
గవర్నర్‌కు ఆహ్వాన పత్రిక ఇస్తున్న ఈవో భాస్కర్‌రావు
గవర్నర్‌కు ఆహ్వానపత్రిక అందించిన ఆలయ ఈవో
యాదగిరిగుట్ట: మార్చి 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగే యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఆలయ ఈవో భాస్కర్‌రావు ఆహ్వానపత్రిక అందజేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలసి ప్రత్యేక ఆహ్వాన పత్రికతో పాటు శ్రీస్వామివారి లడ్డూ ప్రసాదం అందజేశారు. కాగా, బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఈవో భాస్కర్‌రావు తెలిపారు. కొండపైన గల తన కార్యాలయంలో ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై విలేకరుల సమావేశం నిర్వహించారు.
మార్చి 1న విష్వక్సేన ఆరాధన, స్వస్తివాచనంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని చెప్పారు. 7వ తేదీన ఎదుర్కోలు మహోత్సవం, 8న శ్రీస్వామి వారి తిరు కల్యాణ మహోత్సవం, 9న రథోత్సవం, 10న చక్రతీర్థ స్నాన వేడుకలు ఉంటాయన్నారు. 11వ తేదీన రాత్రి డోలోత్సవంతో వేడుకలు ముగుస్తాయని వివరించారు. 3వ తేదీ నుంచి శ్రీస్వామి వారి అలంకార, వాహన సేవలు ప్రారంభం అవుతాయని తెలిపారు. కాగా, బ్రహ్మోత్సవాల్లో భాగంగా సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు భక్తుల వాహనాలను కొండపైకి టోల్‌చార్జీ వసూలు చేయకుండా ఉచితంగా పంపించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన చెప్పారు.