1945లో ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) స్థాపన తేదీని గుర్తుచేసుకోవడానికి అక్టోబర్ 16న ప్రతి సంవత్సరం ‘ప్రపంచ ఆహార దినోత్సవం’ జరుపుకొంటున్నాం. ఆకలి, ఆహార భద్రతకు సంబంధించిన ఇతర సంస్థలు... ప్రపంచ ఆహార కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వ్యవసాయ అభివృద్ధికి అంతర్జాతీయ నిధి వంటివి ఈ రోజును ఘనంగా జరుపుకుంటాయి.
ఆకలిని ఎదుర్కోవడానికి, సంఘర్షణ ప్రాంతాలలోశాంతికి దోహదపడటానికి, యుద్ధం సంఘర్షణలకు ఆకలిని ఉపయోగించడాన్ని ఆపడంలో ప్రముఖ పాత్ర పోషించినందుకు ప్రపంచ ఆహార కార్యక్రమం 2020లో నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది.
‘ప్రపంచ ఆహార దినోత్సవం 2024’ యొక్క సారాంశం ‘మెరుగైన జీవితం, మంచి భవిష్యత్తు కోసం ఆహార హక్కు’. 2022 నివేదిక ప్రకారం ఆహార భద్రత కలిగిన మొదటి ఐదు దేశాలు ఫిన్‌లాండ్, ఐర్లాండ్, నార్వే, ఫ్రాన్స్, నెదర్లాండ్‌లు. అత్యంత ఆహార అభద్రత ఉన్న దేశాలు యెమెన్, హైతీ, సిరియాలు. భారతదేశంలో ఆహార భద్రత ప్రధాన ఆందోళన కలిగిస్తోంది. 2022లో, ప్రపంచ ఆహార భద్రతా సూచిక పరంగా 113 ప్రధాన దేశాలలో భారత దేశానికి 68వ స్థానాన్ని ఇచ్చింది. 2024లో, ప్రపంచ ఆకలి సూచిక (జీహెచ్‌ఐ –2024) ప్రకారం 127 దేశాలలో భారతదేశం 27.3 స్కోరుతో 105వస్థానంలో ఉంది. దేశంలో 27 కోట్ల మందిఆకలితో ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం.
భారతీయ జనాభాలో అధిక భాగం వ్యవసాయ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నప్పటికీ, దేశంలో పెరుగుతున్న జనాభా కారణంగా అందరికీ ఆహారం లభించడం సవాలుగా ఉంది. కరవు, వరదల అస్థిర చక్రాలను దేశం అనుభవిస్తున్నందున, వాతావరణ మార్పుల కారణంగా భారతదేశం ఆహార భద్రత ముప్పులో ఉంది. దేశంలో సగటు కంటే కొంచెం ఎక్కువ వర్షపాతం మాత్రమే నమోదవుతున్నప్పటికీ, అవపాతం హెచ్చుతగ్గులు వివిధ ప్రాంతా లలో తీవ్రంగా మారుతూ పంటలను అస్థిరపరుస్తున్నాయి.
ఆహార భద్రతను మెరుగుపరచడానికి... ఆహారాన్ని వృధా చేయడాన్ని తగ్గించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, న్యాయమైన వ్యాపార పద్ధతులను ప్రోత్సహించడం, వైవిధ్యంపై శ్రద్ధ చూపడం, దిగుబడి అంతరాన్ని తగ్గించడం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, ఆహార అభద్రతకు పరోక్ష కారణాలను పరిష్కరించడం వంటి మార్గాలు అవసరం.
– డా. పి.ఎస్. చారి మేనేజ్‌మెంట్ స్టడీస్ ప్రొఫెసర్, తిరుపతి
Comments
Please login to add a commentAdd a comment