రసాయనాలు కలిపిన ఆహారపదార్థాలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌లో తనిఖీలు నిర్వహిస్తున్న అధికారి (ఫైల్)
డబ్బు సంపాదనే వారికి ముఖ్యం. అందుకోసం ఆహారంలో ఏమైనా కల్తీ చేస్తారు. దీని వల్ల ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసినా ఏ మాత్రం చలించరు. కస్టమర్లను మళ్లీ మళ్లీ రప్పించుకోవడమే లక్ష్యంగా ఆహార పదార్థాల విక్రయ కేంద్రాల నిర్వాహకులు ప్రమాదకర రంగులు, పదార్థాలను కలిపేందుకే తెగబడుతున్నారు. అధికారులకు సైతం ఈ విషయం తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. నేడు వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే సందర్భంగా ప్రత్యేక కథనం.
కర్నూలు(హాస్పిటల్): ఉమ్మడి కర్నూలుజిల్లాలో చిన్నా పెద్దా హోటల్స్, రెస్టారెంట్స్, డాబాలు, చాట్, నూడల్స్ షాపులు అన్నీ కలుపుకుని దాదాపు 9 వేలకు పైగా ఉంటాయి. ఒక్క కర్నూలు నగరంలోనే 1500 దాకా హోటళ్లు, దుకాణాలు ఉన్నాయి. ఈ దుకాణాలు ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి 2006 చట్టం మేరకు లైసెన్స్ తీసుకుని, ఆ శాఖ నిబంధనల ప్రకారం ఆహారం తయారు చేయాలి.
ఈ శాఖలోని అధికారులు ఏడాదికి 350 శ్యాంపిల్స్ సేకరించాల్సి ఉన్నా నామమాత్రంగా పనిచేస్తున్నారు. నెలకు ఐదు నుంచి ఆరు శ్యాంపిల్స్ తీసి చేతులు దులుపుకుంటున్నారు. గత మూడు నెలలుగా జిల్లాల పునర్విభజన పేరుతో ఒక్క శ్యాంపిల్ కూడా తీయలేదు. సిబ్బంది తక్కువగా ఉన్నారని, కోర్టు డ్యూటీల ఉన్నాయని పేర్కొంటూ తూతూ మంత్రంగా విధులు నిర్వహిస్తున్నారు. వీరి సేకరించి ప్రయోగశాలకు పంపిన శ్యాంపిల్స్ రెండు, మూడు నెలలకు గానీ నివేదికలు రావడం లేదు. దీంతో ఏ ఒక్కరిపైనా వీరు సరైన చర్యలు తీసుకోవడం లేదు. దీనికితోడు హోటల్, రెస్టారెంట్, ఇతర ఆహార పదార్థాల విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేయాలంటే తప్పనిసరిగా ఆహార పరిరక్షణ, నాణ్యత ప్రమాణాల సంస్థ నుంచి అనుమతి తీసుకోవాలి.
కానీ జిల్లాలో ఇలా అనుమతి తీసుకుని వ్యాపారం చేసే సంస్థలు నూటికి పాతిక శాతానికి మించి ఉండటం లేదు. ఉత్పత్తి కేంద్రాలైతే ఏడాదికి రూ.3వేలు, విక్రయ కేంద్రాలు రూ.2వేలు, తోపుడు బండ్లు రూ.100లు చెల్లించి అనుమతులు పొందాల్సి ఉన్నా ఆ పనిచేయడం లేదు. కొన్ని పెద్ద హోటళ్లు, రెస్టారెంట్లు మినహా అధిక శాతం హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, రోడ్డుసైడు హోటళ్లలో పరిశుభ్రత గురించి అస్సలు పట్టించుకోవడం లేదు.
యథేచ్ఛగా రంగులు, టేస్టీ సాల్ట్ వాడకం
జిల్లాలోని స్వీట్స్ తయారీ కేంద్రాలు, విక్రయ కేంద్రాలతో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో అనుమతిలేని రంగులను, టేస్టీసాల్ట్ (అజినోమోటో)ను వాడుతున్నారు. వాస్తవంగా ఆహార పదార్థాల్లో వాడే రంగు(బుష్‌పౌడర్)ను ఒక కిలోకు 0.001మి.గ్రా వాడాలి. పదార్థాలు ఆకర్షణీయంగా కనిపించాలన్న దురుద్దేశంతో కిలోకు 10 నుంచి 20 మి.గ్రా కలుపుతున్నారు. దీంతో పాటు మెటాలిక్ ఎల్లోను సైతం వాడుతున్నారు. వీటిని తిన్న వారికి క్యాన్సర్ వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నా పట్టించుకునే వారు లేరు.
చదవండి: (Nandyal TDP: టీడీపీలో వర్గ పోరు)
అలాగే ప్రమాదకర అజినోమోటో(టేస్టీసాల్ట్)ను రెస్టారెంట్లు, హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో విచ్చలవిడిగా వాడుతున్నారు. వీటిని తిన్న వారు క్యాన్సర్, జీర్ణకోశ సమస్యలతో పాటు సంతానలేమి సమస్యలు, సెక్స్ సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు. ఇటీవల అధికారులు కృష్ణానగర్, పార్కురోడ్డు, సెంట్రల్‌ప్లాజా సమీపాల్లోని పలు దుకాణాలు, హోటల్‌లలో దాడులు నిర్వహించి నోటీసులు జారీ చేసినా వ్యాపారుల్లో మార్పు రాలేదు.
హోటళ్లు, బిర్యానీ సెంటర్లకు ఇవీ నిబంధనలు
►వ్యాపారులు ఫుడ్ సేఫ్టీ స్టాండర్స్ అథారిటీఆఫ్ ఇండియా లైసెన్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. లైసెన్స్ లేకపోతే తనిఖీల్లో దొరికినప్పుడు సెక్షన్ 63 ప్రకారం ఫుడ్ సేఫ్టీ కమిషన్ ద్వారా క్రిమినల్ కేసులు ఫైల్ చేస్తారు. నేరం రుజువైతే 6 నెలల జైలు శిక్షతో పాటు రూ.5లక్షల జరిమానా విధిస్తారు.
►ఆహార పదార్థాలను తనిఖీ చేసేటప్పుడు నాలు గు భాగాలుగా విభజిస్తారు. అన్ సేఫ్, సబ్ స్టాండర్డ్, మిస్ బ్రాండెడ్, మిస్‌లీడింగ్ విభాగాల కింద అధికారులు శ్యాంపిల్స్ సేకరిస్తారు.
►వ్యాపార ప్రకటనల్లో సూచించినట్లుగా ఆహారంలో ప్రమాణాలు లేకపోతే దానిని మిస్‌లీడింగ్ గా పరిగణిస్తారు.
►ఆహార పదార్థాల రంగు కోసం ప్రకృతి సిద్ధమైన రంగులు వాడాలి. రసాయనాలు కలిపిన రంగులు వాడకూడదు.
►ఆహార పదార్థాల తయారీకి టేస్టింగ్ సాల్ట్స్ వాడకూడదు. రోజువారీ వాడే ఉప్పునే వాడాలి.
►అలాగే అన్ని రకాల హోటళ్లు, రెస్టారెంట్‌లలో లోపలి భాగం, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి. వంటగదిలో డ్రైనేజీ వసతి బాగుండాలి.
అనుమతులు తప్పనిసరి
తినుబండారాల వ్యాపారం చేసే ప్రతి ఒక్కరూ సి.క్యాంపులోని తమ కార్యాలయంలో తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలి. అనుమతి లేకుండా విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటాము. చట్టప్రకారం అనుమతి ఉన్న రంగులు, పదార్థాలనే ఆహార పదార్థాల్లో వాడాలి. రుచి కోసం చాలా మంది టేస్టీసాల్ట్ వాడుతున్నారని ఫిర్యాదులున్నాయి. ఇది చట్టరీత్యానేరం. ఇకపై జిల్లా లో ముమ్మర దాడులు నిర్వహించి నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటాము.
–శేఖర్‌రెడ్డి, డిస్ట్రిక్ట్ ఫుడ్ ఇన్‌స్పెక్టర్, ఉమ్మడి కర్నూలు జిల్లా
కలర్స్‌తో క్యాన్సర్ వచ్చే ప్రమాదం
ఆహార పదార్థాల్లో రంగు, రుచి కోసం వాడే కలర్స్(బుష్‌పౌడర్ ) వల్ల పాంక్రియాస్, లివర్, పిత్తాశయ క్యాన్సర్‌లు వచ్చే అవకాశం ఉంది. కొన్నిచోట్ల టేస్టీ సాల్ట్‌లో పందిమాసంతో తయారు చేసిన పదార్థాన్ని కల్తీ చేస్తున్నారు. దీంతో పాటు అజినోమోటో సాల్ట్‌ను వాడటంతో జీర్ణాశయ, సంతానలేమి, సెక్స్ సమస్యలు వస్తాయి. కాబట్టి బయటి ఆహార పదార్థాల వినియోగంలో ప్రజలు తగు జాగ్రత్త వహించాలి.
–డాక్టర్ పి. అబ్దుల్ సమద్, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టు, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment