ఘనచరిత్రను ఇముడ్చుకున్న ఇందూరు చుట్టుపక్కల ప్రాంతాలు
పౌరాణిక ప్రాశస్త్యం, చారిత్రక నేపథ్యంతో బోధన్‌గా రూపాంతరం చెందిన ఏకచక్రపురం
నవసిద్ధుల నేపథ్యం నుంచి ఆర్మూర్‌గా మారిన నవనాథపురం
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: అశ్మక రాష్ట్రంగా ప్రస్థానాన్ని ప్రారంభించి.. ఇందూరు వరకు నామాంతరం చెందిన నిజామాబాద్ (Nizamabad) చుట్టుపక్కల ప్రాంతాలు పౌరాణిక, ప్రాచీన చారిత్రక నేపథ్యాన్ని ఇముడ్చుకున్నాయి. మంజీర, గోదావరి పరీవాహకంలో ఉండి ప్రాచీన కాలంలో ఏకచక్రపురంగా, బహుధాన్యపురంగా విరజిల్లి, ప్రస్తుతం సాధారణ పట్టణంగా ఉన్న బోధన్ (Bodhan) ఎనలేని ప్రాచీన చరిత్రను కలిగి ఉంది. అయితే దీని చరిత్ర నిరంతరం బయటపడుతూనే ఉంది. తవ్వకాలు చేయడంలో నిర్లక్ష్యం కారణంగా దీని చరిత్ర ఆశించిన స్థాయిలో వెలుగు చూడటం లేదనేది చరిత్రకారుల అభిప్రాయం. ఇక్కడ ఎన్ని తవ్వకాలు జరిపితే అంత చరిత్ర (History) బయటపడే అవకాశముంది. ఈ విషయంలో పాలకులు అంతగా దృష్టి సారించకపోవడంతో.. పట్టణం చుట్టుపక్కల ప్రాంతాల ఘనమైన చరిత్ర బయటకు రావడం లేదని పలువురి వాదన.
పౌరాణిక నేపథ్యం ప్రకారం ఈ ప్రాంతాన్ని పరశురాముడు(Parasu Ramudu) తన చక్రంతో రక్షించడంతో పాటు చక్రతీర్థమనే చెరువును నిర్మించడంతో ఏకచక్రపురంగా పేరుపొందినట్లు పలువురు చెబుతున్నారు. పౌరాణిక సాహిత్యంలో, జైన సాహిత్యంలో, బౌద్ధ సాహిత్యంలో బోధన్ ప్రాశస్త్యం ఉంది. మహాభారతంలో వసుమతి, పద్మపురం నామాలతో, జైన సాహిత్యంలో పోదనపురం నామంతో, బౌద్ధ సాహిత్యంలో పోదన నామంతో పేరొందింది. ఇక ప్రాచీన, మధ్యయుగాల్లో ఈ ప్రాంతం ధన సంపదలతో తులతూగడంతో.. బహుధాన్యపురం పేరుతో పిలిచినట్లు చరిత్ర చెబుతోంది. గొప్ప వర్తక కేంద్రంగా వర్ధిల్లినట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి అనేక శాసనాలు, పాత్రలు, శిల్పాలు, నాణేలు(Coins) లభించాయి.
అశ్మకుడనే రాజు పాలనలో..
ఈ ప్రాంతాన్ని అశ్మకుడనే రాజు పరిపాలించినట్లు మహాభారతంలో ప్రస్తావన ఉందని పలువురు చెబుతున్నారు. ఇక ఈ ప్రాంతాన్ని శాతవాహనులు, ఇక్ష్వాకులు, విష్ణుకుండినులు, వాకాటకులు, బాదామి చాళుక్యులు, రాష్ట్రకూటులు, కాకతీయులు, విజయనగర రాజులు, మరాఠా రాజులు, బహమనీ సుల్తానులు, గోల్కొండ రాజులు, మొఘలులు పరిపాలించారు. ఏకచక్రపురంగా, బహుధాన్యపురంగా చాలాకాలం పేరొందిన ఈ పట్టణం ప్రస్తుతం బోధన్ పేరుతో స్థిరపడింది. ఈ ప్రాంతం గురించి ఎంత శోధిస్తే అంత చరిత్ర బయటపడే అవకాశముందని చరిత్రకారులు స్పష్టం చేస్తున్నారు.
నాటి నవనాథపురం.. నేటి ఆర్మూర్
ప్రస్తుతం పసుపు పంట అత్యధికంగా పండించే ప్రాంతంగా ఉన్న ఆర్మూర్ (Armoor) ప్రాంతం సైతం ఘనమైన చరిత్రను కలిగి ఉంది. నవనాథపురంగా ప్రసిద్ధి చెందిన ఈ పట్టణం.. నేడు ఆర్మూర్ నామాంతరంతో స్థిరపడింది. ఆర్మూర్ పట్టణానికి దక్షిణ నైరుతి భాగంలో కొన్ని కిలోమీటర్ల మేర సిద్ధులగుట్ట విస్తరించి ఉంది. ఈ గుట్టపై నవనాథ సిద్ధులు తపస్సు చేశారు. దీంతో గుట్ట చుట్టూ ఉన్న ప్రాంతానికి నవనాథపురంగా పేరు వచ్చింది. కాలక్రమంలో నవనాథపురం నుంచి ఆర్మూర్‌గా నామాంతరం చెందింది.
వందల ఏళ్ల క్రితం దేశం నలుమూలల నుంచి నవనాథులైన గోరఖ్‌నాథ్, జలంధర్‌నా, చరఫట్‌నాథ్, అపభంగనాథ్, కానీషనాథ్, మచ్చింద్రనాథ్, చౌరంగీనాథ్, రేవనాథ్, బర్తరినాథ్ తదితరులు ఇక్కడికి వచ్చారు. నల్లని రాళ్లు పేర్చినట్లున్న ఈ గుట్టపై ఒక ఇరుకైన గుహలో తమ ఇష్టదైవమైన సిద్ధేశ్వరుడిని ప్రతిష్టించి పూజలు చేశారని ప్రతీతి. వారి పేరిట గుట్టకు నవనాథ సిద్ధుల గుట్టగా పేరు వచ్చింది. దీంతో గుట్టను ఆనుకున్న గ్రామానికి నవనాథపురంగా నామకరణం చేసుకున్నారు.
చదవండి: ఆ గుడిలో దేవుడు లేడు.. అయినా జనాల క్యూ!
కాలక్రమంలో ఈ తొమ్మిది మంది సాధువుల్లో ఆరుగురు ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. మిగిలిన ముగ్గురు సాధువులు ఇక్కడే ఉండి పూజలు చేయడంతో ఆరు.. మూరు.. అంటూ కాలక్రమంలో ఆర్మూర్‌గా పేరు స్థిరపడింది. మరికొందరు చరిత్రకారులు ఆర్మూర్ అనే పదం.. ఆరావం అనే పదం నుంచి వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం ఈ సిద్ధుల గుట్ట ఆధ్యాత్మికతకు చిరునామాగా మారింది.
Comments
Please login to add a commentAdd a comment