కేంద్ర ప్రభుత్వ ఉన్నతాధికారి అక్షయ్ రౌత్
హైదరాబాద్: దేశంలో ప్రముఖ పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలను స్వచ్ఛ ఐకానిక్ స్థలాలుగా గుర్తించి వాటిని రూ.450 కోట్ల వ్యయంతో పర్యాటక అనుకూల ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ శాఖ డైరెక్టర్ జనరల్ అక్షయ్ రౌత్ వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సోమవారం స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ అనే అంశంపై జరిగిన జాతీయ స్థాయి సదస్సును జీహెచ్‌ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. దేశంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాల నుంచి వచ్చిన సీనియర్ అధికారులు, పలు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో మూడో దశ స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశాలను ప్రకటించారు. ఇందులో కణ్వాశ్రమ్ (ఉత్తరాఖండ్), బ్రహ్మసరోవర్ టెంపుల్(హరియాణా), శ్రీనాగ్‌వాసుకి ఆలయం (ఉత్తరప్రదేశ్), శబరిమల శ్రీధర్మసస్థ టెంపుల్ (కేరళ), శ్రీరాఘవేంద్రస్వామి మంత్రాలయం (ఆంధ్రప్రదేశ్), పాంగోంగ్‌త్సో(జమ్మూ కశ్మీర్), మన విలేజ్ (ఉత్తరాఖండ్), విదుర్‌కుటి టెంపుల్ (ఉత్తరప్రదేశ్), ఎమాకైథెల్ (మణిపూర్), హజార్ దువారి ప్యాలెస్ (పశ్చిమబెంగాల్)ఉన్నాయి. ఈసారి తెలంగాణ నుంచి ఏ ప్రాంతం ఎంపిక కాలేదు. మొత్తం మూడు దశల్లో 30 ప్రముఖ పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలను ఐకానిక్ ప్రాంతాలుగా గుర్తించి వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఒక్కో ప్రాంతానికి ఒక్కో కార్పొరేట్ సంస్థకు అప్పగించామని ఈ సందర్భంగా అక్షయ్ రౌత్ తెలిపారు.
చార్మినార్‌లో భారీ పాదచారుల ప్రాజెక్టు
జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ చార్మినార్ పరిసర ప్రాం తాల అభివృద్ధికి అతిపెద్ద పాదచారుల ప్రాజెక్ట్‌ను ప్రారంభించామన్నారు. చార్మినార్ వద్ద నిత్యం శానిటేషన్ చేపట్టామన్నారు. కార్పొరేట్ సంస్థల నిధుల విడుదలలో మరింత సరళీకృతంగా ఉండాలని తెలిపారు. చార్మినార్ పాదచారుల ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.35.10 కోట్ల జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం నిధులతో ఇన్నర్, ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం, అంతర్గత రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. స్వచ్ఛ ఐకానిక్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన అభివృద్ధి పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment