![Indian government has granted geographical indication to Dharmavaram silk sarees](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/12/sarees.jpg.webp?itok=8UMSqCj8)
చేతి మగ్గాల పైనే అద్భుతమైన చీరలు
శ్రీసత్యసాయి జిల్లాకు కీర్తి కిరీటం చేనేత
28 వేల మగ్గాలతో రాష్ట్రంలోనే ప్రథమ స్థానం
వారంలో రూ.100 కోట్ల వరకు పట్టుచీరల వ్యాపారం
ఇతర రాష్ట్రాలతో పాటు విదేశాలకు పట్టుచీరల ఎగుమతులు
ధర్మవరం పట్టుచీరకు భౌగోళిక గుర్తింపునిచ్చిన భారత ప్రభుత్వం
సాక్షి, పుట్టపర్తి : మగువలు మెచ్చే పట్టు చీరలు.. వివాహం కోసం ప్రత్యేకంగా చీరలు, ఫంక్షన్లలో స్పెషల్ లుక్కుతో ఆకట్టుకునే డిజైన్లు తయారీలో ధర్మవరం నేతన్నలు ఆరితేరిపోయారు. తరతరాలుగా మగ్గాల పైనే తమ నైపుణ్యాన్ని రంగరించి రకరకాల పట్టుచీరలు తయారు చేస్తున్నారు. సింగిల్ త్రెడ్, డబుల్ త్రెడ్, వెండి జరీ, బంగారు జరీ చీరలు, జాకాడీ డిజైన్లతో అత్యద్భుతంగా నేసి వినియోగదారులను ఆకట్టుకుంటున్నారు. ధర్మవరంలో తయారయ్యే పట్టుచీరలు హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు, చెన్నైతో పాటు విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి.
రాష్ట్రంలో 28 వేల మగ్గాలు ఉన్న ఏకైక ప్రాంతంగా ధర్మవరం పట్టణం ప్రథమ స్థానంలో నిలుస్తోంది. ఇక్కడి పట్టు మార్కెట్‌లో సగటున వారానికి రూ.100 కోట్ల వరకు పట్టుచీరల వ్యాపార లావాదేవీలు జరుగుతున్నాయి. ధర్మవరం పట్టణ విశిష్టతను గుర్తించి భారత ప్రభుత్వం ధర్మవరం పట్టుచీరకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్)ను ఇవ్వడం నేతన్నల ప్రతిభకు గర్వ కారణంగా చెప్పవచ్చు.
శ్రీసత్యసాయి జిల్లాలో ధర్మవరంతో పాటు కొత్తచెరువు, గోరంట్ల, బుక్కపట్నం, సోమందేపల్లి, పెనుకొండ, హిందూపురం ప్రాంతాల్లోనూ మగ్గాలు ఉన్నాయి. ధర్మవరంలో మగ్గాలతో పాటు 18 చేనేత అనుబంధ రంగాల ద్వారా సుమారు లక్ష మంది ఉపాధి పొందుతున్నారు.
ఫ్యాషన్ ప్రపంచానికి దీటుగా డిజైన్లు
మారుతున్న ఫ్యాషన్ ప్రపంచానికి దీటుగా ధర్మవరంలోని డిజైనర్‌లు ఎప్పటికప్పుడు కొత్తరకాల డిజైన్లు రూపొందిస్తున్నారు. ధర్మవరంలో పట్టుచీరల డిజైన్లు రూపొందించడంలో సుమారు వందమంది మంచి నైపుణ్యం సంపాదించారు. వివాహాలు, ఇతర శుభకార్యాల దగ్గర నుంచి సినీ మోడళ్లు, సెలబ్రిటీల వరకు వినూత్న డిజైన్‌లను తయారు చేస్తున్నారు. ఒక్కో పట్టు చీర రూ.5 వేల నుంచి రూ.10 లక్షల వరకు ధర ఉంటుంది. బంగారం తాపడంతో పట్టుచీరలు తయారు చేయడం ధర్మవరం నేతన్నల ప్రత్యేకం.
విదేశాలకు ఎగుమతులు
ధర్మవరంలో తయారైన పట్టుచీరలు ఇతర రాష్ట్రాలతో పాటు అమెరికా, సౌదీ అరేబియా, న్యూజిలాండ్ తదితర దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. రాష్ట్రంలో తయారైన పట్టుచీరలకు ధర్మవరం పట్టుమార్కెట్ ప్రధానం. ధర్మవరం పట్టణంలో సుమారు రెండు వేల పట్టుచీరల దుకాణాలు ఉన్నాయి. ఈ సిల్క్ షాపుల ద్వారా నేతన్నల వద్ద పట్టుచీరలను కొనుగోలు చేసి, ఆపై షోరూంలకు హోల్‌సేల్‌గా ఎగుమతి చేస్తారు.
వారానికి రూ.వంద కోట్ల వ్యాపారం
సగటున ధర్మవరం నేసేపేటలోని మార్కెట్‌లో వారానికి రూ.100కోట్ల వరకు వ్యాపార లావాదేవీలు జరుగుతాయని అంచనా. ఇంతటి ప్రాధాన్యం ఉన్న ధర్మవరం పట్టణాన్ని, చేనేత రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని నేతన్నలు కోరుతున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ఆదరణ కరువైందని.. గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో ఏటా నేతన్న నేస్తం పథకం కింద ఏటా రూ.24వేల లబ్ధి చేకూరేదని వివరించారు.
ధర్మవరం పట్టుచీరకు భౌగోళిక గుర్తింపు
ధర్మవరం నేతన్న ప్రతిభను గుర్తించిన భారత ప్రభుత్వం గత 2014లో ధర్మవరం పట్టుచీరలు, పావుడాలకు భౌగోళిక గుర్తింపు (జియోగ్రాఫికల్ ఇండికేషన్) ఇచి్చంది. దీని ద్వారా ధర్మవరం పట్టుచీర డిజైన్‌లు ఎక్కడా తయారు చేయకూడదు. ఒక వేళ ఇతరప్రాంతాల్లో ధర్మవరం నేతన్నల డిజైన్‌లు నేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది.
విమానాశ్రయం వస్తే బాగుంటుంది
శ్రీసత్యసాయి జిల్లా ఏర్పాటు తర్వాత ధర్మవరంలో చేనేత రంగం మరింత వృద్ధి చెందింది. అయితే పుట్టపర్తిలో విమానాశ్రయం ఆధునీకరించి.. ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకొస్తే.. వివిధ దేశాలకు పట్టుచీరల ఎగుమతులు సులభమవుతాయి. మన దేశ పట్టును ప్రపంచ స్థాయికి తీసుకెళ్లవచ్చు. ఫలితంగా వ్యాపారం మరింత ఊపందుకుంటుంది. – రంగన శ్రీనివాసులు, పట్టుచీరల వ్యాపారి, ధర్మవరం
ఆధునిక ఫ్యాషన్‌కు అనుగుణంగా డిజైన్‌లు
ప్రస్తుత ఫ్యాషన్ పోటీ ప్రపంచంలో మారుతున్న కాలానికి అనుగుణంగా కొత్త డిజైన్‌లు ఎప్పటికప్పుడు రూపొందిస్తున్నాం. మేము తయారు చేసే చీరలు దేశంలోని ఇతర రాష్ట్రాలకే కాక, ఎక్కువగా అమెరికా, సౌదీ దేశాలకు పంపుతుంటాం. పట్టుచీరల్లో నేను తయారు చేసిన డిజైన్‌లకు రాష్ట్ర స్థాయిలో రెండు, జాతీయ స్థాయిలో ఒక అవార్డు అందుకోవడం సంతోషంగా ఉంది. – నాగరాజు, క్లస్టర్ డిజైనర్, ధర్మవరం
గణాంకాలు ఇలా...
చేతి మగ్గాలు : 28 వేలు
పట్టుచీరల దుకాణాలు : 2వేలు
మగ్గాలపై ఆధారపడ్డ కుటుంబాలు : 30 వేలు
మగ్గాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు : లక్ష మంది
అనుబంధ రంగాల ద్వారా : మరో 20 వేల మందికి ఉపాధి
రోజుకు పట్టుమార్కెట్ సగటు టర్నోవర్ : రూ.7 కోట్లు
శుభకార్యాల సీజన్‌లో వారంలో పట్టుచీరల లావాదేవీలు : రూ.100 కోట్లు
Comments
Please login to add a commentAdd a comment