
దేవాదాయ శాఖ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
మొత్తం 18 మందితో పాలక మండలి
ఆలయ పాలనపరమైన నిర్ణయాలన్నీ బోర్డు పరిధిలోనే..
వేములవాడ, భద్రాచలం ఆలయాలకూ బోర్డు ఏర్పాటు చేయాలని సభ్యుల విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: యాదగిరిగుట్ట దేవాలయానికి తిరుమల తిరుపతి దేవస్థానాల తరహాలో పాలక మండలిని ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమమైంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ప్రవేశపెట్టిన తెలంగాణ ధార్మిక హిందూ మత సంస్థల, ధర్మాదాయాల చట్టం–1987 సవరణ బిల్లుకు శాసనసభ మంగళవారం ఆమోదం తెలిపింది. సాలీనా రూ.100 కోట్లకుపైగా ఆదాయం ఉన్న ఆలయాలకు పాలకమండళ్లను నియమించేందుకు ఇది వీలు కల్పించనుంది.
18 మందితో బోర్డు..
యాదగిరిగుట్ట ఆలయానికి ఏర్పాటు చేయబోయే బోర్డు చైర్మన్‌ను ప్రభుత్వం నియమిస్తుంది. దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి, దేవాదాయ శాఖ కమిషనర్ సభ్యులుగా, దేవాలయ కార్యనిర్వహణాధికారి సభ్య కార్యదర్శిగా, యాదగిరిగుట్ట దేవాలయ అభివృద్ధి ప్రాధికార సంస్థ (వైటీడీఏ) వైస్ చైర్మన్, వ్యవస్థాపక ధర్మకర్త (ఓటు వేయు హక్కు కలిగి ఉంటారు) తదితరులు సభ్యులుగా ఉంటారు. వీరే కాకుండా మరో 9 మందితో కలిపి మొత్తం 18 మందిని ప్రభుత్వం నియమిస్తుంది.
ఇందులో ఒకరు శాసనమండలి సభ్యులు, ఒక ఎస్సీ, ఒక బీసీ వర్గాలకు చెందిన వారు, కనీసం ఒక మహిళ ఉండాల్సి ఉంటుంది. ఆలయ స్థానాచార్యులు కూడా బోర్డు సభ్యుడిగా కొనసాగుతారు. బోర్డుకు సహాయ సహకారాలు అందించేందుకు తొలి రెండేళ్ల పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.. మొదటి ఐదేళ్ల కాలానికి యాదాద్రి భువనగిరి కలెక్టర్ కూడా సభ్యులుగా కొనసాగుతారు. దేవాలయ పాలనపరమైన నిర్ణయాలన్నీ ఈ బోర్డే తీసుకుంటుంది.
వైటీడీ పేరుపై అభ్యంతరం!
యాదగిరిగుట్ట దేవస్థానాన్ని వైటీడీ అని ప్రభుత్వం బిల్లులో ప్రస్తావించింది. బిల్లుపై చర్చలో పలువురు సభ్యులు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేశారు. టీటీడీ అంటే తిరుమల తిరుపతి దేవస్థానాలు అని.. వైటీడీ అంటే యాదగిరిగుట్ట టెంపుల్ దేవాలయమా? అని బీజేపీ సభ్యుడు హరీశ్‌బాబు ప్రశ్నించారు. టీటీడీ తరహాలో ధ్వనించేలా పోటీగా ఆ పేరు పెట్టినట్టు కనిపిస్తోందని పేర్కొన్నారు. కాగా యాదగిరిగుట్ట అభివృద్ధి అథారిటీ మనుగడ ఉండనందున.. దేవస్థానం పేరును వైజీడీ (యాదగిరిగుట్ట దేవస్థానం)గా మార్చాలని కాంగ్రెస్ సభ్యుడు రాజగోపాల్‌రెడ్డి సూచించారు.
కేసీఆర్ పేరు చిరస్థాయిలో ఉంటుంది..
యాదగిరిగుట్ట బోర్డులో ఎమ్మెల్సీ సభ్యుడు/సభ్యురాలు ఉండనున్నట్టు బిల్లులో ఉందని.. ఓ ఎమ్మెల్యేకు కూడా సభ్యత్వం కల్పించాలని బీఆర్‌ఎస్ సభ్యుడు హరీశ్‌రావు కోరారు. యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం చేపట్టిన మాజీ సీఎం కేసీఆర్ పేరును మంత్రి ప్రస్తావించకపోవడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే కేసీఆర్ పేరు చరిత్రలో నిలిచిపోతుందని, తెలంగాణ ఇచ్చిన వ్యక్తిగా సోనియా పేరు చిరస్థాయి అయినట్టు, యాదగిరిగుట్ట ఆలయ పునర్నిర్మాణం విషయంలో కేసీఆర్ పేరు ఉంటుందని మంత్రి కొండా సురేఖ సమాధానంగా చెప్పారు.
ఇక ఉమ్మడి నల్గొండలో ఎస్టీల జనాభా అధికంగా ఉన్నందున.. బోర్డులో ఓ ఎస్టీ కూడా ఉండేలా చూడాలని హరీశ్‌రావుతోపాటు బీజేపీ సభ్యుడు హరీశ్‌బాబు విజ్ఞప్తి చేశారు. వేములవాడ, భద్రాచలం, బాసర, కొండగట్టు దేవాలయాలకు కూడా ట్రస్టుబోర్డులను ఏర్పాటు చేయాలని సీపీఐ సభ్యుడు కూనంనేని సాంబశివరావు, కాంగ్రెస్ సభ్యుడు ఆది శ్రీనివాస్, బీజేపీ సభ్యుడు హరీశ్‌బాబు తదితరులు కోరారు.
యాదగిరిగుట్ట వేద పాఠశాలను విశ్వవిద్యాలయం స్థాయికి పెంచాలని, హిందూ ధర్మ ప్రచార పరిషత్ నిధులను కోటి నుంచి రూ.5 కోట్లను పెంచాలని బీఆర్‌ఎస్ సభ్యుడు వేముల ప్రశాంత్‌రెడ్డి కోరారు. ఈ బిల్లుకు మద్దతు తెలుపుతున్నామని.. నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ రూ.82 వేల నగదు, ముఖరంజా భార్య ఇజ్రా రూ.8 లక్షల విలువైన ఆభరణాలను యాదగిరిగుట్ట దేవాలయానికి గతంలో సమరి్పంచారని మజ్లిస్ సభ్యుడు కౌసర్ మొహియుద్దీన్ పేర్కొన్నారు.
‘గుట్ట’ వార్షికాదాయం రూ.224 కోట్లు..
యాదగిరిగుట్టలో కనీస వసతులు కూడా లేకపోవటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న తీరు చూసి.. గత 15 నెలల్లో పలు వసతులు కల్పించామని మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణ వసతి వల్ల కూడా దేవాలయానికి వచ్చే భక్తుల సంఖ్య పెరిగిందన్నారు. ప్రస్తుతం ఆలయ వార్షికాదాయం రూ.224 కోట్లకు చేరిందని వెల్లడించారు.
దళితవాడల్లో యాదగిరీశుడి కల్యాణోత్సవాల నిర్వహణపై దృష్టి సారిస్తామని తెలిపారు. రూ.42 కోట్ల నిధులతో బాసర ఆలయ అభివృద్ధి పనులు ప్రారంభిస్తామని.. గోదావరి, సరస్వతీ పుష్కరాలకు ఏర్పాట్లు ప్రారంభిస్తున్నామని వెల్లడించారు. బ్రాహ్మణ పరిషత్తును బలోపేతం చేస్తామని, ధూపదీప నైవేద్య పథకం చెల్లింపుల్లో పెండింగ్ లేకుండా చూస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment