ఇంటర్ విద్యార్థి గల్లంతు
- సుబ్బరాయసాగర్‌లో ఈతకు వెళ్లి నీటమునిగిన వైనం
మండలంలోని నారాయణరెడ్డిపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి పెద్ద కుళ్లాయప్ప (22) తన స్నేహితులు మల్లికార్జున, రంగనాయకులు, రాముతో కలిసి సోమవారం సంజీవపురం వద్దనున్న సుబ్బరాయసాగర్‌లో ఈత నేర్చుకునేందుకు వెళ్లారు. నీటిలోకి దిగిన పెద్ద కుళ్లాయప్ప కొద్దిసేపటికే మునిగిపోయాడు. మిగిలిన ముగ్గురికీ ఈత రాకపోవడంతో రక్షించండి అంటూ కేకలు వేసుకుంటూ సమీప గ్రామస్తులకు సమాచారం అందించారు. వారు వచ్చి నీటిలో గాలించినప్పటికీ పెద్ద కుళ్లాయప్ప జాడ కనిపించలేదు. కాసేపటి తర్వాత పోలీసులు, హెచ్చెల్సీ సిబ్బంది కూడా వచ్చి వెతికినా ప్రయోజనం లేకపోయింది. నీటి లోతు ఎక్కువగా ఉండటంతో పాటు సాగర్‌లో చేపలు ఉండటం వల్ల అట్టడుగుకు వెళ్లి గాలించడానికి ఎవరూ సాహసం చేయలేకపోతున్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్‌ఐ సురేష్‌బాబు పరిశీలించి ప్రమాదంపై స్నేహితులను విచారించారు.
ఆశలన్నీ తనయుడిపైనే..
‘ఆశలన్నీ నీపైనే పెట్టుకుంటిమయ్యా... నీవు లేకుండా పోతే మా గతి ఏమికాను’ అంటూ పెద్ద కుళ్లాయప్ప తల్లిదండ్రులు వెంకటరాముడు, రామాంజినమ్మ కన్నీరుమున్నీరయ్యారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. కాగా సాగర్‌లో గల్లంతైన పెద్ద కుమారుడు పెద్ద కుళ్లాయప్ప తాడిపత్రిలోని శ్రీవాణి కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు.
సాగర్‌లో ఏడాదికి ఒకరు బలి..
సుబ్బరాయసాగర్ వద్ద గత మూడేళ్లుగా ఏడాదికి ఒకరు చొప్పున మరణిస్తున్నారు. సాగర్‌లోకి నీరు వచ్చిన సమయంలో చూడటానికి ఈ ప్రదేశం ఆహ్లాదకరంగా ఉండటంతో సందర్శకుల సంఖ్యతో పాటు స్థానిక యువకులు పెద్ద ఎత్తున ఇక్కడకు ఈతకొట్టేందుకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో నీటిలోకి దిగుతున్న యువకులను హెచ్చెల్సీ సిబ్బంది, పోలీసులు మందలించకపోవడంతో ఈ ప్రమాదాలు కొనసాగుతున్నాయి. 2014 డిసెంబర్ 7న కడవకల్లు గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్తి నరేష్, 2015 డిసెంబర్ 13న తాడిపత్రి పట్టణానికి చెందిన షాహీద్‌బాషా(22) నీటిలో మునిగి చనిపోయిన విషయం విదితమే.