కొండ, గుట్టల్లో తేనె సేకరిస్తున్న గ్రామస్తులు
25 కుటుంబాలకు ఉపాధి
ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇది కూడా అలాంటి ఊరే. ఈ ఊరు పేరు చెబితే చాలు నోరూరుతుంది. తియ్యని పిలుపు రారమ్మంటుంది. అదే తాడిమర్రి మండలంలోని చిల్లకొండయ్యపల్లి (Chillakondaiahpalli). వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయంతో నష్టపోయిన రైతులు (Farmers) ఉపాధి కోసం అడవి బాట పట్టారు. కొండ, గుట్టలెక్కుతూ తేనె (Honey) సేకరించి కుటుంబాలను పోషించుకుంటున్నారు.
ఉదయమే సద్దిమూట కట్టుకుని అందరూ పొలం బాట పడితే సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం (Tadimarri Mandal) చిల్లకొండయ్యపల్లి యువకులు మాత్రం అడవిబాట పడతారు. కొండ, గుట్ట, చెట్టు, చేమ చుట్టేస్తూ సేకరించిన స్వచ్ఛమైన తేనెను విక్రయించి కుటుంబాలను పోషించుకుంటున్నారు. గ్రామంలోని 25 కుటుంబాలు తేనె సేకరణను ఉపాధిగా మలచుకున్నాయి.
15 ఏళ్లుగా... తేనె సేకరణే వృత్తిగా
దాదాపు 15 సంవత్సరాలుగా తేనె సేకరణనే వృత్తిగా పెట్టుకుని చిల్లకొండయ్యపల్లి యువత జీవనం సాగిస్తోంది. అప్పట్లో వ్యవసాయ పనులు లేక పోవడంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు కాటమయ్య అనే వ్యక్తి తొలిసారిగా తేనె సేకరణను ఉపాధిగా మార్చుకున్నాడు. అనంతరం అదే బాటలో కొందరు యువకులు పయనించారు. అయితే వీరు సేకరించిన తేనెకు సరైన మార్కెటింగ్ లేక ఇబ్బంది పడుతుండడంతో అప్పట్లో మహాత్మాగాంధీ యువజన సంఘం మండల అధ్యక్షుడిగా ఉన్న రామలింగప్ప స్పందించి, గిట్టుబాటు ధరతో తేనె కొనుగోలు చేసేలా చెన్నకొత్తపల్లిలోని ధరణి స్వచ్చంద సంస్థతో ఒప్పందం కుదిర్చాడు. ప్రస్తుతం సంస్థ కిలో తేనెను రూ.400 చొప్పున కొనుగోలు చేస్తుండగా... స్థానికంగానే ఇతరులకు రూ.500తో విక్రయిస్తూ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కు తున్నారు. ఉమ్మడి జిల్లాలో చిల్లకొండయ్యపల్లి తేనెకు మంచి గిరాకీ ఉంది.
అన్నం పెడుతున్న అడవి..
మండలంలోని దాడితోట బీట్ పరిధిలో కునుకుంట్ల, చిల్లవారిపల్లి, దాడితోట గ్రామాలతో పాటు పుట్లూరు మండలం ఎల్లుట్ల పరిధిలో సుమారు 3,534 హెక్టార్లలో రిజర్వు ఫారెస్టు విస్తరించి ఉంది. రిజర్వు ఫారెస్టులో అటవీ అధికారులు నారేపి, ఎర్రచందనం, తవసీ తదితర మొక్కలు భారీగా నాటారు. ఇప్పుడా మొక్కలు పెద్ద వృక్షాలై తేనెపట్టులకు ఆవాసాలుగా మారాయి. ఫలితంగా రిజర్వు ఫారెస్టు ఎందరికో ఉపాధి వనరుగా మారి అన్నం పెడుతోంది.
ముంగార్ల కాలం అనువైనది..
తేనె సేకరణకు ముంగార్ల కాలం అనువైనది. జూన్ ప్రారంభంతో వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో అడవులు, తోటలు పచ్చదనం సంతరించుని పుష్పాలు వికసిస్తాయి. ఆ పుష్పాల్లోని మకరందం కోసం వచ్చే తేనెటీగలు సమీపంలోనే తేనెపట్టులను ఏర్పాటు చేసుకుంటాయి. ఏడాదిలో 9 నెలల పాటు తేనె సేకరణలో ఇక్కడి యువకులు నిమగ్నమవుతారు. నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం వస్తోందని చెబుతున్నారు.
చదవండి: పెళ్లి మంటపాల్లో ‘డబ్బు’ వాద్యాలు
తేనె సేకరణలో కష్టాలు ఎన్నో..
తేనె ఎంత రుచిగా ఉంటుందో దానిని సేకరించడమంటే అంతకు రెట్టింపు కష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. అయినా చిల్లకొండయ్యపల్లి యువకులు కష్టాలను లెక్కచేయడం లేదు. కళ్లముందు తేనె పట్టు కనిపిస్తే చాలు వెంటనే సేకరణలో నిమగ్నమవుతారు. ఈ క్రమంలో ముళ్లకంపలు గుచ్చుకున్నా, తేనెటీగలు కుట్టినా తమ పట్టు మాత్రం వదలరు. ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా... తేనెటీగలు కుట్టి తీవ్ర అస్వస్థతకు లోనైన సందర్భాలు ఎన్నో ఉన్నాయని యువత తెలుపుతోంది.
Comments
Please login to add a commentAdd a comment