
జైపూర్: దక్షిణ భారతదేశంలో క్రైస్తవ మిషనరీల కంటే హిందూ ఆధ్యాత్మిక సంస్థలే ప్రజలకు ఎక్కువ సేవలు అందిస్తున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్‌ఎస్‌ఎస్) సర్‌సంఘ్ చాలక్ మోహన్ భగవత్ చెప్పారు. మిషనరీలతో పోలిస్తే హిందూ ఆధ్యాత్మిక గురువులు సమాజ సేవలో ఎన్నో రెట్లు ముందంజలో ఉంటున్నారని ప్రశంసించారు. అయితే, ఇది పోటీకి సంబంధించిన విషయం కాదని అన్నారు.
రాజస్తాన్ రాజధాని జైపూర్ సమీపంలోని జామ్‌డోలీలో ఆర్‌ఎస్‌ఎస్ అనుబంధ సంస్థ అయిన కేశవ్ విద్యాపీఠ్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ సేవ సంగమ్ సదస్సును మోహన్ భగవత్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సమాజ సేవ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మన దేశంలో మేధావులు క్రైస్తవ మిషనరీల గురించి మాట్లాడుతుంటారని చెప్పారు. మిషనరీలు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విద్యాసంస్థలను, ఆసుపత్రులను నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రజలకు తమ వంతు సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు.
కానీ, దక్షిణ భారతదేశంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలు మాట్లాడే హిందూ మత గురువులు, ఆచార్యులు, సన్యాసులు అంతకంటే ఎన్నోరెట్లు ఎక్కువ సేవలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. సేవ అంటే సేవ మాత్రమేనని, ఇది పోటీ కాదని వివరించారు. నిస్వార్థంగా ప్రజలకు అందించే సేవలను కొలవలేమని వ్యాఖ్యానించారు.
సేవ అనేది సహజ మానవత్వ వ్యక్తీకరణ అని మోహన్ భగవత్ తెలియజేశారు. మనమంతా సమాజంలో భాగమేనని, ఐక్యంగా లేకపోతే మనం పరిపూర్ణం కాదని తేల్చిచెప్పారు. సమాజంలో అసమానతలు ఎంతమాత్రం వాంఛనీయం కాదన్నారు. దురదృష్టవశాత్తూ అసమానతలు కొనసాగుతున్నాయని వివరించారు. సేవ అనేది ఆరోగ్యకరమైన మనుషులను, ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందిస్తుందని చెప్పారు.