సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం పుట్టపాకలోని చేనేత హ్యాండ్లూమ్ క్లస్టర్ పరిధిలో తయారయ్యే తేలియా రుమాల్ వస్త్రానికి భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. ఇది దాదాపు పేటెంట్ హక్కుతో సమానం. ఈ నెల 10న చెన్నైలోని జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ కార్యాలయం ఆమోదం తెలపగా, ఈ విషయాన్ని జీఐ అధికారులు గురువారం పుట్టపాకకు చెందిన చేనేత కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధనాకు ఫోన్ ద్వారా తెలిపారు. తేలియా రుమాల్ అనే వస్త్రం ప్రాచీన కళకు సంబంధించింది. ఈ వస్త్రాన్ని సహజ రంగులు, ముడిపదార్థాలతో తయారు చేస్తారు. వేసవికాలం చల్లగా, చలికాలం వెచ్చగా ఉంటుంది.
పుట్టపాకలోని చేనేత కళాకారులు ఈ వస్త్రాన్ని అభివృద్ధి చేసి చీరలు, దుప్పట్లు, డ్రెస్ మెటీరియల్ రూపాల్లో తయారు చేస్తున్నారు. 2017లో హ్యాండ్లూమ్ క్లస్టర్ పేరు మీద జీఐ కోసం దరఖాస్తు చేశారు. జీఐ అధికారులు పలుమార్లు ఇక్కడికి వచ్చి వస్త్రం తయారీని పరిశీలించారు. చివరికి పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యం గుర్తించి భౌగోళిక గుర్తింపు (జీఐ) ఇచ్చారు. ఇప్పుడు తేలియా రుమాల్ అనే వస్త్రం ఎక్కడ ఉన్నా, పుట్టపాకకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. జీఐ ఆధారంగా విదేశీయులు కూడా పుట్టపాకకు వచ్చే అవకాశం ఉంది. ఈ వస్త్రం తయారీ ద్వారానే పుట్టపాకలోని గజం గోవర్ధనా, గజం అంజయ్యతోపాటు ఎంతోమంది చేనేత కళాకారులు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, గుర్తింపు పత్రాలు అందుకున్నారు.
శ్రమకు గుర్తింపు వచ్చింది
పుట్టపాక చేనేత కళాకారుల శ్రమకు జీఐతో గుర్తింపు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ పటంలో పుట్టపాకకు గుర్తింపు ఉంటుంది. మాలో కొత్త ఉత్సాహం వచ్చింది. – గజం గోవర్ధనా, పద్మశ్రీ అవార్డు గ్రహీత
Comments
Please login to add a commentAdd a comment