సాక్షి, అనంతపురం : ఎన్నికల హడావుడి ముగిసిందో, లేదో అప్పుడే గ్రామాల్లో ‘రాజకీయాలు’ మొదలయ్యాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేశారన్న నెపంతో పలుచోట్ల టీడీపీకి చెందిన సర్పంచులు ఉపాధి హామీ పథకం కూలీల పొట్టకొడుతున్నారు. పనులకు అనుమతి నిరాకరిస్తూ కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. తమకు జరుగుతున్న అన్యాయాన్ని కూలీలు ఉన్నతాధికారులకు వివరిస్తున్నా లాభం లేకుండా పోతోంది. కరువు కాటకాలకు నిలయమైన జిల్లాలో పనుల కోసం కూలీలు ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లడం ఆనవాయితీ. అయితే.. స్థానికంగానే పనులు కల్పించి వ లసలు ఆపాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమలు చేస్తోంది.
ఈ పథకం కింద గ్రామాల్లో పనులు మంజూరు చేయాలంటే సర్పంచ్ ఆధ్వర్యంలో సమావేశమై తీర్మానం చేయాల్సి ఉంటుంది. దీన్ని ఆసరాగా చేసుకొని టీడీపీకి చెందిన సర్పంచులు కక్ష సాధిస్తున్నారు. ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకిమద్దతు తెలిపారనే నెపంతో పనులకు ఆమోదం తెలపకుండా వాయిదా వేస్తున్నారు. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. రాప్తాడు మండలం గాండ్లపర్తిలో ఉపాధి పనులు కావాలని కూలీలు రెండు నెలలుగా అడుగుతున్నా గ్రామ సర్పంచ్ శకుంతలమ్మ అనుమతి ఇవ్వడం లేదు. స్థానికసంస్థలు, సార్వత్రిక ఎన్నికల్లో తాము చెప్పిన పార్టీకి కాదని.. మరో పార్టీకి మద్దతు తెలిపారనే కారణంతో కూలీలను ఇబ్బంది పెడుతున్నారు. దీంతో చేసేది లేక పలువురు కూలీలు వలస వెళ్తున్నారు.
ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం జిల్లాలోని 838 గ్రామ పంచాయతీల్లో 3,173 పనులు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇంతకంటే రెట్టింపు పనులు కావాలని కూలీలు అడుగుతున్నా గ్రామాల్లోని రాజకీయ పరిస్థితుల కారణంగా ఎక్కడికక్కడ బ్రేక్ వేస్తున్నారు. ఇంతకుముందు ఎన్ని పనులు అడిగితే అన్ని మంజూరు చేసేవారని, ప్రస్తుతం అందుకు విరుద్ధంగా జరుగుతోందని కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న ఫీల్డ్ అసిస్టెంట్లను సైతం తొలగించి.. వారి స్థానంలో టీడీపీ సర్పంచులకు అనుకూలంగా ఉండే వారిని నియమించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. మూడు నెలల పాటు గ్రామాల్లో పనులు కల్పించకపోతే ఫీల్డ్ అసిస్టెంట్లకు వేతనాలు నిలిపివేసే పరిస్థితి ఉంది. అప్పుడు వారంతట వారే వెళ్లిపోయేలా వ్యూహాలు రచిస్తున్నారు.
మా దృష్టికి వచ్చింది
కొన్ని గ్రామాల్లో సర్పంచులు ఉపాధి పనులకు ఆమోదం తెలపడం లేదని మా దృష్టికి వచ్చింది. అయితే.. రాజకీయాలు వేరు, పనులు వేరని ఇప్పటికే ఎంపీడీఓల ద్వారా సర్పంచులకు తెలియజేశాం. ఈ సమస్యకు త్వరలోనే పరిష్కారం చూపుతాం.
- సంజయ్ ప్రభాకర్, పీడీ, డీడబ్ల్యూఎంఏ
టీడీపీకి ఓటేయలేదని పొట్ట కొడుతున్నారు!
Published Tue, May 20 2014 1:19 AM | Last Updated on Wed, Sep 5 2018 8:24 PM
Advertisement
Advertisement