‘ఏంటిది?’.. రిజ్వాన్‌ చర్యకు హర్షిత్‌ రాణా రియాక్షన్‌ వైరల్‌.. గంభీర్‌ కూడా! | Ind vs Pak: Rizwan Collision With Harshit Rana Young Pacer Reaction Viral | Sakshi
Sakshi News home page

‘ఏంటిది?’.. రిజ్వాన్‌ చర్యకు హర్షిత్‌ రాణా రియాక్షన్‌ వైరల్‌.. గంభీర్‌ కూడా!

Published Sun, Feb 23 2025 6:33 PM | Last Updated on Sun, Feb 23 2025 6:42 PM

Ind vs Pak: Rizwan Collision With Harshit Rana Young Pacer Reaction Viral

పాకిస్తాన్‌తో మ్యాచ్‌ సందర్భంగా టీమిండియా యువ బౌలర్‌ హర్షిత్‌ రాణా(Harshit Rana) అసహనానికి గురయ్యాడు. దాయాది జట్టు కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌(Mohammad Rizwan) చేసిన పనికి అతడు ఇచ్చిన రియాక్షన్‌ వైరల్‌గా మారింది. కాగా చాంపియన్స్‌ ట్రోఫీ-2025(ICC Champions Trophy) బుధవారం(ఫిబ్రవరి 19) మొదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో గురువారం తమ తొలి మ్యాచ్‌ ఆడిన రోహిత్‌ సేన.. బంగ్లాదేశ్‌ను ఆరు వికెట్ల తేడాతో చిత్తు చేసింది.

కట్టుదిట్టమైన బౌలింగ్‌తో 
ఇక రెండో మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్థిని పాకిస్తాన్‌తో తలపడుతున్న టీమిండియా టాస్‌ ఓడి తొలుత ఫీల్డింగ్‌ చేసింది. ఆరంభం నుంచే భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో పాక్‌ బ్యాటర్లను కట్టడి చేశారు. ఓపెనర్‌ బాబర్‌ ఆజం(23)ను హార్దిక్‌ పాండ్యా పెవిలియన్‌కు పంపగా.. మరో ఓపెనర్‌ ఇమామ్‌ ఉల్‌ హక్‌(10)ను రనౌట్‌ చేశాడు అక్షర్‌ పటేల్‌.

ఈ క్రమంలో వన్‌డౌన్‌ బ్యాటర్‌ సౌద్‌ షకీల్‌(62) కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ చక్కదిద్దే ప్రయత్నం చేయగా.. భారత స్పిన్‌ బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ ఈ జోడీని విడదీశాడు. రిజ్వాన్‌(46)ను బాపూ బౌల్డ్‌ చేయడంతో 104 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. అనంతరం హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో సౌద్‌ షకీల్‌ ఇచ్చిన క్యాచ్‌ను అక్షర్‌ పట్టడంతో వరుస విరామాల్లో పాక్‌ వికెట్లు కోల్పోయింది.

ఆ తర్వాత తయ్యబ్‌ తాహిర్‌(4)ను రవీంద్ర జడేజా పెవిలియన్‌కు పంపగా.. వరుస బంతుల్లో చైనామన్‌ స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ సల్మాన్‌ ఆఘా(19), షాహిన్‌ ఆఫ్రిది(0)లను అవుట్‌ చేశాడు.

 

ఇదిలా ఉంటే.. యువ పేసర్‌ హర్షిత్‌ రాణా మాత్రం ఈ మ్యాచ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌లో రిజ్వాన్‌ ఇచ్చిన సులువైన క్యాచ్‌ను వదిలేసిన ఈ ఫాస్ట్‌బౌలర్‌.. ఖుష్దిల్‌ షా(38)ను అవుట్‌ చేసి పాక్‌ ఇన్నింగ్స్‌లో ఆఖరి వికెట్‌ను దక్కించుకున్నాడు. 

ఏంటిది?
ఇక మొత్తంగా ఈ మ్యాచ్‌లో  హర్షిత్‌ రాణా 7.4 ఓవర్ల బౌలింగ్‌లో 30 రన్స్‌ ఇచ్చాడు. అయితే, పొదుపుగా బౌలింగ్‌ చేసిన హర్షిత్‌ రాణా ఆట కంటే.. రిజ్వాన్‌తో ఢీకొట్టిన విధానంతో ఎక్కువ హైలైట్‌ అయ్యాడు. పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌లో 21వ ఓవర్‌ను రాణా వేశాడు.

అప్పుడు క్రీజులో ఉన్న రాణా వేసిన షార్ట్‌ బాల్‌ను డీప్‌ లెగ్‌స్వ్కేర్‌ దిశగా షాట్‌ బాది సింగిల్‌కు వెళ్లాడు. ఈ క్రమంలో రాణా తన లైన్‌లోనే ఉండగా.. రిజ్వాన్‌ మాత్రం పరిగెడుతూ కాస్త పక్కకు జరిగి రాణాను ఢీకొట్టాడు. దీంతో అతడు రిజ్వాన్‌ను వైపు గుర్రుగా చూస్తూ.. ‘ఏంటిది?’’ అన్నట్లుగా సీరియస్‌ అయ్యాడు. 

ఇక డగౌట్‌లో ఉన్న టీమిండియా హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌ కూడా రిజ్వాన్‌ తీరుకు కాస్త అసహనంగా ఫీలైనట్లు కనిపించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి. 

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. పాక్‌ 49.4 ఓవర్లలో 241 పరుగులకు ఆలౌట్‌ కాగా.. భారత బౌలర్లలో కుల్దీప్‌ యాదవ్‌ మూడు, హార్దిక్‌ పాండ్యా రెండు వికెట్లు పడగొట్టగా.. రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, హర్షిత్‌ రాణా ఒక్కో వికెట్‌ తీశారు. అక్షర్‌ పటేల్‌ రెండు రనౌట్లలో భాగమయ్యాడు.

చదవండి: IND vs PAK: బాబర్‌ ఆజం అరుదైన రికార్డు..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement