National Rural Employment Guarantee Programme (NREGP)
-
‘ఉపాధి’లో భేష్
సాక్షి, వికారాబాద్: మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్ఈజీఎస్)లో అత్యుత్తమ సేవలకు గాను తెలంగాణ నుంచి రెండు జిల్లాలు జాతీయ అవార్డుకు ఎంపికయ్యాయి. వివిధ కేటగిరీల్లో దేశవ్యాప్తంగా 18 జిల్లాలను కేంద్రం ఎంపిక చేయగా.. రాష్ట్రం నుంచి వికారాబాద్, కామారెడ్డి అవార్డు కైవసం చేసుకున్నాయి. ఉపాధి హామీ పనులు సమర్థంగా నిర్వహించడం, ఎక్కువ మంది కూలీలకు పని కల్పించడం తదితర అంశాల్లో అవార్డుకు ఈ జిల్లాలు ఎంపికయ్యాయి. పనులపై ప్రజెంటేషన్ ఉపాధి హామీ పథకంలో ఉత్తమ సేవలకు ఆయా జిల్లాల నుంచి అవార్డులకు జాబితా పంపాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించగా.. వికారాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం, నిర్మల్ జిల్లాలను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. జిల్లాల్లో చేసిన ఉపాధి పనులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వాలని కూడా జిల్లా కలెక్టర్లను రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దీంతో ఈ ఏడాది మే నెలలో కలెక్టర్లు పథకం ద్వారా చెపట్టిన పనులు, లబ్ధిదారుల ప్రగతిపై ప్రజెంటేషన్ ఇచ్చారు. దీనిపై సంతృప్తి చెందిన కేంద్రం జిల్లాలను అవార్డుకు ఎంపిక చేసింది. ఈ నెల 11న ఢిల్లీలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నరేంద్రసింగ్ తోమర్ చేతుల మీదుగా కలెక్టర్లు అవార్డు అందుకోనున్నారు. మరింత బాధ్యతగా పని చేస్తాం జిల్లాలోని గ్రామీణాభివృద్ధి అధికారులు, ఉద్యోగుల సహకారంతో లక్ష్య సాధనలో సఫలీకృతమయ్యాం. దీంతో కేంద్రం జాతీయ స్థాయి అవార్డుకు ఎంపిక చేసింది. ఇకపై మరింత బాధ్యతగా పని చేస్తాం. – జాన్సన్, డీఆర్డీఓ, వికారాబాద్ జిల్లా -
కూలీల కష్టం నీటి పాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలులో చోటుచేసుకున్న అక్రమాలపై కేంద్ర ప్రభుత్వం వివరణ కోరింది. రాష్ట్రానికిచ్చిన ఉపాధి నిధులను ఇతర పథకాలకు మళ్లించారని, గత మూడేళ్లలో రూ.9,862 కోట్లు దుర్వినియోగం చేశారని తప్పుబట్టింది. దీనిపై వివరణ ఇవ్వాలని పేర్కొంటూ ఉపాధి హామీ అమలును పర్యవేక్షించే కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ డైరెక్టర్ వారం క్రితం రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ (నంబర్ హెచ్– 11012– 21–2018) రాశారు. నాలుగున్నరేళ్లలో రూ.20,634 కోట్లు చంద్రబాబు ముఖ్యమంత్రిగా అధికారం చేపట్టిన నాటి నుంచి గత నాలుగున్నర ఏళ్లలో ఉపాధి పథకం అమలుకు కేంద్రం రూ. 20,634 కోట్లు ఇచ్చింది. ఈ ఏడాది ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పుటి వరకు ఐదు నెలల కాలానికే రూ. 5,753 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఉపాధి హామీ పథకం అమలుకు మాత్రమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. ఉపాధి హామీ కింద ఏ పనులు చేపట్టాలి? వేటిని చేపట్టకూడదనే అంశాలపై కేంద్రం స్పష్టమైన విధివిధానాలను ఖరారు చేసి రాష్ట్ర ప్రభుత్వాలకు తెలిపింది. నిబంధనలకు విరుద్ధంగా జీవోలతో మళ్లింపు ఉపాధి పథకం నిధులతో చేపట్టే ఏ పని అయినా కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా కేవలం గ్రామ పంచాయతీల ఆధ్వర్యంలో చేయాలని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. అయితే నిబంధనలు ఉల్లంఘించి రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు ప్రభుత్వం ప్రత్యేకంగా జీవోలు ఇచ్చి ఉపాధి నిధులను సాగునీటి పనులకు వ్యయం చేసిందని కేంద్ర అధికారులు లేఖలో పేర్కొన్నారు. నీరు– చెట్టు పేరుతోప్రొక్లెయిన్లతో చిన్న తరహా సాగునీటి చెరువుల్లో పూడిక తీత పనులు చేపట్టి అందుకు ఉపాధి నిధులను చెల్లించారని కేంద్రం లేఖలో పేర్కొంది. మట్టినీ మింగేశారు! రూ. 9,862 కోట్ల ఉపాధి హామీ నిధులను సాగునీటి చెరువుల్లో మట్టి వెలికి తీసే పనులకు ఖర్చు పెట్టడంతో పాటు భారీ పరిమాణంలో తవ్విన మట్టిని ఎక్కడ ఉపయోగించారో వివరాలు లేకపోవడాన్ని కేంద్రం తప్పుబట్టింది. చెరువుల నుంచి వెలికి తీసిన మట్టిని కాంటాక్టర్లు రూ.వేల కోట్ల కు విక్రయించినట్లు కేంద్రం అనుమానం వ్యక్తం చేసింది. సోము వీర్రాజు లేఖతో కదలిక.. ఉపాధి హామీ పథకంతో పాటు నీరు– చెట్టు కార్యక్రమం పేరుతో భారీగా అవినీతి జరుగుతున్నట్లు బీజేపీ ఎమ్మెల్సీ సోము వ్రీరాజు గత ఆగస్టు 1వ తేదీన కేంద్రానికి ఫిర్యాదు చేశారు. కేంద్రం ఇచ్చే నిధులతో అమలయ్యే కార్యక్రమంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణకు ఆదేశించాలని ప్రధాని మోదీ, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి తోమర్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో వివరాలను సేకరించిన కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ తమ దృష్టికి వచ్చిన అంశాలపై ప్రాథమికంగా రాష్ట్ర ప్రభుత్వ వివరణ కోరినట్టు అధికారవర్గాలు వెల్లడించాయి. -
పెదబాబు-చినబాబు.. 130 లఘు చిత్రాల విడుదల!
సాక్షి, అమరావతి: గ్రామాల్లో పేద కూలీలకు జీవనోపాధి కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం స్వలాభం కోసం ఉపయోగించుకుంటోంది. ఎన్నికలు సమీపిస్తుండడంతో ఈ పథకం నిధులతో సొంత ప్రచారం చేసుకోవాలని ప్రభుత్వం సంకల్పించింది. ఇప్పటినుంచి ఎన్నికలయ్యే దాకా దాదాపు 8 నెలలపాటు వందల సంఖ్యలో షార్ట్‌ఫిలింలు, పెద్దపెద్ద హోర్డింగ్‌లు, భారీ ఫ్లెక్సీలు, పోస్టర్లు రాష్ట్రమంతటా నిండిపోనున్నాయి. పేరుకే ప్రభుత్వ పథకాలపై ప్రచారం.. వాస్తవానికి జరిగేదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు, మంత్రి నారా లోకేశ్‌ల భజన కీర్తనలే. వారిద్దరిని ప్రపంచంలోనే గొప్ప పరిపాలనాదక్షులుగా చిత్రీకరిస్తూ ప్రజలను మభ్యపెట్టడమే ఈ ప్రచారపర్వం అసలు ఉద్దేశం. ప్రభుత్వం మనదే.. అడిగేదెవరు? ఉపాధి హామీ పథకంలో కూలీలకు డబ్బులు చెల్లించడానికి నిధులు లేవంటూ చేతులెత్తేస్తున్న ప్రభుత్వం మరోవైపు సొంత ప్రచారం కోసం అదే పథకం నిధులను వాడుకోవాలని నిర్ణయించడం గమనార్హం. కూలీలకు దాదాపు నెల రోజులుగా డబ్బులు చెల్లించడం ప్రభుత్వం నిలిపివేసింది. రూ.542 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. కానీ, ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ.కోట్లు ఖర్చు పెట్టి భారీ ఎన్నికల ప్రచారానికి టీడీపీ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసుకుంది. ఈ సొమ్ముతో వచ్చే ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీకి లబ్ధి చేకూరేలా ప్రచారానికి రూపకల్పన చేశారు. ఉపాధి హామీ పథకం అమలు విభాగానికి మంత్రిగా నారా లోకేశ్ వ్యవహరిస్తుండడంతో ప్రభుత్వ పెద్దలు ఆదేశించడం.. ఈ పథకం నిధులను ఎన్నికల ప్రచారానికి ఖర్చు పెట్టడానికి ప్రణాళిక సిద్ధం చేయడం.. ఆ ప్రణాళికకు మంత్రి నారా లోకేశ్ ఆమోదం తెలపడం వంటివి శరవేగంగా.. కేవలం పది రోజుల్లో పూర్తయింది. ఇక రాష్ట్రమంతటా ప్రచార హోరు ఉపాధి హామీ పథకం నిధుల నుంచి రూ.కోట్ల ఖర్చుతో 130 లఘుచిత్రాలను(షార్ట్ ఫిలింలు) చిత్రీకరించి, వాటిని 8 నెలలపాటు రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లలో ప్రదర్శించాలని ప్రభుత్వ పెద్దలు నిర్ణయించారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లను హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు, పోస్టర్లను నింపేస్తారు. రాష్ట్రవ్యాప్తంగా ఆటో రిక్షాలకు అంటించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఫోటోలతో కూడిన 50,000 పోస్టర్లను ముద్రించనున్నారు. ఇప్పటికే స్వచ్ఛ భారత్ పథకం నుంచి దాదాపు రూ.20 కోట్లు వెచ్చించి, ఆర్టీసీ బస్సుల చుట్టూ చంద్రబాబు బొమ్మలతో కూడిన ప్రచార పోస్టర్లను అతికించాలని ప్రభుత్వం ఆదేశించిన సంగతి తెలిసిందే. తాజాగా ఉపాధి హామీ పథకం నిధుల నుంచి కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి ఆర్టీసీ బస్సుల చుట్టూ చంద్రబాబు బొమ్మలతో కూడిన ప్రచార పోస్టర్లను అతికించాలని ప్రణాళికలో పొందుపరిచారు. ప్రతి పట్టణంలో నాలుగు పెద్ద పెద్ద హోర్డింగ్‌లు, మండల కేంద్రాల్లో ఒక్కోటి చొప్పున హోర్డింగ్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బకాయిలు ఎప్పుడిస్తారో? గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కూలీలు ఉపాధి హామీ పథకంలో చేసిన పనులకు గాను కూలీ డబ్బుల కోసం చకోర పక్షుల్లా ఎదురు చూస్తున్నారు. రాష్ట్రంలో 660 గ్రామీణ ప్రాంత మండలాలు ఉండగా, ఇందులో 170 మండలాల్లో కూలీలకు ప్రభుత్వం రూ.కోటికి పైగా బకాయిలు చెల్లించాల్సి ఉంది. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలంలోని 16 గ్రామ పంచాయతీల్లోని 13,084 కుటుంబాలకు చెందిన కూలీలు గత నాలుగు నెలలుగా ఉపాధి హామీ పథకం కింద పనులు చేశారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వం రూ.2.5 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. ఒక్కో కుటుంబానికి సగటున రూ.2 వేల చొప్పున ప్రభుత్వం బకాయి పడింది. అనంతపురం జిల్లా శింగనమల మండలంలోని కూలీలకు రూ. 2.36 కోట్లు, శ్రీకాకుళం జిల్లా సీతంపేట మండలంలోని కూలీలకు రూ. 2.26 కోట్లు, శ్రీకాకుళం జిల్లా గార్ల మండలంలోని కూలీలకు రూ.1.96 కోట్లు ప్రభుత్వం చెల్లించాలి. రాష్ట్రవ్యాప్తంగా 660 మండలాల్లోని కూలీలకు ప్రభుత్వం ఆదివారం నాటికి రూ.542.80 కోట్ల బకాయిలను చెల్లించాల్సి ఉంది. ఉపాధి నిధులు స్వాహా నిరుపేద కూలీలకు సొంత గ్రామాల్లోనే పనులు కల్పించి, వలసలకు అడ్డుకట్ట వేసేందుకు ఉపాధి హామీ పథకం అమలు కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను రాష్ట్ర సర్కారు దారి మళ్లించింది. రూ.5,224 కోట్ల ఉపాధి నిధులను ఖర్చు పెట్టి 19,179 కిలోమీటర్ల మేర సిమెంట్ రోడ్ల నిర్మాణం చేపట్టింది. మరో రూ.570 కోట్లతో మట్టి రోడ్లు నిర్మించినట్లు సమాచారం. దాదాపు రూ.6,000 కోట్ల విలువైన పనులను ఎలాంటి టెండర్లు లేకుండా అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నామినేషన్ విధానంలో కట్టబెట్టింది. ఉపాధి హామీ పథకం పనులపై సోషల్ ఆడిట్ తూతూమంత్రంగా జరుగుతోంది. ఈ పథకం నిధులను కేవలం గ్రామాల్లోనే ఖర్చు చేయాలి. పట్టణ ప్రాంతాల్లో ఖర్చు పెట్టడం నిబంధనలకు విరుద్ధమే. అయినా, టీడీపీ ప్రభుత్వం ఎన్నికల ప్రచారంలో భాగంగా పట్టణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం నిధులతో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని ప్రణాళిక రూపొందించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్లో దాదాపు రూ.814 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం తన వద్దే అట్టిపెట్టుకుంది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం ఇతర కార్యక్రమాలకు మళ్లించిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. -
పనులు చేసినా పైసల్లేవ్..!
కడప సిటీ: ఉపాధి కూలీలకు ఆరువారాలుగా కూలి డబ్బులు అందలేదు. పనులు చేసినా పస్తులు ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈవిషయంలో అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని వారు వాపోతున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని డబ్బులు అందేలా చూడాలని కోరుతున్నారు. జిల్లాలో ఉపాధి హామీ కింద రోజుకు 1.7 లక్షల పనిదినాలు నమోదవుతున్నాయి.795 గ్రామ పంచాయితీల్లో పనులు జరుగుతున్నాయి.రోజుకు సగటున రూ.170–205వరకు కూలి ఇవ్వాలి. అయితే పని చేసినా సకాలంలో డబ్బులు అందక పోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 4,88,939 మందికి..రూ.40.88 కోట్లు పెండింగ్ జిల్లాలో దాదాపు 4,88,939 మంది కూలీలకు రూ.40.88 కోట్లు రావాల్సి ఉంది. అంటే సగటున ఒక్కొక్కరికి రూ.8,000 రావాల్సి ఉంది. రెజెక్ట్ అయిన ఖాతాలకు సంబంధించి 10,914 మంది కూలీలకు గాను రూ.97.61 లక్షలు రావాల్సి ఉంది. వివిధ కారణాలతో ఖాతాల్లో డబ్బులు జమ కాని కూలీలు 13,079 మందికి 2.21 లక్షలు రావాల్సి ఉంది.ఈ పరిస్థితుల్లో కూలీలు ఉపాధి పనులకు వెళ్లడానికి ఇష్టపడటం లేదు. కూలీలకు సకాలంలో డబ్బులు రాకపోవడానికి కారణం కేంద్ర ప్రభుత్వమే కారణమని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. దీంతో కూలీలు మండి పడుతున్నారు. ఇబ్బందులు లేకుండా చూస్తాం కూలీలకు సకా లంలో డబ్బులు అందేలా చర్యలు తీసుకుంటాం.జూలై నెలకు సం బంధించి కొన్ని రోజుల వేతనం అందలేదని తెలిసింది.సమావేశం నిర్వహించి తగిన కారణాలను తెలుసుకుంటాం. కూలీలకు న్యాయం జరిగేలా చూస్తాం. – వై.హరిహరనాథ్, డ్వామా, పీడీ -
ఉపాధి హామీతో రైతుల ఆదాయం పెంపు
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని సమర్థవంతంగా వినియోగించుకోవడం వలన రైతుల ఆదాయాన్ని పెంచవచ్చని కేంద్ర గ్రామీణాభివృ ద్ధిశాఖ కార్యదర్శి అమర్జిత్ తెలిపారు. మంగళవారం హైదరాబాద్‌లో ‘2022 సంవత్సరానికి రైతుల ఆదాయం రెట్టింపు’ లక్ష్యంతో వ్యవసాయం, ఉపాధి హామీ అనుసంధానం విధానాన్ని రూపొందించే అంశంపై ‘నీతి ఆయోగ్, రాష్ట్ర వ్యవసాయశాఖ’ సంయుక్తంగా నిర్వహించిన ఒక రోజు వర్క్‌షాపులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ, వివిధ రాష్రాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం ద్వారా వారి ఆదాయం పెరిగినట్లు గుర్తించామన్నారు. పంటల సాగు ఖర్చును తగ్గించటం, మెరుగైన మార్కెటింగ్ సౌకర్యం, గిడ్డంగుల నిర్మాణం ద్వారా వారి ఆదాయం పెంపొందించవచ్చని తెలిపారు. ఇన్పుట్ ఖర్చులు తగ్గించడం వలన మేలైన ఫలితాలు లభిస్తాయని, ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామంలో రైతులకు అవసరమైన ఆస్తుల కల్పనకు ఉన్న అవకాశాలను వినియోగించుకోవాలన్నారు. కూలీల వేతనాలు స్థిరంగా ఉన్నాయి కానీ, వ్యవసాయ సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు తదితర ఖర్చులు గణనీయం గా పెరిగినట్లు సర్వేలు తెలుపుతున్నాయని తెలిపారు. ఉపాధి హామీ పథకంలో కొన్ని మార్పు లు చేయడం ద్వారా రైతులకు మేలు చేకూర్చే చర్యలు చేపట్టవచ్చన్నారు. వివిధ రాష్ట్రాలలో సమర్థవంతంగా అమలవుతున్న ఉపాధి హామీ పథకాన్ని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. రైతుల ఆదాయం పెంపొందించడానికి ప్రకృతి వనరుల యాజమాన్యం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యకరమైన రుణ సదుపాయం, పరిశోధన, మార్కెటింగ్ వ్యూహాలు తదితర తొమ్మిది అంశాలపై దృష్టి పెట్టాలన్నారు. 98% చిన్న, సన్నకారు రైతులు: సీఎస్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయం పెంపొందించడానికి అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి వివరించారు. తెలంగాణలో రైతులకు పెట్టుబడికోసం రైతుబంధు పథకం ప్రారంభించామని, సంవత్సరానికి ఎకరానికి రూ.8 వేలు ఇస్తున్నామన్నారు. ఆగస్టు 15 నుంచి రూ.5 లక్షల ఉచిత బీమాను ప్రతి రైతుకు అందిస్తున్నామన్నారు. భూసర్వే ద్వారా తెలంగాణలో 98 శాతం చిన్న, సన్నకారు రైతులు ఉన్నారని గుర్తించినట్లు తెలిపారు. రైతుల ఆదాయం పెంచడానికి, పాడి పరిశ్రమ, చేపల పెంపకం, గొర్రెల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. హరితహారం పథకాన్ని పెద్ద ఎత్తున అమలు చేస్తున్నందున ఉపాధి హామీలో వేతనం కింద అధిక నిధులను రాష్ట్రానికి కేటాయించాలని కేంద్రాన్ని కోరారు. ఇన్పుట్ ఖర్చు తగ్గించి, ఉత్పత్తి పెంపొందించినప్పుడే రైతులకు ఆదాయం పెరుగుతుందన్నా రు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పార్థసార థి స్వాగతోపన్యాసం చేస్తూ రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి తీసుకోవలసిన చర్యలపై సలహాలు, సూచనలను వివిధ వర్గాల నుండి తీసుకోవడానికి ఈ వర్క్‌షాప్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి తగు సూచనలు అందించాలని ఆయన కోరారు. ఈ సదస్సులో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు కార్యదర్శి సంజీవ్ కుమా ర్, వ్యవసాయ శాఖ సంయుక్త కార్యదర్శి దేవేశ్ చతుర్వేది, నీతి ఆయోగ్ సలహాదారు ఎ.కె.జైన్, ఎన్.ఐ.ఆర్.డి డైరెక్టర్ జనరల్ డాక్టర్ డబ్లు్య ఆర్ రెడ్డి, రాష్ట్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలు, పాండిచ్చేరి, అండమాన్ నికోబార్ ప్రాంతాల వ్యవసాయ, గ్రామీణాభివృద్ధి, నీతి ఆయోగ్ అధికారులు, వ్యవసాయరంగ నిపుణులు, రైతుసంఘాల ప్రతినిధులు, ఎన్జీవోలు పాల్గొన్నారు. -
మరో రంగస్థలం
జిల్లాలోని కుల్లూరు పంచాయతీలో ప్రస్తుతం రంగస్థలం కథ నడుస్తోంది. పంచాయతీ ఎన్నికలు రాక ముందే అక్కడ వాతావరణం వేడెక్కింది. పంచాయతీలో ఓ ప్రజాప్రతినిధి చెప్పిందే వేదం. ఆయన చెప్పినట్లు అధికారులు, ప్రజలు వినాల్సిందే. వినకపోతే వారిపై అవినీతి, అక్రమాల పేరుతో అధికారుల చేత విచారణలు, వేదింపులకు గురి చేస్తున్నాడు. తప్పు చేయకపోయినా.. చేసినట్లు ఆధారాలు లేకపోయినా.. ఏదో ఒక విధంగా చర్యలు తీసుకునేలా అధికారులపై ఒత్తిళ్లు చేయిస్తున్నాడు. ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్ ప్రజాప్రతినిధి చెప్పినట్లు చేయడం లేదనే అక్కసుతో అతనిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఆకాశారామన్న ఫిర్యాదులు తీసుకెళ్లి జిల్లా అధికారులకు అందజేసి విచారణ పేరుతో వేదిస్తున్నారు. అధికారులు కూడా ఆకాశ రామన్న ఫిర్యాదులకు అత్యంత ప్రధాన్యం ఇచ్చి కింది స్థాయి అధికారులతో విచారణలు చేయిస్తున్నారు. విచారణలో ఎలాంటి ఆధారాలు లేదని నివేదికలు అందజేస్తే మరొక ఆకాశ రామన్న ఫిర్యాదు చేసి విచారించి చర్యలు తీసుకోమని ఒత్తిడి తెస్తున్నారు. నెల్లూరు(పొగతోట): జిల్లాలోని కలువాయి మండలంలో ఉన్న కుల్లూరు మేజర్ పంచాయతీలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి పి.వంశీకృష్ణ ఫీల్డ్ అసిస్టెంట్(ఎఫ్ఏ)గా పని చేస్తూ కూలీలకు పనులు కల్పిస్తున్నాడు. ఉపాధి హామీ పనులు కల్పించడంలో ఈ పంచాయతీ ప్రథమ స్థానంలో ఉండడంతో ఎఫ్ఏ వంశీకృష్ణ ఎంపీడీఓ చేతులమీదుగా అవార్డు కూడా అందుకున్నారు. ఉ పాధి కూలీలకు రోజుకు రూ.200లకు పైగా వేత నం మంజూరయ్యేలా పనులు చూపిస్తున్నాడు. ఎఫ్ఏ తాను చెప్పినట్లుగా నడుచుకోలేదని ప్రజా ప్రతినిధి ఆకాశ రామన్న ఫిర్యాదులు చేయడం ప్రారంభించాడు. ఇద్దరు, ముగ్గురు కూలీలను రెచ్చగొట్టి ఎఫ్‌ఏపై ఫిర్యాదులు చేయించాడు. కొద్ది రోజుల తరువాత ఫిర్యాదులు చేసిన కూలీలు ఎంపీడీఓ వద్దకు వచ్చి తమకు రాజకీయాలతో సంబంధం లేదని, ఎఫ్ఏ తమకు పనులు కల్పిస్తున్నాడని, అతను అక్రమాలకు పాల్పడడం లేదని తెలిపారు.\ తమకు రావాల్సిన వేతనాలు అతను తీసుకోవడం లేదని ఎంపీడీఓకు రాతపూర్వకంగా వివరించారు. అనంతరం ఆ ప్రజాప్రతినిధి కూలీలు కాకుండా పంచాయతీ పాలక సభ్యులతో ఫిర్యాదు చేయించాడు. ఫిర్యాదు అందుకున్న అధికారులు ఆగమేఘాలపై కుల్లూరులో ఈ నెల 18వ తేదీన విచారణ చేపట్టారు. విచారణ సమయంలో ఎలాంటి ఆధారాలు లభించలేదు. గతంలో ఆధారులు లేని ఫిర్యాదుకు సంబంధించి బ్యాంక్ కార్సండెంట్ నుంచి కూలీలకు ఇవ్వాల్సిన రూ.1.20 లక్షల నగదు ఎఫ్ఏ తీసుకున్నాడని అతనితో రాయించుకుని దీనిపై క్రిమినల్ కేసు పెడతామని బెదిరిస్తున్నారు. ఉపాధి పనులు చేసినందుకు బ్యాంక్ కార్సండెంట్ కూలీలకు వేతనాలు ఇవ్వాల్సిఉంది. దానితో ఎఫ్‌ఏకు ఎలాంటి సంబంధం ఉండదు. చేసిన పనులకు వేతనాలు ఇంత వరకు ఇవ్వలేదని కూలీలు ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. ఫిర్యాదులు చేయకుండా బ్యాంక్ కార్సండెంట్ నుంచి ఎఫ్ఏ నగదు తీసుకుపోయడంటే గుడ్డిగా ఏవిధంగా కేసు నమోదు చేసే విషయాన్ని పరిశీలిస్తే పై నుంచి ఏస్థాయిలో ఒత్తిళ్లు వచ్చాయో అర్థమవుతోంది. అవినీతిని కప్పిపెట్టి.. కుల్లూరు పంచాయతీలో రోడ్లు వేయకుండా రూ.లక్షల బిల్లులు స్వాహా చేసిన పంచాయతీ కార్యదర్శిపై ఎలాంటి విచారణ చేయలేదు. పంటకుంటల బిల్లులు మంజూరు కాగానే వాటిని పూడ్చి వేసి పంటలు సాగు చేస్తున్నా వాటిపై ఎలాంటి విచారణ చేయడం లేదు. పంచాయతీ కార్యదర్శి నిధులు స్వాహా చేశారని జిల్లా అధికారులకు నాలుగు పర్యయాలు ఫిర్యాదులు చేసినా ఇప్పటి వరకు ఎలాంటి విచారణ చేపట్టలేదు. ఉపాధి టీఏకు రూ.3.50 లక్షల రికవరీ పడితే దానిని రూ.14 వేలకు తగ్గించారు. దీనిపై ఇంత వరకు విచారణ చేయలేదు. అధికారపార్టీ ప్రజాప్రతినిధి కావడంతో అధికారులు ఆయన చెప్పినట్లు చేస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకపోయిన ఎఫ్‌ఏపై చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేయడం చేస్తుండడం గమనార్హం. -
వ్యవసాయంతో ‘ఉపాధి’ అనుసంధానం?
సాక్షి, అమరావతి: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానించే విషయమై కేంద్రం నియమించిన ముఖ్యమంత్రుల కమిటీ ముసాయిదా నివేదికను దాదాపు సిద్ధం చేసింది.వచ్చే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోపు కేంద్రానికి సమర్పించవచ్చని తెలిసింది. కేంద్రం అమలు చేస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక పథకాల్లో ఒకటైన ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేస్తే వ్యవసాయ ఖర్చులు గణనీయంగా తగ్గుతాయని ముఖ్యమంత్రుల కమిటీ అభిప్రాయపడినట్టు సమాచారం. అయితే ఈ కమిటీ చేయబోయే సిఫారసులు ఏమిటన్నది ముందే బయటకు పొక్కడంతో విమర్శలు వెల్లువెత్తాయి. వ్యవసాయ ఖర్చులు తగ్గితేనే రైతు బతికి బట్టకడతాడని కొందరు రైతులు వాదిస్తుండగా కూలీల కడుపుకొట్టి భూ స్వాములకు పెడతారా? అని వ్యవసాయ కూలి సంఘాలు మండిపడుతున్నాయి. అసలేమిటీ కమిటీ? వ్యవసాయ ఖర్చులు తగ్గించాలనే దానిపై పరిశీలించి నివేదిక సమర్పించేందుకు కేంద్రం ఏడు రాష్ట్రాల (ఆంధ్రప్రదేశ్, బిహార్, యూపీ, గుజరాత్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్) ముఖ్యమంత్రులతో కమిటీ ఏర్పాటు చేసి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్‌ను చైర్మన్‌గా నియమించింది. ఈ కమిటీ ఇటీవల ఢిల్లీలో భేటీ అయి వ్యవసాయ ఖర్చులు తగ్గించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. విత్తనం మొదలుకొని పంటల ఉత్పత్తుల అమ్మకాల వరకు పథకాన్ని ఎలా వర్తింపజేయవచ్చు అనేది ప్రధానంగా చర్చించింది. సాగు ఖర్చులు తగ్గించి, నీటిని సమర్థంగా వినియోగించడం ద్వారా ఉత్పత్తిని పెంచడం, గిట్టుబాటు కల్పించడం, ప్రకృతి విపత్తులతో దెబ్బతిన్న భూముల్ని తిరిగి పునరుద్ధరించడం వంటి అంశాలను చర్చించినా ప్రధానంగా ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి ఎలా అనుసంధానం చేయాలన్న దానిపైనే దృష్టి కేంద్రీకరించినట్టు తెలిసింది. దేశంలో అమలవుతున్న అతిపెద్ద సంక్షేమ పథకమైన ఉపాధి హామీకి 2017–18లో కేంద్రం రూ.55 వేల కోట్లను కేటాయించి నైపుణ్యం లేని కూలి కింద సంతకం చేసి గుర్తింపు కార్డు పొందిన ప్రతి గ్రామీణ కార్మికునికి ఏడాదికి వంద రోజుల పని కల్పిస్తోంది. గ్రామీణ ఉపాధి, అనువైన ఆస్తుల సృష్టి అనే ఉపాధి హామీ పథకం లక్ష్యాల సాధనకు అనుగుణంగా వ్యవసాయ రంగ అవసరాలను తీర్చడం ఎలా? అనే విషయాన్ని ముఖ్యమంత్రుల కమిటీ పరిగణలోకి తీసుకుంది. కనీస వేతనాల కన్నా ఉపాధి హామీ కూలి ఎక్కువగా ఉన్నందున వ్యవసాయంతో అనుసంధానం చేస్తే ఉపయోగంగా ఉంటుందని భావిస్తోంది. భూస్వాముల ఉపాధిగా మారుస్తారా? వ్యవసాయంలో ఉపాధి హామీ నిధులు ఖర్చుకు అవకాశం ఇవ్వడాన్ని వ్యవసాయ కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే 29 రకాల పనులను వ్యవసాయంతో అనుసంధానం చేశారని, మరో 12 రకాల పనులను కొత్తగా ఆ జాబితాలో చేర్చాలని చూస్తున్నారని, అదే జరిగితే ఇది భూస్వాముల ఉపాధి హామీగా మారుతుందని వాదిస్తున్నాయి. సీఎం చంద్రబాబు ఇందుకు సుముఖత వ్యక్తం చేయడాన్ని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు సుబ్బారావు ఖండించారు. ఉపాధి హామీ పథకం ప్రారంభించిన స్ఫూర్తినే దెబ్బతీస్తారా? అని ప్రశ్నించారు. ఉపాధి పథకాన్ని వ్యవసాయంతో అనుసంధానం చేయాల్సి వస్తే వంద రోజుల పని చట్టాన్ని 360 రోజుల పనికి పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
కూలి చెల్లింపులో జాప్యం వద్దు
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాల చెల్లింపులో జాప్యం లేకుండా చూడాలని, వీటి చెల్లింపునకే బ్యాంకులు, పోస్టాఫీసులు తొలి ప్రాధాన్యత ఇవ్వాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. ఉపాధి కూలీలకు వేతనాల చెల్లింపులో జాప్యంపై బ్యాంకర్లు, తపాలా, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులతో జూపల్లి గురువారం సమీక్ష నిర్వహించారు. నిరుపేద కూలీలకోసం ఉపాధి హామీ పథకం చేపడుతున్నామని, కూలి చెల్లింపులో జాప్యం చేయడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకుల ద్వారా చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు లేవని, నగదు కొరత కారణంగా పోస్టల్ చెల్లింపుల్లో తీవ్రజాప్యం జరుగుతోందని గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు మంత్రికి తెలిపారు. బ్యాంకుల్లో ఖాతా తీసుకునేందుకు ఆధార్ కార్డుతోపాటు పాన్ కార్డు అడగడం వల్ల ఉపాధి కూలీలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెప్పారు. అలాగే మూడు నెలలపాటు ఆపరేట్ చేయకుండా ఉన్న కూలీల అకౌంట్లను తొలగించడం, జీరో బ్యాలెన్స్ అకౌంట్లను ప్రారంభించేందుకు బ్యాంకు సిబ్బంది నిరాకరించడం లాంటి కారణాలతో దాదాపు 60 శాతం చెల్లింపులను పోస్టల్ ద్వారా చేయాల్సి వస్తుందని వివరించారు. ఉపాధి కూలీలకు చెల్లింపులకోసం ఏప్రిల్, మే నెలల్లో బ్యాంకులకు రూ.360 కోట్లను, పోస్టాఫీసులకు రూ.412 కోట్లను విడుదల చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటివరకు బ్యాంకులు రూ.350 కోట్ల వరకు చెల్లింపులు జరిపాయని, తపాలా శాఖ కేవలం రూ.79 కోట్లు మాత్రమే చెల్లించిందని అధికారులు వివరించారు. తపాలా శాఖ తీరుపై జూపల్లి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటినుంచి ఎలాంటి జాప్యం లేకుండా చెల్లింపులు జరపాలని పోస్ట్ మాస్టర్ జనరల్ పీవీఎస్ రెడ్డిని ఆదేశించారు. ఆర్బీఐ నుంచి నగదు విడుదల చేయకపోవడం, వారం రోజులుగా పోస్టల్ సిబ్బంది సమ్మెలో ఉండటం వల్ల చెల్లింపుల్లో జాప్యం జరిగిందని పీవీఎస్ రెడ్డి వివరించారు. నగదు కొరతను అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఉపాధి నిధుల చెల్లింపు కోసమే ప్రత్యేకంగా రూ.150 కోట్లను బుధవారం విడుదల చేశామని ఆర్బీఐ డిప్యూటీ జనరల్ నాగేశ్వర్రావు తెలిపారు. -
ఉపాధిలో లోపాలెన్నో..
కడప సిటీ : ఉపాధి హామీ పథకం జిల్లాలో సక్రమంగా అమలుకు నోచుకోలేదన్న విమర్శలున్నాయి. సమస్యలను పరిష్కరించడంలో అధికారులు తీవ్ర వైఫల్యం చెందారన్న ఆరోపణలున్నాయి. మజ్జిగ పంపిణీ, కూలీలకు సౌకర్యాలు, బిల్లుల చెల్లింపు, పెండింగ్ ఖాతాల పరిష్కారాలు, సిబ్బంది సమస్యలు తదితర అంశాలు తిష్టవేసి పరిష్కారానికి నోచుకోక కూలీలు ఇబ్బందులు పడుతున్నారు. పంపిణీ కాని మజ్జిగ :జిల్లాలో రోజుకు ఉపాధి పనులకు 1.80 లక్షల మంది కూలీలు హాజరవుతున్నట్లు అధికారుల లెక్కలు చెబుతున్నాయి. వేసవిలో కూలీలకు వడదెబ్బ సోకకుండా ఒక్కొక్కరికి 250ఎం.ఎల్ మజ్జిగను అందించాల్సి ఉంటుంది. ఇందుకుగానూ మేట్లకు మజ్జిగకు రూ.4లు, పంపిణీ చేసినందుకు ఒక్క రూపాయి ఇస్తారు. అయితే జిల్లాలో చాలా చోట్ల మేట్లు కూలీలకు మజ్జిగ పంపిణీ చేయకుండానే పంపిణీ చేస్తున్నట్లు నమోదు చేసుకుంటున్నారు. తమ ఖాతాలలో ఆ మొత్తాన్ని జమ చేసుకుంటున్నారు. అధికారులకు తెలిసినప్పటికీ ఈ విషయం పట్టించుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. పరిష్కారంకానీ సస్పెన్షన్ ఖాతాలు :గతకొన్నేళ్లుగా ఉపాధి కూలీలకు సంబంధించి సస్పెన్షన్ ఖాతాల జాబితాలో ఉన్న వారికి ఇప్పటికీ కూలీ ల సొమ్ము అందలేదు. జిల్లా వ్యాప్తంగా ఈ ఖాతాల పరిధిలో 13,832మంది కూలీలు ఉన్నారు. దాదాపు రూ.2.26కోట్లు ఈ కూలీలకు డబ్బులు రావాల్సి ఉంది. ఆధార్ కార్డు బ్యాంక్ ఖాతాకు లింకేజీ కాకపోవడంవల్ల కూలీలకు డబ్బులు జమ కాలేదు. ఈ సమస్యను అధికారులు పరిష్కరించలేదు. ♦ కంప్యూటర్ ఆపరేటర్లు జాబ్ కార్డులు ఇచ్చేటప్పుడు వారి బ్యాంక్ ఖాతాకు ఆధార్ కార్డు, ఉపాధి హామీ జాబ్ కార్డు నంబర్లు సరిగా వేస్తేనే ఖాతా నమోదవుతుంది. ఆపరేటర్ల నిర్లక్ష్యం ఉన్నా అధికారులు దగ్గరుండి చేయించకపోవడంవల్లే ఈ పరిస్థితి నెలకొంది. వాటర్ షెడ్ గ్రామాలలో అందని మజ్జిగ.. జిల్లాలో 795పంచాయతీలున్నాయి. ఇందులో 200గ్రామాలు వాటర్ షెడ్ కింద ఎంపికయ్యాయి. అయితే ఈ పథకం కింద ఎంపికైన గ్రామాలలో ఉపాధి కూలీలు మజ్జిగ పంపిణీకి నోచుకోలేదు. ఈ పథకానికి సంబంధించి ప్రత్యేక వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంవల్లే ఈ పరిస్థితి వచ్చిందని అధికారులు చెబుతున్నారు. దాదాపు 40వేల మంది కూలీలకు మజ్జిగ అందడంలేదు. సరిగా అందని బిల్లులు :జిల్లాలో గతంలో లేని విధంగా కూలీలకు బిల్లుల సమస్య వెంటాడుతోంది. 2016–17 సంవత్సరంలో మార్చి నాటికే దాదాపు రూ.60లక్షల మేర బిల్లులు రావాల్సి ఉండగా.. ఇప్పటివరకు పూర్తిస్థాయిలో బిల్లులు రాలేదు. ప్రస్తుతం పనిచేస్తున్న ఉపాధి పనులకు సంబంధించి కూలీలకు సకాలంలో కూలీ డబ్బులు అందడంలేదు. దీంతో కూలీలు పనులకు రావాలంటే మొగ్గు చూపడంలేదు. సోషల్ ఆడిట్‌పై విమర్శలు : ఉపాధి పనులను సక్రమంగా చేశారా.. లేక అక్రమాలకు పాల్పడ్డారా అనే విషయంపై సామాజిక తనిఖీ(సోషల్ ఆడిట్) చేయడం ఉపాధి పథకంలో ఒక నియమంగా ఉంటుంది. కానీ జిల్లాలో సోషల్ ఆడిట్‌పై పలు విమర్శలు వస్తున్నాయి. ♦ ముద్దనూరులో సోషల్ ఆడిట్ సక్రమంగా జరగలేదని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా.. ప్రత్యేక బృందంతో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది. అలాగే సొ మ్ము రికవరీ చేయడానికి అలసత్వం ప్రదర్శిస్తున్న ట్లు తెలుస్తోంది. కొంతమందినుంచి రికవరీ చేయకుండానే లోపాయికారి ఒప్పందం చేసుకుని అధికా రులు మళ్లీ విధులలో చేర్చుకున్నట్లు సమాచారం. ♦ ఉపాధిలో తిష్ట వేసిన సమస్యలను పరిష్కరించాలని డైరెక్టర్ రంజిత్ బాషాను ఉపాధి హామీ కూలీలు కోరుతున్నారు. ఎన్నో ఏళ్లుగా తిష్ట వేసిన సమస్యలను పరిష్కరించే దిశగా నేడు జరిగే సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నారు. -
15 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల సస్పెన్షన్
కర్నూలు(అర్బన్) : ఉపాధి హామీ అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిన 15 మంది ఫీల్డ్ అసిస్టెంట్ల(సీనియర్ మేటీలు)ను సస్పెండ్ చేసినట్లు డ్వామా పీడీ ఎం.వెంకటసుబ్బయ్య తెలిపారు. శుక్రవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 2018–19 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం నిర్ణయించిన పనిదినాలను పూర్తి చేయడంలో ఫీల్డ్ అసిస్టెంట్లు పూర్తిగా విఫలమయ్యారన్నారు. ఆర్థిక సంవత్సరం ప్రారంభమై నెల రోజులు పూర్తి కావొస్తున్నా ఇంతవరకు ఆయా గ్రామ పంచాయతీల్లో ఉపాధి పనులు ప్రారంభం కాని విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకుపోయాన్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదోని మండలం బసాపురం, చిన్నహరివాణం, ఆత్మకూరు మండలం సున్నిపెంట, చాగలమర్రి మండలం నేలంపాడు, హొళగుంద మండలం పెద్దగోనేహాల్, కోసిగి మండలం జంబులదిన్నె, మిడుతూరు మండలం కలమందలపాడు, ఓర్వకల్లు మండలం మీదివేముల, అవుకు మండలం చెర్లోపల్లి, రామాపురం, పాణ్యం మండలం కొత్తూరు, ప్యాపిలి మండలం మెట్టుపల్లి, ఎన్.రంగాపురం, పెద్దపూదిర్ల, వెల్దుర్తి మండలం అల్లుగుండు ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేశామన్నారు. -
కూలీలతో వెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తా
సారంగాపూర్(జగిత్యాల): ఉపాధి హామీ కూలీలను తీసుకెళ్తున్న ట్రాలీ ఆటో బోల్తాపడిన సంఘటనలో 21 మంది గాయపడ్డారు. జగిత్యాల జిల్లా లక్ష్మీదేవిపల్లి–పెంబట్ల గ్రామాల మధ్య సోమవారం ఈ సంఘటన జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. సారంగాపూర్ మండలం పెంబట్ల గ్రామంలోని బుడిగెజంగాలకాలనీ, బీసీ కాలనీకి చెందిన కూలీలు కొద్దిరోజులుగా ఉపాధి హామీ పనులకు వెళ్తున్నారు. సోమవారం ఉదయం పెంబట్ల–రంగపేట గ్రామాల మధ్య పెద్దమ్మ ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో పనులు నిర్వహించడానికి సుమారు 35 మంది గ్రామానికి చెందిన పార్తం గంగాధర్ ట్రాలీ ఆటోలో వెళ్లారు. పనులు ముగించుకుని ట్రాలీ ఆటోలో ఇళ్లకు బయల్దేరారు. ఆటో లక్ష్మీదేవిపల్లి గ్రామం దాటగానే ఓవర్‌లోడ్ కారణంగా కుదుపునకు గురికావడంతో డ్రైవర్ సడెన్‌గా బ్రేక్‌వేశాడు. దీంతో వేగంగా వెళుతున్న వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తాపడింది. ఈసంఘటనలో 21 మంది కూలీలు గాయపడ్డారు. సకాలంలో స్పందించిన పోలీసులు సంఘటన విషయం తెలుసుకున్న సారంగాపూర్ ఎస్సై రాజయ్య 10 నిమిషాల్లో తన సిబ్బందితో ఘటనాస్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. తహసీల్దార్ వసంత, ఎంపీడీవో పుల్లయ్య పరిస్థితిని సమీక్షించారు. క్షతగాత్రులను జగిత్యాల ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి పరామర్శించారు. -
ఇలాగైతే ఇంటికి పంపుతా
ఆదోని: ఉపాధి హామీ పథకం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఇంటికి పంపుతానని జిల్లా కలెక్టర్ సత్యనారాయణ హెచ్చరించారు. బు«ధవారం పట్టణంలోని ఎంపీడీవో సమావేశం హాలులో ఆదోని, కౌతాళం, కోసిగి, పెద్దకడబూరు, మంత్రాలయం మండలాల ఎంపీడీఓలు, ఏపీఓలు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఇంజినీరింగ్ కన్సల్టెంట్లతో సమావేశం నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ప్రగతి లేక పోవడంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు కల్పించకపోవడంతో ఆదోని డివిజన్ పరిధిలోని మండలాల నుంచి ప్రజలు ఎక్కువగా వలసలు పోతున్నారన్నారు. పత్రికల్లో వార్తలు వస్తున్నా.. సిగ్గు అనిపించదా? బుద్ధి ఉన్నోళ్లు ఎవరైనా స్పందించకుండా ఉంటారా? అని మండి పడ్డారు. వలసల నివారణచకు చర్యలు తీసుకోకపోతే బాధ్యులను ఇంటికి పంపుతానని హెచ్చరించారు. ఐదు మండలాల్లో మార్చి చివరి లోగా 175 లక్షల పనిదినాలు కల్పించాల్సి ఉండగా 125 లక్షల పనిదినాలు మాత్రమే కల్పించారన్నారు. సీనియర్ మేట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు సక్రమంగా పనిచేయడం లేదని మంత్రాలయం, పెద్దకడుబూరు ఎంపీడీవోలు ఫిర్యాదు చేయగా.. పూర్తి వివరాలతో నివేదిక పంపితే చర్యలు తీసుకుంటానని కలెక్టరు చెప్పారు. ఎండలు మండుతున్నందున ఉదయం, సాయంత్రం మాత్రమే పనులు చేపట్టాలని సూచించారు. కూలీలు పని చేసే చోట తాగునీరు, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మజ్జిగ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఆదోని డివిజన్లో తాగు నీటి వనరులపై ఆర్డబ్ల్యూఎస్ ఈఈ రామస్వామితో చర్చించారు. వేసవిలో ఎక్కడా నీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో డ్వామా పీడీ వెంకటసుబ్బయ్య, ఆర్డీఓ ఓబులేసు, అదనపు పీడీ నాగేశ్వరరావు, ఏపీడీ మల్లేశ్వరి, ఏపీవోలు మన్న, మద్దిలేటి పాల్గొన్నారు. -
అవినీతిని సహించం..!
సాక్షి ప్రతినిధి, కడప : ఉపాధి హామీ పథకం జిల్లాకు వరం. నాలుగేళ్లుగా జిల్లాలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో వలసలు నియంత్రించేందుకు ప్రతి ఒక్కరికీ పని కల్పించడమే లక్ష్యంగా పని చేస్తున్నాం. ఇందుకు తగిన కార్యాచరణ ప్రణాళికతో ముందుకెళ్తున్నాం. రోజూ లక్ష పని దినాలు నమోదయ్యేలా క్షేత్ర సిబ్బంది ని నిత్యం పర్యవేక్షిస్తున్నాం. ఈ పథకం పరిధిలో ఏ స్థాయిలో కూడా అవినీతిని సహించేది లేదు. అవినీతికి ఎవరైనా పాల్పడుతున్నట్లు తెలిస్తే నేరుగా నాకు ఫిర్యాదు చేయొచ్చు. ఎవ్వరిని వదిలిపెట్టం. కఠిన చర్యలు తీసుకుంటాం.’ అని జిల్లా నీటి యాజమాన్య సంస్థ(డ్వామా) పీడీ వై హరి హరనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 270 కోట్లు ఖర్చు చేశామని ఇందులో సింహభాగం కూలీలకే చెల్లించామని ఆయన వివరించారు. జిల్లాలో ఉపాధి, వాటర్షెడ్ల పనుల నిర్వహణ, సిబ్బంది పనితీరు..అక్రమాలు.. వంటి వాటిపై ‘సాక్షి’ ఆయనతో ముఖాముఖి నిర్వహించింది. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ప్రతి కూలీకి పనికల్పిస్తాం.. ప్రతి కూలీకి పని కల్పించడమే కర్తవ్యంగా పెట్టుకున్నాం. ఆ దిశగా క్షేత్రస్థాయి సిబ్బందిని సమాయత్తం చేస్తున్నాం. కూలీలు అడిగినా పనులు కల్పించకపోతే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించాం. ఇప్పుడిప్పుడు పని దినాల సంఖ్య పెరుగుతోంది. రోజూ 80 వేల మంది దాకా కూలీలు పనులకు వస్తున్నారు. ఈ సంఖ్యను లక్షకుపైగా పెంచాలనేది లక్ష్యం. రాజంపేట, జమ్మలమడుగు, పులివెందుల ప్రాంతాల్లో పొలం పనులు జరుగుతున్నాయి. రానున్న రెండు మూడు రోజుల్లో పని దినాల సంఖ్య లక్షకుపైగా పెరిగే అవకాశం ఉంది. అలాగే 2018–19 ఆర్థిక సంవత్సరానికి 1.30 కోట్ల పని దినాలు లక్ష్యంగా పెట్టుకున్నాం. ∙రూ.270 కోట్లు ఖర్చు చేశాం.. ఈ ఆర్థిక సంవత్సరంలో పని దినాల నమోదు లక్ష్యం 1.39 కోట్లు. ఇప్పటికే 1.08 కోట్ల పని దినాలను పూర్తి చేశాం. మిగిలిన పని దినాలను మార్చి నాటికి పూర్తి చేస్తాం. ఈ ఏడాది ఉపాధి హామీ కింద రూ.330 కోట్లు ఖర్చు చేయాలన్నది లక్ష్యం. ఇప్పటి దాకా రూ.270 కోట్లు ఖర్చు చేశాం. ఇందులో కూలీలకే రూ.157 కోట్లు చెల్లించాం. సామగ్రి కొనుగోలు కింద మరో రూ.87 కోట్లు వ్యయం చేశాం. వేతనాలకు రూ.18 కోట్లు వెచ్చించాం. ∙బాధ్యతతో పనిచేయాలి.. క్లస్టర్లో సహాయ పీడీలు విధుల పట్ల ఎవరూ నిర్లక్ష్యంగా వ్యవహరించరాదు. కేవలం సిబ్బందిపై కర్ర పెత్తనం చేస్తామంటే కుదరదు. సమష్టిగా పని చేస్తేనే ఫలితాలు సాధ్యం. ఇదే విషయాన్ని ప్రతి వారం సమీక్షల్లో చెబుతున్నాం. రూ.2.36 కోట్ల అవినీతి జరిగింది.. పదమూడేళ్ల కిందట ఈ పథకం మొదలైంది. మొత్తం 12 విడతల సామాజిక తనిఖీలు జరిగాయి. ఉపాధి, వాటర్షెడ్ల పనుల్లో దాదాపు రూ.9.84 కోట్ల అక్రమాలు జరిగినట్లు సామాజిక తనిఖీ బృందాలు తేల్చాయి. ఇందులో రూ.4.86 కోట్లు విచారణ తర్వాత రద్దు చేశాం. మరో రూ.2.36 కోట్ల మేర వసూలు చేశాం. ఆర్ఆర్ చట్టం కింద రూ.1.53 కోట్లు, మిగిలిన రూ.96 లక్షలు వేతనాల రికవరీ కింద వసూలు చేయాల్సి ఉంది. అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు.. ఉపాధి, వాటర్షెడ్ల పనుల్లో ఏస్థాయి అధికారైనా అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయి. ఏ స్థాయిలో అవినీతిని సహించేది లేదు. అధికారులెవరైనా అవినీతికి పాల్పడుతున్నట్లు తెలిస్తే.. నేరుగా నాకు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. అవినీతి ఆరోపణలు నిజమని తేలితే కఠిన చర్యలు తీసుకుంటాం. పీఓలపై పని ఒత్తిడి ఉన్నది వాస్తవమే.. ఉపాధి హామీ పథకంలో ఎంపీడీఓలే పీఓలుగా పనిచేస్తున్నారు. వీరు సరిగా పనిచేయలేదన్నది వాస్తవం కాదు. నేను వచ్చిన తర్వాత తరచూ వారితో మాట్లాడుతున్నా.. మండల కంప్యూటర్ కేంద్రాల్లో ఎంపీడీఓలు ఉండి ప్రతి లావాదేవీని వారే చేస్తున్నారు. అయితే వారు ఇతర పనుల పట్ల దృష్టి సారించడంతో పని ఒత్తిడి ఉన్న మాట వాస్తమే. అలాగని వారు ఉపాధి పనిని ఎప్పుడూ నిర్లక్ష్యం చేయడం లేదు. -
లేజీఎస్!
రాయికోడ్(అందోల్): ఈజీఎస్ (ఎంప్లాయిమెంట్ గ్యారంటీ స్కీం) పనులు జిల్లాలోని ఆయా మండలాల్లో నత్తనడకన సాగుతున్నాయి. చేసిన పనులకు సంబంధించి కూలీల వేతనాలు, మెటీరియల్ కాంపోనెంట్ నిధులు సక్రమంగా విడుదల కావడం లేదు. నాడెం కంపోస్టు పిట్స్, పాఠశాలల కిచెన్ షెడ్స్, ఇంకుడు గుంతలు, పశువుల పాకలు, సేద్యపు నీటి గుంతలు, డంపింగ్ యార్డులు తదితర పనులు మందకొడిగా సాగుతున్నాయి. 2016 నుంచి ఆయా రకాల పనులు మంజూరైనా ఆశించిన స్థాయిలో పురోగతి కనిపించడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేక, గ్రామీణ ప్రాంతాల్లో ఆశించిన స్థాయిలో అవగాహన లేక, బిల్లులు సకాలంలో అందుతాయనే భరోసా లేక మంజూరైన పనులు నిదానంగా నడుస్తున్నాయి. సేద్యపు నీటి గుంతలు.. జిల్లాలో 3,031 సేద్యపు నీటి గుంతలకు 777 గుంతలే వివిధ దశల్లో పనులు కొనసాగుతున్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. రైతులకు ఎంతో ఉపయోగకరంగా ఉండే సేద్యపు నీటి గుంతలను నిర్మింపజేసి పంటల సాగులో రైతులు ఎదుర్కొనే నీటి ఇబ్బందులను తీర్చాల్సి ఉండగా పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడంలేదు. పూర్తికాని పశువుల పాకలు.. జిల్లాలోని ఆయా మండలాల్లో 558 నిర్మించాల్సి ఉండగా 55 పశువుల పాకలు మాత్రమే నిర్మాణ దశలో ఉన్నాయి. పశువుల పాకలు లేక పోషకులు తాము పోషిస్తున్న పశువులను ఆరుబయట కట్టేస్తున్నారు. ఈ దశలో పశువులు, పోషకుల ప్రయోజనం కోసం మంజూరు చేసిన పాకలు పూర్తి చేయడంలో క్షేత్రస్థాయిలో సంబంధిత అధికారులు, సిబ్బందికి చిత్తశుద్ధి కొరవడిందనే ఆరోపణలు ఉన్నాయి. 306 మాత్రమే పూర్తయిన కంపోస్ట్ పిట్స్.. 1,333 నాడెం కంపోస్టు పిట్స్ మంజూరు కాగా 306 మాత్రమే ప్రారంభించినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. ఇంకుడు గుంతలు అంతంతే.. 53,138 ఇంకుడు గుంతలు మంజూరవగా ఇప్పటివరకు 22,013 ఇంకుడుగుంతలు మాత్రమే పూర్తి చేశారు. ప్రస్తుతం ఎక్కడా ఇంకుడుగుంతల నిర్మాణం చురుగ్గా సాగుతున్న పరిస్థితులు లేవు. ఇంకుడుగుంతలు నిర్మించుకున్న వారికి సకాలంలో బిల్లులు రాకపోవడంతో ఈ పనులు చేపట్టడానికి లబ్ధిదారులు ఆసక్తి చూపడంలేదని తెలుస్తోంది. పూర్తికాని డంపింగ్ యార్డులు.. జిల్లాకు 330 డంపింగ్ యార్డులు మంజూరయ్యాయి. ఇందులో 142 డంపింగ్ యార్డులు మాత్రమే ప్రారంభమయ్యాయి. డంపింగ్ యార్డుల నిర్మాణంలో అధికారులు పెద్దగా దృష్టి సారించడం లేదనే వాదనలు వినవస్తున్నాయి. పూర్తయిన కిచెన్ షెడ్లు 128 మాత్రమే.. ఆయా మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలలకు 539 కిచెన్ షెడ్లు మంజూరు చేయగా 128 మాత్రమే పూర్తయినట్లు ఈజీఎస్ అధికారులు వెల్లడించారు. శ్మశాన వాటికల అభివృద్ధి పనులు సైతం ఆశించిన స్థాయిలో సాగడం లేదు. వివిధ రకాల పనులు మంజూరవుతున్నా వాటిని పూర్తి చేయడంలోనే లోపాలు కనిపిస్తున్నాయి. కొరవడిన పర్యవేక్షణ.. ఈజీఎస్ పనులపై పర్యవేక్షణ లేక ఆశించిన స్థాయి లో పనుల్లో పురోగతి లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా, మండల స్థాయిలోని అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షణకు ప్రాధాన్యతనిచ్చి ప్రజల్లో ఈజీఎస్ పనులపై సరైన అవగాహన కల్పిస్తే ఆశిం చిన లక్ష్యాలను చేరుకునే అవకాశం ఉంది. పనులు పూర్తి చేయడానికి కృషి చేస్తున్నామని అధికారులు చెబుతున్నా గ్రామాల్లో పనుల పురోగతి అందుకు విరుద్ధంగా ఉంది. ఇప్పటికైనా పటిష్ట ప్రణాళికలు వేసి మంజూరైన అన్నిరకాల ఈజీఎస్ పనులను పూర్తి చేయాలని పలువురు కోరుతున్నారు. -
తెలంగాణలో కేంద్ర పథకాల అమలు భేష్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యక్రమాల అమలు బాగుందని కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి రాంకృపాల్ యాదవ్ ప్రశంసించారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ కేంద్ర పథకాలపై మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలసి రాజేంద్రనగర్‌లోని రాష్ట్ర పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థ (టీ సిపార్డ్)లో సోమవారం సమీక్ష నిర్వహించారు. తెలంగాణలో అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాల పురోగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అధికారులు వివరించారు. ఉపాధి హామీ, పీఎంజీఎస్‌వై, రూర్బన్, డీడీయూజీకేవై, టీఆర్ఐజీపీ, పింఛన్ల పంపిణీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రాంకృపాల్ యాదవ్ మాట్లాడుతూ.. తెలంగాణలో గ్రామీణాభివృద్ధి శాఖ కార్యక్రమాల అమలు బాగుందని, మరింత ఉత్సాహంగా పనిచేయాలని సూచించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని చెప్పారు. హరితహారంలో భాగంగా నాటిన మొక్కల మనుగడ రేటు 70 శాతం వరకు ఉండటంపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఉపాధి హామీ పనిదినాల్ని పెంచండి దేశానికే ఆదర్శంగా గ్రామీణాభివృద్ధి శాఖను తీర్చిదిద్దుతామని మంత్రి జూపల్లి అన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి మరింత సహకారం అందజేయాలని కోరారు. పెద్ద ఎత్తున ఉపాధి హామీని అమలు చేస్తున్నామని, ఈ ఆర్థిక సంవత్సరంలో మొదట్లో ఇచ్చిన 8 కోట్ల పనిదినాల లక్ష్యాన్ని ఇప్పటికే అధిగమించామని తెలిపారు. ఈ లక్ష్యాన్ని 16 కోట్లకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. గతంలో నిలిచిన పనులకు సంబంధించి రూ.800 కోట్ల విలువైన రహదారుల నిర్మాణానికి పీయంజీఎస్‌వై–2 కింద అనుమతినివ్వాలని కోరారు. రాష్ట్రానికి మూడు విడతల్లో 16 రూర్బన్ క్లస్టర్లను మంజూరు చేశారని.. కనీసం జిల్లాకు ఒక్కటైనా ఇవ్వాలని కోరుతూ కేంద్ర మంత్రి రాంకృపాల్ యాదవ్‌కు జూపల్లి వినతి పత్రం అందజేశారు. ఈ సమీక్షలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజ్, కమిషనర్ నీతూ ప్రసాద్, సెర్ప్ సీఈఓ పౌసమి బసు తదితరులు పాల్గొన్నారు. -
ఉపాధి కూలీలను పస్తులుంచుతారా?: చాడ
సాక్షి, హైదరాబాద్: ఉపాధి హామీ కూలీలకు నాలుగు నెలలుగా వేతనాలివ్వడం లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మంగళవారం ఆవేదన వ్యక్తం చేశారు. పండుగ పూట వారిని పస్తులు ఉంచుతారా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. దసరా, దీపావళి పండుగలకు కూలీ డబ్బులు ఇవ్వలేదని, సంక్రాంతికైనా వారికి వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధిహామీ పథకం కింద చేపట్టిన కొత్తబావుల తవ్వకం, పూడికతీత వంటి పనులకు కూలి డబ్బులను చెల్లించకపోవడంతో కూలీలు అప్పుల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
కేంద్ర పథకానికి పచ్చ రంగు
వ్యవసాయ కూలీలు పనుల సమయంలో ఖాళీగా లేకుండా, పనుల కోసం వలస పోకుండా తమ ప్రాంతాలలోనే పనులు చేసుకొని ఉండాలన్న ఉద్దేశంతో గతంలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని అమలులోకి తెచ్చింది. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలకు రాజకీయ రంగు పూసి తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటుంది. పథకాల అమల్లో లోపాలుంటే మాత్రం దాన్ని అమలు చేసే వారిపై నెడుతుంది. రామభద్రపురం: కేంద్ర పథకాలకు రాష్ట్రంలో అధికార తెలుగుదేశం ప్రభుత్వం తమ రంగు వేస్తూ ప్రయోజనం పొందేందుకు శతవిధాల ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలోనే ఉపాధి హామీ జాబ్ కార్డులను పూర్తిగా పసుపు రంగుతో ముద్రించి జారీ చేసింది. తెలుగుదేశం ప్రచార కార్డులుగా పసుపు రంగుతో ముద్రించిన జాబ్‌కార్డులను ఇప్పటికే జిల్లాలోని ఏపీఓలు క్షేత్ర స్థాయి అధికారులకు అందజేశారు. వీటిని జన్మభూమి గ్రామ సభలలో ఉపాధి హామీ వేతనదారులకు అందజేస్తున్నారు. జిల్లాలో 5,03,038 జాబ్‌కార్డులుండగా, సుమారుగా 11 లక్షలు వేతనదారులున్నారు. వారిలో 3,50,000 పైబడి జాబ్‌కార్డుదారులు పనులుకు వెళ్తున్నట్టు సమాచారం. వీరికి గతంలో మాదిరిగా కాకుండా కొత్తగా పసుపు పచ్చరంగులో ఉపాది పనులకు పోతున్న వేతనదారులకు మాత్రమే ఫోటోలతో ముద్రించిన జాబ్‌కార్డులను పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఉన్న జాబ్‌కార్డులు స్థానంలో కొత్త వాటికి ఆధార్ అనుసంధానం చేసి అందజేస్తున్నారు. వీటిని పుస్తక రూపంలో ముద్రించి కుటుంబంలో ఉపాధి పనులకు వెళ్తున్న వారి వివరాలను ముద్రించారు. కార్డు ఐదేళ్లు ఉపయోగపడేలా రూపొందించారు. అలాగే పనులు చేసే ముందుగా ఒక ఫోటో, 60 శాతం పనులు పూర్తి చేసిన తరువాత మరో ఫోటో తీసి జియో ట్యాగింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయడం వల్ల ఉపాధి పనుల్లో అక్రమాలకు తావు లేకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ఇక నుంచి వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఈ జాబ్ కార్డులు కీలకంగా మారనున్నాయని సమాచారం. హౌసింగ్ పథకంలో ఇళ్ల నిర్మాణం, ఇంకుడు గుంతల తవ్వకం, గ్రామాల్లో సీసీ రోడ్లు, వ్యక్తిగత మరుగుదొడ్లు, పశుగ్రాస క్షేత్రాలు నాడెఫ్ తొట్లు, చెరువులు తవ్వకం, పూడికతీత పనులు, వర్మీ కంపోస్టులు, మట్టి రోడ్ల నిర్మాణం ఇలా అన్ని పనులకు జాబ్‌కార్డుల అవసరం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. దీంతో కొత్తగా అందజేస్తున్న జాబ్‌కార్డులు టీడీపీ ప్రచార కార్డులుగా ఉన్నాయని, కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వ పథకాలుగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని బీజేపీ నాయకులు పెదవి విరుస్తున్నారు. సొంత పథకాలుగా ప్రచారం తగదు... రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సంక్షేమ ప«థకాలను అమలు చేస్తాయి. ఆ పథకాలను కేంద్రం ఇచ్చిన వాటా ఎంత ఉంది, రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత అనేది రాష్ట్ర ప్రభుత్వాలు ప్రచారం చేయాలి. అలా కాకుండా సొంత పథకాలుగా ప్రచారం చేసుకోవడం విడ్డూరంగా ఉంది. –పెద్దింటి జగన్మోహనరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నిర్వీర్యం చేస్తోంది... రాష్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను నిర్వీర్యం చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతీ పథకానికి 80 శాతం నిధులు ఇస్తుంది. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఉపయోగించుకోవడం తప్ప కనీసం ఏ పథకానికి కేంద్రం ప్రభుత్వ పేరు చెప్పడం లేదు. –ఆర్.లక్ష్మణరావు, బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు -
ఉపాధి సిబ్బందితో సెల్‌గాటం
గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ శాంసంగ్ మొబైల్ ఫోన్ల వ్యాపారం ప్రారంభించిందా? ఉపాధి హామీ పథకం సిబ్బంది వద్దంటున్నా బలవంతంగా పాత స్మార్ట్ఫోన్లను అంటగట్టే ప్రయత్నాలు ప్రారంభిం చిందా? స్మార్టు ఫోన్లు ఉన్నా మళ్లీ కొనాల్సి వస్తోందని ఉపాధి హామీ పథకం సిబ్బంది వాపోతున్నారా? అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి. ఉపాధి పథకం సిబ్బంది వద్ద ఇప్పటికే స్మార్టు ఫోన్లు ఉన్నా అంతగా ఫీచర్లు లేని ఫోన్లను బలవంతంగా అంటగట్టడం ఇందుకు నిదర్శనం. సాక్షి, మచిలీప్నటం: రాష్ట్రంలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ప్రారంభించి పదేళ్లు పూర్తయింది. పథకంలో పారదర్శకత కోసం 8 ఏళ్లుగా కూలీల హాజరు, పని కొలతల నమోదు, కూలి చెల్లింపును ఆన్లైన్లో చేపడుతున్నారు. ఇందు కోసం క్షేత్ర స్థాయి సిబ్బంది మొదలు కార్యాలయ సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ అధునాతన టెక్నాలజీతో కూడిన ఆండ్రాయిడ్ స్మార్టు ఫోన్లను వినియోగిస్తున్నారు. 2006లో పథకం ప్రారంభం సమయంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఉపాధి హామీ పథకం సిబ్బందికి సాధారణ ఫోన్లు ఉచితంగా అందజేసింది. ఆన్లైన్ చెల్లింపులు ప్రారంభమవడంతో నాలుగేళ్ల క్రితం రూ.6,700 విలువైన శాంసంగ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లు అందజేసింది. ఫోన్ ధరలో 50 శాతం సిబ్బంది చెల్లిస్తే, మిగిలిన మొత్తం గ్రామీణాభివృద్ధి భరిస్తుందని మొదట్లో చెప్పినా ఆ మొత్తాన్ని కూడా సిబ్బంది వేతనం నుంచే వసూలు చేశారు. వద్దన్నా ఫోన్లు సెల్‌ఫోన్ కంపెనీల మధ్య పోటీ నేపథ్యంలో అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, సరికొత్త ఫీచర్లతో మొబైల్ ఫోన్లు చౌకధరలకే లభిస్తున్నాయి. ఉపాధి సిబ్బంది కూడా రూ.10 వేలకు పైగా విలువైన లేటెస్ట్ మోడల్ స్మార్ట్ఫోన్లతో రోజువారీగా కూలీల హాజరు, కొలతలు, జీపీఎస్ ద్వారా క్షేత్రస్థాయి నుంచే ఎన్ఆర్ఈజీఎస్ వెబ్‌సైట్‌కు అప్లోడ్ చేస్తున్నారు. క్షేత్రస్థాయి ఫీల్డ్ అసిస్టెంట్లతో పాటు మేట్లు కూడా వీటినే వినియోగిస్తున్నారు. ఈ నేథ్యంలో ఇటీవల ఎన్ఆర్ఈజీఎస్ సరఫరా చేసే స్మార్ట్ ఫోన్లు ఎవరికి కావాలంటూ గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ నుంచి ఉపాధి సిబ్బందిని అడిగారు. 80 శాతం మందికి పైగా క్షేత్రస్థాయి సిబ్బంది తమకు అవసరం లేదని స్పష్టం చేశారు. అయితే రాష్ట్రంలోని అన్ని డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్ కార్యాలయాలకు పాతబడిన శాంసంగ్ జే2 ప్రో మొబైల్ పార్శిళ్లు వచ్చిచేరాయి. జిల్లాలో గ్రామీణాభివృద్ధి శాఖలో ఏపీడీ, పీఓ, టెక్నిలక్ అసిస్టెంట్స్, సీనియర్ మేట్లు కలిపి 1035 మంది ఉన్నారు. వారందరికీ రూ.93 లక్షలు వెచ్చించి కొనుగోలు చేశారు. ఇప్పటికే 80 శాతం ఫోన్లను ఎంపీడీఓ కార్యాలయాలకు సరఫరా చేశారు. కొంత మంది సిబ్బందికి సైతం పంపిణీ చేశారు. మిగిలిన వారికి రెండు మూడు రోజుల్లో అందజేయనున్నారు. సిబ్బంది అప్పుగా ఫోన్లు ఇచ్చి, నెలకు రూ.900 చొప్పున జీతంలో కోత విధించనున్నారు. పాత ఫోన్లకు అధిక ధర శ్యాంసంగ్ జే2 ప్రో మోడల్ పాతబడింది. ప్రస్తుతం సరికొత్త జే7 మోడల్ మార్కెల్లో లభిస్తోంది. ఈ ఫోన్ల కంటే ఎక్కువ ఫీచర్స్ ఉన్న వీవో, అప్పో ఫోన్లు చౌకగా లభిస్తున్నాయి. ఆ కంపెనీలతో పోల్చితే శాంసంగ్ బ్యాటరీ లైఫ్, ఫీచర్స్ కూడా తక్కువే. అమెజాన్ వంటి ఆన్లైన్ సంస్థ రూ.8,470 రూపాయలకే విక్రయిస్తున్న జే2 ప్రో ఫోన్‌ను రూ.9080కు అంటగడుతున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 26,786 మందికి అంటగట్టేందుకు రూ.24.32 కోట్లు వెచ్చించి ఫోన్లుకొన్నారు. ఇన్ని ఫోన్లు కొంటే ఆన్లైన్ ధరకంటే తక్కువకే రావాలి. అయితే ధర అంతకు విరుద్ధంగా ఉంది. అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల పాత్ర దాగుందని, ఇందులో భాగంగానే తమ కమీషన్ల కోసం సిబ్బందిని పావులుగా వాడుకుంటున్నారన్న ఆరోపణలున్నాయి. -
ఆత్మలకూ ‘ఉపాధి’!
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పాలనలో ఆత్మలకు ప్రాణమొస్తోంది. ప్రాణం రావడమే కాదు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నాయి. బిల్లులు కూడా తీసుకుంటున్నాయి. కావాలంటే పశ్చిమ గోదావరి జిల్లా నల్లజర్ల మండలం తెలికిచర్ల గ్రామానికి వెళ్లి చూడండి. ఈ గ్రామానికి చెందిన పాముల గంగరాజు 2010లో ఉపాధి హామీ పథకంలో కూలీగా నమోదు చేసుకున్నారు. గంగరాజు, భార్య చింటమ్మ పేరిట ఆ కుటుంబానికి 050681324014010959 నెంబరుతో జాబ్‌కార్డును ప్రభుత్వం జారీ చేసింది. గంగరాజు అనారోగ్యం పాలై 2013లో మరణించారు. అతడి మరణాన్ని ధ్రువీకరిస్తూ తెలికిచెర్ల గ్రామ పంచాయతీ కార్యదర్శి అదే ఏడాది మరణ ధ్రువీకరణ పత్రాన్ని కూడా జారీ చేశారు. కానీ చనిపోయిన గంగరాజు ఏప్రిల్, మే, జూన్ నెలల్లో 48 రోజులు పాటు పనిచేసినట్టు ఉపాధి హామీ పథకం రికార్డులో పేర్కొన్నారు. ఆ మేరకు బిల్లులు కూడా తీసుకున్నారు. స్థానిక టీడీపీ నేతలు, అధికారులు కుమ్మక్కై గ్రామంలో ఉన్న మరో పాముల గంగ రాజు పేరిట బ్యాంకు ఖాతాలు తెరిచి, దాని ద్వారా డబ్బులు డ్రా చేశారని సమాచారం. చనిపోయిన గంగరాజు తండ్రి పేరు రాముడు అని ఉపాధి పథకం జాబ్ కార్డులో ఉండగా... డబ్బులు తీసుకున్న గంగరాజు తండ్రి పేరు నాగేశ్వరరావు కావడం గమనార్హం. అయినా అవేమీ పట్టించుకోకుండా బిల్లులు చెల్లించడం రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలు తీరుకు అద్దం పడుతోంది. రాష్ట్రమంతటా దొంగమస్టర్ల దందానే చనిపోయిన గంగరాజు పేరుతో బిల్లులు తీసుకున్నట్లే దొంగ మస్టర్ల దందా రాష్ట్రమంతటా యధేచ్చగా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలే ఇప్పుడు పరోక్షంగా ఉపాధి హామీ పథకంలో దొంగ మస్టర్ల ప్రక్రియను ప్రోత్సహిస్తున్నారని అధికార యంత్రాంగం ఆరోపిస్తోంది. ఉపాధి హామీ పథకంలో కూలీలకు నేరుగా వారి బ్యాంకు ఖాతాలో కూలీ డబ్బులు చెల్లిస్తున్న కేంద్ర ప్రభుత్వం... కూలీలు జిల్లాల వారీగా చేసిన పని విలువను బట్టి రాష్ట్రానికి మెటీరియల్ నిధులను విడుదల చేస్తోంది. పథకంలో కూలీ ద్వారా రూ.60 పని జరిగినట్టు రికార్డులు చూపితే మరో రూ.40 చొప్పున రాష్ట్రానికి 40 శాతం మెటీరియల్ నిధులు మంజూరు చేస్తోంది. ఈ 40 శాతం మెటీరియల్ నిధులతో గ్రామాల్లో పెద్ద మొత్తంలో కాంట్రాక్టు పనులు అప్పగిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో చంద్రబాట పథకంలో వేసే సిమెంట్ రోడ్లు నిర్మాణానికి, అంగన్వాడీ, గ్రామ పంచాయతీ, మండల పరిషత్ కార్యాలయాల నిర్మాణాలకు ఉపాధి హామీ పథకంలో కేంద్రం నుంచి అందే మెటీరియల్ నిధులే దిక్కు. ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకంలో ఇల్లు మంజూరు చేసిన ప్రతి లబ్ధిదారుడు ఒక్కొక్కరికీ రూ. 55 వేలు ఉపాధి హామీ పథకం నిధులను చెల్లిస్తున్నారు. స్మశానాల చుట్టూ ప్రహరీ గోడ, పాఠశాలల్లో ఆటస్థలాలు, చివరకు మినీ స్టేడియాలకు ఈ రకమైన ‘ఉపాధి’ నిధులను ఖర్చు చేయాలని ప్రభుత్వం అధికారులకు ఆదేశించింది. దీంతో సిమెంట్ రోడ్లు, ప్రభుత్వ భవనాల నిర్మాణాలకు అవసరమయ్యే ఉపాధి హామీ పథకం మెటీరియల్ నిధులు కేంద్రం నుంచి ఎక్కువ మొత్తంలో విడుదల కావాలంటే రాష్ట్రంలో కూలీల ద్వారా ఎక్కువ పని జరిగినట్టు రికార్డులు చూపించాలి. ఈ నేపథ్యంలో ఉపాధి పథకం 40 శాతం మెటీరియల్ నిధులను కేంద్రం నుంచి అధిక మొత్తం రాబట్టుకునేందుకు కూలీల పని కల్పనకు ప్రభుత్వం గ్రామాల్లో ఫీల్డు అసిస్టెంట్లకు టార్గెటు విధించింది. ప్రతి రోజూ ప్రతి జిల్లాకు లక్షల మంది చొప్పున కూలీలకు పని కల్పించాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో టార్గెట్లు పూర్తి చేసే ప్రక్రియ సులభమైన దొంగ మస్టర్ల నమోదు దందా ఊపందుకుంది. రెండురకాల ప్రయోజనాలతో నేతలదే హవా! గ్రామంలో ఉపాధి హామీ పథకంలో ఎక్కువ మంది పనిచేసిన దాని ప్రకారమే ఆ జిల్లా పరిధిలోని గ్రామాల్లో సిమెంట్ రోడ్లకు నిధులు కేటాయింపు ఉంటుందని ముఖ్యమంత్రి సహా మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు టీడీపీ అంతర్గత సమావేశాల్లో ప్రచారం చేశారు. దీంతో గ్రామ స్థాయి టీడీపీ నేతలు తమ పరిధిలోని ఫీల్డు అసిస్టెంట్ల ద్వారా దొంగ మస్టర్లతో ఎక్కువ పనిచేసినట్టు చూపించే ప్రక్రియకు తెరతీశారు. తమకు అనుకూలమైన వారి పేరిట పంట కుంట (ఫామ్ ఫాండ్)లను మంజూరు చేసి, వాటిని పొక్లెయిన్ మెషీన్ల ద్వారా తవ్వించి, అదే పనిని కూలీలతో చేయించినట్టు రికార్డులు నమోదు చేయిస్తున్నారు. రూ.5 వేలు ఖర్చు పెట్టి పొక్లెయిన్ల ద్వారా చేసిన పనికి రూ. 30–40 వేల పనిని కూలీల ద్వారా చేసినట్టు చూపి సొమ్ము చేసుకుంటున్నారు. ఆ విధంగా రెండు రకాలుగా ప్రయోజనాలు పొందుతున్నారు. నెల్లూరు జిల్లాలో పోలీసు కేసు పొక్లెయిన్ల సహాయంతో తవ్విన పంట కుంటకు తమకు తెలిసిన కూలీల పేర్లతో పనిచేసినట్టు చూపి బిల్లు చేసుకోవడంపై శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఇటీవల పోలీసు కేసు కూడా నమోదైంది. దుత్తలూరు మండలంలో కొందరు టీడీపీ నేతలు తమ గ్రామంలోని ఫీల్డు అసిస్టెంట్ సహాయంతో పొక్లెయిన్ల ద్వారా తవ్విన దాదాపు 10 పంట కుంటలకు కూలీల పేరుతో బిల్లు చేసుకున్నట్టు నమోదు చేసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన సోషల్ ఆడిట్లో ఈ విషయాలు వెలుగులోకి రావడంతో సిబ్బంది నుంచి ఆ మొత్తాన్ని రికవరీ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. దీంతో కొందరు టీడీపీ నేతలు పొక్లెయిన్ల ద్వారా తవ్విన దానికి కూలీల ద్వారా చేయించినట్టు మోసగించి తమ ద్వారా బిల్లు చేసుకున్నారంటూ సంబంధించిన సిబ్బంది మండల పోలీసు స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది. -
కోరిక తీర్చలేదని.. కక్షగట్టారు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం: ఆమెకు తల్లిదండ్రుల్లేరు.. పేదరికం కారణంగా వివాహమూ కాలేదు.. చిన్న ఉద్యోగం చేసుకుంటూ పొట్టపోసుకుంటోంది. ఆమెపై ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవు.. అయినా ఆ నిరుపేదరాలిపై కక్షగట్టారు. నాలుగు మెతుకులు పెడుతున్న ఆ చిన్న ఉద్యోగం నుంచి ఆమెను తొలగించారు. ఆమె చేసిన తప్పల్లా.. పై అధికారి కోరిక తీర్చకపోవడమే. దీంతో ఉపాధి కోల్పోయి వీధినపడ్డ ఆ అభాగ్యురాలు తనకు న్యాయం చేయాలంటూ ‘సాక్షి’ని ఆశ్రయించింది. ఉద్యోగమే ఆధారం: విజయనగరం జిల్లా జామి మండలం, లొట్లపల్లి గ్రామానికి చెందిన ఆమె పేరు జన్నెల వాణిశ్రీ. నిరుపేద కుటుంబం. తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఐదుగురు ఆడపిల్లల్లో వాణిశ్రీ చిన్నమ్మాయి. ఇంటర్ వరకు చదివిన వాణిశ్రీ నాలుగేళ్ల పాటు కూలి పనులకెళ్లారు. 2006లో ఉపాధి హామీ పథకం రావడంతో ఫీల్డ్ అసిస్టెంట్‌గా ఉద్యోగంలో చేరారు. అప్పటి నుంచీ మరో వ్యాపకం లేకుండా విధులకు అంకితమయ్యారు. 2008–09 సంవత్సరాల్లో తల్లిదండ్రులు కాలం చేశారు. ఒకప్పుడు కట్నం ఇవ్వలేక తల్లిదండ్రులు ఆమెకు పెళ్లి చేయలేకపోయారు. ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించే పరిస్థితిలో ఆమె జీవితం లేదు. కోరిక తీర్చు.. లేదా డబ్బులు కట్టు! ఈ నేపథ్యంలో పైఅధికారి కన్ను తనపై పడుతుందని ఆమె ఊహించలేదు. అతని బుద్ధి తెలిసి కుంగిపోయారు. డబ్బుకి పేదనైనా.. గుణానికి కాదంటూ అతని కోరికను తిరస్కరించారు. అదే ఆమె చేసిన నేరమన్నట్లు ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. ఉన్నవి, లేనివి కల్పించారు. రికార్డులు తారుమారు చేసి ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి ఆమెను విధులకు రావొద్దన్నారు. ఆపై ఈ నెల 16వ తేదీన ఉద్యోగంలోంచి తొలగించారు. ఉద్యోగం కావాలంటే కోరిక తీర్చాలి లేదా.. రూ.30 వేలైనా ఇవ్వాలని పైఅధికారి చేసిన ప్రతిపాదన విని ఆమె కన్నీరు మున్నీరయ్యారు. న్యాయం కోసం డ్వామా పీడీకి, జిల్లా కలెక్టర్‌కు నేరుగా ఫిర్యాదుచేసినా ఫలితం లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తంచేశారు. విచారించాకే చర్యలు ఫిబ్రవరి నుంచి వాణిశ్రీ విధులకు హాజరు కావడం లేదు. దీనిపై విచారణ జరిపి విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆదేశాలు జారీచేశాం. ఆమె స్థానంలో జన్మభూమి కమిటీ సూచించిన వ్యక్తిని నియమించాం. – శ్రీహరి, ఐదు మండలాల క్లస్టర్ ఏపీడీ. ఆమె మాటలు అవాస్తవం ఫీల్డ్ అసిస్టెంట్ వాణిశ్రీ చేస్తున్న ఆరోపణలు అవాస్తవం. ఆమెను ఏ రకంగానూ వేధించలేదు. విధి నిర్వహణలో ఆమె చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటుంది. రికార్డులు కూడా సక్రమంగా నిర్వహించడం లేదు. ఆమెను తొలగించడానికి ఇంకా చాలా కారణాలున్నాయి. ఆమె స్థానంలో ఎవరో ఒకరిచే పనిచేయించుకోవాలి కాబట్టి వేరొకరిని నియమించుకున్నాం. – పి.కామేశ్వరరావు, ఉపాధి హామీ ఏపీవో, జామి మండలం. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
నెల్లూరు(పొగతోట): గూడూరు రూరల్ మండలంలోని ఉపాధిహామీ ఏపీఓ సుబ్బరాయుడిపై దాడి చేసిన అధికారపార్టీ నాయకుడి తనయుడు నాగరాజు, అతని అనుచరులను అరెస్ట్ చేయాలని మహాత్మాగాందీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉద్యోగుల సమాఖ్య(జేఏసీ) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బద్దిపూడి మధు, వల్లూరు దయానంద్ డిమాండ్ చేశారు. ఉపాధి హామీ సిబ్బందికి రక్షణ కల్పించాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏపీఓపై అధికారపార్టీకి చెందిన వ్యక్తులు 20 మంది చుట్టుముట్టి మేము చెప్పిన పనులు చేయవా అంటూ పిడిగుద్దులు గుద్దుతూ, కాళ్ళతో తన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీఓ ప్రాణభయంతో పోలీస్‌స్టేషన్‌కు పరుగులు తీసిన పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఉపా«ధి సిబ్బంది అభద్రతతో పనులు చేయలేమని తెలిపారు. ఈ మేరకు కలెక్టర్ ఆర్.ముత్యాలరాజుకు వినతిపత్రం సమర్పించారు. జ్ఞానప్రకాష్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రపతి, ప్రధాని చిత్రపటాలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఉంచాలి రాష్ట్రపతి, ప్రధాని చిత్రపటాలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఏర్పాటు చేసేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్. సురేష్‌రెడ్డి కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ మేరకు.. కలెక్టర్ ఆర్.ముత్యాలరాజుకు వినతి పత్రం సమర్పించారు. రాష్ట్రపతి, ప్రధాన మంత్రి చిత్రపటాలను అధికారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. న్యాయం చేయండి అల్లూరు చెరువు భూముల్లో పంటలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న యానాదులకు న్యాయం చేయాలని యానాది సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పెంచలయ్య కోరారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు చెరువు భూముల్లో 140 యానాది కుటుంబాలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నట్లు తెలిపారు. సమ్మర్‌స్టోరేజ్ కోసం ఆ భూముల్లో ఐదెకరాలు మాత్రమే ప్రభుత్వం తీసుకుందన్నారు. గతంలో పంటలు సాగు చేసుకున్న యానాదులు భూముల్లోకి వెళితే ఎస్సీలు దౌర్జన్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయం చేయాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజుకు వినతిపత్రం సమర్పించారు. భూస్వాముల నుంచి రక్షణ కల్పించండి.. పేద రైతులకు భూ స్వాముల నుంచి రక్షణ కల్పించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సీపీఐ సినియర్ నాయకులు పి.దశరథరామయ్య, వి. రామరాజు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి దామా అంకయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు. నెల్లూరు రూరల్ మండలం కందమూరులో 150 ఎకరాల ప్రభుత్వ భూములను నిరుపేదలు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని తెలిపారు. అయితే నెల్లూరుకు చెందిన వ్యాపారులు సాగు చేయనివ్వకుండా రైతులపై క్రిమినల్ కేసులు పెట్టారని తెలిపారు. అప్పటి కలెక్టర్ భూములను పరిశీలించి వ్యాపారులకు ఇచ్చిన పట్టాలను రద్దు చేయమని ఆదేశించినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం దొంగ పట్టాలు సృష్టించి రైతులను భూముల్లోకి దిగనివ్వకుండా అడ్డుపడుతున్నారన్నారు. భూములు సాగు చేస్తున్నా వారికి పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆర్.ముత్యాలరాజుకు వినతిపత్రం సమర్పించారు. సొసైటీకి ఎన్నికలు నిర్వహించాలి బ్రాహ్మణక్రాక ఫిషర్మెన్ కో–ఆపరేటివ్ సొసైటీకి ఎన్నికలు నిర్వహించేలా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని సొసైటీ సభ్యులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. 1975లో జలదంకి మండలం బ్రాహ్మణక్రాక సోసైటీ రిజిస్టర్ అయిందన్నారు. ఎన్నికలు నిర్వహించకుండా జరిగినట్లు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. కార్యవర్గ సభ్యుల గడువు పూర్తి అయినందున సోసైటీకి ఎన్నికలు నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతు జిల్లా కలెక్టర్ ఆర్. ముత్యాలరాజుకు వినతిపత్రం సమర్పించారు. -
నిధులు దుర్వినియోగం చేస్తే చర్యలు
బోధన్‌రూరల్(బోధన్): ప్రభుత్వ పథకాల అమలు, గ్రామీణ ప్రజలకు ఉపాధిహామీ కల్పనలో ప్రభుత్వ నిధులు దుర్వినియోగం, నిర్లక్ష్యానికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి వెంకటేశ్వర్లు అన్నారు. సోమవారం బోధన్ మండల పరిషత్ కార్యాలయంలో 10వ విడత మండలస్థాయి ఈజీఎస్ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ తనిఖీలో మండలం లోని 32 జీపీల పరిధిలో ఉపాధిహామీ పథకంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు, రికార్డుల నమోదు, నిధుల వినియోగం వంటి అంశాలపై డీఆర్డీవో ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించారు. 2016 సెప్టెంబర్ 1 నుంచి 2017 జూన్ 30 వరకు మండలంలో మొత్తం రూ. 12కోట్లకు పైగా ప్రభుత్వ నిధులు వినియోగించారని, అయితే ఇందులో సుమారు రూ. 3లక్షల వరకు నిధులు దుర్వినియోగం జరిగినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఈ నిధులను ఫీల్డ్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్ల నుంచి రికవరీ చేపట్టామని వారు తెలిపారు. విధుల్లో నిర్లక్ష్యం గా వ్యవరించిన 70మంది మేట్లను తొలగించామని డీఆర్డీవో వెంకటేశ్వర్లు తెలిపారు. ఎంపీడీవో మల్లారెడ్డి, ఈవోపీఆర్డీ రాజేశ్వర్, ఈజీఎస్ ఏపీఓ రాజేశ్వర్, సోషల్ ఆడిట్ అధికారి చంద్రశేఖర్, ఎస్‌ఆర్పీపీలు రాము, రవి పాల్గొన్నారు. -
ఎవరు బాధ్యులు?
కొన్ని నిర్ణయాలు అమాయకులను బలితీసుకుంటాయి. కొందరి వేధింపులు కొన్ని బతుకులను రోడ్డున పడేస్తాయి. కొత్తవలసలో ఇటీవల చోటు చేసుకుంటున్న సంఘటనలు అక్కడి అధికారుల నిర్ణయాలను ప్రశ్నిస్తున్నాయి. నెల రోజుల క్రితం ఓ కాంట్రాక్టు బోర్ మెకానిక్ ఆత్మహత్య చేసుకోగా... తాజాగా ఉపాధిహామీ ఫీల్డు అసిస్టెంట్ కూడా ఆ బాటలోనే ప్రాణాలు తీసుకున్నాడు. ఇవి యాదృచ్ఛికమే అయినా... ఇందుకు ప్రోత్సహించిన పరిణామాలను ఉన్నతాధికారులు గుర్తించాల్సిన అవసరం ఉంది. సాక్షిప్రతినిధి, విజయనగరం: కొత్తవలస మండలం కంటకాపల్లి పంచాయతీ ఉపాధి హామీ పథకం క్షేత్రసహాయకుడైన పెదిరెడ్ల ఆనంద్‌ను రెండేళ్ల క్రితం సస్పెండ్ చేశారు. సోషల్ ఆడిట్లో అభ్యంతరాలు వ్యక్తం కావడంతో అప్పటి పీడీ ప్రశాంతి ఈ చర్యలు తీసుకున్నారు. అనంతర కాలంలో అతనిపై వచ్చిన ఆరోపణలు రుజువుకాకపోవడంతో తిరిగి విధుల్లోకి తీసుకోవాల్సిందిగా అక్కడి ఎంపీడీఓ పి.నారాయణరావుకు సూచించారు. కానీ ఆయన మాత్రం ఇంకా ఆనంద్ సస్పెన్షన్‌లోనే ఉన్నాడంటున్నారు. రెండేళ్ల నుంచి ఆనంద్ విధులు నిర్వర్తిస్తున్నాడని స్థానికులు చెబుతున్నారు. ఆయన చేసిన సంతకాలను కంప్యూటర్ ఆపరేటర్, ఏపీఓ, ఎంపీడీఓలు ధ్రువీకరించి లక్షల రూపాయల బిల్లులు కూడా చేసేశారు. గత జూలై 15వ తేదీ వరకూ ఉపాధి పనులకు సంబంధించి ఎన్ఎంఆర్ షీట్లలో ఆనంద్ చేసిన సంతకాలు ఉన్నాయి. రెండేళ్ల క్రితమే విధులకు దూరమైన ఉద్యోగి వాటిలో ఎలా సంతకాలు చేశారన్నది జవాబు లేని ప్రశ్న. జీతం లేకున్నా... కానీ ఆయనకు రెండేళ్లుగా జీతం రావడం లేదు. ఇంతలో ఏమైందో ఏమో మూడు నెలల క్రితం నుంచే ఆనంద్‌ను విధులకు రానివ్వడం లేదు. రెండేళ్లుగా జీతం లేక, మూడు నెలలుగా ఉద్యోగం లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆనంద్ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆనంద్ ఇచ్చిన రికార్డుల ఆధారంగా ఉపాధి హామీలో దాదాపు రూ.40 లక్షల బిల్లులు మంజూరయ్యాయి. రెండేళ్ల క్రితం సస్పెండ్ అయిన ఆనంద్ సంతకానికి ఇన్ని లక్షల రూపాయలు ఎలా విడుదలయ్యాయి. మూడు నెలల క్రితం నుంచే విధులకు హాజరుకాకపోవడం ఏమిటి ఇవన్నీ అనుమానాలు రేకెత్తిస్తున్న అంశాలే. నెల రోజుల క్రితం బోర్మెకానిక్... గ్రామీణ నీటి సరఫరా విభాగంలో(ఆర్‌డబ్ల్యూస్) కాంట్రాక్ట్ బోర్ మెకానిక్‌గా పనిచేస్తున్న మునగపాక శ్రీనివాసరావు కొత్తవలస–కె కోటపాడు రోడ్డులో ఉన్న పాత ఎంపీడీఓ కార్యాలయం సమీపంలోని ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో గత నెల 14వ తేదీన ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. నిజానికి ఆయన మరణానికి కూడా అధికారులే కారణమంటున్నారు. మూడు నెలల పాటు అతనికి జీతం ఇవ్వకుండా నిలిపివేయడంతో అతను మనస్తాపం ప్రాణాలు తీసుకున్నాడన్నది ఆరోపణ. అతను మరణించిన తర్వాత కూడా ప్రాణాంతక వ్యాధివల్ల ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులతో కలిసి స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు తప్పుడు ప్రచారం చేయగా తన్నులు కూడా తిన్నారు. ఈ కేసు ఇంకా నడుస్తోంది. ఈ లోగానే ఆనంద్ ఆత్మహత్య చేసుకోవడం, ఇద్దరూ ఒకే ఎంపీడీఓ పరిధిలో పనిచేసేవారే కావడం విశేషం. -
అభివృద్ధిని అడ్డుకుంటోందని ప్రచారం చేయండి
సాక్షి, అమరావతి: రాష్ట్ర అభివృద్ధిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటోందంటూ విస్తృతంగా ప్రచారం చేయాలని టీడీపీ నేతలను తెలుగుదేశం పార్టీ అధినేత, సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందుకు కరపత్రాలు పంపిణీ చేయాలని సూచించారు. ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం జరుగుతున్న తీరుపై బుధవారం చంద్రబాబు తన నివాసం నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఉపాధి హామీ పనులను కార్మికులతో కాకుండా యంత్రాలతో చేయిస్తున్నారంటూ వైఎస్సార్సీపీ ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, అవినాశ్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారని సీఎం వివరించారు.యంత్రాలతో చేయిస్తున్నా మన్న విషయాన్ని పక్కనపెట్టి.. వైఎస్సార్సీపీ వల్లే ఉపాధి హామీ పథకం నిధులు రాలేదని ప్రచారం చేయాలని సూచించారు. కొత్త నాయకులు వస్తారని హెచ్చరిక ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమం కొన్ని నియోజకవర్గాల్లో తూతూమంత్రంగా జరగడంపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు సరిగా లేకపోతే రాజకీయ భవిష్యత్ ఉండదని, వారి స్థానంలో కొత్త నాయకులు వస్తారని హెచ్చరించారు. జిల్లా పార్టీ ఇన్‌చార్జ్‌లు అన్ని నియోజకవర్గాల్లో కార్య క్రమం ఎలా జరుగుతుందో రోజూ తెలుసు కోవాలన్నారు. పార్టీ ఎమ్మెల్యేలు లేనిచోట నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు. ఇళ్ల నిర్మాణంతో పాటు రేషన్ షాపుల్లో చక్కెర, కిరోసిన్ అందడం లేదంటూ ప్రజలు మండిపడుతున్నారని పలువురు నేతలు చెప్పగా బాబు పరిశీలిద్దామంటూ జవాబిచ్చారు. -
హమ్మయ్యా.. ఇప్పటికి బయటపడ్డాం !
♦ వాయిదా పడ్డ కేంద్ర బృందం పర్యటన ♦ ఊపిరి పీల్చుకుంటున్న ‘ఉపాధి’ సిబ్బంది ♦ రికార్డుల్లో లొసుగులతో అంతర్గత మధనం ♦ అంతర్గత ఆడిట్లో సంతృప్తికర ఫలితాలు ♦ వచ్చాయంటున్న అధికారులు రికార్డుల పరిశీలనకు కేంద్ర బృందం రానున్నదనే సమాచారంతో ఉపాధి హామీ పథకం సిబ్బందిలో గుబులు మొదలైంది. హడావుడిగా గత కొన్ని రోజులుగా రాత్రనకా, పగలనక రికార్డులు సేకరించే పనిలో పడ్డారు. సంబంధిత జిరాక్సు కాపీలకే వేల రూపాయలు ఖర్చయ్యాయంటే ఏమేరకు సిద్ధపడ్డారో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు కేంద్రం బృందం పర్యటన తాత్కాలికంగా వాయిదా పడిందన్న సమాచారంతో కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు... సాక్షి, మచిలీపట్నం : ఉపాధి హామీ పథకం సిబ్బందికి కాస్త ఉపశమనం కలిగినట్లయింది. ఇప్పటి వరకు పథకంలో చేపట్టిన పనులకు సంబంధించిన రికార్డుల పరిశీలనకు ఈనెలలో రాష్ట్ర, కేంద్ర బృందాలు జిల్లాలో పర్యటించనున్నట్లు వార్తలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో ఉపాధి హామీ పథకం సిబ్బంది, అధికారులు హడావుడిగా రికార్డులు సిద్ధం చేసుకున్నారు. తమ తప్పులు ఎక్కడ బహిర్గమవుతాయోనని ఆందోళన చెందిన విషయం తెలిసిందే. అయితే ప్రస్తుతం జిల్లాకు రాష్ట్ర బృందం మాత్రమే తనిఖీలకు వచ్చినట్లు సమచారం. కేంద్ర బృందం తూర్పుగోదావరి జిల్లా పర్యటనకు వెళ్లినట్లు తెలిసింది. దీంతో జిల్లా ఉపాధి అధికారులు ఊపిరి పీల్చుకుంటున్నారు. కేంద్ర బృందం పకడ్బందీగా తనిఖీలు నిర్వహిస్తే.. ఆ తనిఖీ ల్లో రికార్డుల నిర్వహణ, నిధుల వెచ్చింపుల్లో తేడాలు వస్తే శాఖపరమైన చర్యలకు బలవ్వాల్సిన పరిస్థితి వస్తుందని మదన పడ్డారు. అంతర్గత ఆడిట్లో సంతృప్తికర ఫలితాలు ! ఉపాధి పథకం నిధులతో జిల్లావ్యాప్తంగా అనేక అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఏటా రూ.కోట్లు వెచ్చిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలు, పంచాయతీల్లో రహదారుల నిర్మాణం, మరుగుదొడ్లు, ఎన్టీఆర్ గృహాలు తదితర వాటికి రూ.కోట్ల నిధులు మంజూరవుతున్నాయి. గత ఐదేళ్లలో జిల్లా వ్యాప్తంగా రూ.400 కోట్లతో వివిధ ప్రాంతాల్లో ఉపాధి పనులు చేపట్టినట్లు సమాచారం. కాగా ఈ పనులకు సంబంధించిన రికార్డుల నిర్వహణ గతంలో గందరగోళంగా ఉండేది. కేంద్ర బృందం జిల్లాలో పర్యటించనుందన్న ఆదేశాలతో అధికారులు రికార్డుల క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టారు. ఒక్కో మండలంలో రూ.50 వేలు జిరాక్స్ కాపీలకే వెచ్చించారంటే ఏ మేరకు క్రమబద్ధీకరించారో అర్థం అవుతోంది. గత నెలలోనే బృందం జిల్లాకు రావాల్సి ఉండగా.. వాయిదా పడుతూ వచ్చింది. ఈనెలలో కూడా బృందం వచ్చే సూచనలు కనిపించకపోవడంతో ఉద్యోగుల్లో ఆనందం వెల్లువెత్తుతోంది. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తగా అధికారులు ఐదేళ్లుగా ఉపాధి పథకం నిధుల వ్యయంపై అంతర్గత ఆడిట్ నిర్వహించారు. ఆ ఆడిట్లో ఎలాంటి అవకతవకలు, నిధుల దుర్వినియోగం బహిర్గతం కాలేదని డ్వామా పీడీ రాజగోపాల్ తెలిపారు. తాను బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎలాంటి అవకతవకలకు ఆస్కారం ఇవ్వలేదన్నారు. రికార్డుల నిర్వహణ సైతం పక్కాగా చేపడుతున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలోనే అంతర్గత ఆడిట్లో సైతం ఎలాంటి తప్పులు బయటపడలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.