
న్యూఢిల్లీ: దేశంలో కుటుంబ వ్యవస్థ క్రమంగా విచ్చిన్నమై పోతోందని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. ప్రపంచమంతా ఒక్కటే కుటుంబం (వసుధైక కుటుంబం) అని భావించడం భారతీయ సంప్రదాయమని పేర్కొంది. ప్రస్తుతం ఆ భావన ఎక్కడా కనిపించడం లేదని, ఒక్కరే ఒక కుటుంబం అనే పరిస్థితి వచ్చిందని వెల్లడించింది. దగ్గరి కుటుంబ సభ్యులను సైతం కలిపి ఉంచలేకపోతున్నామని తెలియజేసింది.
తమ ఇంటిని, ఆస్తులను ఆక్రమించుకొని, తమను వేధిస్తున్న కుమారుడిని అక్కడి నుంచి ఖాళీ చేయించాలంటూ ఓ మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ పంకజ్ మిత్తల్, జస్టిస్ ఎస్.వి.ఎన్.భట్టితో కూడిన ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది.
కుటుంబం అనే భావన కనుమరుగైపోతోందని విచారం వ్యక్తంచేసింది. తల్లిదండ్రులతో పిల్లలను ఒక్కటిగా కలిపి ఉంచడం అసాధ్యంగా మారుతోందని తెలియజేసింది. ఈ కేసులో కుమారుడిని ఇంటి నుంచి బయటకు పంపించాల్సిన అవసరం లేదని భావిస్తున్నామని స్పష్టం చేసింది. తల్లిదండ్రుల జీవనానికి అవసరమైన ఖర్చులు ఇవ్వాలని కుమారుడిని ధర్మాసనం ఆదేశించింది.