Historical Areas
-
తుపాకులు ఇంటిపేరుతో తుపాకీ పడితే ఆ కిక్కే...వేరుకదా
అవి ఆంగ్లేయులు పాలిస్తున్న రోజులు. ఉప్పు మీద ఆంక్షలు కొనసాగుతున్న వేళ.. ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడింది. ఆ సమయంలో ఆంగ్లేయులు మనవాళ్లనే రక్షణ కోసం వాడుకున్నారు. 18 ఏళ్లు దాటి ధృడంగా ఉన్న యువకులను మిలిటరీ, ఉప్పు కొఠార్లు వద్ద జవాన్లుగా ఎంపిక చేశారు. ఆ నాడు అలా రక్షణ కోసం పడిన అడుగులు నేడు దేశ భక్తి వైపు నడిపించాయి. చిత్రమేమిటంటే పూర్వీకుల నుంచి వంశపారపర్యంగా ఈ కొలువులు చేస్తున్న వారి ఇంటిపేరు ‘తుపాకుల’. దశాబ్దాలుగా దేశ రక్షణ వ్యవస్థలోనే అనేక విభాగాల్లో తుపాకుల వంశీయులు స్థిరపడి సేవలందిస్తున్నారు.ఆ వంశీయులే కాకుండా.. వారి అల్లుళ్లు సైతం ఇవే వ్యవస్థల్లో కొనసాగుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో పాటు భారతదేశ సరిహద్దుల్లోని ప్రతి బెటాలియన్‌లో తారసపడతారు. ఇంటి పేరును ఆయుధంగా మార్చుకుని వందలాది మంది తుపాకులు చేతపట్టారు. ‘తుపాకుల’ వంశం వివరాలు, వీరి దేశభక్తిని తెలుసుకుందామా మరి. సాక్షి ప్రతినిధి, ఒంగోలు: సముద్ర తీరప్రాంత గ్రామం కనపర్తి. దీనికి చారిత్రాత్మక గుర్తింపు ఉంది. పూర్వం ఈ గ్రామాన్ని కనకపురి పట్టణం అనేవారు. కార్తవ రాయుడు పాలించిన గడ్డ ఇది. ముత్యాలు, వజ్రాలు, రత్నాలను కుప్పలుగా పోసి అమ్మేవారని పూరీ్వకుల కథనం. ఇక్కడ పురావస్తు ఆనవాళ్లకు గుర్తుగా నంది విగ్రహాలు, బౌద్ధ మతానికి సంబంధించిన ఆనవాళ్లు కూడా ఉన్నాయి. అందుకే ఈ ప్రాంతంపై బ్రిటీష్ వాళ్ల కళ్లు పడ్డాయి. కనపర్తి, పెదగంజాం, దేవరంపాడు ప్రాంతాల్లో ఉప్పు పండించేవారు బ్రిటీష్ పాలకులు. బకింగ్ హాం కెనాల్ నుంచి ఉప్పును తమ దేశానికి తరలించే వారు. ఈ సమయంలో పెద్ద ఎత్తున ఉప్పు సత్యాగ్రహం ప్రారంభమైంది. ఆ తర్వాత కనపర్తికి పక్కనే ఉన్న దేవరంపాడులో నిర్వహించిన ఉప్పు సత్రాగ్రహానికి మహాత్మా గాంధీ వచ్చి స్వాతంత్య్ర సమర యోధులకు మద్దతు పలికారు కూడా. తమకు రక్షణగా ఉన్న బెటాలియన్లోకి, ఉప్పు పొలాల వద్ద రక్షణగా పనిచేసేందుకు స్థానికంగా ఉన్న తుపాకుల వంశీయులను గార్డులుగా నియమించుకున్నారు. వీరు దృఢంగా, భారీ కాయులుగా ఉండటంతో వారిని ప్రత్యేకంగా ఆ కొలువుల్లోకి తీసుకునేవారు. మరికొందర్ని బలవంతంగా బ్రిటీష్ మిలిటరీలోకి తీసుకెళ్లారు. బ్రిటీష్ హయాంలో కనపర్తిలో సాల్ట్ సూపరింటెండెంట్ కార్యాలయం కూడా ఉంది. ఆ సాల్ట్ కార్యాలయానికి ఎదురుగానే బ్రిటీష పోలీస్ క్వార్టర్స్ కూడా ఉండేవి. పోలీస్ క్వార్టర్స్ ప్రస్తుతం శిథిలమైపోయాయి. సాల్ట్ కార్యాలయం కూడా అవసాన దశకు చేరుకుంది. మిలిటరీ వాళ్లకు పెట్టింది పేరు కనపర్తి పెద్ద ఊరు కనపర్తి తోపు తొలుత మిలిటరీ, ఆ తర్వాత పోలీస్, కాలక్రమేణా ఇతర యూనిఫాం విభాగాల్లో సేవలు అందిస్తే.. కనపర్తి పెద్ద ఊరు మాత్రం మిలిటరీ ఉద్యోగాలకు పెట్టింది పేరు. ప్రస్తుతం 150 మందికిపైగా దేశ సేవలో పునీతులవుతున్నారంటే ఆ ఉద్యోగాలంటే ఎంత మక్కువో అర్థమవుతోంది. ఆ గ్రామం నుంచి నలుగురు మిలిటరీలో కెపె్టన్లుగా పదవీ విరమణ చేసిన వారున్నారు. వారిలో తుపాకుల వంశీయులతో కలిసి పాకిస్థాన్, బంగ్లాదేశ్, బర్మా, చైనా యుద్ధాల్లో పాల్గొన్న వారు కూడా ఉన్నారు. పులుగు వెంకటేశ్వరరెడ్డి, కుక్కల వెంకటేశ్వరరెడ్డి కెపె్టన్లుగా పనిచేశారు. వారు కాలక్రమేణా వయస్సు రీత్యా మృతి చెందారు. ఇకపోతే 33 సంవత్సరాల పాటు సేవలందించిన కుక్కల శివారెడ్డి, సూరిబోయిన వెంకటప్పలనాయుడు కూడా కెపె్టన్లుగా విధులు నిర్వర్తించారు. ప్రస్తుతం చాలా మంది బయట ప్రాంతాలకు వెళ్లి స్థిరపడ్డారు. మిలిటరీలో తొలి అడుగుతుపాకుల చెన్నయ్య ఆయన సోదరులు 1930 సంవత్సరానికి ముందు తుపాకుల చెన్నయ్య మొదటిసారిగా బ్రిటీష్ మిలిటరీలోకి వెళ్లారు. వాళ్లు నలుగురు సోదరులు. వాళ్లందరూ కూడా మిలిటరీలో దేశానికి సేవచేసిన వారే. తర్వాత ఆయన సంతానం పెద చెన్నయ్య, సోమయ్య, బంగారయ్యలు పోలీసులుగా విధులు నిర్వర్తించారు. ఆయనకు నలుగురు సంతానంలో తుపాకుల సుబ్బయ్య, రంగయ్య, వెంకటేశ్వర్లు, వీర రాఘవయ్యలు. వీళ్లందరూ కూడా పోలీసులే. ఈ నలుగురు సంతానంలో ఒక్కొక్క ఇంట్లో నలుగురు మొదలుకుని ఎనిమిది మంది వరకు పోలీసులుగా ప్రజలకు సేవలు అందించారు. ప్రతి ఇంట్లో పోలీసులే... కనపర్తి తోపు గ్రామంలో ఉన్న ప్రతి ఇంట్లో పోలీసులే కనపడతారు. తుపాకులతో పాటు ఆవుల, బొజ్జా అనే ఇంటిపేరు వారు కూడా తుపాకుల వారితో పోటీ పడి మరీ పోలీసులతో పాటు ఎక్సైజ్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ ఇలా యూనిఫాం విభాగాల్లోనే సేవలు అందించారు. కానిస్టేబుల్ మొదలుకుని ఏఎస్పీ వరకు అన్ని హోదాల్లో పనిచేసిన వారు ఇక్కడ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. గ్రామంలో ఎనిమిది వందల గడపలు ఉంటే యూనిఫాం లేని ఇల్లు ఉండదు. ఉమ్మడి రాష్ట్ర వ్యాప్తంగా ఏ నగరంలోనైనా, ఏ జిల్లా కేంద్రంలోనైనా తుపాకుల ఇంటి పేరు ఉన్న వారు పోలీసు కొలువుల్లో కనిపిస్తారంటే అతిశయోక్తి కాదు. తుపాకులు ఇంటిపేరుతో తుపాకీ పడితే ఆ కిక్కే...వేరుకదా పోలీస్ విభాగంలో ఉత్సాహంగా చేరాం నేను చిన్నతనంలో ఊరికి మిలిటరీ, పోలీస్ డ్రెస్సులు వేసుకుని బంధువులు వస్తుండేవారు. అది చూసి చిన్నప్పటి నుంచి పోలీస్ కావాలన్న ఆశ ఎక్కువగా ఉండేది. మా ముత్తాతలు మిలిటరీలో పనిచేశారు. ఆ తర్వాత మా తాతలు నలుగురు పోలీసులే. మా నాన్న వీరరాఘవయ్య పోలీస్ విభాగంలో పనిచేశారు. మా పెదనాన్నలు సుబ్బయ్య, రంగయ్య, వెంకటేశ్వర్లు కూడా పోలీస్ విభాగాల్లోనే పనిచేశారు. మా పెదనాన్నల కుమారులు, మా అన్నదమ్ములు పోలీస్ విభాగాల్లోనే పనిచేశారు. నేను ఎక్సైజ్ సెలక్షన్స్‌కు వెళ్లాను. మొదటి ప్రయత్నంలోనే ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఉద్యోగం వచ్చింది. ఎక్సైజ్ విభాగంలో ఏడాదిన్నర క్రితం ఎస్సైగా పదవీ విరమణ పొందాను. మా ఇంటి ఆడపిల్లల్ని అందరినీ పోలీస్ విభాగంలో పనిచేసిన వారికే ఇచ్చారు మా తల్లిదండ్రులు. అందరం సంతోషంగా ఉన్నాం. – తుపాకుల చెన్నకేశవరావు, రిటైర్డ్ ఎస్సై, ఎక్సైజ్ విభాగం ఏఎస్పీలుగా ముగ్గురు పదవీ విరమణ కనపర్తి గ్రామానికి చెందిన వారిలో ముగ్గురు ఏఎస్పీలుగా విధులు నిర్వర్తించి పదవీ విరమణ పొందారు. వారిలో తుపాకుల రామకృష్ణ ఏఎస్పీగా రిటైరై తెనాలిలో కుటుంబంతో స్థిరపడ్డారు. మరొకరు తుపాకుల వెంకటేశ్వరరావు ఏఎస్పీగా రిటైరై గుంటూరులో ప్రస్తుతం న్యాయవాద వృత్తిలో ఉన్నారు. ఇంకొకరు ఆవుల సుబ్బారావు ఏఎస్పీగా రిటైరై కాకినాడలో స్థిరపడగా, తుపాకుల మురళీకృష్ణ డీవైఎస్పీగా తిరుపతిలో పనిచేస్తున్నారు. ఇక సీఐ, ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, అటు పోలీస్, ఇటు ఎౖజ్, సెంట్రల్ ఎక్సైజ్, కస్టమ్స్ విభాగాల్లో వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. యూనిఫాం విభాగాలు కాకుండా ఇతర ప్రభుత్వ విభాగాల్లో కూడా పనిచేసిన, చేస్తున్న వారు కూడా ఉన్నారు. ఆడపిల్లలను పోలీసులకే ఇచ్చి వివాహం మొదటి నుంచి తుపాకుల వంశీయులు మిలిటరీ, పోలీస్ విభాగాల్లో పనిచేస్తున్నప్పటికీ వారి ఇంటి ఆడపడుచులను కూడా ఆయా విభాగాల్లో పనిచేస్తున్న వారికే ఇచ్చి సంబంధాలు కలుపుకున్నారు. ఆ విధంగా పుట్టినిల్లు, మెట్టినిల్లు యూనిఫాంలు ధరించే వారితో కలర్ఫుల్గా ఉండటాన్ని వారు కూడా స్వాగతించారు. మా వంశం మొత్తం మిలిటరీ, పోలీసులుగానే మా వంశం మొత్తం మిలిటరీ, పోలీస్ విభాగాల్లోనే పనిచేశారు. మా ముత్తాత కూడా మిలిటరీలో పనిచేశారని మా తాత చెప్పేవారు. మా తాత రాఘవయ్య బ్రిటీష్ వాళ్ల వద్ద జవానుగా పనిచేశారు. మా నాన్న కోటయ్య 1939లో బ్రిటీష్ వాళ్ల వద్ద జవానుగా పనిచేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అర్హతను బట్టి మిలిటరీలోకి, పోలీస్ విభాగంలోకి, ఎక్సైజ్ విభాగంలోకి వేరే ఇతర విభాగాల్లోకి పంపించారు. నేను పోలీస్ విభాగంలో కానిస్టేబుల్‌గా విధుల్లో చేరి 2010లో పదవీ విరమణ పొందాను. – బొజ్జా కృష్ణమూర్తి, రిటైర్డ్ ఏఎస్సై, పోలీస్ విభాగం -
మట్టి కొట్టుకుపోతున్న రాజమహళ్లు, గడీలు
సాక్షి నెట్వర్క్: దర్పానికి, రాజసానికి దర్పణంగా నిలిచిన చారిత్రక కట్టడాలు నిర్లక్ష్యంతో శిథిలమై నిశీథిలోకి జారుకుంటున్నాయి. అబ్బుర పర్చే నిర్మాణ శైలికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచి ఇప్పుడు నిర్వహణాలోపానికి తలవంచి మట్టికొట్టుకుపోతున్నాయి. రెండొందల ఏళ్ల సంస్థానాధీశుల పాలనలో అనేక ప్రత్యేకతలతో నిర్మాణమైన రాజమహళ్లు, గడీలుశిథిల వైభవానికి చిరునామాలవుతున్నాయి. 1948లో సంస్థానాల పాలన అంతమైన అనంతరం రాష్ట్రంలోని పలుచోట్ల సంస్థానాధీశులు ఆ భవనాలను ప్రజోపయోగ పనుల కోసం ప్రభుత్వానికి అప్పగించారు. వీటిల్లో గత యాభై ఏళ్లు సజావుగా కార్యకలాపాలు నిర్వహించారు. కానీ, కొంతకాలంగా వీటిలో కనీస నిర్వహణ కరువైంది. ఈ భవనాలు శిథిలమవుతున్న తీరుపై సంస్థానాధీశుల వారసు లతోపాటు చరిత్రకారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనాల పరిరక్షణతో పర్యాటకం పెరగటమేకాక ఈ తరానికి ఆర్కిటెక్చర్‌కు సంబంధించి కొత్తపాఠాలు చెప్పినట్లు అవుతుందని వారు అంటున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక ప్యాకేజీలు ప్రకటించి ఈ భవనాల వైభవాన్ని ముందు తరాలకు అందించేవిధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. కళ చెదిరిన.. రంగ్ మహల్ వనపర్తిలో నూటాఏభై ఎనిమిది ఏళ్ల క్రితం సరికొత్త నిర్మాణశైలితో సంస్థానాధీశుని కోసం నిర్మితమైన ‘రంగుమహల్’ ఇప్పుడు కళ తప్పింది. హైదరాబాద్ స్టేట్‌లో సొంత కరెన్సీ– అరబ్బులుసహా భారీ సైనిక బల గాలతో 152 గ్రామాల్లో 605 చద రపు మైళ్లు కలిగిన అతిపెద్ద సంస్థానం వన పర్తి. ఎత్తైన గోపురాలతో విదేశీ శిల్పుల ఆధ్వర్యంలో 1849లో ప్రారంభమైన ఈ భవననిర్మాణం 1864లో పూర్తయింది. ఇండియాలో విలీనమైన అనంతరం చివరి సంస్థానాధీశుడు రాజారామేశ్వర రావు దీన్ని ప్రభుత్వానికి అప్పగించారు. దీనిలో 1958లో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ చేతుల మీదుగా రాష్ట్రంలోనే తొలి పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించారు. అయితే భవనం నిర్వహణ లోపాలతో ఈ మధ్య పెచ్చులూడిపోతుండటంతో క్లాసులను వేరే చోటికి తరలించి ప్రస్తుతం పరిపాలన, గ్రంథాలయం కోసం వినియో గిస్తున్నారు. కళాత్మకమైన ఆర్చీలు ఇప్పటికీ చెదరలేదు. అయితే నిర్వహణ లోపాలతో గడీ మొదటి అంతస్తు మొత్తం శిథిలావస్థకు చేరుకుంది. తక్షణ మరమ్మతుల కోసం రూ.4.20 కోట్ల అంచనా వ్యయంతో ఫైలు ప్రభుత్వానికి పంపినా ఇప్పటివరకు ఆమోదం పొందలేదు. వనపర్తి సంస్థాన వారసురాలు నందినీరావు హైదరాబాద్‌లో విద్యాసంస్థలను నిర్వహిస్తున్నారు. గ్రామస్తులు నిలబెట్టుకున్న సిర్నాపల్లి 1910–13లలో నిజామాబాద్ జిల్లా సిర్నాపల్లిలో ఇండో– యూరోపియన్ నిర్మాణశైలితో గడీ నిర్మితమైంది. సిమెంట్, స్టీల్, కాంక్రీట్ వాడకుండా ఈ గడీని నిర్మించడం విశేషం. గడీకి ముందు భాగంలో ఇరువైపులా ఎత్తైన గోపురాలు, మధ్యలో రాజసం ఉట్టిపడేలా గంభీరంగా చూస్తూ నిలుచున్న రెండు సింహాలు ఉంటాయి. ఈ గడీ నిర్మాణంలో పూర్తిగా మట్టి, ఇటుకలు, రాళ్లు, డంగుసున్నం, పొడవాటి ఇనుప స్తంభాలు ఉపయోగించారు. గాలి, వెలుతురు ధారాళంగా ప్రసరించేందుకు వీలుగా ముఖద్వారం ఉత్తరం వైపు ఉండేలా నిర్మాణం చేపట్టారు. నిర్మాణ శైలి, వాడిన పదార్థాల మూలంగా ఈ గడిలో ఉష్ణోగ్రతలు సమతూకంగా ఉంటాయి. చలికాలం వెచ్చగా, వేసవికాలం చల్లగా ఉంటుంది. 1921లో జానకీబాయి మరణానంతరం బందిపోట్లు, రజాకార్ల దాడుల్లో ఇతర బంగ్లాలు ధ్వంసమైనప్పటికీ గడీ మాత్రం పటిష్టంగానే ఉంది. తదనంతర కాలంలో ఇది దాదాపు మూడు దశాబ్దాలకుపైగా ప్రభుత్వ పాఠశాలగా సేవలు అందించింది. దీనిని శీలం జానకీబాయి వారసులు గ్రామస్తుల విరాళాలతో కాపాడుకుంటూ వస్తున్నారు. గ్రామస్తులు రూ.20 వేల విరాళాలు, జానకీబాయి వారసురాలు అనురాధారెడ్డి రూ.60 వేలు అందించారు. గ్రామ పంచాయతీ నుంచి మరో రూ.5 లక్షలు ఖర్చు పెట్టి మరమ్మతులు చేయించి పెయింటింగ్ వేయించారు. ఉపాధిహామీ కింద దీనికి ఒక వాచ్‌మన్‌ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఈ గడీని పోటీ పరీక్షలకు సిద్ధపడే విద్యార్థుల కోసం గ్రంథాలయంగా మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు. జానకీబాయి వారసురాలు అనురాధారెడ్డి హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. దొంగల పాలైన.. ఇందారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం ఇందారం గడీ దొంగల పాలైంది. దేశ, విదేశాల నుంచి తెచ్చిన విలువైన సామగ్రి, కలపను ఎత్తుకుపోయారు. నిజాంరాజుకు నమ్మినబంటు అయినా గోనె వెంకట ముత్యంరావు ఆధ్వర్యంలో ఈ గడీని 1927లో హైదరాబాద్ స్టేట్‌లోనే ఓ ప్రత్యేకత శైలితో నిర్మించారు. ఈ గడీ కేంద్రంగా సిరోంచ, గడ్చిరోలి, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 300 గ్రామాల పాలన సాగేది. 1948లో నిజాం లొంగుబాటు తర్వాత గోనె వెంకట ముత్యంరావు కుటుంబం హైదరాబాద్‌కు తరలివెళ్లింది. (క్లిక్: తెలంగాణకే తలమానికం! ట్విన్ టవర్స్) టూరిజం సర్క్యూట్‌గా ఏర్పాటు చేయాలి ‘200 ఏళ్ల క్రితమే హైదరాబాద్ స్టేట్‌లో అత్యున్నత శైలిలో భవనాలు నిర్మించారు. అన్ని ప్రాంతాల్లోని సంస్థాన భవనాలపై ప్రభుత్వం తక్షణ శ్రద్ధ చూపి టూరిజం సర్క్యూట్‌గా ప్రమోట్ చేయాలి. దీనివల్ల ఆయా ప్రాంతాల ప్రాచుర్యంతోపాటు అనేకమందికి ఉపాధి కేంద్రాలుగా మారుతాయి’ –అనురాధారెడ్డి, కన్వీనర్, ఇంటాక్ -
చారిత్రక స్థలాలు పరాధీనం?
సాక్షి, హైదరాబాద్ : గోల్కొండ పక్కనే ఉన్న నయాఖిల్లాలో ఉన్న చారిత్రక ప్రాధాన్యమున్న భూములను గోల్ఫ్‌కోర్సుకు ఇచ్చేందుకు సన్నాహాలు జరుగుతున్నట్టు తెలుస్తోంది. ఆ ప్రాంతంలో గతంలో భారీ విస్తీర్ణంలో మొఘల్ గార్డెన్ తరహా నిర్మాణం ఉండేది. శతాబ్దాల క్రితమే అది భూమిలోకి కూరుకుపోయింది. దాన్ని సరిగ్గా 11 ఏళ్ల క్రితం గుర్తించి తవ్వకాలు ప్రారంభించారు. దాదాపు 14 ఎకరాల విస్తీర్ణంలో అలనాటి అద్భుత ఉద్యానవన నిర్మాణ ఆనవాళ్లు వెలుగు చూశాయి. దాని చుట్టూ ఇంకా మరో 16 ఎకరాల స్థలం ఉంది. అందులోనూ భూగర్భంలో నిర్మాణాలున్నాయి. ఇప్పుడు 14 ఎకరాల స్థలం మా త్రమే భారత పురావస్తు సర్వేక్షణ విభాగం పరిధిలో ఉంచి, మిగతాదాన్ని తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థ స్వాధీనం చేసుకోబోతోందని సమాచారం. ఆ ప్రాంతంలో చుట్టూ గోల్ఫ్ కోర్సు విస్తరించి ఉంది. మధ్య లో ఉన్న ఈ స్థలాన్ని కూడా తమకు అప్పగిస్తే గోల్ఫ్‌కోర్సును విస్తరిస్తామంటూ దాన్ని నిర్వాహక కమిటీ చాలాకాలంగా కోరుతోంది. ఖాళీగా ఉన్న 16 ఎకరాల్లో కొన్ని రోజులుగా శాస్త్రీయ పరిశోధనలో భాగంగా ఏఎస్ ఐ కందకాలు తవ్వుతోంది. భూగర్భంలో ఉన్న నిర్మాణ అవశేషాలను తెలుసుకుని, అంత ప్రాధాన్యమైనవి లేనట్టు తేలితే పరాధీనం చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే మీటరు నుంచి రెండు మీటర్ల మేర ఈ కందకాలను ప్రతి 30 అడుగుల నుంచి 60 అడుగులకొకటి చొప్పున తవ్వి చూస్తున్నారు. 14 ఎకరాల విస్తీర్ణంలో వెలుగు చూసిన భారీ ఉద్యానవనానికి సంబంధించి నీటి చానళ్లు, ఇతర అనుబంధ నిర్మాణాల అవశేషాలు వాటిల్లో కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఆ చానళ్లు వాడే అవసరం లేనందున, ఇతర నిర్మాణాల్లోనూ ముఖ్యమైనవి పెద్దగా లేవన్న ఉద్దేశంతో ఆ స్థలాన్ని తెలంగాణ పర్యాటకాభివృద్ధి సంస్థకు అప్పగిస్తూ, దానితో ఏఎస్ఐ ఒప్పందం చేసుకోనుందని విశ్వసనీయంగా తెలిసింది. దీనివల్ల గోల్ఫ్‌కోర్సు విస్తరణకు వీలుకలిగే అవకాశం ఉం టుంది. ఏఎస్ఐ రీజినల్ డైరెక్టర్ మహేశ్వరి ఇటీవలే అక్కడికి వచ్చి సర్వే చేసి వెళ్లారు. త్వరలో ఆమె నివేదిక ఇవ్వనున్నారు. క్రీ.శ.1600 పూర్వమే నిర్మాణం దేశంలో తాజ్‌మహల్, ఔరంగాబాద్‌లోని బీబీకా మఖ్బారా ముందు మొఘల్ గార్డెన్స్ ఉన్నాయి. పచ్చికబయళ్లు, ఫౌంటెన్లతో కూడిన ఆ ఉద్యానవనాలు అద్భుతంగా ఉంటాయి. వాటికంటే ముందే అంతకంటే గొప్పగా నయాఖిల్లా వద్ద ఉద్యానవనాన్ని నిర్మించారు. గోల్కొండ కోటకు అనుబంధంగా నయాఖిల్లా నిర్మాణం సమయంలో క్రీ.శ.1600 పూర్వమే ఈ వనం నిర్మించినట్టు హైదరాబాద్ స్టేట్‌లో పురావస్తు అధికారిగా పనిచేసిన గులాం యాజ్దానీ పరిశోధించి తేల్చారు. దాదాపు పదేళ్ల క్రితం చేపట్టిన తవ్వకాల్లో ఇవన్నీ వెలుగు చూశాయి. మధ్యలో కొంతకాలం పనులు నిలిపేసినా... గత నాలుగేళ్లుగా మళ్లీ జరుపుతున్నారు. రాష్ట్రం ఉమ్మడిగా ఉన్న సమయంలో ఏఎస్ఐ–పర్యాటకశాఖ మధ్య ఈ స్థలం విషయంలో ఒప్పందం జరిగింది. అలనాటి నిర్మాణ జాడలు లేని స్థలాన్ని పర్యాటకశాఖకు అప్పగించాలని, నిర్మాణాలుంటే అక్కడ ఎలాంటి కొత్త పనులు చేపట్టవద్దని నిర్ణయించారు. ఇప్పుడు కందకాలు తవ్వి పరిశీలిస్తుంటే 2 ఎకరాల మేర తప్ప నిర్మాణాలు విస్తరించి ఉన్నట్టు గుర్తించామని ఓ ఏఎస్ఐ అధికారి వ్యాఖ్యానించారు. -
విక్టోరియన్ గోథిక్‌కు గౌరవం
ముంబై/న్యూఢిల్లీ: ముంబైకి మరో చారిత్రక గుర్తింపు దక్కింది. నగరంలోని విక్టోరియన్ గోథిక్ (19వ శతాబ్దం), ఆర్ట్ డెకో (20వ శతాబ్దం) నిర్మాణ శైలుల్లో నిర్మించిన కట్టడాలకు యునెస్కో ప్రపంచ చారిత్రక కట్టడాల జాబితాలో స్థానం దక్కింది. ఇప్పటికే ముంబైలోని ఛత్రపతి శివాజీ టెర్మినస్ రైల్వే స్టేషన్ (2004), ఎలిఫెంటా గుహలు (1987) ఈ జాబితాలో ఉన్నాయి. బెహరైన్లోని మనామాలో జరుగుతున్న యునెస్కో ప్రపంచ చారిత్రక కమిటీ (డబ్ల్యూహెచ్‌సీ) 42వ సమావేశంలో భాగంగా శనివారం ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘డబ్ల్యూహెచ్‌సీ సైట్ల జాబితాలో ముంబైలోని విక్టోరియన్ గోథిక్, ఆర్ట్ డెకో నిర్మాణ శైలిలకు చోటుదక్కింది. భారత్‌కు అభినందనలు’ అని యునెస్కో ట్వీట్ చేసింది. 21 దేశాలు ఏకగ్రీవంగా.. ముంబైకి చెందిన ప్రముఖ ఆర్కిటెక్ట్ అభా నారాయణ్ లాంబా.. విక్టోరియన్ గోథిక్, ఆర్ట్ డెకో కట్టడాలకు సంబంధించిన చారిత్రక వివరాలను, గొప్పదనాన్ని రూపొందించి యునెస్కోకు నామినేషన్‌గా పంపారు. జాబితాలో ఈ2కట్టడాలకు చోటు దక్కడం భారత్‌కు, ముంబైకి దక్కిన గౌరవంగా ఆమె పేర్కొన్నారు. జాబితా రూపకల్పన సమయంలో డబ్ల్యూహెచ్సీలోని 21 సభ్యదేశాలు ఏకగ్రీవంగా ఈ రెండు కట్టడాలకు ఓటు వేశాయి. యునెస్కో నిర్ణయాన్ని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ మహేశ్ శర్మ, చరిత్రకారుడు రఫీక్ బగ్దాదీ, ఆర్కియాలజిస్టు కురుశ్ దలాల్ సహా చారిత్రక ప్రముఖులు స్వాగతించారు. తాజా నిర్ణయంతో భారత్‌లో ఉన్న డబ్ల్యూహెచ్‌సీ కట్టడాల సంఖ్య 37కు చేరింది. 1200 పేజీల నామినేషన్ ముంబైలోని ఓవల్ మైదాన్ దగ్గర్లోని చాలా భవనాలు విక్టోరియన్ గోథిక్ శైలిలో కట్టినవే. పాత సచివాలయం (1857–74), యూనివర్సిటీ లైబ్రరీ, కన్వెన్షన్ హాల్ (1874–78), బాంబే హైకోర్టు (1878), ప్రజాపనుల శాఖ కార్యాలయం (1872), వాట్సన్ హోటల్ (1869), డేవిడ్ ససూన్ లైబ్రరీ (1870), ఎల్ఫిన్‌స్టోన్ కాలేజ్ (1888) గోతిక్ శైలిలోని భవనాలే. నామినేషన్లను 1200 పేజీలతో మొత్తం మూడు అధ్యాయాలుగా పంపించారు. ఇందులో ఫొటోగ్రాఫ్‌లు, డ్రాయింగ్లు, వీటి ప్రత్యేకతలు ఉన్నాయి. చారిత్రక కట్టడాల జాబితాలో జపాన్, కొరియాలకు చెందిన కట్టడాలకూ చోటు దక్కింది. దేనికదే వైవిధ్యం విక్టోరియన్ గోథిక్ శైలిలో ప్రభుత్వ భవనాలు ఎక్కువగా ఉన్నాయి. ముంబై యూనివర్సిటీ, పాతసెక్రటేరియట్, పశ్చిమ రైల్వే ప్రధాన కార్యాలయం, బాంబే హైకోర్టు, ఛత్రపతి శివాజీ మహారాజ్ యూనివర్సిటీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ మ్యూజియం, మహారాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయం తదితర భవనాలు ఈ స్టైల్లో ఉన్నాయి. దాదాపు దక్షిణ ముంబైలో బ్రిటిష్ కాలంలో నిర్మించిన భవనాలు ఈ శైలివే. ఇలాంటి భవనాల నిర్మాణంలో తెలుగు కాంట్రాక్టర్లు కీలక పాత్ర పోషించారు. ఆర్ట్ డెకో శైలిలో భవంతులు, నివాస స్థలాలున్నాయి. మెరీన్ డ్రైవ్ పరిసరాల్లోని భవనాల్లో ఈ శైలి ఎక్కువగా కనబడుతుంది. బాడ్గే బాజార్ లోని క్రికెట్ క్లబ్ ఇండియా (సీసీఐ) కూడా ఈ శైలిలో నిర్మించిందే. ద రీగల్, ఎరోస్ సినిమా భవనాలు, మెరీన్ డ్రైవ్‌లోని మొదటి వరసలోని భవనాలకూ గుర్తింపు దక్కింది. -
450 కోట్లతో ఐకానిక్ ప్రాంతాల అభివృద్ధి
హైదరాబాద్: దేశంలో ప్రముఖ పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలను స్వచ్ఛ ఐకానిక్ స్థలాలుగా గుర్తించి వాటిని రూ.450 కోట్ల వ్యయంతో పర్యాటక అనుకూల ప్రాంతాలుగా అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వ డ్రింకింగ్ వాటర్, శానిటేషన్ శాఖ డైరెక్టర్ జనరల్ అక్షయ్ రౌత్ వెల్లడించారు. జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో సోమవారం స్వచ్ఛ ఐకానిక్ ప్లేసెస్ అనే అంశంపై జరిగిన జాతీయ స్థాయి సదస్సును జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్‌రెడ్డితో కలసి ఆయన ప్రారంభించారు. దేశంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాల నుంచి వచ్చిన సీనియర్ అధికారులు, పలు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో మూడో దశ స్వచ్ఛ ఐకానిక్ ప్రదేశాలను ప్రకటించారు. ఇందులో కణ్వాశ్రమ్ (ఉత్తరాఖండ్), బ్రహ్మసరోవర్ టెంపుల్(హరియాణా), శ్రీనాగ్వాసుకి ఆలయం (ఉత్తరప్రదేశ్), శబరిమల శ్రీధర్మసస్థ టెంపుల్ (కేరళ), శ్రీరాఘవేంద్రస్వామి మంత్రాలయం (ఆంధ్రప్రదేశ్), పాంగోంగ్‌త్సో(జమ్మూ కశ్మీర్), మన విలేజ్ (ఉత్తరాఖండ్), విదుర్కుటి టెంపుల్ (ఉత్తరప్రదేశ్), ఎమాకైథెల్ (మణిపూర్), హజార్ దువారి ప్యాలెస్ (పశ్చిమబెంగాల్)ఉన్నాయి. ఈసారి తెలంగాణ నుంచి ఏ ప్రాంతం ఎంపిక కాలేదు. మొత్తం మూడు దశల్లో 30 ప్రముఖ పర్యాటక, చారిత్రక, ఆధ్యాత్మిక కేంద్రాలను ఐకానిక్ ప్రాంతాలుగా గుర్తించి వాటిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడానికి ఒక్కో ప్రాంతానికి ఒక్కో కార్పొరేట్ సంస్థకు అప్పగించామని ఈ సందర్భంగా అక్షయ్ రౌత్ తెలిపారు. చార్మినార్‌లో భారీ పాదచారుల ప్రాజెక్టు జనార్దన్‌రెడ్డి మాట్లాడుతూ చార్మినార్ పరిసర ప్రాం తాల అభివృద్ధికి అతిపెద్ద పాదచారుల ప్రాజెక్ట్‌ను ప్రారంభించామన్నారు. చార్మినార్ వద్ద నిత్యం శానిటేషన్ చేపట్టామన్నారు. కార్పొరేట్ సంస్థల నిధుల విడుదలలో మరింత సరళీకృతంగా ఉండాలని తెలిపారు. చార్మినార్ పాదచారుల ప్రాజెక్ట్‌లో భాగంగా రూ.35.10 కోట్ల జేఎన్ఎన్యూఆర్ఎం నిధులతో ఇన్నర్, ఔటర్ రింగ్‌రోడ్డు నిర్మాణం, అంతర్గత రోడ్ల నిర్మాణం చేపట్టామన్నారు. స్వచ్ఛ ఐకానిక్ ప్రాజెక్ట్ కింద చేపట్టిన అభివృద్ధి పనులను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. -
బేలూరు ఆలయానికి ఉగ్ర బెదిరింపు
ఆలయం వద్ద భద్రత కట్టుదిట్టం సాక్షి, బెంగళూరు: హాసన్ జిల్లాలోని ప్రఖ్యాత బేలూరులోని చెన్నకేశవ స్వామి ఆలయానికి ఉగ్ర ముప్పు ఉందంటూ నిఘా వర్గాలు హెచ్చరికలు చేశాయి. ఈ నేపథ్యంలో బేలూరులోని చెన్నకేశవ స్వామి ఆలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. దేశంలోని ప్రముఖ, చారిత్రాత్మక ప్రాంతాలు, ఆలయాలను లక్ష్యంగా చేసుకొని ఉగ్రవాదులు దాడులకు పాల్పడనున్నారంటూ ఇటీవల నిఘా వర్గాలకు సమాచారం అందింది. ఉగ్రవాదుల జాబితాలో బేలూరులోని పురాతన చెన్నకేశవ స్వామి ఆలయం కూడా ఉందని నిఘా వర్గాలు గుర్తించాయి. దీంతో రాష్ట్ర హోం శాఖ అధికారులతో పాటు, ఆలయ అధికారులను సైతం అప్రమత్తం చేశాయి. ఈ నేపథ్యంలో ఆలయం చుట్టూ అసాధారణ భద్రతా ఏర్పాట్లను చేపట్టారు. ఆలయంలోకి ప్రవేశించే ప్రతి ఒక్కరినీ పూర్తి స్థాయిలో తనిఖీ చేసి అనంతరం ఆలయం లోనికి వెళ్లనిస్తున్నారు. ఆలయ ఆవరణలో దాదాపు 20 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసిన అధికారులు ఆలయంలోనికి వచ్చే ప్రతి ఒక్కరి కదలికలపై నిఘా ఉంచారు. ఇక బేలూరుకు చేరుకునే అన్ని దారుల్లోనూ చెక్‌పోస్ట్‌లను ఏర్పాటు చేసిన పోలీసులను విదేశీ, స్వదేశీ టూరిస్ట్‌ల వాహనాలన్నింటిని పూర్తిగా తనిఖీ చేసిన తర్వాతే బేలూరులోనికి అనుమతిస్తున్నారు. 2004లో సైతం ఆలయానికి బెదిరింపులు..... ఇక బేలూరులోని చెన్నకేశవ స్వామి ఆలయానికి 2004లో సైతం ఇదే తరహా బెదిరింపులు వచ్చాయి. ఆలయంలో బాంబు పెట్టి పేల్చేస్తామంటూ రాసిన బెదిరింపు లేఖ ఆలయ కార్యనిర్వాహక అధికారికి అందింది. దీంతో అప్పట్లో ఆలయం వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఆలయానికి నలువైపులా మెటల్ డిటెక్టర్లను సైతం ఏర్పాటు చేసి భద్రతను పర్యవేక్షించారు. ఇలా దాదాపు రెండేళ్ల పాటు చెన్నకేశవ స్వామి ఆలయానికి పూర్తిగా భద్రతా వలయంలో రక్షణ కల్పించారు అధికారులు. అనంతరం మెటల్ డిటెక్టర్లను తొలగించి సాధారణ భద్రతను ఏర్పాటు చేశారు. కాగా, ప్రస్తుతం ఉగ్రవాదుల బెదిరింపుల నేపథ్యంలో మరోమారు అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.