టెంపుల్ సిటీగా యాదగిరిగుట్ట
తిరుమలకు దీటుగా తీర్చిదిద్దుతాం: ముఖ్యమంత్రి కేసీఆర్
రెండు వేల ఎకరాల భూ సేకరణ, 400 ఎకరాల్లో జింకల పార్కు
1600 ఎకరాల్లో కాటేజీలు, ఆధ్యాత్మిక కేంద్రాలు,
అతిథి గృహాలు,మండపాలు, పార్కులు
లక్ష్మీనారసింహుడిని దర్శించుకున్న కేసీఆర్
ఏటా బ్రహ్మోత్సవాలకు ముత్యాల తలంబ్రాలు,
పట్టువస్త్రాలు సమర్పిస్తామని ప్రకటన
నల్లగొండ: తిరుమల తిరుపతి దేవస్థానానికి దీటుగా యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని అభివృద్ధి చేయనున్నట్లు ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు వెల్లడించారు. రెండు మూడేళ్లలో యాదగిరిగుట్ట దేవస్థానాన్ని అన్ని హంగులతో టీటీడీ తరహాలో అభివృద్ధి పరిచి ‘టెంపుల్ సిటీ’గా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ‘దేవస్థానం పరిధిలో 386 ఎకరాల రిజర్వు అటవీ భూమి ఉంది. మరో 2000 ఎకరాల భూమిని సేకరిస్తాం. 400 ఎకరాల్లో జింకల పార్కు ఏర్పాటు చేస్తాం. మిగతా 1600 ఎకరాల్లో ఆధ్యాత్మిక కేంద్రాలు, వేద పాఠశాల, విల్లాలు, అతిథి గృహాలు, ఉద్యానవన కేంద్రాలు, కాటేజీలు, పార్కులు, కల్యాణ మండపాలు నిర్మించి యాదగిరిగుట్టలో పూర్తి ఆధ్యాత్మిక శోభ సంతరించుకునేలా చర్యలు చేపడతాం’ అని కేసీఆర్ పేర్కొన్నారు. శుక్రవారం ఆయన నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహస్వామి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముఖ్యమంత్రికి వేదపండితులు ఆలయ సంప్రదాయం ప్రకారం ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆండాళ్‌నిలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ మాట్లాడారు. టీటీడీకి ప్రణాళిక రూపకల్పన చేసిన దమ్మన్నను పిలిపించి పక్కా డిజైన్ రూపొందిస్తామన్నారు.
గర్భగుడి గోపురం ఎత్తు పెంచి స్వర్ణ గోపురంగా మార్చుతామని తెలిపారు. దేవాలయ మండపం ఇరుకుగా ఉన్నందున ఉత్తర, దక్షిణాలను విస్తరిస్తామని, తపత్తుల ఆదేశాలు, సూచనల మేరకు గుడిలో అన్ని నిర్మాణాలను శాస్త్రోక్తంగా పూర్తి చేస్తామని చెప్పారు. దేవాలయ పరిధిలో 113 ఎకరాల బంజరు భూమి ఉన్నట్లు రికార్డుల్లో ఉన్నదని, దాన్ని దేవస్థానానికి అప్పగిస్తామని సీఎం పేర్కొన్నారు. గుట్ట చుట్టు పక్కల నిర్మాణాలు, కొండలు ఆలయంకన్నా ఎక్కువ ఎత్తులో కనిపిస్తున్నాయని, అలా కాకుండా వాటిని తొలగించి, దేవస్థానం బయటకు కనిపించేలా నిర్మాణాలు చేపడతామన్నారు. యాదగిరిగుట్టను అత్యంత సుందరంగా అభివృద్ధి చేయడంతో పాటు, టీటీడీ మాదిరి దేవస్థానానికి స్వయం ప్రతిపత్తి(అటానమస్) హోదాను కల్పిస్తామన్నారు. దేవస్థాన అభివృద్ధికి తెలంగాణలో ఉన్న పారిశ్రామిక సంస్థలు, కార్పొరేట్ దిగ్గజాలు, దాతలు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. ఇప్పటి నుంచి బ్రహ్మోత్సవాలకు స్వయంగా ముఖ్యమంత్రే ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించే ఆనవాయితీని అమలు చేస్తామన్నారు. గుడి పరిసర ప్రాంతాల్లో చెత్తాచెదారం, పందులు సంచరించడం శుభప్రదం కానందున, పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను కేసీఆర్ ఆదేశించారు. ఈ పనుల నిమిత్తం స్థానిక ఎమ్మెల్యే, ఎంపీల సహకారంతో వెయ్యి మంది టీఆర్‌ఎస్ కార్యకర్తలు శ్రమదానం చేసేందుకు ముందుకురావాలని సూచించారు. 15 రోజుల్లో మళ్లీ వచ్చి దేవస్థానం పరిసరాలను పరిశీలిస్తానన్నారు.
స్థానికులకు పట్టాలు.. ఉద్యోగుల క్రమబద్ధీకరణ
గుట్టకు దిగువ భాగంలోని గాంధీనగర్‌లో 73 ఇళ్ల నిర్మాణానికి అనుమతిస్తూ పట్టాలు జారీ చేస్తామని సీఎం పేర్కొన్నారు. దేవస్థానంలో పనిచేస్తున్న 43 మంది ఎన్‌ఎంఆర్ ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామని తెలిపారు. జైన్ ట్రస్ట్ సహకారంతో రూ. 3 వేల కోట్లతో సైదాపూరం, మాసాయిపేట గ్రామాల పరిధిలో ఆధ్యాత్మిక కేంద్రాలు ఏర్పాటు చేయాలనే యోచన ఉందన్నారు. ఆ సంస్థ కోరిక మేరకు రాయితీలు ఇచ్చే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. కేసీఆర్‌తో పాటు మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నేతలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
గుట్ట పరిసరాల్లో ఏరియల్ సర్వే
సీఎం కేసీఆర్ హెలికాప్టర్‌లో యాదగిరిగుట్టకు వచ్చారు. సమీపంలోని సైదాపురం గ్రామ శివారులో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు ఉదయం 11.46 గంటలకు చేరుకున్నారు. అక్కడ హెలికాప్టర్ నుంచి మంత్రి జగదీశ్‌రెడ్డి మాత్రమే దిగారు. కేసీఆర్ అం దులోనే ఉండగా, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, శేఖర్‌రెడ్డి, కలెక్టర్ చిరంజీవులు హెలికాప్టర్ ఎక్కారు. అనంతరం 25నిమిషాల పాటు యాదగిరి గుట్ట చుట్టూ సుమారు 5 కిలోమీటర్ల పరిధి లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై ఏరియ ల్ సర్వే నిర్వహించారు. యాదగిరిగుట్ట, కొలనుపాక, గంధమల్లచెరువు అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలను ఎంపీ, ఎమ్మెల్యే లు హెలికాప్టర్‌లోనే సీఎంకు వివరించారు.