తిరుమల వెంకన్నకు ‘తెలంగాణ ధగధగ’
♦ వజ్ర వైఢూర్యాలు, కెంపులతో సిద్ధమవుతున్న కిరీటం
♦ రెండు కిలోల బరువు... రూ.5.59 కోట్ల వ్యయం
♦ అపురూపంగా నిలిచిపోయేలా తయారీ
♦ ఈ నెలాఖరున స్వామికి సమర్పించనున్న సీఎం కేసీఆర్
♦ రూ.55 లక్షలతో సిద్ధమవుతున్న వరంగల్ భద్రకాళి కిరీటం
సాక్షి, హైదరాబాద్: వజ్రాలు, వైఢూర్యాలు, కెంపులతో నగిషీలు.. దాదాపు రెండు కిలోల బరువుతో ధగధగ మెరిసేలా బంగారు కిరీటం... కోనేటి రాయుడి ఆభరణాల్లో ఓ ముఖ్య నగగా నిలిచేలా రూపొందిస్తున్నారు. కృష్ణదేవరాయల కాలం నుంచి ఎన్నో నగలు ఏడుకొండలవాడికి అలంకారంగా మారగా.. ఇప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన అరుదైన కానుక స్వామి ఖాతాలో జమకాబోతోంది. మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ముగిసిన తర్వాత స్వయంగా సీఎం కేసీఆర్ తిరుమల వెళ్లి స్వామివారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున వజ్రాలు పొదిగిన బంగారు కిరీటాన్ని సమర్పించబోతున్నారు.
తిరుపతిలోనే సిద్ధమవుతున్న కానుక
తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తే వివిధ ఆలయాల్లోని దేవుళ్లకు నగలు చేయిస్తానని మొక్కుకున్నట్టు సీఎం కేసీఆర్ గత ఏడాది ప్రకటించిన విషయం తెలిసిందే. తిరుమల వెంకన్న, వరంగల్ భద్రకాళి అమ్మవారికి బంగారు కిరీటాలు, విజయవాడ కనకదుర్గ, తిరుపతి పద్మావతి అమ్మవార్లకు ముక్కుపుడకలు, వరంగల్ జిల్లాలోని కురవి వీరభద్రస్వామికి బంగారు మీసాలు చేయించి తెలంగాణ ప్రజల పక్షాన మొక్కులు తీర్చనున్నట్టు చెప్పారు. వీటికోసం దేవాదాయశాఖ నిధులను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ నగలను సిద్ధం చేస్తున్నారు. తిరుమల వెంకటేశ్వరస్వామి కిరీటాన్ని.. దాదాపు రెండు కిలోల బరువుతో వజ్రవైఢూర్యాలతో తీర్చిదిద్దుతున్నారు. దీనికి దాదాపు రూ.5.59 కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఇలాంటి కిరీటాలు చేయించటంలో ప్రత్యేక మెలకువలు అవసరం.
అలాంటి కిరీటాలు చేసిన అనుభవం ఉన్నందున దాని తయారీ బాధ్యతను టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం)కే అప్పగించారు. ప్రస్తుతం ఆ కిరీటం పనులు తుది దశలో ఉన్నాయి. దాంతోపాటు భద్రకాళి అమ్మవారి కిరీటం, పద్మావతి అమ్మవారి ముక్కుపుడకలను అక్కడ తయారు చేయిస్తున్నారు. మిగతావి స్థానికంగానే సిద్ధం చేస్తున్నారు. వీటి తయారీ తుది దశకు చేరుకుంది. వరంగల్ భద్రకాళి అమ్మవారి కిరీటానికి దాదాపు రూ.55 లక్షలు ఖర్చు చేస్తున్నారు. పద్మావతీ అమ్మవారు, విజయవాడ కనకదుర్గ అమ్మవారికి ముక్కుపుడకలకు 15 గ్రాములు చొప్పున బంగారాన్ని వాడుతున్నారు. నగల తయారీని పర్యవేక్షించేందుకు ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఈ వారంలో తిరుపతి వెళ్లనుంది. ఈ నెలాఖరుకు కేసీఆర్ తిరుమలకు వెళ్లి కిరీటాన్ని, ముక్కుపుడకను అందజేసి మొక్కు తీర్చుకోనున్నారు.