ఏలూరు మిషనరీ వసతి గృహంలో బాలిక ప్రసవం
నవజాతి శిశువును భవనం నుంచి విసిరేయడంతో ఉలికిపాటు
శిక్షణ పొందుతున్న వ్యక్తిపై అనుమానాలు
ఆసుపత్రికి బాధిత బాలిక
ఏలూరు టౌన్: ఏలూరు నగరంలోని ఒక మిషనరీ సంస్థకు చెందిన ఆధ్యాత్మిక శిక్షణ, వసతి గృహంలో ఆదివారం అమానుష ఘటన చోటుచేసుకుంది. ఈ భవనం నుంచి అప్పుడే పుట్టిన ఒక నవజాత శిశువును బయటకు విసిరేయడం స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనను సమీపంలోని ఓ అపార్ట్మెంట్లో ఉంటున్న ఓ మహిళ, పొరుగునున్న ఓ వాచ్‌మేన్ గమనించారు. దీంతో ఈ ఘటన దావానలంలా వ్యాపించింది.
స్థానికులు, పోలీసుల నుంచి సేకరించిన సమాచారం ప్రకారం.. ఏలూరు అశోక్‌నగర్‌లోని మిషనరీ ఆధ్యాత్మిక శిక్షణా వసతిగృహంలో అనేక ప్రాంతాలకు చెందిన బాలికలు, యువతులు సిస్టర్స్(నన్స్)గా శిక్షణ పొందుతుంటారు. ప్రసవించిన బాలిక కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన బాలికగా నిర్వాహకులు చెబుతున్నారు. ఈ బాలిక నగరంలోని ఓ మిషనరీ కళాశాలలో ఇంటర్ చదువుతోంది.
రోజూ వసతిగృహం నుంచి కళాశాలకు వెళ్లి వస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈ వసతి గృహం నుంచి అప్పుడే పుట్టిన పసికందును విసిరేయడం స్థానికులు గమనించారు. భవనంపైన బాలికలు నీళ్లతో రక్తపు మరకలు కడుగుతూ ఉన్న దృశ్యాలను వీరు వీడియో తీసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఏలూరు టూటౌన్ సీఐ రమణ సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లగా పసికందు విగతజీవిగా పడిఉండటాన్ని గమనించారు.
బిడ్డకు బొడ్డు కూడా ఊడకపోవటం, ఒంటినిండా రక్తపు మరకలు ఉండటంతో అప్పుడే జన్మించి ఉండవచ్చని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. వసతిగృహాన్ని కూడా పోలీసు అధికారులు పరిశీలించారు. బాధిత బాలిక ఉండే గదిని పరిశీలించి ఆమె స్నేహితులను విచారించారు.
ఏలూరు డీఎస్పీ డి. శ్రావణ్‌కుమార్ వసతిగృహ నిర్వాహకులతో మాట్లాడి హాస్టల్‌లోని పరిస్థితులను పరిశీలించారు. మరోవైపు.. వసతిగృహంలో ప్రసవించిన బాలికను చికిత్స నిమిత్తం 108లో ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. నవజాత శిశువు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
నిర్వాహకులు గమనించలేదా?
ఇక ఈ సంఘటనకు సంబంధించి ఆధ్మాత్మిక శిక్షణా కేంద్రంలోని మరో వసతిగృహంలో శిక్షణలో ఉన్న వ్యక్తిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మిషనరీ కేంద్రంలో శిక్షణ పొందుతున్న ట్రైనీ ఫాదర్లు తరచూ ఈ బాలికల వసతిగృహానికి వెళ్తుంటారని, ఈ క్రమంలోనే వారిలో ఒకరితో ఆమె సన్నిహితంగా ఉండడంతో బాలిక గర్భం దాల్చినట్లు తెలుస్తోంది.
మిషనరీ శిక్షణ, వసతిగృహంలో ఉంటున్న ఒక బాలిక గర్భం దాల్చి.. ప్రసవించే వరకూ ఆమెను ఇన్ని నెలలపాటు నిర్వాహకులు గమనించకపోవడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాలికలో చోటుచేసుకునే శారీరక మార్పులను సైతం అటు కళాశాలలో, ఇటు వసతిగృహంలో ఎవరూ గుర్తించకపోవటం అనుమానాలకు తావిస్తోంది. ఇక ప్రసవం సమయంలో బాధిత బాలికకు తోటి విద్యార్థినులే సహకరించారా? లేక నిర్వాహకుల ప్రమేయం ఉందా అనేది తేలాల్సి ఉంది.
పోలీసుల అదుపులో అనుమానితుడు?
ఏలూరు డీఎస్పీ శ్రావణ్‌కుమార్ మట్లాడుతూ వసతిగృహాన్ని పరిశీలించి కేసు నమోదుచేసి సమగ్ర దర్యాప్తు చేస్తున్నామన్నారు. కాగా, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment