hindu
-
పాక్‌లో తొలి హిందూ పోలీసు అధికారిగా రాజేందర్ మేఘ్వార్
న్యూఢిల్లీ: మన దాయాది దేశం పాకిస్తాన్లో హిందువులపైన, హిందూ ఆలయాలపైన దశాబ్దాలుగా దాడులు జరుగుతున్న విషయం విదితమే. ఇటువంటి తరుణంలో హిందువులు అక్కడి ప్రభుత్వంలో, ఇతర హోదాల్లో ఉండటం అనేది గగనమే. అయితే పాక్‌లో తొలిసారిగా సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఉత్తీర్ణత సాధించి, అక్కడి పోలీస్ సర్వీసెస్‌కు రాజేందర్ మేఘ్వార్ అనే హిందువు ఎంపికయ్యారు.దీంతో పాకిస్తాన్లో తొలి హిందూ ఏఎస్పీగా రాజేందర్ మేఘ్వార్ చరిత్ర సృష్టించారు. ఈ నేపధ్యంలో రాజేందర్ మేఘ్వార్ భారత్‌లోనూ వార్తల్లో నిలిచారు. రాజేందర్ తాను పాక్‌లో మైనార్టీల సమస్యలను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.పాక్‌లోని పంజాబ్ ప్రావిన్స్ గుల్బర్గ్‌లోని ఫైసలాబాద్ పోలీస్‌శాఖలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌గా రాజేందర్ నియమితులయ్యారు. సింధ్ ప్రావిన్స్ పరిధిలోని బాడిన్కు చెందిన రాజేందర్ మేఘ్వార్ మీడియాతో మాట్లాడుతూ ప్రజలకు సేవ చేయాలనే తన చిరకాల కల నెరవేరినందుకు చాలా ఆనందంగా ఉందన్నారు. పోలీస్ శాఖలో పనిచేస్తేనే సమాజంలో అట్టడుగు స్థాయి ప్రజల సమస్యలు సులభంగా తెలుస్తాయని, అప్పుడే వాటిని పరిష్కరించగలనని రాజేందర్ మేఘ్వార్ తెలిపారు.ఒక పోలీసు అధికారిగా తన పరిధిలో శాంతి భద్రతల పరిరక్షణతో పాటు మైనారిటీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాజేందర్ పేర్కొన్నారు. రాజేందర్ మేఘ్వార్ రాకతో పాక్‌లోని మరికొందరు హిందూ యువకులు కూడా పోలీస్ సర్వీసుల్లో చేరే అవకాశం ఉంటుందని పలువురు అంటున్నారు. కాగా రాజేందర్ మేఘ్వార్‌తోపాటు మైనారిటీ వర్గానికి చెందిన రూపమతి అనే మహిళ కూడా సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించారు. రహీమ్ యార్ ఖాన్‌కు చెందిన ఆమె తాను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో చేరనున్నానని పేర్కొన్నారు. తాను పాకిస్తాన్ సాధిస్తున్న అభివృద్ధిని ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నం చేస్తానని పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: India-Syria Ties: అసద్ పతనంతో భారత్-సిరియా దోస్తీ ఏంకానుంది? -
హిందువులపై దాడులు..బంగ్లాదేశ్‌కు అమెరికా కీలక సూచన
వాషింగ్టన్:బంగ్లాదేశ్‌లో జరుగుతున్న ఆందోళకర పరిణామాలపై అగ్రదేశం అమెరికా స్పందించింది. పౌరుల ప్రాథమిక స్వేచ్ఛకు భంగం కలిగించొద్దని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి అమెరికా సూచించింది. బంగ్లాదేశ్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో దేశంలో మత,ప్రాథమిక,మానవ హక్కులను గౌరవించాలని అక్కడి మధ్యంతర ప్రభుత్వాన్ని అమెరికా కోరింది. ఈ మేరకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ మంగళవారం(డిసెంబర్4) మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వాలన్నీ చట్టాలను గౌరవించాల్సిందేనన్నారు. నిర్బంధంలో ఉన్నవారికి కూడా ప్రాథమిక స్వేచ్ఛనిస్తూ వారి మానవ హక్కులకు భంగం కలగకుండా చూడాలని పటేల్ కోరారు.కాగా, బంగ్లాదేశ్‌లో షేక్‌హసీనా ప్రభుత్వం పడిపోయి మధ్యంతర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అక్కడ మైనారిటీలుగా ఉన్న హిందువులపై దాడులు మొదలైన విషయం తెలిసిందే. ఇటీవల హిందు మతానికి చెందిన చిన్మయ్ కృష్ణదాస్‌ను కూడా అక్కడి ప్రభుత్వం అరెస్టు చేసింది. చిన్మయ్ తరపున కేసు వాదించేందుకు వచ్చిన న్యాయవాదిపైనా దాడి జరగడం బంగ్లాదేశ్‌లో దిగజారిన పరిస్థితులను తెలియజేస్తోంది. -
కోర్టులు కదిపిన తేనెతుట్టెలు
దేవుడు అంతటా, అందరిలో ఉన్నాడని నమ్మే గడ్డపై... ఆయనను నిర్ణీత స్థల, కాలాలకే పరిమితం చేసే సంకుచిత రాజకీయ స్వార్థాలు చిచ్చు రేపుతూనే ఉన్నాయి. విభిన్న వర్గాల మధ్య విద్వేషాగ్ని రగిలిస్తున్న ఈ ప్రయత్నాలకు తాజా ఉదాహరణ – యూపీలోని సంభల్ జామా మసీదు వివాదం, దరిమిలా అక్కడ రేగిన హింసాకాండ, ఆస్తి, ప్రాణనష్టం. ఈ ఏడాది జనవరిలో జరిగిన అయోధ్య రామమందిర ప్రతిష్ఠాపనతో మందిరం – మసీదు వివాదాలు ముగిసిపోతాయని ఎవరైనా ఆశపడితే అది వట్టి అడియాసని మరోసారి తేలిపోయింది. మత రాజకీయాలకూ, వర్గ విభేదాలకూ ప్రార్థనా స్థలాలు కేంద్రాలు కారాదనే సదుద్దేశంతో చేసిన ప్రార్థనా స్థలాల పరిరక్షణ చట్టం–1991 స్ఫూర్తికే విఘాతం కలిగింది. ప్రార్థనా మందిరాల నిర్మాణమూలాలను తెలుసుకోవాలన్న ఒక వర్గం ఉత్సాహం తప్పేమీ కాదంటూ సర్వోన్నత న్యాయస్థానం ఒక దశలో అదాటున చేసిన వ్యాఖ్యలు చివరకు ఇక్కడకు తెచ్చాయి. వివాదం వస్తే చాలు... దేశంలో ప్రతి చిన్న కోర్టూ అనాలోచితంగా సర్వేలకు ఆదేశించేలా ఊతమిచ్చాయి. ఇది అత్యంత దురదృష్టకర పరిణామం. తాజా ఘర్షణలకు కేంద్రమైన సంభల్‌లోని షాహీ జామా మసీదు 16వ శతాబ్దికి చెందిన రక్షిత జాతీయ కట్టడం. వారణాసిలోని జ్ఞానవాపి, యూపీలోని మథురలో నెలకొన్న ఈద్గా, మధ్యప్రదేశ్ లోని ధార్‌లో ఉన్న కమాల్ మౌలా మసీదుల్లో లానే దీనిపై రచ్చ మొదలైంది. అక్కడ కేసులు వేసినవారే ఇక్కడా కోర్టుకెక్కారు. మొఘల్ చక్రవర్తి బాబర్ కాలంలో కట్టిన 3 మసీదుల్లో (పానిపట్, అయోధ్య, సంభల్) ఇదొకటి. ప్రాచీన హరిహర మందిర్ స్థలంలో ఈ మసీదును నిర్మించారని పిటిషనర్ల వాదన. జిల్లా కోర్టులో ఈ నెల 19న కేసు వస్తూనే జడ్జి మసీదులో ఫోటో, వీడియో సర్వేకు ఆదేశిస్తూ, 29వ తేదీ కల్లా నివేదిక సైతం సమర్పించాలన్నారు. తొలి సర్వే ప్రశాంతంగా సాగినా, నవంబర్ 24 నాటి రెండో సర్వే భారీ హింసకు దారి తీసింది. సర్వేకు వచ్చినవారిలో కొందరు జై శ్రీరామ్ నినాదాలు చేశారనీ, దాంతో నిరసనకారులు రాళ్ళురువ్వారనీ వార్త. కాల్పుల్లో అయిదుగురు మరణించారు. అమాయకుల ప్రాణాలు, పట్నంలో సామరస్య వాతావరణం గాలికెగిరి పోయాయి.శతాబ్దాల తరబడి అన్ని వర్గాలూ కలసిమెలసి జీవిస్తున్న చోట విద్వేషాగ్ని రగులుకుంది. ఎన్నో ఏళ్ళుగా ఉన్న అయోధ్య, వారణాసి వివాదాలకు భిన్నంగా సంభల్ కథ చిత్రంగా ఈ ఏడాదే తెర మీదకొచ్చింది. పశ్చిమ యూపీలో సంభల్ జిల్లా మూడు దశాబ్దాలుగా సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)కి కంచుకోట. 1980ల నుంచి అక్కడ అధికారం కోసం బర్ఖ్, మెహమూద్ కుటుంబాలు వేర్వేరు పార్టీల పక్షాన పరస్పరం తలపడుతూ వచ్చాయి. తర్వాత 1990ల నుంచి రెండు వర్గాలూ ఎస్పీతోనే అనుబంధం నెరపుతున్నాయి. అధికారంలో పైచేయి కోసం ఒకే పార్టీలోని ఈ రెండు వర్గాల మధ్య పోరాటమే తాజా హింసకు కారణమని బీజేపీ ప్రచారం చేస్తోంది. హిందూ – ముస్లిమ్‌ల తర్వాత, ఇక ముస్లిమ్‌లలోని ఉపకులాల మధ్య చీలికలు తీసుకురావడానికే కాషాయ ధ్వజులు ఈ ప్రచారం చేస్తున్నారని ఎస్పీ ఖండిస్తోంది. మొఘల్ శిల్పనిర్మాణ శైలికి ఈ మసీదు ప్రతీకైతే, ఈ సంభల్ ప్రాంతం విష్ణుమూర్తి పదో అవతారమైన కల్కి వచ్చే ప్రదేశమని హిందువుల నమ్మిక. భిన్న విశ్వాసాల మధ్య సొంత లాభం చూసుకొనే కొందరి రాజకీయంతో సమస్య వచ్చి పడింది. నిజానికి, 1947 ఆగస్ట్ 15కి ముందున్న ధార్మిక విశ్వాసాల ప్రకారమే అన్ని ప్రార్థనా ప్రదేశాలూ కొనసాగాలి. ఒక్క అయోధ్య రామజన్మభూమి – బాబ్రీ మసీదు వివాదమే దానికి మినహాయింపని దీర్ఘకాలం క్రితమే కేంద్ర సర్కార్ చేసిన 1991 నాటి ప్రార్థనా స్థలాల చట్టం. అయోధ్య తరహాలో మరిన్ని సమస్యలు రాకూడదన్నది దాని ప్రధానోద్దేశం. ఏ ప్రార్థనా స్థలాన్నీ పాక్షికంగా కానీ, పూర్తిగా కానీ ఒక మతవిశ్వాసం నుంచి మరోదానికి మార్పిడి చేయరాదనీ, చర్చ పెట్టరాదనీ చట్టంలోని 3వ సెక్షన్ స్పష్టంగా నిషేధించింది. అయితే, ప్రార్థనా స్థలాల ప్రాచీన స్వరూపమేమిటో నిర్ధారించడం చట్టవిరుద్ధం కాదంటూ 2002 మేలో జస్టిస్ చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలు వివాదాలకు సందు ఇచ్చాయి. అనేకచోట్ల చిన్న కోర్టులు మందిర– మసీదు వివాదాలపై విచారణ చేపట్టి, పర్యవసానాలు ఆలోచించకుండా హడావిడిగా సర్వేలకు ఆదేశిస్తున్నాయి. సంభల్ ఘటన తర్వాతా అజ్మీర్‌లోని ప్రసిద్ధ షరీఫ్ దర్గాను గుడిగా ప్రకటించాలంటూ దాఖలైన కేసును రాజస్థాన్ కోర్ట్ అనుమతించడం ఓ మచ్చుతునక. సమస్యల్ని తేల్చాల్సిన గౌరవ కోర్టులే ఇలా తేనెతుట్టెల్ని కదిలించడం విషాదం.ప్రార్థనాస్థలాల చట్టాన్ని సవాలు చేస్తూ సుప్రీమ్‌లో ఇప్పటికే నాలుగు పిటిషన్లున్నాయి. దానిపై నిర్ణయానికి కేంద్రం, కోర్ట్ తాత్సారం చేస్తుంటే ఆ లోగా వారణాసి, మథుర, ధార్, సంభల్, తాజాగా అజ్మీర్... ఇలా అనేక చోట్ల అత్యుత్సాహం వ్యక్తమవుతోంది. ఇది శాంతి, సామరస్యాలకు పెను ప్రమాదం. ఈ ప్రయత్నాలను ఆపేందుకు సర్కారు కానీ, సర్వేలపై జోక్యానికి సుప్రీమ్ కానీ ముందుకు రాకపోవడం విడ్డూరం. ఒక వివాదాస్పద స్థలపు ధార్మిక స్వభావ అన్వేషణ చారిత్రక నిర్ధారణ, పురాతత్వ అన్వేషణతో ఆగుతుందనుకుంటే పొరపాటు. అది మత పరంగా, రాజకీయంగా రావణకాష్ఠమవుతుంది. కాశీ, మథురల్లో, ఇప్పుడు సంభల్ జరుగుతున్నది అదే. ‘ప్రతి మసీ దులో శివలింగాన్ని అన్వేషించాల్సిన పని లేద’ంటూ ఆరెస్సెస్ అధినేత రెండేళ్ళ క్రితం అన్నారు కానీ జరుగుతున్నది వేరు. అధికార వర్గాల అండదండలతోనే ఈ విభజన చిచ్చు రగులుతోందన్నదీ చేదు నిజం. 2019 నవంబర్‌లో ప్రార్థనా స్థలాల చట్టాన్ని సమర్థించిన సుప్రీమ్ మరోసారి గట్టిగా ఆ పని చేయకుంటే కష్టమే. ఓ హిందీ కవి అన్నట్టు, మసీదులు పోనివ్వండి... మందిరాలు పోనివ్వండి... కానీ రక్తపాతం మాత్రం ఆపేయండి. మతాలకు అతీతంగా మనిషినీ, మానవత్వాన్నీ బతకనివ్వండి! -
రాజ్యాంగాన్ని మోసగించడమే
న్యూఢిల్లీ: కేవలం రిజర్వేషన్ ఫలాలు దోచేయాలనే దుర్భుద్దితో మతం మారిన విషయాన్ని దాచిపెట్టిన అంశాన్ని సర్వోన్నత న్యాయస్థానం తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాంటి చర్యలు రాజ్యాంగాన్ని మోసగించడంతో సమానమని అభివర్ణించింది. క్రైస్తవమతంలోకి మారిన తర్వాత కూడా ఒక మహిళ షెడ్యూల్ కులం సర్టిఫికేట్ కోసం తాను ఇంకా హిందువునేనని వాదించడాన్ని సుప్రీంకోర్టు తప్పుబట్టింది. ఈ అంశంలో మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ జస్టిస్ పంకజ్ మిట్టల్, జస్టిస్ ఆర్ మహదేవన్‌ల సుప్రీంకోర్టు ధర్మాసనం బుధవారం తీర్పు చెప్పింది. హిందువు అయిన సి.సెల్వరాణి క్రైస్తవమతం పుచ్చుకుంది. అయితే రిజర్వేషన్ లబ్ది పొందేందుకు, ఉద్యోగి సంబంధిత ప్రయోజనాలు పొందేందుకు తాను ఇంకా హిందువునేనని నమ్మించే ప్రయత్నంచేశారు. అయితే ఆమె నిజంగా క్రైస్తవ మతంలోకి మారిందని, తరచూ చర్చికి వెళ్తూ, క్రైస్తవ మత కార్యక్రమాల్లో పాల్గొంటూ, పూర్తి విశ్వాసంతో క్రైస్తవమతాన్ని ఆచరిస్తోందని సాక్ష్యాధారాలతో నిరూపితమైంది. దీంతో రిజర్వేషన్ కోసం ఆ మహిళ తన మతాన్ని దాచిపెట్టడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తంచేసింది. ‘‘బాప్టిజం పూర్తయ్యాక ఇంకా తాను హిందువును అని మహిళ చెప్పుకోవడంలో అర్థంలేదు. మతం మారాక కూడా రిజర్వేషన్ ప్రయోజనాలే పరమావధిగా ఇలా వ్యవహరించడం రిజర్వేషన్ లక్ష్యాలకే విఘాతం. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అమలుచేస్తున్న రిజర్వేషన్ల విధానం ఇలాంటి వారితో ప్రమాదంలో పడుతుంది’’అని కోర్టు వ్యాఖ్యానించింది. సెల్వరాణి తండ్రి హిందువుకాగా తల్లి క్రైస్తవురాలు. అయితే సెల్వరాణి చిన్నతనంలోనే బాప్టిజం తర్వాత క్రైస్తవురాలిగా మారారు. అయితే 2015లో పుదుచ్చెరిలో అప్పర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగం పొందేందుకు ఆమె ఎస్సీ సర్టిఫికేట్ సంపాదించారు. సెల్వరాణి తండ్రి వల్లువాన్ కులానికి చెందిన వ్యక్తి. స్థానికంగా ఈ కులం వారికి ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తారు. కానీ సెల్వరాణి తండ్రి సైతం దశాబ్దాలక్రితమే క్రైస్తవమతం స్వీకరించారు. దీంతో తల్లిదండ్రులు క్రైస్తవులుకాగా తాను మాత్రం హిందువును అని ఈమె చేసిన వాదనల్లో నిజం లేదని కోర్టు అభిప్రాయపడింది. -
దారుణ విద్వేష క్రీడ!
అయిదు నెలలుగా బంగ్లాదేశ్‌లో అల్పసంఖ్యాకులపై అల్లర్లు సాగుతూనే ఉన్నాయి. హిందూ సాధువు చిన్మయ్ కృష్ణదాస్ అరెస్ట్ ఆ దేశంలో మైనారిటీలు ఎదుర్కొంటున్న పెను సవాళ్ళకు తాజా ఉదాహరణ. మైనారిటీల హక్కుల కోసం బలంగా గళం విప్పే దాస్ బంగ్లాదేశీ జాతీయ పతాకాన్ని అవమానించారంటూ రాజద్రోహ నేరం మోపడం విడ్డూరం. ఆయనను మంగళవారం అరెస్ట్ చేసి, బెయిలివ్వకుండా, పది రోజుల కస్టడీకి పంపడంతో నిరసనలు చెలరేగాయి. సందట్లో సడేమియాగా దుష్టశక్తులు అల్లర్లు రేపి, పొరపాటున ఓ ముస్లిమ్ లాయర్ మరణానికి కారణమై, ఆ పాపం మైనా రిటీల నెత్తిన వేయడంతో ఢాకా మరోసారి భగ్గుమంది. ఆలయాలపై దాడులు, ప్రాణనష్టంతో... మైనారిటీలనూ, భావప్రకటనాస్వేచ్ఛనూ కాపాడాలంటూ బంగ్లాను భారత్ అభ్యర్థించాల్సొచ్చింది.ఇస్లామ్ అధికారిక మతమైనా, లౌకికవాద, ప్రజాస్వామ్య దేశంగా, సమానత్వానికి రాజ్యాంగ బద్ధులమని చెప్పుకొనే బంగ్లా ఆ మాటకు తగ్గట్టు వ్యవహరించడం మానేసి, చాలాకాలమైంది.అందుకు తగ్గట్టే తాజాగా ‘ఇస్కాన్’ను ర్యాడికల్, మత ఛాందసవాద సంస్థ అని బంగ్లా అటార్నీ జనరల్ బుధవారం అభివర్ణించడం ఆందోళనకరం. ‘ఇస్కాన్’ను నిషేధించాలని బంగ్లా యోచిస్తు న్నట్టు వార్త. ఆధ్యాత్మిక చైతన్యం, పీడిత జన సముద్ధరణ కోసం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 150 దేశాల్లో పనిచేస్తున్న ఒక సంస్థపై అలాంటి నిర్ణయం తీసుకోవాలనుకోవడం అక్షరాలా బుద్ధిహీనతే. దేశంలోని విభిన్న వర్గాల మధ్య సౌహార్దం పెంపొందించి, బాధితులకు న్యాయం చేసి, మానవ హక్కుల్ని కాపాడాల్సిన ప్రభుత్వం ఏ శక్తుల ప్రోద్బలంతో ఇలా మాట్లాడుతోందన్నది ఆశ్చర్యకరం. జూలై నాటి ప్రజా ఉద్యమంతో ఢాకాలో ప్రభుత్వ మార్పు జరిగిపోయింది కానీ, అల్పసంఖ్యాక వర్గాలపై సాగుతున్న దాడులు మాత్రం అప్పటి నుంచి ఆగడం లేదు. మైనారిటీలను పూర్తిగా తరిమేసి, బంగ్లాను హిందూ రహిత దేశంగా మార్చాలనే పన్నాగం దీనికి వెనక ఉందని స్థానిక స్వతంత్ర విశ్లేషకుల మాట. ఈ అల్లర్లు, అల్పసంఖ్యాక హిందువులపై దాడుల వెనుక మత ఛాందస జమాతే ఇస్లామీ ఉందనేది స్పష్టం. హసీనా సర్కారు కాలంలో నిషేధానికి గురైన ఈ ర్యాడికల్ గ్రూపు, అలాగే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (బీఎన్పీ)లు యూనస్ యంత్రాంగంలో భాగమే. అసలు ఈ ప్రయత్నమంతా ఇస్లామిక్ షరియత్‌ను ప్రవేశపెట్టి, బంగ్లాదేశ్‌ను ప్రజాస్వామ్య ఎన్నికలు, పార్ల మెంట్‌తో పని లేని దేశంగా మార్చాలనే వ్యూహంలో భాగమని ఒక వాదన వినిపిస్తోంది. అదే గనక నిజమైతే, అత్యంత ప్రమాదకర పరిణామం. పౌరసమాజం, రాజకీయ నేతలు, ప్రజలు కలసి కట్టుగా అలాంటి వ్యూహాలను భగ్నం చేసి, కష్టించి సంపాదించిన స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాలి. అసలు అఫ్ఘన్ లాగానే బంగ్లాను తమ ప్రయోగశాలగా చేసుకోవాలని పాశ్చాత్య ప్రపంచం భావిస్తున్నట్టుంది. అప్పుడిక బంగ్లా మరో తీవ్రవాద కేంద్రంగా మారే ప్రమాదముంది. అది భారత్‌కే కాదు... యావత్ ప్రపంచానికి నష్టం. నిజానికి, ఆసియా – పసిఫిక్ కూటమిలో బంగ్లాను భాగం చేసుకొని, లబ్ధి పొందాలని అమెరికా భావించింది. నిరుటి హసీనా సర్కార్ నో చెప్పడంతో అది కుదరలేదు. మొన్నటి అమెరికా ఎన్నికల్లో కమలా హ్యారిస్ గెలిచి ఉంటే ఏమో కానీ, ట్రంప్ గెలవడంతో బంగ్లా మధ్యంతర సర్కార్ సారథి – ట్రంప్ ద్వేషి ప్రొఫెసర్ మహమ్మద్ యూనస్ గొంతులో పచ్చి వెలక్కాయ పడింది. ట్రంప్ పగ్గాలు చేపట్టాక బంగ్లాపై కఠినవైఖరి అవలంబిస్తారని యూనస్‌కు తెలుసు. అందుకే, ఆలోగా మైనారిటీలపై అల్లర్లను ఆఖరి అస్త్రంగా చేసుకున్నారట. బంగ్లా ప్రజల ఆశలు, ఆకాంక్షలను గుర్తించి, స్వతంత్ర బంగ్లాదేశ్ అవతరణకు అయిదు దశాబ్దాల పైచిలుకు క్రితం భారత్ అండగా నిలిచింది. కానీ, ఇప్పుడు అదే గడ్డపై భారత వ్యతిరేకత, మైనారిటీలపై ద్వేషాలను స్వార్థపరులు పెంచిపోషించడం విషాదం. దాదాపు 14 ఏళ్ళ పైగా షేక్ హసీనా ఏలుబడిలో నియంత పోకడల వల్ల మానవ హక్కుల ఉల్లంఘన, అణచివేత సాగిందని ఆరోపణలొస్తే, కొత్త హయాం కూడా తక్కువేమీ తినలేదు. విజృంభిస్తున్న విద్వేషం, విధ్వంసం ఢాకాలో పత్రికా స్వాతంత్య్రానికి సైతం ముప్పుగా మారాయి. ‘ప్రథమ్ ఆలో’, ‘ది డైలీ స్టార్’లాంటి స్వతంత్ర పత్రికా రచనకు పేరుపడ్డ పత్రికలపై దాడులు అందుకు ఓ మచ్చుతునక. బాధితు లకు సత్వర న్యాయం కోసం ప్రత్యేక ట్రిబ్యునళ్ళ ఏర్పాటు సహా మైనారిటీల కనీసపాటి ఆకాంక్షల్ని నెరవేర్చడానికి బంగ్లా సర్కార్‌కు ఉన్న కష్టమేమిటి? హసీనా సర్కార్‌ను గద్దె దింపినప్పటి నుంచి ఇప్పటికి బంగ్లాలో మైనారిటీలపై 2 వేలకు పైగా దాడులు జరిగాయి. హిందూ, బౌద్ధ, క్రైస్తవ సోదరులపై జరుగుతున్న ఈ దౌర్జన్యకాండను మతపరంగా కాక మానవ హక్కుల పరంగా చూడాలి. అప్పుడే సమస్య తీవ్రత అర్థమవుతుంది. 1930లో బంగ్లాలో 30 శాతం పైగా ఉన్న హిందువులు ఇప్పుడు కేవలం 8 శాతం చిల్లరకు పడిపోయారన్న నిష్ఠుర సత్యం అక్కడ జరుగుతున్నదేమిటో ఎరుకపరుస్తుంది. విద్యుత్ సహా, బియ్యం, పత్తి, చమురు లాంటి అనేక సరుకుల విషయంలోనూ మనపై భారీగా ఆధారపడ్డ బంగ్లా సర్కార్‌పై ఇకనైనా భారత్ కఠినవైఖరిని అవలంబించాలి. పొరుగు దేశంలో బతుకు భయంలో ఉన్న హిందువులను కాపాడేందుకు క్రియాశీలంగా వ్యవహరించాలి. కేవలం మాటలకు పరిమితం కాకుండా, దౌత్య, వాణిజ్య రంగాల్లో చేయగలిగినదంతా చేయాలి. పేరుకు మాత్రం లౌకికవాదం ముసుగు వేసుకొని, మైనారిటీలకు వ్యతిరేకంగా, తెర వెనుక శక్తుల చేతుల్లో కీలుబొమ్మగా మిగిలిన అసమర్థ యూనస్ సర్కార్‌పై అంతర్జాతీయంగానూ ఒత్తిడి తేవాలి. అప్పుడే ఫలితం ఉంటుంది. -
ఆలయంపై దాడి ఘటన.. కెనడాలో అమల్లోకి కొత్త చట్టాలు
ఒట్టావా: హిందూ భక్తులపై సిక్కు వేర్పాటు వాదుల దాడి ఘటనలో కెనడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాడులు పునరావృతం కాకుండా కొత్త చట్టాల్ని అమల్లోకి తెచ్చింది. బ్రాంప్టన్‌లో ప్రార్థనా స్థలాల 100 మీటర్ల పరిసర ప్రాంతాల్లో నిరసనలు, ఆందోళనలపై నిషేదం విధిస్తూ స్థానిక (బైలా) చట్టాన్ని అమలు చేసినట్లు బ్రాంప్టన్ మేయర్ పాట్రిక్ బ్రౌన్ ప్రకటించారు. ఈ చట్టంపై సిటీ కౌన్సిల్ ఆమోదం తెలిపిందని చెప్పారు. చట్టాన్ని అతిక్రమించిన వారిపై భారీ మొత్తంలో జరిమానా విధిస్తామని హెచ్చరించారు.ఈ నెల ప్రారంభంలో బ్రాంప్టన్‌లోని హిందూ సభ దేవాలయ ప్రాంగణంలో సిక్కు వేర్పాటువాదులు ఖలిస్థానీ జెండాలతో రెచ్చిపోయారు. దేవాలయానికి వస్తున్న హిందూ భక్తులపై కర్రలతో దాడి చేశారు. పిడిగుద్దులు కురిపిస్తున్న వీడియోలో వైరల్‌గా మారాయి.ఈ ఘటనపై భారత ప్రధాని మోదీ ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తులపై దాడి ఘటనలో కెనడా ప్రభుత్వం న్యాయం చేస్తుందని ఎక్స్ వేదికగా ఆశాభావం వ్యక్తం చేశారు. కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సైతం ఈ దాడిని ఖండించారు. ప్రతి ఒక్క కెనడియన్ తమ మత విశ్వాసాలను స్వేచ్ఛగా, సురక్షితంగా అనుసరించే హక్కు ఉందని అన్నారు. -
‘హిందువులు ఎక్కడున్నా ఐక్యంగా మెలగాలి’
నాగ్‌పూర్: దేశవ్యాప్తంగా విజయదశమి వేడుకలు జరుగుతున్నాయి. దసరా సందర్భంగా మహారాష్ట్రలోని నాగ్పూర్లోగల రేషమ్‌బాగ్‌లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ ఆయుధ పూజలు చేశారు. అనంతరం సంఘ్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు.సంఘ్ త్వరలోనే 100వ ఏడాదిలోకి అడుగుపెడుతున్నట్లు మోహన్ భగవత్ తెలిపారు. భారతదేశం అన్ని రంగాల్లోనూ పురోగమిస్తున్నదని, మన దేశ విశ్వసనీయత, ప్రతిష్ట మరింతగా పెరిగిందన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని మోహన్ భగవత్ పేర్కొన్నారు. యువత మార్గనిర్దేశకత్వంలో భారత్ అన్ని రంగాల్లో ముందుకు సాగుతున్నదన్నారు.బంగ్లాదేశ్‌లో హిందూ సమాజంపై హింసాకాండ జరుగుతున్నదని, అయితే హిందువులు ఐక్యంగా ఉన్నప్పుడు ఇలాంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేయవచ్చన్నారు. బంగ్లాదేశ్‌లోని హిందువులు తమను తాము రక్షించుకునేందుకు వీధుల్లోకి వచ్చారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు వారికి సహాయం అందించాలని అన్నారు. అఘాయిత్యాలకు పాల్పడే స్వభావం ఉన్నంత కాలం.. హిందువులే కాదు మైనార్టీలందరూ ప్రమాదంలో పడతారని మోహన్ భగవత్ వ్యాఖ్యానించారు. #WATCH | Nagpur, Maharashtra | #VijayaDashami | RSS chief Mohan Bhagwat says, "What happened in our neighbouring Bangladesh? It might have some immediate reasons but those who are concerned will discuss it. But, due to that chaos, the tradition of committing atrocities against… pic.twitter.com/KXfmbTFZ5D— ANI (@ANI) October 12, 2024ఇది కూడా చదవండి: భక్తిభావంతో మెలగాలి -
పార్సీ అయిన టాటాకు హిందూ పద్ధతిలో అంత్యక్రియలు?
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారు. ఆయన అంత్యక్రియలు గురువారం సాయంత్రం 4 గంటలకు ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. దీనికి ముందు ముంబైలోని నారిమన్ మైదానంలో గల ఎన్సీపీఏలాన్లో ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం ఉంచారు.రతన్ టాటా పార్సీ సమాజానికి చెందిన వ్యక్తి అయినప్పటికీ అతని అంత్యక్రియలు హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహించనున్నారు. సాయంత్రం 4 గంటలకు ముంబైలోని వర్లీలోగల విద్యుత్ శ్మశానవాటికలో ఆయన భౌతికకాయాన్ని ఉంచనున్నారు. ఇక్కడ దాదాపు 45 నిమిషాల పాటు ప్రార్థనలు జరుగుతాయి. అనంతరం అంత్యక్రియల ప్రక్రియ పూర్తవుతుంది. ఈ నేపధ్యంలో పార్సీ కమ్యూనిటీలో అంత్యక్రియల పద్ధతి ఎలా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది.There’s a Hindu pujari, Christian priest, Muslim Imam and a Sikh sant standing behind. Sanghis may not like this, but this is truly secular …..!!Rest in peace Sir Ratan Tata ….. 🙏 pic.twitter.com/DjiYNOPR7C— Mayank Saxena (@mayank_sxn) October 10, 2024 పార్సీ కమ్యూనిటీలో అంత్యక్రియల నియమాలు చాలా భిన్నంగా ఉంటాయి. వీరిలో అంత్యక్రియల సంప్రదాయం మూడు వేల సంవత్సరాల నాటిది. పార్సీలు అనుసరించే జొరాస్ట్రియనిజంలో మనిషి మృతి చెందాక ఆ మృతదేహాన్ని రాబందులు తినేందుకు అనువుగా బహిరంగ ప్రదేశంలో ఉంచుతారు. దీనిని టవర్ ఆఫ్ సైలెన్స్ లేదా దఖ్మా అని పిలుస్తారు. అయితే రతన్ టాటా అంత్యక్రియలు హిందూ సంప్రదాయం ప్రకారం జరగనున్నాయి. గతంలో అంటే 2022 సెప్టెంబర్‌లో టాటా సన్స్ మాజీ ఛైర్మన్ సైరస్ మిస్త్రీ అంత్యక్రియలు కూడా హిందూ ఆచారాల ప్రకారం జరిగాయి. కరోనా మహమ్మారి సమయంలో మృతదేహాలను దహనం చేసే పద్ధతుల్లో మార్పులు వచ్చాయి. ఆ సమయంలో పార్సీ సమాజంవారు అనుసరించే అంత్యక్రియల ఆచారాలను వివిధ ప్రభుత్వాలు నిషేధించాయి. ఇది కూడా చదవండి: టాటా గ్రూప్ వ్యాపార వివరాలు తెలిపే వీడియో -
చేగువేరా టు సనాతని హిందూ!
‘‘సముద్రం ఒకడి కాళ్ళ ముందు కూర్చొని మొరగదు/ తుఫాన్ గొంతు ‘చిత్తం’ అనడం ఎరగదు/ పర్వతం ఎవ్వరికీ వంగి సలాం చెయ్యదు.’ పదేళ్ళ కిందట జనసేన పార్టీ విశాఖ సభలో పవన్ కల్యాణ్ తనని తాను వేలితో చూపించుకుంటూ సము ద్రంగా, తుఫాన్‌గా, పర్వతంగా అభివర్ణించుకుంటూ చెప్పిన మాటలివి. ‘చుట్టూ గాఢాంధకారం, ఇల్లేమో దూరం, చేతిలో దీపం లేదు’ వంటి స్థితిలో ప్రజలున్నారని, వారి ఆశలు నిలబెట్టి, వారి జీవితాల్లో వెలుగు పంచి అపర చేగువేరాగా అవతరించాలన్న పవన్ ఉద్దేశాలు జగమెరిగిన వారికి అమాయకంగా కనిపించినా ఎంతోమంది యువత అతన్ని నమ్మారు. పవన్ ఒంటిమీద పిచ్చుక వాలినా జనసేన కార్యకర్తలు బ్రహ్మాస్త్రాలు సంధించారు. సినీహీరోగా తనకున్న ఇమేజ్‌ని గుడ్ విల్‌గా పెడితే చాలదని, అంతకి మించి ఏదో చేయాలన్న తపనని వ్యక్తం చేయడానికి ఆయన పలుమార్లు ప్రగతిశీల సాహిత్యాన్ని తన ప్రచారానికి వాడుకున్నారు. ఏ ప్రాంతానికి ప్రచారానికి వెళితే అక్కడి స్థానిక రచయితలను గుర్తించి వారి రచనల్లోని ప్రజా సమస్యలను ప్రస్తావించేవారు. గుంటూరు శేషేంద్ర శర్మ, శ్రీశ్రీ కవితలు తరుచుగా చదివేవారు. ఆయా సాహిత్య అంశాలలోని అభ్యుదయం, ప్రజాపక్షపాతం, నిర్భీతి వంటివి పవన్ వ్యక్తిత్వ సుగుణాలని జనం నమ్మేలా బట్వాడా అయ్యాయి కూడా. తద్వారా మిగతా రాజకీయ నాయకులకి భిన్నమైన ఇమేజ్‌ని సొంతం చేసుకున్నారు. విప్లవకారులుగా చలామణీ అవ్వడానికి మొహం చెల్లని రాజకీయాల్లో అట్టడుగు ప్రజల కష్టాలు తీర్చగల రాబిన్ హుడ్‌నని ఆయన నమ్మే ఉండాలి. లేకపోతే అంత సులువుగా ‘జై భీమ్’ అని, అంతే సులువుగా ‘గో మాంసం, బీఫ్ తినడం తప్పయితే, అవి తినే ముందుకు వెళ్తాన’ని ఎలా అనగలరు! ఇఫ్తార్‌లో కూర్చుని గడ్డం పెంచుకుని, టోపీ పెట్టుకుని మీలో ఒకడిని అనడం, గోధ్రా, గుజరాత్ అల్లర్ల గురించి ప్రశ్నించడం, తన నాయనమ్మ దీపారాధన చేస్తే దాంతో వాళ్ళ నాన్న సిగరెట్ ముట్టించుకుని, దేవుడూ దయ్యమూ లేవు’ అనేవాడని గుర్తు చేసుకోవడం, మతపరమైన గొడవలు పెడుతున్నది ముఖ్యంగా హిందూ నాయకులని గట్టిగా చెప్పడం ద్వారా పవన్ కొన్నివర్గాల నుంచి మైలేజ్ పొందారు. ఇక ఇపుడు తరం మారకుండానే స్వరం మార్చారు పవన్ కల్యాణ్. అధికారంలోకి రాగానే వేషభాషలు మారాయి. ఇపుడు తనని తాను ‘సనాతని హిందు’గా ప్రకటించుకున్నారు. సనాతన ధర్మాన్ని కాపాడతానని, సనాతన ధర్మ బోర్డు ఏర్పాటు చేస్తానని అంటూ అన్ని మతాలకీ ఒకటే న్యాయం అని ద్వంద్వానికి గురయ్యారు. అంబేడ్కర్‌ని బాగా చదివి ఆయన భావజాలాన్ని అవగాహనలోకి తెచ్చుకున్నానని పవన్ కొన్నిసార్లు అన్నారు. అన్ని కులాలకి ఒకటే న్యాయం అని అంబే డ్కర్, ఇతర రాజ్యాంగ రూపకర్తలు అనుకోలేదు కనుక అణచివేతకి గురయ్యి శతాబ్దాలుగా ఎదుగుదల లేని కులాలకి రిజర్వేషన్లు ఇచ్చారు. అన్ని కులాలూ ఒకటి కానట్లే అన్ని మతాలు కూడా ఒకటి కావు. ఎక్కడైనా మెజారిటీ మతాలు, మైనారిటీల హక్కులకి భంగం కలిగించే సందర్భాలు ఉంటాయి కనుక సెక్యులరిస్టులు మైనారిటీ మతాల హక్కులకి అండగా నిలబడతారు. దానర్థం పవన్ విరుచుకు పడినట్లు వారు ఆ యా మతాలకి భయపడతారని, వలపక్షం చూపుతారని కాదు. తిరుపతి సభలో వారాహి డిక్లరేషన్ ఇచ్చారు. దాని సారాంశం ఏమిటో ప్రజలమైన మాకు సరిగ్గా అర్థం కావడం లేదు. డిప్యూటీ సీఎంగా లడ్డు నాణ్యత మీద రోజుల తరబడి పోరాడటం ముఖ్యమా లేక కనీస అవసరాలు తీరని పేద ప్రజకోసం ఏవైనా చేయడం ముఖ్యమా అని అడగము, మెల్లిగా తెలుగుదేశాన్ని పక్కకి జరిపి జనసేన, బీజేపీతో ఎటువంటి రాజకీయం చేయబోతోంది అని కూడా అడగము, సరేనా! కానీ జస్ట్ ఆస్కింగ్! సనాతన ధర్మం అంటే ఏమిటి? బోర్డులు గట్రా ఏర్పాటు చేసి, జాతీయ స్థాయిలో మీరు చేయబోతున్న పోరాటపు ఆనుపానులు మాకు కాస్త ముందుగానే చెప్పగలరా? వర్ణవ్యవస్థ ఇందులో భాగమా, మనుధర్మ శాస్త్రం ఏమైనా పరిపాలనకి దిక్సూచి కానుందా? స్త్రీలను ఇంట్లో కూచోమంటారా, శూద్రులు సేవకులుగా, శ్రామిక కులాలను అంట రానివారిగా నిశ్చయం చేయబోతున్నారా? ‘మతి ఎంతో గతి అంతే’ అన్నది మీకు ఇష్టమైన కొటేషన్. ఇపుడు సనాతన హిందూగా మీ ‘మతి’ ఆంధ్రప్రదేశ్ ప్రజలమైన మా ‘గతి’ని ఎలా మార్చబోతోందో తెలుసుకోవాలని జస్ట్ ఆస్కింగ్. పవన్ కల్యాణ్ గారూ! ప్రసాదాలు, ప్రమాణాలు సంబంధిత శాఖలకి వదిలిపెట్టి పదేళ్ళ పైబడిన మీ రాజకీయ ప్రయాణాన్ని సమీక్ష చేసుకోండి. మారిన వేషభాషలకి, మీరేంటో గర్జించి ఇచ్చిన ప్రకటనకి మీరే జవాబుదారీ. నచ్చిన మతాన్ని ప్రచారం చేసుకోవడానికి మీరు సాధారణ పౌరుడు కాదు, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి. మీరు సెక్యులరిస్ట్‌గా వినపడటమే కాదు కనపడటం కూడా ప్రజాస్వామిక అవసరం. ఇప్పటికీ మిమ్మల్ని నమ్ముతున్న లక్షలాది యువత కోసం నిజాయితీ మాత్రమే మీ ప్రమాణం అయితే మంచిది. మీరు ధైర్యం విసిరిన రాకెట్టో, చేగువేరా బుల్లెట్టో సనాతని హిందూనో, బీజేపీ ప్రేరిత కాబోయే ముఖ్య మంత్రో, మరొకటో ఇంకొకటో– నాలుగు రోజులైనా కాస్త ఒకచోట ఆగండి. మీరేంటో అర్థంకాక ప్రజలు అయోమయంలో ఉన్నారు. కె.ఎన్. మల్లీశ్వరి వ్యాసకర్త ‘ప్రరవే’ ఏపీ కార్యదర్శి -
సనాతనానికి చీడ పురుగులు
‘‘గుణం లేనివాడు కులం గొడుగు పడతాడు/ మానవత్వం లేనివాడు మతం ముసుగు వేస్తాడు / జనులంతా ఒక కుటుంబం – జగమంతా ఒక నిలయం’’– జాషువాఈ మాటలు ఎంత సందర్భోచితంగా ఉన్నాయో, ఆంధ్ర రాష్ట్ర రాజకీయ రంగాన్ని చూస్తే అర్థమవుతుంది. నిజమైన మతవాదులైతే వారితో ఇబ్బంది లేదు. అది వారి ప్రగాఢ నమ్మకంగా భావించవచ్చు. కానీ కుహనా మతవాదులు వేషాలు వేసుకుని, అవకాశవాద రాజకీయాల కోసం మతాన్ని, కులాన్ని వాడుకోవటం వల్లనే అసలు ఇబ్బంది వస్తున్నది.వారం రోజులుగా ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సనాతన మతవాదుల అవతారం ఎత్తారు. హిందూ మతానికి వీళ్లే అసలైన వారసులన్నట్లుగా ఉపన్యాసాలిస్తున్నారు. ఇక పచ్చ మీడియా రచ్చ సరేసరి.‘అసలే అనలుడు. అతనికి సైదోడు అనిలుడు’ అని ఒక మహాకవి చెప్పినట్లు, చంద్రబాబు అబద్ధా లకు తింగరి పవన్ కల్యాణ్ దొరికాడు. ఇద్దరూ ఒకరికొకరు తీసిపోకుండా చెప్పిన డైలాగ్‌నే చెబుతూ, మెట్లను కడుగుతూ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు.అసలు ఇప్పుడు అర్జంట్‌గా హిందూమతాన్ని ఈ గురుశిష్యులు అంతగా తలకెత్తుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని సామాన్యుడి ప్రశ్న.అందులో ఒకరికి దేవుడన్నా, మతమన్నా ఏ సెంటి మెంట్లూ లేవు. బూట్లతో పూజలు చేస్తాడు, దేవాలయాలు పడగొడతాడు, ఆలయాల్లో క్షుద్ర పూజలు భార్య చేస్తే ఊరుకుంటాడు. ఇక రెండవ వారు చెప్పులు ధరించే స్వామి దీక్షలు నిర్వహి స్తాడు. తలక్రిందులుగా తపస్సు చేసినా వీళ్ళను నమ్మే జనాలున్నారా?అసలెందుకు హఠాత్తుగా ఈ రచ్చ లేవ దీశారు? ఢిల్లీ పెద్దలేమయినా హరియాణా, మహా రాష్ట్ర ఎన్నికల కోసం వీళ్ళిద్దరినీ సెంటిమెంట్ రోల్స్ చెయ్యమన్నారా? లేక ఇచ్చిన హామీలు నెరవేర్చలేక, విజయవాడ వరద బాధితులకు సమాధానం చెప్పలేక, ప్రజల వద్దకు 100 రోజుల మంచి పాలన అంటూ పోవాలనుకున్నా జనా లెక్కడ తిరగబడి ‘సూపర్ సిక్స్’లు అడుగుతారో అనే భయం చేతనా? ప్రజలు ఆలోచించే లోపలే పచ్చ మీడియా మూకుమ్మడిగా జనాలకు అర్థంకాని భాషలో వ్యాఖ్యానాలు చేయిస్తూ చివరకు హిందూ ధర్మం జగన్ గారి వల్లనే నాశనమైందని తేలుస్తుంది.సెంటిమెంట్ బాగా పండాలంటే కలియుగ దైవం, ఆయన ప్రసాదం వీరికి అక్కరకొచ్చాయి. జగన్ గారి పాలనలో లడ్డూ ప్రసాదంలో జంతు వుల కొవ్వులు కలిశా యని చెప్పాలనుకున్నారు. కానీ వాటికి ఆధారాలు దొరక్క చివరకు వీళ్ళ ప్రభుత్వం మెడకు చుట్టు కోవటంతో దానిని ఎలా మలపాలో అర్థం కాక ‘యూటర్న్’ బాబు... 20 సార్లు తిరుమలకు వెళ్ళిన మాజీ ముఖ్యమంత్రిగారి డిక్లరేషన్ పేరుతో దానిని డైవర్ట్ చేయటానికి ప్రయత్నించారు. ‘నాతిని చెయ్యబోతే కోతిగా తయారయ్యిందన్న’ సామె తగా చివరకు సనాతన ధర్మానికే కళంకాన్ని తెచ్చే విధంగా ఈ దుర్మార్గపు ప్రభుత్వం స్వామివారి ప్రసాదాన్నే కళంకితంగా మార్చింది. ఈ చర్యలు క్షమార్హం కాదు. జగన్మోహన్ రెడ్డి తిరుపతి వెళ్తారని ప్రకటించటంతో ఖంగుతిన్న చంద్రబాబు... పార్టీల మాటున గూండాలను తిరుపతికి తరలించారు. వారిలో కొంతమంది బహిరంగంగానే ‘జగన్ మోహన్‌రెడ్డి తిరుపతి వస్తే చంపేస్తాం’ అంటూ చెప్పారు. అంటే ఆయనను చంపాలనేదే కదా వీళ్ళ కుట్ర! వాళ్ళే నిందలేస్తారు. వాళ్ళే నిందిస్తారు.ఎంత నిస్సిగ్గుగా ఆయన మతాన్ని తెర మీదకు తెచ్చి డిక్లరేషన్ బోర్డు పెట్టారు! అందుకు జగన్మోహన్ రెడ్డిగారు ప్రెస్ మీట్లో చాలా చక్కటి సంస్కారవంతమైన సమా ధానం చెప్పారు. అసలైన హిందూ ధర్మతత్వం ఆయన మాటల్లో వినిపించింది. హిందూ ధర్మాన్ని సుప్రతిష్ఠం చేసిన ఉపనిషత్తులు ఏం చెప్పాయో మత ఛాందసులు కూడా తెలుసుకోవాలి.‘‘యస్మిన్ సర్వాణి భూతాని ఆత్మైవాభూద్వి జానతః / తత్ర కో మోహః కశ్శోకః ఏకత్వ మను పశ్యతః’’(ఈశావాస్యోపనిషత్తు)ఎవరయితే సమస్త జీవుల ఆత్మలను తన ఆత్మగా భావించి గౌరవిస్తాడో అతడు శోకమోహ ములను దాటి ఒకే ఆనంద స్థితిని అనుభవిస్తాడు. ఇది సనాతన ధర్మం చెప్పేమాట. అలాగే హిందు వులందరూ పరమ ప్రామాణికంగా భావించే భగ వద్గీతలో కూడా ఆ కృష్ణ పరమాత్మ –యే యథా మాం ప్రపద్యన్తే తాం స్తథైవ భజా మ్యహం! / మమ వర్త్మానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః‘‘ఏ రూపంలో ఆరాధిస్తారో ఆ రూపంలో నేనే ఉంటాను అన్నాడు. అంటే అన్ని మతాలను, దేవుళ్ళను గౌరవించాలనే కదా మన హిందూ ధర్మం చెబుతున్నది. మరి ఈ మతానికి ఈ చాదస్తపు రంగులు పూసి ఎందుకిలా ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు? ఇప్పటికయినా ఢిల్లీ బీజేపీ పెద్దలు తమ కూటమి ఆంధ్రలో చేస్తున్న కోతి చేష్టలను ఆపించ కపోతే అది తమకే నష్టం అని గమనించాలి. ప్రజల్ని అంత తక్కువగా అంచనా వెయ్యొద్దు.‘‘నీకు మతం కావాలా లేక అన్నం కావాలా?’ అని అడిగితే ముందు అన్నమే ఇవ్వమంటాను. ఆకలితో బాధపడేవాళ్ళ కడుపు నింపి తర్వాత బోధలు చెయ్యి’’ అంటారు స్వామి వివేకానంద.ఈరోజు ఆంధ్ర రాష్ట్ర పాలకులకు జగన్ మోహన్ రెడ్డి చెప్పేది అదే. ముందు పేదవాళ్ళను ఆదుకోండి, మీరిచ్చిన హామీలు నిలబెట్టుకోండి. మీ నీచ రాజకీయానికి పవిత్ర ప్రసాదాన్ని బలి చేయకండి.నందమూరి లక్ష్మీపార్వతి వ్యాసకర్త వైసీపీ నాయకురాలు -
దైవంతో జూదమా?
శ్రీ వేంకటేశ్వర స్వామిని కలియుగ ప్రత్యక్షదైవంగా హిందూ భక్తులు ఆరాధిస్తారు. వారి దృష్టిలో తిరుమల క్షేత్రం సాక్షాత్తూ కలియుగ వైకుంఠమే. ‘‘భావింప సకల సంపదరూప మదివో... పావనములకెల్ల పావనమయము’’ అంటూ ఆ శ్రీహరివాసాన్నిఅన్నమయ్య కాలం నుంచీ భజిస్తూనే ఉన్నారు. కోరిన కోర్కెలు తీర్చే దేవదేవునిగా కోట్లాదిమంది చేత నిత్య పూజలందుకునే వేంకటనాథుని ఆలయ ప్రసాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. తన పాలనా వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఆయన ప్రతి పక్షంపై బురదజల్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆలయ ప్రతిష్ఠను, ఔన్నత్యాన్ని ఆయన పణంగా పెట్టారు.కేవలం ప్రభుత్వ వైఫల్యం కారణంగా విజయవాడ వరదల పాలు కావడం, ‘సూపర్ సిక్స్’ పేరుతో చేసిన ఎన్నికల బాసలను ఒక్కటి కూడా అమలు చేయకపోవడం, కనీసం ఎప్పుడు చేస్తారనే షెడ్యూల్‌ను కూడా విడుదల చేయలేకపోవడం వంటి కారణాలు ఈ తాజా కుట్రకు నేపథ్యం. తమ కూటమి పరిపాలనకు వంద రోజులు పూర్తయిన సంద ర్భంగా ఏర్పాటు చేసుకున్న శాసనసభా పక్షాల ఉమ్మడి సమావేశంలో ఆ కుట్రను అమలు చేయడం ప్రారంభించారు. తిరుమల లడ్డూ తయారీకి ఉపయోగించే నెయ్యి జంతువుల కొవ్వుతో తయారైందని, ఇది వైసీపీ పాలనలో జరిగిందని చంద్రబాబు ఆరోపించారు.రాజకీయాల్లో ఇక ఇంతకంటే దిగజారుడు సాధ్యం కాదనుకున్న ప్రతిసారీ చంద్రబాబు షాక్ ఇస్తూనే ఉంటారు. ఏడుకొండలవాడి పవిత్ర ప్రసాదంపై అనుమాన పంకిలం చల్లడానికి ఆయన ఏడు పాతాళ లోకాలను దాటి కిందకు దిగజారారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వంద కోట్ల పైచిలుకు హిందువుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచారు.లడ్డూ ప్రసాదం తయారీకి, అందులో వినియోగించే సరుకుల కొనుగోలుకు ఒక పటిష్ఠమైన వ్యవస్థ తిరుమలలో గత కొన్ని దశాబ్దాలుగా అమలవుతున్నది. ప్రభుత్వంలో ఎవరు ఉన్నా ఈ వ్యవస్థలో మార్పు ఉండదు. తిరుమలలో గత వంద సంవత్సరాలుగా లడ్డూ ప్రసాదం అమల్లో ఉంది. మహంతుల అజమాయిషీలో నడిచే తిరుమల పాలనా వ్యవహారాలను తొంభయ్యేళ్ల కింద బ్రిటిష్ వాళ్లు స్వాధీనం చేసుకొని టీటీడీని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత క్రమంగా తిరుమలకు భక్తుల రద్దీ పెరుగుతూ వస్తున్నది. అందుకు అనుగుణంగానే లడ్డూ ప్రసాదానికీ డిమాండ్ పెరుగుతూ వచ్చింది. ఈ డిమాండ్‌ను అందుకోవడానికి లడ్డూల తయారీ సామర్థ్యాన్ని కూడా పెంచుతూ వస్తున్నారు.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి లడ్డూలు తయారుచేసే పోటు సామర్థ్యం రోజుకు 45 వేలు మాత్రమే. పోటు సామర్థ్యాన్ని రెండు మూడు రెట్లు పెంచుతూ ఆయన హయాంలో ఆధునిక వసతులను సమకూర్చారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా పోటును అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆగమ సలహా మండలి సంప్రదింపులతో విస్తరించారు. మూడున్నర లక్షల లడ్డూల తయారీ సామర్థ్యం ఇప్పు డున్నది. అవసరమైతే ఆరు లక్షల వరకు తయారు చేసుకోవ డానికి అవసరమైన సాంకేతిక ఏర్పాట్లు కూడా చేశారు.తయారీ సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా తిరుమల పవిత్రతను కాపాడటానికి లడ్డూ, అన్నప్రసాదాల నాణ్యతను పెంచడం కోసం ల్యాబ్ వ్యవస్థను పటిష్ఠం చేయడం కూడా వైఎస్ జగన్ హయాంలోనే జరిగింది. నవనీత సేవకోసం అవసరమైన స్వచ్ఛమైన వెన్నను తయారు చేయడానికి తిరుమలలోనే ఒక ప్రత్యేక గోశాల కూడా ఆయన హయాంలోనే ఏర్పాటయింది. ఏడుకొండలపై ఆధ్యాత్మిక శోభ వెల్లి విరియాలన్న సంకల్పంతో మఠాధిపతులతో కూడిన విద్వత్ సభ కూడా అప్పట్లో జరిగింది. చంద్రబాబు నాలుగుసార్లు ముఖ్యమంత్రయినప్పటికీ ఈ తరహా కార్యక్రమాలను అమలు చేసిన దాఖలాలు లేవు.ఇక చంద్రబాబు ఆరోపణలకు సంబంధించిన నెయ్యి కొనుగోలు వ్యవహారాన్ని ఒకసారి పరిశీలిద్దాం. ఈ వ్యవహారం కొన్ని దశాబ్దాలుగా ఒకే పద్ధతిలో జరుగుతున్నది. టీటీడీ బోర్డులో సభ్యులుగా ఉండేవారిలో కొందరితో కలిసి కొనుగోలుకు సంబంధించిన సబ్–కమిటీ ఉంటుంది. ఆరు నెలలకోసారి ఆన్లైన్లో టెండర్లు పిలిచి ఎల్–వన్‌గా నిలిచిన వారిని ఎంపిక చేస్తారు. టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్‌కు ఉన్న ప్లాంట్‌ను పరిశీలించి, అందులో పాటిస్తున్న నాణ్యతా ప్రమాణాలను ఈ సబ్‌కమిటీ బేరీజు వేసుకుంటుంది. అనంతరం కాంట్రాక్టుకు సంబంధించిన అభ్యంతరాలు గానీ, సూచనలు గానీ వుంటే సబ్‌కమిటీ బోర్డుకు నివేదిస్తుంది.టెండర్ ఖరారు చేయడానికీ లేదా రద్దు చేయడానికీ కూడా సబ్ కమిటీకి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం కేబినేట్లో ఉన్న కొలుసు పార్థసారథి, టీడీపీ శాసన సభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంతి, కేంద ప్రభుత్వానికి సన్నిహితుడైన వైద్యనాథన్ కృష్ణమూర్తి కూడా ఈ సబ్ కమిటీలో సభ్యులుగా ఉన్నారు.నెయ్యి సరఫరా దక్కించుకున్న కాంట్రాక్టర్ ప్రతి ట్యాంక ర్తో పాటు నాణ్యత ధ్రువీకరణ పత్రాన్ని కూడా వెంట తెచ్చు కోవాలి. ఎన్ఏబీఎల్ గుర్తించిన ల్యాబుల్లో ఈ ధ్రువీకరణ పత్రాన్ని తెచ్చుకోవచ్చు. ట్యాంకర్ తిరుపతికి చేరుకున్న అనంతరం అక్కడ వున్న మార్కెటింగ్ కార్యాలయంలో మూడు శాంపిళ్లను తీసి వేరువేరుగా పరిశీలిస్తారు. ఈ మూడు శాంపిళ్ల పరీక్షలోనూ నాణ్యత నిర్ధారణ అయితేనే ట్యాంకర్ తిరుమలకు చేరుకుంటుంది. లేకుంటే వచ్చిన దారిన వెనక్కు వెళ్తుంది. పరీక్షలో విఫలమై ట్యాంకర్లు వెనక్కు వెళ్లడం ఈ ఇరవై ఏళ్లలో వందలసార్లు జరిగినట్టు సమాచారం. అదేవిధంగా చంద్రబాబు ఆరోపించిన ఏఆర్ డెయిరీ వారి కంటెయినర్ కూడా వెనక్కు వెళ్లింది. అది కొండెక్కిందీ లేదు. ఆ నెయ్యిని లడ్డూ తయారీలో వాడిందీ లేదు. ఆ కల్తీ ప్రసాదాన్ని భక్తులు ఆరగించిందీ లేదు. తిరుమలలో ఉన్న పటిష్టమైన వ్యవస్థ కల్తీ సరుకులను ప్రసా దాల్లోకి అనుమతించదు.తిరస్కరించిన ఈ ట్యాంకర్‌లోని శాంపిల్‌ను తీసుకున్నది జూలై 12వ తేదీన! అప్పటికి రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఉన్నారు. ఆ శాంపిల్‌ను జూలై 17న గుజరాత్‌లోని నేషనల్ డెయిరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబ్‌కు పంపించారు. 23న ఆ ల్యాబ్ రిపోర్టు పంపించింది. టీటీడీ ఈవో శ్యామలరావు మీడియాతో మాట్లాడుతూ నాలుగు ట్యాంకర్ల నెయ్యిలో వెజిట బుల్ ఫ్యాట్స్ కలిశాయని నివేదిక ఆధారంగా చెప్పారు. విశ్వస నీయ సమాచారం మేరకు ఎన్డీడీబీతో పాటే మైసూర్‌లోని మరో కేంద్ర ప్రభుత్వ ల్యాబ్‌కు కూడా ఈ శాంపిల్స్ పంపించారట. వారి రిపోర్టు గురించి మాత్రం ఎటువంటి సమాచా రాన్ని టీటీడీ ఇవ్వడం లేదు.ఈ వ్యవహారం పూర్తయి రెండు నెలలు గడిచాయి. కూటమి సర్కార్‌కు వందరోజులు నిండిన నేపథ్యంలో జరిగిన రాజకీయ సమావేశంలో చంద్రబాబు ఎన్డీడీబీ నివేదికను విడుదల చేశారు. జంతువుల ఫ్యాట్ కలిసిందనే ఆరోపణ అక్కడే చేశారు. టీటీడీ విడుదల చేయవలసిన నివేదికను పొలిటికల్ మీటింగ్‌లో విడుదల చేయడంపై పలు సందేహాలు ఏర్పడుతున్నాయి. అంతకుముందు వెజిటబుల్ ఫ్యాట్స్ కల్తీ జరిగిందని చెప్పిన ఈఓ ఈ సమావేశం తర్వాత స్క్రిప్టు మార్చి చంద్రబాబు ప్రసంగాన్ని అనుసరించారు.స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రే తిరుమల ప్రసాదానికి అపవిత్రతను ఆపాదిస్తూ మాట్లాడడంతో ఇది జాతీయ స్థాయిలో పెద్ద సమస్యగా మారిపోయింది. తిరుమలకు ఉన్న విశిష్టత అటువంటిది. తిరుమల ప్రతిష్ఠను దెబ్బతీసి, తద్వారా రాష్ట్ర ఇమేజ్‌కు మసిపూసి చంద్రబాబు ఏం సాధించదలుచుకున్నారు? కల్తీ సరుకును కనిపెట్టి వెనక్కు తిప్పి పంపే వ్యవస్థాగత బలం టీటీడీకి ఉన్నది. పలు సంద ర్భాల్లో అలా జరిగింది. మొన్నటి కల్తీ సరుకు వచ్చింది టీడీపీ సర్కార్ జమానాలోనే. దాన్ని గుర్తించిన టీటీడీ వ్యవస్థ వెనక్కు పంపింది కూడా! మరి ఏ విధంగా ఈ వ్యవహారాన్ని జగన్ సర్కార్ మెడకు చుట్టాలని చంద్రబాబు భావించారు? తనకు అనుకూలంగా అరవై నాలుగు నోళ్లు లేస్తాయన్న ధీమాతోనే కదా అభాండాలు వేయడం!తమ జీవితాలను వరదల్లో ముంచేసినందుకు మూడు లక్షల కుటుంబాలు విజయవాడలో బాబు సర్కారు మీద భగ్గుమంటున్నాయి. సర్కార్ బడుల్లో వసతులపై కోత పెట్టడం, సీబీఎస్ఈ సిలబస్ రద్దు చేయడం, ఇంగ్లీష్ మీడి యాన్ని నిరుత్సాహపరచడంతో రెండున్నర లక్షల మంది విద్యార్థులు మళ్లీ ప్రైవేట్ బాట పట్టారు. కేంద్ర సర్కార్‌లో టీడీపీ భాగస్వామిగా ఉండి కూడా విశాఖ ఉక్కు ప్రైవేటీ కరణ యత్నాలను అడ్డుకోవడం లేదని కార్మికులు మండి పడుతున్నారు.ఉద్యోగాల కల్పన ఊసేలేదు, నిరుద్యోగ భృతి ప్రస్తావన లేదు. వంచనకు గురయ్యామని మహిళలు మథనపడుతున్నారు. సర్కార్ మేనిఫెస్టోలపై సోషల్ మీడి యాలో మీమ్స్ వెల్లువెత్తుతున్నాయి. వీడియోల నిండా వెట కారం ప్రవహిస్తున్నది.వంద రోజుల్లోనే విశ్వరూపం దాల్చిన వ్యతిరేకతను దారి మళ్లించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తుండవచ్చు. కానీ ఆ దారి మళ్లింపు ఇలా ఉండకూడదు. నిస్సందేహంగా బాబు చేసింది మహాపచారం. ఆయన చేసిన పనివల్ల తిరుమల ప్రతిష్ఠకు జాతీయ స్థాయిలో భంగం వాటిల్లింది. కూటమి సర్కార్ అందజేసిన సమాచారాన్నే కళ్లకద్దుకొని జాతీయ మీడియా గుడ్డిగా వ్యవహరిస్తున్నది. ఈ మీడియా ప్రచారం వల్ల జగన్ మోహన్‌రెడ్డి ప్రతిష్ఠే దెబ్బతింటుందని చంద్రబాబు భావిస్తుండవచ్చు. కానీ చంద్రబాబు జమానాలోనే కల్తీ సరుకు వచ్చిన విషయం నేడు కాకపోతే రేపైనా జాతీయ మీడియాకు తెలుస్తుంది. అక్కడ అమలవుతున్న కట్టుదిట్టమైన వ్యవస్థపై అవగాహన కలుగుతుంది. కానీ, తిరుమల పవిత్రతకు చంద్రబాబు వల్ల తగిలిన గాయం ఎప్పుడు మానాలి? రాజకీయ జూదం కోసం పుణ్యక్షేత్రాలను పణంగా పెట్టేవారికి ఆ ఏడు కొండలవాడే బుద్ధి చెప్పాలి. వర్ధెల్లి మురళిvardhelli1959@gmail.com -
పెండ్లిలో తలంబ్రాలు ఎందుకు పోసుకుంటారు?
వివాహ సంప్రదాయంలో తలంబ్రాల వేడుక చూడముచ్చటగా సాగుతుంది. వధూవరులు పోటాపోటీగా ఇందులో పాల్గొంటారు. మాంగల్య ధారణ తర్వాత జరిగే తంతు ఇది. తలంబ్రాలకు ఎంచుకునే బియ్యానికి కొన్ని కొలతలు ఉంటాయి. అవి ఆయా ఇంటి ఆచారాలను బట్టి ఉంటుంది. ఇందులో విరిగిన బియ్యం వాడకూడదు. తలంబ్రాల వేడుకలో పఠించే మంత్రాల్లో విశేషమైన అర్థాలు ఉంటాయి. అవి సంసార బాధ్యతలను గుర్తుచేస్తాయి.మొదట తలంబ్రాలను కొబ్బరి చిప్పలో పోసి, రాలతో ్రపోక్షించి వధూవరులకు అందిస్తూ దానం, పుణ్యం చేయాలని, శాంతి, పుష్టి, తుష్టి వృద్ధి కలగాలని, విఘ్నాలు తొలగి ఆయుష్షు, ఆరోగ్యం, క్షేమం, మంగళం కలగాలని, సత్కర్మలు వృద్ధి చెందాలని, తారలు, చంద్రుని వల్ల దాంపత్యం సజావుగా సాగి, సుఖశాంతులు కలగాలని’ పురోహితుడు మంత్ర పఠనం చేస్తాడు.మొదటగా వరుడు వధువు శిరస్సున పోస్తాడు. ఆ సమయంలో ‘నీవలన సత్సంతాన మృద్ధి జరుగునుగాక‘ అను మంత్రాన్ని చదువుతారు. వధువు చేత ‘పిడిపంటలు వృద్ధియగునుగాక‘ అను మంత్రాన్ని చదువుతూ తలంబ్రాలు పోయిస్తారు. మూడోసారి వరుడిచేత ‘ధన ధాన్య వృద్ధి జరుగునుగాక‘ అంటూ తలంబ్రాలు వధువు శిరస్సుమీద పోయిస్తారు. ఆ తర్వాత ఆ తలంబ్రాలను అన్నింటినీ వధూవరులు ఉల్లాసంగా ఒకరి శిరస్సున ఒకరు దోసిళ్ళతో పోసుకుంటారు. ఆ తర్వాత, వారి దాంపత్య బంధం ఆజన్మాంతం వర్ధిల్లాలను విషయానికి సూచనగా, వారి కొంగులను ముడివేస్తారు. దీనినే బ్రహ్మముడి/ బ్రహ్మగ్రంధి అంటారు. -
నేడు హిమాచల్ బంద్.. హిందూ సంస్థల పిలుపు
సిమ్లా: హిమాచల్ ప్రదేశ్‌లోని మండి పట్టణంలో ఆక్రమిత స్థలంలో నిర్మించిన మసీదును కూల్చివేయాలని డిమాండ్ చేస్తున్న నిరసనకారులపై పోలీసులు శుక్రవారం లాఠీచార్జీ చేశారు. దీనికి నిరసనగా నేడు (సెప్టెంబర్ 14) హిమాచల్ బంద్‌కు హిందూ సంస్థలు పిలుపునిచ్చాయి.హిమాచల్ బంద్ నేపధ్యంలో రాష్ట్రంలోని వ్యాపారులంతా తమ దుకాణాలను ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు మూసి ఉంచాలని హిందూ సంస్థ నేత కమల్ గౌతమ్ విజ్ఞప్తి చేశారు. సిమ్లాలోని సంజౌలీలో నిరసనకారులపై పోలీసుల లాఠీచార్జికి వ్యతిరేకంగా హిందూ సంస్థలు ఈ బంద్‌కు పిలుపునిచ్చాయి. వివిధ రాష్ట్రాల్లోని ప్రధాన ప్రాంతాల్లో నిరసనలు తెలుపుతామని హిందూ సంస్థలు హెచ్చరించాయి.సెప్టెంబర్ 11న ఉదయం సంజౌలిలో పెద్ద సంఖ్యలో నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సిమ్లా జిల్లా యంత్రాంగం సెక్షన్ 163ని అమలు చేసింది. ఇందులోభాగంగా ఐదుగురి కంటే ఎక్కువ మంది గుమిగూడడంపై పూర్తి నిషేధం విధించారు. అయితే ఆందోళనకారులు ఢిల్లీ టన్నెల్ దగ్గరున్న బారికేడింగ్‌ను బద్దలు కొట్టి, సంజౌలి వైపు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జి చేసి, వాటర్ క్యానన్ ప్రయోగించారు. దీనికి నిరసనగా ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వారు.ఇది కూడా చదవండి: అంతరిక్షం నుంచే ఓటు వేస్తా: సునీతా విలియమ్స్ -
Bangladesh: హిందువుల పూజలపై ఆంక్షలు
ఢాకా: బంగ్లాదేశ్‌లో అధికారం మారిన తర్వాత, అక్కడి హిందువులపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వం హిందువుల పూజల విషయంలో ఆంక్షలు విధిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది.దీని ప్రకారం బంగ్లాదేశ్‌లోని హిందువులు ఇకపై ముస్లింలు నమాజ్ చేసే సమయంలో పూజలు చేయకూడదు. అలాగే ఆ సమయంలో భజనలు చేయడం, వినడం, లౌడ్ స్పీకర్లు వినియోగించడం లాంటి పనులు చేయకూడదు. ఈ ఉత్తర్వులను తాత్కాలిక ప్రభుత్వ హోం వ్యవహారాల సలహాదారు, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ మహ్మద్ జహంగీర్ ఆలం చౌదరి జారీ చేశారు.ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లు తేలితే, పోలీసులు ఎలాంటి వారెంట్ లేకుండా వారిని అరెస్టు చేస్తారని బంగ్లాదేశ్ హోం మంత్రిత్వ శాఖ ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. బంగ్లాదేశ్‌లో అధికారం మారినప్పటి నుంచి ఇప్పటివరకూ 300 హిందూ కుటుంబాలు, వారి ఇళ్లపై దాడులు జరిగాయి. హిందువులపై మూక హత్యలు కూడా చోటుచేసుకున్నాయి. పదికి పైగా హిందూ దేవాలయాల్లో విధ్వంసం, దహనాలు జరిగాయి. ఇదేవిధంగా 49 మంది హిందూ ఉపాధ్యాయుల చేత బలవంతంగా రాజీనామాలు చేయించారు. ఇప్పుడు ఈ కొత్త ఉత్తర్వుల తర్వాత బంగ్లాదేశ్‌లోని హిందువులు ప్రశాంతంగా పూజలు కూడా చేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఇది కూడా చదవండి: NCPCR: మదర్సాల్లో బాలల హక్కుల ఉల్లంఘన -
ఏది ధర్మం? దేనికి రక్షణ?
చట్టం విరుద్ధం కానంత వరకు ఎవరేమి చేయాలో, ఎవరేం తినాలో చెప్పడానికి వేరొకరికి ఏమి హక్కు ఉంటుంది? కొద్దిరోజుల వ్యవధిలో హర్యానాలో వరసగా జరిగిన రెండు విచక్షణా రహిత హత్యలు ఆ మౌలిక ప్రశ్ననే మరోమారు ముందుకు తెచ్చాయి. ధర్మం పేరిట విద్వేషాన్ని నింపుకొని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొంటున్న స్వయం ప్రకటిత గోరక్షకులతో దేశానికున్న ముప్పును గుర్తుచేశాయి. పన్నెండో తరగతి చదువుతున్న 19 ఏళ్ళ టీనేజ్ కుర్రాడు ఆర్యన్ మిశ్రా హర్యానాలోని ఆగస్ట్ 24న మిత్రులతో కలసి కారులో వస్తుండగా, గోమాంసం రవాణా చేస్తున్నాడనే అనుమానంతో సాయుధ మూకలు 50 కిలోమీటర్ల దూరం ఛేజ్ చేసి మరీ, ఫరీదాబాద్ వద్ద అతణ్ణి కాల్చి చంపిన ఘటన అమానుషం. అలాగే, గొడ్డుమాంసం తింటున్నాడనే అనుమానంతో ఆగస్ట్ 27న చర్ఖీ దాద్రీ వద్ద 26 ఏళ్ళ వలస కార్మికుడు సబీర్ మాలిక్‌ను కొందరు సోకాల్డ్ ధర్మపరిరక్షకులు కొట్టి చంపిన తీరు నిర్ఘాంతపరుస్తోంది. సాక్షాత్తూ హర్యానా సీఎం సైతం ‘సెంటిమెంట్లు దెబ్బతింటే, ఎవరినైనా ఎలా ఆపగల’మంటూ బాధ్యతారహితంగా వ్యాఖ్యానించడం దీనికి పరాకాష్ఠ. ఇలాంటి పాలక వర్గాల భావజాలం కారణంగానే దాదాపు దశాబ్ద కాలంగా దేశంలో గోరక్షణ పేరిట హింస సాధారణమైపోయింది. సోమవారం మహారాష్ట్రలో ఓ రైలులో పశుమాంసం తీసుకెళు తున్న ఓ వృద్ధుడిపై మూకదాడి అందుకు మచ్చుతునక. అయితే, తాజా దాడులు మైనారిటీలపై హింస పెచ్చరిల్లుతున్న వైనాన్ని పట్టిచూపడమే కాక, ఈ మతపరమైన అసహనంపై విస్తృత చర్చను లేవనెత్తాయి. ఫరీదాబాద్ ఘటనలో చనిపోయింది అమాయక హిందువంటూ రచ్చ చేస్తున్న వాళ్ళు ఆ పోయిన ప్రాణాలు ముస్లిమ్వైనా ఇలాగే స్పందిస్తారా అన్నది ధర్మసందేహం. అప్పుడే ఇలా స్పందించి ఉంటే, దేశంలో అసలు గోరక్షణ పేరిట పరిస్థితులు ఇంత దూరం వచ్చేవి కావేమో! ప్రధాని మోదీ సైతం పశువుల వ్యాపారులపై, పశు మాంసం తినేవారిపై దాడులను గతంలో ఖండించక పోలేదు. కానీ, నోరొకటి మాట్లాడుతుంటే నొసలొకటి చెబుతున్నట్టుగా... అధికార బీజేపీ ఊదరగొ డుతున్న హిందూ జాతీయవాదం గోరక్షణ పేరిట దాడుల్ని పెంచిపోషించిందన్నది నిష్ఠురసత్యం. ఆర్యన్ ఘటనపై నిరసనలు వెల్లువెత్తే సరికి, ప్రభుత్వం సైతం దిద్దుబాటు చర్యలకు దిగకతప్పలేదు. ఛాందసవాద గోరక్షకుల జాబితా సిద్ధం చేస్తున్నట్టు పోలీసులు గురువారం ప్రకటించారు. గతంలోకి వెళితే, 2012– 2018 మధ్య కాలంలో గోరక్షణ పేరిట దేశవ్యాప్తంగా 120 దాకా హింసాత్మక ఘటనలు నమోదయ్యాయి. ఆ హింసలో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. అప్పుడు కూడా అత్యధిక ఘటనలు ఉత్తర ప్రదేశ్‌లోనే జరగడం గమనార్హం. గడచిన ఏడెనిమిదేళ్ళుగా ఉత్తర ప్రదేశ్‌లోనే కాక హర్యానా, బిహార్, రాజస్థాన్, జార్ఖండ్ తదితర అనేక ఉత్తరాది రాష్ట్రాల్లో గోసంర క్షకుల పేరిట హింస పెచ్చరిల్లుతూ వస్తోంది. ఈ ‘గోరక్షక ముఠాల’ దాడులు భారత రాజ్యాంగ మౌలిక సూత్రాలనే దెబ్బతీస్తున్నాయి. నిజానికి, 19వ శతాబ్దం ద్వితీయార్ధం నుంచే మన దేశంలో గోహత్యపై చర్చ, అడపాదడపా హింస సాగుతూనే వచ్చాయి. ‘హిందువేతరులపై హిందూ ధర్మాన్ని రుద్ద కూడద’ని దేశ విభజన సందర్భంగా సాక్షాత్తూ గాంధీ సైతం నొక్కిచెప్పాల్సి వచ్చింది. భారతదేశం లౌకికవాద గణతంత్ర రాజ్యమనే స్ఫూర్తిని నిలబెట్టడం కోసం రాజ్యాంగ ముసాయిదా రూపకల్పన సంఘం సైతం గోరక్షణను తమ డ్రాఫ్టులో చేర్చలేదు. గోరక్షణను ప్రాథ మిక హక్కుగా చేర్చాలన్న వాదనను తోసిపుచ్చి, దాన్ని ఆదేశిక సూత్రాల్లోనే చేర్చారని చరిత్ర. భారత ప్రజాస్వామ్య సౌధాన్ని నిర్మించిన మన పెద్దలు వివేకంతో వ్యవహరించి, మెజారిటీ ప్రజల ఒత్తిడికి తలొగ్గలేదు. భావోద్వేగభరిత ధార్మిక అంశాల కన్నా దేశంలోని లౌకికవాద చట్టాన్ని సమున్నతమని చేతలతో చాటారు. హిందూ ధర్మంలో గోవును పవిత్రమైనదిగా పూజిస్తాం. తప్పు లేదు. మరి, అదే ధర్మం మనిషిలో దేవుణ్ణి చూడమన్న మాటను గౌరవించవద్దా? దాదాపు 24 రాష్ట్రాల్లో గోవుల అక్రమ అమ్మకం, వధను నిషేధిస్తూ రకరకాల నియంత్రణలున్నాయి. కానీ, వీటిని అడ్డం పెట్టుకొని కొన్ని అతివాద బృందాలు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని, హత్యలకు పాల్పడడం, మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టి, విద్వేషాలు పెంచడం సహిద్దామా? భరిద్దామా? ఈ రకమైన హిందూ జాతీయవాదంతో దేశం ఎటు పోతుంది? దేశంలోని 20 కోట్ల పైగా ముస్లిమ్‌లను వేరుగా చూస్తూ, ఈ సమాజంలో తాము మరింత మైనారిటీలుగా మిగిలిపోయామనే భావన కల్పించడం సామాజిక సమైక్యతను దెబ్బతీయదా? అది పొరుగున పొంచిన శత్రువులకు ఊతం కాదా?సంఘమంటేనే విభిన్న వర్గాలు, భావాలు, సంస్కృతులు, అలవాట్ల సమ్మేళనమనే ప్రాథమిక అంశాన్ని అందరూ గుర్తెరిగేలా చేయాలి. వైమనస్యాలు పెంచి సామరస్యాన్ని దెబ్బతీస్తే మొదటికే మోసం. అందులోనూ మూగజీవాల్ని అడ్డం పెట్టుకొని ప్రదర్శిస్తున్న మతోన్మాదం రాజకీయ ప్రేరేపి తమైనది కావడం పెను ప్రమాదఘంటిక. రాజ్యాంగ నైతికతకే విఘాతం కలిగిస్తున్న ఈ చర్యలతో చివరకు సత్ పౌరులనూ, అమాయకులనూ హింసించడం మరింత విషాదం. సుప్రీమ్ కోర్ట్ సైతం ఈ రకమైన హింసను సహించరాదని పదే పదే ఆదేశించినా, పాలకవర్గ రాజకీయాలకు ఆశ్రితులైన దోషులు తప్పించుకుంటూనే ఉన్నారు. స్థానిక నేతలుగా ఎదిగి, చట్టసభల్లో స్థానం సంపాదించు కొని, ప్రజాస్వామ్య విలువల్ని పరిహాసప్రాయం చేస్తున్నారు. పశువుల్ని కాపాడే మిషతో మనిషే మృగంగా మారుతున్న ఈ ధోరణికి ఇకనైనా పాలకులు అడ్డుకట్ట వేయాలి. తాత్కాలిక రాజకీయ ప్రయోజనాలకై దీన్ని ఇలాగే వదిలిస్తే ఆఖరికి ఆవుల రక్షణ పేరిట ఆటవిక రాజ్యం నెలకొంటుంది. -
ఏడడుగులు ఎందుకు వేస్తారు?
మూడు ముళ్ల తర్వాత హోమం చుట్టూ ఏడడుగులు ప్రదక్షిణ చేస్తారు వధూవరులు. అంటే జీవిత భాగస్వామితో ఏడు జన్మల వరకూ తోడుంటా అని వాగ్ధానం చేస్తూ ఏడడుగులు వేస్తారు. ఇంకా వివరంగా చె΄్పాలంటే ఒక్కో అడుగుతో ఒక్కో భరోసాను జీవిత భాగస్వామికి ఇస్తున్నట్లు లెక్కమొదటి అడుగు.. అన్నవృద్ధికి. అంటే అన్నపూర్ణగా పిలిచే మనదేశంలో పంటలు బాగా పండాలని ఆకాంక్షిస్తూ వేసేది. రెండో అడుగు.. బలవృద్ధికి. అంటే వధూవరుల ఇరు కుటుంబ సభ్యుల ఆయురారోగ్యాలతో ఉండాలని వేస్తారు.మూడో అడుగు.. ధన ప్రాప్తి కలగాలని వేస్తారునాలుగో అడుగు..దంపతులిద్దరూ సదా సుఖ సంతోషాలతో ఉండాలని ఐదో అడుగు..ఒక్క తమ కుటుంబం మాత్రమే కాకుండా సమాజానికి తమ చేతనైన మేరకు సాయం చేస్తామని చెప్పడం. ఆరో అడుగు..వైవాహిక జీవితంలో ఎలాంటి కలహాలు, అనుమానాలు లేకుండా సాఫీగా సాగాలని.ఏడో అడుగు.. శారీరకంగా, మేధో పరంగా పుష్ఠి కలిగిన సంతానాన్ని కలిగించాలని వేసే అడుగు. -
బంగ్లాదేశ్ సంక్షోభంపై అవిముక్తేశ్వరానంద ఏమన్నారంటే..
బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనల మధ్య షేక్ హసీనా ప్రధాని పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. అనంతరం ఆమె ఢాకా వదిలి ఇండియా వచ్చారు. ఇక్కడి నుంచి షేక్ హసీనా ఇప్పుడు లండన్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. బంగ్లాదేశ్ సంక్షోభంపై ఉత్తరాఖండ్‌లోని జ్యోతిర్మఠానికి చెందిన శంకరాచార్య స్వామి అవిముక్తేశ్వరానంద సరస్వతి ఆందోళన వ్యక్తం చేశారు.ఆయన మీడియాతో మాట్లాడుతూ ‘బంగ్లాదేశ్‌లో రాజకీయ దుమారం చెలరేగుతోంది. ఆ దేశంలో సైనిక పాలన నడుస్తోంది. పౌరులను రక్షించే బాధ్యతను సైన్యం కచ్చితంగా నెరవేరుస్తుందని ఆశిస్తున్నాం. బంగ్లాదేశ్‌లో దాదాపు 10 శాతం మంది హిందువులు నివసిస్తున్నారు. వారి భద్రత ఎంతో ముఖ్యం. హిందువుల భద్రత కోసం బంగ్లాదేశ్ ఆర్మీ పాటుపడాలి’ అని కోరారు.కాగా బంగ్లాదేశ్ రాజధాని ఢాకాతో సహా అనేక ఇతర నగరాల్లో హిందూ దేవాలయాలపై దాడులు జరుగుతున్నాయి. షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసినట్లు బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వకార్-ఉజ్-జమాన్ ప్రకటించారు. బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం బాధ్యతలు చేపట్టనుంది. గత రెండు రోజులుగా హసీనా ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న నిరసనల్లో వందల సంఖ్యలో జనం మృతిచెందారు. -
మోదీజీ.. ఇక చాలు
న్యూఢిల్లీ: విద్వేష ప్రసంగాలతో హిందూ, ముస్లింల మధ్య విషం చిమ్ముతున్న మోదీ ప్రజాజీవితం నుంచి నిష్క్రమించడం మేలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే హితవు పలికారు. విపక్షాల కూటమి అధికారంలోకి వస్తే మీ దగ్గర ఉన్న పాడిఆవులు, గేదెలను లాక్కుంటారని, మీ రిజర్వేషన్ కోటా తగ్గించి ముస్లింలకు 15 శాతం ఇస్తారని మోదీ రోజూ అబద్దాలు ప్రచారంచేస్తూ సమాజంలో చీలిక తెస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం పీటీఐ ఇంటర్వ్యూ సందర్భంగా ఖర్గే వెల్లడించిన అభిప్రాయాలు, ప్రస్తావించిన అంశాలు ఆయన మాటల్లోనే..ఆయనే వైదొలగుతానన్నారు‘హిందూ, ముస్లింల మధ్య ఘర్షణకు కారణమయ్యేలా మాట్లాడితే క్రియాశీలక రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఇటీవల ప్రధాని మోదీ స్వయంగా చెప్పారు. మళ్లీ ఆయనే రోజూ హిందూ, ముస్లిం విద్వేష ప్రసంగాలు ఇస్తున్నారు. ఆయన మాటలకు ఆయనే కట్టుబ డట్లేరు. తప్పులు ఒప్పుకోరు. క్షమాపణలు చెప్పరు. ఆయన ఎంతగా అబద్దాలడుతున్నారో తెలియాలంటే సొంత ప్రసంగాలు ఆయన ఒకసారి వింటే, చూస్తే మంచిది. ఎన్నికల ర్యాలీల్లో విష ప్రచారాన్ని దట్టించారు. ఇలా మాట్లాడే ఆయన ప్రజాజీవితానికి స్వస్తి పలకడమే అత్యుత్తమం’’అందుకే రాహుల్ ప్రేమ దుకాణాలు తెరుస్తానన్నారు‘‘ బీజేపీ నేతలు రాజ్యాంగం, ముస్లింల వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తే మోదీ ఏనాడైనా ఖండించారా? గిరిజ నులపై మూత్ర విసర్జన ఘటనలను ఒక్కసారైనా తప్పుబట్టారా? కనీసం బీజేపీ నేతలను మందలిస్తూ హెచ్చరిక వ్యాఖ్యలు చేశారా?. తానొక్కడినే నేత అన్నట్లు వన్‌మ్యాన్ షో చేస్తున్నారు. మొత్తం దేశాన్ని ఒక్కడినే పాలిస్తానని ప్రకటించుకుంటున్నారు. ప్రచారసభల్లో విద్వేష వ్యాఖ్యానాలే చేస్తున్నారు. అందుకే విద్వేషం సమసిపోయేలా ప్రేమ దుకాణాలు తెరుస్తానని రాహుల్ గాంధీ అన్నారు’’అవి బుజ్జగింపు రాజకీయాలు కావు‘‘అన్యాయమైపోతున్న వారిని పట్టించుకుంటే దానిని బుజ్జగింపు రాజకీయాలు అనరు. మేమేం చేసినా బుజ్జగింపు రాజకీయాలు అంటే ఎలా? పేదలకు ఏదైనా ఇవ్వడం, స్కాలర్షిప్ అందించడం, ముస్లింలకు ప్రత్యేక పాఠశాలల ద్వారా విద్యనందిస్తే వాటిని బుజ్జగింపు రాజకీయాల గాటన కట్టొద్దు’’బీజేపీలో కూర్చున్న అవినీతి నేతల సంగతేంటి?‘‘అవినీతి నేతల్ని జూన్ 4 తర్వాత జైల్లో వేస్తామని మోదీ అన్నారు. మరి అవినీతి మరకలున్న చాలా మంది నేతలను బీజేపీ లాగేసుకుని ఒళ్లో కూర్చోబెట్టుకుంది. వారిలో కొందరిని ఎంపీలను చేసింది. మరి కొందరు ఏకంగా ముఖ్యమంత్రులు కూడా అయ్యారు. మరి వారి సంగతేంటి?’’.బీజేపీ మెజారిటీని కచ్చితంగా అడ్డుకుంటాం‘‘కాంగ్రెస్, విపక్షాల ‘ఇండియా’ కూటమి పట్ల ప్రజల్లో సానుకూల స్పందన చాలా పెరిగింది. కూ టమి అనుకూల పవనాలు బలంగా వీస్తున్నాయి. ఈ బలంతో బీజేపీ మెజారిటీని ఖచ్చితంగా నిలు వరిస్తాం. మా కూటమి ఎక్కువ సీట్లు గెలుస్తుంది’’.ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా?‘‘రామ మందిరం, హిందూ–ముస్లిం, ఇండియా–పాకిస్తాన్ అంశాలే దశాబ్దాలుగా చెబుతూ ప్రజల భావోద్వేగాలను ఓట్ల రూపంలో ఇన్నాళ్లూ ఒడిసిపట్టారు. ఇక ఆటలు సాగవని అర్థమైంది. అందుకే కొత్తగా కాంగ్రెస్ గెలిస్తే ఇంట్లో ఆవులు, గేదెలు తీసుకెళ్తుందని, ఆస్తులు స్వాధీనం చేసుకుంటుందని, మంగళసూత్రం తెంపుకుపోతుందని, భూము లు లాక్కుంటారని ఇష్టమొచ్చినట్లు చెబుతున్నారు. అసలు ప్రధాని స్థాయి వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా?’’‘400’ గొడవ మొదలెట్టిందే మీరు‘‘పార్లమెంట్లో మూడింట రెండొంతుల మెజారిటీ కావాలని, 400 సీట్లు గెలవాలని అన్నది ఎవరు?. రిజర్వేషన్లపై ఆర్ఎస్ఎస్ చీఫ్ భాగవత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేయలేదా? అసలు 400 సీట్ల గొడవ మొదలెట్టిందే మీరు. అర్హతలేని ఆర్ఎస్ఎస్ నేతలతో రాజ్యాంగబద్ధ సంస్థలను నింపేద్దామని బీజేపీ భావిస్తోంది. రిజర్వేషన్లు తెగ్గోసేందుకు రాజ్యాంగంలో మార్పులకు బీజేపీ సాహసిస్తోంది. రాజ్యాంగం ప్రకారం పాలించట్లేదు. అనైతికంగా గతంలో మధ్యప్రదేశ్, కర్ణాటక, మణిపూర్, ఉత్తరాఖండ్, గోవాల్లో ప్రభుత్వాలను కూల్చేశారు’’ అని ఖర్గే ఆరోపించారు. -
మళ్లీ సీఏఏ రంగప్రవేశం!
రేపో మాపో లోక్‌సభ ఎన్నికల నగారా మోగబోతున్న తరుణంలో... ఎలక్టోరల్ బాండ్ల వివరాలను ఆరునూరైనా ఈనెల 15కల్లా బహిరంగపరచాలని సుప్రీంకోర్టు విస్పష్టంగా చెప్పిన కొన్ని గంటల్లో పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) నిబంధనలపై సోమవారం సాయంత్రం నోటిఫికేషన్ విడుదలైంది. అఫ్గానిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్‌లలో మైనారిటీలుగా వేధింపులకు లోనవుతూ మన దేశానికి వలసవచ్చిన హిందూ, సిక్కు, జైన, బౌద్ధ, క్రైస్తవ, పార్సీ మతస్తులకు త్వరితగతిన భారత పౌర సత్వం ఇవ్వటం సీఏఏ ప్రధాన ఉద్దేశమని పార్లమెంటులో బిల్లు పెట్టిన సందర్భంగా కేంద్రం ప్రకటించింది. ఇప్పుడు మరోసారి ఆమాటే చెప్పింది. ఈ మతస్తులు వరసగా అయిదేళ్లపాటు ఈ దేశంలో నివసిస్తే పౌరసత్వానికి దరఖాస్తు చేసుకోవచ్చు. 1955 నాటి పౌరసత్వ చట్టానికి ఈ సవరణలు తీసుకొచ్చారు. చట్టంలో ముస్లింలను మినహాయించినట్టు బాహాటంగానే కనబడుతోంది. కానీ శ్రీలంకలో మైనారిటీలైన హిందూ తమిళులనూ, మయన్మార్‌లోని మైనారిటీలు రోహింగ్యాలనూ, ఇంకా... హజరా, అహ్మదీయ వంటి ముస్లిం మైనారిటీ తెగలనూ సీఏఏ పరిగణనలోకి తీసుకోలేదు. ఈ తెగలు కూడా భారత పౌరసత్వం కోసం ఎప్పటిలా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే కనీసం వారు పదకొండేళ్లపాటు ఈ దేశంలో నివసించాలి. ఆచరణలో పౌరసత్వం రావటానికి దశాబ్దాలు పడుతుందని వేరే చెప్పనవసరం లేదు. ముస్లిం దేశాల్లోని హిందువుల స్థితిగతులపై వున్న ఆరాటం లంక తమిళుల విషయంలో ఎందుకు లేకుండా పోయింది? అక్కడ వారు ఎదుర్కొంటున్న వివక్ష, హింస తక్కువేమీ కాదు. చట్టం ముందు అందరూ సమానులేనని మన రాజ్యాంగం చెబుతోంది. రాజ్యం ఎవరికీ సమానత్వాన్ని నిరాకరించకూడదనీ, పౌరులందరికీ చట్టాలు సమంగా రక్షణ కల్పించాలనీ రాజ్యాంగంలోని 14వ అధికరణ చాటుతోంది. పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నవారి విషయంలో ఆ స్ఫూర్తే కొనసాగాలి. కానీ సీఏఏ అందుకు విరుద్ధంగా కొన్ని మతాలవారిని ఉదారంగా చూడటం, మరికొందరిని దూరం పెట్టడం ఎంతవరకూ సమంజసం? ఈ చట్టాన్ని సవాలు చేస్తూ ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) 2020లో పిటిషన్ దాఖలు చేసింది. కాలక్రమంలో మరో 200 పిటిషన్లు దానికి జత కలిశాయి. ఇందులో అస్సాంకు చెందిన అసోం గణపరిషత్, డీఎంకే, అస్సాం పీసీసీ మొదలుకొని అసదుద్దీన్ ఒవైసీ, మహువా మొయిత్రా, జైరాం రమేష్ వంటి నాయ కులు కూడా వున్నారు. బిల్లు చట్టంగా మారాక దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాల్లో, విశ్వ విద్యాలయాల్లో ఆందోళనలు మిన్నంటాయి. ఢిల్లీలోని జామియా మిలియా, అలీగఢ్ ముస్లిం యూని వర్సిటీ వంటిచోట్ల హింసాత్మక సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఆందోళనల్లో వందమంది వరకూ మరణించగా, అనేకులు గాయపడ్డారు. వందలాదిమందిపై ఇప్పటికీ కేసులు కొనసాగు తున్నాయి. సోమవారం నోటిఫికేషన్ విడుదలయ్యాక ఈశాన్య రాష్ట్రాలైన అస్సాం, మేఘాలయ, త్రిపురల్లో ఆందోళనలు చెలరేగాయి. ఈ ఉద్యమాల వెనకున్న ఉద్దేశం వేరు. ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ వంటివి పరాయి దేశాల మైనారిటీలకు మనమెందుకు పౌరసత్వం ఇవ్వాలని ప్రశ్నిస్తు న్నాయి. ఈ భారం తమపైనే పడుతుందని ఆందోళన పడుతున్నాయి. మరోపక్క సీఏఏ నోటిఫికేషన్ రాకపై గత కొన్ని నెలలుగా మీడియాలో కథనాలు వస్తూనే వున్నాయి. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీని ఎదుర్కొనటానికి ఇది బ్రహ్మాస్త్రంగా ఉపయోగపడుతుందనీ, లేకుంటే దెబ్బతింటామనీ ఆ రాష్ట్ర బీజేపీ నేతలు చెబుతూ వస్తున్నారు. బెంగాల్‌లోని నాదియా, 24 పరగణాలు, తూర్పు బర్ద్వాన్, ఉత్తర బెంగాల్‌లోని మరికొన్ని ప్రాంతాలకు 1971లో బంగ్లా విముక్తి యుద్ధ సమయంలో బంగ్లాదేశ్ నుంచి వచ్చిన మతువా తెగ ప్రజలు హిందువులు. పౌరసత్వ చట్టానికి 2003లో చేసిన సవరణ కింద వారంతా శరణార్థులుగా కొనసాగుతున్నారు. ఓటుహక్కు వగైరాలున్నాయి. మొదట్లో సీపీఎంకూ, తర్వాత తృణమూల్కూ, ఇప్పుడు బీజేపీకీ వోటు బ్యాంకుగా వీరు ఉపయోగపడుతున్నారు. అస్సాంలోనూ బీజేపీకి అటువంటి ప్రయోజనాలే వున్నాయి. రామమందిరం, పౌరసత్వ సవరణ చట్టంవంటివి మాత్రమే ఎన్నికల్లో గట్టెక్కిస్తాయని నిజంగా బీజేపీ భావిస్తే అది ఆ పార్టీ బలహీనతను సూచిస్తుందే తప్ప బలాన్ని కాదు. పొరుగు దేశాల బాధిత మైనారిటీల విషయంలో అనుసరించాల్సిన విధానాలను మాత్రమే సీఏఏ నిర్ధారించిందని, మైనారిటీల పౌరసత్వానికి దానివల్ల వచ్చే నష్టంలేదని, వారు భయపడాల్సిన పని లేదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెబుతున్నారు. సీఏఏ దానికదే సమస్యాత్మకం కాక పోవచ్చు. కానీ జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ)ను దాంతో అనుసంధానిస్తే ఉత్పన్నమయ్యే సమస్యలు అన్నీ ఇన్నీ కాదని నిపుణులంటున్న మాట. అస్సాంలో ఎన్ఆర్సీ అమలయ్యాక ఏమైందో చూస్తే ఇది అర్థమవుతుంది. ఆ రాష్ట్రంలో దాదాపు 20 లక్షలమంది పౌరసత్వానికి అనర్హు లయ్యారు. ఇందులో ముస్లింలతోపాటు హిందువులు కూడా వున్నారు. ఎన్ఆర్సీని ఏదోమేరకు అంగీకరించిన అస్సాంలో సీఏఏపై వ్యతిరేకత వుండటాన్ని, లంక తమిళులకు చట్టంలో చోటీయక పోవటంపై వున్న అసంతృప్తిని కేంద్రం పరిగణనలోకి తీసుకున్నట్టులేదు. చట్టం తీసుకురావటానికి ముందు అన్ని వర్గాలతోనూ చర్చించలేదు. ఉద్యమాల సమయంలో చర్చలకు సిద్ధమని ప్రకటించినా అవేమీ జరగలేదు. కనీసం నోటిఫికేషన్ విడుదలకు ముందైనా సందేహాలు పోగొట్టాల్సిన అవసరం గుర్తించకపోతే ఎలా? అసలు ఎన్నికలు ముంగిట పెట్టుకుని సమస్యాత్మకమైన ఈ తేనెతుట్టెను ఎందుకు కదిపినట్టు? -
కన్నడ కాంతార కాదు.. కేరళ కలియట్టం
-
‘ఉమ్మడి పౌరస్మృతి’.. ఎవరిపై ఎంత ప్రభావం?
యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ).. అంటే ఉమ్మడి పౌరస్మృతిపై మరోసారి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఉత్తరాఖండ్‌లోని ధామి ప్రభుత్వం అసెంబ్లీలో యూసీసీ బిల్లును ప్రవేశపెట్టింది. బిల్లును ప్రవేశపెడుతున్న సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు భారత్ మాతాకీ జై, వందేమాతరం, జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ బిల్లుకు స్వాగతం పలికారు. అయితే దీనిపై సమగ్ర చర్చ జరగాలని ప్రతిపక్ష కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దేశవ్యాప్తంగా ముస్లిం సంఘాలన్నీ ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఈ బిల్లు ఇంకా చర్చల దశలోనే ఉంది. యూనిఫాం సివిల్ కోడ్ ఏ మతంపై ఎలాంటి ప్రభావం చూపనున్నదో ఇప్పుడు తెలుసుకుందాం. హిందువులు ఉత్తరాఖండ్‌లో ‘ఉమ్మడి పౌరస్మృతి’ అమలైన పక్షంలో హిందూ వివాహ చట్టం (1955), హిందూ వారసత్వ చట్టం (1956) తదితర ప్రస్తుత చట్టాలను సవరించాల్సి ఉంటుంది. ఇది కాకుండా హిందూ అవిభక్త కుటుంబం (హెచ్‌యూఎఫ్)పై కూడా దీని ప్రభావం పడనుంది. ముస్లింలు ప్రస్తుతం ముస్లిం పర్సనల్ (షరియత్) అప్లికేషన్ చట్టం 1937 ముస్లింలకు అమలువుతోంది. దీనిలో వివాహం, విడాకులు తదితర నియమాలు ఉన్నాయి. అయితే యూసీసీ అమలైతే బహుభార్యత్వం, హలాలా తదితర పద్ధతులకు ఆటకం ఏర్పడుతుంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాఖండ్‌లో ముస్లిం జనాభా 13.95 శాతం ఉంది. సిక్కు కమ్యూనిటీ 2011 జనాభా లెక్కల ప్రకారం ఉత్తరాఖండ్‌లో సిక్కు జనాభా 2.34%. ఆనంద్ వివాహ చట్టం 1909 సిక్కుల వివాహాలకు వర్తిస్తుంది. అయితే ఇందులో విడాకులకు ఎలాంటి నిబంధన లేదు. అటువంటి పరిస్థితిలో విడాకుల కోసం సిక్కులకు హిందూ వివాహ చట్టం వర్తిస్తుంది. అయితే యూసీసీ అమలులోకి వచ్చిన పక్షంలో అన్ని వర్గాలకు ఒకే చట్టం వర్తిస్తుంది. అటువంటి పరిస్థితిలో ఆనంద్ వివాహ చట్టం కనుమరుగు కావచ్చు. క్రైస్తవులు క్రైస్తవ సమాజానికి చెందిన ప్రజలు కూడా ఉత్తరాఖండ్‌లో నివసిస్తున్నారు. ప్రస్తుతం క్రిస్టియన్ విడాకుల చట్టం 1869లోని సెక్షన్ 10A(1) ప్రకారం పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకునే ముందు భార్యాభర్తలు కనీసం రెండేళ్లపాటు విడిగా ఉండటం తప్పనిసరి. ఇది కాకుండా 1925 వారసత్వ చట్టం ప్రకారం క్రైస్తవ మతంలోని తల్లులకు వారి మరణించిన పిల్లల ఆస్తిలో ఎటువంటి హక్కు ఉండదు. అయితే యూసీసీ రాకలో ఈ నిబంధన ముగిసే అవకాశం ఉంది. ఆదివాసీ సముదాయం ఉత్తరాఖండ్‌లోని గిరిజనులపై యూసీసీ ప్రభావం ఉండదు. ఉత్తరాఖండ్‌లో అమలు కాబోయే యూనిఫాం సివిల్ కోడ్ బిల్లు.. ఇందులోని నిబంధనల నుండి గిరిజన జనాభాకు మినహాయింపు ఇచ్చింది. ఉత్తరాఖండ్‌లో గిరిజనుల జనాభా 2.9 శాతంగా ఉంది. -
Gyanvapi: మిగిలిన సెల్లార్లలో కూడా ఏఎస్ఐ సర్వే చేపట్టాలి
లక్నో: జ్ఞానవాపి కాంప్లెక్స్‌లో మిగిలిన సెల్లార్లను సర్వే చేసేందుకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ హిందూ పిటిషనర్ వారణాసిలోని ట్రయల్ కోర్టును ఆశ్రయించారు. కాంప్లెక్స్ మతపరమైన స్వభావాన్ని నిర్ధారించడానికి ఈ సెల్లార్లను సర్వే చేయడం చాలా కీలకమని పిటిషనర్ పేర్కొన్నారు. ప్రవేశానికి అనుమతి లేని మిగిలిన సెల్లార్లలో సర్వే చేపట్టవలసిందిగా పిటిషనర్ ఏఎస్ఐని అభ్యర్థించారు. వీటితోపాటు జ్ఞానవాపి ఆవరణలో ఇటీవలి సర్వే సమయంలో దర్యాప్తు చేయని సెల్లార్ల సర్వేలను నిర్వహించాలని ఏఎస్ఐని కోరారు. ఏ సర్వే నిర్వహించినా నిర్మాణానికి నష్టం జరగకుండా చూడాలని పిటిషన్లో పేర్కొన్నారు. కొన్ని ఇటుకలు, రాళ్లతో ఉన్న అడ్డంకుల కారణంగా ఏఎస్ఐ సర్వే కొన్నిసెల్లార్లలో పూర్తి కాలేదని పిటిషనర్ పేర్కొన్నారు. నిర్మాణానికి హాని కలిగించకుండా ఈ అడ్డంకులను సురక్షితంగా తొలగించడానికి అవసరమైన నైపుణ్యాలను ఏఎస్ఐ నిపుణులు కలిగి ఉన్నారని స్పష్టం చేశారు. అవసరమైతే ఈ అడ్డంకుల తొలగింపుపై ఏఎస్ఐ నివేదిక పొందాలని అభ్యర్థించారు. జ్ఞానవాపి మసీదులో ఏఎస్ఐ సర్వేను పూర్తి చేసి నివేదికను కూడా బహిర్గతం చేసింది. మసీదు ప్రాంగణంలో భారీ హిందూ దేవాలయ ఆనవాళ్లు ఉన్నాయని ఏఎస్ఐ స్పష్టం చేసింది. హిందూ దేవాలయ చిహ్నాలు శంఖం, చక్రం సహా పలు ఆధారాలు లభించాయని స్పష్టం చేసింది. అయితే.. ఈ సర్వే తర్వాత జ్ఞానవాపి కాంప్లెక్స్ సెల్లార్లో పూజలు చేసుకోవడానికి హిందూ పక్షంవారికి అనుమతినిస్తూ వారణాసి కోర్టు తీర్పునిచ్చింది. ఇదీ చదవండి: Varanasi: మాఘ పౌర్ణమి వేళ.. వారణాసికి మోదీ -
పాక్ ఎన్నికల్లో హిందూ మహిళ.. ముస్లింల మద్దతు!
ఫిబ్రవరి 8న పాకిస్తాన్లో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థులంతా విరివిగా ప్రచారాలు సాగిస్తున్నారు. ఈ నేపధ్యంలో ఎన్నికల బరిలో నిలిచిన హిందూ మహిళ సవీరా ప్రకాష్ వార్తల్లో నిలిచారు. పాక్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న తొలి హిందూ మహిళగా ఆమె గుర్తింపు పొందారు. హిందువు అయినప్పటికీ, ముస్లిం ప్రాబల్యం కలిగిన ప్రాంతాలలో ఆమె ప్రచారం సాగించినప్పుడు ఆమెకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. సవీరా ప్రకాష్ పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాలోని బునెర్ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఆమెకు టికెట్ ఇచ్చింది. సవీరా వృత్తిరీత్యా వైద్యురాలు. ఆమె తండ్రి పేరు ఓం ప్రకాష్. ఆయన పీపీపీలో సభ్యునిగా ఉన్నారు. ఆయన వైద్య వృత్తిలో రాణిస్తున్నారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా మీడియాతో సవీరా ప్రకాష్ మాట్లాడుతూ తాను భారత్-పాక్ మధ్య సత్సంబంధాలకు వారధిగా పని చేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. తాను డాక్టర్‌నని, పాక్‌లోని ఆసుపత్రుల్లో పరిస్థితులను మెరుగుపరిచేందుకే రాజకీయాల్లోకి వచ్చానని ఆమె తెలిపారు. సవీరా 2022లో మెడికల్ కాలేజీ నుండి పట్టా పుచ్చుకున్నారు. బునర్ అసెంబ్లీలో పీపీపీ పార్టీ మహిళా విభాగానికి ప్రధాన కార్యదర్శిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఆమె చాలా కాలంగా తండ్రితోపాటు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. పాకిస్తాన్లో మహిళల అభ్యున్నతి, ఆరోగ్య సేవలను మెరుగుపరిచేందుకు ఆమె కృషి చేస్తున్నారు. ఇదిలావుండగా పాక్ ఎన్నికలకు ముందు గత మూడు రోజులుగా కరాచీ, బలూచిస్థాన్‌లోని ఎన్నికల సంఘం కార్యాలయాల వెలుపల పేలుళ్లు జరిగాయి. -
అవిస్మరణీయ క్షణాలు
కొన్ని క్షణాలు చరిత్రలో ప్రత్యేకంగా నిలుస్తాయి. భారత ప్రధాని మోదీ మాటల్లో చెప్పాలంటే, హిందువులు ఆరాధించే శ్రీరాముడికి పురాణప్రసిద్ధమైన ఆయన జన్మస్థలి అయోధ్యలో వెలసిన మందిర ప్రారంభం, అక్కడ అయిదేళ్ళ బాలరాముడి విగ్రహానికి సోమవారం జరిపిన ప్రాణప్రతిష్ఠాపన ఘట్టం అలాంటివే. మరో వెయ్యేళ్ళు గుర్తుండిపోయే రోజుగా మోదీ పేర్కొన్న మందిర ప్రారంభ దినాన కశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా రామనామం ప్రతిధ్వనించింది. నేపాల్, బాలీ, ట్రినిడాడ్ సహా దేశదేశాల్లోని హిందువులు ఉత్సవం చేసుకున్నారు. వజ్రవైడూర్య ఖచిత స్వర్ణాభరణాలంకృత మందస్మిత బాలరామ రూపసాక్షాత్కారం, సాయంసంధ్యలో సరయూ తీరంలో లక్షల సంఖ్యలో దీపప్రజ్వలనంతో... అనంత కాలగతిలో ఒక చక్రభ్రమణం పూర్తి అయినట్టయింది. నాగరకతలో ఇదొక మహత్తర క్షణమనీ, రామరాజ్య స్థాపనకు తొలి అడుగనీ కొందరంటే... రామరాజ్యమంటే హిందూ రాజ్యం కాదు, ధర్మరాజ్యమనే గాంధీ భావనను ఇతరులు గుర్తుచేయాల్సి వచ్చింది. అనేక మతఘర్షణలు, దశాబ్దాల రాజకీయ, న్యాయ పోరాటాలు ఈ మందిర నిర్మాణం వెనుక ఉన్నాయి. రామ జన్మభూమిలో 1528లో బాబర్ సైన్యాధ్యక్షుడు మీర్ బాఖీ కట్టినట్టు చెబుతున్న బాబ్రీ మసీదు 1992 డిసెంబర్ 6న కరసేవకుల చేతిలో కూలడం, చివరకు సుప్రీమ్ కోర్టు వేర్వేరుగా ఆలయ – మసీదు నిర్మాణాలకు ఆదేశాలివ్వడం... అలా అది ఓ సుదీర్ఘ చరిత్ర. వెరసి, అయిదు శతాబ్దాల తర్వాత రామ్ లల్లా (బాల రాముడు)కు అది మందిరమైంది. వేలాది ధార్మికుల మొదలు అద్వానీ, మురళీ మనోహర్ జోషీ, అశోక్ సింఘాల్, కల్యాణ్ సింగ్ లాంటి నేతల వరకు ఈ ఆలయ నిర్మాణ ఘట్టానికి ప్రేరకులు, కారకులు ఎందరెందరో. మూడు దశాబ్దాల క్రితం తమ పార్టీ చేసిన ఎన్నికల వాగ్దానాన్ని ఎట్టకేలకు నెరవేర్చిన ఘనత మాత్రం మోదీకి దక్కింది. తెరపై రామ జన్మ భూమి ట్రస్ట్ లాంటి పేర్లున్నా, తెర వెనుక చక్రం తిప్పుతున్నదెవరో తెలియనిది కాదు. వచ్చే మేలో మరోసారి ప్రజాతీర్పు కోరి, వరుసగా మూడోసారి బీజేపీని గద్దెనెక్కించే పనిలో మోదీ ఉన్నారు. హడావిడి, అసంపూర్ణ ఆలయ ప్రారంభోత్సవాన్ని ఎన్నికల అస్త్రంగా విమర్శకులు తప్పుబడుతున్నదీ అందుకే. కోట్లాది శ్రద్ధాళువుల ఉత్సాహం అర్థం చేసుకోదగినదైనా, దేశమంతటా ఉద్వేగం రగిలించి, మందిరాన్ని సైతం మెగా ఈవెంట్‌గా మార్చేయడం వెనుక రాజకీయ ప్రయోజనాలు లేవనలేం. ‘ఆనకట్టలే ఆధునిక దేవాలయాలు’ అన్న భావన నుంచి పక్కకు జరిగి, అత్యద్భుత ఆలయ నిర్మాణాలు అవసరమనే విధాన మార్పు వైపు దేశం ప్రయాణించింది. బీజేపీ, మోదీల మందిర రాజకీయాలు ప్రాంతీయ నేతలకూ పాఠమయ్యాయి. ఆలయాలు అనంత రాజకీయ ఫలదాయకమని అందరూ గుర్తించారు. అయోధ్య అక్షతలను ఇంటింటికి పంపే పని ఒకరు చేస్తే, ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ రాష్ట్రంలో ప్రతి ఇంటా బియ్యం, తాంబూలం సేకరించి, గత బుధవారం పూరీ క్షేత్రంలో ఆలయ విస్తరణ ప్రాజెక్ట్ ‘జగన్నాథ్ పరిక్రమ’ ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ శక్తిపీఠాల్లో ఒకటైన కోల్‌కతాలోని కాళీఘాట్ ఆలయ పునర్నిర్మాణాన్ని తెరపైకి తెచ్చారు. మతానికీ, రాజకీయానికీ ముడివేసే ఈ ప్రయత్నాలు ఎంత దూరం వెళతాయో చెప్పలేం. అడుగడుగున గుడి, అందరిలో దేవుడున్నాడని భావించే భారతీయ సంస్కృతి నడయాడిన నేలపై... అయోధ్యలో మందిరావిష్కారం రోజునే మమత సర్వమత సౌభ్రాతృత్వ యాత్ర చేపట్టడం గమనార్హం. నిజానికి, ప్రపంచవ్యాప్తంగా ధార్మిక స్థలాల సందర్శన పెరుగుతోంది. ధార్మిక పర్యాటకంపోటెత్తుతోంది. భారత్‌లో ఏటా 20 కోట్ల మందికి పైగా కాశీని సందర్శిస్తారనీ, రోజుకు లక్ష మందికి పైగా తిరుపతికి వస్తారనీ లెక్క. ఇప్పుడీ జాబితాలో కొత్తగా అయోధ్య చేరనుంది. దేశంలోనే పెద్ద హిందూ దేవాలయంగా నిర్మాణమైన రామమందిరం, సరయూ నదీ తీరంలోని సామాన్య పట్నాన్ని మహానగరంగా మార్చేందుకు వేసిన మెగా ప్రణాళిక, ప్రచార హంగామాతో పరి వ్యాప్త మైన ధార్మిక వాతావరణం... అన్నీ కలసి పురాణ ప్రసిద్ధ శ్రీరామ జన్మస్థలి అయోధ్యను సరికొత్త ఆధ్యాత్మిక గమ్యంగా మారుస్తున్నాయి. చరిత్ర ప్రసిద్ధ ప్రాంతాలను పర్యాటక క్షేత్రాలుగా తీర్చి దిద్దడం మన వారసత్వ వైభవానికీ, పర్యాటక వాణిజ్యానికీ మంచిదే. కాకుంటే, రూ. 15 వేల కోట్ల ప్రాజెక్టులు, 85 వేల కోట్ల పెట్టుబడులు అంటూ ఒకప్పుడు రోజుకు 2 వేల మందికి పరిమితమైన ప్రాంతాన్ని రోజుకు 3 లక్షల పర్యాటకుల స్థాయికి తీసుకెళ్ళే క్రమంలో తగు జాగ్రత్తలూ ముఖ్యం. అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణప్రతిష్ఠాపన, మందిర ప్రారంభాలకు ఉత్సవం చేసుకోవడం సరే. ఈ సంబరాల వేళ సాటి వర్గాలను మానసికంగా ఒంటరివాళ్ళను చేస్తేనే కష్టం. సమస్త జనుల సౌభాగ్యానికి మారుపేరైన ‘రామరాజ్యం’ వైపు నడిస్తేనే సార్థకత. దేశంలోని అన్ని వర్ణాలు, వర్గాల మధ్య సమత, సమానత, సహనం, సామరస్యం, సౌభ్రాతృత్వం నెలకొనేలా చూడాల్సింది నాయకులే. ఆ కృషి చేస్తేనే అర్థం, పరమార్థం. శ్రీరాముడు చేసింది అదే. అలాకాక, ‘అయోధ్య అయిపోయింది... కాశీ, మథుర మిగిలింది’ లాంటి రెచ్చగొట్టే నినాదాలతో వైమనస్యాలు పెంచితే, దేశ సమైక్యతకే అది గొడ్డలిపెట్టు. మరో రావణకాష్ఠానికి మొదటి మెట్టు. ఈ దేశం నీది, నాది, మనందరిదీ అని అన్నివర్గాలూ అనుకోగలిగే ఏకాత్మ భావనే భిన్న సంస్కృతులు, ధర్మాల సమ్మిళితమైన భారతావనికి శ్రీరామరక్ష. పాత తప్పుల్ని తవ్వి తలకుపోసుకొనే పని మాని, కలసి నడవాల్సిన సమయమిది. ఆ దిశలో... నేటికీ కలగానే మిగిలిన నిరుద్యోగ నివారణ, దారిద్య్ర నిర్మూలన, స్త్రీలోకపు సశక్తీకరణ, పీడితజన సముద్ధరణ లాంటి లక్ష్యాలతో మన పాలకులు అడుగులు వేయాలని ఆశిద్దాం. అందరూ ఆ మహా సంకల్పం చెప్పుకొంటేనే ఏ సంబరానికైనా పుణ్యం, పురుషార్థం! -
‘శ్రీరాముడు మాంసాహారి’: ఎన్సీపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు
హిందువులు ఆదర్శపురుషునిగా భావించే శ్రీరామునిపై మహారాష్ట్రకు చెందిన ఎన్సీపీ నేత డాక్టర్ జితేంద్ర అవద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని షిర్డీలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపీ) నేత డాక్టర్ జితేంద్ర అవద్ మాట్లాడుతూ శ్రీరాముడు శాకాహారి కాదని, మాంసాహారేనని అన్నారు. 14 ఏళ్ల పాటు అడవిలో వనవాసం ఉన్న వ్యక్తి శాకాహారం కోసం ఎక్కడికి వెళ్తారని ప్రశ్నించారు. ఇది నిజమో కాదో ప్రజలే గ్రహించాలన్నారు. దేశ స్వాతంత్ర్యం గురించి ప్రస్తావించిన ఆయన ఎవరెన్ని చెప్పినా గాంధీ, నెహ్రూల కారణంగానే మనకు స్వాతంత్య్రం వచ్చిందన్నది వాస్తవమన్నారు. స్వాతంత్య్ర ఉద్యమ నేత గాంధీజీ ఓబీసీ అనే విషయాన్ని ఆర్‌ఎస్‌ఎస్‌వారు గుర్తుంచుకోవాలన్నారు. గాంధీజీ హత్యకు అసలు కారణం కులతత్వమేనని జితేంద్ర అవద్ వ్యాఖ్యానించారు. త్వరలో జరిగే అయోధ్య రామాలయ ప్రారంభోత్సవానికి ముందు కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో వివాదం తలెత్తింది. 31 ఏళ్ల క్రితం రామమందిర ఆందోళనల్లో పాల్గొన్న శ్రీకాంత్ పూజారిని తాజాగా అరెస్ట్ చేయడంపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తోందని బీజేపీ ఆరోపించింది. అయితే ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని, రామాలయ ప్రారంభోత్సవానికి ముందు ఇలా అరెస్ట్ చేయడం యాదృచ్ఛికమేనని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య స్పష్టం చేశారు. శ్రీకాంత్ పూజారి మద్యం అక్రమ విక్రయాలు, జూదంతో సహా 16 సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డాడని సీఎం తెలిపారు. అలాంటి వారిని అరెస్టు చేయకపోతే రాముడు కూడా క్షమించడని పేర్కొన్నారు. ఇదిలావుండగా ఇటీవల సిద్ధరామయ్య తనయుడు యతీంద్ర కూడా కొత్త వివాదం సృష్టించారు. భారత్ హిందూ దేశంగా మారితే అది ఆఫ్ఘనిస్థాన్, పాకిస్తాన్లా మారుతుందని వ్యాఖ్యానించారు.