దేవుడు అంతటా, అందరిలో ఉన్నాడని నమ్మే గడ్డపై... ఆయనను నిర్ణీత స్థల, కాలాలకే పరిమితం చేసే సంకుచిత రాజకీయ స్వార్థాలు చిచ్చు రేపుతూనే ఉన్నాయి. విభిన్న వర్గాల మధ్య విద్వేషాగ్ని రగిలిస్తున్న ఈ ప్రయత్నాలకు తాజా ఉదాహరణ – యూపీలోని సంభల్ జామా మసీదు వివాదం, దరిమిలా అక్కడ రేగిన హింసాకాండ, ఆస్తి, ప్రాణనష్టం. ఈ ఏడాది జనవరిలో జరిగిన అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపనతో మందిరం – మసీదు వివాదాలు ముగిసిపోతాయని ఎవరైనా ఆశపడితే అది వట్టి అడియాసని మరోసారి తేలిపోయింది.
మత రాజకీయాలకూ, వర్గ విభేదాలకూ ప్రార్థనా స్థలాలు కేంద్రాలు కారాదనే సదుద్దేశంతో చేసిన ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం–1991 స్ఫూర్తికే విఘాతం కలిగింది. ప్రార్థనా మందిరాల నిర్మాణమూలాలను తెలుసుకోవాలన్న ఒక వర్గం ఉత్సాహం తప్పేమీ కాదంటూ సర్వోన్నత న్యాయస్థానం ఒక దశలో అదాటున చేసిన వ్యాఖ్యలు చివరకు ఇక్కడకు తెచ్చాయి. వివాదం వస్తే చాలు... దేశంలో ప్రతి చిన్న కోర్టూ అనాలోచితంగా సర్వేలకు ఆదేశించేలా ఊతమిచ్చాయి. ఇది అత్యంత దురదృష్టకర పరిణామం.
తాజా ఘర్షణలకు కేంద్రమైన సంభల్‌లోని షాహీ జామా మసీదు 16వ శతాబ్దికి చెందిన రక్షిత జాతీయ కట్టడం. వారణాసిలోని జ్ఞానవాపి, యూపీలోని మథురలో నెలకొన్న ఈద్గా, మధ్యప్రదేశ్ లోని ధార్‌లో ఉన్న కమాల్ మౌలా మసీదుల్లో లానే దీనిపై రచ్చ మొదలైంది. అక్కడ కేసులు వేసినవారే ఇక్కడా కోర్టుకెక్కారు. మొఘల్ చక్రవర్తి బాబర్ కాలంలో కట్టిన 3 మసీదుల్లో (పానిపట్, అయోధ్య, సంభల్) ఇదొకటి. ప్రాచీన హరిహర మందిర్ స్థలంలో ఈ మసీదును నిర్మించారని పిటిషనర్ల వాదన.
జిల్లా కోర్టులో ఈ నెల 19న కేసు వస్తూనే జడ్జి మసీదులో ఫోటో, వీడియో సర్వేకు ఆదేశిస్తూ, 29వ తేదీ కల్లా నివేదిక సైతం సమర్పించాలన్నారు. తొలి సర్వే ప్రశాంతంగా సాగినా, నవంబర్ 24 నాటి రెండో సర్వే భారీ హింసకు దారి తీసింది. సర్వేకు వచ్చినవారిలో కొందరు జై శ్రీరామ్ నినాదాలు చేశారనీ, దాంతో నిరసనకారులు రాళ్ళురువ్వారనీ వార్త. కాల్పుల్లో అయిదుగురు మరణించారు. అమాయకుల ప్రాణాలు, పట్నంలో సామరస్య వాతావరణం గాలికెగిరి పోయాయి.
శతాబ్దాల తరబడి అన్ని వర్గాలూ కలసిమెలసి జీవిస్తున్న చోట విద్వేషాగ్ని రగులుకుంది. ఎన్నో ఏళ్ళుగా ఉన్న అయోధ్య, వారణాసి వివాదాలకు భిన్నంగా సంభల్ కథ చిత్రంగా ఈ ఏడాదే తెర మీదకొచ్చింది. పశ్చిమ యూపీలో సంభల్ జిల్లా మూడు దశాబ్దాలుగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి కంచుకోట. 1980ల నుంచి అక్కడ అధికారం కోసం బర్ఖ్, మెహమూద్ కుటుంబాలు వేర్వేరు పార్టీల పక్షాన పరస్పరం తలపడుతూ వచ్చాయి. తర్వాత 1990ల నుంచి రెండు వర్గాలూ ఎస్పీతోనే అనుబంధం నెరపుతున్నాయి.
అధికారంలో పైచేయి కోసం ఒకే పార్టీలోని ఈ రెండు వర్గాల మధ్య పోరాటమే తాజా హింసకు కారణమని బీజేపీ ప్రచారం చేస్తోంది. హిందూ – ముస్లిమ్‌ల తర్వాత, ఇక ముస్లిమ్‌లలోని ఉపకులాల మధ్య చీలికలు తీసుకురావడానికే కాషాయ ధ్వజులు ఈ ప్రచారం చేస్తున్నారని ఎస్పీ ఖండిస్తోంది. మొఘల్ శిల్పనిర్మాణ శైలికి ఈ మసీదు ప్రతీకైతే, ఈ సంభల్ ప్రాంతం విష్ణుమూర్తి పదో అవతారమైన కల్కి వచ్చే ప్రదేశమని హిందువుల నమ్మిక. భిన్న విశ్వాసాల మధ్య సొంత లాభం చూసుకొనే కొందరి రాజకీయంతో సమస్య వచ్చి పడింది.
నిజానికి, 1947 ఆగస్ట్ 15కి ముందున్న ధార్మిక విశ్వాసాల ప్రకారమే అన్ని ప్రార్థనా ప్రదేశాలూ కొనసాగాలి. ఒక్క అయోధ్య రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదమే దానికి మినహాయింపని దీర్ఘకాలం క్రితమే కేంద్ర సర్కార్ చేసిన 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం. అయోధ్య తరహాలో మరిన్ని సమస్యలు రాకూడదన్నది దాని ప్రధానోద్దేశం. ఏ ప్రార్థనా స్థలాన్నీ పాక్షికంగా కానీ, పూర్తిగా కానీ ఒక మతవిశ్వాసం నుంచి మరోదానికి మార్పిడి చేయరాదనీ, చర్చ పెట్టరాదనీ చట్టంలోని 3వ సెక్షన్ స్పష్టంగా నిషేధించింది.
అయితే, ప్రార్థనా స్థలాల ప్రాచీన స్వరూపమేమిటో నిర్ధారించడం చట్టవిరుద్ధం కాదంటూ 2002 మేలో జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు వివాదాలకు సందు ఇచ్చాయి. అనేకచోట్ల చిన్న కోర్టులు మందిర– మసీదు వివాదాలపై విచారణ చేపట్టి, పర్యవసానాలు ఆలోచించకుండా హడావిడిగా సర్వేలకు ఆదేశిస్తున్నాయి. సంభల్ ఘటన తర్వాతా అజ్మీర్‌లోని ప్రసిద్ధ షరీఫ్ దర్గాను గుడిగా ప్రకటించాలంటూ దాఖలైన కేసును రాజస్థాన్ కోర్ట్ అనుమతించడం ఓ మచ్చుతునక. సమస్యల్ని తేల్చాల్సిన గౌరవ కోర్టులే ఇలా తేనెతుట్టెల్ని కదిలించడం విషాదం.
ప్రార్థనాస్థలాల చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీమ్‌లో ఇప్పటికే నాలుగు పిటిషన్లున్నాయి. దానిపై నిర్ణయానికి కేంద్రం, కోర్ట్ తాత్సారం చేస్తుంటే ఆ లోగా వారణాసి, మథుర, ధార్, సంభల్, తాజాగా అజ్మీర్... ఇలా అనేక చోట్ల అత్యుత్సాహం వ్యక్తమవుతోంది. ఇది శాంతి, సామరస్యాలకు పెను ప్రమాదం. ఈ ప్రయత్నాలను ఆపేందుకు సర్కారు కానీ, సర్వేలపై జోక్యానికి సుప్రీమ్ కానీ ముందుకు రాకపోవడం విడ్డూరం.
ఒక వివాదాస్పద స్థలపు ధార్మిక స్వభావ అన్వేషణ చారిత్రక నిర్ధారణ, పురాతత్వ అన్వేషణతో ఆగుతుందనుకుంటే పొరపాటు. అది మత పరంగా, రాజకీయంగా రావణకాష్ఠమవుతుంది. కాశీ, మథురల్లో, ఇప్పుడు సంభల్ జరుగుతున్నది అదే. ‘ప్రతి మసీ దులో శివలింగాన్ని అన్వేషించాల్సిన పని లేద’ంటూ ఆరెస్సెస్ అధినేత రెండేళ్ళ క్రితం అన్నారు కానీ జరుగుతున్నది వేరు.
అధికార వర్గాల అండదండలతోనే ఈ విభజన చిచ్చు రగులుతోందన్నదీ చేదు నిజం. 2019 నవంబర్‌లో ప్రార్థనా స్థలాల చట్టాన్ని సమర్థించిన సుప్రీమ్ మరోసారి గట్టిగా ఆ పని చేయకుంటే కష్టమే. ఓ హిందీ కవి అన్నట్టు, మసీదులు పోనివ్వండి... మందిరాలు పోనివ్వండి... కానీ రక్తపాతం మాత్రం ఆపేయండి. మతాలకు అతీతంగా మనిషినీ, మానవత్వాన్నీ బతకనివ్వండి!
కోర్టులు కదిపిన తేనెతుట్టెలు
Published Fri, Nov 29 2024 5:01 AM | Last Updated on Fri, Nov 29 2024 5:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment