
నిజామాబాద్ మార్కెట్ యార్డులో ఈ రకం పసుపు వంగడమే ఎక్కువ
‘ఎర్ర గుంటూరు’సాగుకే అత్యధిక రైతుల మొగ్గు
సేలం, రాజాపురి, పీతాంబర్ సాగు చాలా స్వల్పం
కొత్త వంగడాల అభివృద్ధికి కమ్మర్‌పల్లి పసుపు పరిశోధన కేంద్రం కృషి
ఇరాన్, బంగ్లాదేశ్, అరబ్ దేశాలకు ఇందూరు పసుపు ఎగుమతులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పసుపు పంట కొనుగోళ్లలో రాష్ట్రంలోనే 70 శాతం వాటా కలిగిన నిజామాబాద్ మార్కెట్ యార్డుకు ప్రత్యేకత ఉంది. కానీ ఇక్కడికి వచ్చే పసుపు రకాల విషయానికి వస్తే 99 శాతం ‘ఎర్ర గుంటూరు’(ఆర్మూర్ రకం) ఉండటం విశేషం. నిజామాబాద్ జిల్లా తరువాత.. పసుపు ఎక్కువగా సాగు చేస్తున్న జగిత్యాల, నిర్మల్ జిల్లాల్లో సైతం ఎర్రగుంటూరు రకం వంగడాన్నే అత్యధిక శాతం రైతులు సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాలోని ‘దుగ్గిరాల ఎరుపు’రకం వంగడాన్ని తీసుకొచ్చి కమ్మర్‌పల్లి పరిశోధన కేంద్రంలో మరింత అభివృద్ధి చేశారు.
అప్పటినుంచి దీన్ని ఎర్ర గుంటూరు (ఆర్మూర్ రకం)గా పిలుస్తున్నారు. ‘ఎర్ర గుంటూరు’రకం వంగడం ఇక్కడి నేలకు సరిపోయిందని రైతులు చెబుతున్నారు. ఇందులో కర్కుమిన్ 3 శాతం లోపే ఉంటోంది. కాగా కర్కుమిన్ శాతం ఎక్కువగా ఉండే సోనాలి, రాజేంద్రసోని (బిహార్), పీతాంబర్ (ఉత్తరప్రదేశ్) రకాలను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చినప్పటికీ.. రైతులు మాత్రం స్థానికంగా అభివృద్ధి చేసిన ‘ఎర్ర గుంటూరు’రకం వైపే మొగ్గు చూపుతున్నారు. కేవలం 6 నెలల్లోనే పంట వచ్చే ప్రగతి, ప్రతిభ (కేరళ) పొట్టి రకాలను అందుబాటులోకి తీసుకొచ్చినప్పటికీ, ఈ రకాల్లో పసుపు బరువు ఎక్కువగా రావడం లేదని రైతులు ఆసక్తి చూపడం లేదు.
చూసేందుకు మంచిగా, ధర ఎక్కువగా పలికే ‘ఎర్ర గుంటూరు’రకమే మేలని రైతులు అంటున్నారు. దుంప ఎక్కువగా వచ్చే తమిళనాడు సేలం రకం వంగడాన్ని సైతం నామమాత్రంగానే సాగు చేస్తున్నారు. అయితే చాలా తక్కువ విస్తీర్ణంలో సాగు చేస్తున్న రాజాపురి, సేలం, పీతాంబర్ రకాలను రైతులు ఎక్కువగా మహారాష్ట్రలోని సాంగ్లి మార్కెట్‌కు తీసుకెళ్లి అమ్ముతున్నారు. ఈ రకాల్లో కర్కుమిన్ శాతం ఎక్కువగా ఉంటుంది. కాగా ‘ఎర్ర గుంటూరు’రకం పసుపును దేశీయంగా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. నిజామాబాద్ పసుపు బంగ్లాదేశ్, ఇరాన్, అరబ్ దేశాలకు సైతం ఎగుమతి అవుతోంది.
13 రకాలపై పరిశోధన
రాష్ట్రంలో ఏకైక కమ్మర్‌పల్లి పసుపు పరిశోధన కేంద్రంలో ప్రస్తుతం 13 రకాల పరిశోధనలు జరుగుతున్నాయి. అధిక కర్కుమిన్, దిగుబడి ఎక్కువ, తెగుళ్ల నివారణ, కీటకాలు, పురుగు నివారణ తదితర అంశాలను దృష్టిలో పెట్టుకుని ప్రయోగాలు చేస్తున్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఉద్యాన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నడుస్తున్న కమ్మర్‌పల్లి పసుపు పరిశోధన కేంద్రంలో.. పరిశోధనలకు భారత సుగంధ ద్రవ్యాల పరిశోధన సంస్థ (ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పైసెస్ రీసెర్చ్) నుంచి సూచనలు వస్తాయి. కేరళలోని ఆలిండియా కో–ఆర్డినేటెడ్ రీసెర్చ్ ప్రాజెక్ట్ ఆన్ స్పైసెస్ (ఏఐసీఆర్‌పీ)తో సమన్వయం చేసుకుంటూ.. కొన్ని పరిశోధనలు, రాష్ట్ర ఉద్యాన వర్సిటీ ఆధ్వర్యంలో మరికొన్ని పరిశోధనలు ఇక్కడ చేస్తున్నారు.
40 శాతం సాగు నిజామాబాద్ జిల్లాలో..
రాష్ట్రంలో అత్యధికంగా 40 శాతం నిజామాబాద్ జిల్లాలో సాగవుతోంది. తరువాత స్థానాల్లో జగిత్యాల, నిర్మల్, వరంగల్, వికారాబాద్, మహబూబాబాద్, హనుమకొండ, భూపాలపల్లి, ఆదిలాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లో సాగు చేస్తున్నారు. నిజామాబాద్ మార్కెట్‌కు 2019–20లో 10,78,821 క్వింటాళ్ల పసుçపు వచ్చింది. 2020–21లో 8,55,516 క్వింటాళ్లు, 2021–22లో 8,38,932 క్వింటాళ్లు, 2022–23లో 7,49,072 క్వింటాళ్లు, 2023–24లో 7,23,470 క్వింటాళ్ల పసుపు వచ్చిoది.
ఈ ఏడాది జనవరి చివరి వారంలో సీజన్ ప్రారంభమైంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు 6,74,055 క్వింటాళ్ల పసుపు నిజామాబాద్ మార్కెట్‌కు వచ్చిoది. గత ఏడాది కంటే 1.50 లక్షల క్వింటాళ్లు అధికంగా పసుపు రానుందని మార్కెటింగ్ అధికారులు చెబుతున్నారు. ఈ నెలాఖరుకు మరో 50 వేల క్వింటాళ్లు, ఏప్రిల్‌లో 85 వేల క్వింటాళ్లు, మే నెలలో మరో 65 వేల క్వింటాళ్ల పసుపు ఇక్కడి మార్కెట్‌కు రానున్నట్లు అధికారుల అంచనా.
గత ఏడాది రాష్ట్రంలో సగటున ఎకరానికి 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చిoది. ఈ ఏడాది దుంపకుళ్లు సోకక పోవడంతో ఎకరానికి 30 క్వింటాళ్ల దిగుబడి వస్తోంది. ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 45 వేల ఎకరాల్లో సాగు చేయగా, ఇందులో నిజామాబాద్ జిల్లాలో 22 వేల ఎకరాల్లో పసుపు సాగు చేశారు.