Indian tradition
-
ఇండియన్ ట్రెడిషన్..ఫ్యాషన్ వాక్..
భారతీయ సంస్కృతికి అద్దం పట్టే రీతిలో సాగిన ఫ్యాషన్ వాక్ ఔరా అనిపించింది. ఆయా రాష్ట్రాల వస్త్రధారణతో సాగిన క్యాట్ వాక్ అందరినీ ఆకట్టుకుంది. తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్‌లోని రాయదుర్గంలోని ఎఫ్‌డీడీఐ ఆడిటోరియంలో ప్రధాని నరేంద్ర మోదీ భావజాలమైన వారసత్వ చేనేత వ్రస్తాలను ప్రోత్సహించేందుకు చేపట్టిన అవతరణ్–2024లో భాగంగా బుధవారం ఫ్యాషన్ వాక్ నిర్వహించారు. ఎఫ్‌డీడీఐ(ఫుట్‌వేర్ డిజైన్ డెవలప్మెంట్ ఇనిస్టిట్యూట్)లోని ఫ్యాషన్ డిజైన్ విభాగం రెండో సంవత్సరం విద్యార్థులు ఫ్యాషన్ వాక్ నిర్వహించారు. ఆయా రాష్ట్రాల్లో వివిధ పేర్లతో పిలిచే చీర కట్టు, పంచెకట్టుతో ర్యాంప్‌పై విద్యార్థులు మెరిశారు. యువతులు వివిధ రాష్ట్రాల సంప్రదాయాలను కళ్లకు కట్టినట్లు ప్రదర్శించారు. సాంఘిక సంస్కరణల చుట్టూ ఉండే సంప్రదాయ కథలలో భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే రీతిలో వ్రస్తాలను డిజైన్ చేశారని ఎఫ్‌డీడీఐ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎన్.తేజ్ లోహిత్‌రెడ్డి పేర్కొన్నారు. నిఫ్ట్ అసోసియేట్ ప్రొఫెసర్ మధుప్రియ ఝా ఠాకూర్, ఎల్జీఏడీ సీనియర్ ఫ్యాకల్లీ సి.వేణుగోపాల్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. బెస్ట్ డిజైనర్, బెస్ట్ మోడల్‌ను ఎంపిక చేయనున్నారు. (చదవండి: చందమామ లేదు.. యూట్యూబ్ ఉంది..!) -
మంగళకరం
భారతీయ సంప్రదాయంలో ఏదయినా ప్రారంభం చేసేటప్పుడు.. మంగళకరమైన వాక్కులతో, శబ్దాలతో ప్రారంభం జరుగుతుంటుంది. ‘మంగళాదీని మంగళమధ్యాని మంగళాంతాని శాస్త్రాణి ప్రథంతే’.. అంటారు. అంటే మంగళకర వాక్కుతో ప్రారంభించాలి, మధ్యలో మంగళకరమైన వాక్కు ఉండాలి. ముగింపును కూడా మంగళకరంగా పూర్తి చేయాలి.. అని శాస్త్ర వాక్కు. అంటే జీవితం ఎప్పుడూ మంగళకరంగా, శోభాయమానంగా ఉండాలి. శాంతికి విఘాతం కలగకుండా చూసుకుంటుండాలి. అంటే ఇతరుల మనశ్శాంతికి కారణమయ్యేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి. మంగళకర వాక్కులు, శబ్దాలు ఉన్నచోట పూజనీయత ఉంటుంది. వాతావరణం కూడా పరిశుద్ధమయి, దేవతల అనుగ్రహానికి కారణమవుతుందని విశ్వసిస్తాం. ఘంటానాదంతో పూజ ప్రారంభం చేస్తాం. ఎందుకని.. ఆగమార్థంతు దేవానాం/ గమనార్థంతు రాక్షసాం/ కురుఘంటారవంతత్ర/ దేవాతాహ్వాన లాంఛనం... అంటే రాక్షసులు అక్కడినుంచి వెళ్లిపోవాలన్నా, దేవతలు రావాలన్నా... ఘంట మోగాలి. ఆ శబ్దంలోని పవిత్రత, మంగళప్రదత్వం అటువంటిది. నాదస్వరం, షెహనాయి, మృదంగం, డోలు, శాక్సోఫోన్, మద్దెల, ఘంటలు, గజ్జెలు, ఢమరుకం, శంఖం, కొమ్ము, వేణువు, వీణ, వయోలిన్, హార్మోనియం, క్లారినెట్... ఇవన్నీ మంగళప్రదమైన శబ్దాలు చేసే సంగీత పరికరాలు. బ్యాండ్ కూడా అంతే... దానిలోని శాక్సోఫోన్ కానీ, క్లారినెట్ కానీ, ఇతర పరికరాలు కానీ అవి కూడా గురుముఖతః నేర్చుకుని వాయిస్తారు. వీటిని మోగించే కళాకారులను కూడా సమాజం సమున్నతం గా ఆదరిస్తుంది. పండిట్ రవిశంకర్, ఉస్తాద్ బిస్మిల్లాఖాన్ లను భారతరత్న వరించింది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్... వంటి ఎన్నో ప్రతిష్ఠాత్మక పురస్కారాలను ఆయన అందుకున్నారు. ‘నేను సరస్వతీ ఆరాధకుడిని’ అని బిస్మిల్లాఖాన్ ప్రకటించుకున్నారు. ‘యావత్ భారతదేశంలోని ప్రజలందరూ అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు..’ అని ఆయన తరచుగా అంటూండేవారు. ఒకసారి అమెరికాలో కచేరీ సందర్భంగా అభిమానులు ఆయనను అక్కడే ఉండిపొమ్మని కోరగా... కాశీని, విశ్వనాథుడిని, విశాలాక్షిని, గంగమ్మను వదిలి రాలేను అని.. ప్రకటించుకున్న గొప్ప దేశభక్తుడు. సింహాచలం ఆస్థాన విద్వాంసుడు చిట్టబ్బాయిని... సంగీతనాటక అకాడమీ, కళాప్రపూర్ణ వంటి బిరుదులెన్నో వరించాయి. కాకినాడలో సత్యనారాయణ అనే గొప్ప క్లారినెట్ విద్వాంసుడు ఎందరో శిష్యులను తయారు చేసాడు.. వారందరూ కలిసి ఆయనకు గురుదక్షిణగా బంగారు క్లారినెట్ ను బహూకరించారు. ఇటువంటి వాద్య సంగీత విద్వాంసులను కూడా గౌరవించడం, వారి కచ్చేరీలు నిర్వహించి వారిని, వారి కళను, వారి వాయిద్యాలను సమాదరించడం మన కర్తవ్యంగా భావించాలి. మంగళత్వం అనేది కోయిల కూతలో, మామిడాకులో వానచినుకులో, పసుపులో, కుంకుమలో, పువ్వులో.. కూడా దర్శించే సంప్రదాయం మనది. ఇప్పటికీ నృత్యకళను అభ్యసించినవారు అరంగేట్రం చేయడానికి ముందు .. సభలో ఆసీనులైన పెద్దల దగ్గరకు వచ్చి, వారి చేతికి గజ్టెలు అందించి... తిరిగి వారి చేతులనుండి స్వీకరించి కాలికి కట్టుకుని వెళ్ళి ప్రదర్శిస్తుంటారు... అంత గాఢంగా మనం ఈ కళలను అభిమానిస్తాం... ఈ సంప్రదాయాన్ని నవతరం కూడా నిష్ఠతో కొనసాగించాలని కోరుకుందాం. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు -
ఒకేచోట... వెయ్యి ఇంద్రధనుస్సుల పాట!
పట్టుచీర కట్టుబడికి పట్టుపురుగు జన్మ ధన్యమైందో లేదోగానీ... ఇంగ్లాండ్‌లో జరిగిన ఓ ఉత్సవంలో చీరలు ధరించి వచ్చిన మహిళల మనోహర దృశ్యం ఒక కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టింది. భారతీయ నేతకళలలోని గొప్పతనాన్ని ఘనంగా, సగర్వంగా ప్రపంచానికి చాటి చెప్పింది... ఇంగ్లాండ్‌లో ‘రాయల్ ఎస్కాట్’ అనేది చారిత్రకంగా ప్రసిద్ధిపొందిన అయిదురోజుల ఉత్సవం. ఈ ఉత్సవానికి రాజకుటుంబీకులు హాజరవుతారు. ‘రాయల్ ఎస్కాట్ 2022’ (బెర్క్‌షైర్)లో లేడిస్ డే కార్యక్రమం ఈసారి చరిత్రను సృష్టించింది. దీనికి కారణం... ఈ కార్యక్రమంలో పాల్గొన్న భారతీయ మూలాలు ఉన్న వెయ్యిమంది మహిళలు భారతదేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన చీరలను ధరించి వచ్చారు. భారతీయ సంస్కృతిని ఘనంగా, సగౌరవంగా ప్రతిబింబించారు. కోల్కత్తా నుంచి వచ్చి లండన్‌లో స్థిరపడిన దీప్తి జైన్ మొదట ఈ చీరల ప్రతిపాదన చేశారు. ఆమె ప్రతిపాదనకు అందరూ సంతోషంగా ఓకే చెప్పి, భారత్‌లోని తమ ప్రాంత ప్రసిద్ధ చీరలతో ఉత్సవానికి వచ్చారు. దీప్తి జైన్ పశ్చిమబెంగాల్లో ప్రసిద్ధమైన ‘కాంతా వర్క్’ చీర ధరించి వచ్చారు. ఆకట్టుకునే ఎంబ్రాయిడరీతో కూడిన సిల్క్ చీర అది. ఈ చీరను వినూత్నంగా డిజైన్ చేసిన రూపా ఖాతున్‌కు ‘రాయల్ ఎస్కాట్’ గురించి ఏమీ తెలియదు. అయితే ఆమె ప్రతిభ గురించి మాత్రం ఇక్కడ గొప్పగా మాట్లాడుకున్నారు. మీడియా ప్రొఫెషన్లో ఉన్న సంచిత భట్టాచార్య మధుబని చీర ధరించి వచ్చారు. ఈ పెయింటింగ్ చీర ఎంతోమందిని ఆకట్టుకుంది. ఇంజనీర్ చీనూ కిశోర్ అస్సామీ సంప్రదాయ చీర ‘మెఖల చాదర్’తో వచ్చారు.తాను డిజైన్ చేసిన ‘కాంతా వర్క్’ చీరకు మంచి పేరు రావడంతో ఆనందంలో మునిగిపోయింది పశ్చిమబెంగాల్లోని ననూర్ గ్రామానికి చెందిన రూప ఖాతున్. ఈ చీరల డిజైనింగ్, తయారీల గురించి ఆమె ప్రత్యేకంగా ఎక్కడా శిక్షణ తీసుకోలేదు. అమ్మమ్మ, అమ్మల దగ్గర నుంచి ఆ విద్యను నేర్చుకుంది. ‘ఈ చీర తయారీ కోసం నాలుగు నెలల పాటు కష్టపడ్డాను. ఇతర మహిళల సహాయం తీసుకున్నాను. మా పనికి అంతర్జాతీయ స్థాయిలో పేరు రావడం గర్వంగా అనిపిస్తుంది’ అంటుంది రూప. మధుబని చీరను డిజైన్ చేసిన బిహార్‌లోని దర్భంగ ప్రాంతానికి చెందిన ఛోటీ ఠాకూర్‌పై ప్రశంసలు వెలువెత్తుతున్నాయి. ‘ఇందులో నేను కొత్తగా సృష్టించింది ఏమీ లేదు. ఇదంతా మధుబనీ కళలోని గొప్పతనం’ వినమ్రంగా అంటుంది చోటి. నిజానికి ఈ ఉత్సవంలో ప్రతి చీర ఒక కథను చెప్పింది. ఆ కథలో రూప, ఛోటీలాంటి అసాధారణమైన ప్రతిభ ఉన్న సామాన్య కళాకారులు ఎందరో ఉన్నారు. వారి సృజన ఉంది. స్థూలంగా చెప్పాలంటే విభిన్నమైన అందాలతో వెలిగిపోయే భారతీయ సంస్కృతి ఉంది. ఈ ఉత్సావానికి హాజరైన ఒకరు కవితాత్మకంగా అన్నారు ఇలా: ‘వెయ్యి ఇంద్రధనుసులు మధురమైన సంగీత కచేరి చేసినట్లుగా ఉంది’ వాహ్! -
సమాజాన్ని ఏకం చేసే శక్తి సంస్కృతిదే
సాక్షి, హైదరాబాద్: కుల, ప్రాంత, వర్గాలకు అతీతంగా సమాజాన్ని ఒకచోటకు చేర్చగలిగే శక్తి సంస్కృతికి ఉన్నదని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. ఆత్మీయత, గౌరవం, ప్రేమాభిమానాల సంగమమే అలయ్–బలయ్ కార్యక్రమమని, అస్తిత్వాన్ని కాపాడుకోవడంతో పాటు దేశ సాంస్కతిక పునరుజ్జీవనం మనందరి బాధ్యత అని తెలిపారు. ఆదివారం నెక్లెస్‌రోడ్డులోని జలవిహార్‌లో హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రే య ఆహ్వాన కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘దత్తన్న అలయ్ బలయ్–దసరా సమ్మేళన్’కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మా ట్లాడుతూ, భారతదేశానికే ప్రత్యేకమైన అస్తిత్వం ఇంకా నిలబడి ఉండడానికి కారణం మన సంస్కృతి సంప్రదాయాల పరిరక్షణేనని అలయ్–బలయ్ కూడా అలాంటి కార్యక్రమమేనని తెలిపారు. ఈ సందర్భంగా శాస్త్ర, విజ్ఞాన, పరిశోధన రంగాల్లో విశేష కృషి జరిపినందుకుగాను భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణా ఎల్లా, ఏఐజీ ఆసుపత్రుల చైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వర్‌రెడ్డి, రెడ్డిలాబ్స్ ఎండీ జీవీ ప్రసాద్‌రెడ్డి, బయోలాజికల్ ఈవాన్స్ మహీమా దాట్లను నిర్వాహకుల తరఫున ఉపరాష్ట్రపతి సన్మానించారు. సంస్కృతి, సంప్రదాయాలు గుర్తుచేసుకునేందుకే: దత్తాత్రేయ భిన్న సంస్కృతులు, ఆచారాలు, భావజాలాలున్నా అందరూ ఆత్మీయంగా ఒకచోట కూడి ఆడిపాడి, భిన్నరుచులతో కూడిన భోజనం చేయడం, మన సంస్కృతి, సంప్రదాయాలను గుర్తుచేసుకోవడమే అలయ్ బలయ్ ముఖ్య ఉద్దేశమని హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ తెలిపారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ప్రారంభించి, అక్కడి నుంచి మరో కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లారని, ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సి ఉన్న ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆ రాష్ట్ర చీఫ్ జస్టిస్ ప్రమాణ స్వీకారం ఉండడంతో రాలేకపోయారని చెప్పారు. రాజకీయాల్లో ఉన్న వారంతా శత్రువులు కాదు రాజకీయాల్లో ఉన్న వారంతా శత్రువులు కాదని, రాజకీయ ప్రత్యర్థులం మాత్రమేనని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి జి.కిషన్‌రెడ్డి అన్నారు. అందరూ ఐకమత్యంగా ఉండాలన్న భావనతోనే బండారు దత్తాత్రేయ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు. భిన్నసంస్కృతులు, ఆచారాల సమ్మేళనంగా నిర్వహిస్తున్న ఇలాంటి ఉత్సవాలను ఇతర రాష్ట్రాల్లోనూ నిర్వహించాల్సిన అవసరం ఉందని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ అర్లెకర్ అన్నారు. హైదరాబాద్‌లో జరిగే అలయ్ బలయ్ వంటి ఉత్సవాలు దేశంలోనే ఎక్కడా జరగవని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంచికి, సహృదయతకు దత్తాత్రేయ ప్రతిరూపంగా నిలుస్తున్నారని ఆంధ్రప్రదేశ్ అధికార భాషాసంఘం అధ్యక్షురాలు నందమూరి లక్ష్మీపార్వతి అన్నారు. ప్రాంతీయతలు, ఎజెండాలకు అతీతంగా భాషలు వేరైనా మనమంతా ఒక్కటేననే సంస్కృతిని దత్తాత్రేయ ముందుకు తీసుకెళుతున్నారని జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ అన్నారు. బండారు దత్తాత్రేయ సతీమణి వసంత, ఆహ్వాన కమిటీ తరఫున దత్తాత్రేయ వియ్యంకులు బి.జనార్దనరెడ్డి, బండారు విజయలక్ష్మి–డాక్టర్ జిగ్నేష్రెడ్డి దంపతులు, చింతల రామచంద్రారెడ్డి, తదితరులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వివిధ రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన మహిళా కెప్టెన్ రేష్మా రెజ్వాన్, డా.షేక్ హసీనా, గాయకురాలు మధుప్రియ, అనూహ్యరెడ్డి, ప్రవీణ్‌కుమార్ గోరకవిలను ఈ సందర్భంగా సన్మానించారు. పాల్గొన్న వివిధ రంగాల ప్రముఖులు... శాసనమండలి ప్రొటెమ్ చైర్మన్ ఎం.భూపాల్‌రెడ్డి, రాష్ట్ర హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ చంద్రయ్య, జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు టి.ఆచారి, సినీనటులు మంచు విష్ణు, కోట శ్రీనివాసరావు, ఎంపీ కె.కేశవరావు, మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, మాజీ మంత్రి జె.గీతారెడ్డి, మాజీ ఎంపీలు మధుయాష్కి గౌడ్, వి.హనుమంతరావు, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం, టీడీపీ నేత రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఏపీ ఎమ్మెల్యే శ్రీదేవి, ఎమ్మెల్సీ మాధవ్, ఎంపీలు బండి సంజయ్, సోయం బాపూరావు, ఎమ్మెల్యేలు రాజాసింగ్, ఎం.రఘునందన్‌రావు, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, వందేమాతరం శ్రీనివాస్, బీసీ సంఘాల నేతలు ఆర్.కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అలయ్–బలయ్ కార్యక్రమంలో కోలాటమాడుతున్న గవర్నర్లు దత్తాత్రేయ, తమిళిసై. చిత్రంలో దత్తాత్రేయ కుమార్తె.. -
నూలు వెచ్చని రక్షాబంధం
భారతీయ సంప్రదాయం ప్రకారం ఇంటి ఆడపడచు శక్తి స్వరూపిణి. సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మికి ప్రతిరూపం. అందుకే ఆమెను తల్లిదండ్రులు మంగళ, శుక్రవారాలలో పుట్టింటి నుంచి పంపరు. అంతటి శక్తి గల సోదరి చేత రక్షాబంధనం కట్టించుకుంటే అరిష్టాలన్నీ తొలగి దేవతలందరి అనుగ్రహం కలిగి, సర్వజగద్రక్ష ఏర్పడుతుందనే దృష్టితో ప్రాచీనులు ఈ రక్షాబంధన సంప్రదాయాన్ని ఏర్పరిచారు. చారిత్రకంగా, ఐతిహాసికంగా, సామాజికంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. సాధారణ సంప్రదాయం ప్రకారం రక్షాబంధన దినోత్సవం నాడు సోదరులకు తోబుట్టువులు రక్షాబంధనం కడితే విశాల దృక్పథంతో గ్రామ ప్రజలందరి హితాన్ని కోరుతూ పురోహితుడు ప్రజలందరికీ రక్షాబంధనం కట్టడం కూడా గమనించవచ్చు. అంతేకాదు, యుద్ధ సమయాలలో సైనికులు దేశ రక్షణకు ముందుకు నడుస్తున్నప్పుడు, సరిహద్దు ప్రాంతాలలోని యువతులు, వృద్ధులు, బాలికలు సైనికులందరికీ రక్షాబంధనం కట్టి తిలకం దిద్ది, మంగళహారతులతో సాగనంపడం రివాజు. రక్షాబంధన మంత్రం యేనబద్ధో బలీరాజా దానవేంద్రోమహాబలః తేనత్వామభి బధ్నామి రక్షమాచల మాచల ‘బలాధికుడు, దానశీలుడు అయిన రాక్షసరాజు బలిచక్రవర్తిని దేవతల కోరికపై విష్ణువు తన శక్తితో బంధించాడు. అంతటి విష్ణుశక్తిని రక్షాబంధన రూపంలో నీకు కడుతున్నాను. నీ చేతిని అంటి పెట్టుకుని ఉండే ఈ రక్షాకవచ ప్రభావం వల్ల దేవతలందరూ నీ పక్షాన నిలచి ఏ ప్రమాదమూ జరగకుండా నిన్ను చల్లగా చూడాలని కోరుకుంటున్నాను’ అని ఈ మంత్రానికి అర్థం. రక్షాబంధన పండుగ పరమార్థం ఈ పండుగ నుంచి గ్రహించవలసిన పరమార్థం ఏమంటే– ప్రతిఫలాన్ని ఆశించకుండా నిష్కల్మషమైన ప్రేమతో, స్వచ్ఛమైన మనస్సుతో జరుపుకునే ఈ పండుగ సమాజంలో అందరూ ఒకరికొకరు తోబుట్టువుల వంటి వారేనని, స్వంత సంబంధం లేకపోయినా, సామాజికంగా స్త్రీ పురుషుల మధ్య ప్రేమ, ఆత్మీయత, మమతానురాగాలు పరిఢవిల్లాలని, తోబుట్టువులు లేరని చింతించకండా సోదర ప్రేమ కలిగిన వారికి రక్షణగా నిలవాలని. ఎంత ఖరీదైన రాఖీ అయినా కట్టుకోవచ్చు కానీ నూలు పోగుది మంచిది. జంధ్యాల పూర్ణిమ దైవీశక్తులతో కూడిన శ్రావణ పూర్ణిమనాడు చేసే దేవతారాధన, జపం, స్తోత్ర పారాయణం సత్ఫలితాలనిస్తాయి. దక్షిణ భారతదేశంలో శ్రావణ పూర్ణిమ నాడు ద్విజులు న దులలో, చెరువులలో లేదా కాలువ స్నానం– అదీ కుదరని పక్షంలో ఇంటి వద్దనయినా స్నానం చేసి జీర్ణ (పాత)యజ్ఞోపవీతాన్ని విసర్జించి, నూతన యజ్ఞోపవీతం ధరిస్తారు. కొత్తగా ఉపనయనం జరిగిన వారికి శ్రావణ పూర్ణిమనాడు ఉపాకర్మ (ముంజవిడుపు) జరిపిస్తారు. యజ్ఞోపవీతం ధరించే ప్రతి ఒక్కరు ఈ రోజున జంధ్యం మార్చుకోవడం ఆచారం గనుక దీనిని జంధ్యాల పూర్ణిమగా పేర్కొంటారు. హయగ్రీవజయంతి: బ్రహ్మవద్దనుంచి వేదాలను దొంగిలించిన సోమకాసురుడనే రాక్షసురుని సంహరించేందుకు శ్రీమహావిష్ణువు హయగ్రీవావతారం దాల్చిన రోజిది. ఈ రోజున విద్యార్థులు ‘జ్ఞానానందమయందేవం నిర్మల స్ఫటికాకృతిం, ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే’అనే శ్లోకాన్ని పఠిస్తూ హయగ్రీవ రూపంలోని విష్ణుమూర్తిని ప్రార్థిస్తే ఉన్నత విద్యలు ప్రాప్తిస్తాయని, జ్ఞానం వికసిస్తుందనీ ప్రతీతి. – డి.వి.ఆర్ (సోమవారం శ్రావణ పూర్ణిమ, రక్షాబంధన దినోత్సవం) -
భర్త వెంటే భార్య ఎందుకు నడవాలంటే..!
భారతీయ సంప్రదాయం ప్రకారం భర్త ముందు నడిస్తే అతడికి కాస్త వెనుకగా భార్య నడుస్తుంది. దీనికి కేంద్రమంత్రి స్మృతి ఇరానీ తనదైన శైలిలో భాష్యం చెప్పారు. తాను సంప్రదాయక మహిళను అని అందరూ అంటుంటారు. మన దేశ సంప్రదాయం ప్రకారం భర్తకు రెండడుగులు వెనుకగా భార్య నడవాలన్నది దైవ నిర్ణయం. అందుకు బలమైన కారణం ఉంది. భర్త దారితప్పినా వెనకున్న భార్య సరిదిద్దే వీలుంటుంది. అతడు దారి తప్పినా అతడ్ని తిరిగి దారిలో పెట్టగల శక్తి స్త్రీకి ఉంటుంది. నా భర్త నాకు సహకరిస్తాడు. అతనికి నేను సహకరిస్తాను. చదవండి: ఆ సమస్య పరిష్కరిస్తే.. 35 లక్షలు మీవే..! అందుకే ఆయన అడుగులో అడుగేసి రెండు అడుగులు వెనుకే నడుస్తాను అని స్మృతి ఇరానీ వివరణ ఇచ్చారు.స్మృతి వ్యాఖ్యలకు చెందిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. 2018లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ సమావేశంలో స్మృతి ఇరానీ ప్రసంగిస్తూ పై వ్యాఖ్యలు చేశారు. కాగా..ప్రస్తుతం స్మృతి ఇరానీ వ్యాఖ్యలపై లాజికల్ థింకర్ అనే ట్టిటర్ పేజిలో కొన్ని టిక్‌టాక్ వీడియోలు సైతం వైరల్ అవుతున్నాయి. చదవండి: మాయల్లేవ్..మంత్రాల్లేవ్..ప్రయత్నించానంతే! Best reply to why Indian women walk behind her husband!!!👍👍👍👍👍🙏🙏🙏 pic.twitter.com/rFEZClQKt1 — logical thinker (@murthykp) January 2, 2020 -
అనంత కాల భ్రమణం... రవ్వంత జీవన పయనం
కాలం దైవ స్వరూపం. ఇది భారతీయ సంప్రదాయం. భగవంతుడు తన శక్తులతో చురుకుగా ఉన్నప్పుడు సృష్టిస్తాడు. ఆయన తన శక్తినంతటినీ ఉపసంహరించుకొని, క్రియారాహిత్య స్థితిలోకి వెళ్ళినప్పుడు సృష్టికి అంతం. ఈ సృష్టి ఆద్యంతాలకు మధ్య ఉన్నదంతా కాలమే! నిజం చెప్పాలంటే, భగవంతుడు ఈ కాలస్వరూపుడే కాదు... కాలాతీతుడు. జరిగిపోయినది, జరుగుతున్నది, జరగబోయేది – మూడూ ఏకకాలంలో ఆయనలోనే ఉంటాయి. ఈ కాలాన్నే మానవ జీవిత సౌలభ్యం కోసం పగలు – రాత్రిగా, ‘కాలచక్రం’గా దేవుడు విభజించాడని మన నమ్మకం. దీన్నే మనం నిమిషాలుగా, గంటలుగా, రోజులుగా, సంవత్సరాలుగా విభజించుకొని, మాట్లాడుకొంటున్నాం. భిన్నమైన భాషలు, సంస్కృతులకు ఆలవాలమైన మన సువిశాల భారతదేశంలో ఒకటీ రెండూ కాదు... దాదాపు 30 దాకా వేర్వేరు కాలగణన విధానాలను అనుసరిస్తూ వచ్చాం. ఇన్ని విభిన్నమైన కాలగణన విధానాల వల్ల దాదాపుగా ప్రతి నెలా ఒకటి, రెండు ప్రాంతాల్లో స్థానిక క్యాలెండర్‌ను బట్టి నూతన సంవత్సరం వస్తుంటుంది. వేడుకలు జరుగుతుంటాయి. గందరగోళాన్ని నివారించి, ఒక ఏకరూపత తీసుకురావడం కోసం 1957లో ఇప్పటి ‘భారత జాతీయ క్యాలెండర్’ను పెట్టారన్నది చరిత్ర. ఇక, గ్రెగేరియన్ క్యాలెండర్ ప్రకారం జరుపుకొనే ఆంగ్ల సంవత్సరం, సంవత్సరాదిని కార్యనిర్వహణ పనుల నిమిత్తం ప్రభుత్వం అనుసరించడమనేది చూస్తూనే ఉన్నాం. పద్ధతులు ఏవైనా, ఏ పద్ధతి ప్రకారం అది కొత్త సంవత్సరమైనా... దైవస్వరూపమైన కాలాన్ని మనం ఎలా గౌరవించాలి? మనకు ఒక సంవత్సరమైతే, దేవతల కాలమానం ప్రకారం ఒక రోజుకు సమానం. దేవతలకు ఉత్తరాయణమంతా పగలు, దక్షిణాయనమంతా రాత్రి. అంటే, దాదాపుగా 180 రోజులు ఒక అయనం అన్న మాట! పగలు – రాత్రి, మళ్ళీ పగలు – రాత్రి... ఇలా ఒక చక్రం తిరిగినట్లుగా, రోజులు, వారాలు, నెలలు, సంవత్సరాలు, ఋతువులు, యుగాలు, శకాలు గడిచిపోతుంటాయి. ఇదొక అంతం లేని చక్ర భ్రమణం. ఎంత పరిమితమైనదో, అంత అనంతమైనది. ఎంత గతించిందో, అంత ఆగతం (భవిష్యత్తు) ఉంది. నిన్న గతిస్తుంటుంది... నేడు జరుగుతుంటుంది... రేపు ఉద్భవిస్తుంటుంది. ఈ రకంగా లయ, స్థితి, సృష్టి – ఈ మూడింటికీ కాలచక్రం ఒక ప్రతీక. శివ, విష్ణు, బ్రహ్మలు ఈ మూడింటినీ నిర్వహించే త్రిమూర్తులు. తెల్లవారుజామున ప్రతి రోజూ మొదలై, పగలంతా గడిచి, చివరకు రాత్రితో ముగుస్తుంది. మానవ జీవితమూ అంతే... బాల్యంతో మొదలై, యౌవనమంతా గడిచి, చివరకు వృద్ధాప్యంతో ముగుస్తుంది. అనిత్యమైన ఈ శరీరాన్ని విడిచి, ఆత్మ మరో శరీరాన్ని ధరిస్తుంది. ఆ శరీరానికి మళ్ళీ బాల్యం, యౌవనం, వృద్ధాప్యం... అచ్చంగా కాలచక్రం లాగే ఇదీ పునరావృతమయ్యే ప్రక్రియ. మరి, ఈ పునర్జన్మల చక్రభ్రమణం నుంచి మనిషి ముక్తి పొందాలంటే, కాలాతీతమైన స్థితిని పొందాలంటే, సాక్షాత్తూ కాలస్వరూపుడైన ఆ దేవదేవుడే శరణ్యం. ఆధ్యాత్మికంగా చెప్పాలంటే, ఆత్మ – పరమాత్మ వేరు వేరు అనే ద్వైత భావన ఉన్నప్పుడు ‘కాలం’ ఉంటుంది. అలా కాకుండా, ఆత్మ – పరమాత్మ ఒకటే అనే అద్వైత భావన, ఏకీకృతమైన ఆలోచనలోకి ప్రవేశించినప్పుడు, మరోమాటలో చెప్పాలంటే ‘సమాధి’ స్థితిలోకి వెళ్ళినప్పుడు మనకు కాలం లేదు... కాలం తెలియదు... కాలాతీతులం అవుతాం. సాక్షాత్తూ కాలస్వరూపుడైన భగవంతునిలో భాగం అవుతాం. కాలాయ తస్మై నమః ఇలా బతుకుదాం! నిత్యజీవితం గడుపుతున్నప్పుడు కూడా కాలాతీతమైన ప్రశాంత స్థితి కోసం కొత్త ఏడాది కొన్ని తీర్మానాలు చేసుకుందాం. ► వర్తమానంలోనే జీవిద్దాం. జరిగిపో యినది ఆలోచించడమో, జరగబోయేదానికి ఆందోళనో అనవసరం. ►స్నేహ సంబంధాలను పెంచుకుందాం. తోటివారితో స్నేహసంబంధాలే మన జీవితాన్ని నిర్వచిస్తాయి. ►జీవితంలో అందరికీ, అన్నిటికీ కృతజ్ఞులమై ఉందాం. తోటివారికి సాయపడాలి. పొందిన సాయాన్నీ గుర్తుపెట్టుకోవాలి. ►ఇంటికి ఎవరొచ్చినా, సాదరంగా స్వాగతిద్దాం. ఆతిథ్యమిద్దాం. అర్థిస్తూ వచ్చిన ఎవరినీ వట్టి చేతులతో పంపవద్దు. ►అందరికీ సమన్యాయం అందేలా, స్వేచ్ఛా స్వాతంత్య్ర ప్రపంచం కోసం శ్రమిద్దాం. ► భూతదయ, కరుణ, తోటివారిని ప్రోత్స హించడం, మర్యాద మన్నన చూపడం– ఇవే మనిషితనానికి గీటు రాళ్ళు. ►ఎదుటివాళ్ళు చెప్పేది సావధానంగా విందాం. అంతకన్నా ముందుగా, మన అంతరాత్మ ప్రబోధాన్ని ఆలకిద్దాం. ►ప్రపంచంలో ప్రతిదీ పవిత్రమైనదే. చివరకు ఈ జీవితం కూడా! అన్నిటినీ గౌరవిద్దాం. ►ప్రపంచంలో మనతో సహా, అందరిలో లోపాలుంటాయి. స్వీయలోపాలు అధిగమిద్దాం. ►ఆధ్యాత్మిక జీవితంలో సమస్త ప్రాణికోటీ గురువులే. ప్రతి జీవి నుంచీ నేర్చుకుందాం. – రెంటాల జయదేవ -
ట్రెండీ టైమ్
మోడ్రన్ ట్రెండ్స్ ఎన్ని పుట్టుకొస్తున్నా... అచ్చమైన భారతీయ సంప్రదాయంలోని అందం అలా అరవిరిస్తూనే ఉంటుంది. కాదంటారా..! ఈ భామలను చూడండి! తెలుగింటి పడచు పిల్లలా లంగా ఓణీలో మెరిసి మురిపిస్తున్నారు ఒకరు. కలర్‌ఫుల్ అనార్కలీ వెరైటీలో ట్రెడిషన్‌కు సింబాలిక్‌గా సిరులొలికిస్తున్నారు ఇంకొకరు. బంజారాహిల్స్ హోటల్ తాజ్ కృష్ణాలో బుధవారం ప్రారంభమైన ‘డిజైర్’ ఎగ్జిబిషన్లో తళుకులివి. టాలీవుడ్ నటి సిమేర్ స్పెషల్ అప్పీయరెన్స్ ఇచ్చిన ఈవెంట్లో... సిటీ అమ్మాయిలూ ఇలా బ్యూటీ‘ఫుల్’గా ఎంట్రీ ఇచ్చి ఆహా అనిపించారు. లేటెస్ట్ ట్రెండ్స్‌ను పరిచయం చేసేందుకు ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శన ఫ్యాషన్‌ను స్ట్రిక్ట్‌గా ఫాలో అయ్యేవారందరి ‘డిజైర్’ను ఫుల్‌ఫిల్ చేస్తుందనడంలో సందేహం లేదనేది నిర్వాహకుల మాట. గురువారం కూడా ఎగ్జిబిషన్ ఉంటుంది. మీరూ ఓ లుక్కేయండి మరి! సాక్షి, సిటీ ప్లస్ -
నయాదారుల్లో.. చుడీదార్లు
భారతీయ సంప్రదాయాన్ని కొలిచినట్టు చూపగలిగేది చీరకట్టే. చీరల తర్వాత ఫ్యాషన్ ప్రపంచంలోకి అడుగుపెట్టి.. శారీలకు దీటుగా నిలిచిన ఘనత పంజాబీ డ్రెస్‌లకు దక్కుతుంది. మోడర్న్ లుక్‌లో కనిపించినా.. ట్రెడిషనల్ ఇంపాక్ట్నూ క్యారీ చేస్తూ.. టీనేజీ యువతుల నుంచి.. నడివయసు నారీమణుల వరకూ అందరికీ నేస్తంగా మారాయివి. ఒంటికి నిండుగా హత్తుకునే ఈ డ్రెస్‌లో కంఫర్టబుల్ అదనంగా ఉండటంతో.. ఏ తరం వారైనా పంజాబీ డ్రెస్‌లను సాదరంగా ఆహ్వానిస్తున్నారు. అందుకే చుడీదార ్లకు ఎప్పటికప్పుడు మోడర్న్ టచ్ ఇచ్చి.. వెస్ట్రన్ లుక్ తీసుకొస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. లేటెస్ట్గా మార్కెట్లోకి వచ్చిన జాకెట్ మోడల్ ప్లేటెడ్ చుడీ, జంప్ సూట్ స్టైల్ ట్యూనిక్‌లు యువతుల మనసును దోచుకుంటున్నాయి. కుచ్చుల మ్యాజిక్.. ఫ్యాషన్ మార్కెట్లో లేటెస్ట్ అప్డేట్ జాకెట్ మోడల్ ప్లేటెడ్ చుడీ. కుచ్చులతో వస్తున్న ఈ డ్రెస్ ఈ తరం అమ్మాయిలకు బాగా నప్పుతుంది. స్లీవ్‌లెస్ లాంగ్ టాప్ విత్ మల్లీ ప్లేట్స్ (కుచ్చులు)తో చూడగానే ఆకట్టుకునే విధంగా ఉంటుంది. లెఫ్ట్‌సైడ్ షార్ట్ లెన్త్‌లో ఉండే ఈ కుచ్చులు.. రైట్సైడ్కు వచ్చే సరికి ఫ్లోర్లెన్త్గా మారుతాయి. మ్యాచింగ్ ప్యాంట్, చుడీకి పైన కాంట్రాస్ట్ కలర్స్‌తో అందమైన లాంగ్ జాకెట్ మోడల్ వస్తుంది. మెగా స్లీవ్స్‌తో ఉండే ఈ లాంగ్ జాకెట్ డ్రెస్కే డిఫరెంట్ లుక్ తెస్తుంది. కాలేజ్ ఈవెంట్లకు, పార్టీలకు ఈ డ్రెస్ కరెక్ట్‌గా సరిపోతుందని చెబుతున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. జంప్ టు రిచ్‌లుక్.. డిజైనింగ్ కాస్ట్యూమ్స్‌కు ఏమాత్రం తీసిపోని విధంగా ఫ్యాషన్ వరల్డ్‌లో హల్చల్ చేస్తున్నాయి జంప్‌సూట్ ట్యూనిక్ చుడీలు. ఫుల్ హ్యాండ్స్‌తో హైనెక్ ప్యాటర్న్ కలిగి ఉన్న ఈ డ్రెస్‌లు పార్టీవేర్‌గా మంచి మార్కులు కొట్టేశాయి. తేలికపాటి లేసర్, 60 గ్రామ్స్ ఫ్యాబ్రిక్స్‌తో ఫ్లోర్లెన్త్ టాప్.. ఫ్రంట్ అండ్ బ్యాక్ సెంటర్ స్లిట్స్తో స్పెషల్ లుక్‌లో కనిపిస్తాయి. కింది వైపు యాంటిక్, గోల్డ్ కలర్లలో ఫ్లవర్ ఎంబ్రయిడరీ డిజైన్‌తో రిచ్ లుక్‌ను కట్టబెడుతుంది. వీటికి బాటమ్‌గా ఏదైనా స్పన్ లెగ్గిన్ వేసుకుంటే సరిపోతుంది. హైనెక్ ఉండే ఈ ప్యాటర్న్ వేర్ మీద చున్నీలు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సింప్లిసిటీ కోరుకునే వాళ్లకు ఈ డ్రెస్ పర్ఫెక్ట్గా సూటవుతుంది. మెడలో చైన్లు గట్రా వేసుకోవాల్సి పని కూడా ఉండదు. చెవులకు మాత్రం కాస్త పెద్ద సైజు హ్యాంగింగ్స్ ధరిస్తే సరి. పార్టీలో అందరి లుక్కూ మీ మీదే. -
భోగి భాగ్యాలు
ఏ దేశంలోనైనా సరే కొన్ని సంప్రదాయాలుంటాయి. అలాగే భారతీయ సంప్రదాయంలో మాత్రం తిలదానం దగ్గరనుండి అప్తోర్యామయాగం వరకు ప్రతి తంతుకీ లో విశేషం ఉంటుంది- ఉండి తీరుతుంది. ఆ ఆంతర్యాన్ని తెలుసుకోగల పండుగల మనకుండడాన్ని ఓ అదృష్టంగా భావిస్తూ ఆ నేపథ్యాన్ని గ్రహిద్దాం! భోగం కలిగింది భోగి. భోగమంటే ఆనందాన్ని అనుభవించడమని అర్థం. భూమి- తాను సంతృప్తిగా ధాన్యాన్ని ఇచ్చాననే ఆనందాన్ని అనుభవిస్తూ, వృషభం- తన శ్రమకి ఫలితం లభించి ధాన్యం ఇబ్బడిముబ్బడిగా గాదెలకు చేర్చగలిగాననే సంతోషంతో, యజమాని- గాదెలన్నీ నిండాయ నే ఆనందాన్ననుభవిస్తూ, పిచ్చుకలు- కంకులనిండా ఉన్న ధాన్యాన్ని తినగలుగుతున్నామనే తృప్తితో... ఇలా పశుపక్షి మానవ జీవరాశులన్నీ భోగంతో (ఆనందానుభవంతో) గడుపుకునే పండుగ కాబట్టి ‘భోగి’. ఇది మొదటి ఆంతర్యం. నిజమైన భోగం ఆనందానుభవం ఎప్పుడంటే ఆకాశవర్షం భూమికి చేరి పంట చేతికొచ్చినప్పుడే. అందుకే ధరణి నుండి పుట్టిన గోదాదేవికి ఆకాశరాజపుత్రుడైన రంగనాథునితో కల్యాణాన్ని చే(యి)స్తారు. పంచభూతాల్లో మొదటిదైన పృథివి ఆ చివరిదైన ఆకాశంతో సమన్వయపడి ఉంటే ఇంక పంచభూతాత్మక ప్రపంచానికి తిరుగేముంది? - కాబట్టి ‘భోగి’. ఇది రెండవ ఆంతర్యం. అభ్యంగస్నానభోగం: ప్రాతఃకాలంలోనే తల్లులందరూ తమ పిల్లల్ని నిద్రలేపి వాళ్ల మాడున నువ్వులనూనెని అద్దుతూ ‘ఆశీర్వచనాలని హృదయపూర్వకంగా చేసి, ఎక్కడా ఏ రక్తనాళంలోనూ రక్తప్రసరణ మందంగా ఉండకుండా ఉండేలా బలంగా శరీరాన్ని మర్దించి నలుగుపెట్టి, శిరోజాల్లో క్రిమికీటకాలు చేరకుండా ఉండేలా కుంకుడుపులుసుతో రుద్ది, అభ్యంగస్నానాన్ని చేయించి వాళ్లకి సుఖనిద్ర కలిగేలా చేస్తారు. స్వేదరంధ్రాలన్నీ తెరుచుకున్న కారణంగా శరీరానికి ఆనందానుభవం కల్గిస్తుంది ఈ పర్వదినం. అందుకే ఇది ‘భోగి’. ఆరోగ్యపరమైన ఆంతర్యం ఇది మూడవది. ప్రాతరగ్ని భోగం: తెల్లవారుఝామునే నాలుగుమార్గాల కూడళ్లలోనూ మంటలు వేస్తారు. ఏవో పాతకర్రలూ పనికిరాని చెక్కముక్కలూ దీనిలో పడిపోతాయనేది రహస్యం కాదిక్కడ. శరీరానికి హాని కల్గించేవి క్రిములు. వాతావరణానికి హాని కల్గించేవి కృములు. ఈ చలీమంచూ పుష్కలంగా ఉండే ఈ కాలంలో ఆ క్రిమికృములూ ఇటు వ్యక్తులకీ అటు వాతావరణానికీ హాని కల్గిస్తూ ఉంటాయి. ఆ కారణంగా మర్రి, మామిడి, మేడి, రావి, జువ్వి, మారేడు, ఉత్తరేణి, తులసి ఎండుకట్టెలతో మంటని చేసి ఆ ధూమాన్ని పీల్పింపచేస్తూ ఆ మంట వద్ద కూర్చోవలసిందన్నారు పెద్దలు. దీంతో మనలోపలి క్రిమిబాధ తొలగి శరీరారోగ్యం కుదుటపడుతుంది. ఆరోగ్యానుభూతిని పొందడమనేది నాల్గవ ఆంతర్యం. ఇక కృములన్నీ వాటంతట అవే మంటలకి ఆక ర్షింపబడి మరణించి పర్యావరణానికి హాని కల్గించ కుండా మనకి ఆనందానుభవాన్ని ఇస్తోంది కాబట్టి ఇది వాతావరణ కాలుష్య హరానందానుభూతి నియ్యడమనేది 5వ ఆంతర్యం. రంగవల్లికాభోగం: ఏ విధమైన పరిశోధనా పరికరమూ లేకుండా ఖగోళంలో ఉన్న గ్రహగతుల్నీ వాటిద్వారా వ్యక్తులకి కలిగే మేలు- కీడులని తెలియజేయడం కోసం - ఈ నేలని ఆకాశంగా చేస్తూ- గ్రహాలు తిరిగే మార్గాలని ముగ్గుగీతలుగా చేస్తూ, ఈ తీరు గ్రహ పరివర్తన కారణంగా వర్షం ఎంత పడుతుంది? ఎంత దూరంలో పడుతుంది? ఆ స్థాయి వర్షబలంతో ఏ పంట పండుతుంది? ... ఇలా అన్నింటినీ వ్యవసాయదారులు నేలమీదే చూసి తెలుసుకుని ఆనందానుభూతితో గడుపుకునేది భోగి. ఇది ఆరవ ఆంతర్యం. వాతపట భోగం: వాతమంటే గాలి పరివర్తన దిశకి సంకేతం. పటమంటే వస్త్రం. ఒకప్పటి రోజుల్లో వస్త్రంతో చేసిన గాలిపటాలనెగురవేస్తూ ఉండేవాళ్లు. ఆ సూర్యునికి ఆహ్వానాన్ని అక్కడికి వెళ్లి పలకలేం కాబట్టి ఇక్కడినుండి గాలిపటాలనెగురవేసి స్వాగతించడంలో ఓ ఆనందానుభవాన్ని పొందడం భోగి. మరో విశేషమేమిటంటే ఉత్తరాయణం రాబోతున్న రోజున గాలి వేగం ఎంతతో ఉందో, గాలి ఏ దిశగా వీస్తోందో, దానిలో తేమ ఎంత శాతముందో, దాన్ని బట్టి రాబోయే కాలంలో పంట దిగుబడిక్కావలసిన వర్షపాతాన్ని లెక్కించగలరు రైతులు. ఆ కారణంగా వాళ్లకి- రాబోయే పంట సమాచారాన్ని తెలుసుకోగలిగా-మనే ఆనందానుభవం ‘భోగి’. ఇది ఏడవ ఆంతర్యం. కుండలినీ భోగం: భోగము అంటే పండుగ. అది కలిగినది భోగి అంటే పాము. ఆ పాము (కుండలిని) శరీరానికి ఉత్తరంగా ఉండే శిరసులోనికి ఆయనం (ప్రయాణం) చేస్తూ మెల్లమెల్లగా సహస్రారంలో ఉండే దైవాన్ని దర్శించి ఆనందానుభవాన్ని పొందడం ‘భోగి’. ఇది యథార్థం కాబట్టే కార్తిక త్రయోదశి, చతుర్దశి, అమావాస్యలు కలిసిన అవమతిథినాడు కురుక్షేత్రయుద్ధంలో పాల్గొన్న భీష్ముడు మార్గశీర్ష (శీర్షం వైపుకి ప్రయాణింపజేసే మార్గం)- శుద్ధ దశమినాడు అంపశయ్యని చేరే ఆనందానుభవం లభించే భోగిని దాటి, అష్టమీ తిథి రోహిణీ నక్షత్రంలో కృష్ణునిలో లీనమయ్యాడు! కేవలం యోగమార్గంలో ఆనందానుభవాన్ని పొందడమే ఆయన లక్ష్యమైనా అష్టమి, రోహిణి అనే రెంటికోసమే మరికొన్ని రోజులు తన శరీరాన్ని త్యజించకుండా ఆపాడు. ఇన్ని ఆంతర్యాలతో కూడిన భోగం ‘భోగి’. ఎంత అదృష్టవంతులం! మనం ఇలాంటి పండుగంటూ ఒకటి మనకి ఉన్న కారణంగా! ఫొటో: వీరభగవాన్ తెలగరెడ్డి, విజయవాడ అర్కఫలభోగం సూర్యునితో ఆకారంలోనూ, రంగులోనూ పేరులో కూడా (అర్కఫలమ్) పోలిక ఉన్న రేగుపళ్లని తలమీదుగా శరీరం నిండుగా పో(యి)స్తూ ఆశీర్వచనాన్ని అందరూ చేస్తూ ఆ ఆనందానుభవాన్ని పొందడం భోగి. సూర్యుణ్ణి ఈ పసివారి శరీరాల్లోకి ఆవహింపజేస్తూ అటు ఆ సూర్యుని ఆరోగ్యశక్తీ ఇటు ఆ సూర్యునికి గల జ్ఞానశక్తీ (ధియో యోనః ప్రచోదయాత్) అనే రెండూ ఈ ఫలాభిషేకాన్ని చేయించుకుంటున్న వ్యక్తికి లభించాలనే తీరు ఆనందానుభవం (భోగి). ఇది ఎనిమిదవ ఆంతర్యం. -
వెలుగు పూల పరిమళాల వేళ...
దీపావళి రోజున ఇంటింటా దీపం వెలిగించడం ఆచారం. భారతీయ సంప్రదాయం ప్రకారం చెప్పాలంటే... దీప జ్యోతిని పరబ్రహ్మ స్వరూపంగా భావిస్తారు. దీపం జ్యోతి పర బ్రహ్మ దీపం సర్వ తమోపహమ్ దీపేన సాధ్యతే సర్వమ్ సంధ్యా దీప నమోస్తుతే ॥ దీపాన్ని మనో వికాసానికి, ఆనందానికి, నవ్వులకు, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి... నిదర్శనంగా భావిస్తారని పండితులు చెబుతారు. ఇలా దీపం వెలిగించి, మహాలక్ష్మిని పూజించడం వెనుక ఒక పురాణగాథ ఉంది. పూర్వం ఒకసారి దుర్వాస మహామునికి దేవేంద్రుడు ఆతిథ్యం ఇచ్చాడు. అతిథి సత్కారానికి దుర్వాసుడు పరమానందం చెంది, ఇంద్రుడికి మహిమాన్విత హారాన్ని ప్రసాదించాడు. అయితే అహంకారంతో నిండిన ఇంద్రుడు ఆ హారాన్ని తిరస్కార భావంతో చూసి, తన దగ్గరున్న ఐరావతం మెడలో వేశాడు. ఏనుగు ఆ హారాన్ని తన కాలితో తొక్కేసింది. ఆ సంఘటన చూసిన దుర్వాసుడికి విపరీతమైన కోపం వచ్చింది. ఆ ఆగ్రహంలో దేవేంద్రుడిని శపించాడు. ఆ శాప ఫలంగా దేవేంద్రుడు రాజ్యం, సర్వ సంపదలు కోల్పోయి, దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థించాడు. విషయం గ్రహించిన శ్రీమహావిష్ణువు, దేవేంద్రునితో- ఒక జ్యోతిని వెలిగించి, దానిని శ్రీమహాలక్ష్మీ స్వరూపంగా తలచి పూజించమని సూచించాడు. శ్రీహరి సూచనను తుచ తప్పకుండా పాటించాడు ఇంద్రుడు. దేవేంద్రుని భక్తికి సంతుష్టి చెందిన లక్ష్మీదేవి ఇంద్రుడిని అనుగ్రహించింది. ఆమె కరుణతో దేవేంద్రుడు తిరిగి త్రిలోకాధిపత్యాన్ని, సర్వసంపదలనూ పొందాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీహరి చెంతనే ఉన్న శ్రీలక్ష్మితో ‘‘తల్లీ నీవు కేవలం శ్రీహరి దగ్గరే ఉండటం న్యాయమా! నీ భక్తులను కరుణించవా?’’ అని దేవేంద్రుడు ప్రశ్నించాడు. అందుకు లక్ష్మీదేవి, ‘‘దేవేంద్రా! నన్ను త్రికరణశుద్ధిగా ఆరాధించే భక్తులకు ప్రసన్నురాలనవుతాను. మహర్షులకు మోక్షలక్ష్మిగా, జయాన్ని కాంక్షించే వారికి విజయలక్ష్మిగా, విద్యార్థులకు విద్యాలక్ష్మిగా, ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించేవారికి ధనలక్ష్మిగా, భక్తుల సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మిగా ప్రసన్నురాలవుతాను’’ అని వరమిచ్చింది. అందుకే, దీపావళి నాడు దీపం వెలిగించి, మహాలక్ష్మిని పూజించేవారికి సర్వసంపదలూ చేకూరతాయని పెద్దల మాట. పురాణాల మాటెలా ఉన్నా, జీవితంలోని చీకటినీ, దుఃఖాన్నీ పారదోలేం దుకు వెలుగు పూల పరిమళాలను పంచే దీపాలను మించినవి ఏముంటాయి! - డా. పురాణపండ వైజయంతి -
ఓడినవాడు కోర్టులో ఏడుస్తాడు, గెలిచినవాడు ఇంటికొచ్చి ఏడుస్తాడు!
నివృత్తం: ఇది ఆధునిక న్యాయస్థానాలు వచ్చాక పుట్టుకు వచ్చిన సామెత. కోర్టు మెట్లు ఎక్కితే న్యాయాన్యాయల సంగతి పక్కనపెట్టి చూస్తే ఇరు వర్గాలకు కష్టాలు మొదలైనట్లే. ఎందుకంటే కోపతాపాల వల్లో, పెండింగ్ ఫైళ్ల వల్లో, ఇగోల వల్లో ఒక పట్టాన వాదనలు పూర్తి కావు. సాక్ష్యాలనీ, గైర్హాజరులనీ, రాజీలనీ ఇలా పుణ్యకాలం కాస్త కోర్టుకు తిరగడంలోనూ వాయిదాలకు హాజరు కావడంలోనూ గడిచిపోతుంది. ఈ నేపథ్యంలో గెలిచినా, ఓడినా తుది తీర్పు వచ్చే సమయానికి చాలా కోల్పోయి ఉంటాం. పనులన్నీ మానుకుని కోర్టుకు తిరగడం వల్ల, దారి ఖర్చులు-లాయరు ఖర్చులు ఇలా రకరకాలుగా ఎంతో పోగొట్టుకుంటాం. కాబట్టి గెలిచినా ఓడినా అత్యధిక కేసుల్లో ఇరువర్గాలకీ ఎంతోకొంత నష్టం వాటిల్లక తప్పదన్న అంతరార్థంతో వాడుకలోకి వచ్చిన సామెత ఇది. నుదుటి మీద బొట్టు ఎందుకు పెడతారు? నుదుటి మీద బొట్టు పెట్టడం అనేది ఒక సనాతన భారతీయ సంప్రదాయం. ఇది హిందువుల సంప్రదాయమని ప్రచారమైంది కానీ ఇది మతానికి సంబంధించిన సంప్రదాయం కాదు. దేహానికి సంబంధించిన సంప్రదాయం. మనిషిలో అష్టచక్ర స్థానాలుంటాయి. వాటిలో ముఖ్యమైన ‘ఆజ్ఞచక్ర’ రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. అక్కడ బొట్టు పెట్టడం ద్వారా ఆ చక్రం ఉత్తేజితమై మనిషిలో ఆందోళన తగ్గి ప్రశాంతత సిద్ధిస్తుంది. ఆక్యుపంక్చర్ విధానంలోని ఆక్యుప్రెజర్ సూత్రాల ప్రకారం నుదురు తలనొప్పి నివారణ కేంద్రం. బొట్టు పెట్టుకోవడం ద్వారా అక్కడ కొంత ఒత్తిడి పడుతుంది. అపుడు ఆ కేంద్రం ఉత్తిజేతిమై అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది అని చెబుతారు. -
అభినేతృత్వం
భరతనాట్యం... ఒక సంప్రదాయ నృత్యరీతి... ప్రేక్షకులను అలరించడమే దాని లక్ష్యం. లీడర్షిప్, వ్యక్తిత్వ వికాసం... ఇవి యువతరానికి కెరీర్లో అత్యంత ఆవశ్యకమైన అంశాలు. భరత నాట్యం ద్వారా నాయకత్వ లక్షణాలు పెంపొందించుకునేందుకు, వ్యక్తిత్వ వికాసానికి దోహదపడుతున్నారు అర్చనా కర్రె (వ్యాసం). ఎంబీఏ చదువుకుని, దాదాపు ఏడేళ్లు కార్పొరేట్ ఉద్యోగంలో కొనసాగిన అర్చన, నాట్యం కోసం ఆకర్షణీయమైన కెరీర్‌ను కాదనుకున్నారు. ఇప్పుడు నాట్యాన్నే తన సర్వస్వంగా తీర్చిదిద్దుకున్నారు. తొలుత సుప్రసిద్ధ నాట్య విద్వాంసుడు వెంపటి చినసత్యం వద్ద నృత్యం నేర్చుకున్నారు. తర్వాత చెన్నైలోని ‘కళాక్షేత్ర’లో చేరి, భరతనాట్యంలో పీజీ పూర్తి చేశారు. సోక్ట్రానిక్స్ సంస్థలో దాదాపు ఏడేళ్లు పనిచేశారు. తర్వాత మంజీరం అకాడమీ ఆఫ్ ఫైనార్ట్స్ను స్థాపించి, పూర్తిగా నాట్యానికే అంకితమయ్యారు. భరతనాట్యాన్ని సంప్రదాయబద్ధంగానే నేర్చుకున్నా, అర్చన కేవలం సంప్రదాయ పద్ధతులకే పరిమితం కాలేదు. సృజనాత్మకతను, ప్రయోగశీలతను జోడించి, శాస్త్రీయ నృత్యాన్ని ఆధునిక తరానికి చేరువ చేస్తున్నారు. ‘లీడర్షిప్ ఇన్ డ్యాన్స్’ (నాట్యంలో నాయకత్వం) ఆమెకు బాగా గుర్తింపు తెచ్చిన అంశం. ‘లీడర్షిప్ ఇన్ డ్యాన్స్’ ప్రదర్శనకు సత్యం స్కూల్ ఆఫ్ లీడర్షిప్ అర్చనను ‘ఫుల్ లైఫ్ సైకిల్ లీడర్’ (ఎఫ్ఎల్సీఎల్) అవార్డుతో సత్కరించింది. అంతే కాదు, ఈ అంశాన్ని తన శిక్షణ కార్యక్రమంలో పాఠ్యాంశంగా చేర్చింది. నృత్యం వినోదాన్ని పంచే కళ మాత్రమే కాదు, వ్యక్తిత్వ వికాసాన్ని, నాయకత్వ లక్షణాలను పెంపొందించుకునేందుకు సైతం దోహదపడగల సాధనమని అర్చన తన ప్రదర్శనలతో నిరూపించుకున్నారు. నానాటికీ సంక్లిష్టంగా మారుతున్న వర్తమాన సమాజంలో శాంతిని పెంపొందించే సాధనం కూడా నృత్యమేనని ఆమె విశ్వసిస్తారు. నగరంలోని సైనిక్‌పురి ప్రాంతంలో ఉంటున్న అర్చన పలు వేదికలపైనే కాకుండా, దేశ విదేశాల్లో లెక్కకు మిక్కిలిగా ప్రదర్శనలు ఇచ్చారు. ‘మంజీరం’ అకాడమీ ద్వారా ఒకవైపు విద్యార్థులకు నాట్యంలో శిక్షణ ఇస్తూనే, మరోవైపు వినూత్న ప్రయోగాలు చేపడుతున్నారు. - పన్యాల జగన్నాథదాసు నాట్యమే సర్వస్వం నాట్యమే నా సర్వస్వం. నాట్యంపై అంతులేని తపన, నిబద్ధతతో పాటు కుటుంబ సభ్యుల మద్దతు ఉండటంతో ఒకవైపు నాట్యాన్ని, మరోవైపు చదువుని కొనసాగించగలిగా. మా అమ్మ ఇచ్చిన స్ఫూర్తితోనే నాట్యం నేర్చుకున్నా. ఎంబీఏ కొత్తగా ఆలోచించడం నేర్పింది. ఏడేళ్ల కార్పొరేట్ కెరీర్లో భిన్నమైన మనస్తత్వాలను, పరిస్థితులను ఆకళింపు చేసుకోగలిగాను. నాట్యం నిరంతర పరిణామం చెందే కళ. నాట్యం ద్వారా నాయకత్వ లక్షణాలు సహా చాలా జీవన నైపుణ్యాలను నేర్చుకోవచ్చు. నాట్యం పట్ల అందరూ సానుకూలంగా స్పందించాలన్నదే నా ఆకాంక్ష. - అర్చన -
శరణం... గురు చరణం...
గురు బ్రహ్మ భారతీయ సంప్రదాయంలో గురువుది అత్యున్నతమైన స్థానం. గురువు అనుగ్రహం లేకుండా ఎవ్వరూ జీవిత లక్ష్యాలను సాధించలేరు. తల్లి, తండ్రి, గురువు, అతిథి- ఈ నలుగురు ప్రత్యక్ష గురువులు. భగవంతుని తల్లి, తండ్రి, గురువుల రూపంలోను, తల్లి, తండ్రి, గురువులను భగవంతుని రూపంలోను దర్శించి ఆరాధించడం భారతీయ సంప్రదాయం. సద్గురువును, సదాచార్యుని పొందడం గొప్ప అదృష్టం. యోగ్యత ఉన్న వ్యక్తుల చెంతకు భగవంతుడే ఒక సద్గురువును పంపిస్తాడట. సద్గురువును పొందడానికి యోగ్యత కలగాలంటే సత్సంగంలోనూ, ఆధ్యాత్మిక కార్యకలాపాలలోనూ పాల్గొనడమే సరైన మార్గం. జగద్గురువు ఆదిశంకరులు, భగవద్రామానుజులు, షిరిడి సాయిబాబా వంటివారు కూడా సద్గురు చరణారవిందాలను సేవించినవారే! ఎందుకంటే... నీటిలోని చేప తన చూపుతోను, తాబేలు తన స్పర్శతోను తమ పిల్లలని సాకినట్లుగా, శిష్యులను ఉత్తములుగా తీర్చిదిద్దగలిగిన మహనీయులే గురువులు. ప్రపంచంలో ఉన్న అనేక రకాల ఆధ్యాత్మిక సాధనలలో ఏది ఎవరికి తగినది? అన్నదానిని సాధకుని యోగ్యతను బట్టి, అవగాహన స్థాయిని బట్టి నిర్ణయించేది, ఉపదేశించేది గురువే. కనుక మన ధర్మంలో గురువుకు ప్రత్యేక స్థానం ఉండటం వల్ల గురువును దైవంగాను, ఒక్కోసారి దైవం కన్న మిన్నగాను పరిగణించే ఆచారం అనాదిగా వస్తోంది. అపార జ్ఞానరాశిగా పోగు పడి ఉన్న వేదాలను నాలుగుగా విభజించి, అష్టాదశ పురాణాలను విరచించి, పంచమవేదం వంటి భారత మహేతిహాసాన్ని రచించిన తేజోమూర్తి వేదవ్యాసుడు. వేదవాఙ్మయానికి మూల పురుషుడయిన వ్యాసుడు జన్మించిన ఆషాఢపూర్ణిమను వ్యాసపూర్ణిమగా జరుపుకుంటున్నాం. అపర నారాయణుడయిన ఈయన వల్లనే మన సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచమంతటా పరిఢవిల్లాయి. బ్రహ్మసూత్రాలను నిర్మించి, కర్మ, జ్ఞాన, భక్తి మార్గాలను పటిష్టం చేసిన ఆ వశిష్ఠుని ముని మనుమడయిన వ్యాసుని ఈ రోజు అర్చించడం భారతీయుల కర్తవ్యం. గురువులలో మొట్టమొదటి వాడు శ్రీకృష్ణుడు. అంతకన్నా ముందు దత్తాత్రేయులవారు. ఆ తర్వాత వేదవ్యాసుడు, ఆయన తర్వాత ఆదిశంకరాచార్యులు, షిరిడి సాయిబాబా, శ్రీ రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, భగవాన్ సత్యసాయి బాబా తదితరులు. వీరెవ్వరితోనూ మనకు ప్రత్యక్షమైన అనుబంధం ఉండచ్చు, ఉండకపోవచ్చు. అయితే మనకు విద్యాబుద్ధులు నేర్పి, మనం గౌరవప్రదమైన స్థానంలో నిలబడేందుకు బాటలు పరిచిన మన గురువులతో మనకు అనుబంధం, సామీప్యం తప్పనిసరిగా ఉండి ఉంటుంది కాబట్టి గురుపూర్ణిమ సందర్భంగా వారిని స్మరించుకోవటం, సేవించుకోవటం, సన్మానించుకోవటం సముచితం, సందర్భోచితం. ఒకవేళ మనకు అందుకు వీలు లేనట్లయితే, కనీసం మన పిల్లలకైనా ఆ అవకాశం కల్పించటం, వారి చేత వారి గురువులకు పాదాభివందనం చేయించటం, సమ్మానింపజేయడం మన కనీస ధర్మం. (ఈ నెల 12న గురుపూర్ణిమ సందర్భంగా) - డి.వి.ఆర్ -
కట్టూ బొట్టూ.. అంతా భారతీయం
-
విజయం చేకూర్చే దశమి
లోకంలో ఉన్న మనందరం లోహాల్లో బంగారం, సువాసన గల పుష్పాల్లో కదంబం, వనాల్లో నందనం, కట్టడాల్లో దేవేంద్రభవనం... ఇలా గొప్పవని లెక్కిస్తూ ఉంటాం. నిజానికి భారతీయ సంప్రదాయం లెక్కించమని చెప్పిందీ, ప్రాముఖ్యాన్ని గుర్తించవలసిందని చెప్పిందీ, ఇలాంటి వస్తువుల గొప్పదనాన్ని గురించి కాదు... మనందరినీ నడిపిస్తున్న కాలం గొప్పదనాన్ని గుర్తుంచుకోవలసిందని తెలియజేసింది. కాలంలో ఉండే సంవత్సరానికీ, సంవత్సరంలో కనిపించే అయనానికీ, ఋతువుకీ మాసానికీ పక్షానికీ తిథికీ వారానికీ ... అన్నింటికీ ప్రత్యేకతలుంటాయని నిరూపించినవాడు బ్రహ్మదేవుడు. అందుకే ఆయన ప్రభవలో ఉత్తరాయణంలో వసంత ఋతువులో చైత్రంలో శుద్ధపక్షంలో పాడ్యమీ తిథిలో సృష్టిని ప్రారంభించాడు. అదే తీరుగా ఏ రాక్షసుణ్ణి వధించాలన్నా ఏ యజ్ఞాన్ని ప్రారంభించాలన్నా ఏకాంలో ఏది సరైన సమయమో గమనించి ఆ నాడే ఆ పనిని చేస్తూ వచ్చారు దేవతలంతటి వారు కూడ. మనకి పండుగగా కనిపిస్తున్న విజయదశమిలో దాగిన తిథుల గొప్పదనం ఇంత అంత కాదు. ఏ పురోహితుణ్ణి అడిగినా శుద్ధ పాడ్యమినాడు పనిని ప్రారంభించవద్దనే చెప్తారు. అదే పూర్ణిమ వెళ్లిన మరునాడు అంటే కృష్ణపాడ్యమి అయితే మంచిదనే చెప్తారు. దానిక్కారణం శాస్త్రం అలాగే చెప్పింది. అయితే ఆశ్చర్యమేమంటే అమ్మ తాను విజయాన్ని సాధించడానికి శుద్ధ పాడ్యమినే మంచిరోజుగా ఎన్నుకోవడం. అందుకే దసరా నవరాత్రాలు ఆశ్వయుజ శుద్ధ పాడ్యమినాడే ప్రారంభమయ్యాయి. దశమినాటికి విజయాన్ని తెచ్చిపెట్టి అమ్మని విజయ రూపిణిగా నిలబెట్టాయి. ఈ నేపథ్యంలో ఏ తిథిలో ఏ రహస్యం దాగి ఉందో గమనిద్దాం! పాడ్యమి: అమావాస్య వెళ్లిన పాడ్యమిని శుద్ధ పాడ్యమి అంటారు. అదే పూర్ణిమ వెళ్లిన పాడ్యమి అయితే శుభకరమని పైన అనుకున్నాం. అయితే అమ్మ శుద్ధ పాడ్యమినాడే ప్రారంభించి విజయాన్ని ఎలా సాధించగలిగింది? దైవానికి ఈ నిషేధాలు లేవా? లేక అసలు ఈ తీరు ఆలోచనే సరికాదా అనిపిస్తుందా మనకి. చిత్రమేమిటంటే శుద్ధ పాడ్యమి చెడ్డ తిథి కాదు. అయితే ఆ ప్రారంభించబడిన పని- అమావాస్య వరకూ చక్కగా కొనసాగాలంటే దానిని కనీసం పూర్ణిమ వరకైనా చేస్తూనే ఉండాలి. కాబట్టి విజయసిద్ధి కావాలంటే శుద్ధ పాడ్యమి నుండి అమావాస్య (నెలరోజులు) వరకు ఆపకుండా పనిని చేయాలి. అది అమావాస్య వరకూ కొనసాగని పక్షంలో కనీసం పూర్ణిమవరకైనా నిర్విఘ్నంగా చేస్తూ ఉండాలి. ఈ విషయాన్ని ‘బాలాత్రిపుర సుందరీ దేవి’ అలంకారం మనకి చెప్తుంది. (బాలా రూపానికి పదిరోజులూ త్రిపుర రూపానికి పదిరోజులూ సుందరీ రూపానికి పదిరోజులూ కలిపి మొత్తం నెలరోజుల ఆరాధన) విదియ: పాడ్యమినాడు ప్రారంభించిన పక్షంలో వ్యక్తికి విదియనాడు- అంటే రెండవ రోజున (ద్వితీయ) మానసిక ఆందోళన తొలగుతుంది. చంద్రుడు ఆకాశంలో సన్నని గీత ఆకారంలో ఈ రోజున అర్ధచంద్రాకారంగా కనిపిస్తాడు. దీన్నే లోకంలో నెలపొడుపు, నెలబాలుడు అని పిలుస్తారు. స్త్రీలు ఈ తిథినాడు చంద్రుణ్ణి దర్శించాలని చెప్తారు పెద్దలు. దానిక్కారణం స్త్రీలకి మానసిక బలం తక్కువ ( అ- బల)కాబట్టి. అలాంటి మనోబలం స్త్రీకి కలిగిన రోజున ఇల్లంతా సిరితో నిండినట్లే. అందుకే ఈ రోజున కనిపించే అలంకారం శ్రీ మహాలక్ష్మి. తదియ: ఈ రోజు ప్రారంభించబడిన పని అక్షయంగా సాగుతుంది. అందుకే తదియ తిథినాడు అక్షయ తదియ- అక్ష తదియ- అక్ష తృతీయ లేదా అక్షయ తృతీయ అనే పండుగ వైశాఖమాసంలో వస్తుంది. వ్యక్తికి అక్షయంగా ఉండాల్సింది ధనం కాదు ఆహారం. అందుకే ఈ రోజున అన్నపూర్ణాలంకారాన్ని వేయాలన్నారు పెద్దలు. చవితి: శుద ్ధచవితి అలాగే కృష్ణ చవితి లేదా బహుళ చవితి అనేవి వినాయకునికి ఇష్టమైన తిథులు. శుద్ధ చతుర్థి విఘ్నాలని నివారించి ఐశ్వర్యాన్ని కలిగించేందుకు బహుళ చతుర్థి కష్టాలని తొలగించేందుకూ ఏర్పడ్డాయి. అందుకే ప్రతిమాసంలోని బహుళ చతుర్థినీ సంకష్ట హర చతుర్థి అని పిలుస్తారు. ఈ రోజున అమ్మకి వేసే అలంకారం గాయత్రి. ఏ మంత్రాన్ని ఉసాసించాలన్నా ముందుగా ఉపాసించి తీరాల్సింది గాయత్రినే అనే విషయాన్ని చెప్తుంది ఈ తిథి. అలా చేసిన రోజున అమ్మ ఏ మంత్రాన్నైనా పట్టిచ్చేలా చేస్తుంది సాధకునికి. పంచమి: పంచమీ పంచభూతేశీ పంచ సంఖ్యోపచారిణీ... అనే ఈ నామాలు. పంచభూతాలకీ అధిపత్ని అమ్మ అనీ, మర్రి, మామిడి, మేడి, రావి, జువ్వి అనే పంచ పల్లవాలూ అమ్మకి ప్రీతికరాలనీ పంచాగ్నుల మధ్య (నాల్గుదిక్కులా నాలుగు నిప్పుమంటలు పైన సూర్యుడు ఉండగా) తపస్సు చేసి శంకరుణ్ణి మెప్పించిన తల్లి అనీ చెప్తుంది ఈ తిథి. పంచమినాడు ప్రారంభిస్తే పని మీద పట్టుదల పెరుగుతుంది వ్యక్తికి. అందుకే ఈనాడు వేసే అలంకారం లలితాదేవి. భండాసురాది రాక్షసుల్ని వధించేవరకూ విశ్రమించలేదు ఆమె. షష్ఠి: అన్నింటికీ మూలం విద్యయే అనే విషయాన్ని తెలియజేస్తూ మూలా నక్షత్రం నాడు కనిపించే ఈ తిథి షష్ఠి. ఈరోజున సరస్వతీ అల ంకారం వేస్తారు. వ్యక్తికి అక్షయంగా ఉండాల్సింది ఆహారమైతే మూలాధారంగా ఉండాల్సింది విద్య. ఇక్కడ విద్య అంటే మనం చదువుకునే చదువు కాదు. జీవితాన్ని నడుపుకోవడానికి ఏ వృత్తి అవసరమో ఆ వృత్తికి సంబంధించిన జ్ఞానమని అర్థం. సప్తమి: సంపూర్ణ భోగాలనిచ్చే తిథి సప్తమి. అందుకే ఏడుకొండలు కలిగి ఐశ్వర్యవంతుడు, ఏడువర్ణాలు ఒకచోట కూడి (సరిగమ పదని) ప్రపంచాన్ని ఆనందమయం చేసే సంగీతం, ఏడు చక్రాలు కలిగి శరీరానికి సంపూర్ణతని కలుగజేసే కుండలినీ విధానం ఏడడుగులతో ఏడు మాటలతో జీవితాల్ని దగ్గరకి చేర్చే సప్తపది... ఇవన్నీ ఏడుతో ముడిపడినవే. ఇలాంటి ఏడుతో ముడిపడిన పక్షంలో అది నిజమైన భోగానికి ప్రతీక అని గుర్తు చేస్తూ అమ్మకి ఈ రోజున భోగరూపమైన భవానీ అలంకారాన్ని వేస్తారు. అష్టమి: ఈ తిథి కష్టాలని ఎదుర్కొనేందుకు సంకేతం. అష్టకష్టాలు, అష్ట దారిద్య్రాలు... అని వింటూంటాం. అదే సందర్భంలో అష్టైశ్యర్యాలనే మాట కూడ వింటుంటాం. ధైర్యంగా కష్టాన్ని ఎదుర్కొన్న పక్షంలో ఐశ్వర్యం మనదే అనే విషయాన్ని చెప్తుంది ఈ తిథి. దుర్గాదేవి రాక్షసునితో యుద్ధానికి సిద్ధపడుతూ కష్టాలను ఎదుర్కోదలిచింది కాబట్టే ఈ తిథి దుర్గాష్టమి అయింది. అసలు అష్టమి ఎప్పుడూ సవాళ్లని ఎదుర్కోవలసిన తిథే. నవమి: మహ త్- గొప్పదైన, నవమి- తొమ్మిదవ రోజు అనే అర్థంలో ఇది మహానవమి అవుతుంది నిజానికి. అయితే ‘మహర్నవమి’ అని ఎందుకో ప్రచారంలోకి వచ్చింది. అష్టమినాటి అర్ధరాత్రి కాలంలోనే ప్రారంభిస్తారు అర్చనని. (క్రోధం బాగా ఆవహించే ఈ రూపాన్ని ’కాళి’ అని పిలుస్తారు. కాళి అనే మాటకి కాలాన్ని అంటే ఎదుటివ్యక్తి మృత్యువుని తన అధీనంలో ఉంచుకునేది అని అర్థం. ధర్మబద్ధమైన విజయాన్ని సాధించాలంటే అది నవమీ తిథికి సొంతం. రాముడు పుట్టింది చైత్ర శుద్ధ నవమి కావడానిక్కారణం ఇదే. దశమి: ఇది పూర్ణ తిథి. శ్రీహరి ప్రధానావతరాలనెత్తింది పది సంఖ్యతోనే. లోకాన్ని రక్షిస్తూన్న దిక్కులు కూడ పది. (నాలుగు దిక్కులూ నాలుగు విదిక్కులూ పైన, కింద కలిపి పది). శరీరం నిండుగా వ్యాపించి ఉన్న వాయువులు కూడ దశ విధ వాయువులే. దశేంద్రియాలు కూడా ఈ తీరుగా కనిపించేవే. ఇది విజయ సంఖ్య. అందుకే అమ్మ తన ప్రస్థానాన్ని ప్రారంభించి పదవ తిథియైన దశమినాడు రాక్షస సంహారాన్ని చేసి లోకానికి జయాన్ని కల్గించి, ఆ జయమనేది దైవమైన తాను సాధించి లోకక్షేమం కోసం వినియోగిస్తోంది కాబట్టి దాన్ని ‘విజయ దశమి’అని వ్యవహరించింది. ఈ రోజున ఉదయం చేసే అలంకారం మహిషాసుర మర్దిని. సాయంవేళ రాజరాజేశ్వరీ అలంకారం. అమ్మకి తన సంతానపు రక్షణ అతి ముఖ్యం కాబట్టి, లోకంలో వ్యాధులు బాగా ప్రబలే వసంత శరత్కాలాల్లోనే తన ఉత్సవాలు పదిరోజులపాటూ ఆహార నియమాలని తానే నైవేద్యాల రూపంగా (ఔషధాలుగా) మన చేత చేయిస్తూ మన ఆరోగ్యాన్ని పరిరక్షిస్తుంది ఆ జగన్మాత. ‘శరద్వసంత నామానౌ లోకానం యమదంష్ట్రికే’ ఈ శరత్ వసంత ఋతువుల్లోకే యమునికి పని ఎక్కువ అని తెలియజేస్తూ ఈ కాలాన్ని యమదంష్ట్రికా కాలం (యముని కోరలు తెరిచి ఉంచే కాలం) అంది శాస్త్రం. ఆ కారణంగా ఏయే తిథుల్లో ఏ యే రూపాలతో అమ్మని ఆరాధించాలో తెలుసుకుని నిత్యం ఆ రూపంతో ఉన్న అమ్మని ధ్యానిస్తూ ఉంటే (నివేదనలు ప్రధానం కాదు నామ పారాయణ ప్రీత కాబట్టి నామ పారాయణని చేస్తూ) ఆ తల్లి మనకి మానసిక శారీరక ఆరోగ్యంతోపాటు ఐశ్వర్య సుఖ సంతోషాలనిస్తుంది. తన్నో దుర్గిః ప్రచోదయాత్! - డాక్టర్ మైలవరపు శ్రీనివాసరావు మీకు తెలుసా! వాల్మీకి రామాయణం ప్రకారం రాముడు రావణుని మీద దండు వెడలిన దినం విజయ దశమే. దుర్గ మహిషాసురుని అంతమొందించిన రోజని, అజ్ఞాతవాస పరిసమాప్తి కాగానే విజయుడు ఉత్తర గోగ్రహణం చేసి విజయం పొందిన రోజని... ఇలా విజయ దశమి జరుపుకోవడం వెనుక రకరకాల గాథలు ప్రచారంలో ఉన్నాయి. శమీ వృక్షం అగ్ని అంటే తేజస్సుకు సంకేతం. అందుకే విజయ దశమినాడు శమీ వృక్షాన్ని అంటే జమ్మి చెట్టును దర్శిస్తే పాపాలను పోగొడుతుంది. మన లోపల, బయట ఉన్న శత్రువులను నశింప చేస్తుందని ప్రతీతి. కొన్ని ప్రాంతాలలో దసరాను వీరత్వానికి సంకేతంగా భావిస్తారు. శ్రీ రాజ రాజేశ్వరీ దేవికి పెరుగన్నం నివేదిస్తే సంసారం చ ల్లగా ఉంటుందంటారు. -
సేంద్రియ వ్యవసాయం భేష్
శాయంపేట, న్యూస్‌లైన్ : జిల్లాలో రైతులు సేంద్రియ సాగు పద్ధతులు అవలంబించడం అభినందనీయమని బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ ఆండ్రూ మెక్ అలిస్టర్ అన్నారు. మారి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో శాయంపేట మండల కేంద్రంలోని సంస్థ కార్యాలయంలో బుధవారం ఆయన రైతులతో సమావేశమయ్యూరు. ముందుగా సంస్థ బాధ్యులు, రైతులు ఆయనకు భారతీయ సంప్రదాయం ప్రకారం ఆహ్వానం పలికారు. అనంతరం మారి సంస్థ ఆధ్యర్యంలో అమలు చేస్తున్న సేంద్రియ వ్యవసాయ పద్ధతులను సొసైటీ డెరైక్టర్లు, రైతులు తెలిపారు. జీవ సంబంధ ఎరువుల వినియోగం.. ఉపయోగంపై మహిళా రైతు రజిత వివరించారు. అదేవిధంగా వ్యవసాయ సాగు పద్ధతులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్‌ను అలిస్టర్ సందర్శించారు. ఈ సందర్భంగా రసాయనిక, సేంద్రియ ఎరువులకు గల తేడాలపై ఆరా తీయగా... రైతులు చెప్పిన సమాధానంతో ఆయన సంతోషం వ్యక్తం చేశారు. రసాయనికి ఎరువుల వాడకాన్ని తగ్గించి... సేంద్రియ వ్యవసాయంపై మొగ్గుచూపడం శుభపరిణామమన్నారు. రైతులతో సమావేశం ముగిసిన అనంతరం శాయంపేట మండలం కొత్తగట్టు సింగారం గ్రామంలోని ఆలేటి తిరుపతికి చెందిన పత్తి పంటను అలిస్టర్ పరిశీలించారు. సాగు విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. రైతులు గ్రామంలో ఏర్పాటు చేసుకున్న సొసైటి వివరాల రికార్డులను పరిశీలించారు. అరుణ్పిల్లే, మృణాలి, శంకన్సర్కార్, జేడీఏ రామారావు, డబ్ల్యూడబ్ల్యూఫ్ సీనియర్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ ఉమేశ్కృష్ణ, మారి సంస్థ కార్యదర్శి మురళి, ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ నర్సింహారెడ్డి, రామ్మూర్తి, కృష్ణమూర్తి, డిప్యూటీ తహసీల్దార్ కె.కేదారి, మారి సంస్థ క్లస్టర్ కోఆర్డినేటర్ గౌస్, సిబ్బంది పల్నాటి రాంబాబు, రైతులు పాల్గొన్నారు.