తొందరగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్న ఆత్రుత ఓ ఇంటర్ విద్యార్థి ప్రాణాలను బలికొంది. అంతేగాక తనతోపాటు వచ్చిన అతని స్నేహితుడు కూడా బలయ్యాడు. ఒక్కగానొక్క కుమారుడు ఉన్నత చదువులు చదివి వృద్ధాప్యంలో ఆసరాగా ఉంటాడనుకున్న తల్లిదండ్రులకు తీరని వ్యథ మిగిలింది. ఒక్క క్షణం ముందు బస్టాపు వద్దకు వచ్చి ఉన్నా.. క్షణం ఆలస్యంగా వచ్చి ఉన్నా వారు క్షేమంగా ఉండేవారు. ములకలచెరువు సమీపంలోని విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.
ఈ ఘటనలో మండలంలోని సోంపల్లెకు చెందిన ఇంటర్ విద్యార్థి మృతి చెందగా అతని తోడుగా వచ్చిన మిత్రుడు కూడా దుర్మరణం పాలయ్యాడు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు ఒకేసారి మృతి చెందడంతో ఆ గ్రామంలో విషాదం అలుముకుంది. ఈ సంఘటన వివరాలిలా..
ములకలచెరువు: సోంపల్లి ఎస్సీ కాలనీకి చెందిన ఆది నారాయణ, గంగులమ్మల కుమారుడు అనిల్‌కుమార్(18) ఇంటర్మీడియట్ చదువుతున్నాడు. బుధవారం నుంచి పరీక్షలు ప్రారంభం కావడంతో పరీక్ష రాసేందుకు మదనపల్లెకు వెళ్లాల్సివుంది. దీంతో సోంపల్లె నుంచి ములకలచెరువుకు చేరుకుని అక్కడి నుంచి మదనపల్లెకు వెళ్లాలి. దీంతో అనిల్‌కుమార్‌ను బస్సెక్కించేందుకు మిత్రుడు అంజనప్ప(19) బైక్‌లో బయలుదేరారు. ఉదయం 6.30 గంటలకు బైక్‌లో ములకలచెరువుకు చేరుకోగా అప్పటికే మదనపల్లెకు వెళ్లే ఆర్టీసీ బస్సు ముందుకు కదిలింది. బస్సును అందుకునేందుకు బైక్‌లో వెంబడించాడు. విద్యుత్ సబ్‌స్టేషన్ వద్ద బస్సును ఓవర్‌టేక్ చేస్తూ ముందుకు వెళ్తుండగా..అదే సమయంలో ఎదురుగా పుంగనూరు నుంచి కర్నూలుకు కోళ్ల లోడుతో వెళ్తున్న ఐషర్ వాహనం బైక్‌ను ఢీకొంది. ఈ ఘటనలో అంజనప్ప(19), అనిల్‌కుమార్ (18)లు సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు.
క్షణ కాలమే ఆలస్యం..
మిత్రులిద్దరూ ఉదయం బైక్‌లో ములకలచెరువు చేరుకోవడం క్షణకాలమే ఆలస్యమైంది. ఆ సమయంలో ఆర్టీసీ బస్సు కదులుతోంది. తొందరగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్న ఆత్రుతతో అదే బస్సును అందుకునేందుకు బైక్‌లో వెంబడించారు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని గమనించక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది.
కన్నీరుమున్నీరైన కుటుంబసభ్యులు
విషయం తెలిసి మృతుల కుటుంబసభ్యులు, బంధువులు ఘటనా స్థలికి చేరుకుని బోరున విలపించారు. వీరివురు నిరుపేద కుటుంబాలకు చెందిన వారు. అనీల్‌కుమార్ తల్లిదండ్రులు ఆదినారాయణ, గంగులమ్మ కూలి పనులు చేసుకుంటూ కొడుకును చదివిస్తున్నారు. వీరికి అనీల్‌కుమార్ ఒక్కడే కుమారుడు. వృద్ధాప్యంలో తమకు చేదోడు వాదోడుగా ఉంటాడన్న ఆశించిన నీరుపేద తల్లిదండ్రులకు తీరని వ్యథ మిగిలింది. ఇక అంజనప్ప కూలి పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఇతని తండ్రి వేమనారాయణ గతంలో మరణించగా తల్లి లక్ష్మీదేవి కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది.
ఎదిగొచ్చిన బిడ్డ రోడ్డుపై విగతజీవిగా పడి ఉండటం చూసిన ఆ తల్లి తల్లడిల్లిపోయింది. మృతదేహాలను చూసి కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎస్‌ఐ శ్రీకాంత్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లెకు తరలించారు. ఈ ఘటనతో సోంపల్లిలో విషాదఛాయలు అలుముకున్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు ఎస్‌ఐ తెలిపారు. ములకలచెరువు సీఐ రుషికేశవ మదనపల్లి ఆస్పత్రికి వెళ్లి మృతుల కుటుంబసభ్యులను పరామర్శించి ఆర్థిక సహాయం ఆందించారు. మృతుల కుంటుంబాలకు ప్రభుత్వం ఆదుకోవాల్సివుంది.