కూలీ డబ్బులో ‘పచ్చ’బ్రోకర్! | State government issued Circular No. -1926 | Sakshi
Sakshi News home page

కూలీ డబ్బులో ‘పచ్చ’బ్రోకర్!

Published Mon, Aug 29 2016 1:01 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM

కూలీ డబ్బులో ‘పచ్చ’బ్రోకర్! - Sakshi

కూలీ డబ్బులో ‘పచ్చ’బ్రోకర్!

ఉపాధి కూలీలను సరఫరా చేసినందుకు కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లింపు
 
- చట్టం ప్రాథమిక సూత్రానికే ప్రభుత్వం తూట్లు
- రాష్ట్ర ప్రభుత్వం సర్క్యులర్ నంబర్-1926 జారీ
- ఇప్పటికే ఉపాధి పనులకు నిధులు కటకట
- రోజుకు మూడు లక్షల మందికి మాత్రమే పని
 
 సాక్షి, అమరావతి: పార్టీ నేతలు, కార్యకర్తల జేబులు నింపేందుకు పేద కూలీల కడుపు కొట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. కూలీలకు కావాల్సినప్పుడల్లా పని కల్పించడం కోసమే పుట్టిన ‘మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం’లోనే కాంట్రాక్టర్ల ప్రమేయానికి తెరలేపింది. కూలీలకు నేరుగా పనులు కల్పించాలన్న పథకం ప్రాథమిక ఉద్దేశానికే గండికొడుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధి హామీ పథకం ద్వారా రాష్ట్రంలో చేపట్టే పనులకు నైపుణ్యం కలిగిన పని(స్కిల్డ్, సెమీ స్కిల్డ్ లేబర్) వారిని కాంట్రాక్టర్ల ద్వారా సరఫరా చేసుకోవడానికి అనుమతిస్తూ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ జూలై 11వ తేదీన సర్క్యులర్ నంబర్-1926ను జారీ చేసింది. దీని ప్రకారం ఈ తరహా కూలీలను సరఫరా చేసినందుకు నేరుగా సప్లయిర్ పేరుతో కాంట్రాక్టర్లకే ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తోంది. 2005లో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో చట్టం చేయడం ద్వారా అమల్లోకి తీసుకొచ్చిన ఉపాధి హామీ పథకం ప్రాథమిక సూత్రాలకు తాజా సర్క్యులర్ తూట్లు పొడుస్తోందనే ఫిర్యాదులు కేంద్రానికి అందాయి. పార్టీ నేతలు, కార్యకర్తలకు కాంట్రాక్టులు కట్టబెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం ఈ పధకాన్ని దుర్వినియోగం చేస్తోందని తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 నేతలకు కాంట్రాక్టులు కోసమే ప్రభుత్వం పాట్లు
 ఉపాధి పథకం ద్వారా పనులు పొందే కూలీలకు జిల్లాల వారీగా చెల్లించే మొత్తంలో గరిష్టంగా 40 శాతం సిమెంట్ రోడ్లు, భవన నిర్మాణాలకు ఖర్చు పెట్టుకోవచ్చని కేంద్ర ప్రభుత్వ నిబంధనలు చెబుతున్నాయి. అలాంటి పనులకు ఉపాధి పథకం నిధులు ఖర్చు పెట్టేటప్పుడు కూడా ఆయా పనులను కాంట్రాక్టర్లకు అప్పగించకుండా నేరుగా గ్రామ పంచాయతీల ద్వారా మాత్రమే వాటిని చేపట్టాలని నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. అయితే, చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక గ్రామ పంచాయతీలతో సంబంధం లేకుండా తమ పార్టీ నేతలకు కాంట్రాక్టు పనులు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల్లో రకరకాల మార్పులు చేశారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే ఉపాధి హామీ పథకం నిధులు, 14వ ఆర్థిక సంఘం నిధులు సగం సగం కలిపి ఆ మొత్తం నిధులతో చంద్రన్న బాట పేరుతో గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. పంచాయతీల ద్వారానే ఖర్చు పెట్టాల్సిన రెండు రకాల నిధులను సప్లయిర్ పేరుతో సొంత పార్టీ నేతల ద్వారా పనులు చేయించేలా కొత్త నిబంధనలు అమలు చేస్తున్నారు.
 
 కూలీల పనుల కన్నా కాంట్రాక్టు పనులకే ప్రాధాన్యం
 కేంద్రమిచ్చే ఉపాధి నిధులతో రాష్ట్ర ప్రభుత్వం సొంత నేతల ఆధ్వర్యంలో మెటీరియల్ పనులు చేయించడానికి ప్రాధాన్యత ఇవ్వడంతో  తీవ్ర వర్షాభావ పరిస్థితుల్లో కూలీలకు పని కల్పించడానికి అధికారులు నిధుల ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు. కేంద్రం ఈ ఏడాది ఉపాధి పథకంలో రాష్ట్రానికి ఇప్పటివరకు రూ. 3,488.35 కోట్లు విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రమిచ్చే నిధులకు పది శాతం కలిపి గ్రామీణాభివృద్ది శాఖకు నిధులు విడుదల చేయాల్సి ఉండగా, ఇప్పటివరకు రూ.3,180 కోట్లను విడుదల చేసింది. అయితే, గత ఆర్థిక సంవత్సరం ముగింపులో నిధులు లేకపోయినా ప్రభుత్వం సొంత పార్టీ నేతలతో సిమెంట్ రోడ్డు పనులు చేయించడంతో దాదాపు రూ.1000 కోట్లకు పైగా ఈ ఏడాది నిధులను చెల్లించాల్సి వచ్చింది. ఈ ఏడాది కూడా మరో రూ. 730 కోట్లు మెటీరియల్ పనులకు ఖర్చు పెట్టారు. ఇప్పటివరకు కూలీల వేతనాలకు కేవలం రూ. 1,942 కోట్లు  చెల్లించినా నిధులకు ఇబ్బందులు ఉన్నాయని, కూలీలకు  పనుల కల్పనకు వెనుకాడాల్సిన పరిస్థితి నెలకొని ఉందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఇప్పుడు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో రోజూ మూడు లక్షల మందికి మించి ఉపాధి పనులు పొందలేకపోవడం గమనార్హం.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement