
1993 నుంచి 2009 వరకు: పొడవాటి జుట్టు... ముఖంలో నిర్లక్ష్య ధోరణి... పోలీసులు పక్కనున్నా ధాటిగా మాట్లాడగలిగే తెగింపు...
2009 నుంచి 2012 వరకు: నీట్‌గా కట్ చేసిన హెయిర్... పైకి వినయ విధేయతలు... పోలీసులతో మర్యాద పూర్వక ధోరణి...
హైదరాబాద్, సైబరాబాద్ పోలీసు కమిషనరేట్లతో పాటు శివారు జిల్లాల్లోని పోలీసుస్టేషన్లలో 172 చోరీలు చేసిన మహ్మద్ ఖాజా నయీముద్దీన్ అలియాస్ మారుతి నయీం వ్యవహారశైలి ఇది. పోలీసు విభాగంతో పాటు నగర వాసుల్లో అనేకమందికి ‘సుపరిచితుడైన’ ఈ ఘరానాదొంగ కథ 2012 మే 18న ముగిసింది. ఎప్పటికప్పుడు కొత్త అనుచరులను తయారు చేస్తూ, వరుస చోరీలు చేసే మారుతి నయీం చివరకు ఆ చోరీ సొత్తు పంపకాల్లో జరిగిన గొడవల్లో అనుచరుల చేతిలోనే హతమయ్యాడు.
యాకుత్‌పురలోని నాగాబౌలి ప్రాంతానికి చెందిన మహ్మద్ ఖాజా నయిముద్దీన్ అలియాస్ మారుతి నయీం అలియాస్ అయూబ్ నేర ప్రస్థానం దాదాపు పంతొమ్మిదేళ్లకు పైగా కొనసాగింది. 1993లో చిల్లర దొంగతనాలతో మొదలుపెట్టిన నయీంపై 2012 వరకు 172 కేసులు నమోదయ్యాయి. రికార్డుల్లోకి ఎక్కనివి ఇంకా అనేకం ఉంటాయని పోలీసులు చెబుతుంటారు. నయీంపై రెయిన్‌బజార్ పోలీసుస్టేషన్‌లో నోన్ డెకాయిటీ షీట్ ఉండేది. పేరుకు మాత్రం కారు మెకానిక్‌గా చలామణీ అయ్యే ఇతగాడు నానా నేరాలు చేసేవాడు. 2002 అక్టోబర్‌లో జరిగిన బేగంబజార్‌లోని శాంతి ఫైర్ వర్క్స్ ఉదంతం ఇతని నేరజీవితంలో అతి దారుణమైంది.
ఆ దుకాణంలో దొంగతనానికి వెళ్లి, ఏమీ దొరకలేదనే అక్కసుతో దుకాణంలోని టపాసులకు నిప్పు పెట్టాడు. ఈ దుకాణం పై అంతస్తులో కార్తికేయ లాడ్జి ఉండేది. ఫైర్ వర్క్స్‌లో మొదలైన మంటలు పైకి విస్తరించాయి. దీంతో లాడ్జిలో నిద్రపోతున్న 13 మంది అమాయకులు సజీవ దహనమయ్యారు. ఉదంతం జరిగిన రోజు ఇది షార్ట్‌సర్క్యూట్ ప్రమాదంగా భావించారు. కొన్నాళ్లకు అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అన్ని కేసులున్నా, పోలీసులు మాత్రం అతడికి ఒక్క కేసులోనూ శిక్ష పడేలా చేయలేకపోయారు. పైగా, అతడు సాక్షాత్తు పోలీసుల కస్టడీ నుంచే మూడుసార్లు పరారయ్యాడు.
జైలుకు వెళ్లిన ప్రతిసారీ అక్కడి చిల్లర నేరగాళ్లను చేరదీస్తాడు. వారితో జైల్లోనే ఓ కొత్త ముఠా కట్టి బయటకు వస్తుండటం నయీం నైజం. ఆ ముఠాలో ఉండి, బెయిల్ పొంది బయటకు వచ్చే వారితో తనకూ బెయిల్ ఇప్పించేలా ఒప్పందం కుదుర్చుకుంటాడు. విడుదల చేయించాక వాళ్లతో కలిసే దొంగతనాలు చేస్తాడు. స్నాచింగ్స్, చోరీలు, షట్టర్ లిఫ్టింగ్స్ వంటి నేరాలు చేయడంలో దిట్ట అయిన ఖాజా నయీముద్దీన్‌కు మారుతీ కారుతో అనుబంధం ఉంది. మెకానిక్ కావడంతో తేలిగ్గా కారు చోరీలు చేస్తాడు. ఎక్కువగా మారుతీ కారునే ఎంచుకుని, అందులో తిరుగుతూ దాన్ని షట్టర్‌కు అడ్డుపెట్టి, తాళం పగులకొట్టి దర్జాగా లోపలికి ప్రవేశించి, దుకాణాలను లూటీ చేసేవాడు. అందుకే ‘ఖాజా’ స్థానంలో ‘మారుతి’ వచ్చింది.
పాత నేరగాళ్లతో పాటు ప్రతిసారీ కొత్తగా మరికొందరిని దొంగలుగా తయారు చేస్తుంటాడు. ఒకసారి తన ముఠాలో వాడిన నేరగాళ్లను మరోసారి వినియోగించేవాడు కాదు. వారి ద్వారా తన ఉనికి బయటపడుతుందనే ఉద్దేశంతో వారిని దూరంగా ఉంచేవాడు. చోరీ సొత్తులో కేవలం కొంత మాత్రమే వారికి పంచి ఇచ్చేవాడు. అలా కొన్నాళ్లకు చోర విద్యలో ఆరితేరే వాళ్లు విడిగా ముఠాలు కట్టుకుని నేరాలు చేసే వాళ్లు. మారుతి నయీం 1993–2012 మధ్య 21 సార్లు అరెస్టయ్యాడు. ఇతడు తొలిసారి, చివరిసారి అరెస్టయింది పాతబస్తీలోనే! తొలిసారిగా 1993లో డబీర్‌పుర పోలీసులు అరెస్టు చేశారు.
సీసీఎస్ పోలీసులు 1994, 2000, 2002ల్లో హుమయూన్‌నగర్ పోలీసులు 1996లో, ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు 2001లో, టాస్క్‌ఫోర్స్ పోలీసులు 2005లో, షాహినాయత్‌గంజ్ పోలీసులు 2006 ఏప్రిల్‌లో, తూర్పు–పశ్చిమ మండలాల పోలీసులు సంయుక్తంగా 2006లో అరెస్టు చేశారు. 2011లో ఆయుధచట్టం కింద ఫలక్‌నుమా పోలీసులకు చిక్కాడు. 2009, 2010ల్లో సీసీఎస్, టాస్క్‌ఫోర్స్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఆఖరిగా 2012 జనవరి 12న ఫలక్‌నుమా పోలీసులు మహ్మద్ తారిఖ్, మహ్మద్ ముజాహిద్‌లతో కలిసి అరెస్టు అయ్యాడు. అదే ఏడాది మే 18న హతమయ్యాడు. నగరంలోని దాదాపు అన్ని పోలీసుస్టేషన్ల పరి«ధిలోనూ చేతివాటం ప్రదర్శించిన నయీంపై ఒక్క కేసులోనూ నేర నిరూపణ జరగలేదు.
నేరాల్లో దిట్ట అయిన నయీం నగరానికి చెందిన ఓ వితంతువును పెళ్లి చేసుకున్నాడు. మారుతి నయీంను పట్టుకోవడం అప్పట్లో పోలీసులకు పెద్ద సవాల్ లాంటిది. అతడిని అరెస్టు చేస్తే, ఏమాత్రం ఇంటరాగేషన్ అవసరం లేకుండానే రూ.లక్షల సొత్తు రికవరీ ఇస్తుండేవాడు. బంగారం, వాహనాలు, వెండి, సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ వస్తువులు, నగదు ఇలా అనేకం అతడి నుంచి పోలీసులు స్వాధీనం చేసుకునేవాళ్లు. ఎప్పటికప్పుడు కొత్త అనుచరులను తయారు చేస్తూ, వరుస చోరీలు చేసే మారుతి నయీం చివరకు ఆ చోరీ సొత్తు పంపకాల్లో జరిగిన గొడవల ఫలితంగా అనుచరుల చేతిలోనే హతమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment