Spiritual centers
-
మధ్యప్రదేశ్-రాజస్థాన్ల మధ్య ఆధ్యాత్మిక కారిడార్
భోపాల్: మధ్యప్రదేశ్, రాజస్థాన్లలోని పలు ఆధ్యాత్మిక ప్రాంతాలను కలుపుతూ ఆధ్యాత్మిక కారిడార్ నిర్మించనున్నారు. దీనిలో భాగంగా రాజస్థాన్‌లోని ఖాటూ శ్యామ్ మందిరం, నాథ్‌ద్వార్ మందిరం.. మధ్యప్రదేశ్‌లోని మహాకాళేశ్వర్, ఓంకారేశ్వరంల మధ్య వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు ఎలక్ట్రికల్ బస్సు నడపనున్నారు.ఈ రాష్ట్రాల్లోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేయడమే లక్ష్యంగా కారిడార్ నిర్మితం కానుంది. దీనిలో భాగంగా శ్రీక్షృష్ట గమన్ పథాన్ని కూడా నిర్మించనున్నారు. దీంతో ఈ రెండు రాష్ట్రాల్లోని శ్రీకృష్ట మందిరాల అనుసంధానం జరగనుంది.భోపాల్ సీఎం మోహన్ యాదవ్, రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్‌లాల్ శర్మల సంయుక్త సమావేశంలో ఆధ్మాత్మిక కారిడార్ నిర్మాణంపై నిర్ణయం తీసుకున్నారు. దీనితో పాటు పార్వతీ-కాళీసింధ్- చంబల్ పరీవాహక యోజనపై ఇరు రాష్ట్రాల మధ్య భాగస్వామ్య ఒప్పందం కుదిరింది.ఈ సందర్భంగా రాజస్థాన్ సీఎం భజన్‌లాల్ శర్మ మాట్లాడుతూ పార్వతీ-కాళీసింధ్- చంబల్ ప్రాజెక్టు దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉందని, ప్రధాని మోదీ సారధ్యంలో ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చనున్నదని అన్నారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 17 ఆనకట్టలు నిర్మితం కానున్నాయని తెలిపారు. రాజస్థాన్, మధ్య ప్రదేశ్ రాష్ట్రాలు సోదరభావంతో అభివృద్ధికి బాటలు వేస్తున్నాయన్నారు. -
దేశంలో ఆధ్యాత్మిక టూరిజం జోష్
న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక పర్యాటకంపై ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో బడా రిటైల్ బ్రాండ్లు ఆధ్యాత్మిక కేంద్రాలపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. భక్తుల అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తులను అందించే దిశగా తిరుపతి, అయోధ్య, వారణాసి, అమృత్సర్, పూరి, అజ్మీర్ వంటి నగరాల్లో గణనీయంగా విస్తరిస్తున్నాయి. 14 కీలక నగరాల్లో పెరుగుతున్న ఆధ్యాత్మిక టూరిజంతో వ్యాపార అవకాశాలను అందిపుచ్చుకునేందుకు రిటైల్ చెయిన్స్ అనుసరిస్తున్న వ్యూహాలపై రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ సీబీఆర్ఈ రూపొందించిన నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మదురై, గురువాయూర్, ద్వారకా, మథురా తదితర నగరాల్లో కూడా రిటైల్ బూమ్ కనిపిస్తున్నట్లు రిపోర్టు పేర్కొంది. పేరొందిన మాల్స్‌తో పాటు రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో కూడా టూరిస్టులను ఆకర్షించేలా తమ బ్రాండ్లను ప్రదర్శించడంపై రిటైల్ సంస్థలు దృష్టి పెడుతున్నాయి. అయోధ్యలో మాన్యవర్, రిలయన్స్ ట్రెండ్స్, రేమండ్స్, మార్కెట్99, ప్యాంటలూన్స్, డామినోస్, పిజ్జా హట్, రిలయన్స్ స్మార్ట్ మొదలైనవి తమ రిటైల్ స్టోర్స్ ప్రారంభించినట్లు నివేదిక వివరించింది. వారణాసిలో జుడియో, షాపర్స్ స్టాప్, బర్గర్ కింగ్ తదితర సంస్థలు కూడా కార్యకలాపాలు విస్తరించినట్లు పేర్కొంది. టూరిజంను ప్రోత్సహించేందుకు, కనెక్టివిటీని మెరుగుపర్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో ఆధ్యాతి్మక పర్యాటకానికి ఊతం లభిస్తున్నట్లు సీబీఆర్ఈ చైర్మన్ అన్షుమన్ మ్యాగజైన్ తెలిపారు. ఫ్యాషన్, ఫుడ్ అండ్ బెవరేజెస్, హైపర్మార్కెట్లు మొదలైన సంస్థలన్నీ కూడా భక్తుల అవసరాలకు అనుగుణమైన ఉత్పత్తులను అందిస్తూ కార్యకలాపాలను విస్తరిస్తున్న ట్లు వివరించారు. ఆధ్యాతి్మక టూరిజం ట్రెండ్‌తో ఆయా ప్రాంతాల్లో ఆతిథ్య, రిటైల్ రంగాలకు కలిసి వస్తోందని సీబీఆర్ఈ ఇండియా ఎండీ రామ్ చంద్నానీ తెలిపారు. -
క్రైస్తవ మిషనరీల కంటే హిందూ ఆధ్యాత్మిక సంస్థల సేవలు అపారం
జైపూర్: దక్షిణ భారతదేశంలో క్రైస్తవ మిషనరీల కంటే హిందూ ఆధ్యాత్మిక సంస్థలే ప్రజలకు ఎక్కువ సేవలు అందిస్తున్నాయని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) సర్సంఘ్ చాలక్ మోహన్ భగవత్ చెప్పారు. మిషనరీలతో పోలిస్తే హిందూ ఆధ్యాత్మిక గురువులు సమాజ సేవలో ఎన్నో రెట్లు ముందంజలో ఉంటున్నారని ప్రశంసించారు. అయితే, ఇది పోటీకి సంబంధించిన విషయం కాదని అన్నారు. రాజస్తాన్ రాజధాని జైపూర్ సమీపంలోని జామ్డోలీలో ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ అయిన కేశవ్ విద్యాపీఠ్ ఆధ్వర్యంలో రాష్ట్రీయ సేవ సంగమ్ సదస్సును మోహన్ భగవత్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... సమాజ సేవ గురించి ప్రస్తావన వచ్చినప్పుడల్లా మన దేశంలో మేధావులు క్రైస్తవ మిషనరీల గురించి మాట్లాడుతుంటారని చెప్పారు. మిషనరీలు ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో విద్యాసంస్థలను, ఆసుపత్రులను నిర్వహిస్తున్నాయని తెలిపారు. ప్రజలకు తమ వంతు సేవలు అందిస్తున్నాయని పేర్కొన్నారు. కానీ, దక్షిణ భారతదేశంలో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషలు మాట్లాడే హిందూ మత గురువులు, ఆచార్యులు, సన్యాసులు అంతకంటే ఎన్నోరెట్లు ఎక్కువ సేవలు అందిస్తున్నారని స్పష్టం చేశారు. సేవ అంటే సేవ మాత్రమేనని, ఇది పోటీ కాదని వివరించారు. నిస్వార్థంగా ప్రజలకు అందించే సేవలను కొలవలేమని వ్యాఖ్యానించారు. సేవ అనేది సహజ మానవత్వ వ్యక్తీకరణ అని మోహన్ భగవత్ తెలియజేశారు. మనమంతా సమాజంలో భాగమేనని, ఐక్యంగా లేకపోతే మనం పరిపూర్ణం కాదని తేల్చిచెప్పారు. సమాజంలో అసమానతలు ఎంతమాత్రం వాంఛనీయం కాదన్నారు. దురదృష్టవశాత్తూ అసమానతలు కొనసాగుతున్నాయని వివరించారు. సేవ అనేది ఆరోగ్యకరమైన మనుషులను, ఆరోగ్యకరమైన సమాజాన్ని రూపొందిస్తుందని చెప్పారు. -
సాగర్ వద్ద ఆధ్యాత్మిక టూరిజం ప్రాజెక్టు
సాక్షి, అమరావతి: మలేషియాకు చెందిన డీఎక్స్ఎన్ గ్రూపు రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి వ్యక్తం చేసింది. నాగార్జునసాగర్ సమీపంలో అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేలా సున్య ఇంటర్నేషనల్ పేరుతో ఆధ్యాత్మిక, ఆయుర్వేద టూరిజం ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. నాగార్జున కొండకు సమీపంలో పల్నాడు జిల్లా మాచర్ల వద్ద 110 ఎకరాల్లో సుమారు రూ.250 కోట్ల పెట్టుబడితో ఈ సెంటర్‌ను ఏర్పాటు చేయడానికి డీఎక్స్ఎన్ మాన్యుఫాక్చరింగ్ (ఇండియా) ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదనలు సమర్పించింది. లీజు విధానంలో 99 ఏళ్లకు 110 ఎకరాలు కేటాయించాల్సిందిగా శుక్రవారం ఏపీఐఐసీ చైర్మన్ మెట్టు గోవిందరెడ్డిని ఆ సంస్థ ప్రతినిధులు కోరారు. ఈ సెంటర్లో 1,000 మంది ఒకే చోట కూర్చొని ధ్యానం చేసుకునే విధంగా మందిరంతో పాటు 7 స్టార్ హోటల్ సదుపాయాలతో రిసార్ట్, 50 పడకల హాస్పిటల్‌ను కూడా అభివృద్ధి చేయనున్నారు. ఔషధ వనం, తద్వారా ఆయుర్వేద మందులను తయారు చేసే యూనిట్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా ఏటా లక్ష మంది పర్యాటకులు సున్య ఇంటర్నేషనల్ సెంటర్‌ను సందర్శిస్తారని, ఇందులో 2,000 మందికి ఉపాధి లభిస్తుందని సంస్థ ప్రతినిధులు వివరించారు. డీఎక్స్ఎన్ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన గోవింద్ రెడ్డి.. ప్రభుత్వంతో చర్చించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. బియ్యం నుంచి ఇథనాల్ తయారీ యూనిట్ పాడైన బియ్యం, ఇతర ధాన్యాల నుంచి ఇథనాల్ తయారు చేసే యూనిట్‌ను రాజమండ్రి వద్ద అస్సాగో గ్రూపు ఏర్పాటు చేయనుంది. సుమారు రూ.300 కోట్ల పెట్టుబడితో 21 ఎకరాల్లో ఏర్పాటు చేస్తున్న ఈ యూనిట్ భూమి కోసం ఏపీఐఐసీకి సింగిల్ విండో విధానంలో దరఖాస్తు చేసింది. భూమి కేటాయింపు జరగ్గానే, భూమి పూజ చేసి.. పనులు మొదలు పెట్టడానికి రంగం సిద్ధం చేసుకుంది. భూ కేటాయింపుతో పాటు అన్ని అనుమతులు త్వరితగతిన మంజూరయ్యేలా చూడాలని కంపెనీ ప్రతినిధులు ఏపీఐఐసీ చైర్మన్‌ను కోరారు. ఈ యూనిట్ ద్వారా 200 మందికి ఉపాధి లభించనుంది. -
450 కోట్లతో ఐకానిక్ ప్రాంతాల అభివృద్ధి
హైదరాబాద్: దేశంలో ప్రముఖ పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలను స్వచ్ఛ ఐకానిక్ స్థలాలుగా గుర్తించి వాటిని రూ.450 కోట్ల వ్యయంతో పర్యాటక అనుకూల ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ శాఖ డైరెక్టర్ జనరల్ అక్షయ్ రౌత్ వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సోమవారం స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ అనే అంశంపై జరిగిన జాతీయ స్థాయి సదస్సును జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. దేశంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాల నుంచి వచ్చిన సీనియర్ అధికారులు, పలు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మూడో దశ స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశాలను ప్రకటించారు. ఇందులో కణ్వాశ్రమ్ (ఉత్తరాఖండ్), బ్రహ్మసరోవర్ టెంపుల్(హరియాణా), శ్రీనాగ్వాసుకి ఆలయం (ఉత్తరప్రదేశ్), శబరిమల శ్రీధర్మసస్థ టెంపుల్ (కేరళ), శ్రీరాఘవేంద్రస్వామి మంత్రాలయం (ఆంధ్రప్రదేశ్), పాంగోంగ్‌త్సో(జమ్మూ కశ్మీర్), మన విలేజ్ (ఉత్తరాఖండ్), విదుర్కుటి టెంపుల్ (ఉత్తరప్రదేశ్), ఎమాకైథెల్ (మణిపూర్), హజార్ దువారి ప్యాలెస్ (పశ్చిమబెంగాల్)ఉన్నాయి. ఈసారి తెలంగాణ నుంచి ఏ ప్రాంతం ఎంపిక కాలేదు. మొత్తం మూడు దశల్లో 30 ప్రముఖ పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలను ఐకానిక్ ప్రాంతాలుగా గుర్తించి వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఒక్కో ప్రాంతానికి ఒక్కో కార్పొరేట్ సంస్థకు అప్పగించామని ఈ సందర్భంగా అక్షయ్ రౌత్ తెలిపారు. చార్మినార్‌లో భారీ పాదచారుల ప్రాజెక్టు జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ చార్మినార్ పరిసర ప్రాం తాల అభివృద్ధికి అతిపెద్ద పాదచారుల ప్రాజెక్ట్‌ను ప్రారంభించామన్నారు. చార్మినార్ వద్ద నిత్యం శానిటేషన్ చేపట్టామన్నారు. కార్పొరేట్ సంస్థల నిధుల విడుదలలో మరింత సరళీకృతంగా ఉండాలని తెలిపారు. చార్మినార్ పాదచారుల ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.35.10 కోట్ల జేఎన్ఎన్యూఆర్ఎం నిధులతో ఇన్నర్, ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం, అంతర్గత రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. స్వచ్ఛ ఐకానిక్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన అభివృద్ధి పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
‘ఆహ్లా’దం.. అద్భుతం
- గోదావరి అందాలకు యాత్రికుల పరవశం - చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాల సందర్శన సాక్షి,రాజమండ్రి : పుష్కరాలకు పోటెత్తుతున్న యాత్రికులు అటు ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యాటక , ఆధ్యాత్మిక కేంద్రాలను చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. పుష్కర స్నానాలు పూర్తిచేసి పర్యాటక కేంద్రాల సందర్శనలకు బయల్దేరుతున్నారు. గోదావరి అందాలను చూసి ఆనందలో మునిగితేలుతున్నారు. కాటన్దొర గొప్పదనాన్ని కొనియాడుతున్నారు. ప్రకృతి సౌందర్యానికి నెలవైన పాపికొండలు, పట్టిసీమ ప్రాంతాలను సందర్శిస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజినీ చూసేందుకు వస్తున్నారు. బ్యారేజీ పక్కనే ఉన్న కాటన్ మ్యూజియాన్ని సందర్శిస్తున్నారు. బొమ్మూరు మిట్టలో కాటన్దొర నివాసమున్న ఇంటిని సైతం సందర్శిస్తున్నారు. ఇక రాజమండ్రి గోదావరి ఒడ్డున ఉన్న ఇస్కాన్‌టెంపుల్, కందుకూరి వీరేశలింగం పంతులు నివాస గృహాన్ని పుష్కర యాత్రికులు పెద్ద ఎత్తున సందర్శిస్తున్నారు. ప్రభుత్వ పురావస్తు శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న రాల్లబండి సుబ్బారావు పురావస్తు ప్రదర్శనశాలను సైతం పుష్కర యా త్రికులు సందర్శిస్తున్నారు. మ్యూజియంలోని శిల్పకళను తిలకిస్తున్నారు. వీటితో పాటు ఉభయ గోదారిజిల్లాలలోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను, పర్యాటక ప్రాంతాలను సైతం పుష్కర భక్తులు పెద్ద ఎత్తున సందర్శిస్తున్నారు. -
టెంపుల్ సిటీగా యాదగిరిగుట్ట
తిరుమలకు దీటుగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి కేసీఆర్ రెండు వేల ఎకరాల భూ సేకరణ, 400 ఎకరాల్లో జింకల పార్కు 1600 ఎకరాల్లో కాటేజీలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, అతిథి గృహాలు,మండపాలు, పార్కులు లక్ష్మీనారసింహుడిని దర్శించుకున్న కేసీఆర్ ఏటా బ్రహ్మోత్సవాలకు ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పిస్తామని ప్రకటన నల్లగొండ: తిరుమల తిరుపతి దేవస్థానానికి దీటుగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. రెండు మూడేళ్లలో యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అన్ని హంగులతో టీటీడీ తరహాలో అభివృద్ధి పరిచి ‘టెంపుల్ సిటీ’గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ‘దేవస్థానం పరిధిలో 386 ఎకరాల రిజర్వు అటవీ భూమి ఉంది. మరో 2000 ఎకరాల భూమిని సేకరిస్తాం. 400 ఎకరాల్లో జింకల పార్కు ఏర్పాటు చేస్తాం. మిగతా 1600 ఎకరాల్లో ఆధ్యాత్మిక కేంద్రాలు, వేద పాఠశాల, విల్లాలు, అతిథి గృహాలు, ఉద్యానవన కేంద్రాలు, కాటేజీలు, పార్కులు, కల్యాణ మండపాలు నిర్మించి యాదగిరిగుట్టలో పూర్తి ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా చర్యలు చేపడతాం’ అని కేసీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహస్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రికి వేదపండితులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆండాళ్నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. టీటీడీకి ప్రణాళిక రూపకల్పన చేసిన దమ్మన్నను పిలిపించి పక్కా డిజైన్ రూపొందిస్తామన్నారు. గర్భగుడి గోపురం ఎత్తు పెంచి స్వర్ణ గోపురంగా మార్చుతామని తెలిపారు. దేవాలయ మండపం ఇరుకుగా ఉన్నందున ఉత్తర, దక్షిణాలను విస్తరిస్తామని, తపత్తుల ఆదేశాలు, సూచనల మేరకు గుడిలో అన్ని నిర్మాణాలను శాస్త్రోక్తంగా పూర్తి చేస్తామని చెప్పారు. దేవాలయ పరిధిలో 113 ఎకరాల బంజరు భూమి ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నదని, దాన్ని దేవస్థానానికి అప్పగిస్తామని సీఎం పేర్కొన్నారు. గుట్ట చుట్టు పక్కల నిర్మాణాలు, కొండలు ఆలయంకన్నా ఎక్కువ ఎత్తులో కనిపిస్తున్నాయని, అలా కాకుండా వాటిని తొలగించి, దేవస్థానం బయటకు కనిపించేలా నిర్మాణాలు చేపడతామన్నారు. యాదగిరిగుట్టను అత్యంత సుందరంగా అభివృద్ధి చేయడంతో పాటు, టీటీడీ మాదిరి దేవస్థానానికి స్వయం ప్రతిపత్తి(అటానమస్) హోదాను కల్పిస్తామన్నారు. దేవస్థాన అభివృద్ధికి తెలంగాణలో ఉన్న పారిశ్రామిక సంస్థలు, కార్పొరేట్ దిగ్గజాలు, దాతలు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. ఇప్పటి నుంచి బ్రహ్మోత్సవాలకు స్వయంగా ముఖ్యమంత్రే ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించే ఆనవాయితీని అమలు చేస్తామన్నారు. గుడి పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం, పందులు సంచరించడం శుభప్రదం కానందున, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఈ పనుల నిమిత్తం స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల సహకారంతో వెయ్యి మంది టీఆర్ఎస్ కార్యకర్తలు శ్రమదానం చేసేందుకు ముందుకురావాలని సూచించారు. 15 రోజుల్లో మళ్లీ వచ్చి దేవస్థానం పరిసరాలను పరిశీలిస్తానన్నారు. స్థానికులకు పట్టాలు.. ఉద్యోగుల క్రమబద్ధీకరణ గుట్టకు దిగువ భాగంలోని గాంధీనగర్‌లో 73 ఇళ్ల నిర్మాణానికి అనుమతిస్తూ పట్టాలు జారీ చేస్తామని సీఎం పేర్కొన్నారు. దేవస్థానంలో పనిచేస్తున్న 43 మంది ఎన్ఎంఆర్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. జైన్ ట్రస్ట్ సహకారంతో రూ. 3 వేల కోట్లతో సైదాపూరం, మాసాయిపేట గ్రామాల పరిధిలో ఆధ్యాత్మిక కేంద్రాలు ఏర్పాటు చేయాలనే యోచన ఉందన్నారు. ఆ సంస్థ కోరిక మేరకు రాయితీలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. కేసీఆర్‌తో పాటు మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. గుట్ట పరిసరాల్లో ఏరియల్ సర్వే సీఎం కేసీఆర్ హెలికాప్టర్లో యాదగిరిగుట్టకు వచ్చారు. సమీపంలోని సైదాపురం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు ఉదయం 11.46 గంటలకు చేరుకున్నారు. అక్కడ హెలికాప్టర్ నుంచి మంత్రి జగదీశ్‌రెడ్డి మాత్రమే దిగారు. కేసీఆర్ అం దులోనే ఉండగా, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, శేఖర్‌రెడ్డి, కలెక్టర్ చిరంజీవులు హెలికాప్టర్ ఎక్కారు. అనంతరం 25నిమిషాల పాటు యాదగిరి గుట్ట చుట్టూ సుమారు 5 కిలోమీటర్ల పరిధి లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఏరియ ల్ సర్వే నిర్వహించారు. యాదగిరిగుట్ట, కొలనుపాక, గంధమల్లచెరువు అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను ఎంపీ, ఎమ్మెల్యే లు హెలికాప్టర్లోనే సీఎంకు వివరించారు.