International student
-
విదేశీ విద్యార్థులపై ఆస్ట్రేలియా పరిమితి
కాన్బెర్రా: అంతర్జాతీయ విద్యార్థులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా ఉన్న ఆస్ట్రేలియా విదేశీ విద్యార్థుల సంఖ్యను భారీగా తగ్గించాలని నిర్ణయించింది. కోవిడ్19కు పూర్వస్థితికి వలసలను కట్టడి చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. 2025 నుంచి ప్రతిఏటా 2,70,000 మంది విదేశీ విద్యార్థులను మాత్రమే అనుమతిస్తామని మంగళవారం ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి యూనివర్శిటీకి నిర్ణీత కోటాను పెడతామని వెల్లడించింది. దీనివల్ల వృత్తి విద్యాసంస్థలు, శిక్షణ సంస్థలపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. ఇది ఆర్థిక విధ్వంసమని పలు యూనివర్శిటీలు ప్రభుత్వ నిర్ణయంపై ధ్వజమెత్తాయి. ఈ ఏడాది ఆరంభంలో ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఆస్ట్రేలియాలో 7,17,500 మంది విదేశీ విద్యార్థులు ఉన్నారు. కోవిడ్ సమయంలో ఉన్నత విద్యారంగం గడ్డు పరిస్థితులను ఎదుర్కొందని ఆస్ట్రేలియా విద్యాశాఖ మంత్రి జాసన్ క్లార్ అంగీకరించారు. కోవిడ్‌కాలంలో ఆస్ట్రేలియా విదేశీ విద్యార్థులందరినీ స్వదేశాలకు పంపించి వేసింది. ప్రస్తుతం కోవిడ్ పూర్వకాలంతో పోలిస్తే 10 శాతం మంది విదేశీ విద్యార్థులు ఆస్ట్రేలియా వర్శిటీల్లో అధికంగా ఉన్నారని క్లార్ అన్నారు. వృత్తి విద్య, శిక్షణ సంస్థల్లో అయితే విదేశీ విద్యార్థుల సంఖ్య ఏకంగా 50 శాతం అధికంగా ఉందన్నారు. విద్యారంగాన్ని వ్యాపారంగా మార్చి నాణ్యత లేని విద్యను అందిస్తున్నారని, ఆంగ్ల భాషలో ఏమాత్రం ప్రావీణ్యం లేని విద్యార్థులనూ చేర్చుకుంటున్నారని, ఆస్ట్రేలియాలో పని చేసుకునేందుకు వచ్చినవారికి విద్యార్థుల ముసులో ఆశ్రయం కల్పిస్తున్నారని క్లార్ ఆరోపించారు. 2025 నుంచి ప్రభుత్వ యూనివర్శిటీల్లో 1,45,000 మంది విదేశీ విద్యార్థులను మాత్రమే చేర్చుకుంటామని తెలిపారు. అలాగే ప్రైవేటు యూనివర్శిటీల్లో అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్యను 30 వేలకు పరిమితం చేస్తామని, వృత్తివిద్య, శిక్షణ సంస్థల్లో 95 వేల మందికి పరిమితం చేస్తున్నట్లు వివరించారు. -
ఇంటర్ విద్యార్థి గల్లంతు
సుబ్బరాయసాగర్‌లో ఈతకు వెళ్లి నీటమునిగిన వైనం మండలంలోని నారాయణరెడ్డిపల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి పెద్ద కుళ్లాయప్ప (22) తన స్నేహితులు మల్లికార్జున, రంగనాయకులు, రాముతో కలిసి సోమవారం సంజీవపురం వద్దనున్న సుబ్బరాయసాగర్‌లో ఈత నేర్చుకునేందుకు వెళ్లారు. నీటిలోకి దిగిన పెద్ద కుళ్లాయప్ప కొద్దిసేపటికే మునిగిపోయాడు. మిగిలిన ముగ్గురికీ ఈత రాకపోవడంతో రక్షించండి అంటూ కేకలు వేసుకుంటూ సమీప గ్రామస్తులకు సమాచారం అందించారు. వారు వచ్చి నీటిలో గాలించినప్పటికీ పెద్ద కుళ్లాయప్ప జాడ కనిపించలేదు. కాసేపటి తర్వాత పోలీసులు, హెచ్చెల్సీ సిబ్బంది కూడా వచ్చి వెతికినా ప్రయోజనం లేకపోయింది. నీటి లోతు ఎక్కువగా ఉండటంతో పాటు సాగర్‌లో చేపలు ఉండటం వల్ల అట్టడుగుకు వెళ్లి గాలించడానికి ఎవరూ సాహసం చేయలేకపోతున్నారు. సంఘటనా స్థలాన్ని ఎస్ఐ సురేష్‌బాబు పరిశీలించి ప్రమాదంపై స్నేహితులను విచారించారు. ఆశలన్నీ తనయుడిపైనే.. ‘ఆశలన్నీ నీపైనే పెట్టుకుంటిమయ్యా... నీవు లేకుండా పోతే మా గతి ఏమికాను’ అంటూ పెద్ద కుళ్లాయప్ప తల్లిదండ్రులు వెంకటరాముడు, రామాంజినమ్మ కన్నీరుమున్నీరయ్యారు. వీరికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె సంతానం. కాగా సాగర్‌లో గల్లంతైన పెద్ద కుమారుడు పెద్ద కుళ్లాయప్ప తాడిపత్రిలోని శ్రీవాణి కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు. సాగర్‌లో ఏడాదికి ఒకరు బలి.. సుబ్బరాయసాగర్ వద్ద గత మూడేళ్లుగా ఏడాదికి ఒకరు చొప్పున మరణిస్తున్నారు. సాగర్‌లోకి నీరు వచ్చిన సమయంలో చూడటానికి ఈ ప్రదేశం ఆహ్లాదకరంగా ఉండటంతో సందర్శకుల సంఖ్యతో పాటు స్థానిక యువకులు పెద్ద ఎత్తున ఇక్కడకు ఈతకొట్టేందుకు వస్తున్నారు. ఇలాంటి సమయంలో నీటిలోకి దిగుతున్న యువకులను హెచ్చెల్సీ సిబ్బంది, పోలీసులు మందలించకపోవడంతో ఈ ప్రమాదాలు కొనసాగుతున్నాయి. 2014 డిసెంబర్ 7న కడవకల్లు గ్రామానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్తి నరేష్, 2015 డిసెంబర్ 13న తాడిపత్రి పట్టణానికి చెందిన షాహీద్‌బాషా(22) నీటిలో మునిగి చనిపోయిన విషయం విదితమే. -
‘కాలం’ కాటేసింది
తొందరగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్న ఆత్రుత ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాలను బలికొంది. అంతేగాక తనతోపాటు వచ్చిన అతని స్నేహితుడు కూడా బలయ్యాడు. ఒక్కగానొక్క కుమారుడు ఉన్నత చదువులు చదివి వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడనుకున్న తల్లిదండ్రులకు తీరని వ్యథ మిగిలింది. ఒక్క క్షణం ముందు బస్టాపు వద్దకు వచ్చి ఉన్నా.. క్షణం ఆలస్యంగా వచ్చి ఉన్నా వారు క్షేమంగా ఉండేవారు. ములకలచెరువు సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మండలంలోని సోంపల్లెకు చెందిన ఇంటర్ విద్యార్థి మృతి చెందగా అతని తోడుగా వచ్చిన మిత్రుడు కూడా దుర్మరణం పాలయ్యాడు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఒకేసారి మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. ఈ సంఘటన వివరాలిలా.. ములకలచెరువు: సోంపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఆది నారాయణ, గంగులమ్మల కుమారుడు అనిల్‌కుమార్(18) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం కావడంతో పరీక్ష రాసేందుకు మదనపల్లెకు వెళ్లాల్సివుంది. దీంతో సోంపల్లె నుంచి ములకలచెరువుకు చేరుకుని అక్కడి నుంచి మదనపల్లెకు వెళ్లాలి. దీంతో అనిల్‌కుమార్‌ను బస్సెక్కించేందుకు మిత్రుడు అంజనప్ప(19) బైక్‌లో బయలుదేరారు. ఉదయం 6.30 గంటలకు బైక్‌లో ములకలచెరువుకు చేరుకోగా అప్పటికే మదనపల్లెకు వెళ్లే ఆర్టీసీ బస్సు ముందుకు కదిలింది. బస్సును అందుకునేందుకు బైక్‌లో వెంబడించాడు. విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద బస్సును ఓవర్టేక్ చేస్తూ ముందుకు వెళ్తుండగా..అదే సమయంలో ఎదురుగా పుంగనూరు నుంచి కర్నూలుకు కోళ్ల లోడుతో వెళ్తున్న ఐషర్ వాహనం బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో అంజనప్ప(19), అనిల్‌కుమార్ (18)లు సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. క్షణ కాలమే ఆలస్యం.. మిత్రులిద్దరూ ఉదయం బైక్‌లో ములకలచెరువు చేరుకోవడం క్షణకాలమే ఆలస్యమైంది. ఆ సమయంలో ఆర్టీసీ బస్సు కదులుతోంది. తొందరగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్న ఆత్రుతతో అదే బస్సును అందుకునేందుకు బైక్‌లో వెంబడించారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని గమనించక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. కన్నీరుమున్నీరైన కుటుంబసభ్యులు విషయం తెలిసి మృతుల కుటుంబసభ్యులు, బంధువులు ఘటనా స్థలికి చేరుకుని బోరున విలపించారు. వీరివురు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. అనీల్‌కుమార్ తల్లిదండ్రులు ఆదినారాయణ, గంగులమ్మ కూలి పనులు చేసుకుంటూ కొడుకును చదివిస్తున్నారు. వీరికి అనీల్‌కుమార్ ఒక్కడే కుమారుడు. వృద్ధాప్యంలో తమకు చేదోడు వాదోడుగా ఉంటాడన్న ఆశించిన నీరుపేద తల్లిదండ్రులకు తీరని వ్యథ మిగిలింది. ఇక అంజనప్ప కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఇతని తండ్రి వేమనారాయణ గతంలో మరణించగా తల్లి లక్ష్మీదేవి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఎదిగొచ్చిన బిడ్డ రోడ్డుపై విగతజీవిగా పడి ఉండటం చూసిన ఆ తల్లి తల్లడిల్లిపోయింది. మృతదేహాలను చూసి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎస్ఐ శ్రీకాంత్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లెకు తరలించారు. ఈ ఘటనతో సోంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ తెలిపారు. ములకలచెరువు సీఐ రుషికేశవ మదనపల్లి ఆస్పత్రికి వెళ్లి మృతుల కుటుంబసభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం ఆందించారు. మృతుల కుంటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాల్సివుంది.