world food day
-
World Food Day 2024 : ఆహార భద్రత ఏదీ?
1945లో ఐక్యరాజ్యసమితి ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) స్థాపన తేదీని గుర్తుచేసుకోవడానికి అక్టోబర్ 16న ప్రతి సంవత్సరం ‘ప్రపంచ ఆహార దినోత్సవం’ జరుపుకొంటున్నాం. ఆకలి, ఆహార భద్రతకు సంబంధించిన ఇతర సంస్థలు... ప్రపంచ ఆహార కార్యక్రమం, ప్రపంచ ఆరోగ్య సంస్థ, వ్యవసాయ అభివృద్ధికి అంతర్జాతీయ నిధి వంటివి ఈ రోజును ఘనంగా జరుపుకుంటాయి.ఆకలిని ఎదుర్కోవడానికి, సంఘర్షణ ప్రాంతాలలోశాంతికి దోహదపడటానికి, యుద్ధం సంఘర్షణలకు ఆకలిని ఉపయోగించడాన్ని ఆపడంలో ప్రముఖ పాత్ర పోషించినందుకు ప్రపంచ ఆహార కార్యక్రమం 2020లో నోబెల్ శాంతి బహుమతిని అందుకుంది. ‘ప్రపంచ ఆహార దినోత్సవం 2024’ యొక్క సారాంశం ‘మెరుగైన జీవితం, మంచి భవిష్యత్తు కోసం ఆహార హక్కు’. 2022 నివేదిక ప్రకారం ఆహార భద్రత కలిగిన మొదటి ఐదు దేశాలు ఫిన్లాండ్, ఐర్లాండ్, నార్వే, ఫ్రాన్స్, నెదర్లాండ్‌లు. అత్యంత ఆహార అభద్రత ఉన్న దేశాలు యెమెన్, హైతీ, సిరియాలు. భారతదేశంలో ఆహార భద్రత ప్రధాన ఆందోళన కలిగిస్తోంది. 2022లో, ప్రపంచ ఆహార భద్రతా సూచిక పరంగా 113 ప్రధాన దేశాలలో భారత దేశానికి 68వ స్థానాన్ని ఇచ్చింది. 2024లో, ప్రపంచ ఆకలి సూచిక (జీహెచ్ఐ –2024) ప్రకారం 127 దేశాలలో భారతదేశం 27.3 స్కోరుతో 105వస్థానంలో ఉంది. దేశంలో 27 కోట్ల మందిఆకలితో ఉన్నారు. ఇది ప్రపంచంలోనే అత్యధికం. భారతీయ జనాభాలో అధిక భాగం వ్యవసాయ కార్యకలాపాలలో నిమగ్నమై ఉన్నప్పటికీ, దేశంలో పెరుగుతున్న జనాభా కారణంగా అందరికీ ఆహారం లభించడం సవాలుగా ఉంది. కరవు, వరదల అస్థిర చక్రాలను దేశం అనుభవిస్తున్నందున, వాతావరణ మార్పుల కారణంగా భారతదేశం ఆహార భద్రత ముప్పులో ఉంది. దేశంలో సగటు కంటే కొంచెం ఎక్కువ వర్షపాతం మాత్రమే నమోదవుతున్నప్పటికీ, అవపాతం హెచ్చుతగ్గులు వివిధ ప్రాంతా లలో తీవ్రంగా మారుతూ పంటలను అస్థిరపరుస్తున్నాయి. ఆహార భద్రతను మెరుగుపరచడానికి... ఆహారాన్ని వృధా చేయడాన్ని తగ్గించడం, మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, న్యాయమైన వ్యాపార పద్ధతులను ప్రోత్సహించడం, వైవిధ్యంపై శ్రద్ధ చూపడం, దిగుబడి అంతరాన్ని తగ్గించడం, వాతావరణ మార్పులను ఎదుర్కోవడం, ఆహార అభద్రతకు పరోక్ష కారణాలను పరిష్కరించడం వంటి మార్గాలు అవసరం.– డా. పి.ఎస్. చారి మేనేజ్మెంట్ స్టడీస్ ప్రొఫెసర్, తిరుపతి -
లేబుల్.. డేంజర్ బెల్ చదివితే ఉన్న మతి పోతుంది!
ప్యాకెట్ మీద సగం కోసిన ఆరెంజ్ పెద్ద అక్షరాలతో ‘సి విటమిన్స్ సమృద్ధితో’ అని ఉంటుంది. ‘మీరు ప్యాకెట్ వెనుక ఉన్న లేబుల్ చదవండి’ అంటాడు రేవంత్ హిమత్సింగ్కా. లేబుల్ మీద 0.9 పర్సెంట్ ఆరెంజ్ ఫ్రూట్ ΄పౌడర్ అని ఉంటుంది. అంటే ఒక శాతం ఆరెంజ్, మిగిలిన 99 శాతం కెమికల్. ‘లేబుల్ చదివితే మీరు ఆ విషాన్ని ఇంటికి తేరు’ అంటాడు ఈ హెల్త్ చాంపియన్స్ . ప్రపంచ ఆహార దినోత్సవం సురక్షితమైన ఆహారాన్ని కల్పించుకోమంటోంది. ‘దేశమా... లేబుల్ చదువు’ ఉద్యమం ఒక అవసరమైన చైతన్యం.‘గుర్తు పెట్టుకోండి. ఏది ఎక్కువ రోజులు ప్యాకెట్లో నిల్వ ఉంటుందో అది మనకు ఎక్కువ అపాయం కలిగిస్తుంది’ అంటాడు రేవంత్ హిమత్ సింగ్కా. అమెరికాలో చదువుకుని, మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తూ అవన్నీ వదులుకొని ఇండియాలో ఫుడ్ రెవల్యూషన్ తేవాలని వచ్చేసిన ఈ కోల్‌కతా కుర్రాడు బడాబడా కంపెనీల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాడు. రావడం రావడమే ముందు బోర్నవిటా హెల్త్‌డ్రింక్ కాదని చేసిన వీడియో సంచలనం సృష్టించింది. కేంద్రప్రభుత్వం బోర్నవిటా యజమాని అయిన క్యాడ్‌బరీకి నోటీసు ఇచ్చి ఇకమీదట లేబుల్ మీద హెల్త్ డ్రింక్ అని వేయకూడదని చెప్పింది. ఆ మాట చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు... లేబుల్ చదివి ఉంటే మనకే తెలిసేది అంటాడు హిమత్ సింగ్కా. ఎందుకంటే 400 గ్రాముల బోర్నవిటాలో 50 గ్రాముల చక్కెర ఉంది. లిక్విడ్ గ్లూకోజ్ ఉంది. కృత్రిమ రంగులు ఉన్నాయి. నిల్వకారకాలైన రసాయనాలు ఉన్నాయి. ఇవన్నీ చూపి అతడు సంధించిన ప్రశ్నలకు గొప్ప స్పందన వచ్చింది. ప్రస్తుతం అతడు ప్యాకేజ్డ్ ఫుడ్ మీద చేస్తున్న వీడియోలు అతణ్ణి ఫుడ్ క్రూసేడర్ అని పిలిచేలా చేస్తున్నాయి.పదార్థం గుట్టు ప్యాకెట్ వెనుకకాలం చాలా మారింది. మన తాత, తండ్రులు అంగడికి వెళ్లి సరుకులు తెచ్చుకునేవారు. అవి కొన్నాళ్లకు పాడైపోయేవి. కాబట్టి అవసరమైనంత వరకే తెచ్చుకునేవారు. ఇప్పుడు మాల్, మార్ట్ల కల్చర్ వచ్చింది. ప్యాకేజ్డ్ ఫుడ్ అందుబాటులోకి వచ్చింది. వెళ్లి కొనుక్కొస్తే రెండు మూడు నెలలకు కూడా పాడుకావు. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్‌ను ‘ఎఫ్ఎంసిజి’ (ఫాస్ట్ మూవింగ్ కన్సూ్యమర్ గూడ్స్) అంటారు. వీటిలో కొన్ని ‘ఆరోగ్యకరమైనవి’గా, ‘ఆరోగ్యానికి మేలు చేసేవిగా’ చెప్పుకుని అమ్మకాలు పెంచుకోవాలని చూస్తాయి.‘లేబుల్ మీద చూస్తే అవి మీకు హాని చేసేవిగా తెలుస్తుంది’ అంటాడు హిమత్ సింగ్కా. ఇవాళ దేశానికి ‘కాన్షియస్ కాపిటలిజమ్’ కావాలనేది హిమత్ నినాదం. అంటే బాధ్యతాయుతమైన పెట్టుబడిదారీ వ్యవస్థ. ముఖ్యంగా ఆహార రంగంలో ఈ బాధ్యత మరింత ఎక్కువ ఉండాలంటాడు అతను. ఇవాళ మన దేశం ఏటా 50 వేల కోట్ల రూపాయల పామాయిల్‌ను దిగుమతి చేసుకుంటోంది. దీన్ని ప్యాకేజ్డ్ ఫుడ్‌లో విస్తారంగా ఉపయోగిస్తారు. ‘హార్డ్ ఎటాక్‌లకు పామాయిల్ కూడా ఒక కారణం’ అంటాడు హిమత్.ఇంగ్లిష్‌లో చిన్న అక్షరాల్లోమ్యాంగో జ్యూస్‌ల పేరుతో ఇవాళ ఫేమస్ అయిన రెండు మూడు బ్రాండ్ల లేబుల్స్ చదివితే వాటిలో 20 శాతానికి మించిన మ్యాంగో పల్ప్ లేదని ఆ కంపెనీలే చెప్పడం కనిపిస్తుంది. వైట్ బ్రెడ్ కాదని బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటున్నవాళ్లు లేబుల్ మీద చూస్తే కలర్ వల్ల మాత్రమే అది బ్రౌన్ కాని, వాస్తవానికి అది మైదాపిండి అని తెలుసుకుంటారు. కంపెనీ ఆ మాట చెప్తుందికానీ చిన్న అక్షరాల్లో, ఇంగ్లిష్‌లో చెబుతుంది. పీనట్ బటర్లోప్రోటీన్ సమృద్ధిగా ఉంటుందని యాడ్స్ చెబుతాయి. కాని పీనట్ బటర్లో క్యాలరీలు తప్ప ప్రోటీన్ 3 శాతానికి మించి ఉండదు.మన దేశంలో ఒకలా విదేశాల్లో ఒకలాఒకే వ్యాపార సంస్థ మన దేశంలో చిప్స్‌కు నాసిరకం నూనె, యూరప్‌లో నాణ్యతగల నూనె వాడుతుంది. ఎందుకంటే యూరప్‌లో నియమాలు కఠినంగా ఉంటాయి. అలాగే రెండేళ్ల లోపు పిల్లలకు అమ్మే సెరియల్స్‌లో మనదేశంలో యాడెడ్ సుగర్స్ ఉంటాయి. యూరప్‌లో ఉండవు. రెండేళ్లలోపు పిల్లలకు యాడెడ్ సుగర్స్ ఉన్న ఆహారం అంత మంచిది కాదు. తీపికి అడిక్ట్ అయిన పిల్లలు ఇంట్లో ఆరోగ్యకరమైనది పెట్టినా తినరు. అదీ కంపెనీల ఎత్తుగడ. డబ్బా ఆహారం తినే పసికందులు తర్వాతి కాలంలో స్థూలకాయం, డయబెటిస్‌తో బాధ పడే అవకాశం ఉంటుంది. ‘మా డ్రింక్ రోజూ తాగితే ΄÷డవు పెరుగుతారు’, ‘మా నూనె వాడితే గుండెకు మంచిది’... ఇలాంటివి ఏవీ నమ్మొద్దు అంటాడు హిమత్.దేశమా.. లేబుల్ చదువు...‘మీరు ఏ వస్తువు కొన్నా దాని వెనుక ఉన్న లేబుల్ చదవండి. చెడ్డ పదార్థాలు ఉంటే నాణ్యంగా తయారు చేయమని గొంతు విప్పండి. మనం ఏకమైతే సంస్థలు మారి మంచి ఉత్పత్తులు అందిస్తాయి. మన ఆరోగ్యాలు మెరుగు పడతాయి. అలాగే ప్రకటనలతో సంబంధం లేకుండా కొన్ని కంపెనీలు నాణ్యమైన పదార్థాలు అందిస్తున్నాయి. వాటిని గుర్తించి కొనడం కూడా మన పనే’ అంటాడతను. ఇవాళ ‘వరల్డ్ ఫుడ్ డే’. ‘బలవర్థకమైన, సురక్షితమైన ఆహారం ప్రతి ఒక్కరి హక్కు’. కాని మోసాన్ని గుర్తించడంలో మనమే వెనుక ఉంటే నష్టం మనకే కదా. ‘లేబుల్ పఢేగా ఇండియా’. ఇండియా.. లేబుల్ చదువు.కోర్టు కేసులు ఎదుర్కొంటూప్యాకేజ్డ్ ఫుడ్లోని మోసాలను బయట పెడుతున్నందుకు పెద్ద పెద్ద సంస్థలు హిమత్ మీద కత్తి కట్టాయి. కోర్టుకు ఈడ్చాయి. మొదట్లో భయపడినా ఇప్పుడు లెక్క చేయడం లేదు. ‘నన్ను కోర్టుకు లాగితే మిమ్మల్ని బజారుకు లాగుతా’ అంటున్నాడు హిమత్. కొన్ని కంపెనీలు రకరకాల చోట్ల కేసులు వేసి ఇబ్బంది పెడుతున్నాయి. అంటే తన ఊరి నుంచి కాకుండా వేరే ఊళ్లకు అతడు వాయిదాకు హాజరు కావాలి. -
Madhavi Kattekola: జై జవాన్‌కు టిఫిన్ బాక్స్
సమాజానికి మంచి ఆహారాన్నివ్వాలనుకుంది. ఖాద్యమ్... పేరుతో తినదగిన ఆహారాన్నిస్తోంది. ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’లోనూ నిరూపించుకుంది. దేశ రక్షణ కోసం కొండల్లో గుట్టల్లో డ్యూటీ చేసే సైన్యానికి మంచి ఆహారాన్నిచ్చే బాధ్యత చేపట్టింది. ఈ సందర్భంగా కట్టెకోల మాధవి విజయగాథ. రక్షణరంగంలో విధులు నిర్వర్తించే వారి ఆహారం ఎలా ఉండాలో నిర్దేశించడానికి డీఎఫ్‌ఆర్‌ఎల్‌లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగం పని చేస్తూ ఉంటుంది. ఆ ప్రమాణాల మేరకు ఆహారం తయారు చేయడానికి అనుమతి సాధించారు ఓ తెలుగు మహిళ. ఈ అనుమతి సాధించడానికి ముందు ఆమె ఆహారం మీద అంతులేని పరిశోధన చేశారు. భూమిలో నాటే గింజ నుంచి పంట దిగుబడి, దినుసులను ప్రాసెస్ చేయడం, వండి చల్లార్చి డబ్బాల్లో ప్యాక్ చేయడం వరకు ప్రతిదీ ఒక చేతి మీదుగా నడిచినప్పుడే నిర్దేశించిన ప్రమాణాలను పాటించగలమని నమ్ముతారామె. సేంద్రియ పంట, వంటను ఈ నెల న్యూఢిల్లీలో జరిగిన ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ సదస్సులో ప్రదర్శించి మరోసారి నిరూపించారు. ఈ సందర్భంగా సాక్షితో తన అనుభవాలను పంచుకున్నారు హైదరాబాద్‌లో నివసిస్తున్న కట్టెకోల మాధవి. రైతులు విచిత్రంగా చూశారు! మాది సూర్యాపేట. నాన్న ఉద్యోగ రీత్యా నా చదువు మొత్తం హైదరాబాద్‌లోనే. నిజానికి నా చదువుకి, నేనెంచుకున్న ఈ రంగానికి సంబంధమే లేదు. బీఎస్సీ స్టాటిస్టిక్స్ చేసి కొంతకాలం టీచర్‌గా, ఆ తర్వాత బ్యాంకులో ఉద్యోగం చేశాను. మా వారు మైక్రో బయాలజీ చేసి హిమాలయ సంస్థలో ఉద్యోగం చేశారు. నెలలో ఇరవై రోజులు క్యాంపుల ఉద్యోగం ఆయనది. జీవితం ఇది కాదనిపించేది. మన జ్ఞానాన్ని సరిగ్గా ఒకదారిలో పెడితే గొప్ప లక్ష్యాలను సాధించవచ్చనిపించింది. సొంతంగా ఏదో ఒకటి చేయాలనే నిర్ణయానికి 2009లో వచ్చాం. నాలుగేళ్లపాటు సమాజం అవసరాలేమిటి, అందుబాటులో ఉన్న వనరులేమిటి అని అధ్యయనం చేశాం. సమాజంలో ఆరోగ్యకరమైన ఆహారం తప్ప అన్నీ ఉన్నాయని తెలిసింది. మేము 2014లో గ్రామాలకు వెళ్లి రైతులతో కొర్రలు పండిస్తారా అని అడిగినప్పుడు మమ్మల్ని వెర్రివాళ్లను చూసినట్లు చూశారు. కుగ్రామాలకు వెళ్లి మహిళలకు మా ఉద్దేశాన్ని వివరించాం. విత్తనాల నుంచి పంటకు అవసరమైన ఇన్పుట్స్ అన్నీ మేమే ఇస్తాం, మీరు పండించిన పంటను మేమే కొంటాం... అని భరోసా ఇచ్చాం. దాంతోపాటు వారు పండించే కంది పంట మధ్య చాళ్లలో చిరుధాన్యాలను పండించమని సూచించాం. ఒక కందిపంట సమయంలో చిరుధాన్యాలు మూడు పంటలు వస్తాయి. తమకు నష్టం ఏమీ ఉండదనే నమ్మకంతోపాటు మామీద విశ్వాసం కలిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, రాజస్థాన్, సిక్కిం రాష్ట్రాల్లో మొత్తం 1350 మంది మహిళారైతులు మాతో కలిశారు. గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత 2018లో కంపెనీ ఖాద్యమ్ని రిజిస్టర్ చేశాం. ఖాద్యమ్ అనే సంస్కృత పదానికి అర్థం తినదగినది అని. పంట నుంచి మా ప్రయోగాలు వంటకు విస్తరించాయి. వండి చల్లబరుస్తాం! ఇడ్లీ, సాంబార్, చట్నీ వంటి ఆహార పదార్థాలు యంత్రాల్లోనే తయారవుతాయి. ఉడికిన వెంటనే మైనస్ నలభై డిగ్రీల ఉష్ణోగ్రతకు తీసుకువెళ్లడంతో వాటిలో ఉండే తేమ హరించుకుపోతుంది. ఇలా తయారైన ఆహారం ప్యాకెట్లలో తొమ్మిది నెలల పాటు నిల్వ ఉంటుంది. వేడినీటిలో ముంచితే ఐదు నిమిషాల్లో ఇడ్లీ మెత్తగా మారుతుంది, సాంబార్, చట్నీలు కూడా అంతే. మేము కనుగొన్న విజయవంతమైన ఫార్ములా ఇది. పోహా నుంచి స్పగెట్టీ, పాస్తా వరకు ఒక ఇంట్లో అన్ని తరాల వారూ ఇష్టపడే రుచులన్నింటినీ ఇలాగే చేస్తున్నాం. మొదట్లో రెడీ టూ కుక్ ఉత్పత్తుల మీద దృష్టి పెట్టాం. రోజూ వండి బాక్సు పట్టుకెళ్లడం కుదరని రోజుల్లో రెడీ టూ ఈట్ విధానాన్ని అనుసరించాం. ఆఫీస్‌కి టిఫిన్ బాక్స్ తేలిగ్గా తీసుకెళ్లడానికి, ప్రయాణాల్లో తీసుకెళ్లడానికి మా ఉత్పత్తులు చాలా అనువుగా ఉంటాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే సైన్యం అవసరాలకు తగినట్లు ఆహారాన్ని తయారు చేయడం పెద్ద సవాల్ అనే చెప్పాలి. మైసూర్లో ఉన్న డీఎఫ్ఆర్ఎల్కి ఎన్నిసార్లు వెళ్లామో లెక్క పెట్టలేం. యాభైసార్లకు పైగా వెళ్లి ఉంటాం. విమాన టిక్కెట్ల ఖర్చే లక్షల్లో వచ్చింది. సైంటిస్టులు సూచించిన నియమావళి ప్రకారం తయారు చేయడం, శాంపుల్ తీసుకెళ్లి చూపించడం, వాళ్లు చెప్పిన సవరణలను రాసుకుని హైదరాబాద్ రావడం, మేడ్చల్ దగ్గర బండ మాదారంలో ఉన్న మా యూనిట్లో తయారు చేసి మళ్లీ పట్టుకెళ్లడం... ఇలా సాగింది. మా ప్రయోగాల గురించిన ప్రతి వివరాన్నీ నోట్స్ సమర్పించాం. జీవితంలో ఓ గొప్ప లక్ష్యాన్ని సాధించాలనుకున్నాం, ఆ ప్రయాణంలో మేము లక్ష్యాన్ని చేరేలోపు ఉద్యోగంలో సంపాదించుకున్న డబ్బు రెండు కోట్లకు పైగా ఖర్చయిపోయింది. ఏ దశలోనూ వెనుకడుగు వేయకుండా దీక్షగా ముందుకెళ్లడమే ఈ రోజు విజేతగా నిలిపింది. ఏ– ఐడియా వంటి ప్రభుత్వరంగ సంస్థలు ఆర్థికంగానూ, మౌలిక వసతుల కల్పనలోనూ సహకరిస్తున్నాయి. మా ఉత్పత్తులు ఈ–కామర్స్ వేదికల మీద పన్నెండు దేశాలకు చేరుతున్నాయి. ఢిల్లీలో ఈ నెల మూడు నుంచి ఐదు వరకు ‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ సదస్సు జరిగింది. అందులో స్టాల్ పెట్టమని ప్రభుత్వం నుంచి ఆహ్వానం రావడమే ఈ ప్రయత్నంలో మేము గెలిచామని చెప్పడానికి ఉదాహరణ’’ అని వివరించారు ఖాద్యమ్ కో ఫౌండర్ మాధవి. డీఎఫ్ఆర్ఎల్... డిఫెన్స్ ఫుడ్ రీసెర్చ్ లాబొరేటరీ. కర్నాటక రాష్ట్రం మైసూర్లో ఉన్న ఈ సంస్థ డీఆర్డీవో (డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్)లో ఒక విభాగం. రక్షణరంగంలో విధులు నిర్వర్తించే వారికి నిల్వ ఉండే ఆహారాన్ని సరఫరా చేస్తుంది. పర్వత ప్రాంతాలు, లోయలు, గడ్డకట్టే మంచులో ఉండే ఆర్మీ క్యాంపుల్లో విధులు నిర్వర్తించేవారికి తాజా ఆహారాన్ని అందించడం కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. అలాంటి సమయాల్లో వారి ఆకలి తీర్చేది... ముందుగానే వండి, శీతలపరిచి డబ్బాల్లో నిల్వ చేసిన ఆహారమే. అలా నిల్వ చేసే ఆహారాన్ని తయారు చేయడం అత్యంత క్లిష్టమైన పని. ఆహారం నెలల కొద్దీ నిల్వ ఉండాలి, అందులో పోషకాలు లోపించకూడదు. – వాకా మంజులారెడ్డి ఫొటో : నోముల రాజేశ్ రెడ్డి -
ఇంటర్నేషనల్ ఫుడ్ డే: ఎన్ని టన్నుల ఆహారం వృథా అవుతోందో తెలుసా?
World Food Day 2023: ప్రపంచ ఆహార దినోత్సవం 2023: సరైన ఆహారం , పోషకాహారాన్ని పొందడం మానవ ప్రాథమిక హక్కు. ప్రపంచంలోని మిలియన్ల మంది ప్రజలు సరైన పోషకాహారంలేక, పరిశుభ్రమైననీరు అందుబాటులో లేక నానా కష్టాలుపడుతున్నారు.మరోవైపు ప్రపంచవ్యాప్తంగా టన్నుల కొద్దీ ఆహారం వృధా అవుతోంది. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఈ భూమ్మీద ప్రతి వ్యక్తికి సరైన పోషకాహారం, సరైన ఆహారం లభించేలా అవగాహన పెంచడం, సంబంధిత చర్యలు తీసుకోవడంపై ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా కొన్ని ఇంట్రస్టింగ్ సంగతులు మీకోసం.. 1979లో, FAO సమావేశంలో, ప్రపంచ ఆహార దినోత్సవాన్ని అధికారికంగా ప్రపంచ సెలవుదినంగా ఆమోదించారు. ఆ తర్వాత, 150 కంటే ఎక్కువ దేశాలు ప్రపంచ ఆహార దినోత్సవ ప్రాధాన్యతను గుర్తించాయి. 2023 వరల్డ్ ఫుడ్ డే ధీమ్ ఏంటంటే ‘‘నీరే జీవితం, నీరే ఆహారం... ప్రతీ ఒక్కరికీ ఇది అందుబాటులో ఉండాలి’’ భూమిపై జీవించడానికి నీరు చాలా అవసరం. ఈ భూమిపై ఎక్కువ భాగం, మన శరీరాల్లో 50శాతం పైగా నీరే ఉంటుంది. అసలు ఈ ప్రపంచం ముందుకు సాగాలంటే నీరు లేకుండా సాధ్య పడుతుందా? అలాంటి అద్భుతమైన ఈ జీవజలాన్ని కాపాడుకోవడం చాలా అవసరం. ప్రపంచ జనాభాలో ఎంతమందికి కడుపునిండా భోజనం దొరుకుతోంది? అసలు ఎంత ఆహారం వృథా అవుతోంది మీకు తెలుసా? మీకు తెలుసా... ►ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకుని ఏటా అక్టోబరు 16వ తేదీని ఇంటర్నేషనల్ ఫుడ్ డేను ఆచరిస్తున్నాం. ► ప్రపంచంలో ప్రతి పది మందిలో ఒకరు పోషకాహార లోపాలతో బాధపడుతున్నారు. ప్రపంచ జనాభా 810 కోట్లు కాగా... ఇందులో 300 కోట్ల మందికి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునే స్థోమత కూడా లేదు. ►ఇజ్రాయెల్ - పాలస్తీనా, రష్యా-ఉక్రెయిన్ల మాదిరిగా యుద్ధాలు, వాతావరణ మార్పులు, పెరిగిపోతున్న ధరల కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార భద్రత తగ్గిపోతోంది. ►అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఏటా 130 కోట్ల టన్నుల ఆహార ఉత్పత్తులు వృథా అవుతున్నాయి. ఈ అంశంపై ప్రజల్లో అవగాహన పెరిగితే అన్నార్తులు మరింత మంది ఆకలి తీర్చే అవకాశం ఏర్పడుతుంది. ► కోవిడ్-19 పుణ్యమా అని పేదల ఆర్థిక స్తోమత మరింత దిగజారిపోయింది. ఫలితంగా చాలామందికి ప్రతి రోజూ నాలుగు వేళ్లూ నోట్లోకి వెళ్లడమే కష్టమవుతోంది. Water is not an infinite resource. We need to stop taking it for granted. What we eat and how that food is produced all affect water. On #WorldFoodDay @FAO calls on countries to take greater #WaterAction for food.https://t.co/DKBqAUky9y pic.twitter.com/I3TYWf4LrL — UN Environment Programme (@UNEP) October 16, 2023 ► ఆకలి మనిషి శరీరాన్ని చాలా రకాలుగా ప్రభావితం చేస్తుంది. పోషకాహార లోపం వాటిల్లో ఒకటి మాత్రమే. భారతదేశంలో పోషకాహార లోపాల కారణంగా ఐదేళ్ల లోపు పిల్లల్లో 30 శాతం మంది వారి సామర్థ్యానికి తగ్గట్టు ఎదగలేకపోతున్నారు. ►ఆకలి మన రోగ నిరోధక వ్యవస్థను బలహీన పరుస్తుంది. అనేక ఆరోగ్య సమస్యలకూ కారణమవుతుంది. రక్తహీనత, విటమిన్ లోపాలు వాటిల్లో కొన్ని మాత్రమే. ►మానసిక ఆరోగ్య సమస్యలు తలెత్తేందుకు కూడా ఆకలి కారణమవుతుందంటే చాలామంది ఆశ్చర్యపోతారు కానీ ఇది నిజం. మనోవ్యాకులత (డిప్రెషన్) యాంగ్జైటీ వంటి మానసిక సమస్యలు ఆకలి కారణంగా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతారు. ఇవీ చదవండి: ప్రకృతి ప్రకోపానికి మూల్యం... 12,300 కోట్ల డాలర్లు ఆకలి సూచీలో అధోగతి -
World Food Day: ముక్క తినే ముందు జాగ్రత్త పడండి!
సాక్షి, మహబూబ్‌నగర్: ఎంతో ఇష్టపడి తినే ఆహారం అనారోగ్యం పాలు చేయకూడదు. ఎందుకంటే కొన్ని బయట మార్కెట్లలో ఉన్న హోటల్స్, ఫాస్డ్‌ఫుడ్ సెంటర్లలో కుళ్లిన మాంసాన్ని జనానికి అంటగడుతూ సొమ్ము చేసుకుంటున్నాయి. అందుకే ముక్క తినే ముందు జాగ్రత్త పడండి. నేడు వరల్డ్ ఫుడ్ డే సందర్భంగా ప్రత్యేక కథనం.. చట్టం ఏం చెబుతుంది ఫుడ్ సేప్టీ అండ్ స్టాండర్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 2018 జూలై 10న ది ఈట్ రైట్ మూవ్మెంట్ అనే చట్టం తీసుకువచ్చింది. హోటళ్లు, రెస్టారెంట్లలో ఆహార పదార్థాలను ఆహార తనిఖీ అధికారులు క్రమం తప్పకుండా పరిశీలించాలి. నమూనాలను సేకరించి వాటిని పరీక్షలకు పంపాలి. అనారోగ్యకర పదార్థాలు ఉంటే జరిమానా, లేదంటే హోటళ్లను సీజ్ చేసే అధికారం ఉంది. భోజన హోటళ్లు, రెస్టారెంట్లు, మటన్, చికెన్ దుకాణాలకు చాలా వరకు అనుమతులు లేవు. ట్రేడ్ లైసెన్సు తీసుకోకుండానే దర్జాగా వ్యాపారం చేస్తున్నారు. కొన్ని హోటల్స్ కనీస నిబంధనలు పాటించడం లేదు. ఎన్ఓసీ, పారిశుద్ధ్య ధ్రువపత్రాలు కచ్చితంగా తీసుకోవాలి. ► వంటలు చేసే గదులు, వంటపాత్రలు పరిశుభ్రంగా పెట్టుకోవాలి. కనీసం ఆరు నెలలకు ఒకసారైనా గోడలు అంతా శుభ్రం చేసి పెయింట్ వేయాలి. ► హోటళ్లలో పని చేసే సిబ్బందికి ఎలాంటి రోగాలు లేవని వైద్యుడి నుంచి ధ్రువపత్రం తీసుకోవాలి. ► ఎలుకలు, బొద్దింకలు, పంది కొక్కులు, ఈగలు, దోమలు గదుల్లోకి లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. గాలి, వెలుతురు వచ్చేలా చూసుకోవాలి. ► తాజాగా ఉన్న ఆహార పదార్థాలే వంటల కోసం వినియోగించాలి. ► ఆహారం నిల్వ చేసినా, ఉడికించినా ని ర్ణీత సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రతలు పాటించాలి. ► ఉడికించి చల్లార్చిన ఆహారంలో బ్యాక్టీరియా ఎక్కువగా విస్తరించే అవకాశం ఉంది. చల్లారాక వేడి చేసినప్పుడు ప్రతి ముక్కా పూర్తిగా వేడి అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవాలి. ► మాంసం తరిగిన కత్తితో కూరగాయలు కోయకూడదు. రిఫ్రిజిరేటర్లో శాఖాహార, మాంసాహార పదార్థాలు వేర్వేరుగా నిల్వ ఉంచాలి. ఆరోగ్య సమస్యలు వస్తాయి కల్తీ, నిల్వ ఉంచిన మాంసంతో, కూరగాయాలతో చేసిన వంటకాలు తింటే తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిల్వ చేసిన మాంసంలో సాల్మొనెల్లా, ఈకోలి వంటి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుంది. ఇది తింటే ఆహారం విషతుల్యమై ప్రాణాల మీదకు రావొచ్చు. డయేరియా, కలరా, నీళ్ల విరోచనాలు, వాంతులు దారి తీయవచ్చు. ఆధునిక కాలంలో ప్రజలు ఆరోగ్యకరమైన పోషకాహారాన్ని పక్కన పెడుతూ, వ్యాధులు ప్రబలడానికి కారణభూతమవుతున్న భోజనానికి పెద్దపీట వేస్తున్నారు. చిరుధాన్యాలతో కూడిన అల్పాహారాన్ని వదిలిపెట్టి భోజనం తీసుకుంటుండటంతో అనారోగ్యానికి లోనవుతున్నారు. ప్రధానంగా గ్రామీణా మహిళలు ఐరన్, కాల్షియం లోపంతో రక్తహీనత, పురుషులు ప్రోటీన్లు, ఖనిజాలు, విటమిన్లతో కూడిన ఆహారం తీసుకోలేక గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం, చర్మ, క్యాన్సర్ తదితర దీర్ఘకాలిక రోగాలభారిన పడుతున్నారు. ఆరోగ్యవంతంగా ఉండాలంటే చిరుధాన్యాలతో కూడిన ఆహారం తీసుకోవాలి. – డాక్టర్ బాల శ్రీనివాస్, జనరల్ ఫిజిషియన్ ఆహారం కల్తీ కోళ్ల ఫారాల్లో జబ్బుపడి చనిపోయిన కోళ్లను తక్కువ ధరకే కొని వాటిని అసలైన చికెన్‌లో కలుపుతున్నారు. ఇక కొన్ని కోళ్ల ఫారాల్లో తక్కువ సమయంలో ఎక్కువ బరువు పెరగడానికి మందులు వినియోగిస్తున్నారు. ఇది ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ► మటన్‌లో పశుమాంసం, జబ్బు పడి చనిపోయిన గొర్రెలు, మేకల మాంసాన్ని కల్తీ చేస్తున్నారు. జాగ్రత్తగా గమనిస్తే మాంసం తాజాదనం, రంగును బట్టి కల్తీ గుర్తించే వీలుంది. ► చేపలు ఎక్కువగా ఐస్‌లో నిల్వ చేసి విక్రయిస్తుంటారు. కొన్నిసార్లు రోజుల తరబడి నిల్వ ఉంటాయి. తాజా సరుకులో ఇలాంటి వాటిని కలిపి అమ్ముతారు. సాధారణంగా చేపను తాకినప్పుడు మెత్తగా అనిపించినా, మొప్పల లోపల భాగం ఎర్రగా కాకుండా నల్లగా మారినా నిల్వ కింద లెక్క. రంగులతో మాయ చాలా హోటళ్లు, రెస్టారెంట్లు రంగులతో మాయ చేస్తుంటాయి. నిల్వ ఉన్న, కుళ్లిపోయిన మాంసాన్ని రంగుల్లో ముంచి, ఉప్పు, కారం దట్టించి వేడి చేసి తాజాగా వడ్డిస్తుంటారు. ఆకలిలో గమనించకుండా చాలా మంది తినేస్తుంటారు. రాత్రి వేళలలో రంగులు తప్ప వాటిని నాణ్యత గుర్తించలేని పరిస్థితి. తినేటప్పుడు కాస్త జాగ్రత్తగా గమనిస్తే తెలిసిపోతుంది. చాలా రోజులపాటు నిల్వ ఉన్న చికెన్, మటన్ రుచిలో తేడా కచ్చితంగా ఉంటుంది. అవగాహన కల్పిస్తాం.. ఆరోగ్యానికి పోషకాలతో కూడిన నాణ్యమైన ఆహారం ఎంతో అవసరం. ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధతో విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించాలి. మండల స్థాయిలో కార్యక్రమాల అమలుపై డాక్యుమెంటరీ సమర్పించాలని ఎంఈవోలకు ఆదేశించాం. కార్యక్రమ విజయవంతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. – గోవిందరాజులు, డీఈఓ, నాగర్‌కర్నూల్ -
World Food Safety Day: సంపాదనే ముఖ్యం.. అందుకోసం ఏమైనా కల్తీ చేస్తారు
డబ్బు సంపాదనే వారికి ముఖ్యం. అందుకోసం ఆహారంలో ఏమైనా కల్తీ చేస్తారు. దీని వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసినా ఏ మాత్రం చలించరు. కస్టమర్లను మళ్లీ మళ్లీ రప్పించుకోవడమే లక్ష్యంగా ఆహార పదార్థాల విక్రయ కేంద్రాల నిర్వాహకులు ప్రమాదకర రంగులు, పదార్థాలను కలిపేందుకే తెగబడుతున్నారు. అధికారులకు సైతం ఈ విషయం తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నేడు వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా ప్రత్యేక కథనం. కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలుజిల్లాలో చిన్నా పెద్దా హోటల్స్, రెస్టారెంట్స్, డాబాలు, చాట్, నూడల్స్ షాపులు అన్నీ కలుపుకుని దాదాపు 9 వేలకు పైగా ఉంటాయి. ఒక్క కర్నూలు నగరంలోనే 1500 దాకా హోటళ్లు, దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాలు ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి 2006 చట్టం మేరకు లైసెన్స్ తీసుకుని, ఆ శాఖ నిబంధనల ప్రకారం ఆహారం తయారు చేయాలి. ఈ శాఖలోని అధికారులు ఏడాదికి 350 శ్యాంపిల్స్ సేకరించాల్సి ఉన్నా నామమాత్రంగా పనిచేస్తున్నారు. నెలకు ఐదు నుంచి ఆరు శ్యాంపిల్స్ తీసి చేతులు దులుపుకుంటున్నారు. గత మూడు నెలలుగా జిల్లాల పునర్విభజన పేరుతో ఒక్క శ్యాంపిల్ కూడా తీయలేదు. సిబ్బంది తక్కువగా ఉన్నారని, కోర్టు డ్యూటీల ఉన్నాయని పేర్కొంటూ తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి సేకరించి ప్రయోగశాలకు పంపిన శ్యాంపిల్స్ రెండు, మూడు నెలలకు గానీ నివేదికలు రావడం లేదు. దీంతో ఏ ఒక్కరిపైనా వీరు సరైన చర్యలు తీసుకోవడం లేదు. దీనికితోడు హోటల్, రెస్టారెంట్, ఇతర ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి అనుమతి తీసుకోవాలి. కానీ జిల్లాలో ఇలా అనుమతి తీసుకుని వ్యాపారం చేసే సంస్థలు నూటికి పాతిక శాతానికి మించి ఉండటం లేదు. ఉత్పత్తి కేంద్రాలైతే ఏడాదికి రూ.3వేలు, విక్రయ కేంద్రాలు రూ.2వేలు, తోపుడు బండ్లు రూ.100లు చెల్లించి అనుమతులు పొందాల్సి ఉన్నా ఆ పనిచేయడం లేదు. కొన్ని పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు మినహా అధిక శాతం హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రోడ్డుసైడు హోటళ్లలో పరిశుభ్రత గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. యథేచ్ఛగా రంగులు, టేస్టీ సాల్ట్ వాడకం జిల్లాలోని స్వీట్స్ తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో అనుమతిలేని రంగులను, టేస్టీసాల్ట్ (అజినోమోటో)ను వాడుతున్నారు. వాస్తవంగా ఆహార పదార్థాల్లో వాడే రంగు(బుష్‌పౌడర్)ను ఒక కిలోకు 0.001మి.గ్రా వాడాలి. పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించాలన్న దురుద్దేశంతో కిలోకు 10 నుంచి 20 మి.గ్రా కలుపుతున్నారు. దీంతో పాటు మెటాలిక్ ఎల్లోను సైతం వాడుతున్నారు. వీటిని తిన్న వారికి క్యాన్సర్ వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకునే వారు లేరు. చదవండి: (Nandyal TDP: టీడీపీలో వర్గ పోరు) అలాగే ప్రమాదకర అజినోమోటో(టేస్టీసాల్ట్)ను రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో విచ్చలవిడిగా వాడుతున్నారు. వీటిని తిన్న వారు క్యాన్సర్, జీర్ణకోశ సమస్యలతో పాటు సంతానలేమి సమస్యలు, సెక్స్ సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ఇటీవల అధికారులు కృష్ణానగర్, పార్కురోడ్డు, సెంట్రల్ప్లాజా సమీపాల్లోని పలు దుకాణాలు, హోటల్లలో దాడులు నిర్వహించి నోటీసులు జారీ చేసినా వ్యాపారుల్లో మార్పు రాలేదు. హోటళ్లు, బిర్యానీ సెంటర్లకు ఇవీ నిబంధనలు ►వ్యాపారులు ఫుడ్ సేఫ్టీ స్టాండర్స్ అథారిటీఆఫ్ ఇండియా లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. లైసెన్స్ లేకపోతే తనిఖీల్లో దొరికినప్పుడు సెక్షన్ 63 ప్రకారం ఫుడ్ సేఫ్టీ కమిషన్ ద్వారా క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తారు. నేరం రుజువైతే 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.5లక్షల జరిమానా విధిస్తారు. ►ఆహార పదార్థాలను తనిఖీ చేసేటప్పుడు నాలు గు భాగాలుగా విభజిస్తారు. అన్ సేఫ్, సబ్ స్టాండర్డ్, మిస్ బ్రాండెడ్, మిస్లీడింగ్ విభాగాల కింద అధికారులు శ్యాంపిల్స్ సేకరిస్తారు. ►వ్యాపార ప్రకటనల్లో సూచించినట్లుగా ఆహారంలో ప్రమాణాలు లేకపోతే దానిని మిస్లీడింగ్ గా పరిగణిస్తారు. ►ఆహార పదార్థాల రంగు కోసం ప్రకృతి సిద్ధమైన రంగులు వాడాలి. రసాయనాలు కలిపిన రంగులు వాడకూడదు. ►ఆహార పదార్థాల తయారీకి టేస్టింగ్ సాల్ట్స్ వాడకూడదు. రోజువారీ వాడే ఉప్పునే వాడాలి. ►అలాగే అన్ని రకాల హోటళ్లు, రెస్టారెంట్లలో లోపలి భాగం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. వంటగదిలో డ్రైనేజీ వసతి బాగుండాలి. అనుమతులు తప్పనిసరి తినుబండారాల వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ సి.క్యాంపులోని తమ కార్యాలయంలో తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. చట్టప్రకారం అనుమతి ఉన్న రంగులు, పదార్థాలనే ఆహార పదార్థాల్లో వాడాలి. రుచి కోసం చాలా మంది టేస్టీసాల్ట్ వాడుతున్నారని ఫిర్యాదులున్నాయి. ఇది చట్టరీత్యానేరం. ఇకపై జిల్లా లో ముమ్మర దాడులు నిర్వహించి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాము. –శేఖర్‌రెడ్డి, డిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఉమ్మడి కర్నూలు జిల్లా కలర్స్‌తో క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఆహార పదార్థాల్లో రంగు, రుచి కోసం వాడే కలర్స్(బుష్‌పౌడర్ ) వల్ల పాంక్రియాస్, లివర్, పిత్తాశయ క్యాన్సర్లు వచ్చే అవకాశం ఉంది. కొన్నిచోట్ల టేస్టీ సాల్ట్‌లో పందిమాసంతో తయారు చేసిన పదార్థాన్ని కల్తీ చేస్తున్నారు. దీంతో పాటు అజినోమోటో సాల్ట్‌ను వాడటంతో జీర్ణాశయ, సంతానలేమి, సెక్స్ సమస్యలు వస్తాయి. కాబట్టి బయటి ఆహార పదార్థాల వినియోగంలో ప్రజలు తగు జాగ్రత్త వహించాలి. –డాక్టర్ పి. అబ్దుల్ సమద్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, కర్నూలు -
హంగర్ ఇండెక్స్‌లో దిగజారిన ఇండియా: ముంచుకొస్తున్న ఆకలి భూతం
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ఆకలి తీర్చడమే వరల్డ్ ఫుడ్ డే ప్రధాన లక్ష్యం. ప్రపంచవ్యాప్తంగా 150 కి పైగా దేశాలు ఈ కార్యక్రమంలో పాల్గొంటాయి. అందరికీ ఆరోగ్యకరమైన ఆహారం అంటూ ప్రతీ ఏడాది లాగానే ‘‘ఆరోగ్యకరమైన రేపటి కోసం ఇప్పుడు సురక్షితమైన ఆహారం" అనే థీమ్‌ను నిర్ణయించారు. ఆహారాన్ని ఆదా చేయడం, వ్యర్థాలను తగ్గించడం, వ్యవసాయం, ఆరోగ్యకరమైన ఆహార పదార్థాల అభివృద్ధిని పెంచడం అనేది లక్ష్యం. తద్వారా భవిష్యత్తు తరాల కోసం ప్రపంచంలోని అనేక ప్రాంతాలలో ప్రబలంగా ఉన్న పోషకాహారలోప సమస్యను నిర్మూలించాలనేది ప్రధానోద్దేశం. వరల్డ్ ఫుడ్ డే : చరిత్ర, ప్రాధాన్యత ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ (ఎఫ్ఏఓ) 1945లో స్థాపితమైంది. దీనికి గుర్తుగా ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పాటిస్తున్నారు. 1979 నుండి ప్రతి సంవత్సరం అక్టోబర్ 16న ప్రపంచ ఆహార దినోత్సవాన్ని జరుపుకుంటారు. హంగేరియాకు చెందిన మాజీ వ్యవసాయ, ఆహార మంత్రి డాక్టర్ పాల్ రోమానీ సూచన మేరకు ప్రపంచవ్యాప్తంగా 150కి పైగా దేశాలు ఈ డేను జరుపుకుంటాయి. దాదాపు 821 మిలియన్ల ప్రజలు దీర్ఘకాలికంగా పోషకాహార లోపంతో ఉన్నారు. వీరిలో దాదాపు 99 శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో నివసిస్తుండటం గమనార్హం. ప్రపంచంలో ఆకలితో ఉన్నవారిలో 60శాతం మంది మహిళలు. ప్రతి సంవత్సరం దాదాపు 20 మిలియన్ల మంది పిల్లలు తక్కువ బరువుతో పుట్టారు. ఇందులో కూడా 96.5శాతం మంది అభివృద్ధి చెందుతున్న దేశాలలో ఉన్నారు. అది కూడా ప్రతి ఐదు జననాలలో ఒకటి సరైన వైద్య సదుపాయం లేనందు వల్ల చనిపోతున్నారు. ఫలితంగా పిల్లల్లో మరణాలలో దాదాపు 50శాతం మంది 5 సంవత్సరాల లోపే ఉంటున్నాయి. ఎయిడ్స్, మలేరియా, క్షయ వ్యాధి కారణగా సంభవిస్తున్న మరణాలకంటే ఆకలి కారణంగా ప్రపంచవ్యాప్తంగాఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. ప్రతి రోజు, 10,000 మందికి పైగా పిల్లలతో సహా 25,000 మంది ఆకలి, సంబంధిత కారణాలతో మరణిస్తున్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభా 9.6 బిలియన్లకు చేరుకుంటుందని అంచనా. ఈ నేపథ్యంలో ఆహార ఉత్పత్తని పెంచడం అంటే తక్కువ ప్రాంతంలో ఎక్కువ ఆహారాన్ని ఉత్పత్తి చేసే పద్ధతులు ముఖ్యంగా సహజ వనరులను ఉపయోగించాలినేది లక్ష్యం. మెరుగైన పంట, నిల్వ, ప్యాకింగ్, రవాణా, మౌలిక సదుపాయాలు, మార్కెట్ యంత్రాంగాలతో పాటు, సంస్థాగత చట్టపరమైన చర్యల తో అనేక కార్యక్రమాల ద్వారా తుది వినియోగానికి ముందు ఆహార నష్టాలను తగ్గించాలని నిర్ణయించింది. గ్లోబల్ హంగర్ ఇండెక్స్ మరోవైపు గ్లోబల్ హంగర్ ఇండెక్స్‌లో ఇండియా మరింత దిగజారింది. ప్రపంచ ఆకలి సూచిక (జీహెచ్ఐ) 2021లో 116 దేశాలలో భారతదేశం 101వ స్థానానికి పడి పోయింది. తాజా నివేదిక ప్రకారం 94వ స్థానం 101కి దిగజారింది. తద్వారా పొరుగు దేశాలైన పాకిస్తాన్, బంగ్లాదేశ్ , నేపాల్ కంటే కూడా ఇండియా వెనుకబడి ఉంది. బ్రెజిల్, చిలీ, చైనా. క్యూబా కువైట్ సహా పద్దెనిమిది దేశాలు జీహెచ్ఐ స్కోరు తొలి అయిదు టాప్ ర్యాంక్‌లో నిలిచాయని ఆకలి, పోషకాహారలోపాలను లెక్కించే గ్లోబల్ హంగర్ ఇండెక్స్ వెబ్సైట్ గురువారం తెలిపింది. అంతేకాదు ఇండియాలో ఆకలి స్థాయి ఆందోళనకరంగా ఉందని పేర్కొంది. దేశంలో కరోనా వైరస్ మహమ్మారి, సంబంధిత ఆంక్షల ప్రభావంతో ప్రజలు తీవ్రంగా నష్ట పోతున్నారనీ, ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే పోషహార లోపంతో బాధపడుతున్న పిల్లల రేటు అత్యధికంగా ఉన్న దేశం ఇండియానే అని నివేదిక పేర్కొంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 47 ప్రకారం దేశంలో పోషకాహార ప్రమాణాలను కాపాడటం ప్రభుత్వాల విధి. -
‘ప్రకృతి’ రైతుకు అంతర్జాతీయ ఖ్యాతి
సాక్షి, అమరావతి/తెనాలి: కాకానీస్ స్టోరీ.. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ (ఎఫ్ఏవో) ప్రపంచవ్యాప్తంగా శుక్రవారం ప్రసారం చేయనున్న లఘుచిత్రం/న్యూస్ స్టోరీ శీర్షిక ఇది. ఫుడ్ హీరోస్ ప్రచారంలో భాగంగా ప్రకృతి వ్యవసాయంలో చక్కటి ఫలాలు అందుకుంటున్న ఓ రైతు కృషి, తోటి రైతులను ప్రభావితం చేస్తున్న తీరును ప్రతిబింబించిన కథనమిది. ఇప్పటికే ఇన్‌స్టాగ్రామ్‌లో 40 వేల మందికి పైగా వీక్షించిన ‘కాకానీస్ స్టోరీ’ కథానాయకుడు ఓ తెలుగోడు. తెనాలి రైతు. పేరు కాకాని శివన్నారాయణ. రోమ్ ప్రధాన కేంద్రంగా కలిగిన యునైటెడ్ నేషన్స్ ఎఫ్ఏఓ సంస్థ బృందం.. ప్రకృతి వ్యవసాయంపై డాక్యుమెంటరీ కోసమని రెండేళ్ల క్రితం రాష్ట్రంలో పర్యటించింది. కృష్ణానదీ తీరంలో పర్యటిస్తున్న సమయంలో అప్పటికే చాలాచోట్ల భారీ గాలులు అరటి తోటల్లో చెట్ల వెన్ను విరిగింది. కానీ, తీరానికి దగ్గరలోని కొల్లిపర మండలం అన్నవరం గ్రామంలో శివన్నారాయణ అరటి తోట ఆరోగ్యంగా నిలబడే ఉంది. రైతును కలిసి సమాచారం సేకరించి, వీడియో రికార్డు చేశారు. అర ఎకరం భూమిలో పసుపు/అరటి సాగుతో నష్టపోతూ వస్తున్న శివన్నారాయణ.. తాను ప్రకృతి వ్యవసాయం చేపట్టి, ఎలా లాభాల బాట పట్టిందీ అందులో వివరించాడు. రసాయన ఎరువులను మానేసి, ఘన, జీవామృతాల వినియోగంతో పెట్టుబడి రూ.20 వేల నుంచి రూ.3,500కు తగ్గిన వైనాన్ని వివరించి, ఆశ్చర్యపరిచాడు. అంతర పంటలుగా కూరగాయలు వేస్తూ, ఏటా రూ.70-80 వేల ఆదాయం తీస్తున్న విధానాన్నీ పూసగుచ్చాడు. ప్రకృతి వ్యవసాయంతో భూమి గుల్లబారి, చేలో ఎక్కువ ఎరలుండటాన్నీ చూపాడు. అధికారుల ప్రోత్సాహంతో ఇంటర్నల్ క్లస్టర్ రిసోర్స్ పర్సన్‌గా ఇప్పుడు తోటి రైతులకు ఈ విధానంలో శివన్నారాయణ శిక్షణనిస్తున్నాడు. అందుకే ఫుడ్ హీరోస్ ప్రచారంలో ఎఫ్ఏవో సంస్థ.. ‘వ్యవసాయ క్షేత్రమనే పాఠశాల నుంచి రైతు, వ్యవసాయ శాస్త్ర శిక్షకుడిగా మారినప్పుడు..’ అంటూ ‘కాకానీస్ స్టోరీ’ గా శివన్నారాయణ కథనాన్ని రూపొందించటం విశేషం. ఇదే సందర్భంగా గుంటూరు జిల్లా కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ శుక్రవారం శివన్నారాయణను గుంటూరులో సత్కరించనున్నట్లు ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజరు కె.రాజకుమారి తెలిపారు. మరోవైపు.. ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా భారత్‌లో ఎఫ్ఏవో 75వ వార్షికోత్సవ, ప్రపంచ ఆహార దినోత్సవ స్మారక నాణాన్ని ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. ఎందుకీ దినోత్సవం.. అంతర్జాతీయంగా ఆహార సంక్షోభాన్ని నివారించేందుకు ఎఫ్ఏవో 1979లో ఈ దినోత్సవాన్ని ప్రకటించింది. పోషకాహార లోపం, సూక్ష్మపోషక లోపాలు, అధిక బరువు, పర్యావరణ, భూసార పరిరక్షణ, అందరికీ ఆహారం లక్ష్యంతో ఆహార దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు రైతు సాధికార సంస్థ సీఈవో డాక్టర్ విజయ్‌కుమార్ తెలిపారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ మందికి తిండి గింజల్ని అందించేలా ఏపీ సర్కారు కూడా ప్రణాళికలు రచించినట్లు ఆయన వివరించారు. ప్రకృతి సాగు. సహజ వనరులు, జీవవైవిధ్యాన్ని కాపాడడంతో పాటు వాతావరణ మార్పు వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి రైతుల్ని సిద్ధంచేస్తున్నామన్నారు. -
బాగా బతకాలంటే ఇవి తెలుసుకోండి..!
తిండి కలిగితే కండ కలదోయ్.. కండ కలవాడే మనిషోయ్.. అని అప్పుడెప్పుడో ఓ మహాకవి కవితలు అల్లేశారు గానీ.. ఈ కాలంలో ఇదో సమస్య. ఏం తినాలి? ఏం తినకూడదన్న అవగాహన చాలా మందిలో లేదు అందుకే అటు పట్టణాల్లో.. ఇటు పల్లెల్లోనూ రక్తపోటు, మధుమేహం, గుండెజబ్బుల్లాంటివి పెచ్చరిల్లుతున్నాయి. నేడు ‘ప్రపంచ ఆహార దినోత్సవం’సందర్భంగా తిండి సంగతులు కొన్ని చెప్పుకుందాం.. చురుకైన, జబ్బుల ప్రమాదం తక్కువగా ఉన్న జీవితం కావాలనుకుంటున్నారా? అయితే సురక్షితమైన, పోషకాలతో కూడిన, వైవిధ్యభరితమైన ఆహారం తీసుకోండి. పండ్లు, కూరగాయలు, పప్పుధాన్యాలతో పాటు గింజలు, విత్తనాలు, పల్లీలు, శనగలు, ఉలవలు, బొబ్బర్లు, జీడిపప్పు, బాదం, వాల్నట్స్ వీలైనంత రోజూ తీసుకోండి. భారతీయులు రోజూ కనీసం 400 గ్రాముల కాయగూరలు, పండ్లు తీసుకోవాలని భారత పోషకాహార సంస్థ చెబుతోంది. రాగులు, జొన్నలు, వరి, గోధుమ వంటి ధాన్యాన్ని మరపట్టించకపోవడం మేలు. కొవ్వులు, మరీ ప్రత్యేకంగా సంతృప్త కొవ్వులు, చక్కెర, ఉప్పు వాడకాన్ని మితంగా ఉంచుకోవడం మేలు. ఆరోగ్యంలో పౌష్టికాహారం పాత్ర ఎంత ఉందో.. తగు మోతాదులో రోజూ వ్యాయామం చేయడం కూడా అంతే ముఖ్యం. మరిన్ని వివరాల కోసం జాతీయ పోషకాహార సంస్థ సిద్ధం చేసిన వెబ్‌పేజీ http://te.vikaspedia.in/health/nutrition చూడండి. ఏ ఆహారంతో ఎలాంటి ప్రయోజనం ఉంటుందో. కొన్ని ఆరోగ్య సమస్యలను ఆహారంతో ఎలా అధిగమించవచ్చో ఇందులో విపులంగా అందించారు. మీరు తినే ఆహారంతో ఎన్ని కేలరీలు అందుతున్నాయో తెలుసు కోవాలనుకుంటే.. http://count&what&you&eat.ninindia. org:8080/CountWhatYouEat/Receipes.do లింక్ వాడండి. మీకు తెలుసా..? భూమ్మీద మనిషి తినగలమొక్క జాతుల సంఖ్య 30,000 సాగవుతున్న పంటల సంఖ్య 200 50 శాతం కేలరీలు అందిస్తున్న పంటలు 8 రకాలు (బార్లీ, బీన్స్, వేరుశనగ, మొక్కజొన్న, బంగాళదుంప,, వరి, జొన్న, గోధుమ) ఊబకాయ సంబంధిత ఆరోగ్య సమస్యలపై ప్రపంచవ్యాప్తంగా ఏటా ప్రభుత్వాలు పెడుతున్న 140లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నాయి అసాంక్రమిక వ్యాధులతో జరిగే మరణాల్లో అనారోగ్యకరమైన ఆహారం , శారీరక శ్రమలేమితో జరిగేవి ముందు వరుసలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆకలితో బాధపడుతున్న వారి సంఖ్య 82కోట్లు పోషకాహార లోపం కారణంగా సామర్థ్యానికి తగ్గట్టు ఎదగని ఐదేళ్లలోపు పిల్లలు 14.9కోట్లు అధిక ఆహారం కారణంగా సమస్యలు ఎదుర్కొంటున్న ఐదేళ్ల లోపు పిల్లలు 4.9కోట్లు ఊబకాయ సమస్యతో ఉన్న వాళ్లు 67కోట్లు ఊబకాయులైన (5 –19 మధ్య వయస్కులు) పిల్లల సంఖ్య 12కోట్లు ఊబకాయులుగా ఉన్న ఐదేళ్లలోపు పిల్లలు 4కోట్లు -
మస్తు.. ఆకలి పస్తు
ఆధునిక ప్రపంచం వివిధ రంగాల్లో శరవేగంగా ప్రగతిపథంలో దూసుకుపోతోంది. ఒకవైపు అంతరిక్ష ప్రయోగాలు విజయవంతంగా సాగుతున్నా, మరోవైపు ఆకలికేకలు వినిపిస్తూనే ఉన్నాయి. జనాభాలో చాలామంది తగిన పోషకాహారానికి నోచుకోలేకపోతున్నారు. కొందరు అర్ధాకలితో అలమటిస్తున్నారు. ఇప్పటికీ అక్కడక్కడా ఆకలిచావులు నమోదవుతూనే ఉన్నాయి. మొన్నటికి మొన్న మధ్యప్రదేశ్‌లో ఒక ఎనిమిదేళ్ల బాలుడు ఆకలితో అలమటిస్తూ కన్నుమూశాడు. ఆకలి సమస్యను నిర్మూలించడమే ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు ఉన్న అతిపెద్ద సవాలు. ఈ ఏడాది ప్రపంచ ఆహార దినోత్సవం సందర్భంగా దాదాపు 150 దేశాలు ఆకలి సమస్య నిర్మూలన కోసం నిబద్ధతను ప్రకటిస్తూ విస్తృతంగా కార్యక్రమాలను నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నాయి. ఆధునిక వ్యవసాయ పద్ధతులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఆహార ధాన్యాల ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. అక్కడక్కడా కరువు కాటకాలు, అతివృష్టి అనావృష్టి పరిస్థితులు ఏటా ఎదురవుతూనే ఉన్నా, ఆహార ధాన్యాల ఉత్పత్తి ఆశాజనకంగానే ఉంటోంది. పంపిణీ, నిల్వ సజావుగా సాగితే ఆకలిచావులు సంభవించే పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండదు. దురదృష్టవశాత్తు ఆహార ధాన్యాల పంపిణీ, నిల్వ సక్రమంగా సాగుతున్న దాఖలాలే తక్కువ. మనుషుల మధ్య ఆర్థిక వ్యత్యాసాలు నానాటికీ పెరుగుతుండటం కూడా ఆకలి సమస్యకు కారణమవుతోంది. భూతాపం పెరుగుతుండటం వల్ల కొన్నిచోట్ల వాతావరణంలో చోటు చేసుకుంటున్న అనూహ్య మార్పులు ఆహార ధాన్యాల ఉత్పాదనపై ప్రతికూల ప్రభావం చూపుతున్నాయి. అయితే, ఆధునిక శాస్త్ర పరిశోధనలు ఈ పరిస్థితిని సమర్థంగానే ఎదుర్కోగలుగుతున్నాయి. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకుని మంచి దిగుబడులను ఇవ్వగల వంగడాలను ఎప్పటికప్పుడు శాస్త్రవేత్తలు అందుబాటులోకి తెస్తూనే ఉన్నారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా కొన్నిచోట్ల ఆహార ధాన్యాలకు కొరత ఏర్పడుతుంటే, మరికొన్ని చోట్ల సరైన సాధానాసంపత్తి కరువవడం వల్ల తిండిగింజలు వినియోగానికి దక్కకుండాపోతున్నాయి. ప్రపంచంలో కొందరు ఆకలితో అలమటిస్తుంటే, ఇంకొందరు నిర్లక్ష్యంగా ఆహార పదార్థాలను వృథా చేస్తున్నారు. ఆహార పదార్థాల వృథాను సమర్థంగా అరికట్టగలిగితే ఆకలి సమస్యను చాలావరకు అరికట్టవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఆకలి సమస్యకు ప్రధాన కారణాలు రెండు దశాబ్దాల కిందటి కంటే ప్రస్తుతం ఆకలి సమస్య చాలావరకు తగ్గింది. అయినా, ఇప్పటికీ చాలా చోట్ల ప్రజలు ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు. తాజా లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 81.5 కోట్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. పేదరికం, ఉద్యోగ భద్రత కొరవడటం, ఆహార కొరత, ఆహార పదార్థాల వృథా, సాధనా సంపత్తి లోపాలు, అస్థిరమైన మార్కెట్లు, భూతాపం కారణంగా ఏర్పడుతున్న వాతావరణ మార్పులు, యుద్ధాలు, సంఘర్షణలు, అట్టడుగు వర్గాలపై వివక్ష వంటివి ఆకలి సమస్యకు ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం రోజుకు 1.25 డాలర్లు (సుమారు రూ.89) లేదా అంతకంటే తక్కువ మొత్తం సంపాదన ఉన్నవారిని పేదలుగా పరిగణిస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచ జనాభా దాదాపు 750 కోట్లకు పైగా ఉంటే, సుమారు 140 కోట్ల మంది రోజుకు కనీసం రూ.89 సంపాదనైనా లేని పేదరికంలో మగ్గుతున్నారని ప్రపంచబ్యాంకు చెబుతోంది. వీరిలో ఎక్కువ మంది అభివృద్ధి చెందుతున్న దేశాలు, వెనుకబడిన దేశాల్లోనే ఉన్నారు. పేదరికంలో మగ్గుతున్న వారిలో అత్యధికులు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని సన్నకారు రైతులేనని కూడా ప్రపంచబ్యాంకు లెక్కలు చెబుతున్నాయి. ఇక ఉద్యోగాల్లోని అస్థిర పరిస్థితుల వల్ల అభివృద్ధి చెందిన దేశాల్లో సైతం చాలామంది ఆకలితో అలమటిస్తున్నారు. ఆహార ధాన్యాలను భవిష్యత్ అవసరాల కోసం నిల్వ చేసుకునేందుకు తగిన సౌకర్యాలు లేకపోవడం వల్ల చాలా దేశాల్లో దాదాపు 40 శాతం మేరకు తిండి గింజలు వినియోగానికి పనికిరాకుండా నాశనమైపోతున్నాయి. ఈ పరిస్థితి ఆకలి సమస్యను మరింత తీవ్రతరం చేస్తోంది. యుద్ధ పరిస్థితులు, సంఘర్షణలతో అతలాకుతలమవుతున్న దేశాల్లోనూ జనం ఆకలితో అలమటిస్తున్నారు. మరోవైపు మార్కెట్లలో అస్థిరతల వల్ల ఆహార ధాన్యాలు, ప్రధానమైన పంటల ధరలు ఒక్కోసారి విపరీతంగా పెరగడం, ఒక్కోసారి విపరీతంగా పడిపోవడం వల్ల కూడా తాత్కాలికంగా చాలామంది ఆకలితో అలమటించే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఉదాహరణకు చెప్పుకోవాలంటే, 2009లో మొక్కజొన్న, గోధుమలు, వరి వంటి తిండిగింజల ధరలు అకస్మాత్తుగా పెరగడం వల్ల ఆ ఏడాది కొద్దికాలం పాటు ఆకలితో అలమటించే వారి సంఖ్య 5 కోట్ల నుంచి ఏకంగా 10 కోట్లకు పెరిగింది. ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ), ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థల అంచనా ప్రకారం 2050 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరుకునే అవకాశాలు ఉన్నాయి. అప్పటి జనాభా అవసరాలను తీర్చడానికి ఆహార ధాన్యాల ఉత్పాదన 70 శాతం మేరకు పెరిగితే గాని ఆకలి సమస్యను నివారించడం సాధ్యం కాదు. వ్యవసాయం కోసం సాగుభూముల లభ్యత ఆశించిన స్థాయిలో పెరిగే అవకాశాలు ఎటూ లేవు. మెరుగైన వంగడాలు, ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా తిండి గింజల ఉత్పాదనను గణనీయంగా పెంచే ప్రయత్నాలను సాగించడంతో పాటు, ప్రత్యామ్నాయ ఆహార పద్ధతులను వ్యాప్తిలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు. మన దేశంలో ఇదీ పరిస్థితి మన దేశంలో పరిస్థితులను ఒకసారి పరిశీలిస్తే, 2006–07 నుంచి 2016–17 సంవత్సరాలలో లెక్కలను చూసుకుంటే, దశాబ్ది వ్యవధిలో మూడేళ్లు కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ఆ మూడేళ్లనూ మినహాయిస్తే, మిగిలిన ఏడేళ్లలోనూ రికార్డులు బద్దలు కొట్టేస్థాయిలో ఆహార ధాన్యాల దిగుబడులు వచ్చినట్లు ప్రభుత్వం బాగానే ప్రచారం చేసుకుంది. దేశవ్యాప్తంగా 2006–07లో 21.7 కోట్ల టన్నుల తిండిగింజల దిగుబడులు వస్తే, 2016–17లో 27.5 కోట్ల టన్నుల దిగుబడులు వచ్చాయి. దేశంలో 2009, 2014, 2015 సంవత్సరాల్లో కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రభుత్వం ఎంతగా ప్రచారం చేసుకుంటున్నా, వాస్తవ పరిస్థితులు మాత్రం ఆందోళనకరంగానే ఉన్నాయి. గడచిన రెండు దశాబ్దాలలో దేశవ్యాప్తంగా రైతుల ఆత్మహత్యలు, ఆందోళనలు పెరిగాయి. ఈ రెండు దశాబ్దాల్లోనూ అప్పుల ఊబిలో కూరుకుపోయిన 1.40 కోట్ల మంది రైతులు వ్యవసాయం నుంచి తప్పుకున్నారు. ఒకవైపు ప్రభుత్వం తిండిగింజల ఉత్పత్తిలో దేశం స్వయంసమృద్ధి సాధించినట్లు చెబుతున్నా, మన దేశంలో ఇంకా నిత్యం ఆకలిబాధలు పడుతున్నవారి సంఖ్య 27 కోట్లకు పైగానే ఉంది. ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆకలి బాధితుల సంఖ్య మన దేశంలోనే అత్యధికం. తలసరి ఆహార లభ్యత విషయంలోనూ మనది వెనుకబాటే. ‘ఆక్స్‌ఫామ్‘ గత ఏడాది విడుదల చేసిన ‘ఫుడ్ అవైలబిలిటీ ఇండెక్స్’ నివేదిక ప్రకారం తలసరి ఆహార లభ్యతలో భారత్ 97వ స్థానంలో ఉంది. అందుబాటులో ఉన్న ప్రభుత్వ లెక్కల ప్రకారం 2016–17లో తిండిగింజల ఉత్పాదన 27.5 కోట్ల టన్నులైతే, అదే ఏడాది తిండిగింజల డిమాండు 25.7 కోట్ల టన్నులు అని కేంద్ర వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఇది నామమాత్రపు మిగులు ఉత్పత్తి మాత్రమే. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం తిండిగింజల ఉత్పత్తి స్థానిక అవసరాలతో పోల్చుకుంటే 80 శాతం కంటే తక్కువగా ఉంటే, ఆహార కొరత ఏర్పడినట్లు భావించాలి. తిండిగింజల ఉత్పత్తి 80–120 శాతం వరకు ఉంటే, స్వయంసమృద్ధి సాధించినట్లు భావించాలి. ఈ ఉత్పత్తి 120 శాతాన్ని దాటినప్పుడు మాత్రమే మిగులు ఉత్పత్తి సాధించినట్లు పరిగణించాలి. మనదేశం తిండిగింజల ఉత్పాదనలో స్వయంసమృద్ధి సాధించింది. అయితే, సమీప భవిష్యత్తులో కరువు ముంచుకొస్తే, ఇప్పుడున్న బొటాబొటి మిగులు ఏ మూలకూ సరిపోదని నిపుణులు చెబుతున్నారు. భారీ స్థాయిలో ఆహార వృథా ప్రపంచవ్యాప్తంగా ఆహార వృథా భారీ స్థాయిలో జరుగుతోంది. సంపన్న దేశాలతో పాటు నిరుపేద దేశాల్లో సైతం ఆహార వృథా దాదాపు ఒకే స్థాయిలో జరుగుతోందని ఆహార వ్యవసాయ సంస్థ (ఎఫ్ఏఓ) చెబుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఏటా దాదాపు 130 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోంది. జనాభా వినియోగించే ఆహార పరిమాణంలో ఇది దాదాపు మూడో వంతు. వృథా అవుతున్న ఆహారం విలువ సుమారు 2.6 లక్షల కోట్ల డాలర్లు (రూ.184.31 లక్షల కోట్లు). ఎఫ్ఏఓ లెక్కల ప్రకారం సంపన్న దేశాల్లో సగటున ఏటా 67 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతుంటే, పేద దేశాల్లో సగటున 63 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోంది. సంపన్న దేశాల్లో ఆహార వృథాకు, పేద దేశాల్లో ఆహార వృథాకు కారణాలు వేర్వేరు. సంపన్న దేశాల్లో విత్తనాలు వేసే నాటి నుంచి పంట కోసే వరకు గల దశల్లో 32 శాతం నష్టం జరుగుతుంటే, వినియోగదారుల వల్ల 61 శాతం మేరకు ఆహార వృథా జరుగుతోంది. పేద దేశాల్లో విత్తనాలు వేసే నాటి నుంచి పంట కోసే వరకు గల దశల్లో 83 శాతం నష్టం జరుగుతుంటే, వినియోగదారుల వల్ల జరుగుతున్న వృథా 5 శాతం మాత్రమే. పేద దేశాల్లో తగిన కోల్డ్ స్టోరేజీ సౌకర్యాలు లేకపోవడం, పంట కోతలో ఆధునిక పరికరాలు అందుబాటులో లేకపోవడం వంటి కారణాల వల్ల భారీ స్థాయిలో ఆహార నష్టం వాటిల్లుతోంది. వినియోగదారుల వల్ల ఈ దేశాల్లో జరుగుతున్న ఆహార నష్టం తక్కువే అయినా, ఆధునిక వసతులు కొరవడటం కారణంగా చాలా వరకు ఆహారం వినియోగానికి పనికిరాకుండా పోతోంది. మన భారత్ పరిస్థితులనే తీసుకుంటే, దేశంలో తగినన్ని కోల్డ్ స్టోరేజీలు లేని కారణంగా ఏటా భారీ స్థాయిలో కూరగాయలు, పండ్లు వృథా అవుతున్నాయి. మన దేశంలో ఇలా ఏటా వృథా అయ్యే కూరగాయలు, పండ్ల విలువ సుమారు రూ.38,500 కోట్ల వరకు ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ బర్మింగ్‌హామ్ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. ప్రపంచీకరణ ఫలితంగా ఆహార వృథా ప్రపంచీకరణ ఫలితంగా నిష్కారణంగా ఆహారం వృథా అవుతోంది. ప్రపంచీకరణ ఫలితంగా సంపన్న దేశాలతో పాటు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ సూపర్ మార్కెట్లు విరివిగా పెరిగాయి. సూపర్ మార్కెట్లు షెల్ఫుల్లో అందంగా కనిపించే ఆహార పదార్థాలకే ప్రాధాన్యమిస్తాయి. కాస్త వంకర టింకరగా ఉన్న పండ్లు, కూరగాయలను షెల్ఫులకెక్కించేందుకు ఇష్టపడవు. అలాంటి వాటిని పశువుల దాణాగా పంపడం లేదా వృథాగా పడవేయడం చేస్తుండటంతో వినియోగానికి పనివచ్చే పదార్థాలు అనవసరంగా వృథా అవుతున్నాయి. సూపర్ మార్కెట్ల మరో లక్షణం ఏమిటంటే, ఇవి షెల్ఫుల నిండుగా పండ్లు, కూరగాయలను నిల్వ చేస్తాయి. షెల్ఫులు ఖాళీగా ఉండనివ్వవు. ఒక్కోసారి ఆశించినంత విరివిగా అమ్ముడుపోని పండ్లు, కూరగాయలు షెల్ఫుల్లోనే నాశనమైపోతుంటాయి. ‘బెస్ట్ బిఫోర్’, ‘యూజ్ బై’, ‘సెల్ బై’ వంటి తేదీల లేబుళ్లను గుడ్డిగా నమ్మే వినియోగదారులు ఆహార పదార్థాల లేబుళ్ల మీద తేదీలను మాత్రమే చూసి పారవేసే ఆహార పదార్థాలు కూడా తక్కువ కాదు. సాధారణంగా ‘బెస్ట్ బిఫోర్’ తదితర తేదీలను రిటైలర్లు తమ అంచనా మేరకు వేస్తారు. ఈ తేదీలు కాస్త దాటినప్పటికీ చాలా వరకు పదార్థాలు వినియోగయోగ్యంగానే ఉంటాయి. అయితే, చాలామంది వినియోగదారులు లేబుళ్ల మీద ముద్రించిన తేదీలనే గుడ్డిగా నమ్ముతూ విలువైన ఆహారాన్ని వృథా చేస్తున్నారు. యూరోపియన్ యూనియన్ దేశాల్లో ఏటా ఇలా 8.80 కోట్ల టన్నుల ఆహారం వృథా అవుతోంది. పర్యావరణంపై ప్రతికూల ప్రభావం ఆహార వృథా కారణంగా పర్యావరణంపై చాలా ప్రతికూల ప్రభావం పడుతోంది. పెరుగుతున్న భూతాపాన్ని ఆహార వృథా కూడా ఇతోధికంగా ఎగదోస్తోంది. ఆహార వృథా కారణంగా పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లుతోందో తెలుసుకోవడానికి ఒక చిన్న ఉదాహరణ– ఒక ఆపిల్ పండు మన చేతికి అందటానికి కనీసం 125 లీటర్ల నీరు అవసరం. ఒక ఆపిల్‌ను పాడయ్యే వరకు నిల్వ ఉంచి పారేస్తే, 125 లీటర్ల నీటిని వృథా చేసినట్లే. ఒక్క ఆపిల్‌కే నీటి వృథా ఈ స్థాయిలో ఉంటే, ప్రపంచవ్యాప్తంగా ఏటా కోట్లాది టన్నుల్లో జరుగుతున్న ఆహార వృథా కారణంగా ఏ స్థాయి జలనష్టం జరుగుతోందో ఊహించవచ్చు. ఆహార వృథా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఏటా 250 క్యూసెక్కుల మేరకు నీటి వృథా పరోక్షంగా జరుగుతోంది. ఈ నీటి పరిమాణం జెనీవా సరస్సులోని నీటి పరిమాణానికి మూడు రెట్లు. ఇదిలా ఉంటే, వృథా అవుతున్న ఆహార పదార్థాల కారణంగా ఏటా అదనంగా 330 టన్నుల కార్బన్ డయాక్సైడ్ పర్యావరణంలో కలుస్తోంది. ఇది భూతాపాన్ని తనవంతు పెంచుతోంది. వృథాగా పారవేసిన ఆహార పదార్థాలు కుళ్లిపోయే దశలో విడుదలయ్యే మీథేన్ వాయువు కూడా పర్యావరణంపై ఇదే తీరులో ప్రతికూల ప్రభావం చూపుతోంది. కేవలం బొగ్గు, చమురు ఇంధనాల వల్ల మాత్రమే కాదు, ఆహార వృథా కారణంగా కూడా భూతాపం అంతకంతకు పెరుగుతోంది. పర్యావరణ క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని అయినా, ప్రపంచ దేశాలన్నీ ఆహార వృథాను అరికట్టడానికి కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకుంటే, భవిష్యత్తులో గడ్డు పరిస్థితులను ఎదుర్కొనక తప్పదు. తలసరి ఆహారలభ్యత అంతంతే తిండిగింజల ఉత్పాదనలో స్వయంసమృద్ధి సంగతి సరే, తలసరి ఆహార లభ్యతలో మనం సాధించిన పురోగతి అంతంత మాత్రమే. మన దేశంలో 1908 నాటికి తలసరి వార్షిక ఆహార ధాన్యాల లభ్యత 177.3 కిలోలుగా ఉంటే, 2016 నాటికి తలసరి వార్షిక ఆహార ధాన్యాల లభ్యత 177.9 కిలోలు మాత్రమే. చైనాలో తలసరి వార్షిక ఆహార ధాన్యాల లభ్యత 450 కిలోలు కాగా, బంగ్లాదేశ్‌లో ఈ పరిమాణం 200 కిలోలు ఉండటం గమనార్హం. అగ్రరాజ్యమైన అమెరికాలో తలసరి వార్షిక ఆహార ధాన్యాల లభ్యత 1100 కిలోలు. మనదేశంలో ఆకలితో అలమటిస్తున్నవారు కొందరైతే, పోషకాల సంగతి పట్టించుకోకుండా దొరికినదేదో తిని కడుపు నింపుకుంటున్న వారే ఎక్కువ. ఆహార నిపుణుల సూచనల మేరకు పోషకాహారం తీసుకునే పరిస్థితి చాలామందికి లేదు. తీసుకుంటున్న ఆహారానికీ, పోషక ప్రమాణాలకు వ్యత్యాసం మన గ్రామీణ ప్రాంతాల్లో 30 శాతం మేరకు, పట్టణ ప్రాంతాల్లో 20 శాతం మేరకు ఉంటోంది. అర్ధాకలి, అరకొర ఆహారం వల్ల మన దేశంలో నెలకొన్న పరిస్థితులపై ఎఫ్ఏఓ విడుదల చేసిన తాజా గణాంకాలు ఇవీ... భారత జనాభాలో పోషకాహార లోపంతో బాధపడుతున్నవారు : 14.5% తక్కువ బరువుతో ఉన్న ఐదేళ్ల లోపు పిల్లలు : 20.8% ఐదేళ్ల పిల్లల్లో ఎదుగుదల లోపాలు ఉన్నవారు : 37.9% రక్తహీనతతో బాధపడుతున్న మహిళలు : 51.4% -
ఆకలి తీర్చడమే పరమార్థం
ఆహార అన్వేషణే మనిషి మనుగడను సమున్నతమైన మలుపులు తిప్పింది. నేడు అదే ఆహారం మనుషులను విడ గొడుతోంది. ఆహారాన్ని అలక్ష్యం చేసే వారుగా, ఆహారం అందనివారుగా మనుషులు విడిపోయారు. ఆహారం లేమితో బాధపడేవారిలో ఎటువంటి వర్గీకరణలు లేవు. సమాజంలో ఆర్థిక పరంగా వున్న వర్గీకరణలేవీ ఆహా రాన్ని అలక్ష్యం చేసేవారికి వర్తించవు. తెలిసి, తెలిసీ ధనిక, ఎగువ మధ్య తరగతివారు ఆహారాన్ని నిర్లక్ష్యం చేస్తుంటే; దిగువ మధ్యతరగతి వారు తెలియకుండానే ఆహారాన్ని వృధా చేస్తున్నారు. ఆమధ్య వరకూ ఎయిడ్స్ కారణంగా, ఆ తర్వాత క్యాన్సర్ వల్ల ప్రపంచంలో అత్యధికులు మరణిస్తు న్నట్టు చాలా చదువుకున్నవారు సైతం విశ్వసిస్తారు. కానీ, ఆకలితో చనిపో యేవారి సంఖ్యే చాలా ఎక్కువ అని తక్కువమందికి తెలియడం విషాదం. ఆహారాన్ని వృధా చేయకూడదని చాలామంది అనుకుంటారు. కానీ, అందుకు చేయాల్సిందేమిటనే దానిపై ఎవరికీ సరైన అవగాహన ఉండదు. వాట్సప్‌లో వచ్చే మెసేజ్‌లను మొక్కు బడిగా ఫార్వర్డ్ చేసేసి చేతులు దులు పుకుంటారు. అందుకే ఐక్యరాజ్య సమి తికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ ‘జీరో హంగర్’ను ఇంటి నుంచే ప్రారంభించమని చెబుతుంది. అది ఆర్థికంగా, ఆరోగ్యపరంగా మేలు చేయడంతోపాటు ప్రపంచంలోని అన్నార్తుల ఆకలి తీరుస్తుంది. తక్కువ పదార్థాలతో రుచికరమైన వంట చేయ డం; మిగిలిపోయిన అన్నం, రొట్టె లతో కొత్త ఆహారాన్ని తయారుచేసు కోవడం; అవసరమైన మేరకే సరు కులు కొనుగోలు చేయడం; ఎక్స్పె యిరీ తేదీల విషయంలో జాగరూక తతో ఉండటం వంటి పలు చర్యలను ఎవరికివారు అలవర్చుకోవాలి. పండిన కూరగాయల్లో 40 శాతం, ఆహారధాన్యాలు 30 శాతం పూర్తిగా వృధా అవుతున్నాయని ఒక అంచనా. కడుపునిండా తిని ‘బ్రేవ్’మని తేన్చేలోపు ఆ ఊహకు సైతం నోచు కోని సుమారు 20 కోట్ల మంది మన దేశ పౌరులు ఆకలితో నిద్రిస్తున్నారని మర్చిపోవద్దు. చేతి నుంచి ఓ అన్నం మెతుకు వృధాగా నేలరాలిపోతున్న ప్పుడల్లా.. ప్రతిరోజూ 7,000 మంది భారతీయులు ఆకలితో అసువులు బాస్తున్నారని విస్మరించొద్దు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పడం కాదు, ఆకలి తీర్చడమే ఆహారం పర మార్థం అని మరోసారి గుర్తుచేసు కుందాం. (నేడు ప్రపంచ ఆహార దినోత్సవం) – అక్షర, హైదరాబాద్ -
ఆకలి తీరుద్దాం రండి..
సర్వ్ నీడీ సంకల్పం లక్ష్యం: రోజుకు 500 మందికి పైగా ఆకలి తీర్చడం ప్రాజెక్టు పేరు: అన్నదాత కార్యాచరణ: ఫంక్షన్ హాళ్లు, రెస్టారెంట్లలో మిగిలిపోయిన ఆహార పదార్థాలు సేకరించడం. ప్రభుత్వ ఆస్పత్రులు, అనాథ, వికలాంగ, వృద్ధాశ్రమాల వద్దకు స్వయంగా వెళ్లి వందలాది మంది అన్నార్తుల కడుపునింపడం. నెట్వర్క్: దాదాపు 40 మంది వలంటీర్ల సహాయంతో సేవలందిస్తూ... ఆహార సేకరణకు 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు. ఫోన్ చేసి చెప్పినా వెంటనే వెళ్తారు. బతుకుదెరువు కోసం వలస వచ్చిన వారికి వటవృక్షం భాగ్యనగరం. ఆశగా వచ్చినవారిని అక్కున చేర్చుకునే అమ్మలాంటి నగరం. బతుకు దారి చూపించి అండగా నిలుస్తుంది. ఇంతటి నగరంలో ఆకలితో అలమటించేవారు కోకొల్లలు. ఎండుతున్న గొంతును తడుముకుంటూ.. ప్రాణం కళ్లలో నింపుకుని గుక్కెడు గంజి గొంతులో పోసేవారు లేకపోతారా అని ఆశతో ఎదురుచూసే అవ్వ నిత్యం ఏ వీధి మలుపులోనో మనకు తారసపడే ఉంటుంది.. ఎండిన డొక్కను నులుపుకొంటూ.. ఆకలి కేకలని పంటిబిగువున అదుముకుంటూ.. ఎవరైనా బుక్కెడు బువ్వ పెడితే బాగుండునని ఆత్రంగా చూసే తాతలు దారిలో కనిపిస్తూనే ఉంటారు. ఒక్క క్షణం ఆగిచూస్తే ‘ఆకలి’ బాధ తెలిసినవారి కళ్లు చెమర్చక మానవు. ప్రాణం ఏదైనా ఆకలి అందరికీ సమానమే కదా..! అందరూ బాగుండాలి.. అందులో నేనుండాలి అనుకుంటే ఆ అవ్వ.. తాత కళ్లల్లో ఆనందం కనిపిస్తుంది. అందరి ఆకలి తీరాలి.. అందులో కొందరినైనా నేను ఆదుకోవాలని భావిస్తే నీకన్నా దేవుడు మరొకరు ఉండరు. మన కంచంలో ఒక్క ముద్ద ఓ నిరుపేద బిడ్డ ఆకలి తీర్చినప్పుడే కదా ఈ జన్మకు సార్థకత. మనసు తలుపు తెరవండి. నగరంలో ఎందరో అన్నార్తులను ఆదుకుంటున్న స్వచ్ఛంద సంస్థలను ఆదర్శంగా తీసుకోండి. కొందరి ఆకలినైనా తీర్చేందుకు కదలండి. నేడు వరల్డ్ ఫుడ్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఆకలి అందరికీ సమానమే. కానీ అనుభవాలు మాత్రం భిన్నం. రాత్రీ,పగలు ఒకేలా ఉండే భాగ్యనగరంలో ‘ఈ పూట ఎలా గడపాలి’.. అని ఆలోచించే మనుషులున్నచోటే ‘ఈ పూట ఎలా గడిచేది’ అని మథనపడే కుటుంబాలు కోకొల్లలు. అజీర్తి–ఆకలి రెండూ నగరమనే ఒకే బొజ్జలో సహవాసం చేస్తున్న తీరుకు ఇలాంటి నిదర్శనాలెన్నో. ఖరీదైన వంటకాలు వడ్డించే స్టార్ హోటళ్లు, రెస్టారెంట్లు కనీసం 15 నుంచి 20 శాతం ఆహారాన్ని వృథా చేస్తుంటాయని ఓ ఫుడ్ ఎనలిస్ట్ అంటున్నారు. ఇక ఫుడ్ ఐటమ్స్ సంఖ్యతో స్టేటస్‌ను కొలుచుకునే సంపన్నుల వేడుకల్లో వృధా అయ్యే పరిమాణాన్ని కొలవనేలేం. వ్యధని, వృథాని సమన్వయం చేయగలిగితే.. తినడం, తినిపించడం రెండూ కడుపు నిండేవే అని గుర్తించగలిగితే.. ఈ నేలపై ఆకలి కేకలు ఉండవు. అజీర్తి రోగాలూ దరిచేరవు. ఈ పరిస్థితులను వీలైనంత మార్చడానికి ప్రయత్నిస్తున్నాయి పలు స్వచ్ఛంద సంస్థలు. వరల్డ్ ఫుడ్ డే సందర్భంగా వృథా.. వ్యధపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. సాక్షి, సిటీబ్యూరో: ఒక్క పూట పెట్టినా చాలు.. పాతికేళ్ల ఎన్ఆర్ఐ ముస్తాఫా అలీ హష్మీ ఏడేళ్ల క్రితం ప్రారంభించిన సేవా సంస్థ ‘గ్లోటైడ్ సొసైటీ డెవలప్మెంట్’. వృథా అవుతున్న ఆహారాన్ని నగరవాసుల నుంచి సేకరించి ఆకలితో అలమటిస్తున్నవారికి అందిస్తోంది. కార్పొరేట్ కంపెనీలు, కేటరింగ్ సంస్థలు, హోటల్స్ నుంచి ప్రతిరోజూ భారీ పరిమాణంలో ఆహారాన్ని వీరు సేకరించి దాదాపు 200 మందికి పెడుతున్నారు. ‘‘కేవలం నీళ్లతో కడుపునింపుకుంటూ 11 రోజులుగా అన్నం దొరకని వ్యక్తిని కలిశాను. అతనే ఈ సంస్థ ఏర్పాటుకు స్ఫూర్తి’ అంటారు ముస్తాఫా. అంతేకాదు.. దాతల సాయంతో అనాథ పేద పిల్లలకు కోరిన ఆహారం పెడుతున్నారు. సేవ.. ఆకాశమంత ఆకలి బాధ తెలిసిన కొందరు సాఫ్ట్వేర్ ఇంజినీర్లు, విద్యార్థులు, ల్యాబ్ టెక్నీషియన్లు చేయిచేయి కలిపారు. అన్నార్థులకు అండగా నిలబడేందుకు ఒక్కటయ్యారు. అలా 2012లో వారి ఆలోచనల నుంచి ‘స్కై ఫౌండేషన్’ ప్రాణం పోసుకుంది. రోడ్డు పక్కన బిచ్చగాళ్లు, అనాథలు, మతిస్థిమితం కోల్పోయి తిరుగుతున్నవారు.. ఇలా ఎందరో అభాగ్యులకు ఈ ఫౌండేషన్ అన్నదానం చేస్తూ ఆకలి తీరుస్తోంది. ప్రతి నెలా రెండు, నాలుగో ఆదివారం క్రమం తప్పకుండా ఈ అన్నదానం నిర్వహిస్తారు. ఇటీవలే 92వ అన్నదాన కార్యక్రమం నిర్వహించిన స్కై ఫౌండేషన్ జనగాం, యాదాద్రిలో తమ సేవాలను విస్తరించింది. ‘అన్నం వృధా చేయవద్దు. దాని విలువ తెలుసుకుని, మీ పిల్లలకు, స్నేహితులకు చెప్పండి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం దేవునికి పెట్టడం లాంటిదే’నని ప్రచారం చేస్తున్నారు ఫౌండేషన్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు సంజీవ్‌కుమార్, పావని. వృద్ధాశ్రమాల్లో దీనగాధ.. నగరంలో లెక్కకు మించి వృద్ధాశ్రమాలు ఉన్నాయి. ఒకప్పుడు ఎంతో ఉన్నతంగా బతికినవారు.. ఎంతోమందికి నచ్చిన ఆహారం వండి పెట్టినవారు సైతం ఇప్పుడు ఇక్కడ జిహ్వ చంపుకొని బతుకీడుస్తున్నారు. ఇక్కడి వారిని కదిలిస్తే మనసుకు, జిహ్వకు మధ్య యుద్ధం జరుగుతుందనిపిస్తోంది. మంచి ఆహారం తినాలని ఉన్నా అది ఊహకకే అందదు. వారి మాటల్లోనే.. బస్తీల్లో ‘ఆశ’ల కలలు ఇవీ.. బంజారాహిల్స్ రోడ్ నెం.10లోని సింగాడబస్తీ, సింగాడికుంట, నాయుడునగర్, ఉదయ్‌నగర్‌లోని పలువురు చిన్నారులను భోజనం విషయంలో కదిలించినప్పుడు తమకు ఇష్టమైన ఆహారం తినడం గగనమేనన్నారు. చికెన్ బిర్యాని తినాలని ఉన్నా తమ స్తోమతకు చాలా దూరమంది చిన్నారి అరుణ. నెలలో ఒకరోజు ఇంట్లో చికెన్ కూర వండినప్పుడే పండుగంది. కూలిపనులు చేసుకుని బతికే ఇలాంటి కుటుంబాలు నగరంలో కోకొల్లలు. ఇక్కడి పిల్లలకు రోజుకు ఓ గుడ్డు తినాలనుకోవడం అత్యాశ కిందే లెక్క. బసవ తారకం వద్ద ఆకలి కేకలు బంజారాహిల్స్ ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆస్పత్రి పరిసరాల్లో నిత్యం కనిపించే సన్నివేశాలు మానవత్వాన్ని తట్టిలేపుతాయి. తమవారిని బతికించుకునేందుకు వైద్యం కోసం సూదూర ప్రాంతాల నుంచి వచ్చేవారు ఇక్కడ ఉండేందుకే కాదు.. ఆకలి తీర్చుకునేందుకు కూడా అవస్తలు పడుతుంటారు. ఆస్పత్రిలో రోగులు వైద్యం పొందుతుంటే.. అయినవాళ్లు మాత్ర రోడ్డు పక్కన ఎండా,వాన, చలిని భరిస్తూ ఆరుబయటే గడిపే ఎంతోమంది ఇక్కడ కనిపిస్తారు. వారిని పలకరిస్తే కళ్లు చెమర్చక మానవు. ఆహారం జమ.. ఆనందం విత్‌డ్రా తిండి ‘కొన’లేని వారికీ.. తినలేక పారబోసే వారికీ మధ్య వారధిగా నిలుస్తోంది ‘హైదరాబాద్ ఫుడ్ బ్యాంక్’. అయితే ఇచ్చే ఆహారం పరిశుభ్రంగా ఉండేలా చూడమని సూచిస్తోంది. ఇంట్లో చేసిన ఆహారాన్ని మాత్రమే సేకరించి పంపిణీ చేస్తామంటున్నారు సంస్థ ప్రతినిధులు అబ్దుల్ అజీజ్, దిలీప్, ఇక్బాల్, సత్య, అబ్దుల్ సలామ్. తరచూ ఫుడ్ డ్రైవ్స్ నిర్వహిస్తూ ఒక్కో డ్రైవ్‌లో ఆకలితో ఉన్న 500 మందికి పైగా పేదలకు పంచుతున్నారు. ఇందులో వికలాంగులతో పాటు ఫుట్‌పాత్‌ల మీద నివసించేవారికి అందిస్తున్నారు. ఆహారం దానం చేయాలనుకున్నవారు రోజూ కాకపోయినా, వారంలో ఓ రోజు సాంబారన్నం/ వెజిటబుల్ రైస్, పండ్లు, ఇడ్లీ, దోసలు.. ఇలా ఏదైనా సరే వండి ప్యాక్ చేసి స్థానిక కో–ఆర్డినేటర్‌కి అందించాలన్నారు. ఆసక్తి ఉంటే పంపిణీలో సైతం పాల్గొనవచ్చంటున్నారు. నిత్యాన్నదాన సేవ సర్వ్ నీడీ.. సికింద్రాబాద్ కార్ఖానాలో ఉన్న సర్వ్ నీడీ సంస్థ ప్రతిరోజు 500 మందికి పైగా అన్నదానం చేస్తోంది. దీన్ని ‘అన్నదాత’ ప్రాజెక్ట్‌గా చేపట్టి సేవలందిస్తోంది. అన్నం, సాంబార్, కూర, ఫ్రైయాన్స్, బిస్కెట్స్, కోడిగుడ్డు, మూడు రకాల ఫ్రూట్స్.. ఇదీ ఇక్కడి మెనూ. నగరంలోని ఆకలి కేకలు వినిపించకూడదనేది తమ ఆశయం అంటున్నారు సర్వ్ నీడి సంస్థ ఫౌండర్ గౌతమ్ కుమార్. నగరంలోని ఫంక్షన్ హాల్స్, రెస్టారెంట్లో ఫుడ్ మిగిలినా వెంటనే ఈ సంస్థకు కాల్ చేస్తారు. ఇక్కడి ఫుడ్ సేకరించి వీధుల్లో ఆకలితో అలమటించే వారికి, గవర్నమెంట్ హాస్పిటల్స్ దగ్గర పంచి పెడతారు. పుట్టిన రోజులు, పెళ్లి రోజులు, చనిపోయిన జ్ఞాపకార్థం ఆహారం పెట్టాలనుకునేవారు సైతం ఇక్కడికి వస్తుంటారు. మొదట్లో 20 మందికి మాత్రమే అన్నదానం చేసిన ఈ సంస్థ ప్రస్తుతం నగరంలోని హయత్‌నగర్, రాజేంద్రనగర్, శామీర్‌పేట్, అల్వాల్, సుచిత్ర, లోవర్ ట్యాంకుబండ్‌లో వందలాది మందికి ఆహారం పెడుతోంది. ఆహారం అందించాలనుకునేవారు 91605 08054/97005 24806 నెంబర్లలో సంప్రదించవచ్చు. -
విద్యతోనే దేశాభివృద్ధి సాధ్యం
మచిలీపట్నం టౌన్ : విద్య ద్వారానే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని ఫుడ్‌ఫస్టు ఇన్ఫర్మేషన్ అండ్ యాక్షన్ నెట్వర్క్ (ఫియాన్) స్వచ్ఛంద సంస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ తంటేపూడి రవికుమార్ అన్నారు. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని ఆదివారం స్థానిక యానాదుల కాలనీలో ఫియాన్ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆహార భద్రత– ఆవశ్యకతపై యానాదులకు అవగాహన కలిగించి అనంతరం సామూహిక భోజన కార్యక్రమాన్ని నిర్వహించారు. కాలనీలోని దాదాపు 400 మంది యానాది పిల్లలు, పెద్దలకు ఆ సంస్థ ప్రతినిధులు ఆహారాన్ని వడ్డించారు. రవికుమార్ మాట్లాడుతూ ప్రతి పేద పిల్లవాడూ చదువుకుంటే తద్వారా ఉపాధి అవకాశాలు వచ్చి వారి కొనుగోలు శక్తి పెరుతుగుతుందన్నారు. చదువుకున్న ప్రతి ఒక్కరూ ఏదోక పనిలో నిమగ్నమవుతారని దీని ద్వారా దేశం, రాష్ట్రం అన్ని రంగాల్లోనూ పురోగమిస్తుందన్నారు. ఆహార భద్రతకు ప్రభుత్వాలు సరైన ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. అప్పుడే పేదలకు కూడా తిండిగింజలు లభిస్తాయన్నారు. ‘రైట్ టు ఫుడ్ అండ్ న్యూట్రీషన్ వాచ్’ అనే పుస్తకాన్ని రవికుమార్ ఆవిష్కరించారు. ఫియాన్ సంస్థ కార్యదర్శి జి. జాన్‌రవి, కోఆర్డినేటర్ కె. కపాశాంతి, కమ్యూనిటీ ఆర్గనైజర్ డి.వి. సాగర్, ఆ ప్రాంత పెద్దలు కె. శామ్యూల్, రమణయ్య పాల్గొన్నారు.