
చిందుల ఎల్లమ్మ ‘చిందు కళ’ వారసత్వాన్ని బతికిస్తున్న చిందుల శ్యాం కుటుంబం
కళను బతికించేందుకు రాష్ట్రవ్యాప్తంగా కృషి చేస్తున్న పరిమిత కుటుంబాలు
ప్రత్యేక ఆభరణాలు వాడుతున్న కళాకారులు
1981 నుంచి ప్రభుత్వం ద్వారా ప్రదర్శనలిస్తున్న చిందు బాగోతం బృందాలు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జానపద కళారూపాల్లో చిందు బాగోతానికి ప్రత్యేక స్థానముంది. చిందు బాగోతాన్ని బతికించేందుకు ఇందూరు జిల్లా కళాకారులు ఎనలేని కృషి చేస్తున్నారు. ‘చిందు కళాసింధు’గా పేరొందిన బోధన్ ప్రాంతానికి చెందిన చిందుల ఎల్లమ్మ వారసత్వాన్ని.. జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామానికి చెందిన పులింటి శ్యామ్ (చిందుల c) కుటుంబం కొనసాగిస్తోంది.
చిందుల శ్యామ్‌కు పద్మశ్రీ అవార్డు కోసం 2018లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. శ్యామ్ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. 2021లో శ్యామ్ మరణించగా.. ఆయన కుటుంబం ఈ కళను బతికించేందుకు కృషి చేస్తోంది. శ్యామ్ కుమారులు పులింటి కృష్ణయ్య, గంగాధర్, కృష్ణయ్యతో పాటు డిగ్రీ చదువుతున్న కుమార్తె పులింటి శరణ్య సైతం చిందు బాగోతం ప్రదర్శనలిస్తోంది.
అయిదో ఏట నుంచే శరణ్య చిందు కళను ప్రదర్శిస్తోంది. ఈ కళను బతికించడమే తన లక్ష్యమని శరణ్య చెబుతోంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో 40 బృందాలు, నిర్మల్, కరీంనగర్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో మరో 70 బృందాలు మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క బృందంలో 10 నుంచి 20 మంది కళాకారులు ఉన్నారు.
» 1981లో పేరిణి శివతాండవం కళాకారుడు నటరాజ రామకృష్ణ ఆధ్వర్యంలో చిందు బాగోతంపై నిజామా బాద్ జిల్లాలో సర్వే చేశారు. అప్పటి నుంచి గుర్తింపు వచ్చింది. 1983లో చిందు బాగోతం మేళాను నిర్వహించగా ఇందూరు జిల్లా కళా కారులు నాయకత్వం వహించారు. 1986లో ఢిల్లీలో అప్నా ఉత్సవ్‌లో ఆర్మూర్ ప్రాంత చిందు కళాకారుల ప్రదర్శ నను అప్పటి ప్రధాని రాజీ వ్‌గాంధీ, రష్యా నేత మిఖాయిల్ గోర్బ చేవ్‌లు తిలకించి అభినందించారు.
» చిందు బాగోతానికి నేపథ్యగానం ఉండ దు. పురాణాలను ఆకళింపు చేసుకుని.. సన్నివేశాలకు అనుగుణంగా భావోద్వేగా లను ప్రదర్శిస్తుంటారు. ఈ కళాకారులు తమ ఆభరణాలను ‘పాణికి’ (పునికి) కర్రతో తయారు చేసుకుంటారు. వీటి తయారీకి ఆరునెలల సమయం పడుతుంది. చిందు బాగోతానికి సంబంధించి నిజా మాబాద్, నిర్మల్ కళాకారులు తమకే ప్రత్యే కమైన సూర్యకిరీటం వినియోగిస్తున్నారు.
వీటితో పాటు భుజకీర్తులు(శంఖు చక్రా లు), కంఠసరి, పెద్దపేరు, చిన్నపేరు. జడ ల చిలుకలు, మల్లెదండలు, చేదస్తాలు, దు స్తులు ఉపయోగిస్తున్నారు. రామాయణం, మహాభారతం, భాగవతం కథలతో కళా ప్రదర్శనలు ఇస్తున్నారు. ప్రస్తుతం సాంస్కృతిక, దేవాదాయ శాఖలు సూచించిన చోట్ల ప్రదర్శనలు ఇస్తున్నారు.
ఇక చిందు బాగోతానికి చిరునామాగా ఉన్న చిందుల ఎల్లమ్మకు.. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ప్రతి ష్టాత్మక ‘హంస’ అవార్డుతో సత్కరించింది. చిందు బాగోతంలో స్త్రీ పాత్రలను సై తం పురుషులే ధరిస్తారు. అయితే చిందుల ఎల్లమ్మ మాత్రం.. స్త్రీ పాత్రలతో పాటు అన్నిరకాల పురుష పాత్రలు ధరించి ఈ కళకు చిరునామాగా నిలవడం విశేషం.
రాత్రిపూట రారాజులం.. తెల్లారితే బిచ్చగాళ్లం..
ప్రాచీన కళను బతికిస్తున్న మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలి. ప్రదర్శనలకు వెళ్తే.. రాత్రి పూట రారాజులం.. తెల్లవారితే బిచ్చగాళ్లం అనేలా మా పరిస్థితి తయారైంది. గురుశిష్య పరంపరలో నేర్చుకుని కళను బతికించేవారు వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఉన్నారు. వారసులే చిందు కళను బతికిస్తూ వస్తున్నారు. కళను బతికించేందుకు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. – పులింటి కృష్ణయ్య, మునిపల్లి, జక్రాన్‌పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా
Comments
Please login to add a commentAdd a comment