The Central Election Commission
-
డీసీ తండాలో 98 % పోలింగ్
హన్మకొండ అర్బన్ : వరంగల్ ఉప ఎన్నికలో వర్ధన్నపేట నియోజకవర్గం డీసీ తండాలోని 193వ పోలింగ్ కేంద్రంలో 98 శాతం ఓట్లు పోలయ్యూరుు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో అధికారులు ఈ ఈవీఎంను సీజ్‌చేసి భద్రపరిచారు. 24న కౌంటింగ్ సందర్భంగా కూడా ఈ ఓట్లు లెక్కించలేదు. ఈ కేంద్రంలోని అధికారుల నిర్వాకం వల్ల జరిగిన తప్పిదాన్ని వెంటనే గుర్తించిన ఉన్నతాధికారులు వెంటనే సమస్యను రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు ఆ ఓట్లు లెక్కించకుండా వదిలేశారు. అసలేం జరిగింది...? వర్ధన్నేపేట నియోజక వర్గం, అదే మండలంలోని డీసీ తండా 193వ పోలింగ్ కేంద్రం పరిధిలో మొత్తం 678 ఓట్లు ఉన్నాయి. ఇవి కాక ఇటీవల అధికారులు ఓటర్ల జాబితా సవరణ సంద ర్భంగా గ్రామంలో లేని, మరణించిన వారి ఓట్లు మొత్తం 159 తొలగించారు. వీరిలో 77 పురుషులు, 82 మహిళల ఓట్లు ఉన్నాయి. పోలింగ్‌కు ముందు అధికారులు బీఎల్వోల ద్వారా ఓటర్ల జాబితాలో ఉన్న అందరికీ పోల్చీటీలు పంపిణీ చేశారు. కాగా, పోలింగ్ రోజున అధికారికంగా ఉన్న జాబితాలోని 678 మందిలో కొందరు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కాగా, జాబితా నుంచి తొలగించిన 159 మందిలోనూ సుమారు 90 శాతం ఓట్లు పోల్ కావడం గమనార్హం. తొలగింపుల జాబితాలో ఉన్నవారు ఓటు ఎలా వేశారు..? ఒకవేళ వారు వస్తే పీవో ఎలా ఓటింగ్‌కు అనుమతించారు అనేది తేలాల్సి ఉంది. అరుుతే తొలగింపు జాబితాలో ఉన్న వారి పేర్లను పోలింగ్ సిబ్బంది టిక్ పెట్టి ఓటు వే యించారని అధికారులు ప్రాథమిక విచారణలో గుర్తించారు. ఇందుకు బాధ్యులెవరు.. ఉద్దేశపూర్వకంగా చేశారా.. పొరపాటున జరిగిందా అనే కోణంలో అధికారులు పూర్తిస్థారుులో విచారణ చేస్తున్నారు. 678 ఓట్ల కంటే తక్కువ మెజార్టీ ఉంటే రీపోలింగ్... డీసీ తండా ఘటనపై తీసుకోవాల్సిన చర్యల గురించి కౌంటింగ్‌కు ముందే కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా యంత్రాంగానికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. పోటీ హోరాహోరీగా ఉండి.. మెజార్టీ 678 ఓట్లు లోపు ఉంటే విజేత ఫలితం ప్రకటించకుండా డీసీ తండాలో రీ పోలింగ్ చేపట్టాలని, వాటి లెక్కింపు అనంతరం తుది ఫలితం ప్రకటించాలని సూచించారు. దీంతో అధికారులు సిద్ధమైనప్పటికీ.. గెలుపొందిన అభ్యర్థి మెజార్టీ లక్షల్లో ఉండటంతో జిల్లా యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది. లేదంటే డీసీ తండాలో రీ పోలింగ్ తప్పనిసరి అయ్యేది. పది కేంద్రాల్లో 90శాతానికి పైగా.. వరంగల్ పార్లమెంట్ పరిధిలోని 1778 పోలింగ్ కేంద్రాల్లో కేవలం పదింట్లో మాత్రమే 90 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అయితే, ఆయా కేంద్రాలన్నీ గ్రామీణ ప్రాంతాల్లోనివే కావడం విశేషం. అయితే, ఉద్యోగులు, విద్యావంతుల నియోజకవర్గంగా పేరున్న వరంగల్ పశ్చిమలోని కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 30 శాతానికన్నా తక్కువగా పోలింగ్ నమోదైతే.. తండాలు, గ్రామాల్లో మాత్రం 90 శాతానికిపైగా ఓటేశారంటే గ్రామీణుల్లోని చైతన్యానికి నిదర్శనమని చెప్పొచ్చు. -
అనుసంధానం
ఓటర్ కార్డుకు ఆధార్ లింక్ మొదటి స్థానంలో డోర్నకల్.. చివరి స్థానంలో వరంగల్ పశ్చిమ మార్చి 15న ప్రారంభమైన ప్రక్రియ ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో అనుసంధానం పోచమ్మమైదాన్ : బోగస్ ఓట్లను ఏరివేయూలనే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం ఓటరు గుర్తింపు కార్డుతో ఆధార్‌కార్డును అనుసంధానం చేసింది. జిల్లాలో మార్చి 15న ప్రారంభమై.. జూలై చివరి వరకు పూర్తికావాలని గడువు విధించారు. అనంతరం మళ్లీ ఆగస్టు 15 వరకు పొడిగించారు. అనుసంధాన ప్రక్రియలో డోర్నకల్ నియోజకవర్గం మొదటిస్థానంలో ఉండగా, చివరి స్థానంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఉంది. కాగా, ఒకరికి రెండు నుంచి మూడు చోట్ల ఓటు హక్కు ఉన్నవారిని గుర్తించేందుకు ఆధార్ కార్డుతో లింక్ పెట్టారు. ఇందుకోసం ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. ఫస్ట్ డోర్నకల్ ఈ నెల 13 వ తేదీ వరకు ఓటు హక్కుకు ఆధార్ లింక్ చేయడంలో డోర్నకల్ ప్రథమ స్థానంలో నిలిచింది. డోర్నకల్ నియోజకవర్గంలో 1,70,890 మంది ఓటర్లు ఉండగా అందులో 1,70,833 మంది ఓటర్లను ఆధార్ కార్డుకు అనుసంధానం చేశారు. మిగతా 57 ఓటర్లలో బీఎల్ఓలు పరిశీలించగా డూప్లికేట్వి 9, మరణించిన వారివి 3, షిఫ్ట్ అయినవి 39, డోర్ లాక్ ఉన్నవి 4, ఎన్రోల్ చేసుకోనివి 2 ఉన్నాయి. 100 శాతం డోర్నకల్ నియోజకవర్గం ఓటర్ కార్డు ఆధార్ కార్డు అనుసంధానం పూర్తయింది. చివరన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ఉంది. 2,45,335 మంది ఒటర్లు ఉండగా 1,00,901 ఓటర్లు మాత్రమే ఓటరు కార్డుకు ఆధార్ కార్డును అనుసంధానం అయింది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో భారీగా తగ్గనున్న ఓటర్ల సంఖ్య. పశ్చిమ నియోజకవర్గంలో బీఎల్ఓ ద్వారా ఇంటింటికి సర్వే నిర్వహించారు. ఇంక ఆధార్ లింక్ కాని 1,44,434 ఓటర్ల ఇంటింటికి తిరిగి బీఎల్ఓ విచారణ చేపట్టగా 3,049 ఓట్లు డుప్లికేట్విగా, ఎలిజిబుల్ కానీ వారు 983, మరణించిన వారు 1,974, షిఫ్ట్ అయిన వారు 30,579, డోర్ లాక్ ఉన్నవి 1,00,004, ఎన్రోల్ చేసుకోని వారు 3,269, ఇంక ఎన్రోల్ చేయాల్సినవి 4,576 ఉన్నాయి. జిల్లాలో 24,44,989 మంది ఓటర్లు ఉండగా 19,95,749 మంది ఓటరు కార్డుకు ఆధార్ కార్డును అనుసంధానం చేశారు. ఆధార్ అనుసంధానంకు అందరూ సహకరించాలి రవీందర్, తహసీల్దార్, వరంగల్. ఆధార్ ఆనుసంధానంకు ప్రతీ ఒక్క ఓటరూ సహకరించాలి. తమ వద్దకు వచ్చే బీఎల్ఓలకు ఆధార్ కార్డుల నంబర్లు అందజేయాలి. ఇలా చేయడం వలన డబుల్ ఉన్న ఓటర్లు తొలగించబడుతారు. దీంతో బోగస్ ఓటర్లు పూర్తి స్థాయిలో తొలగించబడుతారు. -
మీ వల్ల కాకుంటే సీఈసీకి అప్పగిస్తాం
జీహెచ్ఎంసీ ఎన్నికలపై ప్రభుత్వానికి స్పష్టం చేసిన హైకోర్టు ఎన్నికల నిర్వహణకు 249 రోజులెందుకు? ఆ గడువును ఎలా సమర్థించుకుంటారో చెప్పండి ఏజీకి ఆదేశం.. విచారణ సోమవారానికి వాయిదా హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నికల నిర్వహణ కోసం ఏకంగా 249 రోజుల గడువు కోరడంపై హైకోర్టు గురువారం తెలంగాణ ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ఎన్నికల నిర్వహణకు అంత సమయం ఎందుకని ప్రశ్నించింది. ‘మీకు (ప్రభుత్వం) అవసరం కాబట్టి సాధారణ ఎన్నికలను, ఉప ఎన్నికలను ఆగమేఘాలపై నిర్వహిస్తారు. కాని చట్టబద్ధంగా నిర్వహించాల్సిన జీహెచ్ఎంసీ ఎన్నికలను నిర్వహించేందుకు గడువు కావాలంటారు. అసాధారణ అలసత్వాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో సహించేది లేదు. మీరు (ప్రభుత్వం) ఎన్నికలు పెట్టకుంటే ఆ పనిని మేం కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ)కు అప్పజెబుతాం’ అని ఘాటుగా వ్యాఖ్యానించింది. 249 రోజుల గడువు కోరడాన్ని ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కె.రామకృష్ణారెడ్డిని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. జీహెచ్ఎంసీకి ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించడంతో పాటు స్పెషల్ ఆఫీసర్ల నియామకానికి అవకాశం కల్పిస్తున్న జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్ 70జి చట్ట విరుద్ధంగా ప్రకటించాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి హైకోర్టులో ఇటీవల ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యాన్ని ఇప్పటికే పలుమార్లు విచారించిన ధర్మాసనం గురువారం దానిని మరోసారి విచారించింది. ప్రభుత్వం తరఫున ఏజీ కె.రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ, జీహెచ్ఎంసీ వార్డుల సంఖ్యను 200కు పెంచామని, ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీవో కూడా జారీ చేసిందన్నారు. ఈ జీవోను పరిశీలించిన ధర్మాసనం, జీవోను జారీ చేయడానికి 30 రోజుల గడువు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించింది. అధికారుల సంఖ్య తక్కువగా ఉండటం వల్ల నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరుగుతోందని ఏజీ చెప్పారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం సమర్పించిన షెడ్యూల్‌ను పరిశీలించిన ధర్మాసనం, పలు అంశాలపై వివరణ కోరింది. ‘అవసరమైతే ఎన్నికల నిర్వహణ బాధ్యతలను కేంద్ర ఎన్నికల సంఘానికి అప్పజెబుతాం. జీహెచ్ఎంసీకి ఎన్నికలు పెట్టి తీరాల్సిందే. మీరు ఈ విధంగా 249 రోజులు అంటూ అసాధారణ గడువు కోరడం సరికాదు. మిగులు నిధులున్న మీ రాష్ట్రంలోనే జీహెచ్ఎంసీ ఎన్నికలు పెట్టకుంటే ఎలా..?’ అని వ్యాఖ్యానించింది. దీనికి ఏజీ స్పందిస్తూ, మిగులు నిధులన్నది మీడియా ప్రచారమేనంటూ కొట్టిపారేసే ప్రయత్నం చేశారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, మీడియా గాల్లో నుంచి రాయదు కదా. అధికారులు చెబితేనే వారు రాసేది అంటూ వ్యాఖ్యానించింది. 249 రోజుల గడువును ఎలా సమర్థించుకుంటారో చెప్పాలని ఏజీకి స్పష్టం చేస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. -
కేజ్రీవాల్‌కు ఈసీ తాఖీదు
బీజేపీపై వ్యాఖ్యలతో సీరియస్ న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో మత హింసను రెచ్చగొట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపిస్తూ చేసిన వ్యాఖ్యల ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల నియమావళిని ప్రాథమికంగా ఉల్లంఘించారంటూ కేంద్ర ఎన్నికల కమిషన్ ఆయనకు శనివారం షోకాజ్ నోటీసు జారీ చేసింది. ఈ నోటీసుకు ఈ నెల 20వ తేదీ (వచ్చే మంగళవారం) మధ్యాహ్నం 3 గంటల లోపు సమాధానం ఇవ్వాలని గడువు విధించింది. గడువులోగా సమాధానం ఇవ్వని పక్షంలో.. ఎన్నికల నియామవళి ఉల్లంఘన అంశంపై ఆయనను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేసింది. కేజ్రీవాల్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. ఢిల్లీలో మత హింసను ప్రేరేపించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, త్రిలోక్‌పురి, నందగిరిల్లో మత హింసను రెచ్చగొట్టిందని ఆరోపించారని పేర్కొంటూ బీజేపీ రాష్ట్ర చీఫ్ సతీష్ ఉపాధ్యాయ్ చేసిన ఫిర్యాదును ఈసీ తన నోటీసులో ఉటంకించింది. ఢిల్లీలో చర్చిలపై దాడులకు కూడా బీజేపీ కారణమని కేజ్రీవాల్ చేసినట్లు చెప్తున్న వ్యాఖ్యలను నూ ప్రస్తావించింది. అలాగే.. తనపైన, బీజేపీ ఢిల్లీ కార్యవర్గంలోని మరో నేతపైన కేజ్రీవాల్ తప్పుడు ఆరోపణలు చేశారని సతీష్ ఉపాధ్యాయ్ చేసిన మరో ఫిర్యాదుపై కూడా సమాధానం ఇవ్వాలని ఈసీ తన నోటీసులో అడిగింది. ఢిల్లీ శాసనసభ ఎన్నికలకు ఈసీ షెడ్యూలు విడుదల చేయడంతో ఈ నెల 12 నుంచి రాజధాని నగరంలో ఎన్నికల నియమావళి అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. -
84 ఫ్రీ సింబల్స్ ప్రకటించిన ఈసీ
న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం ఎవ్వరికీ కేటాయించని గుర్తుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో ఎయిర్ కండిషనర్, బ్యాట్, కార్పెట్, చెప్పులు, బ్రెడ్, బెలూన్, కిటికీ, కొబ్బరికాయ, కాలీఫ్లవర్, బ్యాటరీ, కేక్, బకెట్, అలారమ్, క్యారమ్ బోర్డ్, తదితర 84 గుర్తులు ఉన్నాయి. వీటి నుంచి కొత్త పార్టీలకు గుర్తులను ఇవ్వనుంది. ఎన్నికల సంఘం (రిజర్వేషన్, కేటాయింపుల చట్టం-1968) కింద పార్టీలకు గుర్తులను కేటాయిస్తుంది. ‘రిజర్వుడ్ సింబల్స్’ను ఈసీ గుర్తింపు పొందిన పార్టీలకు మాత్రమే ఇస్తుంది. ఈ గుర్తులపై ఆపార్టీ అభ్యర్థులంతా పోటీ చేయవచ్చు . ఎవ్వరికీ కేటాయించని(ఫ్రీసింబల్స్) గుర్తులను తన వద్ద కొత్తగా రిజిస్టర్ చేసుకున్న పార్టీలకు కేటాయిస్తుంది. ప్రస్తుతం ఈసీ దగ్గర 1,737 పార్టీలు రిజిస్టర్ చేసుకోగా వాటిలో అన్ని పార్టీలు గుర్తింపు పొందలేదు. కాంగ్రెస్, బీఎస్పీ, బీజేపీ,సీపీఐ,సీపీఐ(ఎమ్), ఎన్సీపీలకు మాత్రమే జాతీయ పార్టీలుగా గుర్తింపు ఉంది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఎస్పీ, ఇక్కడి తెలుగుదేశం పార్టీలకు మాత్రం ఒకే గుర్తు సైకిల్ ఉంది. -
సంబరాలకు సీఎం దూరం?
తిరుపతి ఉప ఎన్నిక షెడ్యూలుతో జిల్లా వ్యాప్తంగా అమల్లోకి కోడ్ చంద్రన్న సంక్రాంతి కానుక పంపిణీకి కోడ్ నుంచి మినహాయింపు తిరుపతి: తిరుపతి శాసనసభ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల చేయడంతో సోమవారం సాయంత్రం నుంచి జిల్లా వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శిల్పారామంలో మంగళవారం నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనకపోవచ్చని సమాచారం. చంద్రన్న సంక్రాంతి కానుక పథకాన్ని రెండు రోజుల క్రితమే ప్రారంభించిన నేపథ్యంలో.. ఆ పథకం పంపిణికీ కోడ్ నుంచి మినహాయింపును ఇచ్చింది. కానీ.. ప్రజాప్రతినిధులు, రాజకీయపార్టీల నేతలు పంపిణీ కార్యక్రమంలో పాల్గొనకూడదు. తిరుపతిలో మంగళవారం నిర్వహించే సం కాంత్రి సంబరాలకు బాబు దూరంగా ఉంటారని తెలిసింది. ఎమ్మెల్యే వెంకటరమణ మృతితో తిరుపతి శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. ఉప ఎన్నిక షెడ్యూలు విడుదల చేయడంతో సోమవారం నుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ముందే నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం సీఎం చంద్రబాబు మంగళవారం విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిల్లో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాల్సి ఉంది. విశాఖపట్నం, విజయవాడ పర్యటనలు ముగించుకుని.. సింగపూర్ మంత్రి ఈశ్వరన్‌తో కలిసి తిరుపతిలో పర్యటించాలని చంద్రబాబు భావించారు. విజయవాడ నుంచి మంగళవారం మధ్యాహ్నం 3.45 గంటలకు ప్రత్యేక విమానంలో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకుని.. అక్కడి నుంచి తిరుమలకు వెళ్లి శ్రీవారిని దర్శించుకుని.. ఆతర్వాత అర్బన్‌హాట్‌లో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పాల్గొనాలని నిర్ణయించారు. సంబరాలు ముగిసిన తర్వాత గ్రాండ్ రిడ్జ్ హోటల్లో జిల్లాలో పారిశ్రామికవేత్తలతో సమావేశమై.. రాత్రికి సొంతూరు నారావారిపల్లికి చేరుకోవాలని భావించారు. నారావారిపల్లిలో సంక్రాంతి పండుగ చేసుకుని.. 15న నేరుగా ఢిల్లీకి వెళ్లేలా పర్యటనను రూపొందించుకున్నారు. కానీ.. సోమవారం ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో మంగళవారం తిరుపతి అర్బన్‌హాట్‌లో నిర్వహించే సంక్రాంతి సంబరాలకూ.. గ్రాండ్ రిడ్జ్‌లో నిర్వహించే పారిశ్రామికవేత్తల సమావేశాలకు సీఎం దూరంగా ఉంటారని సమాచారం. విమానాశ్రయం నుంచి నేరుగా తిరుమలకు వెళ్లి.. శ్రీవారిని దర్శించుకుని నారావారిపల్లికి చేరుకుంటారని తెలిసింది. ముఖ్యమంత్రి శిల్పారామంలో నిర్వహించే సంక్రాంతి సంబరాల్లో పాల్గొంటారా లేదా అనే సమాచారం కోసం కలెక్టర్‌ను సంప్రదించగా ఆయన స్పందించకపోవడం గమనార్హం. -
తిరుపతి ఉప ఎన్నికకు మోగిన నగారా
షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ఎన్నికల సంఘం 19న నోటిఫికేషన్.. అదే రోజున నామినేషన్ల స్వీకరణ ఫిబ్రవరి 13న పోలింగ్.. 16న ఓట్ల లెక్కింపు, ఫలితం ప్రకటన జిల్లాలో అమలులోకి వచ్చిన ఎన్నికల కోడ్ తిరుపతి: తిరుపతి శాసనసభ స్థానం ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం తెరతీసింది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధానాధికారి వీఎస్ సంపత్ సోమవారం షెడ్యూల్ విడుదల చేశారు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ ఈనెల 19న జారీచేయనున్నారు. అదే రోజున నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. నామినేషన్ల దాఖలుకు ఈనెల 27 తుదిగడువు. ఈనెల 30 మధ్యాహ్నం మూడు గంటల్లోగా నామినేషన్లను ఉపసంహరించుకోవచ్చు. ఫిబ్రవరి 13న ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకూ పోలింగ్ నిర్వహిస్తారు. ఈవీఎంల్లో పోలైన ఓట్లను ఫిబ్రవరి 16న లెక్కించి.. ఫలితాన్ని ప్రకటిస్తారు. వివరాల్లోకి వెళితే.. సార్వత్రిక ఎన్నికలకు సరిగ్గా మూడు నెలల ముందు ఎం.వెంకటరమణ కాంగ్రెస్‌ను వీడి టీడీపీలో చేరారు. తిరుపతి శాసనసభ స్థానం నుంచి టీడీపీ తరఫున పోటీ చేసివిజయం సాధించారు. అనారోగ్యం బారిన పడిన వెంకటరమణ డిసెంబర్ 15న చెన్నైలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. వెంకటరమణ మృతితో ఖాళీ అయిన తిరుపతి శాసనసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు సోమవారం కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూలు విడుదల చేసింది. దీంతో జిల్లావ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకూ అంటే ఫిబ్రవరి 19 వరకూ జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఉప ఎన్నికలో టీడీపీ అభ్యర్థిగా ఎవరిని బరిలోకి దించుతారన్నది చర్చనీయాంశంగా మారింది. దివంగత ఎమ్మెల్యే వెంకటరమణ భార్య ఎం.సుగుణను బరిలోకి దించుతారా..? వారి కుటుంబ సభ్యుల్లో మరొకరిని పోటీకి దించుతారా..? ఇతరులను బరిలోకి దించుతారా...? అన్నది తేలాల్సి ఉంది. అభ్యర్థిత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీసుకునే నిర్ణయంపైనే ఉప ఎన్నిక ఆధారపడి ఉంటుందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. -
జాబితాలో కనిపించని ‘జనసేన’
దేశవ్యాప్తంగా 100 ! ఎన్నికల తర్వాత పుట్టుకొచ్చిన వైనం జాబితాలో కనిపించని ‘జనసేన’ హైదరాబాద్: దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలు ముగిశాయో లేదా అప్పుడే కొత్త రాజకీయ పార్టీలు పుట్టుకొస్తున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో లోక్‌సభ సార్వత్రిక ఎన్నికలు, పలు రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు ముగిసి నాలుగు నెలలు తిరక్కముందే ఏకంగా వంద కొత్త రాజకీయ పార్టీలు కేంద్ర ఎన్నికల సంఘం వద్ద నమోదయ్యాయి. నాలుగు మాసాల కింద ఎన్నికలు జరిగినప్పుడు ఈసీ వద్ద రిజిస్టరైన పార్టీల సంఖ్య 1,593 గా ఉంది. ఈసీ తాజాగా విడుదల చేసిన గణాంకాల మేరకు ఆ సంఖ్య 1,699 కి చేరింది. కొత్తగా రిజిస్టరైన రాజకీయ పార్టీల్లో అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌లో 31 ఏర్పాటయ్యాయి. ఆ తర్వాత హర్యానా (14), మహారాష్ట్ర (13)లో కొత్త పార్టీలు ఏర్పాటు కాగా ఆంధ్రప్రదేశ్‌లో 9 రాజకీయ పార్టీలు ఏర్పాటయ్యాయి. అయితే ఇవన్నీ ఎన్నికలకు ముందు దరఖాస్తు చేసుకున్న పార్టీలే. సార్వత్రిక ఎన్నికల అనంతరం రాజకీయ పార్టీగా రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న సినీనటుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ పేరు మాత్రం తాజాగా ఈసీ విడుదల చేసిన జాబితాలో లేదు!.. రాష్ట్రం విడిపోక ముందు దరఖాస్తు చేసిన ఈ పార్టీలన్నింటినీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నమోదైన పార్టీలుగానే ఎన్నికల సంఘం పరిగణించింది. రెండు రాష్ట్రాల్లో గుర్తింపు పార్టీగా వైఎస్సార్ కాంగ్రెస్... గడచిన సార్వత్రిక ఎన్నికల్లో ఆరు పార్టీలు (బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ, సీపీఎం, సీపీఐ, ఎన్సీపీ) మాత్రమే జాతీయ పార్టీలుగా కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందాయి. అలాగే ఆయా రాష్ట్రాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు 54 ఉన్నాయి. ఎన్నికల ఫలితాల అనంతరం గుర్తింపు పొందిన రాష్ట్ర పార్టీల జాబితాలో మరికొన్ని పార్టీలు చేరారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా అవతరించగా, తెలంగాణలో ఏఐఎంఐఎం, బీహార్‌లో రాష్ట్రీయ లోక్ సమతా పార్టీ, పంజాబ్‌లో ఆమ్ ఆద్మీ పార్టీ, సిక్కింలో సిక్కిం క్రాంతి మోర్చా, కేరళలో రెవెల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, త్రిపురలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలు రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొందాయి. జాతీయ, రాష్ట్ర పార్టీలుగా గుర్తింపు పొందినవి మినహాయిస్తే 16 వందల పైచిలుకు పార్టీలు కేవలం ఎన్నికల సంఘం వద్ద రిజస్టరైన పార్టీలుగానే ఉండటం గమనార్హం. -
పునర్విభజన కసరత్తు షురూ
రిజర్వ్డ్ అసెంబ్లీ స్థానాలు ఏపీలో 50కి.. తెలంగాణలో 38కి పెరుగుదల ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో ఇకపై 9 అసెంబ్లీ స్థానాలు హైదరాబాద్: రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను 119 నుంచి 153 కు, ఆంధ్రప్రదేశ్‌లో 175 నుంచి 225కు పెంచేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు ప్రారంభించింది. 2015 జనవరి నుంచి రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను ప్రారంభించేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ విషయమై పలు అంశాలపై కేంద్రం నుంచి వివరాలను కోరింది. దీనిపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌తో కూడా ఈసీ ఇటీవల సమీక్షించింది. ప్రాథమికంగా తెలంగాణ, ఏపీలో 2011 జనాభా ప్రాతిపదికన ఏ జిల్లాల్లో ఎస్సీ నియోజకవర్గాలు పెరుగుతాయో నిర్ధారించడంతో పాటు ఎన్ని ఎస్టీ స్థానాలు పెరుగుతాయో అంచనా వేశారు. జిల్లా యూనిట్‌గా ఎస్సీ నియోజకవర్గాలను, రాష్ట్ర యూనిట్‌గా ఎస్టీ నియోజకవర్గాలను ఖరారు చేయనున్నారు. ఏపీలో ప్రస్తుతం ఎస్సీ రిజర్వ్డ్ స్థానాలు 29 ఉండగా పునర్విభజన అనంతరం 38 స్థానాలకు, ఎస్టీ రిజర్వ్ స్థానాలు ఏడు నుంచి 12కు పెరుగుతాయి. తెలంగాణలో ఎస్సీ స్థానాలు 19 నుంచి 24కు, ఎస్టీ స్థానాలు 12నుంచి 14కు పెరుగుతాయి. ఇరు రాష్ట్రాల్లోనూ ప్రస్తుతం ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో ఏడు అసెంబ్లీ స్థానాలుండగా పునర్విభజన అనంతరం రెండేసి చొప్పున పెరుగుతాయి. అంటే ఒక్కో ఎంపీ స్థానంలో తొమ్మిది అసెంబ్లీ స్థానాలుంటాయి. లోక్‌సభ స్థానాల సంఖ్యలో మార్పూ ఉండదు. పునర్విభజన కోసం ఎస్సీ, ఎస్టీల జనాభాను గ్రామాల వారీగా ఇవ్వాలని రిజస్ట్రార్ ఆఫ్ జనరల్ జనాభా గణాంకాలను ఈసీ కోరింది. విభజన చట్టం ప్రకారం నియోజకవర్గాల పునర్విభజనకు సంబంధించి అసోసియేషన్ సభ్యులు ఐదుగురు మాత్రమే అని పేర్కొంది. -
ఏపీలో 8, తెలంగాణలో 3
మండలి స్థానాలపై ఈసీకి సీఈఓ భన్వర్‌లాల్ ప్రతిపాదనలు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనమండలి స్థానాలను 50 నుంచి 58కి పెంచేందుకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీ) ప్రతిపాదనలు పంపారు. తెలంగాణ మండలిలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీల సంఖ్యను మూడుకు పెంచేందుకు ప్రతిపాదనలు పంపారు. ఈ పెంపుపై కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకోవడంతో పాటు రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఆ మేరకు సవరణలు తీసుకురావాల్సి ఉంటుంది. ఏపీలో ప్రస్తుతం శాసనసభ్యుల సంఖ్య ఎక్కువగా ఉన్నందున, అలాగే స్థానిక సంస్థలు ఎక్కువగా ఉన్నందున ఆ మేరకు ఎమ్మెల్సీల సంఖ్యను పెంచేందుకు వీలుందని అధికార వర్గాలు తెలిపాయి. తెలంగాణలో ప్రస్తుతం శాసనసభ్యుల సంఖ్య తక్కువగా ఉన్నందున ఎమ్మెల్సీ స్థానాలను 40కి మించి పెంచడం సాధ్యం కాదని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఏపీ మండలిలో స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ప్రస్తుతం 20 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. అయితే రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్ట ప్రకారం స్థానిక సంస్థల నియోజకవర్గాల నుంచి ఎమ్మెల్సీల సంఖ్య 17 మాత్రమే ఉండాలి. అయితే స్థానిక సంస్థలు ఎక్కువగా ఉన్నందున.. ఆ సంఖ్యను ఇప్పుడు మరో మూడుకు పెంచేందుకు వీలుగా భన్వర్‌లాల్ ఈసీకి ప్రతిపాదనలు పంపారు. అలాగే ‘ఎమ్మెల్యే’ స్థానాల సంఖ్యను కూడా మరో మూడు పెంచేందుకు, అలాగే పట్టభద్రులు, ఉపాధ్యాయ నియోజకవర్గాల నుంచి చెరొక స్థానం చొప్పున పెంచేందుకు ప్రతిపాదనలు పంపారు. ఈ పెంపుతో ఏపీ శాసన మండలిలో ఎమ్మెల్సీ స్థానాల సంఖ్య 58కి పెరుగుతుంది. ఇక తెలంగాణ శాసనమండలిలో 14 మంది ‘స్థానిక’ ఎమ్మెల్సీలుండాలని రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం 11 మందే ఉన్నారు. ఈ నేపథ్యంలో మూడు ‘స్థానిక’ స్థానాలను పెంచాల్సిందిగా సీఈఓ ప్రతిపాదించారు. ఇందుకు ఆమోదం లభిస్తే తెలంగాణ శాసనమండలిలో ఎమ్మెల్సీల సంఖ్య 40కి చేరుతుంది. -
ఇరు రాష్ట్రాల్లో మూడేసి ఎమ్మెల్సీ స్థానాలు పెంపు
త్వరలో కేంద్ర కేబినెట్ ముందుకు ప్రతిపాదనలు పెంపునకు సిఫార్సు చేస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు సీఈఓ లేఖ స్థానిక ఎమ్మెల్సీ స్థానాల, నియోజకవర్గాల పునర్విభజనపై ఈసీ సమీక్ష సీఈఓ కార్యాలయాలకు పోస్టుల మంజూరుపై సీఎస్‌లకు లేఖలు హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ శాసనమండలిలో స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాల సంఖ్యను మూడేసి చొప్పున పెంచేం దుకు కేంద్ర ఎన్నికల కమిషన్ రంగం సిద్ధం చేసింది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను త్వరలోనే కేంద్ర కేబినెట్ ముందుకు పంపనుంది. స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్సీ స్థానాల పునర్విభజన, ఎమ్మెల్యే సీట్ల పెంపునకు నియోజవర్గాల పునర్విభజన అంశాలపై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం ఢిల్లీలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌తో పాటు కేంద్ర హోం, న్యాయ శాఖ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించింది. ప్రస్తుతం రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్ శాసన మం డలిలో స్థానిక నియోజవర్గాల ఎమ్మెల్సీ స్థానాలు 17 మాత్రమే ఉండాల్సి ఉంది. అలాగే తెలంగాణ శాసనమండలిలో స్థానిక నియోజకవర్గాల ఎమ్మెల్సీ స్థానాల సంఖ్య 14 ఉండాల్సి ఉంది. అయితే ఏపీ మండలిలో స్థానిక నియోజకవర్గాల ఎమ్మెల్సీలు 20మంది ఉండగా తెలంగాణలో 11 మందే ఉన్నారు. తొలుత ఏపీలో మూడు స్థానిక నియోజవర్గాలను తగ్గించాలని, తెలంగాణలో మూడు పెంచాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కేంద్రాన్ని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ అంశంలో జోక్యం చేసుకుని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సంపత్ తో సంప్రదించారు. ఏపీలో స్థానిక ఎమ్మెల్సీ స్థా నాలను తగ్గించబోమని, వాటిని పెంచాలని కో రారు. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఏపీలో, తెలంగాణ లోనూ ఎమ్మెల్సీ స్థానాలను మూడుకు పెంచాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. ఈ అంశంపై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం నిర్వహించిన సమావేశంలో చర్చించింది. ఏపీ లో మూడు ఎమ్మెల్సీ స్థానాల తగ్గింపు చేయకుం డానే ఆ మేరకు మూడు స్థానాలను పెంచుతూ తెలంగాణలో కూడా మూడు స్థానాలను పెం చుతూ ప్రతిపాదనలను కేంద్ర కేబినెట్‌కు పం పించాలని సోమవారం జరిగిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీని కారణంగా ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం ఎమ్మెల్సీల స్థానాల సంఖ్య 53కు పెరుగుతుంది. అయితే తెలంగాణలో మాత్రం 40 స్థానాలే ఉంటాయి. వేర్వేరుగా ఈసీఓ కార్యాలయాలకు పోస్టులు మంజూరు చేయండి విభజన నేపథ్యంలో రెండు రాష్ట్రాల్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయాలకు తగినన్ని పోస్టులను మంజూరు చేయాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘం రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులకు లేఖలు రాసింది. రాష్ట్రస్థాయి కేడర్ ఉద్యోగులు ఇరు రాష్ట్రాలకు పంపిణీ అనంతరం రెండు ప్రభుత్వాలు సీఈఓ కార్యాలయాలకు పోస్టులను మంజూరు చేయనున్నాయని అధికార వర్గాలు తెలిపాయి. నియోజకవర్గాల పునర్విభజనపై సమీక్ష రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలో ఎమ్మెల్యే స్థానాలను 119 నుంచి 153కు, ఏపీలో ఎమ్మెల్యే స్థానాలను 175 నుంచి 225కు పెంచాల్సి ఉన్నందున నియోజవర్గాల పునర్విభజనపై కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం సమీక్ష నిర్వహిం చింది. 2011 ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కల ఆధారంగానే నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉంది. ఇందుకు సంబంబంధించిన పూర్తి సమాచారాన్ని, మ్యాప్‌లను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ కేంద్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. కేంద్ర ఎన్నికల సంఘం మరింత సమాచారం కోసం కేంద్ర హోంశాఖను కోరింది. -
‘వైఎస్సార్సీపీ’ ఇక గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ
వైఎస్సార్సీపీకి ఫ్యాన్ గుర్తు రిజర్వ్ చేసిన ఈసీ ఆంధ్రప్రదేశ్‌లో గుర్తింపు పొందిన మూడో రాష్ట్ర పార్టీగా అవతరణ లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల మేరకు లభించిన గుర్తింపు రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు ఇక లాంఛనమే హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇటీవలి లోక్‌సభ, శాసనసభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీకి లభించిన ఓట్లను పరిగణనలోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్‌ను రాష్ట్ర పార్టీగా గుర్తించినట్టు కేంద్ర ఎన్నికల సంఘం సోమవారం జారీ చేసిన ఆదేశాల్లో (నం.56/రివ్యూ/2013/పీపీ-2) పేర్కొంది. ఇప్పటివరకు కేవలం రిజిస్టర్డ్ పార్టీగా మాత్రమే ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ ఎన్నికల చట్టంలోని గుర్తులు (రిజర్వేషన్, కేటాయింపు) ఆర్డర్ 1968 నిర్దేశించిన విధివిధానాలన్నింటినీ పూర్తి చేసిందని, అందువల్ల ఇకనుంచి ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర పార్టీగా గుర్తింపును ఇచ్చినట్టు ఎన్నికల సంఘం అండర్ సెక్రటరీ ప్రమోద్ కుమార్ శర్మ పేరుతో జారీ అయిన ఆదేశాల్లో పేర్కొన్నారు. దీంతోపాటు పార్టీ అభ్యర్థన మేరకు సీలింగ్ ఫ్యాన్ గుర్తును వైఎస్సార్ కాంగ్రెస్‌కు రిజర్వ్ చేసినట్టు ఆ ఆదేశాల్లో తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా జారీ చేసిన ఆదేశాలను తన వెబ్సైట్లో పెట్టడమే కాకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పంపారు. ఈ ఉత్తర్వులకు అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లో ఫ్రీ సింబల్స్ జాబితాలో ఉన్న సీలింగ్ ఫ్యాన్ గుర్తును తొలగిస్తున్నట్లు అందులో పేర్కొన్నారు. ఎన్నికల సంఘం తాజా ఆదేశాలతో రాష్ట్ర పార్టీగా గుర్తింపు పొందిన పార్టీల్లో ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటివరకు టీడీపీ, టీఆర్ఎస్లు మాత్రమే ఉన్నాయి. తాజా ఆదేశాలతో రాష్ట్ర పార్టీల జాబితాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా చేరింది. అయితే నిబంధనల మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి కూడా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా ఆ పార్టీ నాయకులు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులను కలసి గుర్తింపు కోసం ప్రత్యేకంగా దరఖాస్తు చేయనున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీ చేసిన గుర్తింపు పత్రాన్ని దరఖాస్తుతోపాటు జత చేయనున్నారు. దీంతో రాష్ట్ర ఎన్నికల సంఘం గుర్తింపు రావడం ఇక లాంఛనప్రాయమే కానుంది. తాజా పరిణామాల ఫలితంగా వైఎస్సార్ కాంగ్రెస్ గుర్తింపు పొందిన పార్టీ కానందున అందులోంచి వేరే పార్టీల్లోకి వెళ్లే ప్రజాప్రతినిధులకు ఫిరాయింపుల చట్టం వర్తించదంటూ దుష్ర్పచారం సాగిస్తున్న టీడీపీ నేతల నోటికి తాళం పడినట్లయింది. త్వరలో జెడ్పీ, మున్సిపల్ చైర్మన్ల ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు ఎవరైనా తమ పార్టీ ఇచ్చే విప్‌ను ధిక్కరించే పక్షంలో వారిపై అనర్హత వేటు పడనుంది. -
29 కేంద్రాల్లో నేడు రీ పోలింగ్
హైదరాబాద్: తెలంగాణ, సీమాంధ్రలోని పది జిల్లాల్లోని 29 పోలింగ్ కేంద్రాల్లో మంగళవారం రీ పోలింగ్ జరగనుంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. తెలంగాణలో గత నెల 30న, ఈ నెల 7న సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా చాలా చోట్ల ఓటింగ్ యంత్రాలు మధ్యలో పనిచేయడం మానేశాయి. వాటిని మార్చి కొత్త యంత్రాలను అమర్చి పోలింగ్ నిర్వహించారు. అయితే ఇలాంటి చోట్ల రీ పోలింగ్ అవసరం లేదని కలెక్టర్లు నివేదించినప్పటికీ కేంద్ర ఎన్నికల కమిషన్ రీ పోలింగ్ నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో మంగళవారం 29 పోలింగ్ కేంద్రాల్లో రీ పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ కేంద్రాల వివరాలు ఇవీ.. నిజామాబాద్ లోక్‌సభకు బోధన్ అసెంబ్లీ పరిధిలోని 64వ పోలింగ్ కేంద్రం జహీరాబాద్ లోక్‌సభకు జుక్కల్ అసెంబ్లీ పరిధిలోని 134వ పోలింగ్ కేంద్రం బాన్సువాడ అసెంబ్లీ స్థానానికి 146వ పోలింగ్ కేంద్రం జహీరాబాద్ లోక్‌సభకు బాన్సువాడ అసెంబ్లీ పరిధిలోని 39, 187 పోలింగ్ కేంద్రాలు నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ స్థానానికి 48, 168 పోలింగ్ కేంద్రాలు నిజామాబాద్ రూరల్ అసెంబ్లీ పరిధిలోని 9వ పోలింగ్ కేంద్రం కూకట్పల్లి అసెంబ్లీ స్థానానికి 371/ఎ పోలింగ్ కేంద్రం కొత్తగూడెం అసెంబ్లీ స్థానానికి 161వ పోలింగ్ కేంద్రం భద్రాచలం అసెంబ్లీ స్థానానికి 239వ పోలింగ్ కేంద్రం శ్రీకాకుళం లోక్‌సభకు శ్రీకాకుళం అసెంబ్లీ పరిధిలోని 46వ పోలింగ్ కేంద్రం కురుపాం అసెంబ్లీ స్థానానికి 192వ పోలింగ్ కేంద్రం అరకు లోక్‌సభకు సాలూరు అసెంబ్లీ పరిధిలోని 134వ పోలింగ్ కేంద్రం అరకు లోక్‌సభ, పాడేరు అసెంబ్లీ స్థానానికి 68వ పోలింగ్ కేంద్రం మచిలీ పట్నం లోక్‌సభకు గుడివాడ అసెంబ్లీ పరిధిలోని 123వ పోలింగ్ కేంద్రం మచిలీపట్నం లోక్‌సభకు అవనిగడ్డ అసెంబ్లీ పరిధిలోని 29వ పోలింగ్ కేంద్రం అవనిగడ్డ అసెంబ్లీ స్థానానికి 91వ పోలింగ్ కేంద్రం పెనమలూరు అసెంబ్లీ స్థానానికి 59, 172 పోలింగ్ కేంద్రాలు విజయవాడ లోక్‌సభకు విజయవాడ ఈస్ట్ అసెంబ్లీ పరిధిలోని 212వ పోలింగ్ కేంద్రం విజయవాడ లోక్‌సభకు మైలవరం అసెంబ్లీ పరిధిలోని 123వ పోలింగ్ కేంద్రం నందిగామ అసెంబ్లీ స్థానానికి 171, 174 పోలింగ్ కేంద్రాలు విజయవాడ లోక్‌సభకు జగ్గయ్యపేట అసెంబ్లీ పరిధిలోని 122వ పోలింగ్ కేంద్రం కరీంనగర్ లోక్‌సభకు హుస్నాబాద్ పరిధిలోని 170వ పోలిం గ్ కేంద్రం కడప పార్లమెంట్‌కు, జమ్మలమడుగు అసెంబ్లీకి 80, 81,82 పోలింగ్ కేంద్రాలు. -
జంటనగరాల్లో పోలింగ్ అంతంతే!
తెలంగాణలో 70.85 శాతం జంట నగరాల్లో 53 శాతమే ప్రాణహిత-చేవెళ్ల కాంట్రాక్టర్లకు చెల్లింపులు కోడ్ ఉల్లంఘనే సీఈఓ భన్వర్‌లాల్ వెల్లడి హైదరాబాద్: కేంద్ర ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఎంత చెప్పినా జంటనగరాల ఓటర్లు వినిపించుకోలేదు. ఎప్పటి తరహాలోనే ఈసారి ఎన్నికల్లో కూడా జంటనగరాల్లో ఓటు వేయడానికి రాలేదు. తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో పోలింగ్ 70 శాతానికి పైగా జరిగినా, జంటనగరాల పరిధిలోని పార్లమెంట్, అసెంబ్లీ స్థానాల్లో 53 శాతానికి మించలేదు. ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ తెలిపారు. శనివారం ఆయన సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరి లోక్‌సభ స్థానాలు, ఆ స్థానాల పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో గత, ఇప్పటి ఎన్నికల్లోనూ పోలింగ్ శాతం 53 శాతానికి మించలేదు. తెలంగాణ జిల్లాల్లో ఎక్కడా రీ పోలింగ్ లేదని భన్వర్‌లాల్ స్పష్టం చేశారు. ఈవీఎంలు మార్పులకు సంబంధించిన సమాచారాన్ని సకాలంలో పంపించనందుకు ముగ్గురు రిటర్నింగ్ అధికారులకు మెమోలు జారీ చేశామని, పోలింగ్ శాతం గురించి కాదని ఆయన తెలిపారు. ప్రాణహిత-చేవెళ్ల కాంట్రాక్టర్లకు ఎన్నికల ప్రక్రియ పూర్తయిన తర్వాత చెల్లింపులు చేపట్టాలని గతంలో ఆదేశాలు జారీ చేశామని, నియమావళి అమల్లో ఉండగా చెల్లింపులు జరపడం కోడ్ ఉల్లంఘన కిందికే వస్తుందన్నారు. దీనిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకుంటామని భన్వర్‌లాల్ తెలిపారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రూ. 270 కోట్లు స్వాధీనం చేసుకుంటే.. ఒక్క మన రాష్ట్రంలోనే రూ.140 కోట్లు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. డబ్బు, మద్యం పంపిణీ నివారించేందుకు, సంబంధిత ఫిర్యాదులను స్వయంగా స్వీకరించేందుకు ఆదివారం నుంచి రెండు ఫోన్ నంబర్లు ఇస్తానని ఆయన చెప్పారు. ఇప్పటివరకు ఐదు లక్షల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. సీమాంధ్ర పోరుకు సర్వం సిద్ధం సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా సీమాంధ్ర జిల్లాల్లోని 25 లోక్‌సభ స్థానాలు, 175 అసెంబ్లీ స్థానాలకు ఈ నెల 7న (బుధవారం) పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని భన్వర్‌లాల్ తెలిపారు. 90 శాతం పైగా పోలింగ్ నమోదు చేసి రికార్డు సృష్టించాల్సిందిగా సీమాంధ్ర ఓటర్లకు పిలుపునిచ్చారు. సీమాంధ్ర జిల్లాల్లో 25 లోక్‌సభ స్థానాలకు 333 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, 175 అసెంబ్లీ స్థానాల్లో 2,243 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారని చెప్పారు. ఎన్నికల ప్రచారం సోమవారం సాయంత్రం 6 గంటలకు ముగుస్తుందన్నారు. పోలింగ్‌కు 48 గంటల ముందు నుంచి ఎస్ఎంఎస్, రేడియో, సినిమా, ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రచారం నిషేధమని భన్వర్‌లాల్ స్పష్టంచేశారు. తెలంగాణ లోక్‌సభ స్థానాల్లో నమోదైన పోలింగ్ వివరాలు లోక్‌సభ స్థానం 2009 2014 పోలింగ్ శాతం పోలింగ్ శాతం ఆదిలాబాద్ 76.32 73.49 పెద్దపల్లి 68.62 71.56 కరీంనగర్ 65.89 73.55 నిజామాబాద్ 66.53 71.51 జహీరాబాద్ 74.54 76.00 మెదక్ 76.00 77.92 మల్కాజ్గిరి 51.43 51.19 సికింద్రాబాద్ 54.88 53.28 హైదరాబాద్ 52.47 52.52 లోక్‌సభ స్థానం 2009 2014 పోలింగ్ శాతం పోలింగ్ శాతం చేవెళ్ల 64.47 60.08 మహబూబ్‌నగర్ 67.54 71.30 నాగర్ కర్నూలు 69.97 75.00 నల్లగొండ 73.76 79.01 భువనగిరి 76.13 80.99 వరంగల్ 69.21 76.46 మహబూబాబాద్ 78.59 80.58 ఖమ్మం 81.68 80.00 మొత్తం 68.71 70.85 -
క్షమించండి.. లోపాలు జరిగాయి
ఓటర్ల జాబితాలో పేర్ల గల్లంతుపై ఈసీ బాంబే హైకోర్టులో పిల్ వేసేందుక ముంబై ఓటర్లు సిద్ధం జాబితాలో పేర్లు తొలగింపుపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు న్యూఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో తలెత్తుతున్న లోపాలు, ఓటర్లకు స్లిప్పుల పంపిణీలో జరుగుతున్న అసౌకర్యం, ఓటరు జాబితాల్లో భారీ సంఖ్యలో పేర్లు గల్లంతు కావడంపై ఈసీ తీవ్రంగా స్పందించింది. తమ వైపు నుంచి తప్పులు జరిగాయని ఒప్పుకున్న కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ హెచ్.ఎస్. బ్రహ్మ జాబితాలో పేర్లు గల్లంతై ఓటు వేయలేక పోయినవారిని క్షమాపణలు కోరారు. ‘జాబితాలో పేర్లు గల్లంతై.. ఓటు వేయలేక పోయిన అత్యధిక మంది ఓటర్లకు క్షమాపణలు చెబుతున్నా’ అని బ్రహ్మ అన్నారు. ముంబైలో గురువారం జరిగిన ఎన్నికల్లో ఓటరు జాబితాలో పేర్లు లేకపోవడంపై ఆగ్రహం వెలిబుచ్చిన కార్పొరేట్ దిగ్గజాలు సహా వేలాది మంది ఓటర్లు ఈసీకి ఫిర్యాదు చేసిన మరుసటి రోజే సీఎన్ఎన్-ఐబీఎన్ వార్తా సంస్థతో బ్రహ్మ మాట్లాడారు. ఇంతమంది ఓటర్ల పేర్లు జాబితాల నుంచి ఏవిధంగా గల్లంతయ్యాయో తనకు అర్ధం కావడం లేదన్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఈ తప్పు జరిగి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఎన్నికల ఫలితాలు వెలువరించిన తర్వాత ఈ లోపాలపై దృష్టి సారిస్తామని, తప్పులు సరిదిద్దు కుంటామని చెప్పారు. ఇదిలావుంటే, జాబితాల్లో పేర్లు సరిచూసుకోవాలని పేర్కొంటూ తాము అనేక మార్లు ప్రకటనలు ఇచ్చినా ఎవరూ స్పందించలేదని మహారాష్ట్ర ఎన్నికల సంఘం పేర్కొంది. ‘మహా’ సీఎం రుసరుస...: ఓటర్ల జాబితాలో పేర్లు గల్లంతై.. ఓట్లు కోల్పోయిన కార్పొరేట్ దిగ్గజాల పట్ల మహారాష్ట్ర సీఎం పృధ్వీరాజ్ చవాన్ రుసరుసలాడారు. ‘ఓటరు జాబితాలో తమ పేర్లు లేవంటూ కార్పొరేట్ దిగ్గజాలు ఎందుకు ఫిర్యాదు చేశారో నాకర్ధం కావడం లేదు. ఎన్నికల ముందే పరిశీలించుకుని ఉండాల్సింది. అంతర్జాతీయ విమానాలు ఎక్కే ముందు ప్రయాణికుల జాబితాలో పేర్లు పరిశీలించుకోవడం లేదా?’ అంటూ చురకలంటించారు. కాగా, హెచ్డీఎఫ్సీ చైర్మన్ దీపక్ పరేఖ్ సహా అనేక మంది కార్పొరేట్ దిగ్గజాల పేర్లు ముంబై ఓటర్ల జాబితాలో గల్లంతయ్యాయి. దీనిపై బాంబే హైకోర్టులో సోమవారం పిల్ దాఖలుకు పేర్లు గల్లంతైనవారు సిద్ధమయ్యారు. -
డబ్బు, మద్యం పంపిణీపై నిఘా
కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాజకీయ పార్టీల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు సాగుతున్నందున డబ్బు, మద్యం నియంత్రణకు మరింతగా నిఘాను పెంచాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ప్రధాన రాజకీయ పక్షాలు విజ్ఞప్తి చేశాయి. ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారం హైదరాబాద్‌లోని జూబ్లీహాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రతినిధులు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సంపత్‌ను కలసి వివిధ అంశాలపై సూచనలతోపాటు కొన్ని ఫిర్యాదులు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా బందోబస్తు పెంచాలని, డబ్బు, మద్యం పంపిణీ నియంత్రణకు నిఘాను ఇంకా పెంచాలని కోరినట్లు కాంగ్రెస్ నేతలు కమలాకర్‌రావు, ఉమామల్లేశ్వరరావు తెలిపారు. లోక్‌సభకు, అసెంబ్లీకి సంబంధించిన ఈవీఎంలను వేర్వేరు గదుల్లో పెట్టాలని కోరామని బీజేపీ ప్రతినిధి ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల నియమావళికి సంబంధించిన మార్గదర్శకాలను ఎన్నికల కమిషన్ స్పష్టంగా పేర్కొన్నా రిటర్నింగ్ అధికారులకు అవగాహన లేక ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేసినట్లు టీఆర్ఎస్ ప్రతినిధి రామచంద్రరావు తెలిపారు. ‘త్రీడీ పనిచేసేది రాత్రే. అయితే రాత్రి త్రీడీ వాడరాదని రిటర్నింగ్ అధికారులు అంటున్నారు’ అని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని కమిషన్ ప్రతినిధులు తెలిపారన్నారు. -
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
కలెక్టరేట్,న్యూస్‌లైన్ : కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులంతా తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న సూచించారు. నిజామాబాద్ ఎంపీ స్థానానాకి పోటీలో ఉన్న అభ్యర్థులతో శనివారం ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి , ప్రచార కార్యక్రమం, నిర్వహణ, అభ్యర్థుల ఖర్చు, చెల్లింపువార్తలు, వీడియో ప్రసారం తదితర విషయాలను వివరించారు. అభ్యర్థులంతా ఎలక్షన్ ఏజెంట్లను నియమించుకుంటే బాగుంటుందని కలెక్టర్ సూచించారు. వ్యక్తిగతంగా సమావేశానికి హాజరుకాలేనప్పుడు ఏజెంట్లను పంపించవచ్చన్నారు. ఖర్చు వివరాల కోసం కూడా ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు, సభలు, వాహనాల కోసం తప్పనిసరిగా రిటర్నింగ్ అధికారి నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలన్నారు. పోస్టర్లు, కరపత్రాలు, ఇతర ప్రచార సామగ్రి రూపొందిస్తే ప్రింటింగ్ ప్రెస్ యజమాన్యం మూడు రోజుల్లోగా పూర్తి వివరాలతో ప్రచురణ సామగ్రి ప్రతులను రిటర్నింగ్ అధికారికి సమర్పించాలన్నారు. టీవీ ఛానళ్లలో ప్రచారం చేసుకోవాలంటే మూడు రోజుల ముందుగానే అనుమతి కోసం నిర్దేశించిన అనెక్జర్-ఏ పట్టికలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ఆమోదించిన పిదపనే ప్రచారం చేసుకోవలసి ఉంటుందన్నారు. హోర్డింగ్‌లు, బ్యానర్లు అనుమతి ఇచ్చిన చోటనే ఏర్పాటు చేసుకోవాలన్నారు. సార్వత్రిక ఎన్నికలకు జిల్లాలో 2,058 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మార్చి 30వ తేదీ వరకు అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చి 15వ తేదీన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల వారికి అందిస్తామని, ఇతర పార్టీ వారు, స్వతంత్ర అభ్యర్థులు జాబితాలను కొనుగోలు చేసుకోవాలన్నారు. ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అభ్యర్థులు, ఏజెంట్లు గాని వచ్చి ఓటింగ్ ప్రక్రియను చూసుకోవచ్చన్నారు. ఎన్నికల నిర్వహణకు అభ్యర్థులంతా సహకరించాలని కోరారు. అనుమతి తప్పనిసరి... సమావేశంలో ఎస్పీ తరుణ్‌జోషి మాట్లాడుతూ... లౌడ్ స్పీకర్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ప్రచారానికి వినియోగించాలన్నారు. ప్రార్థన మందిరాలలో, దేవాలయాలలో సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. ర్యాలీలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్న వారికి ఇతర పార్టీల వారు గాని, అభ్యర్థులు గాని ఆటంకం కలిగించడం, అడ్డుకోవడం కోడ్ నిబంధనలకు విరుద్ధమని, అలా చేస్తే చట్టారీత్యా చర్యలు తప్పవన్నారు. అనుమానాలు నివృత్తి చేసుకోండి... సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకులు సూర్యనారాయణసోని మాట్లాడుతూ... అభ్యర్థులకు అనుమానాలు, ఎన్నికల కోడ్‌కు సంబంధించి వివరాలు తెలుసుకోవాలంటే జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీ, తననుగాని సంప్రదించాలన్నారు. ఏమైనా ఫిర్యాదులు ఉంటే లిఖిత పూర్వకంగా అందించవచ్చని, సెల్ నం.94918 60465కు కాల్ చేయవచ్చన్నారు. సమావేశంలో అభ్యర్థులు మధుయాష్కీగౌడ్ (కాంగ్రెస్), సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి (వైఎస్సార్సీపీ), కోటపాటినర్సింహనాయుడు, తలారి రాములు (స్వంతంత్రులు), రాపెల్లి శ్రీనివాస్ (ఆమ్ఆద్మీ పార్టీ) పాల్గొన్నారు. -
ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎస్ అధికారులు
సాక్షి, కాకినాడ : జిల్లాలో పార్లమెంట్ నియోజకవర్గానికి ఒకరు, అసెంబ్లీకి ఇద్దరు చొప్పున చొప్పున ఐఏఎస్ స్థాయి అధికారులను ఎన్నికల పరిశీలకులుగా కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించింది. వీరిలో సాధారణ పరిశీలకులు ఈ నెల 12వ తేదీన జిల్లాకు వస్తుండగా, వ్యయ పరిశీలకులు 19వ తేదీన రానున్నారు. సాధారణ పరిశీలకులుగా కాకినాడ పార్లమెంటుకుగౌతమ్‌ఘోష్, రాజమండ్రి పార్లమెంటుకు అమర్ భట్టాచార్య, అమలాపురం పార్లమెంటుకు విమల్ కాంతిదాస్ నియమితులయ్యారు. కాకినాడ సిటీ, రూరల్, పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు నిత్యానంద మండల్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు మదన్‌లాల్, రాజమండ్రిసిటీ, రాజానగరం, అనపర్తి, మండపేట నియోజకవర్గాలకు సౌమ్య నారాయణ పాణిగ్రాహి, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రచూర్‌గోయల్ సాధారణ పరిశీలకులుగా నియమితులయ్యారు. అమలాపురం, రాజోలు, పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలకు షెట్టన్నవార్, రామచంద్రపురం, ముమ్మిడివరం, కొత్తపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు వీరేంద్రకుమార్‌సింగ్ సాధారణ పరిశీలకులుగా నియమితులయ్యారు. వ్యయ పరిశీలకులుగా కాకినాడ సిటీ, కాకినాడ రూరల్, పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు లాల్ చంద్, తుని, ప్రత్తిపాడు, పిఠాపురం, జగ్గంపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు జయరామన్ విశ్వనాథన్, రాజమండ్రి సిటీ, రాజానగరం, అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గాలకు శివప్రసాద్, రాజమండ్రి రూరల్, కొవ్వూరు, నిడదవోలు, గోపాలపురం అసెంబ్లీ నియోజకవర్గాలకు కృష్ణమూర్తి, అమలాపురం, రాజోలు, పి.గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలకు షెరవన్ పెర్మాళ్, రామచంద్రపురం, ముమ్మిడివరం, కొత్తపేట, మండపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు కైలాష్‌కుమార్‌లను నియమించారు. జిల్లాలోని మూడు పార్లమెంట్, 19 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికలకు 12వ తేదీన నోటిఫికేషన్ జారీ కానుంది. అదేరోజు పార్లమెంట్ నియోజకవర్గాల సాధారణ పరిశీలకులు జిల్లాకు రానున్నారు. నామినేషన్ల ఘట్టం 19వ తేదీతో ముగియనుంది. అదే రోజు అసెంబ్లీ వ్యయపరిశీలకులు రానున్నారు. అప్పటివరకూ జిల్లా స్థాయిలో నియమించిన ఫ్లైయింగ్ స్క్వాడ్స్, షాడో టీమ్స్ అభ్యర్థుల వ్యయాలను గణిస్తాయి. ఆ తర్వాత పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పరిశీలకుల అధీనంలో ఈ కమిటీలు పనిచేస్తాయి. విశాఖ జిల్లా అరకు పార్లమెంటు నియోజకవర్గానికి జనరల్ అబ్జర్వర్‌గా పర్వేజ్ అహ్మద్‌ను నియమించగా, అరకు పార్లమెంటు పరిధిలో ఉన్న రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి జనరల్ అబ్జర్వర్‌గా దినేష్‌కుమార్ గుప్తా, వ్యయ పరిశీలకునిగా వీరేంద్రకుమార్‌లను కేంద్ర ఎన్నికల కమిషన్ నియమించింది. -
పన్ను ఎగవేతదారులపై ఈసీ కన్ను
సీబీడీటీతో కలసి అభ్యర్థుల పాన్ కార్డుల వివరాల సంయుక్త తనిఖీ ఎన్నికల రంగం నుంచి పన్ను ఎగవేతదారుల ఏరివేతే లక్ష్యం న్యూఢిల్లీ: ఎన్నికల బరిలో దిగుతున్న అభ్యర్థుల్లో రూ. 5 కోట్లకు పైగా ఆస్తులు ఉండి.. పాన్ కార్డు లేని వారిపై ఆదాయ పన్ను శాఖ, కేంద్ర ఎన్నికల కమిషన్ దృష్టిసారిస్తోంది. పన్ను ఎగవేతదారులను ఎన్నికల రంగం నుంచి ఏరివేయటానికి.. అనుమానిత పన్ను ఎగవేతదారుల జాబితాను ఇప్పటికే సిద్ధం చేశారు. గత ఎన్నికల్లో ప్రకటించిన ఆస్తుల కన్నా ఇప్పుడు రూ. 2 కోట్లు అంతకన్నా ఎక్కువ స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించిన అభ్యర్థులను కూడా ఈ జాబితాలో చేర్చారు. వీరందరి ఆస్తులు, ఆదాయాల వివరాలను ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు (సీబీడీటీ) అధికారులు క్షుణ్నంగా తనిఖీ చేయనున్నారని ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి. అనుమానిత పన్ను ఎగవేత కోణం నుంచి అభ్యర్థుల అఫిడవిట్లను పరిశీలించటానికి ఈసీ, సీబీడీటీలు సంయుక్తంగా ఐదు కీలక ప్రమాణాలను రూపొందించాయి. అందులో పాన్ (శాశ్వత ఖాతా నంబరు) కార్డుల వాస్తవికతను పరిశీలించటం ఒకటి. ఎన్నికల అఫిడవిట్లో ఆయా అభ్యర్థులు ప్రకటించే ఆదాయం, ఆస్తుల వివరాలను తనిఖీ చేయటానికి ఇది చాలా ముఖ్యమైనది. అభ్యర్థులు తమ అఫిడవిట్లో తెలిపే పాన్ కార్డు వివరాలను తమకు అందించాలని.. దాని ద్వారా సదరు అభ్యర్థి ఆర్థిక మూలాలను తనిఖీ చేయటం సులభమని సీబీడీటీ ఇటీవల ఈసీని కోరింది. ఈసీ ఇచ్చిన పాన్ కార్డు వివరాలను తమ వద్ద గల సదరు అభ్యర్థికి సంబంధించిన పాన్ కార్డు వివరాలను పోల్చిచూసి.. అది బూటకపు పాన్ కార్డా లేక వాస్తవమైనదేనా అన్నది సీబీడీటీ నిర్థారించనుంది. అలాగే.. అభ్యర్థులు తమ అఫిడవిట్లలో ప్రకటించిన ఆస్తుల వివరాలను.. వారికి సంబంధించి ఐటీ విభాగానికి సమర్పించిన ఆదాయ పన్ను రిటర్నుల్లో పేర్కొన్న ఆస్తుల వివరాలను కూడా సరిపోల్చి తనికీ చేయనున్నారు. అభ్యర్థి వ్యక్తిగత ఆస్తుల వివరాలతో పాటు కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలను ఏ మేరకు చూపారనే అంశాలను కూడా సీబీడీటీ తనిఖీ చేయనుంది. ఈవీఎంలతోనే ఓటింగ్: ఈసీ సార్వత్రిక ఎన్నికల్లో దేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాల్లోనూ ఈవీఎంలను వినియోగిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం ప్రకటించింది. లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు జరిగే ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కింలోనూ.. వివిధ రాష్ట్రాల్లో జరిగే ఉప ఎన్నికల్లోనూ ఈవీఎంలను వినియోగిస్తామని వెల్లడించింది. ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఈవీఎంలు తమకు అందుబాటులో ఉన్నాయన్నారు. మహిళా అభ్యర్థులకు అదనపు భద్రత లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే మహిళా అభ్యర్థులకు అదనపు భద్రత కల్పించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ప్రస్తుతం ప్రతి మహిళా అభ్యర్థికి ఓ పురుష గన్‌మెన్‌ను అందిస్తున్నారు. దీనికి అదనంగా ఒక మహిళా వ్యక్తిగత భద్రతా అధికారి(పీఎస్వో)ని కూడా నియమించాలని నిర్ణయించారు. సాధారణంగా అభ్యర్థులు మగవారైనా.. మహిళలైనా పీఎస్వోలుగా పురుషులనే నియమిస్తారు.