ఓడినవాడు కోర్టులో ఏడుస్తాడు, గెలిచినవాడు ఇంటికొచ్చి ఏడుస్తాడు!
నివృత్తం: ఇది ఆధునిక న్యాయస్థానాలు వచ్చాక పుట్టుకు వచ్చిన సామెత. కోర్టు మెట్లు ఎక్కితే న్యాయాన్యాయల సంగతి పక్కనపెట్టి చూస్తే ఇరు వర్గాలకు కష్టాలు మొదలైనట్లే. ఎందుకంటే కోపతాపాల వల్లో, పెండింగ్ ఫైళ్ల వల్లో, ఇగోల వల్లో ఒక పట్టాన వాదనలు పూర్తి కావు. సాక్ష్యాలనీ, గైర్హాజరులనీ, రాజీలనీ ఇలా పుణ్యకాలం కాస్త కోర్టుకు తిరగడంలోనూ వాయిదాలకు హాజరు కావడంలోనూ గడిచిపోతుంది. ఈ నేపథ్యంలో గెలిచినా, ఓడినా తుది తీర్పు వచ్చే సమయానికి చాలా కోల్పోయి ఉంటాం. పనులన్నీ మానుకుని కోర్టుకు తిరగడం వల్ల, దారి ఖర్చులు-లాయరు ఖర్చులు ఇలా రకరకాలుగా ఎంతో పోగొట్టుకుంటాం. కాబట్టి గెలిచినా ఓడినా అత్యధిక కేసుల్లో ఇరువర్గాలకీ ఎంతోకొంత నష్టం వాటిల్లక తప్పదన్న అంతరార్థంతో వాడుకలోకి వచ్చిన సామెత ఇది.
నుదుటి మీద బొట్టు ఎందుకు పెడతారు?
నుదుటి మీద బొట్టు పెట్టడం అనేది ఒక సనాతన భారతీయ సంప్రదాయం. ఇది హిందువుల సంప్రదాయమని ప్రచారమైంది కానీ ఇది మతానికి సంబంధించిన సంప్రదాయం కాదు. దేహానికి సంబంధించిన సంప్రదాయం. మనిషిలో అష్టచక్ర స్థానాలుంటాయి. వాటిలో ముఖ్యమైన ‘ఆజ్ఞచక్ర’ రెండు కనుబొమ్మల మధ్యలో ఉంటుంది. అక్కడ బొట్టు పెట్టడం ద్వారా ఆ చక్రం ఉత్తేజితమై మనిషిలో ఆందోళన తగ్గి ప్రశాంతత సిద్ధిస్తుంది. ఆక్యుపంక్చర్ విధానంలోని ఆక్యుప్రెజర్ సూత్రాల ప్రకారం నుదురు తలనొప్పి నివారణ కేంద్రం. బొట్టు పెట్టుకోవడం ద్వారా అక్కడ కొంత ఒత్తిడి పడుతుంది. అపుడు ఆ కేంద్రం ఉత్తిజేతిమై అనేక ప్రయోజనాలు కలిగిస్తుంది అని చెబుతారు.