
రేపో మాపో లోక్‌సభ ఎన్నికల నగారా మోగబోతున్న తరుణంలో... ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఆరునూరైనా ఈనెల 15కల్లా బహిరంగపరచాలని సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పిన కొన్ని గంటల్లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) నిబంధనలపై సోమవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదలైంది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మైనారిటీలుగా వేధింపులకు లోనవుతూ మన దేశానికి వలసవచ్చిన హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, క్రైస్తవ, పార్సీ మతస్తులకు త్వరితగతిన భారత పౌర సత్వం ఇవ్వటం సీఏఏ ప్రధాన ఉద్దేశమని పార్లమెంటులో బిల్లు పెట్టిన సందర్భంగా కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు మరోసారి ఆమాటే చెప్పింది. ఈ మతస్తులు వరసగా అయిదేళ్లపాటు ఈ దేశంలో నివసిస్తే పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
1955 నాటి పౌరసత్వ చట్టానికి ఈ సవరణలు తీసుకొచ్చారు. చట్టంలో ముస్లింలను మినహాయించినట్టు బాహాటంగానే కనబడుతోంది. కానీ శ్రీలంకలో మైనారిటీలైన హిందూ తమిళులనూ, మయన్మార్‌లోని మైనారిటీలు రోహింగ్యాలనూ, ఇంకా... హజరా, అహ్మదీయ వంటి ముస్లిం మైనారిటీ తెగలనూ సీఏఏ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ తెగలు కూడా భారత పౌరసత్వం కోసం ఎప్పటిలా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కనీసం వారు పదకొండేళ్లపాటు ఈ దేశంలో నివసించాలి. ఆచరణలో పౌరసత్వం రావటానికి దశాబ్దాలు పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. ముస్లిం దేశాల్లోని హిందువుల స్థితిగతులపై వున్న ఆరాటం లంక తమిళుల విషయంలో ఎందుకు లేకుండా పోయింది? అక్కడ వారు ఎదుర్కొంటున్న వివక్ష, హింస తక్కువేమీ కాదు.
చట్టం ముందు అందరూ సమానులేనని మన రాజ్యాంగం చెబుతోంది. రాజ్యం ఎవరికీ సమానత్వాన్ని నిరాకరించకూడదనీ, పౌరులందరికీ చట్టాలు సమంగా రక్షణ కల్పించాలనీ రాజ్యాంగంలోని 14వ అధికరణ చాటుతోంది. పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నవారి విషయంలో ఆ స్ఫూర్తే కొనసాగాలి. కానీ సీఏఏ అందుకు విరుద్ధంగా కొన్ని మతాలవారిని ఉదారంగా చూడటం, మరికొందరిని దూరం పెట్టడం ఎంతవరకూ సమంజసం? ఈ చట్టాన్ని సవాలు చేస్తూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) 2020లో పిటిషన్ దాఖలు చేసింది. కాలక్రమంలో మరో 200 పిటిషన్లు దానికి జత కలిశాయి.
ఇందులో అస్సాంకు చెందిన అసోం గణపరిషత్, డీఎంకే, అస్సాం పీసీసీ మొదలుకొని అసదుద్దీన్ ఒవైసీ, మహువా మొయిత్రా, జైరాం రమేష్ వంటి నాయ కులు కూడా వున్నారు. బిల్లు చట్టంగా మారాక దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో, విశ్వ విద్యాలయాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఢిల్లీలోని జామియా మిలియా, అలీగఢ్ ముస్లిం యూని వర్సిటీ వంటిచోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనల్లో వందమంది వరకూ మరణించగా, అనేకులు గాయపడ్డారు. వందలాదిమందిపై ఇప్పటికీ కేసులు కొనసాగు తున్నాయి.
సోమవారం నోటిఫికేషన్ విడుదలయ్యాక ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, త్రిపురల్లో ఆందోళనలు చెలరేగాయి. ఈ ఉద్యమాల వెనకున్న ఉద్దేశం వేరు. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ వంటివి పరాయి దేశాల మైనారిటీలకు మనమెందుకు పౌరసత్వం ఇవ్వాలని ప్రశ్నిస్తు న్నాయి. ఈ భారం తమపైనే పడుతుందని ఆందోళన పడుతున్నాయి. మరోపక్క సీఏఏ నోటిఫికేషన్ రాకపై గత కొన్ని నెలలుగా మీడియాలో కథనాలు వస్తూనే వున్నాయి. పశ్చిమ బెంగాల్‌లో మమతా బెనర్జీని ఎదుర్కొనటానికి ఇది బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుందనీ, లేకుంటే దెబ్బతింటామనీ ఆ రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు.
బెంగాల్‌లోని నాదియా, 24 పరగణాలు, తూర్పు బర్ద్వాన్, ఉత్తర బెంగాల్‌లోని మరికొన్ని ప్రాంతాలకు 1971లో బంగ్లా విముక్తి యుద్ధ సమయంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మతువా తెగ ప్రజలు హిందువులు. పౌరసత్వ చట్టానికి 2003లో చేసిన సవరణ కింద వారంతా శరణార్థులుగా కొనసాగుతున్నారు. ఓటుహక్కు వగైరాలున్నాయి. మొదట్లో సీపీఎంకూ, తర్వాత తృణమూల్‌కూ, ఇప్పుడు బీజేపీకీ వోటు బ్యాంకుగా వీరు ఉపయోగపడుతున్నారు. అస్సాంలోనూ బీజేపీకి అటువంటి ప్రయోజనాలే వున్నాయి. రామమందిరం, పౌరసత్వ సవరణ చట్టంవంటివి మాత్రమే ఎన్నికల్లో గట్టెక్కిస్తాయని నిజంగా బీజేపీ భావిస్తే అది ఆ పార్టీ బలహీనతను సూచిస్తుందే తప్ప బలాన్ని కాదు.
పొరుగు దేశాల బాధిత మైనారిటీల విషయంలో అనుసరించాల్సిన విధానాలను మాత్రమే సీఏఏ నిర్ధారించిందని, మైనారిటీల పౌరసత్వానికి దానివల్ల వచ్చే నష్టంలేదని, వారు భయపడాల్సిన పని లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారు. సీఏఏ దానికదే సమస్యాత్మకం కాక పోవచ్చు. కానీ జాతీయ పౌర పట్టిక (ఎన్‌ఆర్‌సీ)ను దాంతో అనుసంధానిస్తే ఉత్పన్నమయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కాదని నిపుణులంటున్న మాట. అస్సాంలో ఎన్‌ఆర్‌సీ అమలయ్యాక ఏమైందో చూస్తే ఇది అర్థమవుతుంది. ఆ రాష్ట్రంలో దాదాపు 20 లక్షలమంది పౌరసత్వానికి అనర్హు లయ్యారు.
ఇందులో ముస్లింలతోపాటు హిందువులు కూడా వున్నారు. ఎన్‌ఆర్‌సీని ఏదోమేరకు అంగీకరించిన అస్సాంలో సీఏఏపై వ్యతిరేకత వుండటాన్ని, లంక తమిళులకు చట్టంలో చోటీయక పోవటంపై వున్న అసంతృప్తిని కేంద్రం పరిగణనలోకి తీసుకున్నట్టులేదు. చట్టం తీసుకురావటానికి ముందు అన్ని వర్గాలతోనూ చర్చించలేదు. ఉద్యమాల సమయంలో చర్చలకు సిద్ధమని ప్రకటించినా అవేమీ జరగలేదు. కనీసం నోటిఫికేషన్ విడుదలకు ముందైనా సందేహాలు పోగొట్టాల్సిన అవసరం గుర్తించకపోతే ఎలా? అసలు ఎన్నికలు ముంగిట పెట్టుకుని సమస్యాత్మకమైన ఈ తేనెతుట్టెను ఎందుకు కదిపినట్టు?
Comments
Please login to add a commentAdd a comment