ప్రతీకాత్మకచిత్రం
కర్నూలులోని ఓ కాలనీకి చెందిన నిరంజన్, స్వప్న (పేర్లు మార్చాం) హైదరాబాదులో చదువులు పూర్తి చేశారు. ప్రస్తుతం ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వారిద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఒకచోట చేరి కాపురం పెట్టిన రెండేళ్లకే అత్తింటి ఆచారాలు వధువుకు నచ్చలేదు. కొంతకాలం మౌనంతో భరించినా ఆ తర్వాత కోర్టు మెట్లెక్కి విడాకులు తీసుకున్నారు.
కర్నూలు పాతబస్తీకి చెందిన నరేష్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. భార్య స్రవంతి(ఇద్దరి పేర్లు మార్చాం)కి ఫోన్ చేసిన ప్రతిసారి సెల్‌ఫోన్ బిజీ వస్తుండటంతో భర్త అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై తరచూ వారు వాదులాడుకునేవారు. భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇప్పించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. చివరకు కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకున్నారు.
చిన్నచిన్న విషయాలకే భార్యాభర్తలు విడిపోతున్నారు. నాలుగు గోడల మధ్య సర్దిచెప్పాల్సిన ఇరు కుటుంబాల పెద్దలు ఒక్కోసారి మరింత ఆజ్యం పోస్తున్నారు. చిలిపి తగాదాలను సైతం భూతద్దంలో చూస్తూ బంధాన్ని బలహీనం చేసుకుంటున్నారు. ఒక్కోసారి విడిపోయేందుకు కూడా జంకడం లేదు. కడదాకా కలిసి ఉంటామనే పెళ్లినాటి బాసలను అపహాస్యం చేస్తూ ఏడాది తిరక్కముందే భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు.
సాక్షి, కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో విడాకుల కోసం వచ్చే దంపతులు ఎక్కువయ్యారు. ఇక మూడేళ్ల కాలంలో చిన్నచిన్న మనస్ఫర్థలతో 2,986 మంది పోలీస్‌స్టేషన్లను ఆశ్రయించగా.. కలిసి ఉండటానికి ఇష్టపడని మరో 632 మంది కోర్టు మెట్లెక్కారు. వివిధ పోలీస్‌స్టేషన్లకు వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం 30 ఏళ్ల లోపు వారే ఉండటం ఆందోళన కరం. గొడవ పడే దంపతుల్లో ఎవరూ వెనక్కు తగ్గేందుకు ఇష్టపడటం లేదు. పెళ్లి అయిన యువతులు కొత్త కాపురంలోకి కాలు పెట్టగానే అప్పటివరకు ఊహించుకున్నవి గాలిమేడలనే అభిప్రాయానికి వస్తున్నారు.
పుట్టిన రోజును మరచిపోవడం, పండక్కి పుట్టింటికి పంపడం లేదన్న చిన్నచిన్న కారణాలకే మనస్తాపం చెంది సమస్యను రాద్ధాంతం చేసుకునేంతవరకు వెళ్తోంది. ఒక్కోసారి వారు గుర్తించలేనంత స్థాయిలో అగ్నికి ఆజ్యం పోసేలా మూడో శత్రువు ప్రవేశిస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగులో సఖ్యతగా ఉండే ఎవరో ఒకరు లేనిపోని అనుమానాలను పెంచుతున్నారు. వారు చెప్పేది నిజమా? కాదా? అని ఆలోచించకుండానే దంపతులిద్దరూ ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటున్నారు. ఇలాంటి జంటలకు కౌన్సెలింగ్ ఇస్తున్నప్పటికీ మార్పు చెందకపోవడం వల్ల సంసారాల్లో కలతలు పెద్దవై విడాకుల వరకు వెళ్తున్నారు.
ప్రేమ వివాహాలు చేసుకున్నవారే అధికం
పోలీస్‌స్టేషన్లకు ఎక్కువ ప్రేమ వివాహాలు చేసుకున్నవారే వస్తున్నారు. యుక్త వయస్సులో ఆకర్షణకు లోనై ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. పిల్లలు పుట్టాక ఆర్థిక సమస్యలు ఎదురై కలహాలు ప్రారంభమవుతున్నాయి. ముందే ప్రేమికులు కావడంతో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. ఈకారణంతో భార్యాభర్తలు పంతాలకు వెళ్తున్నారు.
పోలీసులు ఏం చెబుతున్నారంటే..
కాపురంలో భరించలేనంత ఆర్థిక ఇబ్బందులేమీ కనిపించవు. కానీ ఒకరికొకరు బద్ధ శత్రువుల్లా భావిస్తున్నారు. ఇంత తీవ్రమైన నిర్ణయానికి వస్తున్న దంపతుల్లో అధిక శాతం పెళ్లయిన ఏడాది నుంచి నాలుగేళ్ల లోపు వారే ఎక్కువగా పోలీసులను ఆశ్రయిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. విడాకులు కావాలని చెప్పే కారణాలు చాలా చిన్నవిగా ఉంటున్నట్లు కౌన్సెలింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఉన్నత విద్యావంతులైన భార్యాభర్తలు కూడా ఎవరి స్వేచ్ఛ వారిదే అనే పద్ధతిలో పంతాలకు పోతున్నట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ప్రేమ వివాహాలు చేసుకున్నవారు కూడా ఏడాది, రెండేళ్లకే అర్థం లేని పట్టింపులతో గొడవలు పడుతూ విడాకుల దాకా వెళ్తున్నారు.
విభేదాలకు కారణాలు..
►మద్యం కారణంగా జరిగే గొడవలు – 33%
►వరకట్న వేధింపులు – 31%
►వివాహేతర సంబంధాలు/అనుమానాలు – 26%
►మగపిల్లలు పుట్టలేదని/సంతానం కలగలేదన్న కారణాలతో – 5%
►ఇతర కారణాలు – 5%
చిన్న కారణాలకే మనస్పర్థలు పెంచుకుంటున్నారు
చిన్న కారణాలకే దంపతుల మధ్య మనస్పర్థలు పెరిగి పోలీసులను ఆశ్రయిస్తున్నా రు. ఇరు కుటుంబాల సభ్యుల తో మాట్లాడి కౌన్సెలింగ్ ఇస్తూ చాలామందిలో మార్పు తీసుకొస్తున్నాం. అయినా కొందరు కోర్టు దాకా వెళ్తూ విడాకులు కోరుకుంటున్నారు. పలు సమస్యలతో దంప తుల మధ్య సఖ్యత తగ్గి విడాకుల దాకా వెళ్తున్నారు.
– వెంకటరామయ్య, దిశ మహిళా పీఎస్ డీఎస్పీ
కుటుంబ వ్యవస్థపై అవగాహన ఉండాలి
ప్రస్తుత పరిస్థితుల్లో యువ జంటలకు కుటుంబ వ్యవస్థపై అవగాహన లేకపోవడం, సర్దుబాటు ధోరణి సన్నగిల్లడం వల్ల విడాకుల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. పెంపక లోపం, ఆర్థిక స్వేచ్ఛ, అహంకారం, అక్రమ సంబంధాలు కూడా విడాకులకు కారణమవుతున్నాయి. కుటుంబ వ్యవస్థ సక్రమంగా నిలబడాలంటే స్త్రీ పాత్ర ముఖ్యమైనది.
– ఎ.అన్నపూర్ణారెడ్డి, అడ్వకేట్
Comments
Please login to add a commentAdd a comment