Family system
-
సోలో బ్రతుకే సో బెటర్ అంటున్న యూత్.. ఇలా తయారయ్యారేంటి?
నేటి తరం.. ఒక కన్ఫ్యూజన్. తానేంటో తనకే తెలియదు. తనకు ఎలాంటి లైఫ్ పార్టనర్ కావాలో తెలియదు. అవతలి వ్యక్తి పర్సనాలిటీని కనిపెట్టలేరు. ఉద్రేకంతో మోహించి , అదే ప్రేమ అని భ్రమించి పెళ్ళాడి , మోజు తీరగానే కొట్లాడి పెటాకులు తెచ్చుకొని, ఇక పెళ్లి యుగం అయిపోయిందని తీర్పులు ఇస్తున్న చదువుకొన్న నాగరికులు. అయినా తప్పు వీళ్లది కాదు వీళ్ల చదువులది. అది అమెరికాలో ఉద్యోగం అయితే ఇప్పించింది. కానీ ఎలా బతకాలో చెప్పలేదు. ఇంకేముంది బతుకు బస్టాండ్ ,ఆపై డిప్రెషన్లు, సూసైడ్లు... పెళ్ళయితే ?.. భార్య భార్య / భర్త , పిల్లలే సంసారం. పెళ్లికి లీవ్, హనీమూన్‌కి లీవ్, మెటర్నిటీ లీవ్.. పిల్లలకు ఆరోగ్యం బాగోకపోతే రెండు, మూడు రోజులు లీవ్. భార్య,భార్తల్లో ఎవరికి ట్రాన్స్ఫర్ అయినా మరొకరు రాజీనామా చేయాల్సిన పరిస్థితి. అదేమంటే, ఫ్యామిలీ ఫస్ట్ ప్రయారిటీ, ఆ తర్వాతే ఉద్యోగం అంటారు. ఇప్పుడప్పుడే పెళ్లి గట్రా వద్దంటున్నారు ఈ బ్రహ్మచారులు. 30దాటినా.. అప్పుడే పెళ్లికి, లివ్ఇన్కి తొందరేముంది? అంటూ నిర్మొహమాటంగానే చెప్పేస్తున్నారు. ఆపై ఉద్యోగమే సర్వస్వం అనుకొని కంపెనీ బానిసలుగా బతుకీడుస్తున్నారు. ఆఫీస్ జిందాబాద్, పెళ్లి, కుటుంబం డౌన్డౌప్ అంటూ పిచ్చి వాగుడు వాగేవాళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మరి కుటుంబం ఛిన్నాభిన్నమేనా? మావోయిస్టుల కాలంలో చైనాలో.. “కుటుంబ వ్యవస్థ మనిషిలో స్వార్థాన్ని పెంపోందిస్తుంది.. కానీ కుటుంబ వ్యవస్థను నాశనం చేస్తేనే అసలుసిసలు కమ్యూనిజం వస్తుంది” అని పెద్ద ప్రయత్నం జరిగింది. కానీ కొన్నాళ్లకే అది తస్సుమంది. యాభై ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు కాపిటలిస్ట్ అమెరికాలో బహుళ జాతి కంపెనీలు.. కంపెనీ బానిసలను తయారుచేయడం కోసం ఇలాంటి ప్రయత్నమే చేస్తున్నాయి. మన దగ్గర్నుంచి ఉద్యోగం కోసం అమెరికా వెళ్లిన మనోళ్లు(కొత్తతరం) ఈ ట్రాప్‌లో పడిపోయి పెళ్లి శకం ముగిసింది అని బ్రహ్మచారి జీవితానికి సిద్ధమయిపోతున్నారు. -ఈ వెస్ట్రన్ కల్చర్ ఇప్పుడు మన దేశంలోనూ చాప కింద నీరులా విస్తరిస్తోంది. ఇంకా ఈ ట్రెండ్ ముదిరిపోక ముందే వేకప్ కాల్ అనుకొని పరిస్థితులను సమీక్షిస్తే మంచిది. వాసిరెడ్డి అమర్ నాథ్ మానసిక శాస్త్ర పరిశోధకులు, ప్రముఖ విద్యావేత్త -
వాటిపై మోజు,ముప్పై దాటినా పెళ్లి ముచ్చట లేదు...కారణమిదే!
కుటుంబ వ్యవస్థ ఇక నిలబడదు.. అతి తొందరలోనే కుటుంబ వ్యవస్థ కూలి పోతుంది అనే అభిప్రాయం ఈమధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం.ఫ్యామిలీ అంటే ఇష్టం లేకున్నా ఏదో తూ..తూ...మంత్రంగా ఇష్టం అన్నట్టు నటిస్తున్నారు. నిజానికి మనుషులు అంటేనే జనాలకు అలెర్జీ పుడుతోంది. దగ్గరి వారు అంటే నచ్చడమే లేదు!అసలు కుటుంబ వ్యవస్థ కూలిపోవడానికి కారణాలు ఏంటన్నది ఇప్పుడు చూద్దాం. అతి తెలివి చిన్న తప్పును కూడా భరించే శక్తి,సహనం లేవు. అందరూ సమానమే అనే వింత భావన పెరగటం (డెమాక్రసి). పెద్దలూ, పిల్లలూ అందరూ కూర్చొని మాట్లాడుకోక పోవడం. ఎంతసేపూ ఎంటర్ టైన్ మెంట్ ప్రోగ్రాంలలో మునిగి పోవడం. ఎక్కడో ఉన్న సినిమా నటులు, ఈరోజు ఉదయం ఏమి చేశారో చెప్ప గలుగుతున్నారు.కానీ, ఇంట్లో వారు ఎప్పుడు ఏమి చేస్తున్నారో చెప్పలేని దుస్థితి వచ్చేసింది. చిన్న చిన్నదానికీ అలిగి, దగ్గరి వారికి కూడా దూరం అవుతున్నారు. ఎవరో ఒకరి నోటి దురుసుతనం కుటుంబం మొత్తం చిన్నాభిన్నం కావడానికి కారణం అవుతుంది . ఆర్థిక సమస్యల వల్ల ఇంటి పెద్దలు సరిగ్గా, దృఢంగా, బలంగా మేనేజ్ చేయలేక పోవడం కూడా ఒక కారణం. ఇంట్లో భార్యా భర్తలు (తల్లిదండ్రులు) చీటికి మాటికి తగాదా పడుతూ ఉంటే ఇంటిల్లి పాది ఏదో దిగులుతో ఉంటున్నారు. అన్ని కుటుంబాల్లో గొడవలు, కొట్లాటలు చూసి ఫ్యామిలీ అంటే జడుసుకుంటున్నారు.అన్యోన్యంగా, ప్రేమతో, అవగాహనతో ఉన్న ఫ్యామిలీస్ కనబడకపోవడంతో ఆ వ్యవస్థపై నమ్మకం పోయింది.. అందుకే యువత పెళ్ళిళ్ళు చేసుకోవడం లేదు. "ముఫై దాటినా" పెళ్లి ముచ్చట ఎత్తడమే లేదు. గత ముఫై నలభై ఏళ్ళల్లో మనస్ఫర్థలు, గొడవలతో విసిగి వేసారిన జనం అలాంటి వ్యవస్థ వద్దు బాబోయ్ అని తమ పిల్లలకు నేరుగానే చెబుతున్నారు. ఆర్థిక అవసరాలు, వ్యత్యాసాలు, పోల్చుకోవడం, తదితర కారణాలు అధికమయ్యాయి . మనుషులు అంటేనే విలువ లేదు. మనిషికి మరో మనిషి అంటే బోర్ వచ్చేసింది. అధిక జనాభా, సుఖ విలాస, సుఖాలకు అడ్డు వచ్చిన వారిని అంతమొందించే తెగింపుతనం వచ్చింది. మధ్యవర్తిత్వం వహించే పెద్దలు లేకుండా అయ్యారు. దీంతో ఎవరిష్టం వారిదే అయ్యింది. కుటుంబ నిర్వహణ ఒక కళ. అది అందరికీ లేకపోవడం వల్ల వ్యవస్థ అతలాకుతలం కావడానికి కారణం అవుతుంది. మానవ ప్రవర్తనపై కనీస అవగాహన లేని దుస్థితి వచ్చింది. మొరటుగా ప్రవర్తిస్తున్నారు. నేను, నా భార్య/భర్త, అనే సిద్దాంతం పోయి "నేనే నేను" "నేను నేనే"పాలసీ వచ్చింది.పిల్లలకు పెళ్లి కాగానే వేరుపడేయటం ఆచారమైనది. ఇంట్లో ఉంచుకోవాలంటే భయపడుతున్నారు. అంత్య నిష్టూరం కన్నా ఆది నిష్టూరం మేలు అంటున్నారు. కుటుంబ విలువలు, కట్టుబాట్లు ఇక ఉండవు. ఎవరిష్టం వాళ్లదే అయ్యే రోజులు వచ్చేశాయి. అన్నాదమ్ములు, అన్నా చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్లు, భార్యా భర్తల మధ్య బలమైన బంధాలు ఇప్పుడు లేవు. సమస్త మానవ సంబంధాల కథ ఫినిష్ అయ్యింది. ప్రస్తుతం నడుస్తుందంతా ఒక షో.. ఒక నాటకం. ఈ షో కూడా ఇంకొన్నాళ్ళకి పూర్తిగా ఉండకుండా పోతుంది. డిజిటల్ ప్లాట్‌ఫాంపై ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలే నిజమైనవి అని అపోహలో బతుకుతున్న జనం. మెరుగైన ప్యాకేజీలు, విలాస జీవితాలపై మోజు పెంచుకుంటున్న యువతులు సాధారణ ఉద్యోగులను పెళ్లి చేసుకునే పరిస్థితి రావడం లేదు. 30 ఏళ్లు దాటిపోతున్నా ఎంతోమంది యువకులు పెళ్లిళ్ల కోసం ఎదురు చూస్తున్నారు. ఎవరైనా చనిపోతే ఒక ఆకర్షణీయమైన మెసేజ్ లేదా RIP అని పెట్టి అంతటితో వదిలేస్తున్నారు. మోయడానికి కూడా నలుగురు వచ్చే పరిస్థితి లేకుండా పోతుంది. ఇదంతా ఊరికే అనుకోవడం తప్ప ఏమీ చేయలేము. అరణ్య రోదన మాత్రమే!! -
అసలే లవ్ మ్యారేజ్.. స్వేచ్ఛ ఎక్కువే.. ఇంకేముంది.. పెళ్లయిన మూణ్ణాళ్లకే పెటాకులు!
కర్నూలులోని ఓ కాలనీకి చెందిన నిరంజన్, స్వప్న (పేర్లు మార్చాం) హైదరాబాదులో చదువులు పూర్తి చేశారు. ప్రస్తుతం ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వారిద్దరి మధ్య స్నేహం కాస్తా ప్రేమగా మారి పెద్దల అంగీకారంతో వివాహం చేసుకున్నారు. ఒకచోట చేరి కాపురం పెట్టిన రెండేళ్లకే అత్తింటి ఆచారాలు వధువుకు నచ్చలేదు. కొంతకాలం మౌనంతో భరించినా ఆ తర్వాత కోర్టు మెట్లెక్కి విడాకులు తీసుకున్నారు. కర్నూలు పాతబస్తీకి చెందిన నరేష్ ప్రభుత్వ ఉపాధ్యాయుడు. భార్య స్రవంతి(ఇద్దరి పేర్లు మార్చాం)కి ఫోన్ చేసిన ప్రతిసారి సెల్‌ఫోన్ బిజీ వస్తుండటంతో భర్త అనుమానం పెంచుకున్నాడు. ఇదే విషయమై తరచూ వారు వాదులాడుకునేవారు. భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి కౌన్సెలింగ్ ఇప్పించారు. అయినా ప్రయోజనం లేకపోయింది. చివరకు కోర్టును ఆశ్రయించి విడాకులు తీసుకున్నారు. చిన్నచిన్న విషయాలకే భార్యాభర్తలు విడిపోతున్నారు. నాలుగు గోడల మధ్య సర్దిచెప్పాల్సిన ఇరు కుటుంబాల పెద్దలు ఒక్కోసారి మరింత ఆజ్యం పోస్తున్నారు. చిలిపి తగాదాలను సైతం భూతద్దంలో చూస్తూ బంధాన్ని బలహీనం చేసుకుంటున్నారు. ఒక్కోసారి విడిపోయేందుకు కూడా జంకడం లేదు. కడదాకా కలిసి ఉంటామనే పెళ్లినాటి బాసలను అపహాస్యం చేస్తూ ఏడాది తిరక్కముందే భార్యాభర్తలు విడాకులు తీసుకుంటున్నారు. సాక్షి, కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలో విడాకుల కోసం వచ్చే దంపతులు ఎక్కువయ్యారు. ఇక మూడేళ్ల కాలంలో చిన్నచిన్న మనస్ఫర్థలతో 2,986 మంది పోలీస్స్టేషన్లను ఆశ్రయించగా.. కలిసి ఉండటానికి ఇష్టపడని మరో 632 మంది కోర్టు మెట్లెక్కారు. వివిధ పోలీస్స్టేషన్లకు వస్తున్న ఫిర్యాదుల్లో ఎక్కువ శాతం 30 ఏళ్ల లోపు వారే ఉండటం ఆందోళన కరం. గొడవ పడే దంపతుల్లో ఎవరూ వెనక్కు తగ్గేందుకు ఇష్టపడటం లేదు. పెళ్లి అయిన యువతులు కొత్త కాపురంలోకి కాలు పెట్టగానే అప్పటివరకు ఊహించుకున్నవి గాలిమేడలనే అభిప్రాయానికి వస్తున్నారు. పుట్టిన రోజును మరచిపోవడం, పండక్కి పుట్టింటికి పంపడం లేదన్న చిన్నచిన్న కారణాలకే మనస్తాపం చెంది సమస్యను రాద్ధాంతం చేసుకునేంతవరకు వెళ్తోంది. ఒక్కోసారి వారు గుర్తించలేనంత స్థాయిలో అగ్నికి ఆజ్యం పోసేలా మూడో శత్రువు ప్రవేశిస్తున్నట్లు పోలీసులు పేర్కొంటున్నారు. స్నేహితులు, బంధువులు, ఇరుగుపొరుగులో సఖ్యతగా ఉండే ఎవరో ఒకరు లేనిపోని అనుమానాలను పెంచుతున్నారు. వారు చెప్పేది నిజమా? కాదా? అని ఆలోచించకుండానే దంపతులిద్దరూ ఒకరిపై ఒకరు ద్వేషం పెంచుకుంటున్నారు. ఇలాంటి జంటలకు కౌన్సెలింగ్ ఇస్తున్నప్పటికీ మార్పు చెందకపోవడం వల్ల సంసారాల్లో కలతలు పెద్దవై విడాకుల వరకు వెళ్తున్నారు. ప్రేమ వివాహాలు చేసుకున్నవారే అధికం పోలీస్స్టేషన్లకు ఎక్కువ ప్రేమ వివాహాలు చేసుకున్నవారే వస్తున్నారు. యుక్త వయస్సులో ఆకర్షణకు లోనై ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటారు. పిల్లలు పుట్టాక ఆర్థిక సమస్యలు ఎదురై కలహాలు ప్రారంభమవుతున్నాయి. ముందే ప్రేమికులు కావడంతో స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. ఈకారణంతో భార్యాభర్తలు పంతాలకు వెళ్తున్నారు. పోలీసులు ఏం చెబుతున్నారంటే.. కాపురంలో భరించలేనంత ఆర్థిక ఇబ్బందులేమీ కనిపించవు. కానీ ఒకరికొకరు బద్ధ శత్రువుల్లా భావిస్తున్నారు. ఇంత తీవ్రమైన నిర్ణయానికి వస్తున్న దంపతుల్లో అధిక శాతం పెళ్లయిన ఏడాది నుంచి నాలుగేళ్ల లోపు వారే ఎక్కువగా పోలీసులను ఆశ్రయిస్తుండటం ఆందోళన కలిగించే అంశం. విడాకులు కావాలని చెప్పే కారణాలు చాలా చిన్నవిగా ఉంటున్నట్లు కౌన్సెలింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. ఉన్నత విద్యావంతులైన భార్యాభర్తలు కూడా ఎవరి స్వేచ్ఛ వారిదే అనే పద్ధతిలో పంతాలకు పోతున్నట్లు పోలీసులు అభిప్రాయపడుతున్నారు. ప్రేమ వివాహాలు చేసుకున్నవారు కూడా ఏడాది, రెండేళ్లకే అర్థం లేని పట్టింపులతో గొడవలు పడుతూ విడాకుల దాకా వెళ్తున్నారు. విభేదాలకు కారణాలు.. ►మద్యం కారణంగా జరిగే గొడవలు – 33% ►వరకట్న వేధింపులు – 31% ►వివాహేతర సంబంధాలు/అనుమానాలు – 26% ►మగపిల్లలు పుట్టలేదని/సంతానం కలగలేదన్న కారణాలతో – 5% ►ఇతర కారణాలు – 5% చిన్న కారణాలకే మనస్పర్థలు పెంచుకుంటున్నారు చిన్న కారణాలకే దంపతుల మధ్య మనస్పర్థలు పెరిగి పోలీసులను ఆశ్రయిస్తున్నా రు. ఇరు కుటుంబాల సభ్యుల తో మాట్లాడి కౌన్సెలింగ్ ఇస్తూ చాలామందిలో మార్పు తీసుకొస్తున్నాం. అయినా కొందరు కోర్టు దాకా వెళ్తూ విడాకులు కోరుకుంటున్నారు. పలు సమస్యలతో దంప తుల మధ్య సఖ్యత తగ్గి విడాకుల దాకా వెళ్తున్నారు. – వెంకటరామయ్య, దిశ మహిళా పీఎస్ డీఎస్పీ కుటుంబ వ్యవస్థపై అవగాహన ఉండాలి ప్రస్తుత పరిస్థితుల్లో యువ జంటలకు కుటుంబ వ్యవస్థపై అవగాహన లేకపోవడం, సర్దుబాటు ధోరణి సన్నగిల్లడం వల్ల విడాకుల కోసం కోర్టులను ఆశ్రయిస్తున్నారు. పెంపక లోపం, ఆర్థిక స్వేచ్ఛ, అహంకారం, అక్రమ సంబంధాలు కూడా విడాకులకు కారణమవుతున్నాయి. కుటుంబ వ్యవస్థ సక్రమంగా నిలబడాలంటే స్త్రీ పాత్ర ముఖ్యమైనది. – ఎ.అన్నపూర్ణారెడ్డి, అడ్వకేట్ -
అగ్గిపెట్టెలాంటి ఇల్లు.. రెండు ముసలి ప్రాణాలు
అగ్గిపెట్టెలాంటి ఇల్లు.. అందులో బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్న రెండు ముసలిప్రాణాలు.. పలకరించే నాథులు లేరు.. అవసరమైతే ఆదుకునే ఆప్తులు కరువు.. పిల్లలు ఉన్నా ఎక్కడో.. ఏ దేశంలోనో, ఇతర ప్రాంతాల్లోనో ఉద్యోగాలు చేస్తూ వారి బతుకు వారిది.. వీరి బతుకు వీరిది.. ఒంటరి జీవితం.. నేడు ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి.. కొడుకులూ, కోడళ్లూ.. కూతుళ్లూ, అల్లుళ్లూ.. మనవళ్లు, మనవరాళ్లు విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారని గొప్పగా చెప్పుకుంటున్నా.. లోలోపల తమ బిడ్డలు తమతో లేకపోతిరే అనే ఆవేదన ఏదో ఒక మూలన ఆ ముసలి ప్రాణాలను తోడేస్తూనే ఉంటుంది.. ఇలా వృద్ధదంపతులు నేడు ఒంటరి పక్షులుగా మారిపోయారు.. మీరక్కడ.. మేమిక్కడ అన్నట్లుగా తల్లిదండ్రులు.. పిల్లలూ తలొకచోట ఏకాకులుగా మారి కుటుంబ వ్యవస్థ కడు దయనీయంగా మారింది. సాక్షి, నెల్లూరు(బారకాసు): ప్రతి ఒక్కరికి జీవితంలో వారి కుటుంబం ముఖ్య భూమిక పోషిస్తుంది. కానీ నేడు కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నామైపోతోంది. ఉమ్మడి కుటుంబాలు అసలు కనిపించని పరిస్థితి. ఆర్థిక, సామాజిక స్థితిగతులు, మారిన జీవన విధానం, సంపాదన, ఉద్యోగంతో చెట్టుకొకరు.. పుట్టకొకరుగా మారారు. బంధుత్వాలు తగ్గాయి. బంధువులు దూరమవుతున్నారు. చిన్నారులు, యువత.. చదువు, ఉద్యోగాల నేపథ్యంలో తల్లిదండ్రులను ఒంటరిగా వదిలి ఎక్కడెక్కడికో వెళ్లిపోతున్నారు. ఒకప్పుడు పట్టణాల్లోనే ఈ పరిస్థితి ఉండగా నేడు పల్లెల్లోనూ ఇలాంటి కుటుంబాలు చాలా కనిపిస్తున్నాయి. రెక్కలొచ్చిన పక్షుల్లా పిల్లలు విదేశాలకు, ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతుండగా తల్లిదండ్రులు ఏకాకులుగా మిగిలిపోతున్నారు. మారిన పరిస్థితులతో.. ఆర్థిక సమస్యలు కూడా కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత పరంగా సమస్యలు సృష్టించి మనుషులను వేరు చేస్తున్నాయి. ప్రస్తుత నాగరిక సమాజంలో రూపాయి విలువ గణనీయంగా పడిపోయింది. దీంతో ఆర్థిక వనరులు కీలకపాత్ర పోషిస్తున్నాయి. ధరల ప్రభావంతో ఖర్చులు పెరిగిపోతున్నాయి. జల్సాలు, ఉన్నతమైన జీవనం అలవడుతున్నాయి. దీంతో సంపాదనపై మోజు పెరిగింది. వృత్తిరీత్యా ఇతర ప్రాంతాలకు ఉద్యోగ, వ్యాపార నిమిత్తం వెళుతున్నారు. పొద్దున లేచినప్పటి నుంచి ఈ కార్యక్రమాలతో బిజీగా కాలం వెళ్లదీస్తున్నారు. కొంతమంది ఇతర దేశాలకు వెళుతున్నారు. ఈ నేపథ్యంలో తల్లితండ్రులు ఒంటరిగా మారడం, కుటుంబాలు విడిపోవడం జరుగుతోంది. ఆనందాన్ని ఎవరు కోరుకోరు.. తమ పిల్లలు రూ.లక్షలు సంపాదించారని తల్లిదండ్రులు గర్వంగా చెబుతున్నారు. పిల్లలు ఎంతో ఎత్తుకు ఎదగడం వారికి ఆనందాన్ని కలిగిస్తుంది. కానీ పిల్లలు తమ వద్ద లేని తమ కుటుంబాలు ఆనందంగా ఉంటున్నాయని చెప్పేవారు చాలా తక్కువగా ఉన్నారు. సంపాదన, ఉన్నత స్థానానికి చేరడం నిజమైన ఆనందం కలిగించదని, తరచి చూస్తే అదంతా నీటిబుడగే అని చెబుతున్నారు. కన్నబిడ్డలు ఎంత ఎత్తుకు ఎదిగినా తమ కళ్ల ఎదుటే ఉంటే తల్లితండ్రులు ఆనందపడతారని చాలామంది అభిప్రాయపడుతున్నారు. విదేశాల్లో ఏడాది పొడవునా బిజీగా గడిపినా ఏదైనా పండగకు పది రోజులు వచ్చి వెళితే.. మిగిలిన 355 రోజులు ఆ జ్ఞాపకాలతో బతికేస్తున్నామని చెప్పుకుంటుంటారు. కానీ విదేశాలకు వెళ్లిన వారిలో ఎక్కువ మంది రెండు మూడేళ్ల కొకసారి వచ్చి వెళుతుంటారు. మళ్లీ ఎప్పుడు వస్తారా అని కన్నీటితో ఎదురుచూస్తున్న తల్లితండ్రులు అనేక మంది ఉంటున్నారు. ఆదరణ లేని కొందరు తల్లిదండ్రులు వృద్ధాశ్రమాలను సైతం ఆశ్రయిస్తున్నారు. ఇరుగుపొరుగుతో మాటలు కలపాలి గతంలో గ్రామీణ ప్రాంతాల్లో అందరూ రచ్చబండ, వీధుల్లో కూర్చొని కష్టసుఖాలు చెప్పుకునే వారు. ఇరుగుపొరుగు వారు కలసిమెలసి జీవనం సాగించేవారు. ప్రస్తుతం మారిన పరిస్థితుల్లో ఇరుగుపొరుగు వారితో మాటలు కరువయ్యాయి. ఎవరికి వారే యమునాతీరే అన్నట్లుగా జీవిస్తున్నారు. జీవితం సాఫీగా సాగాలంటే పది రూపాయలతో కాదు పది మందితో జీవితం పంచుకోవాలన్న మాట వాస్తమనేది గ్రహించాలి. అది బలపడితే కష్టసుఖాలు పంచుకునేందుకు కొంత ఆస్కారం ఉంటుంది. అందరూ ఉన్నా ఏకాకులే కాంక్రీట్ జంగిల్‌గా మారుతున్న నగరంలో ఇంటి చుట్టూ పదుల సంఖ్యలో కుటుంబాలు ఉన్నా.. అగ్గిపెట్టెలాంటి గదుల్లో ఇరుక్కుపోయి జీవనం సాగించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. పండగ, పబ్బాల సమయంలో ఒకరినొకరు చూసుకునే వింత ధోరణిలో అపార్ట్మెంట్ జీవితాలు సాగుతున్నాయి. కలసి ఉన్నా కలివిడితనం తక్కువగానే ఉంటోంది. పక్కింట్లో ఏమి జరుగుతున్నా పట్టించుకోని పరిస్థితుల్లో ఉన్నారంటే మానవీయ విలువలు ఎంత దిగజారుతున్నాయో అర్థమవుతోంది. ఏటా వృద్ధుల శాతం కూడా పెరుగుతోంది. వారు 2001లో 4.5 శాతం ఉండగా నేడు అది 6.0 శాతానికి చేరింది. 2050 నాటికి 30 శాతానికి చేరుతుందని అంచనా. తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధిక శాతం వయోవృద్ధులు ఉన్నారని అంచనాలు చెబుతున్నాయి. ఉమ్మడి కుటుంబాలు ఉంటే ఒకరి విలువ ఒకరికి తెలుస్తుంది. ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. మంచి ఉద్యోగం కోసం తల్లిదండ్రులకు దూరంగా వెళ్లిపోతున్నారు. ఇది తప్పని అనుకోకూడదు. ఎవరికైనా భవిష్యత్ ముఖ్యమే. అలా అని తల్లిదండ్రులను దూరం చేసుకోవడం చాలా తప్పు. లేటు వయస్సులో వారికి కావాల్సింది డబ్బు, సౌకర్యాలు కాదు. స్వాంతన కలిగించాలి. పిల్లల నుంచి వారు ప్రేమను మాత్రమే ఆశిస్తారు. అప్పుడే వారి చివరి మజిలీ ఆనందంగా సాగిపోతుంది. చాలామంది తల్లిదండ్రులు ఆ కోరిక తీరకుండానే మరణిస్తున్నారు. – డాక్టర్ శ్రీనివాసతేజ, మానసిక వ్యాధుల నిపుణుడు నెల్లూరు జిల్లాలో ప్రస్తుత జనాభా – సుమారు 32 లక్షలు 2011 లెక్కల ప్రకారం జిల్లాలో జనాభా 29 లక్షలు జిల్లాలో ఉన్న వృద్ధాశ్రమాలు – సుమారు 150 వీరిలో వృద్ధులు – సుమారు 7 లక్షలు ఆశ్రయం పొందుతున్న వృద్ధులు – సుమారు 3000 మంది -
బంధాలను కాపాడుకోవాలి!
ఆత్మీయం కుటుంబ వ్యవస్థను నిర్మించినవాడు దేవుడు! ఆ కుటుంబ బంధాలు అత్యంత పవిత్రంగా అనురాగ భరితంగా ఉండాలని నిర్దేశించినవాడూ దేవుడే! మనిషిని ఒక తల్లిగా, తండ్రిగా, అన్నగా, అక్కగా, చెల్లెలిగా, తమ్ముడిగా సృష్టించి ఆ బంధాల్లో ఇమిడ్చి పెట్టిన దేవుడు, ఆ బంధాల్లో అతను అనురాగభరితంగా జీవించాలని ఆశించిన దేవుడు అవే బంధాలను ఆధారం చేసుకొని తన ప్రేమను వ్యక్తీకరించడం అసమానం. కాని ఈనాడు వాస్తవానికి ఏం జరుగుతోంది? దురదృష్టవశాత్తూ పెచ్చరిల్లిన వాణిజ్య సంస్థలు, పాశ్చాత్య పోకడలు... కుటుంబ బంధాలను కూడా కలుషితం చేసి కకావికలం చేసి... దేవుడు నిర్మించిన కుటుంబ వ్యవస్థనే బలహీనపర్చి కూలదోస్తున్నాయి. దీని నుంచి బయట పడాలి. అంతా కళ్లు తెరవాలి, కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి. కుటుంబ బంధాలకు అతీతంగా మనిషి బతకలేడు. ఆప్తుల చావు వల్లో, అప్పులతోనో, సమస్యలతోనో, ఒంటరితనంతోనో అలమటిస్తున్న వారిని బాధపడవద్దని వెన్నుతట్టి ‘నీకు నేనున్నాను, మనందరికీ పైన దేవుడున్నాడు’ అని ఓదార్చడం వారికి ఎంత ఉపశమనాన్నిస్తుందో తెలుసా? ప్రయత్నించి చూడండి. -
మానవీయ విలువలు పెంపొందాలి
స్టేషన్ మహబూబ్‌నగర్: ప్రస్తుతం సమాజంలో కుటుంబవ్యవస్థ, మనుషుల వి లువలు తగ్గిపోయాయని ప్రొఫెసర్ హరగోపాల్ ఆవేదన వ్యక్తంచేశారు. మానవీ య విలువలు పెంపొందాలని ఆకాం క్షించారు. స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం స్థానిక ఆదర్శ డిగ్రీ కళాశాలలో ‘జిల్లా ఎస్బీహెచ్ పాల మూరు మిత్రుల’ ఆత్మీయసమ్మేళనం ని ర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. మానవత విలువలు మరుగునపడి వస్తువుల విలువుల వ్యామోహం పెరిగిందన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎస్బీ హెచ్ మిత్రుల సమావేశం నిర్వహించుకోవడం అభినందనీయమన్నారు. ఎస్బీ హెచ్ రాష్ట్ర అసోసియేషన్ మాజీ అధ్యక్షు డు శ్యాంసుందర్ మాట్లాడుతూ.. బ్యాం కులు ఈ రోజులు పటిష్టంగా ఉండి సా మాన్యులకు సేవలందిస్తున్నాయంటే బ్యాంకుల యూనియన్ ప్రధాన భూమిక పోషిస్తుందన్నారు. అనంతరం ఎస్బీహెచ్ పాలమూరు మిత్రుల లోగోతోపాటు టెలిఫోర్ డైరీని ఆవిష్కరించారు. కార్యక్రమంలో రిటైర్డ్ లెక్చరర్ వనమా ల, రిటైర్డ్ ఎస్బీహెచ్ అధికారులు కేవీ అశోక్, వి.నర్సింహ్మరావు, గజ్జెలయ్య, రంగయ్య, సుభాష్ పాల్గొన్నారు. పాతపల్లి దళితులకు అండగా ఉందాం జెడ్పీసెంటర్(మహబూబ్‌నగర్): పెబ్బేర్ మండలం పాతపల్లి గ్రామ దళితులకు అండగా నిలుద్దామని ప్రొఫెసర్ హరగోపాల్ పిలుపునిచ్చారు. ఆదివారం స్థానిక టీఎన్జీఓ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ దళితులపై దాడులు చేసిన వారిని చట్టపరంగా శిక్షించాలని డిమాండ్‌చేశారు. దళితులకు జీవించే హక్కు కల్పించాలని కోరారు. అన్యాయాన్ని ప్రశ్నించాల్సిన ప్రజాప్రతినిధులు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఇక్కడి దళితులపై 20సార్లు దాడులు జరిగాయని ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదన్నారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు దళితుల సమస్యను నీరుగార్చే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అక్కడి బోయలను దళితులకు వ్యతిరేంగా రెచ్చగొడుతున్నారన్నారు. రాజకీయాల నాయకుల క్రీడల్లో ప్రజలు బలికావద్దన్నారు. ఈనెల 6వ తేదీ చలో పాతపల్లి కార్యక్రమం నిర్వహిస్తున్న పేర్కొన్నారు. కార్యక్రమానికి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ మనుమడు ఆనంద్తేల్తుంబ్డే హాజరుకానున్నట్లు తెలిపారు. అనంతరం చలో పాతపల్లి పోస్టర్‌ను విడుదల చేశారు. అందుకు నిరసనంగా ఈనెల 9న హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్‌లో ధర్నా నిర్వహించనున్నట్లు తెలిపారు. పాలమూరు అధ్యయన వేదిక జిల్లా అధ్యక్షుడు రాఘవాచారి, చంద్రశేఖర్, యేసేపు, వామన్‌కుమార్, పూజారి పాల్గొన్నారు. -
ఎవరికి చుట్టం!
ఎక్కడ : అసెంబ్లీ పక్కన పబ్లిక్‌గార్డెన్స్ ఎప్పుడు : ఆదివారం, ఉదయం 9గంటలకు ఏమిటి : కొందరు మగవాళ్ల సమావేశం ఎందుకు : కుటుంబ వ్యవస్థను కాపాడడం కోసం ఎలా : సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ ద్వారా...... ఈవారం జనహితంలో పబ్లిక్ గార్డెన్స్ గేట్ లోపలికి అడుగుపెట్టాక...ఎడమచేతివైపు ఓ వంద అడుగులు వేస్తే....చింతచెట్లకింద ఓ యాభైమంది మగవాళ్లు కూర్చుని ఉన్నారు. అందరిమధ్యలో ఓ పెద్దాయన నిలబడి తన బాధలు చెప్పుకుంటున్నాడు. ‘‘మా కోడలు మామీద 498ఎ కేసు పెడతానంటోంది. తనకి మా కొడుకుతో ఇబ్బందులుంటే....కాటికి కాళ్లు చాచుకున్న మేం బలవ్వాలా...అంటూ మొదలుపెట్టాడు’’ అతను చెప్పిన సమస్యలన్నీ విన్నాక అక్కడ కూర్చున్న వాళ్లలో ఒకతను లేచి ఆ పెద్దాయనకి సలహాలిచ్చాడు. ‘‘మీ అబ్బాయిని, కోడల్ని కూర్చోబెట్టి మంచిగా మాట్లాడండి. మీ అబ్బాయి తప్పుంటే సరిచేసుకోడానికి, అతని ప్రవర్తన మార్చుకోడానికి మీ వంతు ప్రయత్నం మీరు చేయండి. మీ కోడలి బాధల్ని కూడా విని ఆమెని సమస్యల్ని నుంచి బయటపడేయడానిక్కూడా మీరే చొరవ తీసుకోండి. మీ కోడలైనా, కూతురైనా ఒక్కసారి పోలీస్‌స్టేషన్ గుమ్మం తొక్కితే ఒకటి కాదు, రెండు కాదు.. మూడు కుటుంబాలు చిక్కుల్లో పడతాయి.’’ అంటూ సలహా ఇచ్చాడు. అసలు ఎవరు వీళ్లంతా? ఎందుకు అక్కడికి వచ్చారో చూద్దాం... ‘‘ఎంత శక్తిమంతమైన చట్టాలున్నా... ఇంకా చాలామంది మహిళలు గృహహింసకు బలైపోతూనే ఉన్నారు. కట్నాల వేధింపులు, అనుమానంతో వేధించే భర్తలు చట్టాల్ని లెక్కచేయకుండా ప్రవర్తిస్తున్నారు. అలాంటివారిపై 498 ఎ సెక్షన్ కేసు పెడితే వారికి న్యాయం జరుగుతుంది. అలాకాకుండా... జీతం చేతికివ్వలేదని, తల్లిదండ్రుల్ని చూడమన్నాడని, చెప్పిన మాట వినలేదని పంతాలకు పోయి క్షణికావేశంలో ఈ చట్టాన్ని ఆశ్రయించడం మన దేశ కుటుంబ వ్యవస్థని అవమానపరచడమే’’ అంటూ తమ పోరాటం గురించి పరిచయం చేసుకున్నారు. ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిది నుంచి మధ్యాహ్నం ఒంటిగంటవరకూ పబ్లిక్‌గార్డెన్స్‌లో మీట్ అయ్యే ఈ బృందం...‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్ (సిఫ్)’ సభ్యులు. ముందుగా వీరంతా సెక్షన్ 498 ఎ బాధితులు. వీరంతా కలిసి ఈ సెక్షన్ దుర్వినియోగం కాకుండా కృషిచేస్తూ కుటుంబ వ్యవస్థని రక్షించడంకోసం తమ వంతు ప్రయత్నం చేస్తున్నామంటున్నారు. సిఫ్ సభ్యుడు ఫెరాజ్ మాట్లాడుతూ...‘‘మహిళలపై వేధింపుల్ని అరికట్టాలన్న ఉద్దేశంతో పుట్టిన ఈ చట్టం చిన్న చిన్న ఇగోలకు కూడా పరిఆసరాగా మారడం చాలా దారుణం. ఏదో చిన్న గొడవకి 498 ఎ సెక్షన్ కింద కేసు వేసి కుటుంబాన్ని సర్వనాశం చేసుకుంటున్న మహిళలసంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.’’ అంటూ ఆవేదన వ్యక్తం చేశారు కుటుంబం విలువైంది... ‘‘మన దేశంలో అన్నింటికన్నా బలమైంది, విలువైంది కుటుంబమే. మహిళైనా, పురుషుడైనా కుటుంబం లేకుండా ప్రశాంతంగా బతకలేరు. క్షణికావేశంలో కుటుంబాన్ని కోల్పోతున్నవారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. ఇందుకు కారణాలలో 498 ఎ సెక్షన్ దుర్వినియోగం కూడా ఒకటి. రకరకాల కారణాల వల్ల భర్త నుంచి విడిపోవాలనుకుంటున్న కొందరు మహిళలు నేరుగా విడాకులకు దరఖాస్తు చేసుకోకుండా... ముందు పోలీసుల్ని ఆశ్రయిస్తున్నారు. పోనీ భర్తమీద కేసు వేసి ఊరుకుంటున్నారా... అంటే ... కాదు, అతనితోపాటు తనకు కోపం ఉన్న అందరి పేర్లని రాసేస్తున్నారు. అత్త, మామ, ఆడపడచు, మరిది, బావ... అంటూ ఓ ఐదారు మందిని రోడ్డుకి ఈడుస్తున్నారు. దీనివల్ల ఆమెకొరిగేదేమీ ఉండదు. కొన్నాళ్ల తర్వాత ‘అనవసరంగా తొందరపడ్డానే’ అని బాధపడేవాళ్లూ ఉన్నారు. ఏ మహిళైనా 498 ఎ సెక్షన్‌కింద కేసు నమోదు చేస్తే భర ్తని వెంటనే అరెస్టు చేస్తారు. ఆ తర్వాత... మిగిలిన కుటుంబ సభ్యులకు సంబంధించి ప్రాథమిక విచారణ కూడా చేయకుండా పోలీసులు నిర్దాక్షిణ్యంగా సెల్లో పడేస్తున్నారు. ఎక్కడో ఆస్ట్రేలియాలో ఉన్న ఆడపడుచుని కూడా అరెస్టు చేయించారు. భర్త తప్పుచేస్తే అతనిమీద కేసు పెట్టాలి. అంతేకాని రక్తసంబంధీకులైన పాపానికి ఎక్కడో దేశం దాటిపోయినవాళ్లమీద కేసులు పెట్టి వారి కుటుంబాల్ని బజారుకీడ్చే హక్కు ఈమెకి ఎవరిచ్చారు? పెళ్లిచేసి నా బతుకు నాశనం చేశారనే అమ్మాయిలెంత మంది ఉన్నారో, అందులో పదోవంతు అబ్బాయిలు కూడా తమ జీవితభాగస్వాములతో ఇంచుమించు ఇటువంటి ఇబ్బందులే ఎదుర్కొంటున్నారు. ఎన్నోవిషయాల్లో ఎంతో పురోగమిస్తున్న మనం మన చట్టాలకు మగవాళ్ల సంక్షేమం ఎందుకు పట్టదో అర్థం కావట్లేదు. అందుకే ఎనిమిదేళ్ల క్రితం ముంబయిలో ‘సేవ్ ఇండియన్ ఫ్యామిలీ ఫౌండేషన్’ వెలిసింది’’ అని చెప్పారు సిఫ్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జ్ అలీ షా. దేశవ్యాప్తంగా... ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సంస్థలో 13, 500 మంది సభ్యులున్నారు. స్వచ్ఛందంగా పనిచేస్తున్నవారు ఇంతకు మూడింతలున్నారు. వీరి పోరాటం 498 ఎ చట్టం దుర్వినియోగం మీద మాత్రమే కాదు... ఏళ్ల తరబడి న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ కన్నబిడ్డలతో గడిపే అవకాశాన్ని కోల్పోతున్న మగవారి కోసం కూడా. ‘‘దేశంలో అన్ని రాష్ట్రాల్లో సిఫ్ సభ్యులు ఉన్నారు. మొన్నటివరకూ 498ఎ సెక్షన్‌కింద కేసు పెడితే వెనక్కి తీసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. రెండేళ్లక్రితం ట్యాంక్‌బండ్‌పై మేం చేసిన పోరాట ఫలితంగా మన రాష్ర్ట హైకోర్టు కేసుని వెనక్కి తీసుకునే అవకాశం కల్పించింది. కాని, ఏం లాభం... కొందరు మహిళలు కేసు పెట్టి వెనక్కి తీసుకోడానికి బేరాలాడుతున్నారు. భార్యాభర్తలమధ్య మధ్యవర్తుల పేరుతో పుట్టుకొచ్చే కొందరు పెద్దలు మరీ అన్యాయంగా డబ్బు సెటిల్మెంట్లు చేస్తున్నారు. దీనివల్ల వివాహవ్యవస్థ పైనే విరక్తి పుడుతోంది. ఇదిగో...ఇక్కడ ఉన్నవారిలో ఓ పదిమంది విదేశాల్లో స్థిరపడ్డవాళ్లున్నారు. ఈ కేసు పుణ్యాన అక్కడ ఉద్యోగం ఊడగొట్టుకుని ఇక్కడకొచ్చి పోలీస్స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. వాళ్ల భార్యలేమో ఉద్యోగాలు చేసుకుంటూ వీళ్లదగ్గర పోషణకు డబ్బులు తీసుకుంటూ హాయిగా బతికేస్తున్నారు. ఇక్కడ మా ఉద్దేశ్యం వీళ్లంతా మంచివారు, వీరి భార్యలు చెడ్డవారు అని కాదు. చట్టాన్ని అడ్డుపెట్టుకుని జీవితాలు నాశనం చేసుకోవడం ఎందుకు...అని!’’ అంటూ తన వాదనని వివరించారు మరో సభ్యుడు. కుటుంబం కోసం... మా పోరాటం మగవారికోసం కాదు...కుటుంబ సంక్షేమం కోసం అంటోన్న ఈ సంస్థ కొన్ని స్వచ్ఛంద సంస్థలతో కలిసి ఉచిత కౌన్సిలింగ్‌లు కూడా ఇస్తోంది. లోక్ అదాలత్ కింద న్యాయ సేవా సదన్‌లో ప్రీ ప్రివెన్షన్ కౌన్సిలింగ్లో పాల్గొంటోంది. కుటుంబంలో ఎవరితోనైనా సమస్య వస్తే నేరుగా పోలీస్ స్టేషన్లకు వెళ్లకుండా లోక్ అదాలత్‌ని ఆశ్రయిస్తే అక్కడ అధికారులు సమస్య పరిష్కారానికి సహకరిస్తారు. ఇలాంటి సంస్థల్ని ఆశ్రయించి కుటుంబాలను పదికాలలపాటు పచ్చగా ఉండేలా చూసుకోకుండా పోలీసుల్ని ఆశ్రయించి పొరపాటు చేస్తున్న మహిళలు కళ్లు తెరవాలని కోరుకుంటున్నారు సిఫ్ బృందం. 498ఎ చట్టం విలువైంది. శక్తిమంతమైన ఆయుధం. అయితే ఆ ఆయుధాన్ని జాగ్రత్తగా వాడాలి కాని దుర్వినియోగం చేయకూడదు. వందమంది నేరస్థులు తప్పించుకున్నా పరవాలేదు కాని... ఒక్క నిరపరాధికి శిక్ష పడకూడదు అన్న మన న్యాయశాస్త్ర సూత్రాన్ని దృష్టిలో పెట్టుకుని, హింసకు గురవుతున్న మహిళలకు రక్షణకవచంలా ఉన్న ఈ చట్టం దుర్వినియోగం కాకుండా జాగ్రత్తపడదాం. - భువనేశ్వరి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఇదొక్కటే కాదు... మన దేశంలో ఒక్క మహిళా చట్టాలే కాదు అన్ని చట్టాలు దుర్వినియోగం అవుతున్నాయి. ఎన్నో సంవత్సరాలు పోరాడి తెచ్చుకున్న చట్టాలివి. భర్త కొట్టినా, బాధ్యతగా ప్రవర్తించకపోయినా, అనుమానించినా... ఎలాంటి ఇబ్బంది అయినా వాటి నుంచి బయటపడడానికి నేటి మహిళలకి 498 సెక్షన్ ఒక్కటే దిక్కు. సమస్య చిన్నదయినా, పెద్దదయినా తట్టుకునే శక్తిలేనప్పుడు ఎవ్వరూ తనకు తోడుగా నిలబడనపుడు ఆ మహిళ చేతిలో ఉన్న ఏకైక ఆయుధం 498. ఆడ, మగ భేదాలు పక్కనపెడితే ఎవరికి అన్యాయం జరిగిందో కేసు విచారణ చేస్తేగాని చెప్పలేం. - నిశ్చల సిద్దారెడ్డి, ఎడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్, సికింద్రాబాద్ దుర్వినియోగం పెరుగుతోంది... రక్షణగా ఉపయోగపడాల్సిన చట్టాన్ని అవగాహన లేకుండా, క్షణికావేశంతో దుర్వినియోగం చేస్తున్నవారి సంఖ్య నిజంగానే పెరుగుతోంది. వాస్తవం చెప్పాలంటే నిజంగా హింసకు గురవుతున్న మహిళలు నేరాల్ని రుజువుచేయడంలో విఫలమై ఇబ్బందులు పడుతుంటే... తమ స్వార్థాలకు కేసులు పెట్టి జీవితాల్ని నాశనం చేసున్న మహిళలు కూడా మన కళ్లముందే ఉన్నారు. భార్యా, భర్త సంగతేమోగాని మధ్యలో పెద్దలు, మధ్యవర్తులు బాగుపడిపోతున్నారన్నది కూడా వాస్తవం! - పుణ్యవతి, ఐద్వా సంఘం ఉపాధ్యక్షురాలు -
కుటుంబ వ్యవస్థను కాపాడుకోవాలి
తిరుపతి అర్బన్, న్యూస్‌లైన్: కుటుం బ వ్యవస్థను కాపాడుకోవడం ద్వారా నే మానసిక, ఆరోగ్య రుగ్మతలు దూ రమవుతాయని తిరుపతి శ్రీపద్మావతీ మహిళా యూనివర్సిటీ వైస్ చా న్సలర్ డాక్టర్ రత్నకుమారి అభిప్రాయపడ్డారు. ఇండియన్ సైక్రియాట్రి క్ సొసైటీ ఆధ్వర్యంలో ‘‘జెండర్ డి వైడ్ అండ్ మ్యారేజ్-మెంటల్ హెల్త్ అండ్ లీగల్ ఇష్యూస్’’ అనే అం శం పై రెండురోజుల మానసిక వైద్యుల జాతీయ సదస్సు శనివారం తిరుపతిలో ప్రారంభ మైంది. స్థానిక రేణిగుంట రోడ్డులోని ఓ ప్రైవేటు హోటల్లో ఏర్పాటు చేసిన సదస్సుకు డాక్టర్ రత్నకుమారి ముఖ్య అతి థిగా హాజరై ప్రసంగించారు. మానసిక ఆరోగ్య ఇబ్బందుల కారణంగా స మాజంలో ప్రస్తుతం అనేక అరాచకాలు చోటు చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. విడాకులు తీసుకున్న దంపతులు, నిత్యం గొడవలుపడే దంపతుల తీరుతో పిల్లల్లో అరాచక భావాలు పెరిగేందుకు ఎ క్కువ దోహదం చేస్తాయని తెలిపా రు. పెళై ్లన ఏడాదిలోపే విడాకులు తీ సుకుంటున్న వారి సంఖ్య పెరిగిపోతుండడం కూడా సమాజాభివద్ధికి ఆటంకంగా మారుతోందని తెలిపా రు. అలాంటి పరిస్థితుల నుంచి కు టుంబ వ్యవస్థను కాపాడడానికి దం పతులకు కౌన్సెలింగ్‌లు నిర్వహించాల్సిన అవసరం ఉందని వివరించారు. ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ జాతీయ అధ్యక్షురాలు ఫ్రొఫెసర్ ఇందిరాశర్మ మాట్లాడుతూ వివిధ వైద్య అంశాలకు సంబంధించి నిర్వహిస్తు న్న నిరంతర వైద్య విద్యా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాల న్నారు. అంతకుముందు రుయా చి న్నపిల్లల వైద్య విభాగాధిపతి డాక్టర్ వీరాస్వామి, ఎస్వీ మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ శ్రీధర్, సదస్సు కో-ఆర్డినేటర్ డాక్టర్ ప్రసాదరావు ప్రసంగించారు. ఇండియన్ సైక్రియాట్రిక్ సొసైటీ జాతీయ ఉపాధ్యక్షుడు టీవీ అశోకన్, దేశంలోని వివిధ రా ష్ట్రాలకు చెందిన మానసిక వైద్య నిపుణులు పవన్‌కుమార్, కిషన్, పీకే సింగ్, వినయ్‌కుమార్, కిషోర్, రా మ్మనోహర్, 400 మంది వైద్యులు హాజరయ్యారు.