చీర, పంచె కట్టులో పలువురి దర్శనం
శ్రీసత్యసాయి సేవలను కొనియాడిన విదేశీయులు
నేడు శ్రీసత్యసాయి బాబా 99వ జయంతి
సాక్షి, పుట్టపర్తి (శ్రీసత్యసాయి జిల్లా): దేశ, విదేశాల నుంచి వచ్చిన మహిళలు భారతీయ సంస్కృతిపై ఇష్టం పెంచుకున్నారు. చీర, పంచెకట్టులో దర్శనిమిచ్చారు. వివిధ దేశాల నుంచి వచ్చి అక్కడి విధానాలను పరిచయం చేయడమే కాకుండా.. స్థానిక అలవాట్లను వంటబట్టించుకున్నారు. సత్యసాయిబాబా నడయాడిన పుట్టపర్తికి పలు దేశాల నుంచి భక్తులు నిత్యం వస్తుంటారు. తెలుగోడి ఖ్యాతిని ప్రపంచ స్థాయికి సత్యసాయి తీసుకెళ్లారని చెబుతున్నారు.
అంతేకాకుండా శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు సేవలు మరువలేనివని కొనియాడుతున్నారు. ఓసారి పుట్టపర్తికి వస్తే.. మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోందని చెబుతున్నారు. ఎన్ని సమస్యలతో వచ్చినా.. మందిరంలో అడుగు పెట్టాక ప్రశాంతత వస్తుందని పేర్కొంటున్నారు. శనివారం శ్రీసత్యసాయి 99వ జయంతి సందర్భంగా విదేశీయులతో ‘సాక్షి’ మాటామంతీ..
ప్రశాంతతకు మారుపేరు
పుట్టపర్తికి చాలా ఏళ్ల నుంచి వస్తున్నా. వచ్చిన ప్రతిసారీ నెల రోజులు ఉంటా. ఫుడ్ బాగా నచ్చింది. తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నా. చీరకట్టు చాలా నచ్చింది. సత్యసాయి కోట్ల మంది గుండెల్లో కొలువై ఉన్నారు. – మెరియిల్లె, ఫ్రాన్స్
మళ్లీ మళ్లీ రావాలనిపిస్తోంది
పుట్టపర్తి గురించి చాలా ఏళ్లుగా వింటున్నా. తొలిసారి 15 రోజుల క్రితం వచ్చా. ఇక్కడే ఉండాలనిపిస్తోంది. ఒక వ్యక్తి ఇంతమందికి ఓ శక్తిలా మారి.. ఒక ఊరిని తయారు చేశారంటే మామూలు విషయం కాదు. – ఒట్టావి, ఫ్రాన్స్
సంప్రదాయాలు బాగున్నాయి
తెలుగు సంప్రదాయం నచ్చిoది. చీరకట్టుకోవడం, తెలుగు వంటకాలు నేర్చుకున్నా. సెంట్రల్ ట్రస్టు సేవలు చాలా బాగున్నాయి. విద్య, వైద్యంపై భగవాన్ శ్రీసత్యసాయి సేవలను చరిత్ర మరువదు. – డానేలా, ఇటలీ
సాయిబాబా వ్యక్తి కాదు.. శక్తి
1980 నుంచి పుట్టపర్తికి వస్తున్నా. సాయిబాబా ఓ వ్యక్తి కాదు.. ఆయన ఓ శక్తి. ఇక్కడ చాలామంది పరిచయమయ్యారు. సొంత బంధువుల్లా ఆదరిస్తారు. తెలుగు కూడా మాట్లాడటం నేర్చుకున్నా. – లిండా, లండన్
సాయిబాబానే బతికించారు
ఇక్కడకు చాలాసార్లు వచ్చాను. నేను మూడుసార్లు రోడ్డు ప్రమాదాలకు గురయ్యా. బాబానే బతికించాడని నమ్ముతున్నా. ఏటా బాబా జయంతి వేడుకలు మిస్ కాకుండా వస్తా. దోశ అంటే చాలా ఇష్టం. – ఫెర్నాండో, ఇటలీ
అతిథులకు లోటు రానివ్వం
భగవాన్ శ్రీసత్యసాయి బాబా భక్తులకు ఎలాంటి లోటు రానివ్వం. ఏ దేశం నుంచి అతిథులు వచ్చినా సాదరంగా స్వాగతిస్తాం. వారికి కావాల్సిన వసతి ఏర్పాటు చేస్తున్నాం. బాబా ఆశయాల సాధన మేరకు శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు సేవలు ఉన్నాయి. చిన్న గ్రామాన్ని ప్రపంచానికే పరిచయం చేసిన మహోన్నత వ్యక్తి భగవాన్ శ్రీసత్యసాయిబాబా. – ఆర్‌జే రత్నాకర్‌రాజు, శ్రీసత్యసాయి సెంట్రల్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ
Comments
Please login to add a commentAdd a comment