కలెక్టరేట్,న్యూస్‌లైన్ : కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నిబంధనలను ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థులంతా తప్పనిసరిగా పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న సూచించారు. నిజామాబాద్ ఎంపీ స్థానానాకి పోటీలో ఉన్న అభ్యర్థులతో శనివారం ప్రగతిభవన్‌లో సమావేశం నిర్వహించారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి , ప్రచార కార్యక్రమం, నిర్వహణ, అభ్యర్థుల ఖర్చు, చెల్లింపువార్తలు, వీడియో ప్రసారం తదితర విషయాలను వివరించారు. అభ్యర్థులంతా ఎలక్షన్ ఏజెంట్లను నియమించుకుంటే బాగుంటుందని కలెక్టర్ సూచించారు.
వ్యక్తిగతంగా సమావేశానికి హాజరుకాలేనప్పుడు ఏజెంట్లను పంపించవచ్చన్నారు. ఖర్చు వివరాల కోసం కూడా ప్రత్యేకంగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ప్రచార కార్యక్రమాలు, ర్యాలీలు, సభలు, వాహనాల కోసం తప్పనిసరిగా రిటర్నింగ్ అధికారి నుంచి ముందుగా అనుమతి తీసుకోవాలన్నారు.
పోస్టర్లు, కరపత్రాలు, ఇతర ప్రచార సామగ్రి రూపొందిస్తే ప్రింటింగ్ ప్రెస్ యజమాన్యం మూడు రోజుల్లోగా పూర్తి వివరాలతో ప్రచురణ సామగ్రి ప్రతులను రిటర్నింగ్ అధికారికి సమర్పించాలన్నారు. టీవీ ఛానళ్లలో ప్రచారం చేసుకోవాలంటే మూడు రోజుల ముందుగానే అనుమతి కోసం నిర్దేశించిన అనెక్జర్-ఏ పట్టికలో దరఖాస్తు చేసుకోవాలన్నారు.
మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీ ఆమోదించిన పిదపనే ప్రచారం చేసుకోవలసి ఉంటుందన్నారు. హోర్డింగ్‌లు, బ్యానర్లు అనుమతి ఇచ్చిన చోటనే ఏర్పాటు చేసుకోవాలన్నారు. సార్వత్రిక ఎన్నికలకు జిల్లాలో 2,058 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మార్చి 30వ తేదీ వరకు అర్హులైన ఓటర్ల పేర్లను జాబితాలో చేర్చి 15వ తేదీన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల వారికి అందిస్తామని, ఇతర పార్టీ వారు, స్వతంత్ర అభ్యర్థులు జాబితాలను కొనుగోలు చేసుకోవాలన్నారు.
ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ క్యాంపును ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అభ్యర్థులు, ఏజెంట్లు గాని వచ్చి ఓటింగ్ ప్రక్రియను చూసుకోవచ్చన్నారు. ఎన్నికల నిర్వహణకు అభ్యర్థులంతా సహకరించాలని కోరారు.
అనుమతి తప్పనిసరి...
సమావేశంలో ఎస్పీ తరుణ్‌జోషి మాట్లాడుతూ... లౌడ్ స్పీకర్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల వరకు మాత్రమే ప్రచారానికి వినియోగించాలన్నారు. ప్రార్థన మందిరాలలో, దేవాలయాలలో సభలు, సమావేశాలు నిర్వహించరాదని తెలిపారు. ర్యాలీలు, సమావేశాలు, ప్రచార కార్యక్రమం నిర్వహిస్తున్న వారికి ఇతర పార్టీల వారు గాని, అభ్యర్థులు గాని ఆటంకం కలిగించడం, అడ్డుకోవడం కోడ్ నిబంధనలకు విరుద్ధమని, అలా చేస్తే చట్టారీత్యా చర్యలు తప్పవన్నారు.
అనుమానాలు నివృత్తి చేసుకోండి...
సార్వత్రిక ఎన్నికల సాధారణ పరిశీలకులు సూర్యనారాయణసోని మాట్లాడుతూ... అభ్యర్థులకు అనుమానాలు, ఎన్నికల కోడ్‌కు సంబంధించి వివరాలు తెలుసుకోవాలంటే జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీ, తననుగాని సంప్రదించాలన్నారు. ఏమైనా ఫిర్యాదులు ఉంటే లిఖిత పూర్వకంగా అందించవచ్చని, సెల్ నం.94918 60465కు కాల్ చేయవచ్చన్నారు. సమావేశంలో అభ్యర్థులు మధుయాష్కీగౌడ్ (కాంగ్రెస్), సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి (వైఎస్సార్‌సీపీ), కోటపాటినర్సింహనాయుడు, తలారి రాములు (స్వంతంత్రులు), రాపెల్లి శ్రీనివాస్ (ఆమ్‌ఆద్మీ పార్టీ) పాల్గొన్నారు.
నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు
Published Sun, Apr 13 2014 2:57 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement