putluru
-
స్వచ్ఛమైన తేనెకు చిరునామా చిల్లకొండయ్యపల్లి
ఒక్కో ఊరికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. ఇది కూడా అలాంటి ఊరే. ఈ ఊరు పేరు చెబితే చాలు నోరూరుతుంది. తియ్యని పిలుపు రారమ్మంటుంది. అదే తాడిమర్రి మండలంలోని చిల్లకొండయ్యపల్లి (Chillakondaiahpalli). వర్షాభావ పరిస్థితుల్లో వ్యవసాయంతో నష్టపోయిన రైతులు (Farmers) ఉపాధి కోసం అడవి బాట పట్టారు. కొండ, గుట్టలెక్కుతూ తేనె (Honey) సేకరించి కుటుంబాలను పోషించుకుంటున్నారు.ఉదయమే సద్దిమూట కట్టుకుని అందరూ పొలం బాట పడితే సత్యసాయి జిల్లా తాడిమర్రి మండలం (Tadimarri Mandal) చిల్లకొండయ్యపల్లి యువకులు మాత్రం అడవిబాట పడతారు. కొండ, గుట్ట, చెట్టు, చేమ చుట్టేస్తూ సేకరించిన స్వచ్ఛమైన తేనెను విక్రయించి కుటుంబాలను పోషించుకుంటున్నారు. గ్రామంలోని 25 కుటుంబాలు తేనె సేకరణను ఉపాధిగా మలచుకున్నాయి. 15 ఏళ్లుగా... తేనె సేకరణే వృత్తిగాదాదాపు 15 సంవత్సరాలుగా తేనె సేకరణనే వృత్తిగా పెట్టుకుని చిల్లకొండయ్యపల్లి యువత జీవనం సాగిస్తోంది. అప్పట్లో వ్యవసాయ పనులు లేక పోవడంతో కుటుంబాన్ని పోషించుకునేందుకు కాటమయ్య అనే వ్యక్తి తొలిసారిగా తేనె సేకరణను ఉపాధిగా మార్చుకున్నాడు. అనంతరం అదే బాటలో కొందరు యువకులు పయనించారు. అయితే వీరు సేకరించిన తేనెకు సరైన మార్కెటింగ్ లేక ఇబ్బంది పడుతుండడంతో అప్పట్లో మహాత్మాగాంధీ యువజన సంఘం మండల అధ్యక్షుడిగా ఉన్న రామలింగప్ప స్పందించి, గిట్టుబాటు ధరతో తేనె కొనుగోలు చేసేలా చెన్నకొత్తపల్లిలోని ధరణి స్వచ్చంద సంస్థతో ఒప్పందం కుదిర్చాడు. ప్రస్తుతం సంస్థ కిలో తేనెను రూ.400 చొప్పున కొనుగోలు చేస్తుండగా... స్థానికంగానే ఇతరులకు రూ.500తో విక్రయిస్తూ ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కు తున్నారు. ఉమ్మడి జిల్లాలో చిల్లకొండయ్యపల్లి తేనెకు మంచి గిరాకీ ఉంది.అన్నం పెడుతున్న అడవి.. మండలంలోని దాడితోట బీట్ పరిధిలో కునుకుంట్ల, చిల్లవారిపల్లి, దాడితోట గ్రామాలతో పాటు పుట్లూరు మండలం ఎల్లుట్ల పరిధిలో సుమారు 3,534 హెక్టార్లలో రిజర్వు ఫారెస్టు విస్తరించి ఉంది. రిజర్వు ఫారెస్టులో అటవీ అధికారులు నారేపి, ఎర్రచందనం, తవసీ తదితర మొక్కలు భారీగా నాటారు. ఇప్పుడా మొక్కలు పెద్ద వృక్షాలై తేనెపట్టులకు ఆవాసాలుగా మారాయి. ఫలితంగా రిజర్వు ఫారెస్టు ఎందరికో ఉపాధి వనరుగా మారి అన్నం పెడుతోంది. ముంగార్ల కాలం అనువైనది.. తేనె సేకరణకు ముంగార్ల కాలం అనువైనది. జూన్ ప్రారంభంతో వర్షాలు కురుస్తాయి. ఈ సమయంలో అడవులు, తోటలు పచ్చదనం సంతరించుని పుష్పాలు వికసిస్తాయి. ఆ పుష్పాల్లోని మకరందం కోసం వచ్చే తేనెటీగలు సమీపంలోనే తేనెపట్టులను ఏర్పాటు చేసుకుంటాయి. ఏడాదిలో 9 నెలల పాటు తేనె సేకరణలో ఇక్కడి యువకులు నిమగ్నమవుతారు. నెలకు రూ.25 వేల నుంచి రూ.30 వేల వరకు ఆదాయం వస్తోందని చెబుతున్నారు.చదవండి: పెళ్లి మంటపాల్లో ‘డబ్బు’ వాద్యాలుతేనె సేకరణలో కష్టాలు ఎన్నో.. తేనె ఎంత రుచిగా ఉంటుందో దానిని సేకరించడమంటే అంతకు రెట్టింపు కష్టాన్ని చవిచూడాల్సి ఉంటుంది. అయినా చిల్లకొండయ్యపల్లి యువకులు కష్టాలను లెక్కచేయడం లేదు. కళ్లముందు తేనె పట్టు కనిపిస్తే చాలు వెంటనే సేకరణలో నిమగ్నమవుతారు. ఈ క్రమంలో ముళ్లకంపలు గుచ్చుకున్నా, తేనెటీగలు కుట్టినా తమ పట్టు మాత్రం వదలరు. ఎన్ని రక్షణ చర్యలు తీసుకున్నా... తేనెటీగలు కుట్టి తీవ్ర అస్వస్థతకు లోనైన సందర్భాలు ఎన్నో ఉన్నాయని యువత తెలుపుతోంది. -
చోరీ కేసు ఛేదనకు వెయ్యిమంది సహకారం
పుట్లూరు: ప్రభుత్వ పింఛనుదారులకు అందించే డబ్బు రూ.16లక్షల దోపిడీ కేసును చుట్టుపక్కల గ్రామాలకు చెందిన వెయ్యి మంది ప్రజల సహకారంతో పోలీసులు 90 నిమిషాల్లోనే ఛేదించారు. యల్లనూరు మండలం చింతకాయమంద గ్రామ కార్యదర్శి నాగలక్ష్మి చింత కాయమంద గ్రామంలో నవంబర్ నెల వైఎస్సార్ పింఛను కానుక డబ్బును పంపిణీ చేయాల్సి ఉంది. ఆమె పింఛను డబ్బు రూ.16లక్షలు తీసుకుని శుక్రవారం ఉదయం నార్పల మండల కేంద్రం నుంచి ఆర్టీసీ బస్సులో ఎ.కొండాపురానికి చేరుకుంది. ఈ విషయాన్ని గమనించిన వాసాపురం గ్రామానికి చెందిన కుళ్లాయప్ప, సుధాకర్, ఆటో డ్రైవర్లు శ్రీనివాసులు, ఆంజనేయులు ఆ డబ్బును చోరీ చేయడానికి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. నాగలక్ష్మి ఎ.కొండాపురం చేరుకోగానే ఆటోడ్రైవర్ శ్రీనివాసులు ఇతర ప్రయాణికులతో పాటు ఆమెను కూడా ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆదే ఆటోలో కుళ్లాయప్ప కూడా ఉన్నాడు. ఆటోను సుధాకర్ ద్విచక్రవాహనంపై అనుసరించాడు. తిమ్మంపల్లిలో ప్రయాణికులు దిగి వెళ్లగా ఆరవీడు గ్రామ సమీపంలో కుళ్లాయప్ప పిడిబాకుతో పంచాయతీ కార్యదర్శిని బెదిరించి ఆమె వద్ద ఉన్న రూ. 16లక్షల నగదు ఉన్న బ్యాగును తీసుకుని సమీపంలోని అరటి తోటల్లోకి పరారయ్యాడు. దీంతో నాగలక్ష్మి ఫోన్లో పోలీసులకు విషయం తెలపడంతో అప్రమత్తమై.. యుద్ధప్రాతిపదికన గాలింపు చర్యలు చేపట్టారు. పోలీసులు పలు గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంతో దాదాపు 1000 మందికి పైగా ప్రజలు దుండగుల కోసం గాలించారు. చిలమకూరు గ్రామ సమీపంలో నగదును దోచుకెళ్లిన కుళ్లాయప్పను పట్టుకున్నారు. ఈ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి ఆంజనేయులతో పాటు ఆటో డ్రైవర్ శ్రీనివాసులు, సుధాకర్, కుళ్లాయప్పను అరెస్టు చేసి 16లక్షల నగదు, ఆటో, ద్విచక్రవాహనం, పిడిబాకును సీజ్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. -
దారి మరిచాడు..ఆరు కిలోమీటర్లు నడిచాడు
సాక్షి, పుట్లూరు(అనంతపురం) : తప్పిపోయిన బాలుడు ఎట్టకేలకు కనిపించడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. కొండుగారికుంటకు చెందిన హేమంత్ అనే ఐదేళ్ల బాలుడు మంగళవారం ఇంటి నుంచి గ్రామ సమీపంలోని తోట వద్దకు వెళ్లి కనిపించకుండాపోయాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు, గ్రామస్తులు మంగళవారం రాత్రి నుంచి అన్ని చోట్ల కలియదిరిగారు. బుధవారం ఉదయం చాలవేముల సమీపంలోని గాలిమరల సబ్‌స్టేషన్ వద్ద హేమంత్‌ను గుర్తించిన సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. రాత్రి సమయంలో దారి గుర్తించలేక ఆరు కిలోమీటర్ల దూరం నడుస్తూ వెళ్లినట్లు తెలుస్తోంది. హేమంత్ సురక్షితంగా తిరిగిరావడంతో తల్లిదండ్రులు చిరంజీవి, శ్రావణిలు, గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. -
పుట్లూరు పోలీస్‌స్టేషన్‌కు జాతీయ గుర్తింపు
సాక్షి, పుట్లూరు(అనంతపురం) : ప్రజలకు మెరుగైన సేవలందించిన పుట్లూరు పోలీస్ స్టేషన్‌కు జాతీయ స్థాయి గుర్తింపు దక్కింది. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రకటించిన ఉత్తమ పోలీసు స్టేషన్ల జాబితాలో పుట్లూరు స్టేషన్ 23వ స్థానం దక్కించుకుంది. పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధిత సమస్యలు ఓపిగ్గా వినడం, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం, నేరాల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవడం, స్టేషన్లో మెరుగైన సదుపాయాలు కల్పించడం తదితర అంశాలపై కేంద్ర ప్రభుత్వం గతేడాది నవంబర్‌లో దేశ వ్యాప్తంగా సర్వే నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే జిల్లాకు వచ్చిన కేంద్ర బృందం సభ్యులు పుట్లూరు పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఎస్ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో పుట్లూరు పోలీస్‌స్టేషన్‌లో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన విధానం పరిశీలించారు. సమస్యలపై పోలీస్ స్టేషన్‌కు వచ్చే బాధితుల కోసం రిసెప్షన్ కౌంటర్ ఏర్పాటు, స్టేషన్ ఆవరణలో ఆహ్లాదకర వాతావరణంతో పాటు పెండింగ్ కేసులు లేకుండా చర్యలు తీసుకున్న విధానాన్ని స్వయంగా పరిశీలించారు. అలాగే పోలీసులు తీరుపై మండలంలోని ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరించగా మెజార్టీ శాతం మంది సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో కేంద్రం బృందం పుట్లూరు పోలీస్ స్టేషన్‌ను ఆదర్శ పోలీస్ స్టేషన్‌గా ఎంపిక చేసింది. ఈమేరకు దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్లలో పుట్లూరు పోలీస్ స్టేషన్‌కు 23వ స్థానం కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. దీనిపై అదనపు ఎస్పీ చౌడేశ్వరి మాట్లాడుతూ, పుట్లూరు పోలీసు స్టేషన్‌ను దేశంలోనే ఉత్తమ పోలీస్ స్టేషన్‌గా ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించడం కోసం అనేక సంస్కరణలు అమలు చేసినట్లు తెలిపారు. దీన్ని ఆదర్శంగా తీసుకుని జిల్లాలో అన్ని పోలీస్ స్టేషన్లను ఆదర్శ పోలీస్స్టేషన్లుగా తీర్చిదిద్దుతామన్నారు. -
కరెంటు తీగలు తగిలి ఇద్దరి మృతి
అనంతపురం జిల్లా : విద్యుత్ తీగలు తగిలి మంగళవారం ఇద్దరు వ్యక్తులు మరణించారు. పుట్లూరు మండలం అరకటివేములలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇంటి వద్ద గాలివాన తో పేరుకుపోయిన చెత్తను తొలగిస్తుండగా అప్పటికే తెగిపడ్డ విద్యుత్ తీగలు తగిలి ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు అప్రమత్తమై రక్షించేలోపే ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరి శరీరాలు కరెంటు ప్రసరణ ధాటికి పూర్తిగా కాలిపోయాయి. ఈ ఘటనతో మృతుల కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పిడుగు పాటుకు నల్లమాడ మండలంలో ఇద్దరు, చిలమత్తూరు మండలంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు. అకాలవర్షాలకు తాడిపత్రి, పుట్టపర్తి, శింగనమల నియోజకవర్గాల్లో పండ్లతోటలు దెబ్బతిన్నాయి. అక్కడక్కడా విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. -
పిచ్చికుక్క దాడిలో ఏడుగురికి గాయాలు
పుట్లూరు: మండలకేంద్రం పుట్లూరులో బుధవారం సాయంత్రం ఆరుబయట ఆడుకుంటున్న ప్రవల్లిక, స్వాతి, అనిల్, శ్రీకాంత్, నరేష్ అనే చిన్నారులతో పాటు పెద్దయ్య, రాజశేఖర్ అనే వ్యక్తులపై పిచ్చికుక్క దాడి చేసి గాయపరిచింది. ఈ ఏడుగురికీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స చేశారు. -
పుట్లూరు ఎంఈఓ సస్పెన్షన్ !
అనంతపురం ఎడ్యుకేషన్ : ‘చదువు–ఎదుగు’ కార్యక్రమం పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన పుట్లూరు మండల విద్యాశాఖాధికారి (ఎంఈఓ) శ్రీదేవిపై సస్పెన్షన్ వేటు పడింది. బుధవారం కలెక్టర్ వీరపాండియన్ నార్పల, పుట్లూరు మండలాల్లో పర్యటించారు. ఆ సమయంలో పుట్లూరు ఎంఈఓ అక్కడ అందుబాటులో లేరు. స్థానికంగానే వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొనాల్సి ఉన్నా... ఆమె అనంతపురంలో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌కు హాజరయ్యారు. దీనిపై కలెక్టర్ ఆరా తీశారు. అలాగే ‘చదువు–ఎదుగు’ వివరాలను ఆయా స్కూళ్లలో హెచ్ఎంల ద్వారా ఎంఈఓ సేకరించి పంపాల్సి ఉండగా, శ్రీదేవి నిర్లక్ష్యం చేసింది. దీనిపై కలెక్టర్ తీవ్రంగా స్పందించి సస్పెన్షన్‌కు ఆదేశించారు. -
వృద్ధుడి ఆత్మహత్య
పుట్లూరు (శింగనమల) : పుట్లూరులో చదువుల లక్ష్మీరెడ్డి(70) విషపు గుళికలు మింగి గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ సురేశ్‌బాబు తెలిపారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన వైద్యం చేయించుకునేందుకు డబ్బుల్లేక జీవితంపై విరక్తితో తనువు చాలించాడన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. -
సిమ్‌కార్డు ఇస్తే.. ప్రాణం తీశారు!
సిమ్‌కార్డు.. ఓ నిండు ప్రాణాన్ని బలికోరింది. మిత్రుడే కదా అని సిమ్‌కార్డు ఇచ్చిన పాపానికి.. చివరకు అతని ప్రాణం తీశారు. ఓ హత్య కేసు నుంచి తప్పించుకునే క్రమంలో నిందితులు మరో హత్య చేశారు. ఇలా తప్పు మీద తప్పు చేసినా.. చట్టం నుంచి తప్పించుకోలేకపోయారు. చివరకు పోలీసుల వలలో చిక్కి కటకటాలు లెక్కిస్తున్నారు. బళ్లారి ఎస్పీ ఆర్.చేతన్ విలేకరులకు ఆదివారం తెలిపిన వివరాల మేరకు... - తన భార్యను వేధిస్తున్నాడంటూ కాంట్రాక్టర్‌పై పగపెంచుకున్న రిజర్వ్ హెడ్ కానిస్టేబుల్ - పార్టీకి పిలిచి ఇతర కేసుల ‘నిందితుడి’తో కలసి హతమార్చిన వైనం - ఆ కేసు నుంచి తప్పించుకునే క్రమంలో సిమ్‌కార్డు ఇచ్చిన పాపానికి స్నేహితుడినే చంపిన ‘నిందితుడు’ బళ్లారి (కర్ణాటక) : పుట్లూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదిలో పెరవలి శేఖర్(27)ను హత్య చేసి, ఆపై మృతదేహాన్ని కాల్చివేసిన కేసులో అదే గ్రామానికి చెందిన జయరాంను కర్ణాటక రాష్ట్రం బళ్లారి పోలీసులు అరెస్టు చేశారు. శేఖర్, జయరాం ఇద్దరిదీ పుట్లూరు కాగా, వారిద్దరూ మంచి స్నేహితులు కూడా. బళ్లారిలో ఉంటున్న ప్రకాశం జిల్లా గిద్దలూరు తాలూకా అలసందపల్లికి చెందిన పుల్లారెడ్డి తనయుడు కాంట్రాక్టర్ వెంకటరామిరెడ్డి(42)ను హత్య చేయాలని అనంతపురానికి చెందిన రిజర్వ్ హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి కుట్రపన్నాడు. అందుకు జయరాం సహకారం కోరాడు. పథకం అమలులో భాగంగా కొత్త సిమ్ తీసుకురావాలని జయరాంను శ్రీనివాసరెడ్డి కోరాడు. దీంతో శేఖర్ పుట్లూరుకు వచ్చి శేఖర్‌ను కలిశాడు. తమ మధ్య ఉన్న స్నేహంతో మిత్రుడు కోరిన వెంటనే శేఖర్ తన సిమ్ కార్డును జయరాంకు ఇచ్చాడు. దాన్ని బళ్లారికి తీసుకెళ్లి శ్రీనివాసరెడ్డికి అందజేశాడు. భార్యను వేధిస్తున్నాడని కాంట్రాక్టర్‌పై పగ కాంట్రాక్టర్ వెంకటరామిరెడ్డికి అనంతపురానికి చెందిన రిజర్వ్ హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసరెడ్డి దగ్గరి బంధువు. శ్రీనివాసరెడ్డి బళ్లారిలో వివాహం చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు నివాసంలో సెక్యూరిటీ విభాగానికి బదిలీ అయ్యాడు. దీంతో కాపురాన్ని బళ్లారిలోనే పెట్టి, విధి నిర్వహణ కోసం హైదరాబాద్ వెళ్లొచ్చేవాడు. ఈ క్రమంలో శ్రీనివాసరెడ్డి భార్యను వెంకటరామిరెడ్డి తరచూ ఫోన్ చేసి వేధించేవాడని ఎస్పీ తెలిపారు. ఈ విషయం తెలిసి రగిలిపోతున్న శ్రీనివాసరెడ్డి ఎలాగైనా వెంకటరామిరెడ్డిని చంపాలని కుట్రపన్నాడు. పార్టీకి పిలిచి.. కసితీరా చంపి.. పుట్లూరుకు చెందిన జయరాంతో తెప్పించిన శేఖర్ సిమ్‌కార్డుతో గత నెల 29న వెంకటరామిరెడ్డికి శ్రీనివాసరెడ్డి ఫోన్ చేసి పార్టీ చేసుకుందాం రమ్మని పిలిచాడు. పీకల దాకా మద్యం తాపించి, గొడవ పెట్టుకున్నాడు. మాటామాట పెరగడంతో బీర్ బాటిల్‌తో వెంకటరామిరెడ్డిపై దాడి చేసి చంపేశాడు. అంతటితో అతని కసి తీరకపోవడంతో వెంకటరామిరెడ్డి మృతదేహాన్ని అతని బైక్‌పైనే ఉంచి తగులబెట్టి పరారయ్యారు. హత్య కేసు నుంచి తప్పించుకునేందుకు మరో హత్య వెంకటరామిరెడ్డి హత్య నేపథ్యంలో బళ్లారి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. శ్రీనివాసరెడ్డి ఉపయోగించిన సిమ్‌కార్డు ఆధారంగా పోలీసులు విచారణ మొదలుపెట్టారు. ఆ సిమ్ పుట్లూరుకు చెందిన శేఖర్ పేరిట నమోదై ఉండడంతో అతని కోసం పుట్లూరుకు వచ్చారు. ఈ విషయం తెలుసుకున్న జయరాం... ఇక అసలు విషయం పోలీసులకు తెలిసిపోతుందని భావించి శేఖర్‌ను పుట్లూరు హైస్కూల్ తరగతి గదిలోకి పిలిపించి హతమార్చాడు. ఆ తరువాత ఎవరూ గుర్తు పట్టకుండా ఉండేందుకు మృతదేహంపై పెట్రోల్ పోసి తగులబెట్టడం ఈ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృష్టించింది. కేవలం వారం రోజుల వ్యవధిలోనే రెండు హత్య కేసుల మిస్టరీని పోలీసులు ఛేదించగలిగారు. -
పుట్లూరులో దారుణం
- పాఠశాల తరగతి గదిలో కిరాతక చర్య - యువకుడిని హతమార్చి, ఆపై పెట్రోల్ పోసి తగులబెట్టిన వైనం - హతుడు చోరీ, హత్య కేసులో నిందితుడు? - బళ్లారిలో కాంట్రాక్టర్ హత్య కేసు విచారణ కోసం వస్తే.. వెలుగు చూసిన హత్య కేసు పుట్లూరు (శింగనమల) : అనంతపురం జిల్లా పుట్లూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తరగతి గదిలో దారుణం వెలుగు చూసింది. పుట్లూరుకు చెందిన పెరవలి శేఖర్(27)ను బండరాయితో కొట్టి, హతమార్చారని పోలీసులు తెలిపారు. ఆపై గుర్తు పట్టకుండా ఉండేందుకు పెట్రోల్ పోసి కాల్చివేశారన్నారు. మూడ్రోజుల తరువాత ఈ కిరాతకం వెలుగులోకి వచ్చింది. హతుడు పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు... శేఖర్ చెడు వ్యసనాలకు బానిసై, ఒంటరిగా జీవిస్తున్నాడు. 2015లో తక్కళ్లపల్లిలోని ఆలయంలో హుండీని చోరీ చేసిన కేసులో అతను నిందితుడిగా ఉన్నాడు. గత నెల 29న కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో ఓ కాంట్రాక్టర్ హత్య కేసు విచారణలో భాగంగా అక్కడి పోలీసులు ఈ నెల 2న పుట్లూరుకు వచ్చారు. శేఖర్ గుర్తింపు కార్డుతో సిమ్‌కార్డు పొందిన అతని స్నేహితుడు జయరామ్‌కు బళ్లారిలో జరిగిన కాంట్రాక్టర్ హత్య కేసులో ప్రమేయం ఉంది. హత్యకు గురైన కాంట్రాక్టర్ కాల్‌డేటా ఆధారంగా అక్కడి పోలీసులు పుట్లూరుకు రాగా, ఈ విషయం తెలిసి జయరాంతో శేఖర్ ఘర్షణ పడినట్లు తెలుస్తోంది. దీంతో విషయం బయటకు పొక్కుతుందనే కుట్రతో శేఖర్‌ను హతమార్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. దుర్వాసన రావడంతో... ప్రస్తుతం పాఠశాలలకు వేసవి సెలవులు వదిలారు. ఈ క్రమంలో తరగతి గది నుంచి భరించరాని దుర్వాసన వస్తుండడంతో స్థానికులు అనుమానంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడికెళ్లి పరిశీలిస్తే.. హత్య కేసు వెలుగు చూసింది. సమాచారం అందిన వెంటనే తాడిపత్రి డీఎస్పీ చిదానందరెడ్డి, రూరల్ సీఐ సురేంద్రనాథ్‌రెడ్డి, ఎస్ఐ సురేశ్‌బాబు తమ సిబ్బందితో నేర స్థలాన్ని పరిశీలించారు. శేఖర్‌ను హతమార్చిన కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న జయరాం సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
బోరు సీజ్ చేస్తున్నారని రైతు ఆత్మహత్యాయత్నం
పుట్లూరు(శింగనమల): పుట్లూరు చెరువులో పెద్దిరెడ్డి అనే రైతు బుధవారం ఆత్మహత్యాయత్నం చేశారు. ఎటువంటి అనుమతి లేకుండా, బోరు వేయడంతో తహసీల్దార్ రామచంద్రారెడ్డి తమ సిబ్బందితో వెళ్లి సీజ్ చేసేందుకు ప్రయత్నించడంతో మనస్తాపానికి గురైన సదరు రైతు ఈ చర్యకు యత్నించాడు. కుటుంబ సభ్యులు, తోటి రైతుల కథనం మేరకు.. పుట్లూరు చెరువులో రైతులు అక్రమంగా బోరుబావులను తవ్వడంతో భూగర్భ జలాలు అడుగంటి తాగునీటికి ఇబ్బందులు ఏర్పడుతున్నాయని పలు గ్రామాల ప్రజలు తహసీల్దార్‌కు మార్చి 6న ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన ఆయన అదే నెల 24న బోరుబావులను సీజ్ చేశారు. దీనిపై పెద్దిరెడ్డి హైకోర్టును ఆశ్రయించి యధాస్థితిని కొనసాగించాలంటూ ఉత్తర్వులు తెచ్చుకున్నారన్నారు. ఈ నేపథ్యంలో పెద్దిరెడ్డి బోరుబావిని సీజ్ చేసేందుకు రెవెన్యూ అధికారులు బుధవారం వెళ్లారు. విద్యుత్ మోటర్‌ను తొలగించేందుకు ప్రయత్నించారు. దీంతో అవమానంగా భావించిన రైతు.. దానిమ్మ తోటలో దాచి ఉంచిన పురుగుల తాగి ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే కుటుంబ సభ్యులు అతన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటనపై తహసీల్దార్ రామచంద్రారెడ్డిని వివరణ కోరగా.. ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు పుట్లూరు చెరువులో 30 బోరుబావులను సీజ్ చేశామన్నారు. అందులో పెద్దిరెడ్డి అనే రైతు బోరు కూడా ఉండగా, ఆయన కోర్టు నుంచి అనుమతి తెచ్చుకున్నట్లు వివరించారు. సీజ్ చేసిన బోరుబావులను బ్రేక్ చేసి విద్యుత్ మోటర్లను దింపారని తెలిపారు. -
భూ సర్వేను అడ్డుకున్న రైతులు
పరిహారంపై స్పష్టత ఇవ్వాల్సిందేనని డిమాండ్ పుట్లూరు : అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే కోసం తమ భూములకు అందించే పరిహారంపై స్పష్టత ఇవ్వాలని బాధిత రైతులు డిమాండ్ చేస్తున్నారు. గత నెల రోజులుగా ఎక్స్‌ప్రెస్ హైవే కోసం రూట్ మ్యాప్‌ను సిద్ధం చేసిన అధికారులు మండలంలోని దోశలేడు, కడవకల్లు, కందికాపుల, గాండ్లపాడు రెవిన్యూ గ్రామాల్లో రోడ్డు మార్గం వెళ్లే సర్వే నంబర్లను గుర్తించారు. రోడ్డు కోసం 150 మీటర్ల వెడల్పుతో భూములను సేకరించడం కోసం హద్దులను ఏర్పాటు చేయడానికి మండలానికి నలుగురు సర్వేయర్లను కూడా నియమించారు. అయితే మంగళవారం ఓబుళాపురం, కడవకల్లు గ్రామాలకు వెళ్లిన సర్వేయర్లను ఆ గ్రామ రైతులు అడ్డుకున్నారు. తాము అరటి పంట సాగు చేసుకుని జీవనం సాగిస్తున్నామని భూములను కోల్పోతే జీవనాధారం పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వే చేయడానికి ముందు అమరావతి ఎక్స్‌ప్రెస్ హైవే కోసం సేకరించే భూములకు ఎంత పరిహారం ఇస్తారన్న విషయంపై తమకు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. అయితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తాము సర్వే చేస్తున్నామని వారు రైతులకు తెలిపారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకున్న రైతులు భూములకు అందించే పరిహారంపై స్పష్టత ఇవ్వాలని వినతి పత్రం అందించారు. స్థానిక భూ విలువను బట్టి పరిహారం అందించాలన్నారు. -
ఆరు ఎకరాల్లో అరటితోట దగ్ధం
పుట్లూరు : మండలంలోని ఓబుళాపురం గ్రామ సమీపంలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరు ఎకరాల్లో సాగు చేసిన అరటితోట దగ్ధమైంది. చాగంటి పుల్లారెడ్డి అనే రైతుకు చెందిన అరటితోటకు మంటలు వ్యాపించడంలో సమీప పొలాల్లోని రైతులు ఫైరింజి¯ŒS సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజి¯ŒS వచ్చేలోపు అరటితోట దగ్ధమైంది. ఈ ప్రమాదంలో దాదాపు 20 టన్నుల అరటిగెలలు కాలిపోయాయి. డ్రిప్పు పరికరాలు బూడిద కావడంతో రూ.6 లక్షల మేరకు నష్టం జరిగినట్లు బాధిత రైతు వాపోయాడు. -
యువతి అదృశ్యంపై కేసు నమోదు
పుట్లూరు : మండలంలోని కోమటికుంట్లలో యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ సురేష్‌బాబు సోమవారం తెలిపారు. గ్రామానికి చెందిన లక్ష్మీ అనే యువతి ఈ నెల 25 నుంచి కనిపించలేదని ఆమె తండ్రి క్రిష్ణయ్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి
జిల్లాలో రెండు వేర్వేరు చోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు దుర్మరణం చెందారు. పెద్దపప్పూరు మండలం ముచ్చుకోటకు చెందిన ఆర్ఎంపీ చక్రపాణి (50) సోమవారం పుట్లూరు మండలం ఎ.కొండాపురం నుంచి స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో బయల్దేరాడు. కొండాపురం దాటిన తర్వాత ముందు వెళుతున్న వాటర్ ట్యాంక్ ఆటోను వెనుకవైపు నుంచి ద్విచక్రవాహనం ఢీకొంది. తీవ్రంగా గాయపడిన చక్రపాణిని స్థానికులు తాడిపత్రి ప్రభుత్వాస్పత్రికి చేర్చారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. చక్రపాణికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎస్ఐ సురేష్‌బాబు కేసు నమోదు చేసుకున్నారు. అడదాకులపల్లి ప్రమాదంలో యువకుడు... రొద్దం మండలం చోలేమర్రికి చెందిన తిమ్మారెడ్డి, ప్రభావతమ్మ దంపతుల కుమారుడు గోవర్ధన్‌రెడ్డి సోమవారం వ్యక్తిగత పనిమీద ద్విచక్రవాహనంపై పెనుకొండకు బయల్దేరాడు. అడదాకులపల్లి అడ్డురోడ్డు సమీపాన మలుపువద్దకు రాగానే ఎదురుగా పెనుకొండ వైపు నుంచి మడకశిరకు వస్తున్న కేఏ02 ఏఎఫ్ 4156 నంబరుగల సిమెంట్ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో గోవర్ధన్‌రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్ఐ సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆటోలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతుడి తల్లిదండ్రులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
పాము కాటుతో చిన్నారి మృతి
పుట్లూరు: కడవకల్లు గ్రామంలో ఆదివారం రాత్రి పాము కాటుతో శృతి (5) అనే చిన్నారి మృతి చెందింది. సోమవారం ఉదయం తల్లిదండ్రులు అడివన్న, లక్ష్మదేవిలు గమనించిన కన్నీటిపర్యంతమైయ్యారు. శృతి స్థానిక ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. ఎంఈఓ నాగరాజు, ఉపాద్యాయులు విద్యార్థిని మృతికి సంతాపం తెలిపారు. -
ఇంటర్ విద్యార్థి గల్లంతు
సుబ్బరాయసాగర్‌లో ఈతకు వెళ్లి నీటమునిగిన వైనం మండలంలోని నారాయణరెడ్డిపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి పెద్ద కుళ్లాయప్ప (22) తన స్నేహితులు మల్లికార్జున, రంగనాయకులు, రాముతో కలిసి సోమవారం సంజీవపురం వద్దనున్న సుబ్బరాయసాగర్‌లో ఈత నేర్చుకునేందుకు వెళ్లారు. నీటిలోకి దిగిన పెద్ద కుళ్లాయప్ప కొద్దిసేపటికే మునిగిపోయాడు. మిగిలిన ముగ్గురికీ ఈత రాకపోవడంతో రక్షించండి అంటూ కేకలు వేసుకుంటూ సమీప గ్రామస్తులకు సమాచారం అందించారు. వారు వచ్చి నీటిలో గాలించినప్పటికీ పెద్ద కుళ్లాయప్ప జాడ కనిపించలేదు. కాసేపటి తర్వాత పోలీసులు, హెచ్చెల్సీ సిబ్బంది కూడా వచ్చి వెతికినా ప్రయోజనం లేకపోయింది. నీటి లోతు ఎక్కువగా ఉండటంతో పాటు సాగర్‌లో చేపలు ఉండటం వల్ల అట్టడుగుకు వెళ్లి గాలించడానికి ఎవరూ సాహసం చేయలేకపోతున్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ సురేష్‌బాబు పరిశీలించి ప్రమాదంపై స్నేహితులను విచారించారు. ఆశలన్నీ తనయుడిపైనే.. ‘ఆశలన్నీ నీపైనే పెట్టుకుంటిమయ్యా... నీవు లేకుండా పోతే మా గతి ఏమికాను’ అంటూ పెద్ద కుళ్లాయప్ప తల్లిదండ్రులు వెంకటరాముడు, రామాంజినమ్మ కన్నీరుమున్నీరయ్యారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. కాగా సాగర్‌లో గల్లంతైన పెద్ద కుమారుడు పెద్ద కుళ్లాయప్ప తాడిపత్రిలోని శ్రీవాణి కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. సాగర్‌లో ఏడాదికి ఒకరు బలి.. సుబ్బరాయసాగర్ వద్ద గత మూడేళ్లుగా ఏడాదికి ఒకరు చొప్పున మరణిస్తున్నారు. సాగర్‌లోకి నీరు వచ్చిన సమయంలో చూడటానికి ఈ ప్రదేశం ఆహ్లాదకరంగా ఉండటంతో సందర్శకుల సంఖ్యతో పాటు స్థానిక యువకులు పెద్ద ఎత్తున ఇక్కడకు ఈతకొట్టేందుకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో నీటిలోకి దిగుతున్న యువకులను హెచ్చెల్సీ సిబ్బంది, పోలీసులు మందలించకపోవడంతో ఈ ప్రమాదాలు కొనసాగుతున్నాయి. 2014 డిసెంబర్ 7న కడవకల్లు గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్తి నరేష్, 2015 డిసెంబర్ 13న తాడిపత్రి పట్టణానికి చెందిన షాహీద్‌బాషా(22) నీటిలో మునిగి చనిపోయిన విషయం విదితమే. -
నలుగురు అరెస్టు
పుట్లూరు : మండలంలోని ఎల్లుట్లలో ఈ నెల 5న పాడి గేదెల అపహరణ కేసులో ఆదివారం నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై సురేష్‌బాబు తెలిపారు. రవి, నాగభూషణంతో పాటు మరో ఇద్దరిని సోమవారం రిమాండ్‌కు తరలిస్తామన్నారు. -
కరుణించు తండ్రీ..
పుట్లూరు : కరువుతో జనం కష్టాల్లో ఉన్నారు. అయినా చవితి పండుగ నాడు నాకు ఏ లోటూ చేయలేదు. కడుపారా ఉండ్రాళ్లు పెట్టారు. వారి స్తోమతను బట్టి విగ్రహాలను కొలువుదీర్చారు. ఆటపాటలతో నన్ను అలరించారు. వారి కన్నీటి కష్టాలను దాచిపెట్టుకుని.. నన్ను మాత్రం కన్నబిడ్డలా ఆదరించారు. అంతే ఆదరణతో గంగమ్మ ఒడికి చేర్చాలని తపన పడ్డారు. అయితే.. చెరువులు, వాగులు, వంకలు ఇలా ఎక్కడ వెతికినా గంగమ్మ ‘తల్లి’ జాడ కన్పించలేదు. పాపం..! ఇక వారు ఇంతకన్నా ఏం చేయగలరు?! అందుకే నన్నిలా వదిలివెళ్లారు. తండ్రీ.. కరుణించు! గంగమ్మను పంపి..జలకళను ప్రసాదించు! నీ బిడ్డను ఆదరించిన ఈ జనం రుణం కొంతైనా తీర్చుకో! -
చూపులకు సుందరాంగి!
శింగనమల నియోజకవర్గం పుట్లూరుకు చెందిన రామకృష్ణ... బతుకు తెరువు కోసం ఓ గాలిమిషన్ ఏర్పాటుచేసుకున్నాడు. మూడేళ్ల క్రితం ఒంగోలు జాతికి చెందిన ఆవుదూడను రూ. 14 వేలు వెచ్చించి కొనుగోలు చేశాడు. రోజులు గడుస్తున్న కొద్ది అది కొత్త రూపును సంతరించుకోసాగింది. దీంతో దాని పోషణపై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు. అందానికే అందం చూస్తుంటే ముద్దులొలుకుతున్న ఆవును మరింత సుందరంగా అలకరించే పనిలో రామకృష్ణ నిమగ్నమయ్యాడు. దాని కోసం ప్రత్యేకంగా గౌషన్లు, మెడపట్టీ, కాళ్ల గజ్జెలు, కొమ్ము కుచ్చులు, పూసల హారాలు సమకూర్చాడు. వాటిని అప్పుడప్పుడు దానికి అలంకరించి ఆనందించేవాడు. పాల నురుగులాంటి శరీరంపై నల్లటి దారాలతో అలంకరించిన ఆవును చూసేందుకు స్థానికులు ఎగబడ్డేవారు. అందాల పోటీలకు గత ఏడాది ఏప్రిల్‌లో తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి నిర్వహించిన ఆవుల అందాల పోటీలకు రాష్ట్రం నలుమూలల నుంచి మేలు జాతి ఆవులు వచ్చాయి. ఈ పోటీలకు తన ఆవును రామకృష్ణ తీసుకెళ్లాడు. దాదాపు 750కు పైగా ఆవులు వివిధ అంశాల్లో ప్రతిభ చాటుకునేందుకు పోటీ పడ్డాయి. వాటన్నింటిని వెనక్కు నెట్టేసి రామకృష్ణ ఆవు ప్రథమస్థానంలో నిలిచింది. ఈ సందర్భంగా రూ. 15వేలుతో పాటు ప్రశంసాపత్రాన్ని నిర్వాహకులు అందజేశారు. సంక్రాంతి సంబరాల్లోనూ... ఈ ఏడాది ప్రభుత్వం నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో సైతం ఈ ఆవు అందాల పోటీల్లో పాల్గొని మండల, జిల్లా స్థాయిలో ప్రథమ బహుమతి సాధించింది. మండల స్థాయిలో రూ.4 వేలు, జిల్లా స్థాయిలో రూ. 8 వేలు ప్రోత్సాహక నగదు తన యజమానికి దక్కేలా చేసింది. ఈ సందర్భంగా మంత్రుల చేతుల మీదుగా రామకృష్ణ సత్కారం అందుకున్నారు. -
బాలిక కుటుంబానికి హెడ్ కానిస్టేబుల్ బెదిరింపులు
బ్రహ్మసముద్రం : అనంతపురం జిల్లా బ్రహ్మసముద్రంలో దారుణం చోటుచేసుకుంది. ప్రజలను కాపాడాల్సిన ఖాకీలే వారిపై దౌర్జన్యం చేస్తున్నారు. విషయం బయటపెడితే చంపుతానంటూ ఇటీవలే ప్రసవించిన బాలిక కుటుంబంపై హెడ్ కానిస్టేబుల్ ఈశ్వరయ్య బెదిరింపులకు పాల్పడుతున్నారు. అనంతరపురం జిల్లా వ్యాప్తంగా కస్తూర్భా స్కూళ్లలో వికృత చేష్టలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇటీవల పుట్లూరు కస్తుర్భా పాఠశాలలో బాలిక ప్రసవించిన విషయం విదితమే. తనకల్లులో ఆ బాలికతో ఆమె కుటుంబానికి వేధింపులు ఎదురవుతున్నాయి. బాలికలపై వేధింపులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోకపోవడం గమనార్హం. -
బైక్, ఆటో ఢీ: ఇద్దరికి గాయాలు
పుట్లూరు (అనంతపురం): ఆటో, బైకు ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండల కేంద్రంలో పుట్లూరు- తాడిపత్రి రహదారిపై ఆదివారం సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో జరిగింది. వివరాలు.. ఎదురెదురుగా వేగంగా వచ్చిన ఆటో, మోటారు సైకిల్ ఢీకొనటంతో ఈ ఘటన జరిగింది. బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను పుట్లూరు ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
అత్యాచారం చేస్తూ పట్టుబడ్డ యువకుడు
-
అత్యాచారం చేస్తూ రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డ యువకుడు
అనంతపురం జిల్లా పుట్లూరులో దారుణం చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలికపై స్థానిక కానిస్టేబుల్ ఇంట్లో పనిచేసే మురళి అనే వ్యక్తి అత్యాచారానికి పాల్పడుతూ రెడ్ హండెడ్‌గా పట్టుబడ్డాడు. దాంతో స్థానికులు, బాలిక బంధువులు నిందితుడికి దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. అయితే నిందితుడు మురళిపై పోలీసులు కేసు నమోదు చేయలేదు. అత్యాచారానికి గరైన బాలికను పెళ్లి చేసుకోవాలని ఆమె బంధువులు డిమాండ్ చేస్తూ పోలీస్ స్టేషన్ ఎదుటు ఆందోళనకు దిగారు. అతడు పెళ్లి చేసుకునేందుకు ఒప్పకోకుంటే కేసు నమోదు చేయాలని వారు పోలీసు ఉన్నతాధికారులను డిమాండ్ చేశారు. అయితే గత కొంత కాలంగా కానిస్టేబుల్ ఇంట్లో పని చేసే మురళి 16 ఏళ్ల బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంట పడ్డాడు... ఆమెను తన మాటలతో వంచించి... అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ క్రమంలో అత్యాచారం విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బెదిరించాడు. కాగా అత్యాచారం చేస్తూ స్థానికులకు పట్టుబడి పోయాడు. అత్యాచారానికి గురైన బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆమె పరిస్థితి నిలకడ మీద ఉందని వైద్యులు వెల్లడించారు. -
పుట్లూరులో డయేరియాతో ముగ్గురు మృతి
అనంతపురం : అనంపురం జిల్లా పుట్లూరు మండలం పుట్లూరులో డయేరియా విజృంభించింది. కలుషితమైన తాగునీరు సేవించటంతో ఇప్పటికే ఇద్దరు మహిళులు మృతి చెందగా, మరొకరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించారు. దాంతో మృతుల సంఖ్య మూడుకు చేరింది. మరో 30 మంది అస్వస్థతకు గురయ్యారు. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. వాంతులు, విరోచనాలతో నిన్న నారాయణమ్మ (75), లక్ష్మమ్మ (55) మరణించిన విషయం తెలిసిందే. దాదాపు ముప్పైమంది డయేరియా బారిన పడ్డారు. బాధితుల్లో 18మంది తాడిపత్రిలోని ప్రయివేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, మిగిలినవారు అనంతపురంలోని పలు ఆస్పత్రుల్లో చేరారు.