Padma shri award
-
కనువిందు.. ఇందూరు చిందు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: జానపద కళారూపాల్లో చిందు బాగోతానికి ప్రత్యేక స్థానముంది. చిందు బాగోతాన్ని బతికించేందుకు ఇందూరు జిల్లా కళాకారులు ఎనలేని కృషి చేస్తున్నారు. ‘చిందు కళాసింధు’గా పేరొందిన బోధన్ ప్రాంతానికి చెందిన చిందుల ఎల్లమ్మ వారసత్వాన్ని.. జక్రాన్‌పల్లి మండలం మునిపల్లి గ్రామానికి చెందిన పులింటి శ్యామ్ (చిందుల c) కుటుంబం కొనసాగిస్తోంది. చిందుల శ్యామ్‌కు పద్మశ్రీ అవార్డు కోసం 2018లో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. శ్యామ్ దేశంలోని అన్ని రాష్ట్రాల్లో వేలాది ప్రదర్శనలు ఇచ్చారు. 2021లో శ్యామ్ మరణించగా.. ఆయన కుటుంబం ఈ కళను బతికించేందుకు కృషి చేస్తోంది. శ్యామ్ కుమారులు పులింటి కృష్ణయ్య, గంగాధర్, కృష్ణయ్యతో పాటు డిగ్రీ చదువుతున్న కుమార్తె పులింటి శరణ్య సైతం చిందు బాగోతం ప్రదర్శనలిస్తోంది. అయిదో ఏట నుంచే శరణ్య చిందు కళను ప్రదర్శిస్తోంది. ఈ కళను బతికించడమే తన లక్ష్యమని శరణ్య చెబుతోంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో 40 బృందాలు, నిర్మల్, కరీంనగర్, నల్లగొండ, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో మరో 70 బృందాలు మాత్రమే ఉన్నాయి. ఒక్కొక్క బృందంలో 10 నుంచి 20 మంది కళాకారులు ఉన్నారు.» 1981లో పేరిణి శివతాండవం కళాకారుడు నటరాజ రామకృష్ణ ఆధ్వర్యంలో చిందు బాగోతంపై నిజామా బాద్ జిల్లాలో సర్వే చేశారు. అప్పటి నుంచి గుర్తింపు వచ్చింది. 1983లో చిందు బాగోతం మేళాను నిర్వహించగా ఇందూరు జిల్లా కళా కారులు నాయకత్వం వహించారు. 1986లో ఢిల్లీలో అప్నా ఉత్సవ్‌లో ఆర్మూర్ ప్రాంత చిందు కళాకారుల ప్రదర్శ నను అప్పటి ప్రధాని రాజీ వ్‌గాంధీ, రష్యా నేత మిఖాయిల్ గోర్బ చేవ్‌లు తిలకించి అభినందించారు.» చిందు బాగోతానికి నేపథ్యగానం ఉండ దు. పురాణాలను ఆకళింపు చేసుకుని.. సన్నివేశాలకు అనుగుణంగా భావోద్వేగా లను ప్రదర్శిస్తుంటారు. ఈ కళాకారులు తమ ఆభరణాలను ‘పాణికి’ (పునికి) కర్రతో తయారు చేసుకుంటారు. వీటి తయారీకి ఆరునెలల సమయం పడుతుంది. చిందు బాగోతానికి సంబంధించి నిజా మాబాద్, నిర్మల్ కళాకారులు తమకే ప్రత్యే కమైన సూర్యకిరీటం వినియోగిస్తున్నారు. వీటితో పాటు భుజకీర్తులు(శంఖు చక్రా లు), కంఠసరి, పెద్దపేరు, చిన్నపేరు. జడ ల చిలుకలు, మల్లెదండలు, చేదస్తాలు, దు స్తులు ఉపయోగిస్తున్నారు. రామాయణం, మహాభారతం, భాగవతం కథలతో కళా ప్రదర్శనలు ఇస్తున్నారు. ప్రస్తుతం సాంస్కృతిక, దేవాదాయ శాఖలు సూచించిన చోట్ల ప్రదర్శనలు ఇస్తున్నారు. ఇక చిందు బాగోతానికి చిరునామాగా ఉన్న చిందుల ఎల్లమ్మకు.. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ప్రతి ష్టాత్మక ‘హంస’ అవార్డుతో సత్కరించింది. చిందు బాగోతంలో స్త్రీ పాత్రలను సై తం పురుషులే ధరిస్తారు. అయితే చిందుల ఎల్లమ్మ మాత్రం.. స్త్రీ పాత్రలతో పాటు అన్నిరకాల పురుష పాత్రలు ధరించి ఈ కళకు చిరునామాగా నిలవడం విశేషం.రాత్రిపూట రారాజులం.. తెల్లారితే బిచ్చగాళ్లం..ప్రాచీన కళను బతికిస్తున్న మమ్మల్ని ప్రభుత్వం గుర్తించి ఆదుకోవాలి. ప్రదర్శనలకు వెళ్తే.. రాత్రి పూట రారాజులం.. తెల్లవారితే బిచ్చగాళ్లం అనేలా మా పరిస్థితి తయారైంది. గురుశిష్య పరంపరలో నేర్చుకుని కళను బతికించేవారు వేళ్లమీద లెక్కపెట్టే సంఖ్యలోనే ఉన్నారు. వారసులే చిందు కళను బతికిస్తూ వస్తున్నారు. కళను బతికించేందుకు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవాలి. – పులింటి కృష్ణయ్య, మునిపల్లి, జక్రాన్‌పల్లి మండలం, నిజామాబాద్ జిల్లా -
డా. నాగేశ్వర్‌రెడ్డికి పద్మ విభూషణ్..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచ ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్, ఏఐజీ హాస్పిటల్స్ చైర్మన్ డాక్టర్ దువ్వూరు నాగేశ్వరరెడ్డిని దేశ రెండో అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్ వరించింది. దేశ వైద్య రంగానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఆయన్ను తెలంగాణ నుంచి ఈ పురస్కారానికి ఎంపిక చేసింది. ప్రముఖ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణకు ఏపీ నుంచి కళల విభాగంలో పద్మ భూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది.అలాగే ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగతోపాటు కవి, పండితుడు, ద్విసహస్రావధాని మాడుగుల నాగఫణి శర్మ, కె.ఎల్. కృష్ణ, మిరియాల అప్పారావు (మరణానంతరం), వాదిరాజు రాఘవేంద్రాచార్య పంచముఖిలను పద్మశ్రీ పురస్కారాలకు ఎంపిక చేసింది. 76వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని కేంద్ర ప్రభుత్వం 2025 ఏడాదికిగాను శనివారం పద్మ పురస్కారాలను ప్రకటించింది. మొత్తం 139 పద్మ పురస్కారాలను ప్రకటించిన కేంద్రం అందులో ఏడుగురికి పద్మవిభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ పురస్కారాలు ప్రకటించింది. పురస్కారాల్లో 23 మంది గ్రహీతలు మహిళలు, 10 మంది విదేశీయులు/ఎన్ఆర్ఐలు ఉండగా 13 మందికి మరణానంతరం అవార్డులను ప్రకటించారు. పద్మ అవార్డుల్లో తెలంగాణకు రెండు, ఆంధ్రప్రదేశ్‌కు ఐదు అవార్డులు లభించాయి.జాబితాలో మట్టిలో మాణిక్యాలు దేశ సామాజిక, సాంస్కృతిక పురోగతికి తమ సేవల ద్వారా తోడ్పడుతున్నప్పటికీ పెద్దగా గుర్తింపునకు నోచుకోకుండా మట్టిలో మాణిక్యాలుగా మిగిలిపోయిన 30 మందిని కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలతో గౌరవించింది. వారిలో గోవా స్వాతంత్య్ర పోరాట యోధుడైన వందేళ్ల లిబియో లోబో సర్దేశాయ్, పశ్చిమ బెంగాల్‌కు చెందిన మహిళా డోలు కళాకారిణి గోకుల్ చంద్ర దే (57) తదితరులు ఉన్నారు. దేశం గర్విస్తోంది: మోదీ పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు. వివిధ రంగాల్లో అసమాన విజయాలు సాధించిన వ్యక్తులను గౌరవించేందుకు దేశం గర్విస్తోందన్నారు. ఆయా రంగాలకు వారు అందిస్తున్న సేవలు, పనిపట్ల చూపుతున్న నిబద్ధత స్ఫూర్తిదాయకమన్నారు.తెలంగాణకు అవమానం: సీఎంసాక్షి, హైదరాబాద్: పద్మ పురస్కారాల్లో తెలంగాణకు అవమానం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆక్షేపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించిన గద్దర్ (పద్మవిభూషణ్), చుక్కా రామయ్య (పద్మభూషణ్), అందెశ్రీ (పద్మభూషణ్), గోరటి వెంకన్న (పద్మశ్రీ), జయధీర్ తిరుమలరావు (పద్మశ్రీ) వంటి ప్రముఖులను కేంద్రం పరిగణనలోకి తీసుకోకవడం 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలను అవమానించడమేనని విమర్శించారు. మంత్రులు, అధికారులతో జరిగిన సమావేశంలో ఈ అంశంపై ముఖ్యమంత్రి చర్చించారు. అదే సమయంలో తెలంగాణ, ఏపీ నుంచి ఎంపికైన ప్రముఖలకు సీఎం రేవంత్ అభినందనలు తెలిపారు. పద్మ పురస్కారాల్లో అన్యాయంపై ప్రధాని మోదీకి లేఖ రాయాలని సీఎం యోచిస్తున్నట్లు సమాచారం.అత్యుత్తమ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోని అత్యుత్తమ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌ల్లో డాక్టర్ డి.నాగేశ్వర్ రెడ్డి (68) ఒకరు. కర్నూల్ మెడికల్ కాలేజీ నుంచి ఎంబీబీఎస్ చదివిన ఆయన 18 మార్చి 1956న విశాఖపట్నంలో జన్మించారు. ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ పేరిట ఆయన నెలకొల్పిన వైద్య సంస్థ దేశవ్యాప్తంగా అత్యుత్తమ వైద్య సంస్థగా పేరు గడించింది. గ్యాస్ట్రో ఎంటరాలజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ప్రఖ్యాత వైద్య సంస్థ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో, ప్రొఫెసర్‌గా గుంటూరు మెడికల్ కాలేజీలో విద్యార్థులకు వైద్యవిజ్ఞానాన్ని బోధించారు. తన కెరీర్లో ఎన్నో జాతీయ, అంతర్జాతీయ అవార్డులు పొందారు. 2002లో పద్మశ్రీ, 2016లో పద్మభూషణ్ పురస్కారాలు వరించాయి. వినమ్రంగా స్వీకరిస్తున్నా: నాగేశ్వరరెడ్డి ‘పద్మవిభూషణ్ పురస్కారాన్ని వినమ్రంగా స్వీకరిస్తున్నాను. ఇది నాకొక్కడికే దక్కినది కాదు... ప్రతిరోజూ నాలో నూతన స్ఫూర్తిని నింపే మా పేషెంట్స్, ఏఐజీ టీమ్, మా వైద్య సిబ్బందికి దక్కిన గౌరవం. తమ వ్యథాభరితమైన, అత్యంత క్లిష్టమైన క్షణాల్లో సైతం మమ్మల్ని పూర్తిగా విశ్వసించి, మాలో పట్టుదలను, సేవానిరతిని రగిలించే మా పేషెంట్స్‌కు అత్యుత్తమ వైద్యసేవలందించడంలో మేమెప్పుడూ ముందుంటాం. భారతీయుడిగా, ఈ తెలుగుగడ్డ మీద పుట్టిన వాడిగా ప్రజలందరికీ ఆరోగ్య సేవలందించడానికి పునరంకితమవుతున్నాను. నా దేశాన్ని ఆరోగ్యకరంగా, మరింతగా బలోపేతం చేయడానికి అనునిత్యం శ్రమిస్తాను’ అని నాగేశ్వరరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సహస్రావధానానికి సిసలైన బిరుదు మాడుగుల నాగఫణి శర్మ.. ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, ద్వి సహస్రావధాని. 1959, జూన్ 8న అనంతపురం జిల్లా, తాడిపత్రి తాలూకా, పుట్లూరు మండలంలోని కడవకొల్లు గ్రామంలో జన్మించారు. మైసూరు విశ్వవిద్యాలయం నుంచి ఎంఏ, ఢిల్లీ ర్రాష్టీయ సంస్కృత సంస్థాన్ నుంచి ‘శిక్షాశాస్త్రి’ పట్టా పొందారు. తిరుపతి ర్రాష్టీయ విద్యా పీఠం నుంచి పీహెచ్డీ పట్టా పొందిన మాడుగుల.. 1985- 90 మధ్య కాలంలో కడప రామకృష్ణ జూనియర్ కళాశాలలో సంస్కృతోపన్యాసకుడిగా, 1990ృ92 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మ ప్రచార పరిషత్తు అదనపు కార్యదర్శిగా పనిచేశారు. హైదరాబాద్ బర్కత్‌పురలో చాలాకాలంగా సరస్వతీ పీఠాన్ని నిర్వహిస్తున్నారు. అవధాన విద్యలో ఆరితేరిన నాగఫణి శర్మ మాజీ ప్రధానులు అటల్ బిహారీ వాజ్‌పేయి, పీవీ నరసింహారావు, మాజీ రాష్ట్రపతి శంకర్‌దయాళ్ శర్మ వంటి వారి సమక్షంలో ఆశువుగా... అలవోకగా అవధానాలు నిర్వహించి వారి ప్రశంసలు సైతం పొందారు. తన విద్యతో నాగఫణిశర్మ అవధాన సహస్రఫణి, బృహత్ ద్వి సహస్రావధాని, శతావధాని సమ్రాట్, శతావధాన చూడామణి, కళాసాహిత్య కల్పద్రుమ వంటి అనేక బిరుదులు పొందారు. ఇటీవలే ఆయన విశ్వభారతం అనే సంస్కృత మహాకావ్యాన్ని రచించారు. ప్రొఫెసర్.. రచయిత సయ్యద్ ఐనుల్ హసన్ రాయదుర్గం: ప్రొఫెసర్ సయ్యద్ ఐనుల్ హసన్.. విద్యాపరంగా ప్రొఫెసర్, సాహిత్యపరంగా రచయిత. ఆయన ఉత్తరప్రదేశ్‌లోని అలహాబాద్‌లో 15 ఫిబ్రవరి 1957లో జన్మించారు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని పర్షియన్ అండ్ సెంట్రల్ ఏషియన్ స్టడీస్ స్కూల్ ఆఫ్ లాంగ్వేజ్, లిటరేచర్ అండ్ కల్చర్ స్టడీస్ ప్రొఫెసర్‌గా పనిచేశారు. కాటన్ కాలేజ్ స్టేట్ యూనివర్సిటీలోనూ విధులను నిర్వహించారు. ఆయన 23 జూలై 2021లో మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయం (మను) వైస్‌చాన్స్‌లర్‌గా నియమితులయ్యారు. ఇండోృఇరాన్ రిలేషన్స్, లిటరేటర్, కల్చర్ స్టడీస్, ఇండోలోజీ గ్లోబలైజేషన్, ఎడ్యుకేషన్ అంశాలపై ఆయన ఎక్కువ మక్కువ చూపిస్తారు. ఆయనకు సతీమణి అర్షియాహసన్, పిల్లలు కమ్రాన్‌బద్ర్, అర్మాన్ హసన్ ఉన్నారు. ఉద్యమ ప్రస్థానం నుంచి... సాక్షి, హైదరాబాద్: మందకృష్ణ హన్మకొండ జిల్లా కాజీపేట మండలం న్యూశాయంపేట గ్రామంలో 1965, జులై 7న జన్మించారు. ఆయన తల్లిదండ్రులు మంద చిన్న కొమురయ్య, కొమురమ్మ. మాదిగ దండోరా, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎంఆర్పీఎస్)ని స్థాపించారు. ఎస్సీ వర్గీకరణ, ఎస్సీలోని కులాలకు జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో 1994 జులై 7న ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామం నుంచి ఉద్యమ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తెలుగు రాష్ట్రాలతోపాటు దేశవ్యాప్తంగా పలురాష్ట్రాల్లో విస్తృతంగా పర్యటించారు. మాదిగలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే అంశాన్ని ప్రచారం చేసి మాదిగలు, ఉపకులాల ప్రజలను చైతన్యపర్చారు. ఎస్సీ, ఎస్టీల్లో జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు చేయొచ్చని, ఈమేరకు వర్గీకరణ చేపట్టాలని, ఈ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగిస్తూ సుప్రీంకోర్టు గత ఆగస్టులో ఇచ్చిన తీర్పు ఎమ్మార్పీఎస్ ఉద్యమానికి భారీ ఊరట అందించినట్లైంది.ఆర్థికవేత్తల రూపశిల్పి సాక్షి, అమరావతి: ప్రొఫెసర్ కొసరాజు లీలా కృష్ణ.. కేఎల్‌గా, కేఎల్‌కేగా సుప్రసిద్ధులు. ఆర్థిక శాస్త్రం ఆచార్యులైన ఆయన అనేకమంది విద్యార్థులను ఆర్థికవేత్తలుగా తీర్చిదిద్ది దేశానికి అందించారు. షికాగో యూనివర్సిటీలో చదివిన ఆయన.. ప్రస్తుతం మద్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెవలప్మెంట్ స్టడీస్ సంస్థకు చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. ఇండియా కేఎల్ఈఎంఎస్ ప్రొడక్టివిటీ ప్రాజెక్టుకు నేతృత్వం వహిస్తున్నారు. ఆరు దశాబ్దాలుగా అప్లైడ్ ఎకనామిక్స్, ఇండ్రస్టియల్ ఎకనామిక్స్, ప్రాంతీయ అసమానతలు, ఆర్థిక ఉత్పాదకత, సైద్ధాంతిక వాణిజ్యం తదితర సబ్జెక్టులు విద్యార్థులకు బోధించడమే కాకుండా, ఆ విభాగాల్లో విస్తృత పరిశోధనలూ చేశారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో సుదీర్ఘకాలం ఆర్థిక శ్రాస్తాన్ని బోధించారు. ఇండియన్ ఎకనామిక్ సొసైటీకి 1996ృ97లో అధ్యక్షుడిగా వ్యవహరించారు. 1997లో ఆయన రచించిన ఎకనోమెట్రిక్ అప్లికేషన్స్ ఇన్ ఇండియా గ్రంథాన్ని ఆర్థిక శాస్త్రంలో ప్రధాన విభాగాల్లో అధ్యయనానికి దిక్సూచిలా ఆర్థికవేత్తలు భావిస్తారు.బుర్రకథ టైగర్ మిరియాల తాడేపల్లిగూడెం: పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన మిరియాల అప్పారావు బుర్రకథలో ప్రఖ్యాతి చెందారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడేనికి చెందిన ఆయన 1949 సెప్టెంబరు 9న మిరియాల వెంకట్రామయ్య, తిరుపతమ్మల రెండో సంతానంగా జన్మించారు. చక్కని రాగాలాపనతో పద్యాలు, పాటలు పాడటంతో రాగాల అప్పారావుగా పేరుగాంచారు. 1969లో బుర్రకథ రంగంలో అడుగు పెట్టారు. తొలి ఏడాదిలోనే తన చాతుర్యంతో అందరినీ అబ్బురపరిచి నడకుదురులో సువర్ణ ఘంఠా కంకణం పొందారు. 1974లో రేడియోలో పలు కార్యక్రమాలు చేశారు. 1993లో దూరదర్శన్‌లో బుర్రకథలు చెప్పారు. బుర్రకథ చెప్పడంలో నాజర్‌ను స్ఫురణకు తెచ్చే అప్పారావు గాన కోకిల, బుర్రకథ టైగర్ వంటి బిరుదులు సాధించారు. చింతామణి నాటకంలో బిళ్వమంగళుడు, శ్రీకృష్ణ తులాభారంలో శ్రీకృష్ణుడు వంటి పాత్రలను పోషించారు. ఈ ఏడాది జనవరి 15న ఆయన తుది శ్వాస విడిచారు.సంస్కృత పండితుడుసాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన వాదిరాజ్ పంచముఖి ప్రఖ్యాత సంస్కృత పండితుడు, ఆర్థికవేత్త. 1936 సెప్టెంబర్ 17న కర్ణాటకలోని «బాగల్కోట్లో జన్మించారు. కర్ణాటక, బాంబే విశ్వవిద్యాలయాలతో పాటు, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్‌లో విద్యనభ్యసించారు. ఆర్థిక రంగంలో విశేష కృషి చేసి అనేక పరిశోధన వ్యాసాలు రాశారు. అవి అంతర్జాతీయ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. సంస్కృతంలో అనేక పుస్తకాలు, కవితలు రచించారు. తిరుపతిలోని ర్రాష్టీయ సంస్కృత విద్యా పీఠ్ చాన్స్‌లర్‌గా రెండు పర్యాయాలు సేవలందించారు. టీటీడీ బోర్డ్ మెంబర్‌గా పనిచేశారు. సంస్కృతంలో రాష్ట్రపతి ప్రసంశ పత్రంలో పాటు అనేక అవార్డులను అందుకున్నారు. -
కుంభ మేళాకు బాబా @ 100 ఏళ్లు
మహాకుంభ్ నగర్: యూపీలోని ప్రయాగరాజ్‌లో నాలుగు రోజులుగా జరుగుతున్న మహా కుంభ మేళాకు కోట్లాదిగా జనం తరలివస్తున్నారు. ఈ క్రతువులో బయటి ప్రపంచంలోకి అరుదుగా అడుగుపెట్టే సాధువులు, మునులు సైతం పాలుపంచుకోవడం తెలిసిందే. అలాంటి కోవకు చెందిన వారే పద్మ శ్రీ అవార్డు గ్రహీత, యోగ సాధకుడు స్వామి శివానంద బాబా. 1896లో జన్మించిన స్వామి శివానంద బాబా గత వందేళ్లుగా ప్రయాగరాజ్, నాసిక్, ఉజ్జయిని, హరిద్వార్‌లలో జరిగే ప్రతి కుంభమేళాలోనూ హాజరవుతున్నారు. తాజాగా, మహాకుంభమేళాకు సైతం వచ్చారు. సంగంలోని 16వ నంబర్ సెక్టార్‌లోని టెంట్లో ఈయన బస చేస్తున్నారు. టెంట్ బయట బాబా ఆధార్ కార్డు, పుట్టిన రోజు సర్టిఫికెట్ కాపీని ఆయన శిష్యులు ప్రదర్శనకు ఉంచారు. బాబా శిష్యుడు, బెంగళూరుకు చెందిన ఫల్గుణ్ భట్టాచార్య వారిలో ఒకరు. ‘బాబా బిచ్చగాళ్ల కుటుంబంలో పుట్టారు. ఆయన తల్లిదండ్రులు సాధువుల బోధనలకు తరచూ వెళ్లేవారు. ఆ క్రమంలోనే వారు నాలుగేళ్ల వయస్సులో బాబాను సాధువులకు అప్పగించేశారు. ఆరేళ్ల వయస్సులో బాబా తిరిగి సొంతింటికి చేరుకున్న కొన్ని రోజులకే ఆయన సోదరి మరణించింది. మరికొద్ది రోజులకు తల్లిదండ్రులు సైతం తనువు చాలించారు. వారి కర్మకాండలు పూర్తయ్యాక బాబా ఒంటరయ్యారు’అని భట్టాచార్య వివరించారు. ‘అప్పటి నుంచి జీవితమే మారిపోయింది. రాత్రి 9 గంటలకు పడుకుని, వేకువజామున 3 గంటలకే నిద్ర లేవడం మిగతా దినమంతా యోగా, ధ్యానంలోనే గడపడం దినచర్యంగా మార్చుకున్నారు’అని తెలిపారు. ఇప్పటి వరకు ఆయన అనారోగ్యం బారిన పడిన దాఖలాలు లేవన్నారు. కానుకలు స్వీకరించరని చెప్పారు. పాలు, పాల ఉత్పత్తులకు దూరంగా ఉంటారని, ఉడికిన ఆహారాన్ని ఉప్పు, నూనె లేకుండానే తీసుకుంటారని తెలిపారు. వారణాసిలోని దుర్గాకుండ్ ప్రాంతం కబీర్ నగర్‌లోని ఆశ్రమంలో ఉంటున్నారని తెలిపారు. 2022 మార్చి 21వ తేదీన అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మీ శ్రీ అవార్డును స్వీకరించారు. బాబా వయస్సు 125 ఏళ్లని రాష్ట్రపతి భవన్ అప్పట్లో పేర్కొంది. కాగా, ప్రజల ఇబ్బందులకు అనారోగ్యకర అలవాట్లు, శారీరక శ్రమే కారణమన్నది స్వామి శివానంద బాబా అభిప్రాయం. అందుకే, ఉదయాన్నే మేల్కొనడం, కాసేపు నడక, కనీస అరగంటపాటు యోగ సాధనతోపాటు సరైన ఆహార నియమాలతో జీవితాన్ని సుఖమయం చేసుకోవాలని ఆయన సూచిస్తున్నారని ఫల్గుణ్ భట్టాచార్య తెలిపారు. -
Rajni Bector: ఓ విజేత ప్రస్థానం
రజనీ బెక్టార్... సమైక్య భారతంలోని కరాచీ నగరంలో 1940లో పుట్టారామె. తండ్రి అకౌంటెంట్ జనరల్. తండ్రి ఉద్యోగరీత్యా కొంతకాలం లాహోర్‌లో పెరిగారు. ఆమెకు ఏడేళ్లు నిండేలోపే దేశవిభజన జరిగింది. రజని కుటుంబం భారతదేశానికి వచ్చింది. ఇండియాకి వచ్చిన తర్వాత ఢిల్లీలోని మిరిండా హౌస్‌లో చదువుకుందామె. కాలేజ్ చదువు పూర్తయ్యేలోపే లూథియానాలోని ఒక వ్యాపార కుటుంబంలోకి కోడలిగా అడుగుపెట్టింది. ఆమె జీవితంలో కీలకమైన ఘట్టాలు జరిగాయి. గానీ అప్పటికి ఆమె వయసు పదిహేడే. చదువు పూర్తికాకముందే పెళ్లికి తలవంచాల్సి రావడంతో కలిగిన ఆ అసంతృప్తే ఆమెను ఇప్పుడు విజేతగా నిలిపింది. లూథియానాలో అడుగుపెట్టినప్పటి నుంచి పద్మశ్రీ అవార్డు అందుకునే వరకు సాగిన ఆమె విజయయాత్రను సంతోషంగా గుర్తు చేసుకుంటున్నారామె.ఓ కొత్త ప్రపంచం ‘‘నేను లూథియానాకి వచ్చేనాటికి అది చాలా చిన్న పట్టణం. ఢిల్లీ నుంచి వచ్చిన నాకు లూథియానాను పట్టణం అనడానికి కూడా మనసొప్పేది కాదు. పట్టణం మొత్తానికి నాలుగు కార్లుండేవి అంతే. మా అత్తగారింటివాళ్లు ఛాందసులు. మా పుట్టింట్లో అమ్మ వైపు, నాన్న వైపు వాళ్లందరూ ఉన్నత విద్యావంతులు, విశాల దృక్పథం కలిగిన వాళ్లు. అత్తగారిల్లు– పుట్టిల్లు ఒకదానికొకటి పూర్తిగా భిన్నం. దాంతో నేను కొత్త మనుషుల మధ్యకు మాత్రమే కాదు, ఏకంగా కొత్త ప్రపంచంలోకి వచ్చి పడ్డాననే చెప్పాలి. వంటతో స్నేహంనాకు రకరకాలు వండడం, కొత్త వంటలను ప్రయత్నించడం హాబీ. ఆ హాబీయే నాకు పెద్ద ఆలంబన అయింది. స్నేహితులను, బంధువులను ఇంటికి ఆహ్వానించడం వారికి చేసి పెట్టడం, వారు ప్రశంసిస్తుంటే పొంగిపోవడమే జీవితంగా మారిపోయాను. హీరో మోటార్ కార్పొరేషన్‌కు చెందిన బ్రిజ్మోహన్ ముంజాల్, ఎవన్ సైకిల్స్ కంపెనీకి చెందిన పహ్వాస్లు ‘లూథియానా ప్రజలకు మంచి వంటలను రుచి చూపిస్తున్నావ్’ అన్నారు. అప్పటి ఎమ్ఎల్ఏ ఒకరు తన మనుమరాలి పెళ్లికి కేటరింగ్ చేసి పెట్టమని అడిగారు. ఒక్క క్షణం ఏమీ అర్థం కాలేదు. స్థాణువులా ఉండిపోయాను. ఎలాగో ధైర్యం చేసి అంగీకారంగా తలూపాను. ఇద్దరు అసిస్టెంట్ల సాయంతో రెండు వేల మందికి వంటలు చేయించాను. ఆ తర్వాత స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఏ వేడుక జరిగినా నాకు కబురు వచ్చేది. అయితే అవేవీ కమర్షియల్ సర్వీస్‌లు కాదు, స్నేహపూర్వక సర్వీస్లే. కొంతకాలానికి ఇంట్లోనే కుకరీ క్లాసులు మొదలు పెట్టాను. అప్పుడు మా అత్తగారు తీవ్రంగా వ్యతిరేకించారు. ‘ఇంట్లో మగవాళ్లు వ్యాపారంలో బాగా సంపాదిస్తున్నారు, నువ్వు క్లాసులు చెప్పి సంపాదించాల్సిన అవసరం ఏమొచ్చింది’ అని కోప్పడ్డారు. మా వారు నాకు మద్దతుగా నిలవడంతో ఆ పెనుతుఫాను సమసిపోయింది. పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ జైన్ మా ఫ్యామిలీ ఫ్రెండ్. ఆయన సలహాతో అందులో ఫుడ్, డైరీ ప్రొడక్ట్స్, బేకరీ కోర్సులో చేరాను. పిల్లలు కొంచెం పెద్దయి బోర్డింగ్ స్కూల్‌కెళ్లిన తర్వాత నేను కాలేజ్‌లో చేరడంతో ఇంట్లో నాకు ఎటువంటి ఇబ్బందీ రాలేదు. యూనివర్సిటీలో అడుగు పెట్టగానే నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. పెళ్లి కారణంగా చదువాపేసినప్పటి నుంచి మనసులో దాగి ఉన్న దిగులు ఒక్కసారిగా ఎగిరిపోయింది. కోర్సు పూర్తి కాగానే మా వారిచ్చిన ఇరవై వేలతో 1978లో క్రిమికా ఐస్‌క్రీమ్ యూనిట్ ప్రారంభించాను. ‘క్రీమ్ కా’ అనే అర్థంలో పెట్టానా పేరు. లూథియానాలో క్వాలిటీ ఐస్‌క్రీమ్ స్టాల్ పక్కన నేను స్టాల్ తెరిచాను కాని క్వాలిటీ ఐస్‌క్రీమ్‌ను కాదని మా యూనిట్‌కి ఎవరైనా వస్తారా అనే భయం చాలా రోజులు వెంటాడింది. అయితే నేను స్టాల్లో కూర్చోవడం లూథియానాలో మహిళలకు స్ఫూర్తినిచ్చింది. ఇంట్లో మగ్గిపోకుండా బయటకు వచ్చి ఏదైనా సాధించాలనే తపన ఉన్న వాళ్లందరూ తమ ఇంట్లో వాళ్లను ఒప్పించడానికి నన్ను మోడల్‌గా చూపించేవారు. నా ఐస్‌క్రీమ్‌కి కూడా ఆదరణ పెరగసాగింది.ఐస్‌క్రీమ్‌తో మొదలు బిస్కట్ వరకు క్వాలిటీని కాదని మా స్టాల్‌కి రావాలంటే వాళ్లకంటే ఎక్కువగా చేయాలి. ఐస్‌క్రీమ్‌తోపాటు బ్రెడ్, బిస్కట్ వంటి బేకరీ ఫుడ్ చేయడం మొదలు పెట్టాను. మా స్టాల్‌ను విస్తరించి జీటీ రోడ్లోకి మార్చాం. అంతా గాడిలో పడిందనుకునే సమయంలో ఆపరేషన్ బ్లూ స్టార్ మొదలైంది. పంజాబ్ అట్టుడికిపోయింది. అనంతరం దేశం మొత్తాన్ని కుదిపేసిన దుర్ఘటన ఇందిరాగాంధీ హత్య జరిగింది. అప్పటికి వందేళ్ల నుంచి మా కుటుంబం చేస్తున్న ధాన్యం, ఎరువుల వ్యాపారం స్తంభించిపోయింది. రైతులతో సంబంధాలు తెగిపోయాయి. బెదిరింపులు ఎక్కువయ్యాయి. మా పెద్దబ్బాయి మీద అపహరణ ప్రయత్నం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో ఆ వ్యాపారాన్ని మూసివేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అంటే.. 1990 నుంచి నా ఫుడ్ బిజినెస్సే ఇంట్లో అందరికీ ఫుడ్ పెట్టింది. ఇంట్లో అందరమూ క్రిమికా కోసమే పని చేయడం మొదలుపెట్టాం. పదహారు గంటల పని ఇప్పుడు క్రిమికాకు సంబంధించిన రోజువారీ బాధ్యతలేవీ లేవు. కానీ కీలకమైన సమయాల్లో రోజుకు పదహారు గంటలు పనిచేశాను. ఆహారం మీద నాకున్న ప్రత్యేకమైన అభిరుచే నన్ను ఈ రంగంలోకి తీసుకొచ్చింది. విజేతగా నిలబెట్టింది. నేను నా టేస్ట్బడ్స్కి థ్యాంక్స్ చెప్పాలి. క్వాలిటీ చెక్‌లో భాగంగా ప్రతిదీ రుచి చూడాలి. కేవలం రుచి మాత్రమే చూడాలి. కడుపు నిండా తినకూడదు. కడుపు నిండితే రుచిని గ్రహించే శక్తిని కోల్పోతాం. ఆ నియమం పాటిస్తేనే విజయం మనదవుతుంది. ఈ దేశంలో జీవించాలని వచ్చాం. ఇక్కడే సవాళ్లనెదుర్కొన్నాం. జీవితాన్ని వెతుక్కున్నాం. మూడేళ్ల కిందట పద్మశ్రీ పురస్కారం అందుకున్నాను. ఈ దేశం నాకు చాలా ఇచ్చింది’’ అన్నారు రజనీ బెక్టార్. మెక్‌డీ బర్గర్లో మా బన్నుమెక్ డొనాల్డ్ ఫుడ్ చైన్ మనదేశంలో అడుగుపెట్టింది. వాళ్లకు అవసరమైన బన్ కోసం బేకరీలన్నింటినీ సందర్శించారు. మా బేకరీని ఎంపిక చేసుకున్నారు. అయితే వారికి కావల్సిన నియమాలు, పరిమితులకు లోబడి తయారు చేసి ఇవ్వడానికి ఒక ఏడాదిపాటు ఎక్సర్సైజ్ చేశాం. మధ్యప్రదేశ్‌లో పండే నాణ్యమైన గోధుమల పిండితో చేసిన బన్ వారి ఆమోదం పొందింది. మొదట్లో కొంత నష్టం వచ్చినప్పటికీ క్వాలిటీ కంట్రోల్ నుంచి ఆమోదం వచ్చిన తర్వాత ఇక మాకు వెనక్కి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ఆ తర్వాత మెక్‌డీకి అవసరమైన సాస్ ΄్లాంట్ కూడా పెట్టాం. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలతోపాటు విదేశాల్లో కూడా వేగంగా విస్తరించగలిగాం. టర్నోవర్ ఏడు వేల కోట్లకు చేరింది. మా ముగ్గురబ్బాయిలు బాధ్యతలు పంచుకుని వ్యాపారాన్ని కొనసాగించారు. ఇప్పుడు మూడవ తరం అడుగుపెట్టింది. మా మనుమడు ఢిల్లీ మార్కెట్ మీద దృష్టి పెట్టాడు. -
డాక్టర్ రోడ్ సేఫ్టీ: మాయా టాండన్
ఉద్యోగ విరమణ తర్వాత చాలామంది విశ్రాంత జీవనాన్ని ప్రశాంతంగా గడపాలనే ఉద్దేశంతో ఇంటికే పరిమితం అవుతుంటారు. కానీ, జైపూర్ వాసి డాక్టర్ మాయా టాండన్ మాత్రం తన రిటైర్మెంట్ జీవితాన్ని రోడ్డు ప్రమాదాల్లో ్రపాణాలు కోల్పోతున్నవారిని కాపాడేందుకు అంకితం చేసింది. స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి లక్షా ముప్పై మూడు వేల మందికి రోడ్డు భద్రతకు సంబంధించిన శిక్షణ ఇచ్చింది. జీవితం పట్ల ఉత్సాహం, సమాజం కోసం పనిచేయాలనే తపనతో గత ముప్ఫై ఏళ్లుగా డాక్టర్ మాయా టాండన్ చేస్తున్న కృషికి గానూ ఆమెను ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారం వరించింది. వైద్యసేవలోనే తరిస్తున్న టాండన్ గురించి ఆమె మాటల్లోనే...‘‘అజ్మీర్‌లో పుట్టి పెరిగాను. చిన్ననాటి నుంచి కుటుంబ మద్దతు నాకు ఎక్కువే ఉంది. అన్ని బోర్డ్ పరీక్షలలో మంచి మార్కులు సాధించి, అజ్మీర్‌లోని మెడికల్ స్కూల్లో చేరాను. జీవితమంతా నాదైన మార్గాన్ని ఎంచుకునే స్వేచ్ఛ నాకు లభించింది. అజ్మీర్‌లోని హాస్పిటల్లో వైద్యురాలిగా చేరాను. అక్కడే టాండన్‌తో జరిగిన పరిచయం పెళ్లికి దారితీసింది. పెళ్లి తర్వాత జైపూర్‌కు వెళ్లాను. కొడుకు పుట్టిన తర్వాత అనస్తీషియాలజీలో డి΄÷్లమా చేశాను. డి΄÷్లమా పూర్తయ్యేనాటికి కూతురు కూడా పుట్టింది. ఆ తర్వాత అనస్తీషియాలోనే ఎమ్మెస్ కూడా చేశాను. జైపూర్‌లోని మెడికల్ కాలేజీలో అనస్తీషియాపై స్పీచ్‌లు ఇచ్చేదాన్ని. అందులో భాగంగా పీడియాట్రిక్ అనస్తీషియా కోసం లండన్ ఫెలోషిప్‌కు హాజరయ్యాను. అక్కణ్ణుంచి వచ్చాక జైపూర్‌లో పనిచేయడం ్రపారంభించాను. మూడు రోజుల కోర్సు తిప్పిన మలుపుసాధారణంగా అందరికీ అనస్తీషియాలజిస్ట్ పాత్ర తెర వెనుక పనిగా కనిపిస్తుంది. నేను మాత్రం రోగి జీవితం అనస్తీషియాలజిస్ట్ పై ఆధారపడి ఉంటుందని నమ్ముతాను. 1975లో సవాయ్ మాన్సింగ్ హాస్పిటల్లో సూపరింటెండెంట్‌గా, అనస్తీషియా హెడ్‌గా పనిచేస్తూ దాని నిర్వహణను చూశాను. 1985లో పదవీ విరమణ చేసే సమయంలో జైపూర్‌లోని రాజస్థాన్ ΄ోలీసు అకాడమీ నన్ను సంప్రదించి, రోడ్డు భద్రత, ్రపాణాలను రక్షించడంపై మూడు రోజులు కోర్సు ఇవ్వాలని కోరింది. రిటైర్మెంట్ తర్వాత అదే నా జీవిత గమనాన్ని మలుపు తిప్పుతుందని తెలియకనే వారి అభ్యర్థనను అంగీకరించాను. మూడు రోజుల కోర్సు చాలా సక్సెస్ అయ్యింది. దీంతో జైపూర్, చుట్టుపక్కల హైవేలపై ΄ోస్ట్ చేసే సీనియర్ అధికారులందరి కోసం మరొక కోర్సు ఏర్పాటు చేశారు. ఒక ఫొటోగ్రాఫర్ ఆ ఈవెంట్ ఫొటోలు తీయడానికి వచ్చాడు. కొన్ని నెలల తర్వాత అతను నాకు ఫోన్ చేసి, నేను అతని ్రపాణాలను రక్షించానని చె΄్పాడు. అదెలా అని ఆశ్చర్య΄ోయాను. ఆ ఫొటోగ్రాఫర్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. అతని తొడల వెనక భాగంలో రక్తస్రావం అవుతూ ఉంది. అతని చుట్టూ ఉన్న వ్యక్తులు ఎలా సహాయం చేయాలో తెలియక ప్రమాదం తాలూకు ఫొటోలు తీసుకుంటున్నారు. తనను ఎత్తి, ఒక చోట ఎలా కూర్చోబెట్టాలో చెప్పి, రక్తస్రావం తగ్గేలా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో సాటివారికి వివరించి, ప్రమాదం నుంచి బయటపడిన విధం గురించి తెలియజేశాడు. దీంతో ఆ కోర్సు ్రపాముఖ్యత ఎంతటిదో గ్రహించాను. సమయానుకూలంగా తీసుకునే జాగ్రత్తలు మన ్రపాణాలను ఎలా కాపాడతాయో ఆ రోజు మరింతగా కళ్లకు కట్టాయి. ఎక్కడైనా ప్రమాదం జరిగితే చుట్టూ అందరూ గుమికూడుతారు. ఆ గుంపులోని వ్యక్తులలో ఎవరికీ ్రపాణాలను రక్షించే దశలు తెలియవు. దీంతో భారతదేశంలో రహదారి భద్రత తీరుతెన్నులు మార్చాలనే ఉద్దేశ్యంతో ‘సహాయ’ ట్రస్ట్‌ను ్రపారంభించాను. అప్పటి నుండి 1,33,000 మంది వ్యక్తులకు ఉచిత కోర్సులు, సెమినార్లు, ఉపన్యాసాలు ఇస్తూ వచ్చాను.కోర్సులు అన్నీ ఉచితమేకార్డియోపల్మొనరీ రిససిటేషన్ (సీపీఆర్), ప్రమాదాలను ఎదుర్కోవడానికి సరైన నిర్వహణ పద్ధతులు, అవగాహన పెంచడం దీని లక్ష్యం. ΄ోలీసు విచారణ నుండి లైఫ్ సేవర్‌ను రక్షించే వివిధ చట్టాల గురించి కూడా కోర్సులో పాల్గొనేవారికి తెలియజేస్తాం. గాయపడిన వ్యక్తికి సిపీఆర్, ప్రథమ చికిత్స ఎలా అందించాలో మేం చూపిస్తాం. ప్రజలను చేరుకోవడానికి మాకు వివిధ మార్గాలు ఉన్నాయి. ఆన్లైన్, ఆఫ్లైన్లలో సెమినార్లు ఇస్తాం. వర్క్‌షాప్‌లు, తరగతులను కూడా నిర్వహిస్తాం. అదనంగా ర్యాలీలు చేస్తాం. వీధి నాటకాలు కూడా వేయిస్తాం. ఒక చిన్న కోర్సులో మొదటి పది సెకన్లలో ఏమి చేయాలో వారికి సూచనలు అందించడానికి ్రపాధాన్యత ఇస్తాం. ఎవరికైనా ప్రమాదం జరిగినప్పుడు తలకు గాయాలు, రక్తస్రావం కోసం తనిఖీ చేయమని చెబుతాం. సమస్య ఏమిటో నిర్థారించుకున్న తర్వాత ఆ వ్యక్తికి ఊపిరి, గుండెకు సంబంధించిన సమస్య ఉంటే సీపీఆర్ని ఆశ్రయించడం ఉత్తమమైన మార్గం. అంతర్గత రక్తస్రావం, కార్డియాక్ అరెస్ట్ వంటి సమస్యలలో సీపీఆర్ మాత్రమే సహాయం చేస్తుంది. మాల్స్, విమానాశ్రయాలు వంటి బహిరంగ ప్రదేశాల్లో అత్యవసర సేవలు ఉండేలా ప్రభుత్వ సంస్థలతో కలిసి ట్రస్ట్ పని చేస్తుంది.అవగాహన లోపమే ప్రధాన అడ్డంకివర్క్షాప్లకు హాజరయ్యేందుకు ప్రజలను తీసుకురావడం మేం ఎదుర్కొంటున్న ప్రధాన అడ్డంకి. భారతీయ ప్రజానీకం ఎప్పుడూ బిజీ బిజీగా ఉంటారు. కొంత సమయాన్ని అవగాహనకు కేటాయించాలనుకోరు. మా కోర్సులకు వచ్చి, విషయాల పట్ల అవగాహన పెంచుకోక΄ోవడంతో ఇంకా తక్కువ ప్రతిస్పందన రేటునే చూస్తున్నాం. రోడ్డు ప్రమాదాల్లో భారతదేశం ముందుంది. ప్రతిస్పందనలో మాత్రం చాలా వెనుకుంది. దీంతో మన మూలాలైన గ్రామీణ ్రపాంతాలకు వెళ్లి, ప్రజలను రక్షించడానికి కావల్సిన శిక్షణ ఇవ్వాలని ΄్లాన్ చేస్తున్నాం. కోర్సులో పాల్గొన్న వ్యక్తులు స్వచ్ఛందంగా సేవ చేయడానికి లైఫ్సేవర్కి తగిన పరికరాలను ట్రస్ట్ అందిస్తుంది. హైవేలకు సమీపంలో నివసించే గ్రామస్థులకు శిక్షణ ఇవ్వడానికి అందరి నుంచి ఆర్థిక సాయం కూడా కోరుతుంటాను. ఎందుకంటే గాయపడిన వారిని చేరుకోవడానికి, మొదటగా స్పందించినవారికి.. విరాళం ఇవ్వడానికి కూడా మేము సహాయం చేస్తుంటాం’ అని వివరిస్తుంది ఈ డాక్టర్. -
పద్మశ్రీ అవార్డు గ్రహీతకు 'దిల్ రాజు' సాయం
అంతరించిపోతున్న ఆ కళకు అతడే చివరి వారసుడు. బుర్రవీణను భుజాన మోస్తూ.. రామాయణం, ఆధ్యాత్మిక, గ్రామీణ కథలకు తగ్గట్లు వాయిద్యం వాయిస్తూ.. పాటలు పాడుతూ అందరినీ అబ్బురపరిచారు దాసరి కొండప్ప. వాయిద్యం, పాట మాత్రమే తెలిసిన అతడిని కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ పురస్కారాన్ని ప్రకటించింది. నారాయణపేట జిల్లా దామరగిద్దకి చెందిన ఒలియ దాసరి కుటుంబీకుడైన కొండప్పది ఎంతో నిరుపేద కుటుంబం.. రెక్కాడితేగాని డొక్కాడని పరిస్థితి ఆయనది. తాతల కాలం నుంచే బుర్రవీణ వాయిద్యంతో భిక్షాటన చేస్తూ తమ కళా నైపుణ్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. నేడు కేంద్ర ప్రభుత్వం ఆయన్ను గుర్తించి దేశంలోనే నాలుగో అత్యున్నత పురస్కారం పద్మశ్రీ అందించడంతో ఆయన పేరు దేశవ్యాప్తంగా వైరల్ అయింది. కానీ కొన్ని సంవత్సరాలుగా తిరుమలరావు అనే వ్యక్తి ద్వారా ఆంధ్ర ప్రాంతంలో పాటలు పాడి తన కళకు గుర్తింపు సంపాదించారు. ఈ క్రమంలో ఆయన కళను గుర్తించిన ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన కూతురు నిర్మించిన బలగం చిత్రంలో ఒక పాట పాడేందుకు అవకాశం ఇచ్చారు. ఆ చిత్రంలో ‘అయ్యో శివుడా ఏమాయే ఎనకటి దానికి సరిపోయే’ అనే పాటకు తన గాత్రాన్ని అందించాడు కొండప్ప. తాజాగా కొండప్పను తన ఆఫీస్‌కు దిల్ రాజు పిలుపించుకున్నారు. ఆపై ఆయన్ను సన్మానించి గౌరవించారు. దిల్ రాజుతో పాటు బలగం డైరెక్టర్ వేణు తదితరులు కొండప్పను అభినందించారు. అనంతరం దిల్ రాజు లక్ష రూపాయల చెక్కుని కొండప్పకు అందించారు. ఆ డబ్బును కొండప్ప కోసం మాత్రమే వాడాలని సూచించారు. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. #DasariKondappa garu who sang a song and acted in the film #Balagam has been awarded the PRESTIGIOUS PADMA SHRI ❤️ The entire team met him, felicitated him and presented a cheque of 1 Lakh as a token of appreciation!@VenuYeldandi9 @PriyadarshiPN @kavyakalyanram @dopvenu pic.twitter.com/gVNabIzGNK — Dil Raju Productions (@DilRajuProdctns) February 3, 2024 -
క్రీడారంగంలో పద్మ పురస్కారాలు వీరికే..
75వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రద్మ పురస్కారాలను ప్రకటించింది. 2024 సంవత్సరానికిగాను మొత్తం 132 మంది ఈ పురస్కారాలకు ఎంపికయ్యారు. వీటిలో ఐదు పద్మ విభూషణ్, 17 పద్మభూషణ్, 110 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. ఈ ఏడాది క్రీడారంగం నుంచి మొత్తం ఏడుగురికి పద్మశ్రీ అవార్డులు దక్కాయి. వెటరన్ టెన్నిస్ డబుల్స్ స్టార్ రోహన్ బోపన్న, స్క్వాష్ ప్లేయర్ జోష్నా చినప్ప, హాకీ క్రీడాకారుడు హర్బిందర్ సింగ్, పూర్ణిమా మహతో (ఆర్చరీ), సతేంద్ర సింగ్ లోహియా (స్విమ్మింగ్), గౌరవ్ ఖన్నా (బ్యాడ్మింటన్), ఉదయ్ విశ్వనాథ్ దేశ్‌పాండేలను (మల్లఖంబ-కోచ్) పద్మశ్రీ అవార్డులు వరించాయి. -
నా సోదరి సాక్షిని చూసి గర్విస్తున్నా! చెప్పేదేమీ లేదన్న మంత్రి
న్యూఢిల్లీ: భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల ఫలితాలపై నిరసనగా తీవ్రమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు స్టార్ రెజ్లర్లు. వీరికి బధిర రెజ్లర్ వీరేందర్ సింగ్ కూడా బాసటగా నిలిచాడు. తనకు లభించిన పౌరపురస్కారం ‘పద్మశ్రీ’ని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తానని ప్రకటించాడు. సాక్షిని చూసి గర్విస్తున్నా డెఫ్ ఒలింపిక్స్ (బధిర ఒలింపిక్స్)లో స్వర్ణ విజేతగా నిలిచిన వీరేందర్ ‘గుంగా పహిల్వాన్’గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ‘భారత మానస పుత్రిక, నా సోదరి సాక్షి మలిక్ కోసం నేను నా ‘పద్మ’ పురస్కారాన్ని తిరిగి ఇచ్చేస్తా. గౌరవ ప్రధాని నరేంద్ర మోదీజీ... సాక్షిని చూసి నేనెంతో గర్వపడుతున్నాను. దేశంలోని దిగ్గజ క్రీడాకారులంతా దీనిపై స్పందించాలని నేను కోరుకుంటున్నాను’ అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో వీరేందర్ ట్వీట్ చేశాడు. స్పందించేందుకు నిరాకరించిన అనురాగ్ ఠాకూర్ మరోవైపు.. డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల ఫలితాలు, తదుపరి స్టార్ రెజ్లర్ల నిరసన నిర్ణయాలపై స్పందించేందుకు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ నిరాకరించారు. బెంగళూరులోని ‘సాయ్’ సెంటర్లో ఆసియా క్రీడల్లో పతకాలు గెలిచిన అథ్లెట్లను అభినందించే కార్యక్రమానికి హాజరైన ఆయన మాట్లాడుతూ ‘దీనిపై నేను ఇదివరకే చెప్పాల్సింది చెప్పా. ఇకపై ఎలాంటి వ్యాఖ్యలు చేయను’ అని ఠాకూర్ అన్నారు. డబ్ల్యూఎఫ్ఐ అధ్యక్షుడి ఎన్నికకు నిరసనగా కాగా డబ్ల్యూఎఫ్ఐ మాజీ అధ్యక్షుడు, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై పలువురు మహిళా రెజ్లర్లు లైంగిక వేధింపుల ఆరోపణలతో నిరసనలు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కఠిన చర్యలు తీసుకుంటామన్న ప్రభుత్వం నుంచి ఎలాంటి హామీ లభించలేదని.. అంతేగాక డబ్ల్యూఎఫ్ఐ ఎన్నికల్లో బ్రిజ్ భూషణ్ అనుచరుడు సంజయ్ సింగ్ గెలవడం తమపై ప్రభావం చూపుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే.. ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ కుస్తీకి స్వస్తి పలకగా.. మరో ఒలింపియన్ బజరంగ్ పునియా తన పద్మశ్రీ అవార్డును వెనక్కి ఇస్తున్నట్లు ప్రకటించాడు. చదవండి: నాకొద్దీ ‘పద్మశ్రీ’... అది అతడి వ్యక్తిగత నిర్ణయం.. ఏం జరుగుతోంది? -
నాకొద్దీ ‘పద్మశ్రీ’... అది అతడి వ్యక్తిగత నిర్ణయం.. ఏం జరుగుతోంది?
న్యూఢిల్లీ: దేశానికి పతకాలు తెచ్చిపెట్టిన భారత స్టార్ రెజ్లర్ల నుంచి మరో తీవ్రమైన నిర్ణయం వెలువడింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) ఎన్నికల ఫలితాలపై తీవ్ర అసంతృప్తితో ఉన్న రెజ్లర్లు ఆటకు వీడ్కోలు పలకడం, ప్రతిష్టాత్మక పౌర పురస్కారాలను వెనక్కి ఇచ్చేయడం చేస్తున్నారు. ఇది భారత క్రీడాలోకానికి మచ్చగా మిగలడం ఖాయం! డబ్ల్యూఎఫ్ఐలో తిష్ట వేసుక్కూర్చున్న వివాదాస్పద మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ చెరలోనే రెజ్లింగ్ సమాఖ్య కొనసాగనుండటం, ఆయన వీర విధేయుడు సంజయ్ సింగ్ ఎన్నికల్లో కొత్త అధ్యక్షుడిగా గెలవడంతో గురువారం రియో ఒలింపిక్స్ కాంస్య విజేత సాక్షి మలిక్ రిటైర్మెంట్ ప్రకటించింది. శుక్రవారం తాజాగా టోక్యో ఒలింపిక్స్ కాంస్య పతక విజేత బజరంగ్ పూనియా భారత ప్రభుత్వం 2019లో ఇచ్చిన పౌర పురస్కారం ‘పద్మశ్రీ’ని వెనక్కి ఇచ్చేశాడు. రోడ్డుమీదే పురస్కారాన్ని ఉంచి బజరంగ్ పార్లమెంట్ వైపు వెళ్తుండగా కర్తవ్యపథ్ వద్ద ఢిల్లీ పోలీసులు అతన్ని అడ్డుకున్నారు. దీంతో అక్కడి రోడ్డుమీదే పురస్కారాన్ని ఉంచి తన నిరసన లేఖను ప్రధాని నరేంద్ర మోదీకి చేరేలా చూడాలని పోలీసు అధికారుల్ని బజరంగ్ వేడుకొని అక్కడి నుంచి నిష్క్రమించాడు. ‘ప్రధాని మోదీకి నేను పద్మశ్రీని తిరిగి ఇచ్చేస్తున్నా. ఈ లేఖే నా ఆవేదనగా భావించాలి’ అని సోషల్ మీడియా ‘ఎక్స్’లో పేర్కొన్నాడు. నిరసనగానే ఈ నిర్ణయం ఇక ఆ లేఖలో ఏముందంటే... ‘మోదీజీ మీరు బిజీగా ఉంటారని తెలుసు. అలాగే గత కొన్నాళ్లుగా మహిళా రెజ్లర్లు పడుతున్న పాట్లు, బ్రిజ్‌భూషణ్ నుంచి ఎదుర్కొంటున్న వేధింపులు మీకు తెలుసు. దీనిపై మేం రెండుసార్లు రోడెక్కి నిరసించాం. న్యాయం చేస్తామన్న ప్రభుత్వ హామీతో మా దీక్షను విరమించాం. ముందుగా అసలు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు. తాత్సారం తర్వాతే కేసు నమోదు చేశారు. మొదట్లో బ్రిజ్‌భూషణ్‌కు వ్యతిరేకంగా 19 మంది మహిళా రెజ్లర్లు స్టేట్మెంట్ ఇస్తే తదనంతరం ఈ సంఖ్య ఏడుగురికి పడిపోయింది. దీంతో అతని పలుకుబడి ఏ రకంగా శాసిస్తుందనేది అర్థమైంది. ఇప్పుడు మళ్లీ ఆయన వర్గమే రెజ్లింగ్ సమాఖ్యకు కొత్తగా ఎన్నికైంది. దీనికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నాను’ అని బజరంగ్ లేఖలో వివరించాడు. అది అతడి వ్యక్తిగత నిర్ణయం.. ఎన్నికల విషయంలో మరోవైపు బజరంగ్ ‘పద్మశ్రీ’ని తిరిగిస్తుంటే కేంద్ర క్రీడాశాఖ తేలిగ్గా తీసుకున్నట్లుంది. వెనక్కి ఇవ్వడమనేది అతని వ్యక్తిగత నిర్ణయమని తెలిపింది. రెజ్లింగ్ ఎన్నికల్ని ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహించారని... అయినప్పటికీ బజరంగ్‌ను తన నిర్ణయం మార్చుకోవాలని కోరతామని క్రీడాశాఖ అధికారి ఒకరు తెలిపారు. -
పద్మశ్రీ అవార్డుతో నా జన్మ ధన్యం అయింది
-
నవీన్ సోదరి గీతా మెహతా కన్నుమూత
భువనేశ్వర్/కొరాపుట్: రాష్ట్ర ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సోదరి గీతా మెహతా (80) శనివారం రాత్రి న్యూఢిల్లీలోని స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆదివారం ఉదయం విషయం బయటకు రావడంతో రాష్ట్ర ప్రజలు విషాదంలో మునిగిపోయారు. ఓవైపు రాష్ట్ర వ్యాప్తంగా విశ్వ కర్మ పూజలు కోలాహలంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ నుంచి ఎటువంటి సూచనలు లేకపోయినప్పటికీ పార్టీ నాయకులు పరోక్ష సంతాప సూచకంగా ఎటువంటి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనలేదు. ముఖ్యమంత్రి నవీన్ ఆదివారం న్యూఢిల్లీ చేరుకున్న దృశ్యాలు ప్రజలు టీవీల్లో వీక్షించారు. గాంధీ కుటుంబంతో స్నేహం.. దివంగత ఉత్కళ వరపుత్రుడు బిజూ పట్నాయక్‌కు ఇద్దరు కుమారులు ప్రేమ్ పట్నాయక్, నవీన్ పట్నాయక్, ఒక కుమార్తె గీతా ఉన్నారు. వీరందరి బాల్యం లండన్‌లో జరిగింది. ప్రేమ్ ప్రముఖ పారిశ్రామికవేత్త కాగా, గతంలోనే మృతిచెందారు. గీతా అంతర్జాతీయ కవయిత్రి. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డు సైతం అందుకున్నారు. బిజూ సంతానినికి బాల్యంలో గాంధీ కుటుంబంతో స్నేహ సంబంధాలు ఉండేవి. చివరి చూపు కోసం.. నవీన్ న్యూఢిల్లీ నుంచి మీడియాతో మాట్లాడుతూ అక్క చివరి చూపు కోసం ఢిల్లీ వచ్చానని ప్రకటించారు. కాగా, నవీన్ ఉండగా ఏనాడూ అతని కుటుంబం రాజకీయాల్లో జోక్యం చేసుకోలేదు. అప్పుడప్పుడు నవీనే ఢిల్లీ వెళ్లి అక్కని చూసేవారు. గీత మృతిలో రాష్ట్రంలో విషాద ఛాయలు అలముకున్నాయి. గీతా మెహతా అంత్యక్రియలు సోమవారం జరగనున్నాయి. ఘన చరిత్ర.. దివంగత ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ కుమార్తె గీతా మెహతా రచయిత్రిగా, లఘు చిత్ర నిర్మాతగా, జర్నలిస్ట్‌గా పేరొందారు. ప్రఖ్యాత అమెరికన్ పబ్లిషర్ దివంగత సోనీ మెహతాను 1965లో గీతా మెహతా వివాహం చేసుకున్నారు. ఢిల్లీలో బిజు, జ్ఞాన్ పట్నాయక్ దంపతులకు 1943లో జన్మించిన ఆమె తన విద్యను భారత్‌తో పాటు యూకే కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో పూర్తి చేశారు. 2019లో భర్త సోనీ మెహతా మరణించినప్పటి నుంచి ఆమె భారత్‌లోనే ఉంటున్నారు. రెండేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ► కర్మ కోలా, స్నేక్ అండ్ ల్యాడర్స్, ఎ రివర్ సూత్ర, రాజ్ అండ్ ది ఎటర్నల్ గణేషా అనే మూడు పుస్తకాలను రచించారు. ► తన రచనలలో భారత చరిత్ర, సంస్కృతి, మతాన్ని చిత్రీకరించారు. ఈమె రచనలు 13 భాషల్లోకి అనువాదమయ్యాయి. 27 దేశాలలో ప్రచురితమయ్యాయి. యూకే, యూరోపియన్ దేశాలు , యునైటెడ్ స్టేట్స్ కోసం 14 బుల్లి తెర లఘు చిత్రాలను మెహతా నిర్మించి దర్శకత్వం వహించారు. ► 1970లలో నేషనల్ బ్రాడ్‌కాస్టింగ్ కంపెనీకి చెందిన యునైటెడ్ స్టేట్స్ టెలివిజన్ నెట్‌వర్క్‌కు గీత యుద్ధ ప్రతినిధిగా పని చేశారు. యూఎస్ టీవీ నెట్వర్క్ ఎన్బీసీ కోసం గీతా మెహతా బంగ్లాదేశ్ యుద్ధాన్ని కవర్ చేశారు. బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంపై డేట్లైన్ బంగ్లాదేశ్ పేరుతో శక్తివంతమైన డాక్యుమెంటరీని రూపొందించి ప్రత్యేక గుర్తింపు పొందారు. ఈ డాక్యుమెంటరీలో పాకిస్తాన్ సైనికులు చేసిన మారణహోమం, కొత్త దేశం ఆవిర్భావానికి దారితీసిన విముక్తి యుద్ధాన్ని చిత్రీకరించారు. ప్రముఖుల సంతాపం.. గీతా మెహతా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. గీతా మెహతా బహుముఖ వ్యక్తిత్వం కలిగిన మహిళగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఆమె మరణం అత్యంత బాధాకరమన్నారు. గీతా మెహతా మృతి పట్ల రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసర్ గణేషీ లాల్, కేంద్ర విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. -
అలీకి పద్మశ్రీ రావాలి
‘‘బాలనటుడిగా కెరీర్‌ని ప్రారంభించి నలభై ఐదేళ్లుగా అగ్ర హాస్య నటుడుగా కొనసాగుతున్న అలీ కారణజన్ముడు. అతనికి పద్మశ్రీ అవార్డు వస్తే చూడాలని ఉంది’’ అని సీనియర్ నటి రాజశ్రీ అన్నారు. సంగమం ఫౌండేషన్, వివేకానంద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ‘కామెడీ ఫెస్టివల్’ నిర్వహించారు. ఇందులో భాగంగా నటుడు అలీని ‘సంగమం– వివేకానంద జీవిత సాఫల్య పురస్కారం’ అవార్డుతో సత్కరించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజశ్రీ మాట్లాడుతూ–‘‘అలీ ఎంత మంచి నటుడో అంత మంచి వ్యక్తి కూడా. తనలోని సేవాగుణం స్ఫూర్తినిస్తుంది’’ అన్నారు. కాగా అలనాటి హీరో కాంతారావు కుమారుడు రాజా, వ్యాపారవేత్త రాజశేఖర్‌లు హాస్యనటి పాకీజా, కళాకారిణి హేమకుమారిలకు ఒకొక్కరికి రూ. 25000 ఆర్థిక సాయం అందించారు. వివేకానంద హాస్పిటల్స్ అధినేత డా. గీత, నటుడు తనికెళ్ల భరణి, ‘సంగమం’ సంజయ్ కిషోర్ పాల్గొన్నారు. -
పాములు పట్టే వారికి పద్మశ్రీ.. వీరిద్దరూ వరల్డ్ ఫేమస్!
సాక్షి, చెన్నై: తమిళనాడు నుంచి పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలకు ఎంపికైన వారిని గవర్నర్ ఆర్ఎన్ రవి, సీఎం ఎంకే స్టాలిన్ గురువారం అభినందించారు. వివరాలు.. 2023 సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలను బుధవారం రాత్రి రాష్ట్రపతి భవన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందులో రాష్ట్రానికి చెందిన ఆరుగురికి పురస్కారాలు లభించాయి. వీరిలో గాయని వాణీ జయరాంకు పద్మ విభూషణ్ దక్కింది. మిగిలిన ఐదుగురిని పద్మశ్రీ వరించింది. అలాగే, కల్యాణ సుందరం పిళ్లై (కళ) వడివేల్ గోపాల్, మాసి సడయన్ (సామాజిక సేవ), పాలం కల్యాణ సుందరం (సామాజిక సేవ), గోపాల్ స్వామి వేలుస్వామి (వైద్యం) ఉన్నారు. ప్రస్తుతం పద్మశ్రీతో ఇద్దరు వ్యక్తులు తమిళనాడు ప్రముఖులుగా తెర మీదకు వచ్చారు. ఆ ఇద్దరు పాములు పట్టడంలో దిట్టగా ఉండటం విశేషం. పాములను పట్టే ఇద్దరిని వరించిన ప్రతిష్టాత్మక పురస్కారం చెంగల్పట్టు నుంచి అమెరికా వరకు విషపూరిత పాములను పట్టుకోవడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన వెనుక బడిన తరగతుల సామాజిక వర్గానికి చెందిన ఇద్దరిని పద్మశ్రీ వరించింది. దీంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వివరాలు.. చెంగల్పట్టు జిల్లా సెందురి గ్రామానికి చెందిన వెనుకబడిన వర్గాలకు చెందిన వడివేల్ గోపాల్, మాసి సడయన్ పాములు పట్టాడాన్నే వృత్తిగా కొనసాగిస్తున్నారు. వంశ పారంపర్యగా వస్తున్న నేర్చుకున్న విద్యతో ఈ ఇద్దరు అమెరికా వరకు తమ సేవలను అందించారు. ప్రస్తుతం పద్మశ్రీ పురస్కారానికి సైతం ఎంపికై ఉండడం విశేషం. అంతర్జాతీయ స్థాయిలో పాములు పట్టే శిక్షణ ఇచ్చే స్థాయికి వీరు ఎదిగి ఉన్నారు. అమెరికా ఫ్లోరిడాలో కొండ చిలువలను పట్టే ప్రముఖ నిపుణుడు రోమ్లస్ విక్టోరికర్ బృందంలో ఈ ఇద్దరు సభ్యులుగా ఉండడం వెలుగులోకి వచ్చింది. కాగా తనకు పద్మశ్రీ అవార్డు రావడంపై వడివేల్ గోపాల్ మాట్లాడుతూ ఈ ఘనత అందుకోవడం ఎంతో ఆనందం కలిగిస్తోందన్నారు. అమెరికా, థాయ్‌ల్యాండ్ వంటి దేశాలలో తాము పాములు పట్టామని, అధిక విషం కలిగిన పాములు ఎన్ని పట్టామో తనకే తెలియదని పేర్కొన్నారు. మాసి సడయన్ మాట్లాడుతూ పద్మశ్రీ రావడం గొప్ప ఘతన అని ఈ ఆనందానికి మాటలు లేవని వ్యాఖ్యానించారు. ఇది కూడా చదవండి: వైద్యంలో అతడి సేవలు అమోఘం.. వరించిన పద్మశ్రీ -
1971 యుద్ధంలో సేవలు.. రెండు రూపాయల డాక్టర్‌కు పద్మశ్రీ.. ఆయన ఎవరంటే?
దేశ అత్యున్నత పురస్కారాలైన పద్మ అవార్డులను కేంద్రం బుధవారం ప్రకటించింది. 74వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్రం ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో భాగంగా ఈ ఏడాదికి ఆరుగురికి పద్మవిభూషణ్, 9 మందికి పద్మభూషణ్, 91 మంది పద్మశ్రీ అవార్డులు దక్కాయి. అత్యున్నత పౌర పురస్కారమైన భారతరత్న ఈసారి ఎవరికీ ప్రకటించలేదు. కాగా, పద్మశ్రీ అవార్డు అందుకున్న వారిలో ఓ ప్రముఖ వ్యక్తి కూడా ఉన్నారు. ఆయనే డాక్టర్ ఎమ్సీ దావర్. మధ్యప్రదేశ్‌కు చెందిన దావర్(77)ను స్థానికులు 20 రూపాయల డాక్టర్ అని కూడా పిలుస్తారు. దావర్.. అతని వద్దకు వచ్చిన పేషంట్స్‌కు కేవలం రూ.20 మాత్రమే ఫీజు తీసుకుని వారికి వైద్యం అందిస్తుంటారు. అందుకే దావర్‌కు 20 రూపాయల డాక్టర్ అనే పేరు వచ్చింది. దావర్ వివరాలు ఇవే.. మధ్యప్రదేశ్‌లోని జబల్పూర్ జిల్లాకు చెందిన డాక్టర్ ఎమ్సీ దావర్ పద్మశ్రీ దక్కించుకున్నారున. అయితే, డాక్టర్ దావర్ జనవరి 16, 1946న పాకిస్థాన్‌లోని పంజాబ్‌లో జన్మించారు. దేశ విభజన తర్వాత భారత్‌లోకి వచ్చారు. 1967లో దావర్ జబల్పూర్లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. 1971లో ఇండో-పాక్ యుద్ధ సమయంలో భారత సైన్యంలో దావర్ సుమారు ఒక సంవత్సరం పాటు పనిచేశాడు. ఆ తర్వాత 1972 నుండి జబల్పూర్లోని ప్రజలకు వైద్య సేవలు అందించడం ప్రారంభించారు. ఈ క్రమంలో పేషంట్స్ వద్ద నుంచి కేవలం రూ.2 మాత్రమే తీసుకుని వారికి వైద్యం అందించారు. ప్రస్తుతం తన ఫీజును రూ.20కి పెంచి అందరికీ వైద్యం అందిస్తున్నారు. కాగా, పద్మశ్రీ పురస్కారం వచ్చిన సందర్భంగా దావర్ కీలక వ్యాఖ్యలు చేశారు. దావర్ మీడియాతో మాట్లాడుతూ..‘కష్టపడితే కొన్నిసార్లు ఆలస్యమైనా ఫలితం మాత్రం ఉంటుంది. దాని ఫలితంగానే నేను ఈ అవార్డును అందుకున్నాను. ప్రజలకు సేవ చేయడమే మా లక్ష్యం. అందుకే పేషంట్స్ వద్ద నుంచి ఫీజులు వసూలు చేయడం లేదు. విజయం ప్రాథమిక మంత్రం ఏంటంటే.. ఓపికగా పనిచేస్తే కచ్చితంగా విజయం దక్కుతుంది. అలాగే గౌరవం కూడా అందుతుంది’ అని కామెంట్స్ చేశారు. ఇదే క్రమంలో దావర్ కుమారుడు రిషి కూడా తన తండ్రికి పద్మ పురస్కారం అందడంపై ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. రాజకీయంగా పరపతి ఉంటేనే అవార్డులు ఇస్తారని ఇన్ని రోజులు అనుకున్నాను. కానీ, ప్రభుత్వం మా లాంటి వారిని కూడా గుర్తించినందుకు ఆనందంగా ఉంది. ఇలాంటి వారిని గుర్తించి సత్కరిస్తున్న తీరు చాలా మంచి విషయం. మా నాన్నకు ఈ అవార్డు దక్కడం ఆనందంగా ఉంది అంటూ కామెంట్స్ చేశారు. అలాగే, ఇది మాకు, మా కుటుంబానికి, మా నగరానికి చాలా గర్వకారణమని దావర్ కోడలు సుచిత అన్నారు. -
కీరవాణికి పద్మశ్రీ వరించడంపై రాజమౌళి ఎమోషనల్ పోస్ట్
ప్రముఖ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణికి ప్రతిష్టాత్మక పద్మశ్రీ వరించింది. ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలకు ఆయన స్వరాలు సమకూర్చారు. తన వినసొంపైన బాణీలతో దశాబ్దాలుగా తెలుగు సినీ ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తున్నారు. కెరీర్లో ఎన్నో వందల పాటలకు మ్యూజిక్ కంపోజ్ చేశారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో మాత్రం కీరవాణి పేరు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చింది. ఆయన కంపోజ్ చేసిన నాటు నాటు సాంగ్ ఇప్పటికే ఆస్కార్ నామినేషన్స్ లో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పద్మశ్రీ పురస్కారం కూడా రావడంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా కీరవాణికి పద్మశ్రీ రావడంపై దర్శకధీరుడు రాజమౌళి స్పందించారు. ''నిజానికి ఈ గుర్తింపు ఎప్పుడో వచ్చి ఉండాల్సింది.. చాలా ఆలస్యమయ్యింది. కానీ కానీ మీరు ఎప్పుడూ చెబుతారు కదా.. మన కష్టానికి తగిన ప్రతిఫలం ఊహించని విధంగా అందుతుందని. ఒకవేళ నేనే కనుక ఈ విశ్వంతో మాట్లడగలిగితే.. కొంచెం గ్యాప్ ఇవ్వమ్మా. ఒకటి పూర్తిగా ఎంజాయ్ చేశాక ఇంకోటి ఇవ్వమని చెబుతాను''అంటూ జక్కన్న భావేద్వేగ పోస్ట్ చేశారు. దీనికి కీరవాణి వయొలిన్ వాయిస్తుండగా.. తాను కింద కూర్చున్న ఫొటోను షేర్ చేస్తూ.. నా పెద్దన్న.. పద్మశ్రీ అవార్డు గ్రహీత, గర్వంగా ఉంది అంటూ రాసుకొచ్చారు. View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) -
Chutni Mahato: పోరాటమే ఆమె 'మంత్రం'
‘చేతబడి చేస్తుందని మహిళను చెట్టుకు కట్టేసి కొట్టిన గ్రామస్తులు’ అనే వార్తను చూసే ఉంటారు. మూఢనమ్మకాల వల్ల స్త్రీలే కాదు, బాధింపబడినవారిలో పురుషులు కూడా ఉన్నారు. అవిద్య, అజ్ఞానం కారణంగా జరిగే ఇటువంటి అకృత్యాలకు చెక్ పెట్టేందుకు నడుం కట్టింది ఓ మహిళ. తనమీద పడిన నిందను దూరం చేసుకోవడానికే కాదు, సాటి అమాయక మహిళలను ఇలాంటి నిందల నుంచి దూరం చేయాలనుకుంది. ఆమె పేరే చుట్నీదేవి. జార్ఖండ్ రాష్ట్రంలో ఉంటుంది. మంత్రగత్తె అనే నెపంతో స్త్రీలను హింసించి, అనైతికంగా ప్రవర్తించేవారిపైన 25 ఏళ్లుగా పోరాటం చేసి, 125 మంది మహిళలను కాపాడింది. అందుకు గాను ఈ ఏడాది రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుంది. దేశమంతటా ఉన్న ఈ అరాచకాన్ని జార్ఖండ్‌లో పుట్టి పెరిగిన చుట్నీదేవి కథనం ద్వారా తెలుసుకోవచ్చు. పోరాటమే ఆమె ‘మంత్రం’ తనకు జరిగిన అన్యాయం ఇతరులకు జరగకూడదని గట్టిగా నిర్ణయించుకున్న 63 ఏళ్ల చుట్నీదేవి, అందుకు తన జీవితమే ఓ పాఠమైందని తెలియజేస్తుంది.. ‘‘మంత్రవిద్య ప్రయోగిస్తున్నారనే మూఢ నమ్మకంతో అమాయకులైన వారిపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా జరిగే యుద్ధంలో విజయం సాధించడం అంత సులభం కాదు. మాది జార్ఖండ్‌లోని భోలాదిహ్ గ్రామం. పన్నెండేళ్ల వయసులోనే పెళ్లయ్యి, అత్తింటికి వచ్చాను. చదవడం, రాయడం రాదు. కూలి పనులతో కుటుంబాన్ని పోషించేదాన్ని. భర్త, నలుగురు పిల్లలు. ఎప్పుడూ కుటుంబం పనుల్లో మునిగేదాన్ని. ఓసారి పక్కింటి అమ్మాయి నేను చేసిన చేతబడి వల్లే జబ్బున పడిందని గ్రామ ప్రజలు ఆరోపించారు. తర్వాత్తర్వాత అదే నిజమని ఊళ్లోవాళ్లు నమ్మడం మొదలుపెట్టారు. దాంతో నేను కంటబడితే చాలు పరిగెత్తించి పరిగెత్తించి తరిమేవారు. దాదాపు పదేళ్లపాటు నరకం అనుభవించాను. నిత్యం అవమానాలు, నిందలు. చివరిసారి జరిగిన దాష్టీకానికైతే ఎలాగోలా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాను. అది నా జీవితంలోనే అత్యంత చీకటి రోజు. చెట్టుకు కట్టేసి రెండు రోజుల పాటు దారుణంగా కొట్టారు. గొడ్డలితో దాడి చేశారు. నా ముఖంపై ఇప్పటికీ ఆ కోతల గుర్తులు ఉన్నాయి. నన్ను చంపాలని రకరకాలుగా కుట్రలు చేశారు. నువ్వు ఊరు విడిచి పారిపోవాలి, లేకపోతే చంపేస్తామని గ్రామస్తులు, గ్రామ పెద్ద దారుణంగా బెదిరించారు. నెల రోజులు అడవిలోనే... ఆ సమయంలో నా భర్త ధనుంజయ్ మహతో కూడా నాకు మద్దతుగా నిలవలేదు. ఊరి వాళ్లు చెప్పినట్టే నా భర్త చేశాడు. ప్రజలు అర్థం చేసుకోవడానికి సిద్ధంగా లేరు. ఎలాగోలా నా నలుగురు పిల్లలతో ఊరి నుంచి పారిపోయాను. అడవిలో గుడిసె వేసుకొని నెలపాటు అక్కడే నివసించాను. ఆ తర్వాత ఎలాగోలా మా తమ్ముడు ఇంటికి చేరుకుని, కొంతకాలం అక్కడే ఉన్నాను. ప్రచారంలో ఒకరిగా! అమిత్ ఖరే 1995లో పశ్చిమ సింగ్ భూమ్‌కు డిప్యూటీ కమిషనర్‌గా ఉన్నారు. మంత్రగత్తె అనే నెపంతో వేధించేవారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిసింది. అప్పుడు మా ఊళ్లో నా విషయం బయటకు రాకుండా చేశారు. అంటే, అలాంటి ప్రదేశంలోనూ ప్రజలు అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని అర్ధమైంది. నేనే నేరుగా నా సమాచారం అందించాను. వెంటనే చర్యలు తీసుకున్నారు. దీంతో ఈ ప్రచారంలో నేనూ చేరాను. మంత్రగత్తె చేరే చోటు ఎవరైనా మంత్రగత్తె అంటూ ఎవరి గురించైనా నాకు వార్తలు వచ్చినప్పుడల్లా, నేను నా బృందాన్ని కలుసుకునేదాన్ని. అసోసియేషన్ ఫర్ సోషల్ అండ్ హ్యూమన్ అవేర్నెస్ ఆధ్వర్యంలో పునరావాస కేంద్రాన్ని నడుపుతున్నాను. అటువంటి కేసుల గురించి నాకు ఎక్కడి నుండైనా సమాచారం వచ్చినప్పుడు, నేను బృందంతో చేరుకుంటాను. నిందితులను విడిచిపెట్టకూడదని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నాను. దీని ఫలితంగా, 125 మందికి పైగా మహిళలు రక్షించబడ్డారు. భరోసా కల్పిస్తూ.. బాధిత మహిళలు భయాందోళనలకు గురికావద్దని ధైర్యం చెబుతుంటాను. జిల్లా యంత్రాంగం వద్దకు వెళ్లండి. న్యాయం కోరండి. పోలీస్ స్టేషన్ లో చెప్పినా వినకపోతే ఎస్పీ వద్దకు వెళ్లండి. మానవ హక్కుల సంస్థలకు ఫిర్యాదు ఇవ్వండి.. అంటూ 35 నుంచి 40 మందిని జైలుకు కూడా పంపాం. చాలాసార్లు నిందితులు జైలుకు వెళ్లే ముందు కూడా రాజీ పడుతున్నారు. నిందితులు తాము ఇంకెప్పుడూ ఏ స్త్రీనీ మంత్రగత్తె అని నిందించబోమని చెబుతూ బాండ్ రాసి ఇచ్చేవారు. కష్టాల్లో ఉన్న మహిళలకు ఆశ్రయం మంత్రవిద్య కారణంగా సమాజానికి దూరంగా ఉంటూ బాధపడే మహిళలు దేశంలోని పలు చోట్ల నుంచి న్యాయం కోసం వస్తుంటారు. అప్పుడు వారి పక్షాన గట్టిగా నిలబడతాను. నిందితులపై పోరాడతాను. ఇటీవల సెరైకెలాకు చెందిన ఇద్దరు మహిళలు, చత్రా జిల్లాకు చెందిన ఓ మహిళ మంత్రగత్తె అనే ఆరోపణతో బాధపడుతూ వచ్చారు. ఓ మహిళ భూమిని లాక్కోవాలని ప్రయత్నించినవాళ్లు ఆమెను మంత్రగత్తె అంటూ వేధించారు. సెరైకెలాకు చెందిన మరో మహిళను మానసికంగా హింసించడం మొదలుపెట్టారు. చత్రా జిల్లాకు చెందిన బాధితురాలు కూడా అక్కడికి చేరుకుని ‘తన సొంత మామ, అతని కొడుకు తన పూర్వీకుల భూమిని లాక్కోవడానికి తనను మంత్రగత్తె అని పిలుస్తున్నాడ’ని చెప్పింది. ఈ స్త్రీలకు ఆశ్రయం ఇచ్చాను. భూతవైద్యుని నుంచి వైద్యుడి వరకు గ్రామ గ్రామాన తిరిగి, ప్రజలకు వివరిస్తాను. ఎవరైనా ఎద్దు, మేక మొదలైనవి చనిపోతే, భూతవైద్యుని వలలో పడకండి. ఒకరి బిడ్డ అనారోగ్యం పాలైతే అప్పుడు డాక్టర్ వద్దకు వెళ్లండి, చికిత్స ఉంటుంది. భూతవైద్యుని దగ్గరకు వెళ్లవద్దు. ఎవరినైనా మంత్రగత్తె అని పిలిచి వేధిస్తే, చట్టం తన పని తాను చేస్తుంది అని చెబుతున్నాను. భయం లేకుండా... ఎక్కడనుంచైనా మంత్రగత్తె అనే వార్తలు వచ్చినప్పుడల్లా, నేను కూడా అడవుల మధ్యలో ఉన్న గ్రామాలకు చేరుకుంటాను. పోలీసులు కూడా వెళ్లడానికి ఇష్టపడని ప్రాంతాలు. పంచాయితీలో, గ్రామసభలో అందరినీ సమావేశపరిచి, ఈ దురాచారాన్ని ఎందుకు మానుకోవాలో వివరిస్తాను. ప్రజల ప్రభావం కూడా ఉంటుంది. ‘మీరు మంత్రగత్తె అని పిలిచే వ్యక్తి అంత శక్తివంతమైనది అయితే, ఆమె తనను అణచివేసే వారిని ఎందుకు చంపదు’ అని చెప్తాను. ‘ఆమె మళ్లీ ఎందుకు హింసకు గురవుతుంది?’ అని ప్రశ్నిస్తాను. ఈ నిర్భయత వల్లే నన్ను ’సింహరాశి’ అని పిలవడం మొదలుపెట్టారు’ అని తన ధైర్యాన్ని మన కళ్లకు కడుతుంది చుట్నీదేవి. నిశ్శబ్దంగా కూర్చోవద్దు.. పోరాడాలి ‘నేనేమీ చదువుకోలేదు. కానీ మానవ హక్కులను అర్థం చేసుకున్నాను. మూఢనమ్మకాలకి వ్యతిరేకంగా పోరాడాలి. ఎవరైనా స్త్రీని మంత్రగత్తె అనే ఆరోపణపై చిత్రహింసలకు గురిచేస్తే మూడు నెలల జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించే చట్టం ఉంది. మంత్రగత్తె అనే పేరుతో ఎవరైనా శారీరక గాయం చేస్తే, ఆరు నెలల జైలు శిక్ష, రెండు వేల రూపాయల వరకు జరిమానా విధించే మరో నిబంధన ఉంది. మీ హక్కులు మీరు తెలుసుకోండి’’ అని మంత్రగత్తె ఆరోపణలు ఎదుర్కొంటన్నవారికి ధైర్యం చెబుతుంది చుట్నీ. పద్మశ్రీ.. తెలియదు ‘ఈ అవార్డు ఏమిటో నాకు తెలియదు. అయితే ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు రావడంతో ఇది పెద్ద అవార్డు అని తెలిసింది. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అవార్డు అందుకోవడం గర్వంగా ఉంది. అప్పటి డీసీ అమిత్ ఖరే సాహబ్‌ను కలిశాను. మహారాష్ట్ర ప్రభుత్వం ముంబైలో నన్ను సత్కరించింది.’ -
సంగీతమే ఊపిరిగా...
ఆయన కేవలం నాదస్వర విద్వాంసుడే కాదు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు. మారుమూల జన్మించి, సంగీతాన్నే దైవంగా భావించి, చివరివరకు సంగీత ప్రపంచంలోనే జీవించా రాయన. ఎన్ని సత్కారాలు అందుకున్నా, సామాన్య జీవితాన్ని గడిపారు. ఆయనే ‘పద్మశ్రీ’ పురస్కారం వచ్చిన షేక్ హసన్ సాహెబ్. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గంపల గూడెం మండలం గోసవీడులో 1928 జనవరి 1న మీరా సాహెబ్, హసన్ బీ దంపతులకు చివరి సంతానంగా ఆయన జన్మించారు. ఎనిమిదవ ఏట నుంచే సంగీత సాధన ప్రారంభించారు. 14వ ఏటే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేసి జైలు పాలయ్యారు.ౖ జెలులో కూడా గీతాలాపన చేసేవారు. ఆయన స్వర మాధుర్యాన్ని అధికారులు మెచ్చుకొని జైలు నుంచి విడుదల చేశారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేటలో ప్రముఖ సంగీత విద్వాంసుడు చిన మౌలా సాహెబ్ వద్ద వాద్య సంగీతాన్ని, ప్రముఖ గాయకుడు బాల మురళీకృష్ణ తండ్రి పట్టాభిరామయ్య వద్ద గాత్రం నేర్చుకున్నారు. 1950 నుండి 1996 వరకు భద్రాచలం రామాలయంలో ఆస్థాన విద్వాంసుడిగా పనిచేశారు. 1983లో తిరుమల తిరుపతి దేవస్థానంలోనూ నాదస్వరం వినిపించారు. స్వయంగా విద్వాంసుడే కాక ఎంతోమందికి నాద స్వరంలో శిక్షణనిచ్చారు. హిందూ, ముస్లింల ఐక్యత కోసం కృషి చేశారు. రాముడు, అల్లా ఒక్కరేనని ఎప్పుడూ చెబుతుండేవారు. తీవ్ర అనారోగ్యంతో 2021 జూన్ 23న తిరువూరులో తుదిశ్వాస విడిచారు. కేంద్రప్రభుత్వం ఇటీవలే ఆయనకు మరణానంతరం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించింది. మంచి మాటే ప్రతి మనిషికి ఆభరణమని, ఇచ్చిన మాట తప్పడం అంటే ఆ మనిషి మరణించడంతో సమానమని ఆయన ఎప్పుడూ చెబుతుండేవారు. ఆయన ధన్యజీవి. – యం. రాం ప్రదీప్, తిరువూరు -
డాక్టర్ పద్మజారెడ్డి.. సామాజికాంశాలే నా నృత్య కళ
‘‘ఈ అవార్డు నాకు శివుడు ఇచ్చిన ప్రసాదంగా భావిస్తున్నాను. నా కృషిని గుర్తించి నందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు. మా గురువు శోభానాయుడు, మా అమ్మనాన్నల ఆశీస్సులతో ఈ అవార్డు నన్ను వరించిందనుకుంటున్నాను. రానున్న రోజుల్లో నృత్యకళలో మరింతగా కృషి చేయడానికి ఈ అవార్డు నాకు ఊపిరి పోసిందనుకోవాలి. ఐదు దశాబ్దాలుగా నృత్యమే ప్రాణంగా జీవిస్తున్నాను. దాదాపు 15 ఏళ్లుగా కంటున్న నా కల ఇప్పుడు నెరవేరింది. ఈ అవార్డును మా గురువైన శోభా నాయుడు గారికి అంకితం చేస్తున్నాను’’ అన్నారు హైదరాబాద్‌లో ఉంటున్న ప్రముఖ కూచిపూడి నృత్యకారిణి డాక్టర్ పద్మజారెడ్డి. మంగళవారం ఆమెకు కేంద్రప్రభుత్వం ‘పద్మశ్రీ’ పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా ‘సాక్షి’తో ఆమె ముచ్చటించారు. ‘నేనేం చెప్పాలనుకున్నా నా నృత్యకళ ద్వారానే ప్రదర్శించగలను. సామాజిక సమస్యల పై ప్రజల్లో అవగాహన కలిగించడానికి శాస్త్రీయ నృత్యం ఎంత ప్రభావ వంతమైన సందేశాన్ని ఇవ్వగలదో నా ప్రదర్శన ద్వారా చూపడమే లక్ష్యం. నా నృత్య కృషి గురించి రాసి, ప్రజలలో మరింత గుర్తింపు తెచ్చిన ‘సాక్షి’కి ప్రత్యేక ధన్యవాదాలు’ అంటూ తన మనసులోని ఆనందాన్ని పంచుకున్నారు పద్మజారెడ్డి. కాకతీయం తెచ్చిన గుర్తింపు ‘తెలంగాణకు ప్రత్యేకమైన నాట్యకళ ‘కాకతీయం’ను నృత్య దృశ్యకావ్యంగా ఆవిష్కరించి, 2017లో ప్రదర్శించాను. ఇందుకు నృత్యంలోనే కాకుండా కాకతీయుల నాటి వస్త్రధారణకు తగినట్టుగా డ్రెస్సులు, ఆభరణాల ఎంపికలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాను. ఆ తరువాయి భాగం కాకతీయం–2 పేరుతో కిందటి నెలలో ప్రదర్శన ఇచ్చాను. వంద మంది మా అకాడమీ విద్యార్థులతో చేసిన ఈ ప్రదర్శన ఎంతోమందిని ఆకట్టుకుంది. తెలంగాణకు ఓ నృత్యరీతి ఉందని తెలియపరచడానికే నేను కృషి చేస్తున్నాను. ఈ ప్రాజెక్ట్‌ని ప్రభుత్వం ప్రధానంగా గుర్తించందనుకుంటున్నాను. అవగాహనే ప్రధానం కళలు ఉన్నవే ప్రజల్లో అవగాహన కలిగించడానికి. సమాజంలో ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజలకు కళ్లకు కట్టేలా నృత్యకళ ద్వారా చూపడమే నా ధ్యేయం. నా కళ ద్వారా జనాన్ని జాగృతం చేయడం శివాజ్ఞగా భావిస్తాను. సామాజికాంశాలలో బాలికల గురించిన అంశాలు ప్రధానంగా ఉన్నాయి. ఆడపిల్ల అని తెలియగానే గర్భంలోనే చిదిమేసే దారుణ కృత్యాలను నృత్యం ద్వారా చూపగలిగాను. అలాగే, ఎయిడ్స్ మీద అవగాహన కలిగించే అంశాలను, జాతీయ సమైక్యతా స్ఫూర్తిని పెంపొందించే నృత్యరూపకాలను చూపాను. కుటుంబ ప్రోత్సాహం మా వారు గడ్డం శ్రీనివాస్‌రెడ్డి నా ఈ కృషిని వెన్నుదన్నుగా నిలిచి అందించిన ప్రోత్సాహాన్ని మాటల్లో చెప్పలేను. అటు పుట్టిల్లు, ఇటు అత్తింటివైపు వారిలో ఎవరూ నృత్య కళలో లేరు. చిన్ననాటి నుంచి ఇష్టంతో నేర్చుకున్న కళ పెళ్లి తర్వాతా కొనసాగించాను. మా కుటుంబం వ్యాపార రంగంలో ఉంది. ఇందులో భాగం కావాలని అడిగారు. కానీ, నా ధ్యాస, శ్వాస నృత్యమే అని తెలిసి కుటుంబం నాకు అన్ని విధాలా మద్దతునిచ్చింది’’ అంటూ ఇన్నేళ్ల తన కృషిని వివరించారు పద్మజారెడ్డి. గత నెల 26న ‘కాకతీయం–2 ప్రదర్శన’ సందర్భంగా ‘సాక్షి’ ఫ్యామిలీలో ప్రచురించిన కథనం... – నిర్మలారెడ్డి -
‘పద్మ శ్రీ’మొగులయ్య.. 12 మెట్ల కిన్నెర.. తెలంగాణలో ఒక్కరే!
‘ఆడా లేడు మియాసావ్.. ఈడా లేడు మియాసావ్.. పానిగంటి గుట్టలమీద పావురాల గుండున్నదీ.. రాత్రి గాదు.. ఎలుగు గాదు.. వేగుచుక్క పొడువంగానే పుట్టిండాడు పులిబిడ్డ..’ అంటూ తన 12 మెట్ల కిన్నెరను వాయిస్తుంటే.. అటుగా వెళ్తున్న వారి కాళ్లు అక్కడే ఆగిపోతాయి. మధురమైన సంగీతం, లయబద్ధమైన పాటకు కిన్నెరపై నాట్యమాడే చిలుకను చూస్తూ చిన్నా పెద్దా తేడా లేకుండా అంతా మైమరచిపోవాల్సిందే. ఊయలలో పసిపాప నిదురపోయేటప్పుడు.. ఊడలమర్రి కింద ఊర్లో జనం సేద తీరేటప్పుడు.. వెన్నెల వాకిట్లో కురిసిన పల్లెగానం.. ఇప్పుడు నల్లమల నుంచి ఢిల్లీకి తాకింది. ప్రాచీన సంగీత వాయిద్యం ‘కిన్నెర’ కళాకారుడు దర్శనం మొగులయ్యను పద్మశ్రీ అవార్డు వరించింది. కళారంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వం దేశ నాలుగో అత్యున్నత పౌర పురస్కారంతో సత్కరించనుంది. జులపాల జుట్టు, పంచెకట్టు, కోరమీసం.. భుజం మీద 12 మెట్ల వాయిద్యంతో ఆకట్టుకునే ఆహార్యంలో ఉండే దర్శనం మొగులయ్యది నాగర్‌కర్నూల్ జిల్లా లింగాల మండలం అవుసలికుంట. ఆయన పలికించే కిన్నెర సంగీతంతో పాటు ఆలపించే వీరగాథల్లో పౌరుషం ఉప్పొంగుతుంది. పురాతన కిన్నెర వాయిద్యం నుంచి వచ్చే సంగీతం మనల్ని మరో లోకంలోకి తీసుకెళ్తుంది. జానపద గాథలైన పండుగ సాయన్న కథ, సీతమ్మ పర్ణశాల, దాదిమా ధర్మశాల, పానుగంటి మియాసాబ్, పిల్లా జాతర బోదం పిల్ల.. అంటూ పా టలు పాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ప్రాచుర్యం పొందారు. పానుగంటి మీరాసాబ్ కథ, ఎండమెట్ల ఫకీరయ్య, బండోళ్ల కురుమన్న, వట్టెం రంగనాయకమ్మ, పాలమూరు జానపద వీరుడు మియాసాబ్ గాథను కళ్లకు కట్టినట్లుగా వివరిస్తాడు. పెద్దలను కొట్టి పేదలకు పంచే పండుగ సాయన్న వీరగాథ చిన్నా పెద్దా ఆసక్తిగా వింటారు. బలిసినోళ్లను దోచి పేదవారికి పంచి పెట్టి, పేదల పెళ్లిళ్లు చేసిన పండుగ సాయన్న కథను మొగులయ్య ఎంతో ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు. ఆ పాటతో మరింత ఫేమస్ కిన్నెర కళ అంతరించిపోతుండటంతో మొగులయ్య దానికి మళ్లీ ప్రాణం పోయాలనుకున్నారు. ఈయన కళను గుర్తించి ఎంతోమంది ఆయనకు బాసటగా నిలిచారు. తెలుగు యూనివర్సిటీకి చెందిన రీసెర్చ్ స్కాలర్ దాసరి రంగ మొగులయ్యను ప్రోత్సహించారు. తద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చారు. కాలక్రమంలో ఎందరో ఆప్తులుగా మారి అండగా నిలిచారు. ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన ‘భీమ్లా నాయక్’ సినిమాలో టైటిల్ సాంగ్ పాడి మొగులయ్య మరింత ఫేమస్ అయ్యారు. అంతకు ముందు కొంతమందికే తెలిసినా ‘భీమ్లా నాయక్’ సినిమా పాటతో బాగా పాపులర్ అయ్యారు. కష్టాల్లోనూ కిన్నెరను వదలలేదు మొగులయ్య పూర్వీకులు తాతలు, ముత్తాతల కాలం నుంచి కిన్నెర వాయిస్తూనే జీవనోపాధి పొందారు. తర్వాత ఆ కుటుంబంలో ఎవరూ ఈ కళను నేర్చుకునేందుకు ఆసక్తి చూపలేదు. సుమారు 500 ఏళ్ల కిందటి నుంచి ఉపయోగిస్తున్న కిన్నెర మొదట ఏడు మెట్లు మాత్రమే ఉండేది. మొగులయ్య ప్రత్యేక శ్రద్ధతో తర్వాత 12 మెట్ల కిన్నెరగా తీర్చిదిద్ది.. ఆ వాయిద్యంతో మరిన్ని రాగాలను పలికిస్తున్నారు. నిరుపేద కుటుంబానికి చెందిన మొగులయ్యకు సెంటు భూమి లేదు. కిన్నెరనే ఆయన జీవనాధారం. అనారోగ్యంతో భార్య, కుమారులు, కుమార్తెలు ఒక్కొక్కరిగా మరణించారు. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా ఏనాడూ కిన్నెరను విడిచిపెట్టలేదు. పొట్టకూటి కోసం వరంగల్, మహారాష్ట్రలో మట్టిపని చేస్తూ కాలం ఎల్లదీశాడు. పన్నెండేళ్ల ప్రాయంలో కిన్నెర పట్టుకున్న మొగులయ్య వృద్ధాప్యం వచ్చినా.. తన కళను బతికించేందుకు తపిస్తూనే ఉన్నారు. శతాబ్దాల నాటి సంప్రదాయ పురాతన వాయిద్యం కిన్నెరను మొగులయ్య జీవనోపాధిగా చేసుకున్నాడు. ప్రస్తుతం ఈ కళను నేర్చుకునేవారు కరువయ్యారు. కిన్నెర తయారీ సైతం ఎవరూ చేయడం లేదు. అంతరించిపోతున్న దశలో ఉన్న అరుదైన కిన్నెరను 12 మెట్లుగా అభివృద్ధి చేసిన ఆయన 52 దేశాల ప్రతినిధుల ముందు ప్రదర్శనలిచ్చారు. ఈయన జీవిత చరిత్ర ఎనిమిదో తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా ఉంది. 2015లో ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది విశిష్ట పురస్కారాన్ని అందుకున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 12 మెట్ల కిన్నెరను వాయిస్తున్న కళాకారుడు మొగులయ్య ఒక్కరే. -
లోదుస్తులకు ‘బ్రాండెడ్’ మార్కెట్..‘రూప’తో కమాల్..!
లోదుస్తుల తయారీకి సంఘటిత మార్కెట్‌ను ఏర్పాటు చేసిన సంస్థగా రూప అండ్ కంపెనీని చెప్పుకోవాలి. అప్పటి వరకు చాలా చిన్న కంపెనీలే లోదుస్తులను తయారు చేసి, స్థానికంగా మార్కెట్ చేసుకునేవి. దీంతో బ్రాండెడ్ లోదుస్తులతో కస్టమర్ల మనసు గెలవాలన్న ప్రహ్లాద్ రాయ్ అగర్వాల్ ఆలోచనే.. 1969లో కోల్‌కతా కేంద్రంగా రూప అండ్ కంపెనీ ఏర్పాటుకు పునాది పండింది. ప్రహ్లాద్ రాయ్ అగర్వాల్‌తోపాటు ఘనశ్యామ్ ప్రసాద్ అగర్వాల్, కుంజ్ బిహారి అగర్వాల్ సంయుక్తంగా కంపెనీని స్థాపించారు. నేడు దేశంలోనే అతిపెద్ద లోదుస్తుల బ్రాండ్ ఇది. రూప బ్రాండ్‌తో తొలుత లోదుస్తుల తయారీని చేపట్టినా, ఆ తర్వాత వింటర్వేర్, కిడ్స్‌వేర్, ఫుట్‌వేర్‌లోకి కంపెనీ అడుగుపెట్టింది. జాన్, ఫ్రంట్‌లైన్, యూరో ఇలా 18 పాపులర్ బ్రాండ్లు ఈ కంపెనీకి ఉన్నాయి. ‘‘నాణ్యమైన, బ్రాండెడ్ ఇన్నర్‌వేర్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతుందని మాకు అనిపించింది. దీంతో ‘రూప’ పేరుతో సొంత బ్రాండ్ ఏర్పాటు చేశాం. అంతే ఇంక వెనుదిరిగి చూసింది లేదు. కస్టమర్లకు మంచి అనుభవాన్ని ఇస్తూ మార్కెట్‌ను పెంచుకున్నాం’’ అని వ్యవస్థాపకులు చెప్పారు. 2020–21లో రూ.1,311 కోట్ల టర్నోవర్‌ను ఈ సంస్థ నమోదు చేసింది. చదవండి: వీధి కుక్కలు.. శంతన్‌నాయుడు.. రతన్‌టాటా.. ఓ ఆసక్తికర కథ ! -
శెభాష్ దర్శనం మొగిలయ్య.. కిన్నెర కళాకారుడికి 'పద్మశ్రీ'
సాక్షి, హైదరాబాద్: 2022 సంవత్సరానికిగాను భారత ప్రభుత్వం పద్మ అవార్డులను ప్రకటించింది. ఎప్పటిలానే వివిధ రంగాల్లో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులను కొంతమందిని ఎంపిక చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఏడుగురిని పద్మ అవార్డులు వరించాయి. అందులో మొగిలయ్య ఒకరు. ఆయన సేవలను గుర్తించిన కేంద్రం.. తెలంగాణ నుంచి దర్శనం మొగిలయ్యకు పద్మశ్రీ అవార్డ్‌ని ప్రకటించింది. మొగిలయ్య 12 మెట్ల కిన్నెర వాయిస్తూ అంతరించిపోతున్న కళను బ్రతికిస్తూ.. కథలు చెప్పుకుంటూ తన జీవనం సాగిస్తున్నాడు. అయితే ఇటీవల పవన్ కళ్యాణ్ నటించిన 'భీమ్లా నాయక్' చిత్రంలో మొగిలయ్య టైటిల్ సాంగ్ మొదట్లో కొంత బాగాన్ని పాడిన సంగతి తెలిసిందే. ఆ పాటతో ఆయన మరింత మంది ప్రేక్షకులకు చేరువయ్యారు. -
సింగర్ సోనూ నిగమ్‌కు అరుదైన గౌరవం.. 'పద్మశ్రీ'తో సత్కారం
Singer Sonu Nigam Bags Padma Shri Award 2022: దేశంలోని అత్యున్నత పౌర పురస్కారాలలో ఒకటైన పద్మ అవార్డుల గ్రహీతల జాబితాను హోం మంత్రిత్వ శాఖ మంగళవారం (జనవరి 25) ప్రకటించింది. పద్మవిభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ అనే మూడు విభాగాల్లో ఈ ఏడాదికిగాను 128 మందికి ఈ అవార్డులు లభించాయి. ఈ అవార్డులను రాష్ట్రపతి తన అధికారిక నివాసం - రాష్ట్రపతి భవన్లో ప్రతి సంవత్సరం మార్చి లేదా ఏప్రిల్‌లో జరిగే వేడుకల్లో ప్రదానం చేస్తారు. ఇందులో భాగంగా ప్రముఖ బాలీవుడ్ సింగర్ సోనూ నిగమ్‌కు ఈ అరుదైన గౌరవ పురస్కారం దక్కింది. కళారంగంలో అనేక సేవలందించినందుకు గాను సోనూ నిగమ్‌ను 'పద్మశ్రీ' అవార్డుతో ప్రభుత్వం సత్కరించనుంది. జూలై 30, 1973న ఆగమ్ కుమార్ నిగమ్, శోభ నిగమ్ దంపతులకు హర్యానాలోని ఫరిదాబాద్‌లో జన్మించాడు సోనూ నిగమ్. నాలుగేళ్ల చిరుప్రాయం నుంచే తండ్రితోపాటు వేదికలెక్కి పాటలు పాడటం ప్రారంభించిన సోనూ అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నాడు. 18 ఏళ్ల వయసులో బాలీవుడ్లో తానేంటే నిరూపించుకోవాలని ముంబైకి వచ్చాడు. హిందుస్తానీ గాయకుడు గులాం ముస్తఫా ఖాన్ వద్ద శిక్షిణ తీసుకున్నాడు. హిందీ, బెంగాలీ, అస్సామీ, భోజ్ పురీ, ఇంగ్లీషు, కన్నడం, మలయాళం, మైథిలి, మరాఠీ, నేపాలీ, ఒరియా, పంజాబీ, తుళు, తమిళం, తెలుగు, ఉర్దూ లాంటి అనేక భాషల్లో ప్రేమ, దేశభక్తి, రాక్, వేదనా భరిత గీతాలను ఆలపించాడు. -
Kangana Ranaut: అప్పుడేం జరిగిందో చెబితే పద్శశ్రీ తిరిగి ఇచ్చేస్తా
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎప్పుడూ వివాదస్పద వ్యాఖ్యలు చేస్తుంటారన్న సంగతి తెలిసిందే. ఇటీవల 1947లో వచ్చిన స్వాతంత్ర్యం భిక్షగా అభివర్ణించారు. ప్రధాని మోడీ అధికారంలో 2014లో అసలైన స్వాతంత్ర్యం వచ్చిందని టైమ్స్ నౌ సమ్మిట్ 2021లో తెలిపారు. ఈ వ్యాఖ్యలపై రాజకీయ నాయకులు, ప్రముఖులు కంగనాను తీవ్రంగా విమర్శించారు. ఆమె అందుకున్న పద్మశ్రీ అవార్డును సైతం రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఆ డిమాండ్‌కు స్పందనగా కంగనా మరో షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆమె ప్రశ్నలకు సమాధానం చెప్పినట్లయితే ప్రతిష్టాత్మకమైన పద్మశ్రీ అవార్డును తిరిగి ఇచ్చేస్తాను అని తన ఇన్‌స్టా గ్రామ్‌లో ఇలా రాసుకొచ్చింది. 'సుభాష్ చంద్రబోస్, రాణి లక్ష్మీబాయి, వీర్ సావర్కర్ జీ వంటి మహానుభావుల త్యాగాలతో 1857లో మొదటి స్వాతంత్య్ర పోరాటం జరిగిందని అదే ఇంటర్వ్యూలో స్పష్టంగా చెప్పాను. 1857లో ఏం జరిగిందో నాకు తెలుసు. కానీ 1947లో ఏం జరిగిందో నాకు తెలీదు. ఎవరైనా నాకు చెబుతారా. అది చెప్పగలిగితే నా పద్మశ్రీని తిరిగి ఇస్తాను. క్షమాపణ కూడా చెబుతాను. దయచేసి ఇందులో నాకు సహాయం చేయండి.' 'అంతకుముందు మనకు వచ్చిన స్వాతంత్ర్యం కేవలం భౌతికమైనది. కానీ భారతదేశం 2014లో మానసికంగా విముక్తి పొందిందని ప్రత్యేకంగా చెప్పాను. చనిపోయిన నాగరికత సజీవంగా తిరిగి వచ్చింది. ఈ స్వాత్యంత్రం ఇప్పుడు గర్జిస్తూ, పైకి ఎగురుతోంది. నేడు మొదటిసారిగా ఇంగ్లీష్‌లో మాట్లాడలేనందుకు, చిన్న గ్రామాల నుంచి వస్తున్నందుకు, మేడ్ ఇన్ ఇండియా ఉత్పత్తులు వాడనందుకు ప్రజలు సిగ్గుపడలేరు. ప్రతిదీ అదే ఇంటర్వ్యూలో స్పష్టంగా ఉంది. అపరాధ భావం ఉన్నవారు దహించుకుపోతారు. దాని గురించి ఏం చేయలేం. జై హింద్.' అని తనను సమర్థించుకుంది. ఇంకా కంగనా తన స్టోరీలో 'భిక్షగా లభించిన స్వాతంత్ర్యం కూడా ఒక స్వాతంత్య్రమా ? కాంగ్రెస్ పేరుతో బ్రిటీష్ వారు ఏం వదిలేశారు. వారు బ్రిటీష్ వారి కొనసాగింపు.' అని రాసుకొచ్చింది. ఇంతకుముందు కంగనా ట్విటర్ నిబంధనలను పదే పదే ఉల్లంఘించినందుకు కంపెనీ ఆమె ఖాతాను శాశ్వతంగా సస్పెండ్ చేసింది. పశ్చిమ బెంగాల్లో ఎన్నికల అనంతరం జరిగిన హింసపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ చర్య తీసుకుంది ట్విటర్. కంగనా ఇప్పుడు తన వీడియోలు, సందేశాలను ఇన్‌స్టా గ్రామ్ ద్వారా పోస్ట్ చేస్తోంది. -
ఆవిడను చూసి అందరూ చేతులెత్తి నమస్కరించారు.. ఇంతకు ఆమె ఏం చేశారు?
డెభ్బై ఏళ్లకు పైబడ్డ తులసి చెట్టు కోటను వదిలి అడుగులో అడుగేస్తూ...రాష్ట్రపతి భవన్లో అడుగుపెట్టింది! ప్రాంగణంలో ఉన్నవారంతా ఒక్కసారిగా ఆ మెత్తటి అడుగుల దిశగా తలతిప్పి చూశారు! ఆతృతగా చూసిన ఆ చూపులు ఒక్కసారిగా తులసి దగ్గర ఆగిపోయాయి! కదిలే వన దేవతలా ఉన్న ఆమెకు మహామహులెందరో .. రెండు చేతులెత్తి నమస్కారం చేశారు. అతిరథ మహారథులను కట్టిపడేసిన తులసి..అడవిలో ప్రాణం పోసుకున్న వేలాది చెట్లకు అమ్మ! సోమవారం జరిగిన పద్మ అవార్డుల కార్యక్రమంలో..తులసి గౌడ అని పేరు పిలవగానే ఓ పెద్దావిడ..జుట్టును ముడేసుకుని, మెడలో సంప్రదాయాన్ని ప్రతిబింబించే పూసల దండలు, జాకెట్ లేకుండా, ఒంటికి చీర చుట్టుకుని, చెప్పులు కూడా వేసుకోకుండా వచ్చి, రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకుంది. ఈ దృశ్యం చూసిన వారంతా కాస్త ఆశ్చర్యంగా, తరువాత ఆనందంగానూ, అభినందనగా చూశారు. ఆమె మరెవరో కాదు, ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఫారెస్ట్‌గా పిలిచే గిరిజన మహిళ తులసీ గౌడ. గత అరవై ఏళ్లుగా వేల మొక్కలను పెంచుతూ, పర్యావరణాన్ని పరిరక్షిస్తోంది ఆమె. మొక్కలను ఎలా పెంచాలి? ఏ మొక్కలో ఎటువంటి ఔషధ గుణాలు ఉంటాయో చిటికెలో చెప్పేస్తుంది. వేలాది మొక్కల పెంపకం, ఔషధ గుణాలపై ఉన్న అపార అనుభవానికి గుర్తింపుగా దేశంలోనే అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన పద్మశ్రీ అవార్డు తులసిని వరించింది. కర్ణాటక రాష్ట్రం అనకోలా తాలుకలోని హొన్నలి గ్రామంలో పుట్టిన తులసి హక్కాళి తెగకు చెందిన గిరిజన మహిళ. అసలే నిరుపేద కుటుంబం, దీనికి తోడు తులసికి రెండేళ్లు ఉన్నప్పుడు తండ్రి మరణించాడు. పొట్టకూటికోసం తన తల్లి తోబుట్టువులతో కలిసి కూలి పనులు చేసేది. దీంతో బడికి వెళ్లి చదువుకునే అవకాశం దొరకలేదు. తులసికి పదకొండేళ్లకే బాల్య వివాహం జరిగింది. అయినా తన కష్టాలు తీరకపోగా, కొద్ది కాలంలోనే భర్త మరణించడంతో తన బాధ్యతలు, కష్టాలు మరింత పెరిగాయి. అయినా ఏమాత్రం నిరుత్సాహపడకుండా ముందుకు సాగేది. మాటలు కాదు చేతల్లో చూపింది ప్రముఖ పర్యావరణ వేత్త గ్రేటా థన్‌బర్గ్ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఇది చేయండి? అది చేయండి? భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఇవ్వండి అని వివిధ వేదికలపై గళం విప్పుతోంది. గ్రేటా కంటే చాలా చిన్నవయసులోనే పర్యావరణ పరిరక్షణకు శ్రీకారం చుట్టింది తులసీ గౌడ. చిన్నతనం నుంచి మొక్కలంటే ఇష్టమున్న తులసి మొక్కలను ఎంతో ఇష్టంగా పెంచుతుండేది. ఈ ఆసక్తిని గమనించిన ఫారెస్ట్ కన్జర్వేటర్ యల్లప్ప రెడ్డి ఆమెను తాత్కాలిక ఉద్యోగిగా నియమించుకున్నారు. విత్తనాలు నాటి అవి మొలిచి, ఏ ఆటకం లేకుండా పెరిగేలా చేయడం తులసి పని. 35 ఏళ్లపాటు నర్సరీలో రోజువారి కూలీగా పని చేసింది. తరువాత తులసి పనితీరు నచ్చడంతో శాశ్వత ఉద్యోగిగా నియమించారు. తన 15ఏళ్ల సర్వీసులో.. యూకలిప్టస్, టేకు, ఇండియన్ రోజ్ ఉడ్, ఏగిస, చండ్ర, మద్ది మొక్కలను పెంచింది. తర్వాత మామిడి, పనస చెట్లను కూడా పెంచింది. ఉద్యోగం చేసినప్పుడు కాలంలో వందల నుంచి వేల సంఖ్యలో విత్తనాలను నాటి, మొక్కలను పరిరక్షించి, వృక్షాలుగా మార్చారు. ఇలా ఇప్పటిదాకా 40వేలకు పైగా మొక్కలను నాటి వృక్షాలుగా పెంచి అడవిని సస్యశ్యామలం చేశారు. రిటైర్ అయినప్పటికీ గతంలోలాగే మొక్కల పరిరక్షణే ధ్యేయంగా ఆమె పనిచేస్తున్నారు. అంతేగా హళక్కి గిరిజన తెగ సమస్యలు, అడవుల నాశనం పైనా ఎప్పటికప్పుడు గళమెత్తుతూనే ఉన్నారు. ఇన్ని సేవలకు గుర్తింపుగా 1986లో ఇందిరా ప్రియదర్శిని వృక్షమిత్ర,, 1999లో కన్నడ రాజ్యోత్సవ అవార్డులేగాక, డజనుకుపైగా ఇతర అవార్డులు అందుకున్నారు. నడిచే వన దేవత.. విత్తనాలు ఎప్పుడు నాటాలి? మొక్కలను ఎలా పరిరక్షించాలి? వాటిని ఎలా విస్తరించాలి వంటి అనేక ప్రశ్నలకు తులసి తడుముకోకుండా చెబుతారు. అటవీ శాఖ అధికారులు, శాస్త్రవేత్తలు మొక్కల గురించి ఏ సందేహం అడిగినా చిటికెలో చెప్పేస్తుండడంతో.. పర్యావరణ వేత్తలతో సహా అంతా ‘ఎన్సైక్లోపీడియా ఆఫ్ ది ఫారెస్ట్’ అని పిలుస్తారు. విత్తనాలు నాటిన నుంచి మొక్క పెద్దయ్యేంత వరకు కాపాడుకుంటుండడం వల్ల మొక్కల దేవతగా కూడా తులసిని అభివర్ణిస్తున్నారు. తాను పెంచిన వృక్షాల్లో ఏజాతి మొక్క ఎక్కడ ఉంది, వాటిలో మొదటి మొక్క ఏది? వంటి వాటికి తులసి దగ్గర ఇట్టే సమాధానాలు దొరుకుతాయి. తల్లిమొక్క నుంచి తీసిన విత్తనాలు నాటినప్పుడు మొక్కలు ఆరోగ్యవంతంగా పెరుగుతాయి. అందువల్ల ఆమె తల్లిమొక్క నుంచి విత్తనాలు తీసి నాటేది. ఏ విత్తనాలు ఎప్పుడు తీసుకోవాలి? వాటిని ఎలా నాటాలి? మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తులసికి అపార అనుభవం ఉంది. చదువుకోకపోయినప్పటికీ తన అరవైఏళ్ల అనుభవంలో మొక్కలు, వృక్షాల గురించి ఎన్నో విషయాలను గూగుల్ కంటే వేగంగా చెబుతుంది. దీంతో చాలామంది దూరప్రాంతాల నుంచి వచ్చినవారు మొక్కల గురించి తెలుసుకుంటుంటారు. డెబ్భై పైబడినప్పటికీ ఇప్పటికీ ఇంత చురుకుగా ఉంటూ, పర్యావరణ సమతౌల్యతకి కృషిచేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు తులసి. 300 మొక్కలను గుర్తుపడుతుంది.. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారిగా 28 ఏళ్లు పనిచేసిన తరువాత తులసి గౌడను కలిసాను. అంతరించిపోతున్న భారతీయ సంప్రదాయ వృక్షాలను మళ్లీ పెంచాలనుకుంటున్న సమయంలో తులసి కనపడడం అదృష్టం, ఆమె అపార అనుభవాన్ని జోడించి అడవిని విస్తరించాలనుకున్నాను. అందువల్ల అటవీశాఖ విభాగంలో చేర్చుకుని మొక్కల పెంపకాన్ని ఆమెకు అప్పజెప్పాము.అలా పెంచుతూ పోతూ వేల మొక్కలను పెంచింది. అంతేగాక 300 ఔషధ మొక్కలను గుర్తుపట్టడంతోపాటు, రోగాలను తగ్గించే ఔషధమొక్కల పేర్లను ఆమె ఇట్టే చెప్పేస్తుంది. ఆమె విత్తనాలు వేసి పెంచిన వృక్షాలు లక్షలు కాదు కోట్లలోనే ఉంటాయి’’ అని యల్లప్ప రెడ్డి చెప్పారు. -
అద్భుతమైన ఫోటో.. రాష్ట్రపతిని ఆశీర్వదించిన 102 ఏళ్ల టీచర్
ఒడిశాకు చెందిన 102 ఏళ్ల టీచర్ నందా ప్రస్తీ మంగళవారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మ శ్రీ అవార్డు అందుకున్నారు. విద్యారంగంలో నందా చేసిన సేవలకు ఆయనకు ఈ అవార్డు వరించింది. అయితే అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో ఇంతకు మించిన మరో విషయం నెటిజన్లను ఆకర్షించింది. అవార్డు అందుకున్న ప్రస్తీ రాష్ట్రపతి కోవింద్‌ను నిండైన చేతులతో ఆశీర్వదిస్తున్న ఫోటో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ట్విటర్లో వేల రియాక్షన్లను అందుకుంటోంది. చదవండి: పద్మ అవార్డులు: చీర కొంగుతో రాష్ట్రపతిని ఆశీర్వదించింది నందా సర్ అని కూడా పిలువబడే ప్రస్ట్రీ ఒడిశాలోని జాజ్పూర్లో పిల్లలతోపాటు పెద్దలకు ఉచిత విద్యాను అందించేందుకు తనను తాను అంకితం చేసుకున్నాడు. తన గ్రామంలో నిరక్షరాస్యతను నిర్మూలించడమే అతని ప్రధాన లక్ష్యంగా చేసుకున్నాడు. ‘రాష్ట్రపతి కోవింద్ సాహిత్యం, విద్య కోసం చేసిన కృషికి నందా ప్రస్తీకి పద్మశ్రీని ప్రదానం చేశారు. ఒడిశాలోని జాజ్పూర్లో దశాబ్దాలుగా పిల్లలు, పెద్దలకు ఉచిత విద్యను అందించిన 102 ఏళ్ల “నందా సర్”, రాష్ట్రపతిని ఆశీర్వదిస్తున్నారు. అని భారత రాష్ట్రపతి ట్విటర్ అకౌంట్ ట్వీట్ చేసింది. చదవండి: పిక్ ఆఫ్ ది డే.. తులసమ్మకు జేజేలు!! కాగా ప్రస్తీని నెటిజన్లు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. విద్యపై ఆయనకున్న అంకిత భావాన్ని అభినందిస్తున్నారు. అంతేగాక రాష్ట్రపతిని ఆశీర్వదించడం ఎంతో అమూల్యం, విలువైనదని కొనియాడుతున్నారు. ‘మాటల్లో వర్ణించలేనిది. ఇది నేను కలలుగన్న భారతం. నిజమైన గురువు.. అద్భుతమైన ఫోటో. అంటూ కామెంట్ చేస్తున్నారు. చదవండి: అవమానం నుంచి పుట్టిన ఆలోచన.. నేడు పద్మశ్రీ President Kovind presents Padma Shri to Shri Nanda Prusty for Literature & Education. 102-yr-old “Nanda sir”, who provided free education to children and adults at Jajpur, Odisha for decades, raised his hands in a gesture of blessing the President. pic.twitter.com/4kXPZz5NCJ — President of India (@rashtrapatibhvn) November 9, 2021 ఇదిలా ఉండగా సోమవారం, మంగళవారం రెండు రోజులు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వివిద రంగాలకు చెందిన వారికి పద్మశ్రీ అవార్డులను ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఈ వేడుకలో ఏడు పద్మ విభూషణ్‌లు, 10 పద్మ భూషణ్, 102 పద్మ శ్రీ అవార్డులు అందించారు. వీరిలో సామాన్యుల నుంచి సెలబ్రిటీలు వరకూ ఉన్నారు. -
ఆముదం నూనె కలిపిన మట్టితో చీడపీడలకు చెక్
భూమి లోపలి నుంచి తీసి ఎండబెట్టిన 10 కిలోల మెత్తని మట్టి (సబ్ సాయిల్)కి అర లీటరు ఆముదం నూనెను బాగా కలిపి.. ఆ మిశ్రమాన్ని పంట మొక్కల పాదుల్లో లేదా డ్రిప్పర్ల వద్ద పిడికెడు వేసి నీరు అందిస్తే ఆ పంటలకు ఇక చీడపీడల బెడద అసలు ఉండదని రుజువైందని ప్రముఖ రైతు శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత చింతల వెంకట రెడ్డి (సీవీఆర్) తెలిపారు. మొక్క నాటిన/విత్తిన పది రోజులకు మొదటిసారి, అక్కడి నుంచి 15–20 రోజులకు మరోసారి పిడికెడు వేస్తే చాలు. వంగ, టమాటో, బెండ, బీర వంటి పంటలతోపాటు పత్తి, వరి, గోధుమ పంటల్లో సైతం ఈ ప్రయోగం సఫలమైందన్నారు. వంగ వంటి కూరగాయ పంటలకు పురుగు బెడద ఎక్కువ. భూమి లోపలి నుంచి తీసిన మట్టిని ఎండబెట్టి వంగ మొక్కల పాదుల వద్ద వేయడంతోపాటు, ఆ మట్టిని నీటిలో కలిపి 4–5 రోజులకోసారి పిచికారీ చేయటం ద్వారా వంగ పంటలో చీడపీడలు రాకుండా చూసుకోవచ్చని సీవీఆర్ గతంలో చెప్పారు. ఇటీవల లోపలి మట్టికి ఆముదం నూనె కలిపి పాదుల్లో లేదా డ్రిప్లర్ల దగ్గర వేస్తే పచ్చ దోమ, తెల్ల దోమ వంటి రసంపీల్చే పురుగులతోపాటు కాయ తొలిచే పురుగు కూడా ఆయా మొక్కల దరిదాపుల్లోకి రావటం లేదని గుర్తించారు. మొక్కల పెరుగుదల బాగా ఉందని, దిగుబడి కూడా బాగా వచ్చిందని సీవీఆర్ వివరించారు. ఆముదం నూనెను వాడేటప్పుడు ఎమల్సిఫయర్ ద్రావణాన్ని కలపటం పరిపాటి అని అంటూ.. లోపలి మట్టే ఎమల్సిఫయర్‌గా పనిచేస్తోందని.. ఆముదం నూనె వాసనకు చీడపీడలు దరిచేరటం లేదని గుర్తించానని వివరించారు. ఆముదం నూనె కలిపిన మట్టి మిశ్రమం వేసిన తర్వాత కుళ్లింపజేసే పశువుల ఎరువు, ఘనజీవామృతం, వర్మీకంపోస్టు వంటి సేంద్రియ ఎరువులను చెట్ల దగ్గర వేయకూడదని రైతులు గమనించాలన్నారు. అలా వేస్తే మట్టిలో కలిపి వేసిన ఆముదం నూనె (చీడపీడలను తరిమేసే) ప్రభావాన్ని కోల్పోతుందన్నారు. అదేవిధంగా, ద్రవ జీవామృతం, గోకృపామృతం, వేస్ట్ డీకంపోజర్)ను ఆముదం నూనె కలిపిన మట్టి మిశ్రమంపై పోయటం లేదా డ్రిప్ ద్వారా అందించడం కూడా చేయవద్దని సీవీఆర్ హెచ్చరించారు. అయితే, వీటిని ఆయా పంటలపై పిచికారీ చేసుకోవచ్చని సూచించారు. 10 కేజీల భూమి లోపలి నుంచి తీసిన మెత్తని పొడి మట్టికి పావు లీటరు ఆముదం నూనె, మరో పావు లీటరు వేప/కానుగ నూనెను కలిపి కూడా వేసుకోవచ్చని సీవీఆర్ సూచించారు. ఆముదం నూనె కలిపిన మట్టి మిశ్రమం 200 గ్రాములను 20 లీటర్ల నీటిలో కలిపి పంటలపై వారానికోసారి పిచికారీ చేయటం మరీ మంచిదని సీవీఆర్ తెలిపారు. చింతల వెంకట రెడ్డి -
పద్మశ్రీ పంకజాక్షి మనుమరాలు
తోలుబొమ్మలాట కళాకారిణి మూళిక్కల్ పంకజాక్షికి గత ఏడాది పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఎనభై నాలుగేళ్ల వయసులో ఈ పురస్కారం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ‘తోల్ పావకూథు, నూల్ పావకూథు’ శైలి తోలుబొమ్మలాటల ప్రదర్శనలు ఎక్కువగా ఉండేవి. తోలుబొమ్మలాటలో అత్యంత క్లిష్టమైన నొక్కు విద్య పావకళి సాధన చేసే కళాకారులు తక్కువే, ప్రదర్శనలు కూడా అరుదు. కేరళలోని ఓ కుగ్రామం మునిపల్లెలోని పంకజాక్షి నొక్కు విద్య పావకళిని సాధన చేసింది. పన్నెండేళ్ల వయసు నుంచి తల్లిదండ్రులతో కలిసి ప్రదర్శన ఇవ్వడం మొదలుపెట్టింది. 2008లో పారిస్‌లో కూడా ప్రదర్శన ఇచ్చింది. అప్పటికే ఆమెకు ఇది అరుదైన కళ మాత్రమే కాదు, అంతరించిపోవడానికి సిద్ధంగా ఉన్నదనే అవగాహన కూడా వచ్చేసింది. విదేశీ వేదిక మీద ప్రదర్శన ఇచ్చిన సంతోషం కంటే తాను మరణించేలోపు ఈ కళను ఎవరికైనా నేర్పించి చనిపోవాలనే చిన్న ఆశ ఆమెలో కలిగింది. కళ్లు మసకబారడం మొదలైంది. ప్రదర్శనలో తొట్రుపాటు వస్తోంది. క్రమంగా తనది చిన్న ఆశ కాదు, చాలా పెద్ద ఆశ అని, బహుశా తీరని కోరికగా మిగిలిపోతుందేమోననే ఆవేదన కూడా మొదలైంది. ఒక్క మనుమరాలు ఇది పన్నెండేళ్ల కిందటి మాట. పారిస్ ప్రదర్శన తర్వాత ఆమె తీసుకున్న నిర్ణయం. నొక్కు విద్య పావకళి అంతరించి పోకూడదనే కృతనిశ్చయంతో పంకజాక్షి తన ముగ్గురు మనవరాళ్లను కూర్చోబెట్టి నొక్కువిద్యకు అవసరమైన మహాభారత, రామాయణ కథలను చెప్పసాగింది. క్రమంగా వారిలో ఆసక్తి రేకెత్తించాలనేది ఆమె ప్రయత్నం. ఆ ముగ్గురిలో అమ్మమ్మ తాపత్రయాన్ని గమనించింది ఒక్క రంజని మాత్రమే. నొక్కు విద్య కథలను నోట్స్ రాసుకుంది. పంకజాక్షి భర్త బొమ్మల తయారీలో నిపుణుడు. తాత దగ్గర బొమ్మల డిస్క్రిప్షన్ కూడా సిద్ధం చేసుకుంది రంజని. ఆ తర్వాత బొమ్మలతో ప్రాక్టీస్ మొదలు పెట్టింది. కర్రను పై పెదవి మీద ఉంచి బాలెన్స్ చేస్తూ తాడుతో బొమ్మ వెనుక కట్టిన దారాలను కథనానికి అనుగుణం గా కదిలించాలి. ఇది మాటల్లో చెప్పినంత సులువేమీ కాదు. సంవత్సరాల సాధన తర్వాత రంజని నైపుణ్యం సాధించింది. ఇప్పుడు రంజనికి ఇరవై ఏళ్లు. కళను సాధన చేస్తూనే బీకామ్ డిగ్రీ చేసింది. బిజినెస్ మేనేజ్మెంట్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయనుంది. ‘‘తరతరాలుగా మా కుటుంబం ఈ కళతోనే గుర్తింపు పొందింది. కళను ప్రదర్శించిన తర్వాత ప్రేక్షకులు ఇచ్చిన కానుకలతోనే బతుకు సాగేది. క్రమంగా ప్రేక్షకాదరణ తగ్గిపోవడం తో ప్రదర్శనలూ తగ్గిపోయాయి. మా తల్లిదండ్రుల తరంలో ఇతర వృత్తుల్లో ఉపాధిని వెతుక్కోవడం మొదలైంది. అమ్మమ్మ బాధ పడడం చూసినప్పటి నుంచి ఈ కళను బతికించాలనే కోరిక కలిగింది. అందుకే నేర్చుకున్నాను. ఆ తరంలో వాళ్లకు ప్రదర్శించడం తప్ప ప్రాచుర్యం కల్పించడం తెలియదు. నేను దీనిని ప్రాచుర్యంలోకి తీసుకువస్తాను’’ అంటోంది రంజని. -
Kavi Bhandari Priya Paul: 21వ ఏటనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా
కవిభండారీ ప్రియాపాల్ 1967, ఏప్రిల్ 30న కలకత్తాలో జన్మించారు. తన చిన్న వయసులోనే తండ్రి కన్నుమూయడంతో ఆయన నడుపుతున్న మూడు హోటళ్లకు చైర్ పర్సన్ అయ్యారు. విజ్ఞతతో వ్యవహరించారు. మనసు చెప్పినట్లు చేస్తూ ఆదాయాన్ని 400 శాతం పెంచారు. 1988 నాటికి ప్రియా పాల్ వయసు 21 సంవత్సరాలు. ఆ వయసులోనే ఢిల్లీలోని ‘ది పార్క్ హోటల్స్’ మార్కెటింగ్ మేనేజర్‌గా తొలి అడుగు వేశారు. అప్పటికి హార్వర్డ్ బిజినెస్ స్కూల్, వెస్లీ కాలేజీ, ఇన్‌సీడ్‌ల నుంచి డిగ్రీలు సాధించిన ప్రియా.. జనరల్ మేనేజర్‌గా, అపీజే సురేంద్ర గ్రూప్ డైరెక్టర్‌గా, అపీజే సురేంద్ర పార్క్ హోటల్స్‌కి చైర్‌పర్సన్‌గాను నియమితులయ్యారు. దక్షిణ ఆసియా మహిళానిధికి అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఇండియన్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ సభ్యురాలిగా... పెద్ద పెద్ద బాధ్యతలే చేపట్టారు. ‘‘రెండు సంవత్సరాల క్రితం అపీజే సురేంద్ర పార్క్ హోటల్స్ చరిత్రలో మరపురాని సంఘటన చోటుచేసుకుంది. ముంబైలో ‘ది పార్క్’, సేరామ్‌పోర్‌లో ‘ది డెన్మార్క్ టావెర్న్’, జైపూర్‌లో ‘జోన్ ప్యాలెస్’ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మొత్తం 22 హోటల్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. అన్ని రాజధానుల్లోనూ ప్రారంభించాలనుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణం గా వ్యాపారంలో మా సభ్యులంతా కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారం వృద్ధి చెందేలా కృషి చేస్తారని నేను భావిస్తున్నాను’ అని ఎంతో ఆత్మవిశ్వాసంతో అంటారు ప్రియాపాల్. 2000 సంవత్సరంలో బెస్ట్ ఎంట్ర్‌ప్రెన్యూర్‌గా ‘ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ 2011లో ‘హాల్ ఆఫ్ ఫేమ్’ అవార్డులతో పాటు 2012లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 2020లో అత్యంత ప్రభావశీలమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ప్రియాపాల్ సేతు వైద్యనాథన్‌ను వివాహం చేసుకున్నారు. కలకత్తాలో పెరుగుతున్న రోజుల్లో ఫైన్ ఆర్ట్స్ పట్ల మక్కువ కనపరచటంతో, తండ్రి ప్రియాను ఆర్ట్ ఎగ్జిబిషన్స్‌కి తీసుకువెళ్లేవారు. ఆ తరవాత ఫైన్ ఆర్ట్స్ చదువుకున్నారు ప్రియా. తన కళను హోటల్స్‌ను అందంగా మలచటానికి ఉపయోగించారు. పార్క్ హోటల్స్ 1967లో ప్రారంభమయ్యాయి. ప్రియా 1988లో భాగస్వాములయ్యారు. 1992 నుంచి ప్రియా హోటల్స్‌ను అందంగా తీర్చిదిద్దటం ప్రారంభించారు. ‘‘మార్బుల్ లేదా ఇత్తడితో బొమ్మలు పేర్చటం కాదు. ఏదో ఒక థీమ్‌తో అందంగా ఉండాలి. కోల్‌కతాలోని హోటల్లో ముందుగా ఈ మార్పులు ప్రారంభించాను’’ అంటూ తన సృజన గురించి ఎంతో ఆనందంగా చెబుతారు ప్రియ. ఇప్పుడు పార్క్ హోటల్స్ అందంగా కనిపిస్తాయి. చెన్నైలోని హోటల్‌ను సినీ స్టూడియో కాన్సెప్ట్‌తో అందంగా మలిచారు. ‘నేను కొత్త విషయం తెలుసుకున్నప్పుడల్లా ఎగ్జయిట్ అవుతుంటాను. 1990లో నేను పూర్తి బాధ్యతలు స్వీకరించినప్పుడు మూడు హోటల్స్‌ను పూర్తిగా మార్చవలసి వచ్చినప్పుడు నా ఆలోచనలను ఆచరణలోకి తీసుకువచ్చాను’ అంటారు ప్రియాపాల్. అందనంత ఎత్తుకు ఎదిగారు.. ఊహించలేనన్ని విజయాలు సాధించారు... అపీజే సురేంద్ర గ్రూప్ చైర్మన్ సురేందర్ పాల్ మరణంతో ఆయన కుమార్తెగా 21 వ ఏటనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు అనుభవం లేకపోయినా మూడు హోటళ్ల నిర్వహణను స్వీకరించి, విజయం సాధించి పవర్ఫుల్ ఎంట్రప్రెన్యూర్ అనిపించుకున్నారు. మహిళా లోకానికే ఆదర్శంగా నిలిచారు ప్రియాపాల్. -
వీల్ చెయిర్..విల్ చెయిర్
పట్టుదలతో ఏదైనా మార్చుకోవచ్చు అని తన జీవితాన్ని ఉదాహరణగా చూపుతుంది దీపా మాలిక్. దేశంలో పారా ఒలింపిక్ పతకం సాధించిన మొట్టమొదటి మహిళ గా ఘనత సాధించింది. హర్యానాలో పుట్టి పెరిగిన దీప వెన్నెముకలో ఏర్పడిన కణితి కారణంగా చక్రాల కుర్చీకి పరిమితమైంది. అనేక సవాళ్లను ఎదుర్కొని పతకాలు, పురస్కారాలు అందుకుంది. తన సమస్యలతో ఇప్పటికీ పోరాడుతూనే ఆ శక్తిని కుటుంబానికీ ఇస్తూ తనలాంటి వారిలో స్ఫూర్తిని నింపుతోంది. పద్మశ్రీ, రాజీవ్ గాంధీ ఖేల్ రత్న, అర్జున అవార్డు, ఆసియా పారా గేమ్స్‌లో 4 పతకాలు, యమునా నది మీదుగా ఈత కొట్టడం ఇవన్నీ సాధించడానికి ఒక జీవితం సరిపోదేమో అనిపిస్తుంది. కానీ, వాటన్నింటినీ సాధించి, ఓడిస్తున్న జీవితం తో పోరాడి గెలిచి చూపించింది. శక్తి పుంజం దీపా మాలిక్ తన చక్రాల కుర్చీలో కూర్చోగానే ఆ కుర్చీకే శక్తి వస్తుందేమో అనిపిస్తుంది. విధికి లొంగని శక్తి పుంజం అక్కడా ప్రకాశిస్తున్నట్టుగా ఉంటుంది. ‘భగవంతుడు ఇచ్చిన శరీరాన్ని ఎప్పుడూ ఫుల్‌గా ఛార్జ్ చేసి ఉంచండి. పరుగు, ఆట, గెంతడం.. వంటి వాటితో మీలో శక్తిని నింపండి’ అని మహిళలకు చెబుతుంది. దీపా బాల్యమంతా జైపూర్ లో గడిచింది. పెళ్లై ఇద్దరు కూతుళ్లకు తల్లి ఆమె. వారిద్దరూ చదువుకుంటున్నారు. ఆత్మవిశ్వాసాన్ని తగ్గించలేదు దీపా తన కుటుంబానికి వెన్నెముక. జూన్ 3, 1999న వెన్నెముక లో కణితి ఉన్నట్టు వైద్య పరీక్షలో తేలింది. నడుస్తున్న జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు తిరిగింది. కణితి ఆపరేషన్ తర్వాత, పక్షవాతం బారిన పడింది. కొన్నాళ్లు మంచానికే పరిమితమైన దీప తనకు తాను శక్తిని కూడగట్టుకుంది. రెండు యుద్ధాలను జయించిన వేళ కార్గిల్ యుద్ధ మేఘాలు శివార్లలో ఉరుముతున్న కాలం. ఈ యుద్ధంలో దీప భర్త విక్రమ్ కూడా దేశం కోసం పోరాడుతున్నాడు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు సభ్యులు యుద్ధం చేస్తున్నప్పుడు ఇది చాలా కష్టమైన సమయం, ఒకటి దేశ శివార్లలో, మరొకటి శరీర శివార్లలో. ఈ సమయం దీప కుటుంబానికి చాలా సవాల్‌గా మారింది. కానీ చివరికి దీప కుటుంబం రెండు యుద్ధాలను గెలిచింది. ఒక వైపు భారత్ కార్గిల్ యుద్ధంలో విజయం సాధించింది. దీపకు మూడు వెన్నెముక కణితి శస్త్రచికిత్సలు విజయవంతమయ్యాయి. కానీ, పక్షవాతం రావడంతో మంచానికే పరిమితం అయ్యింది. దీంతో కొన్నిసార్లు దీప విచారంగా ఉండేది. ‘ఆ సమయంలో మా నాన్న ‘చీకటిని శపించడంలో అర్థం లేదు, నువ్వే దీపం కావాలి. అందుకే నీకా పేరు పెట్టాను’ అని చెప్పడంతో ఓ కొత్త శక్తి ఆవరించినట్టు అనిపించింది. అప్పటి నుంచి నాకు నేనుగా నిలదొక్కుకోవడానికి ఎంత ప్రయత్నం చేశానో మాటల్లో చెప్పలేను’ అని వివరించిన దీపా మాలిక్ చేతల్లో తన విజయాన్ని ప్రపంచానికి చాటింది. ఇప్పటికీ చాటుతూనే ఉంది. -
‘పద్మశ్రీ’కి విజయన్ పేరు సిఫారసు
న్యూఢిల్లీ: అఖిల భారత ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్ఎఫ్) ఫుట్‌బాల్ దిగ్గజం, మాజీ కెప్టెన్ ఐఎమ్ విజయన్ను ‘పద్మశ్రీ’ పురస్కారానికి సిఫారసు చేసింది. కేరళకు చెందిన మాజీ స్ట్రయికర్ 90వ దశకంలో భారత్ తరఫున విశేషంగా రాణించాడు. 79 అంతర్జాతీయ మ్యాచ్‌లాడిన విజయన్ 40 గోల్స్ చేశాడు. 1993, 1997, 1999లలో ‘ప్లేయర్ ఆఫ్ ద ఇయర్’గా నిలిచాడు. 2000 నుంచి 2003 వరకు జట్టు సారథిగా వ్యవహరించాడు. 2003లో ఆయనకు అర్జున అవార్డు లభించింది. అత్యున్నత నాలుగో పురస్కారమైన ‘పద్మశ్రీ’కి విజయన్ పేరును పరిశీలించాలని కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు ప్రతిపాదించామని ఏఐఎఫ్ఎఫ్ కార్యదర్శి కుశాల్ దాస్ తెలిపారు. పౌర పురస్కారానికి తనను సిఫార్సు చేయడం పట్ల విజయన్ సంతోషం వ్యక్తం చేశాడు. మరో వైపు భారత పురుషుల హాకీ జట్టు మాజీ సహాయ కోచ్ రమేశ్ పరమేశ్వరన్ ద్రోణాచార్య అవార్డు కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది హాకీ ఇండియా (హెచ్ఐ) కరియప్ప, రమేశ్ పఠానియాలను ఆ అవార్డు కోసం నామినేట్ చేయగా... పరమేశ్వరన్ సొంతంగా హాకీ కర్ణాటక అండతో దరఖాస్తు చేసుకున్నారు. -
తేలియా రుమాల్... కియా కమాల్
సంస్థాన్ నారాయణపురం: యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థాన్‌నారాయణపురం మండలం పుట్టపాకలోని చేనేత హ్యాండ్లూమ్ క్లస్టర్ పరిధిలో తయారయ్యే తేలియా రుమాల్ వస్త్రానికి భౌగోళిక గుర్తింపు (జీఐ) లభించింది. ఇది దాదాపు పేటెంట్ హక్కుతో సమానం. ఈ నెల 10న చెన్నైలోని జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ కార్యాలయం ఆమోదం తెలపగా, ఈ విషయాన్ని జీఐ అధికారులు గురువారం పుట్టపాకకు చెందిన చేనేత కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత గజం గోవర్ధనాకు ఫోన్ ద్వారా తెలిపారు. తేలియా రుమాల్ అనే వస్త్రం ప్రాచీన కళకు సంబంధించింది. ఈ వస్త్రాన్ని సహజ రంగులు, ముడిపదార్థాలతో తయారు చేస్తారు. వేసవికాలం చల్లగా, చలికాలం వెచ్చగా ఉంటుంది. పుట్టపాకలోని చేనేత కళాకారులు ఈ వస్త్రాన్ని అభివృద్ధి చేసి చీరలు, దుప్పట్లు, డ్రెస్ మెటీరియల్ రూపాల్లో తయారు చేస్తున్నారు. 2017లో హ్యాండ్లూమ్ క్లస్టర్ పేరు మీద జీఐ కోసం దరఖాస్తు చేశారు. జీఐ అధికారులు పలుమార్లు ఇక్కడికి వచ్చి వస్త్రం తయారీని పరిశీలించారు. చివరికి పుట్టపాక చేనేత కళాకారుల నైపుణ్యం గుర్తించి భౌగోళిక గుర్తింపు (జీఐ) ఇచ్చారు. ఇప్పుడు తేలియా రుమాల్ అనే వస్త్రం ఎక్కడ ఉన్నా, పుట్టపాకకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు వస్తుంది. జీఐ ఆధారంగా విదేశీయులు కూడా పుట్టపాకకు వచ్చే అవకాశం ఉంది. ఈ వస్త్రం తయారీ ద్వారానే పుట్టపాకలోని గజం గోవర్ధనా, గజం అంజయ్యతోపాటు ఎంతోమంది చేనేత కళాకారులు జాతీయ, అంతర్జాతీయ అవార్డులు, గుర్తింపు పత్రాలు అందుకున్నారు. శ్రమకు గుర్తింపు వచ్చింది పుట్టపాక చేనేత కళాకారుల శ్రమకు జీఐతో గుర్తింపు వచ్చింది. చాలా సంతోషంగా ఉంది. ప్రపంచ పటంలో పుట్టపాకకు గుర్తింపు ఉంటుంది. మాలో కొత్త ఉత్సాహం వచ్చింది. – గజం గోవర్ధనా, పద్మశ్రీ అవార్డు గ్రహీత -
‘పొద్దున నన్ను తిడుతారు.. రాత్రి నా పాటలు వింటారు’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీకి పద్మశ్రీ అవార్డు ప్రకటించడం రాజకీయ దుమారానికి దారి తీసిన విషయం తెలిసిందే. బ్రిటన్‌లో జన్మించిన, పాకిస్తాన్ సంతతికి చెందిన అద్నాన్కు పద్మశ్రీ ఎలా ఇస్తారని కాంగ్రెస్, ఎన్సీపీ నాయకులు మండిపడుతున్నారు. ఇక తనను విమర్శించిన వారికి సమీ కూడా ఘాటుగానే సమాధానం ఇస్తున్నారు. తనకు ఏ ఇతర రాజకీయ నాయకులు మధ్య విభేదాలు లేవని, ప్రభుత్వాన్ని విమర్శించడానికి నన్ను పావుగా వాడుకుంటున్నారని సమీ అన్నారు. బుధవారం ఆయన ఓ జాతీయ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. రాజకీయ ప్రత్యర్థుల మధ్య ఉన్న శత్రుత్వం కారణంగా తనపేరును ప్రతిపక్షాలు వాడుకుంటున్నాయని ఆరోపించారు. (చదవండి : బాలీవుడ్ పద్మాలు) ‘ నిజం చెప్పాలంటే.. రాజకీయ నాయకులకు నాకు మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఎందుకంటే నేను రాజకీయ నాయకుడిని కాదు. నేను సంగీత విద్వాంసుడిని. ఉదయం నా గురించి చెడుగా మాట్లాడినవారంతా.. రాత్రి సమయంలో మందు తాగుతూ.. నా పాటలు వింటూ ఉంటారు. సంగీతకారుడిగా, నా పని ప్రజలను సంగీతంతో సంతోషపెట్టడం, ప్రేమను వ్యాప్తి చేయడమే నా పని. సొంత రాజకీయాల కోసం కొంతమంది నా గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ప్రభుత్వాన్ని విమర్శించేందుకు నన్న పావుగా వాడుకుంటున్నారు. ప్రభుత్వంపై ఉన్న కోపాన్ని నాపై చూపిస్తున్నారు. అని షమీ అన్నారు. పాకిస్తాన్ సంతతికి చెందిన అద్నాన్ సమీ 2016లో భారత పౌరసత్వం పొందారు. అద్నాన్ సమీ తండ్రి పాకిస్తాన్ వైమానిక దళంలో పైలట్‌గా పనిచేశారు. 1965 యుద్ధంలో పాక్ తరఫున భారత్‌తో పోరాడారు. భారత్‌కు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి కుమారుడికి ఈ ఉన్నత స్థాయి పురస్కారాన్ని ఇవ్వడంపై పలు విమర్శలు వచ్చాయి. ‘భజన’ కారణంగానే ఈ పురస్కారం లభించిందని కాంగ్రెస్ నేత జైవీర్ షేర్గిల్ ట్వీట్ చేశారు. ఇక సమీకి పద్మశ్రీ ఇవ్వడాన్ని బీజేపీ సమర్థించింది. తన ప్రతిభతో భారత ప్రతిష్టను ఇనుమడింపజేశారని, ఆ పురస్కారానికి సమీ అన్నివిధాలా అర్హుడేనని పేర్కొన్నారు. ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తండ్రికి నియంతలు ముస్సోలినీ, హిట్లర్లతో సంబంధాలున్నాయన్న వార్తలను గుర్తు చేస్తూ.. ఆమెకు భారతీయ పౌరసత్వం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ‘భారతదేశాన్ని, ప్రధాని మోదీని, దేశ వ్యవస్థలను వ్యతిరేకించే ముస్లింలకు మాత్రమే అవార్డులు ఇవ్వాలని విపక్షాలు కోరుకుంటున్నాయి’ అని సంబిత్ పాత్ర ఆరోపించారు. అద్నాన్ సమీ తల్లి నౌరీన్ ఖాన్ జమ్మూకి చెందిన వ్యక్తి అని గుర్తు చేశారు. ‘ఆ ప్రాంత ముస్లిం మహిళలపై కాంగ్రెస్‌కు గౌరవం లేదా?’ అని ప్రశ్నించారు. లోక్‌జనశక్తి పార్టీ నేత, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కూడా సమీకి పద్మశ్రీ ప్రకటించడాన్ని సమర్ధించారు. కాగా, ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్లపై వెల్లువెత్తుతున్న నిరసనల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకునే చర్యల్లో భాగంగానే అద్నాన్ సమీకి పద్మశ్రీ పురస్కారం ప్రకటించారని ఎన్సీపీ విమర్శించింది. ఇది 130 కోట్ల భారతీయులను అవమానించడమేనని పేర్కొంది. ‘జై మోదీ’ అని నినదించిన పాక్ పౌరుడెవరైనా భారత పౌరసత్వం పొందొచ్చని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ఎద్దేవా చేశారు. -
అద్నాన్ సమీకి పద్మశ్రీనా?
ముంబై: ప్రముఖ గాయకుడు అద్నాన్ సమీకి తాజాగా పద్మశ్రీ ప్రకటించడంపై మాటల యుద్ధం ప్రారంభమైంది. బ్రిటన్‌లో జన్మించిన, పాకిస్తాన్ సంతతికి చెందిన అద్నాన్ సమీ 2016లో భారత పౌరసత్వం పొందారు. ఈ పురస్కారానికి తనను ఎంపిక చేయడం పట్ల భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూనే.. విమర్శకులపై సమీ ఘాటుగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ‘భజన’ కారణంగానే ఈ పురస్కారం లభించిందని కాంగ్రెస్ నేత జైవీర్ షేర్గిల్ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ.. ‘పిల్లవాడా..! నీ బ్రెయిన్‌ను క్లియరెన్స్ సేల్‌లో కొనుక్కున్నావా? లేక సెకండ్ హ్యాండ్ స్టోర్‌లో కొనుక్కున్నావా? తల్లిదండ్రుల చర్యలకు పిల్లలను బాధ్యులను చేయాలని నీకు బర్కిలీ వర్సిటీలో నేర్పించారా?’ అని మండిపడ్డారు. దీనికి షేర్గిల్ ట్విటర్ వేదికగానే జవాబిచ్చారు. ‘అంకుల్జీ! ట్విట్టర్లో కొన్ని అభినందనల కోసం సొంత తండ్రినే దూరం పెట్టిన వ్యక్తి నుంచి భారతీయ సంప్రదాయం గురించి పాఠాలు నేర్చుకునే అవసరం నాకు లేదు’ అని ట్వీట్ చేశారు. గత ఐదేళ్లలో భారత్‌కు చేసిన ఐదు సేవలను చెప్పాలని సమీకి సవాలు చేశారు. అద్నాన్ సమీ తండ్రి పాకిస్తాన్ వైమానిక దళంలో పైలట్‌గా పనిచేశారు. 1965 యుద్ధంలో పాక్ తరఫున భారత్‌తో పోరాడారు. భారత్‌కు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి కుమారుడికి ఈ ఉన్నత స్థాయి పురస్కారాన్ని ఇవ్వడంపై పలు విమర్శలు వచ్చాయి. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా స్పందించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ తండ్రికి నియంతలు ముస్సోలినీ, హిట్లర్లతో సంబంధాలున్నాయన్న వార్తలను గుర్తు చేస్తూ.. ఆమెకు భారతీయ పౌరసత్వం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ‘భారతదేశాన్ని, ప్రధాని మోదీని, దేశ వ్యవస్థలను వ్యతిరేకించే ముస్లింలకు మాత్రమే అవార్డులు ఇవ్వాలని విపక్షాలు కోరుకుంటున్నాయి’ అన్నారు. పద్మశ్రీ పురస్కారానికి సమీ పూర్తిగా అర్హుడని సమర్ధించారు. అద్నాన్ సమీ తల్లి నౌరీన్ ఖాన్ జమ్మూకి చెందిన వ్యక్తి అని గుర్తు చేశారు. ‘ఆ ప్రాంత ముస్లిం మహిళలపై కాంగ్రెస్‌కు గౌరవం లేదా?’ అని ప్రశ్నించారు. లోక్‌జనశక్తి పార్టీ నేత, కేంద్రమంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ కూడా సమీకి పద్మశ్రీ ప్రకటించడాన్ని సమర్ధించారు. తన ప్రతిభతో భారత ప్రతిష్టను ఇనుమడింపజేశారని, ఆ పురస్కారానికి సమీ అన్నివిధాలా అర్హుడేనని పేర్కొన్నారు. సోనియాగాంధీపై పాత్రా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందించలేదు. కాగా, ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్లపై వెల్లువెత్తుతున్న నిరసనల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకునే చర్యల్లో భాగంగానే అద్నాన్ సమీకి పద్మశ్రీ పురస్కారం ప్రకటించారని ఎన్సీపీ విమర్శించింది. ఇది 130 కోట్ల భారతీయులను అవమానించడమేనని పేర్కొంది. ‘జై మోదీ’ అని నినదించిన పాక్ పౌరుడెవరైనా భారత పౌరసత్వం పొందొచ్చని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్ మాలిక్ ఎద్దేవా చేశారు. -
యడ్ల గోపాలరావుకు పద్మశ్రీ అవార్డు
-
బ్రెజిల్ పద్మశ్రీలు
బ్రెజిల్ అధ్యక్షుడు ఈ ఏడాది మన గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చారు. బ్రెజిల్ మహిళలు ఇద్దరు ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్‌లో మన రాష్ట్రపతి భవన్‌కు విశిష్ట వ్యక్తులుగా రాబోతున్నారు. వాళ్లిద్దరూ.. లియా దిస్కిన్, గ్లోరియా అరేరియా. వాళ్లు వస్తున్నది పద్మశ్రీ అవార్డు అందుకోడానికి. ఎవరీ లియా, గ్లోరియా?! మన ‘పద్మశ్రీ’ని అందుకునేంత ఘనతను ఈ పరదేశీయులు ఏం సాధించారు?! భారత ప్రభుత్వం ఏటా ప్రదానం చేసే పౌర పురస్కారాలలో నాల్గవ అత్యున్నత పురస్కారం ‘పద్మశ్రీ’. మూడవది ‘పద్మభూషణ్’, రెండవది ‘పద్మవిభూషణ్’. మొదటిది ‘భారత రత్న’. ఆదివారం 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం రాత్రి ప్రభుత్వం 7 పద్మవిభూషణ్, 16 పద్మభూషణ్, 118 పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది. వీరిలో 34 మంది మహిళలు. ఆ ముప్ఫై నాలుగు మందిలో ఇద్దరు లియా దిస్కిన్, గ్లోరియా అరేరియా! లియా గాంధీజీ సిద్ధాంతాలతో, గ్లోరియా భారతీయ వేద వాంఙ్మయంతో తమ దేశంలో శాంతి సుస్థిరతలను, ఆధ్యాత్మిక సుసంపన్నతను నెలకొల్పేందుకు గత నాలుగు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. అందుకు దక్కిన గౌరవం, గుర్తింపే.. ‘పద్మశ్రీ’. బ్రెజిల్ గాంధీ.. లియా! సంతోషం ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఉండదు. మనలోనే ఉంటుంది. మన ఆలోచనల్లో.. మన మాటల్లో.. మన చేతల్లో ఉంటుంది. నువ్వు సంతోషంగా లేవంటే.. నీ ఆలోచన తూకం తప్పిందని. నీ మాట ఎక్కడో తూలిపడిందని. నీ పని తేలిపోయిందని. గాంధీజీ సత్యశోధన చేస్తే, లియా దిస్కిన్ సంతోష శోధన చేస్తోంది. పన్నెండేళ్ల బ్రెజిల్ అమ్మాయికి అంత శక్తి ఎక్కడిది! గాంధీమార్గాన్ని అనుసరించేంత శక్తి!! పుస్తకాలు చదవగలిగిన వయసు వచ్చేటప్పటికే గాంధీజీ.. అర్జెంటీనాలోని వాళ్లింట్లో, పుస్తకాల అరలో ఉన్నారు. 1972లో పెళ్లయి, భర్తతో కలిసి బ్రెజిల్ వచ్చేస్తున్నప్పుడు కూడా గాంధీజీ ఆమె చేతిని వదల్లేదు. గాంధీజీ జీవిత చరిత్ర ‘ది స్టోరీ ఆఫ్ మై ఎక్స్పరిమెంట్స్ విత్ ట్రూత్’తో బ్రెజిల్ సమాజంలో సంతోషాల పూల బాట వేయదలచారు లియా. గాంధీ పుట్టిన రోజును మనం అక్టోబర్ 2న మాత్రమే జరుపుకుంటాం. లియా ఆ ఒక్కరోజే కాదు, ఆ వారం అంతా చేస్తారు. ఒక్కో ఏడాది ఆ నెలంతా! బ్రిజిల్లోనూ హింస ఉంది. నేరాలు, ఘోరాలు ఉన్నాయి. గాంధీజీనే లేరు! ఎలా బ్రెజిల్‌ని గాంధీమార్గం పట్టించడం? మొదట స్కూళ్లకు వెళ్లారు లియా. తర్వాత జైళ్లకు. తర్వాత బహిరంగ ప్రదేశాలకు. అహింస అన్నారు గాంధీజీ. ఆ విషయం తన ప్రజలకు చెప్పారు లియా. శాంతి, సామరస్యం అన్నారు గాంధీజీ. ఆ సంగతీ చెప్పారు. గాంధీజీ పుస్తకాలను బ్రెజిల్‌లోని పండితుల చేత తేలిగ్గా అందరికీ అర్థం అయ్యేలా తర్జుమా చేయించి పంచిపెట్టారు. విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలకు వెళ్లి గాంధీజీ సిద్ధాంతాలపై ప్రసంగాలు ఇచ్చారు. వ్యాధులు రాకుండా పిల్లలకు టీకాలు ఇస్తారు. అలా గాంధీజీ సిద్ధాంతాలను రుచించే తియ్యటి గుళికల్లా అక్షరబద్ధం చేసి పిల్లలకు అందించారు. మనుషులపై కోపం పెంచుకుని ఉంటారు ఖైదీలు. గాంధీజీ కూడా ఖైదీగా ఉన్నవారే. ఆ ఖైదీ అనుభవాలను లియా ఈ ఖైదీలతో పంచుకున్నారు. అలా.. గాంధీజీ ముందు నడుస్తుంటే, ఆయన వెనుక ఆయన చేతికర్రను పట్టుకుని నడిచే అనుచరుల దేశంలా బ్రిజిల్ను మార్చేందుకు గత నలభై ఏళ్లుగా పట్టుదలతో పని చేస్తున్నారు లియా. ఆమె, ఆమె భర్త బాసిలో పాలోవిగ్జ్.. గాంధీజీ సిద్ధాంతాలపై ‘పలాస్ అథేనా’ ఒక సంస్థను కూడా నిర్మించారు. ఆ సంస్థ నిరంతరం సామాజిక సేవల్లో ఉంటుంది. గాంధీజీలోని తాత్వికతను బోధిస్తుంటుంది. వాళ్లే నెలకొల్పిన మరొక సంస్థ ‘కాసా డి పాండవాస్’(పాండవ గృహం) అనాథ పిల్లల్ని ఆదరిస్తుంటుంది. ఆచరించినవే చెప్పారు గాంధీజీ. గాంధీజీ జీవితాన్ని తను కూడా ఆచరించి చూపిస్తున్నారు లియా దిస్కిన్. ఆమె నిరాడంబరంగా ఉంటారు. శాకాహారం మాత్రమే భుజిస్తారు. నిష్టతో గాంధీజీ విలువల్ని పాటిస్తారు. 2006లో గాంధీజీ సత్యాగ్రహానికి నూరేళ్ల ఉత్సవాలు జరిగినప్పుడు భారత ప్రభుత్వం నుంచి లియాకు ప్రత్యేక ఆహ్వానం అందింది. 2007లో ఐక్యరాజ్య సమితి గాంధీ జయంతిని ‘అంతర్జాతీయ అహింసా దినం’గా ప్రకటించినప్పుడు సమితిలో మాట్లాడేందుకు ఇండియా ఆహ్వానించిన కొద్దిమంది ప్రపంచ ప్రసిద్ధులలో లియా ఒకరు! గాంధీజీ ప్రభావంతో లియా కొన్ని పుస్తకాలు కూడా రాశారు. విద్య, శాంతి, విలువలు, సంస్కృతీ సంప్రదాయాలు ఆ పుస్తకాల్లోని ప్రధాన అంశాలు. ఆమె రాసిన ‘పజ్, కోమో సె ఫజ్?’ (పీస్, హౌ టు మేక్?) పుస్తకం ఐదు లక్షల కాపీలకు పైగా అమ్ముడయింది. బ్రెజిల్‌లోని ఆరు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఆ పుస్తకాన్ని పిల్లల పాఠ్యాంశాల్లో ఒకటిగా చేర్చాయి. బ్రెజిల్ వేదాక్షరి.. గ్లోరియా! అన్నీ వేదాల్లోనే ఉన్నాయంటారు. అన్నీ ఉన్న ఆ వేదాలన్నిటినీ గ్లోరియా అరేరియా తన గుప్పెట పట్టేశారు! సంస్కృత పండితురాలు. వేదాంత బోధకురాలు. భారతీయులకే కొరుకుడు పడవే, ఒక బ్రెజిల్ అమ్మాయి సంస్కృతాన్ని, వేదాలను జీర్ణించుకోగలిగిందా! ఇండియా, బ్రెజిల్ అన్నవి మనుషులకే కానీ వేదాలకు కాదు. ఆసక్తి ఉంటే ఏ దేశస్థులనైనా వేదసారం అనుగ్రహిస్తుంది. ఇండియా వచ్చాక గ్లోరియా ముందుగా సంస్కృత భాష నేర్చుకున్నారు. తర్వాత వేదాల్లోకి, అద్వైతంలోకి వెళ్లారు. వాటిని పోర్చుగీసు భాషలోకి అనువదించి రియో డిజెనీరో, ఇంకా బ్రెజిల్‌లోని అనేక ప్రాంతాలలో నేటికీ బోధిస్తున్నారు. రియో ఆమె పుట్టిన ప్రదేశం. నేర్చుకునే వయసులో ఆమె గడిపినదంతా ఇండియాలో! 1974లో ముంబైలోని ఆర్ష సందీపనీ సాధనాలయలో స్వామీ దయానంద దగ్గర ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన చేశారు. తర్వాత ఉత్తరకాశి, రుషికేశ్ వెళ్లారు. అక్కడి నుంచి తమిళనాడు, కేరళ వచ్చారు. తిరిగి 1978లో బ్రెజిల్ వెళ్లిపోయారు. వెళ్లాక, రియోలో ‘విద్యామందిర్’ అనే బోధనాలయాన్ని స్థాపించి తన దేశ ప్రజలకు వేదాలను, ఉపనిషత్తులను పరిచయం చేయడం మొదలుపెట్టారు. 1984 నుంచీ గ్లోరియా అవిశ్రాంతంగా వేదజ్ఞాన వ్యాప్తికి కృషి చేస్తున్నారు. భగవద్గీతతో పాటు అనేక గ్రంథాలను అక్కడి వారికి స్థానిక భాషల్లో అందుబాటులోకి తీసుకెళ్లారు. స్వీయజ్ఞాన సాధనపై ప్రసంగాలు ఇస్తున్నారు. వేదాలు, ఉపనిషత్తులు, ద్వైతాలు, అద్వైతాలు, అవైదిక వాదాలు.. ఇవన్నీ కఠినమైన అంశాలు. వీటిని నలభై ఏళ్లుగా సులభతరం, సూక్ష్మగ్రాహ్యం చేస్తూ బ్రెజిల్‌ను భారతీయ ఆధ్యాత్మిక చింతనవైపు మళ్లిస్తున్నారు గ్లోరియా. -
ఎవరీ గీతా మెహతా?
ఒడిశా మాజీ ముఖ్యమంత్రి బిజూ పట్నాయక్ కుమార్తె గీతా మెహతా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డును తిరస్కరించడంతో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. సీనియర్ కాంగ్రెస్సేతర నేతగా, కేంద్ర మంత్రిగా కూడా దేశ ప్రజలందరికీ తెలిసిన బిజూ, పంజాబీ మహిళ జ్ఞాన్ ఏకైక కూతురు, ప్రస్తుత ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అక్క అయిన గీత తన తమ్ముడికి ఉన్న పదవి, రాష్ట్ర రాజకీయాల్లో బీజేపీ పాత్ర వల్ల పద్మ అవార్డును తిరస్కరించారు. ఆమె అన్న ప్రేమ్ పట్నాయక్ ఢిల్లీలో పెద్ద పారిశ్రామికవేత్త. లోక్‌సభ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు అవార్డు తీసుకోవడం అపార్థాలు, అపోహలకు దారితీస్తుందనే కారణంతో ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంగ్లండ్‌లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో చదువుకున్న గీత.. 1979లో ‘కర్మా కోలా–మార్కెటింగ్ ది మిస్టిక్ ఈస్ట్’ అనే పుస్తకం రాయడం ద్వారా తొలిసారి ప్రాచుర్యంలోకి వచ్చారు. ఆమె ఇంకా కొన్ని గ్రంథాలు రాయడమేగాక డాక్యుమెంటరీ సినిమాలు కూడా తీశారు. ఆమె భర్త సోనీ (అజయ్‌సింగ్)మెహతా పెంగ్విన్ వంటి ప్రఖ్యాత ప్రచురణ సంస్థల్లో ఎడిటర్‌గా పనిచేశారు. ప్రస్తుతం అమెరికాకు చెందిన నాఫ్ డబుల్డే పబ్లిషింగ్ గ్రూప్ చైర్మన్‌గా ఉన్నారు. భర్త సోనీ మెహతాతో కలిసి లండన్‌లో ఆమె నివసిస్తున్నారు. నరేంద్రమోదీ నేతృత్వంలో కేంద్రంలో బీజేపీ సర్కారు అధికారంలోకి వచ్చాక దేశంలో అసహనం పెరిగిందనే కారణంగా 2015 సెప్టెంబర్ నుంచి అనేక మంది రచయితలు, మేధావులు తాము గతంలో తీసుకున్న అవార్డులను వెనక్కి ఇచ్చేస్తున్నట్టు ప్రకటించారు. అలాగే ప్రసిద్ధ జర్నలిస్ట్, రచయిత కుష్వంత్‌సింగ్ కూడా 1984లో స్వర్ణదేవాలయం లో ఆపరేషన్ బ్లూస్టార్ పేరిట ఇందిరాగాంధీ సర్కారు జరిపించిన సైనిక చర్యకు నిరసనగా తనకు 1974లో ప్రభుత్వం ఇచ్చిన పద్మభూషణ్ అవార్డును వెనక్కి ఇచ్చారు. మోదీతో నవీన్‌ను పోల్చిన రాహుల్ గీతకు పద్మశ్రీ అవార్డు ప్రకటించిన రోజున ఒడిశాలో ఉన్న కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఈమె తమ్ముడు నవీన్ పట్నాయక్‌ను ‘నరేంద్రమోదీ తరహా నేత’అని, రిమోట్ కంట్రోల్ మోదీ చేతిలో ఉందని విమర్శించారు. ఈ నేపథ్యంలో మోదీ సర్కారు ఇచ్చిన అవార్డు స్వీకరిస్తే తనకు, నవీన్‌కు ఇబ్బందికరమని గీత భావించారు. నవీన్ దాదాపు 19 ఏళ్లుగా రాష్ట్ర సీఎంగా కొనసాగుతున్నారు. ఏప్రిల్–మేలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు ఆయన రాజకీయ జీవితంలో కీలకమైనవిగా భావిస్తున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో ఆయన చేతులు కలపలేదు. గీత అవార్డు స్వీకరిస్తే కాషాయపక్షంతో నవీన్‌కు లోపాయికారీ సంబంధాలున్నాయనే అనుమానం జనంలో రాకుండా, ఆయనకు ఇబ్బంది కలగకుండా ఉండటానికే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 2017 పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ కాంగ్రెస్‌ను రెండో స్థానంలోకి నెట్టి గణనీయంగా సీట్లు, ఓట్లు సంపాదించింది. అప్పటి నుంచీ గీత ఒడిశాకు తరచూ వస్తూ పాలకపక్షమైన బిజూజనతాదళ్(బీజేడీ) వ్యవçహారాల్లో ఆమె చురుకైన పాత్ర పోషిస్తున్నారని వార్తలొచ్చాయి. ఒక దశలో గీతను బీజేడీ టికెట్‌పై రాజ్యసభకు పంపుతారని అనుకున్నా చివరి నిమిషంలో నవీన్ మనసు మార్చుకున్నారు. తల్లి పంజాబీ కావడం, బాల్యం ఒడిశాలో గడపకపోవడంతో ఒడియాలో అనర్గళంగా ప్రసంగించలేని నవీన్ జనంతో పెద్దగా కలిసిపోయే నేత కాదు. అయితే, గీత సలహా మేరకే ఆయన ఇటీవల పుస్తకాల షాపులు, కాలేజీలు వంటి బహిరంగ ప్రదేశాల్లో ప్రజలతో కలసి మాట్లాడటమేగాక వారితో సెల్ఫీలు కూడా దిగుతున్నారు. -
ఉద్యోగం చేసే సమయంలో ఆర్ఎస్ఎస్లో ..
విశాఖపట్నం : భారత ప్రభుత్వ ఉన్నత పురస్కారం పద్మశ్రీ సిరివెన్నెలను ముద్దాడింది. ప్రజాస్వామ్య విలువలను, సమాజ శ్రేయస్సును ముందుండి నడిపిన ఆ పద సంపదకు సముచితస్థానం లభించింది. సందేశాత్మక సిన గేయ రచయితగా సుప్రసిద్ధులైన సిరివెన్నెల సీతారామశాస్త్రికి అరుదైన గౌరవం దక్కింది. గణతంత్ర దినోత్సవంలో భాగంగా భారత ప్రభుత్వం సినీ గేయరచయిత సిరివెన్నెలకు పద్మశ్రీ అవార్డును శుక్రవారం ప్రకటించింది. మూడు దశాబ్దాలుగా సినీ వీధిలో తనదైన ముద్రవేయడంతో పాటు సమాజాన్ని మెల్కోలిపే అనేక సందేశాత్మక గీతాలకు ఆయన ప్రాణం పోశారు. విశాఖ జిల్లాకు చెందిన ఆయనకు పద్మశ్రీ లభించడంపై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అనకాపల్లితో విడదీయరాని అనుబంధం సిరివెన్నెల సీతారామశాస్త్రి అసలు పేరు చేబోలు సీతారామశాస్త్రి. ఆయన తండ్రి సీవీ యోగి వేదపండితుడు. తల్లి అమ్మాజి గృహిణి. అనకాపల్లిలోని గాంధీనగర్‌లో వారి నివాసం. ఆయనకు ఇద్దరు అక్కలు, ఇద్దరు సోదరులు ఉన్నారు. అనకాపల్లిలోని మునిసిపల్ స్కూల్లో పాఠశాల విద్యను పూర్తిచేసిన ఆయన ఆంధ్ర మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం చేరారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చదువును మధ్యలోనే ఆపేసి బీఎస్ఎన్ఎల్ అనకాపల్లి శాఖలో ఉద్యోగంలో చేరారు. ఉద్యోగం చేసే సమయంలో ఆర్ఎస్ఎస్లో చురుకైన పాత్ర పోషించారు. చిన్నతనం నుంచి సందేశాత్మక దేశభక్తి గీతాలు రాసే అలవాటు ఉన్న ఆయన అనేక కార్యక్రమాల్లో గీతాలు సైతం ఆలపించేవారు. 1983లో కాకినాడలో జరిగిన ఒక కార్యక్రమంలో సినీ దర్శకుడు కె.విశ్వనాథ్‌ను కలుసుకునే అవకాశం ఆయనకు లభించింది. సీతారామశాస్త్రి ప్రతిభను గుర్తించిన విశ్వనాథ్ ఆయన చిత్రం సిరివెన్నెలలో పాటలు రాసే అవకాశాన్ని ఇచ్చారు. సినిమాలో ఆ పాటలకు మంచి గుర్తింపు లభించి సీతారామశాస్త్రి ఇంటి పేరు సిరివెన్నెలగా సుపరిచితమైంది. అనంతరం 3 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ఎన్నో సందేశాత్మక గీతాలు రాసిన సిరివెన్నెల అద్వితీయమైన గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు పద్మశ్రీ లభించడం పట్ల అనకాపల్లితో పాటు జిల్లా వ్యాప్తంగా హర్షతీరేకాలు వ్యక్తమవుతున్నాయి. -
పేదరాశి వైద్యమ్మ
చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకుంది. కూరగాయలు అమ్మి, కొడుకును డాక్టర్ని చేసింది. ఊళ్లోని పేదలకు ఉచితంగా వైద్యం చేయించింది. ఊరి కోసం పెద్ద ఆసుపత్రినే కట్టించింది. ఇప్పుడీ పేదరాశి ‘వైద్యమ్మ’ ను భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించింది! కూరగాయలు అమ్మి ఆసుపత్రి కట్టించింది! రాత్రీ పగలూ లేకుండా ఏ సమయంలో ఎవరు అనారోగ్యంతో వచ్చినా వెంటనే వారికి వైద్య సదుపాయం అందించే ఆసుపత్రి అది. మానవత్వానికి ఎప్పుడూ ద్వారాలు తెరిచి వుంచే ఆ వైద్యాలయం పశ్చిమ బెంగాల్‌లోని జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న హన్స్‌పుకూర్ గ్రామంలో పాతికేళ్ల క్రితం వెదురు గుడిసెలో ప్రారంభమైంది. నాటి నుంచీ పేదలకు ఉచితంగా వైద్యసేవలు, సదుపాయాలు అందిస్తూ ఇప్పుడు ఒకటిన్నర ఎకరం స్థలంలో 45 పడకలతో కార్పొరేట్ ఆసుపత్రులకు దీటుగా విస్తరించింది. ఈ ఆసుపత్రిలో పది ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఉండగా 17 మంది వైద్యులు సేవలు అందిస్తున్నారు. రోజూ 300 మంది ఇక్కడ ఉచితంగా వైద్యం పొందుతున్నారు. ‘హ్యుమానిటీ’ పేరుతో పేదలకు ఉదారంగా వైద్య సేవలు అందిస్తున్న ఈ ఆసుపత్రి నిర్వహణ వెనకాల ఓ వృద్ధురాలైన ఒక స్త్రీమూర్తి ఉన్నారంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒకనాడు కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించిన ఆ మహిళ.. సుభాషిణీ మిస్త్రీ. ప్రస్తుతం 78 ఏళ్ల వయసున్న సుభాషిణిని పేదలకు అందిస్తున్న సేవలకు గాను భారతప్రభుత్వం ఈ యేడు పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. కళ్ల ముందే భర్త మరణం కొడుకుతో తీరిన రుణం ఆసుపత్రి దగ్గరలో లేకపోవడం మూలాన సరైన వైద్యం అందక రోగులు దారి మధ్యలోనే ప్రాణాలు విడవడం సుభాషిణి మనసును కలిచివేసేది. అలాగే ఆమె భర్త సాధన్ చంద్ర మిస్త్రీ కూడా ఉదరకోశ సమస్యతో తగిన వైద్యం అందక తన కళ్ల ముందే ప్రాణాలు విడవడం ఆమె గుండెను ఛిద్రం చేసింది. భర్త అలా కన్ను మూస్తున్నప్పుడు నిస్సహాయంగా ఉండిపోయిన సుభాషిణి నాటి పరిస్థితులను తలుచుకుంటూ కంట తడి పెట్టుకున్నారు. ‘‘అప్పుడు నా వయసు 23 ఏళ్లు. నలుగురు చిన్న పిల్లలు. కూరగాయలు అమ్ముకుంటూ నా పిల్లలను పోషించుకున్నా. నా భర్తలా ఎవరూ వైద్యం అందక చనిపోకూడదని నిర్ణయించుకున్నాను. మా జీవనానికి పోను కొద్ది కొద్దిగా పొదుపు చేసేదాన్ని. ఆ డబ్బుతో నా పెద్ద కొడుకును డాక్టర్ని చదివించాను. నా కొడుకు డాక్టర్ అజయ్ మిస్త్రీ నా మాటపై ఉన్న ఊరిలోనే వైద్యం ప్రారంభించాడు. కూరగాయలు అమ్మే ఆ వెదురు గుడిసెలోనే రోగులను పరీక్షించేవాడు. ఆసుపత్రి అంటే సకల సదుపాయాలు ఉండాలి. అందుకు చాలా డబ్బు కావాలి. రేయింబవళ్లు ఒకటే ధ్యాస.. మంచి ఆసుపత్రి కట్టాలి. డబ్బులు కావాలి ఎలా అని. తెలిసిన డాక్టర్లతో మాట్లాడాను. అంతా లెక్క వేస్తే పేదలకు ఉచితంగా వైద్యం అందించాలంటే నెలకు కనీసం 16 లక్షల రూపాయలు కావాలని స్పష్టమైంది. నిధుల కోసం ఊరూ వాడా, పల్లె పట్నం అని తేడా లేకుండా అందరినీ కలుస్తూనే ఉన్నాను. ఇందుకు నా పిల్లల సాయం తీసుకున్నాను. ప్రకటనలు ఇచ్చాను. దక్షిణ భారతం నుంచి ఎక్కువ మంది దాతలు సాయం చేయడానికి ముందుకు వచ్చారు. ఏడాది ప్రయత్నం తర్వాత ప్రభుత్వం నుంచి సాయం అందడానికి అంగీకారం లభించింది. చెప్పలేనంత ఆనందం. ఆ క్షణం నుంచి దాతల నుంచి డబ్బు తీసుకోవడం ఆపేశాను. ఆసుపత్రి ప్రారంభమైంది. రోగుల ప్రాణాలు నిలబడ్డాయి’’ అని ఆసుపత్రి ఆవిర్భావ పరిస్థితులను, తను ఎదుర్కొన్న ఒత్తిడులను వివరించారు సుభాషిణీ మిస్త్రీ. ఆసుపత్రి పక్కనే ఓ కాలేజీ ద్వీపంలోనూ ఒక ఆసుపత్రి ఆ తర్వాత ‘‘ఈ ఆసుపత్రికి దగ్గర్లోనే నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేస్తే ఉపయుక్తంగా ఉంటుంది’’ అని స్థానిక డాక్టర్లు సుభాషిణికి చెప్పారు. ఆమె అలాగే ఏర్పాటు చేసింది. ఓసారి.. సుందర్ బన్స్‌లోని సజ్జలీయా ద్వీపంలో సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లాలంటే పడవ మీద రెండు గంటలు పడుతుందని, రోగులు నానా ఇక్కట్లు ఎదుర్కోవాల్సి వస్తోందని సుభాషిణి దృష్టికి వచ్చింది. అక్కడా ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి ఆమె నడక సాగించారు. 25 మంచాల ఆసుపత్రిని ఆ ఊళ్లో ఏర్పాటు చేశారు. ఇక్కడితో ఆమె ప్రయాణం ఆగిపోలేదు. ఝర్గామ్ జిల్లాలోని మానికపరాలో హెల్త్ క్యాంప్‌లు ఏర్పాటు చేస్తున్నారు.‘‘సుభాషిణీ మిస్త్రీ వారంలో ఒక్కో రోజు ఒక్కో ఆసుపత్రిలో రోగులకు సరైన సేవలు అందుతున్నాయా లేదా అని పర్యవేక్షిస్తుంటారు. అలాంటి మనిషి చాలా అరుదు’’ అని ఆమె గురించి తెలిసిన డాక్టర్ ఎ.పాల్ అంటారు. ఆసుపత్రుల నిర్వహణకే కాదు అనా«థ పిల్లలకు చక్కని భవిష్యత్తును ఇవ్వడానికి ఆశ్రమాల ఏర్పాటుకు ఈ వయసులోనూ ఆమె అడుగులు పరుగులు తీస్తూనే ఉన్నాయి. – ఎన్.ఆర్ కూరగాయలు అమ్ముతున్న సుభాషిణి (ఫైల్ ఫొటో) -
ఒరిజినల్ డూప్లికేట్
పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ నేరెళ్ల వేణుమాధవ్ (86) ఏడు దశాబ్దాల మిమిక్రీ కళను గుర్తిస్తూ, ఆయన పుట్టిన రోజును (డిసెంబర్ 28) పురస్కరించుకొని తెలంగాణా సర్కిల్ తపాలాశాఖ ప్రత్యేక తపాలా కవర్ని ఆవిష్కరించిన సందర్భంగా... ఈ మనిషి ముందు అద్దం పెడితే... ఈ మనిషి కాదు! అద్దం తికమక పడుతుంది. తను తప్ప ఎందరో కనబడతారు. సారీ... వినబడతారు. ఈయన డూప్లికేట్లకు కింగ్. మిమిక్రీకి ఛత్రపతి. స్వర అనుకరణకు అంకురం. మీలో ఇన్ని ధ్వనులు ఏలా ... అని అడిగితే దేవుడి ప్రతిధ్వని అన్నారు ఈ ఒరిజినల్ డూప్లికేట్ మీరెంచుకున్న మార్గం స్వరంతో ముడిపడి ఉంది. ఈ మిమిక్రీ విద్య దైవం ఇచ్చిన శక్తిగా భావిస్తారా? మీకీ కళ ఎలా అబ్బింది? నూటికి నూరుపాళ్లు దైవం ఇచ్చినదే! మా నాన్న తహసీల్దార్‌గా పనిచేసేవారు. ఇంటికి పెద్ద కొడుకుని కావడంతో నేనూ తహసీల్దార్ కావాలని ఆయన కోరిక. కానీ, నాకా పని పట్ల ఎప్పుడూ ఆసక్తి లేదు. సినిమాలంటే బాగా ఇష్టపడేవాడిని. అందులోనూ చిత్తూరు నాగయ్య సినిమా అయితే ఎన్నిసార్లు చూసేవాడినో లెక్క ఉండేది కాదు. క్లాసురూమ్‌లో కూడా సినిమా యాక్టర్లను అనుకరిస్తూ తోటివారిని సంతోషపెడుతుండేవాడిని. మా ఇంట్లో అందరూ నాకేదో పిచ్చిపట్టిందనేవారు. మా నాన్న అయితే కోపంలో ‘వీడు మన కుటుంబ లెక్కలోనే లేడు’ అని వదిలేశాడు. ఇంట్లో అందరూ నాతో అలాగే ఉండేవారు. కానీ, మా కాలేజీ ప్రిన్సిపల్ నాలో ఉన్న కళను గుర్తించాడు. ఇది అద్భుతమైన కళ. ఇదే దారిగా ఎంచుకుని వెళ్లమని సూచించారు. అప్పటి వరకు మిమిక్రీ అనేది కళగా గుర్తింపు ఎక్కడా లేదు. అసలు ఈ కళను మిమిక్రీ అనేవారే కాదు. అనుకరణ అని మాత్రమే నేను అనుకునేవాడిని. రామాయణంలో సీత పర్ణశాలలో ఉన్నప్పుడు మారీచుడు రాముని గొంతును అనుకరించాడట. ఇదే అనుకరణ గొంతుకు మొదటి ప్రాధాన్యత. నేనీ కళలోకి ప్రవేశించేంతవరకు దీనికి అంతగా ప్రాముఖ్యం లేదు. అలాంటిది ఎన్నో వేదికల మీద ఈ మిమిక్రీ కళ నన్ను ఎంతోమందికి పరిచయం చేసింది. ప్రపంచ దేశాలన్నీ తిప్పింది. పురస్కారాలు అందజేసింది. అంతా భగవంతుని కృప. ఏదీ ఉన్నపళంగా రాదని నమ్ముతాను. మనం ఎంచుకున్న మార్గానికి దైవ శక్తి తోడవ్వాలంటే నిరంతరం సాధన చేయాలి. ఈ కళలో జీవితాంతం గుర్తుండిపోయే సందర్భాన్ని ఏదైనా దైవం మీకు ఇచ్చిందా? ఎన్నో.. లెక్కలేవు. వాటిలో అమెరికా ప్రెసిడెంట్ జాన్ఎఫ్ కెనడీని అనుకరించడం, అందుకు ఆయన మెచ్చుకోవడం మరిచిపోలేనిది. అప్పట్లో ఐక్యరాజ్యసమితిలో జరిగిన సమ్మిట్‌లో నా ప్రదర్శనకు అవకాశం లభించింది. ఆ ప్రదర్శనలో బైబిల్లోని టెన్ కమాండ్‌మెంట్స్‌ని కెనడీ గొంతును అనుకరిస్తూ చెప్పాను. అంతా తెగ ఆశ్చర్యపోయారు. కెనడీ ఆనందంగా ఆలింగనం చేసుకుని, నాతో కొద్దిసేపు ముచ్చటించారు. అదో అద్భుతమైన సందర్భం. చాలా కొద్ది సందర్భాలలో తప్ప వారి ఎదుటి వారి గొంతును అనుకరించను. వారు హర్ట్ అవుతారేమో అని ఆ పని చేయను. దైవం ఉందని అనిపించిన ఘటన? మా కుటుంబం అంతా వేంకటేశ్వరస్వామి భక్తులం. నా చిన్నతనం నుంచి నాకో నమ్మకం.. మనసుపెట్టి తలచుకుంటే ఆ స్వామి నా ముందు ప్రత్యక్షం అవుతారని. నాలో భక్తి భావం ఎక్కువే. మా నాన్నగారు తరచూ తిరుమల తీసుకెళ్లేవారు. శ్రీ తిరుమల తిరుపతి వెంకటరమణా అని నామార్చన రాయించేవారు. 1950లో కంచి వైష్ణవుల ద్వారా సమాసశ్రీనామాలు స్వీకరించాను. ఈ సందర్భంగా పీఠాధిపతి మంత్రోపదేశం చేశారు. నిత్యం నియమాలు, పారిశుద్ధ్యం పాటిస్తూ జపం చేయాలని చెప్పారు. ఓ కళాకారుడిగా నేను వేర్వేరు ప్రాంతాల్లో ఉండాల్సి వస్తుంది. రైళ్లు, బస్సుల్లో ప్రయాణం చేస్తుంటాను. కాబట్టి ఈ పారిశుద్ధ్య నియమాలు పాటించలేనండి అన్నాను. ఆయన ‘ఇక్కడున్న అందరికంటే నీవే నిజమైన భక్తుడివి. పరిశుద్ధత దేహానికి కాదు, మనసుకి ఉండాలి’ అని చెప్పారు. మంచి మనసుతో చేతులు కడుక్కుని మంత్రం జపించినా మంత్ర ఫలం ఉంటుందని చెప్పారు. దైవాన్ని తలిస్తే కుళాయి నీళ్లూ మంత్ర జలం అవుతుందని ఉపదేశం చేశారు. ఇప్పటికీ నిత్యం జపం చేస్తుంటాను. ఇదంతా దైవలీల అనిపించిన సంఘటన? కళాకారుడిగా గుర్తింపు పొంది, మంచి పేరు వచ్చాక తిరుమలలో గజారోహణం జరిగింది. ఇది పూర్తిగా దైవలీలయే. ఆ రోజు తిరుమల పూజారులు మాకు ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేశారు. నేను ముందు, నా వెనక శిష్యులు ఉన్నారు. వెనక ఎక్కడో నా భార్య ఉంది. పూజ సమయంలో తను ఎక్కడుందో నాకు తెలియడం లేదు. ఆ సమయంలో ‘నాకింత గౌరవం దక్కుతుందంటే అది నా అర్ధాంగి వల్లే. ఆమె కుటుంబ పోషణలో సరైన పాత్ర పోషించడం వల్ల నేను ఇంత దూరం రాగలిగాను. ఆమెకూ ఈ సముచితగౌరవం దక్కితే బాగుంటుంది’ అనుకున్నాను. ఇంతలో ఎవరో చెప్పినట్లుగా ఓ పూజారి శిష్యులను దాటుకుని వెళ్లి పూజా సమయానికి ఆమెను నా దగ్గరికి తీసుకొచ్చాడు. తిరుమలలో గజారోహణ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. (చేతులు జోడించి ఆ స్వామిని తలుచుకుంటూ) ఆ దైవానికి నేనెలా కృతజ్ఞతలు చెప్పాలో కూడా ఆ సమయంలో అర్ధం కాలేదు. కళ్లమ్మట నీళ్లు తిరిగాయి. మీ కష్టాలు తీర్చమని దేవుడికి మొక్కుకుని, ఆ మొక్కులు తీర్చుకున్న విధానం? మొక్కులు ఓ రకంగా దేవుడికి లంచం ఇవ్వడం లాంటిదే. నేనెప్పుడూ దేవుడికి లంచం ఇవ్వలేదు(నవ్వుతూ). దేవుడు మన వెల్విషర్ అనే నమ్మకం ఉండాలి. బయటకు వెళ్లేప్పుడు దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాను. ఇలా ఎందుకంటే నన్ను నడిపించే దేవుడు నాతోనే ఉన్నాడు అనే భరోసాకు. దీంతో పనుల్లో కూడా సానుకూల ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఫలితం రాకున్నా మన ఆథ్యాత్మిక వాతావరణం కారణంగా కర్మఫలం అనుకుని సరిపెట్టుకుంటాను. దేవుడిపై నమ్మకం ఉంచి తదుపరి పనిపై దృష్టి పెడతాను. ఎంతో అనుభవసారాన్ని గ్రహించిన మీరు మీ పిల్లలకు దైవారాధనను ఎలా పరిచయం చేశారు? మిమిక్రీలో ఒక రేంజ్‌కి వెళ్లాక కుటుంబానికి టైమ్ ఇవ్వడం కుదరకపోయేది. ఇంటికి వచ్చినప్పుడు మాత్రం పిల్లలతో రకరకాల ధ్వనులతో వారిని మెస్మరైజ్ చేసేవాడిని. అలా మా ఆవిడకు కొంత పని తగ్గించేవాడిని (నవ్వుతూ) మన పిల్లలైనా సరే మన ఇష్టాయిష్టాలతో వారిని ఇబ్బంది పెట్టకూడదు అనేది నా జీవన విధానం. భక్తి, వృత్తి ఏదైనా సరే నా వరకే పరిమితం. ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించడం సరికాదు. నేను భక్తి పరుడిని కాబట్టి నా కుటుంబం అంతా నా మార్గంలోనే నడవాలనుకోకూడదు. వారి అభిప్రాయాలు, పద్ధతులనూ తండ్రిగా నేను గౌరవించాలి. నాకు ఇద్దరు అమ్మాయిలు, ఇద్దరు అబ్బాయిలు. వారు వారి వృత్తుల్లో ఆనందంగా ఉన్నారు. మీ ఈ విశ్రాంత జీవనంలో దైవారాధన ఎలా ఉంటుంది? పిల్లలు పెద్దవాళ్లై, మనవళ్లు వచ్చాక పెద్దవాళ్లకు పని తగ్గిపోతుంది. అలాగే నే చేసే పనులు తగ్గిపోయాయి. కాలక్షేపం కోసం రామకోటి, వెంకటేశ్వర నామార్చన వంటివి ఉంటాయి. కంచి పీఠాధిపతులు ఇచ్చిన మంత్రోపదేశం ఉండనే ఉంది. గతానుభవాలను, దైవాన్ని తలుచుకుంటే ఈ మిగిలిన జీవితాన్ని గడుపుతున్నాను. గతంలో వాకర్స్ అసోసియేషన్‌లో మెంబర్‌గా ఉండేవాడిని. రోజూ ఉదయం సాయంత్రం వాకింగ్‌కి వెళ్లేవాడిని. ఇప్పుడు ఎక్కువసేపు నడవలేకపోతున్నాను. అందుకే మానేశాను. ఇంట్లోనే ఉంటే బోర్ కొడుతుందని క్యారమ్ బోర్డ్ క్లబ్‌కి వెళుతుంటాను. – కృష్ణగోవింద్, సాక్షి ప్రతినిధి, వరంగల్ ఫొటోలు: పెద్ద పెల్లి వరప్రసాద్ -
రెండు కోట్లు ఇస్తే పద్మశ్రీ
గూడూరు: నేరాలను అరికట్టాల్సిన ఆయనే అందులో ఆరితేరాడు! రాష్ట్రపతి కార్యాలయం నుంచి ప్రధాని కార్యాలయం దాకా తనకు ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని చెబుతూ ఓ పోలీసు అధికారి కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టాడు. పద్మశ్రీ అవార్డు.. నామినేటెడ్ పోస్టు... రాజధాని అమరావతి సమీపంలో భూములిప్పిస్తానంటూ మోసాలకు పాల్పడిన కేసులో గుంటూరు సెంట్రల్ క్రైం స్టేషన్ సీఐ కాకర్ల శేషారావు, ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. శేషారావు, ఆయన బృందం రూ. 4 కోట్లకుపైగా గుంజినట్లు ఫిర్యాదులు దాఖలయ్యాయని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు వన్‌టౌన్ సీఐ టి.వి.సుబ్బారావు తెలిపారు. ఫేస్బుక్లో పరిచయం మొదలై... శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వడ్లపూడి గ్రామానికి చెందిన రాయపనేని రమణయ్యనాయుడు కొన్నేళ్లుగా గూడూరులోని నెహ్రూ నగర్లో ఉంటున్నారు. పలు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టి ఫేస్బుక్లో అప్లోడ్ చేయటం ఆయనకు అలవాటు. ఈ క్రమంలో 2014లో రమణయ్యనాయుడికి ఫేస్బుక్ ద్వారా గుంటూరు జిల్లా పండరీపురానికి చెందిన గడ్డం ప్రసన్నలక్ష్మి అనే మహిళ పరిచయమైంది. రమణయ్య నాయుడు గుంటూరు జిల్లాలో రాజధానికి సమీపంలో భూములు కొనుగోలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుసుకున్న ఆమె గుంటూరు సీసీఎస్‌లో సీఐగా పని చేస్తున్న తన భర్త కాకర్ల శేషారావును పరిచయం చేసింది. రమణయ్య నాయుడు ఎకరం భూమిని కొనుగోలు చేసేందుకు శేషారావుతో ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్సుగా రూ.1.50 కోట్లు ఇచ్చాడు. అయితే ఆ తరువాత పెద్దనోట్లు రద్దు కావడంతో రమణయ్య నాయుడు తన వద్ద ఉన్న మిగతా డబ్బును మార్చుకునేందుకు 2016లో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని కోరాడు. భూమిని ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పిన సీఐ శేషారావు తనకు ప్రధాని, రాష్ట్రపతి కార్యాలయాల్లో సైతం తెలిసిన వారు ఉన్నారని నమ్మకం కలిగించాడు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్లో నామినేటెడ్ పదవి ఇప్పిస్తానని చెప్పాడు. రమణయ్య నాయుడిని ఢిల్లీకి తీసుకెళ్లి రాష్ట్రపతి భవన్ వద్ద కొందరు అధికారులను కూడా పరిచయం చేశాడు. దీంతో శేషారావు మాటలను పూర్తిగా విశ్వసించిన రమణయ్య నాయుడు విడతల వారీగా రూ.2 కోట్ల విలువైన చెక్కులు ఇవ్వటంతోపాటు కొంత అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా చెల్లింపులు జరిపాడు. హైదరాబాద్ వైద్యుడికి రూ. 52 లక్షల టోకరా రమణయ్య నాయుడితోపాటు ఓ ప్రముఖ వైద్యుడు కూడా ఈ ఊబిలో చిక్కుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కమ్మెల శ్రీధర్‌కు పద్మశ్రీ అవార్డును ఆశగా చూపి అడ్వాన్సుగా రూ.52 లక్షలను శేషారావుకు ఇప్పించాడు. పద్మశ్రీ అవార్డు రావాలంటే రూ.2 కోట్లు ఇవ్వాలని, మిగతా డబ్బిస్తే వారం రోజుల్లో పని అవుతుందని సీఐ చెప్పినట్లు డాక్టర్‌కు తెలిపాడు. అప్పటికే మోసపోయానని గ్రహించిన డాక్టర్ శ్రీధర్ మిగిలిన మొత్తాన్ని ఇచ్చేది లేదని తేల్చి చెప్పాడు. విడతలవారీగా తాము చెల్లించిన రూ.4.02 కోట్లు తిరిగి ఇవ్వాలని రమణయ్య నాయుడు కోరగా సీఐ శేషారావు సమాధానం చెప్పకుండా దాటవేశాడు. డబ్బిచ్చేది లేదని మీ ఇష్టమొచ్చింది చేసుకోండని తేల్చి చెప్పటంతో రమణయ్య పోలీస్ ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. గుంటూరు ఎస్పీతోపాటు నెల్లూరు జిల్లా ఎస్పీ పీహెచ్డీ రామకృష్ణను కలిసి తాము మోసపోయినట్లు తెలిపాడు. ఈ కేసును పరిశీలించాల్సిందిగా గూడూరు డీఎస్పీ వీఎస్ రాంబాబును ఎస్పీ ఆదేశించారు. రమణయ్య నాయుడి ఫిర్యాదు మేరకు గూడూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. సీఐ కాకర్ల శేషారావు, అతడి రెండో భార్య గడ్డం ప్రసన్నలక్ష్మి, కుమారుడు హరికృష్ణ, కోడలు మౌనిక, మామ గురవయ్యలను శనివారం అరెస్ట్ చేశారు. -
వనజీవి రామయ్యకు తుమ్మల పరామర్శ
హైదరాబాద్: బంజారాహిల్స్ కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పద్మశ్రీ వనజీవి దరిపల్లి రామయ్యను మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు మంగళవారం ఉదయం పరామర్శించారు. రామయ్యను పలుకరించిన తుమ్మల, ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. రామయ్య ఆరోగ్య పరిస్థితి వివరాలను తుమ్మల డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. అనంతరం తుమ్మల మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుతం రామయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందన్నారు. ప్రభుత్వ పరంగా ఎంత ఖర్చయినా భరించి రామయ్యకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు చెప్పారు. గుండెపోటుతో ఆస్పత్రిలో చేరిన వనజీవి రామయ్యకు ప్రభుత్వ ఖర్చులతో మెరుగైన వైద్యం అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీచేసిన విషయం తెలిసిందే. -
వనజీవి రామయ్యకు తీవ్ర అస్వస్థత
► హైదరాబాద్ తరలించిన కుటుంబ సభ్యులు ఖమ్మం: ఖమ్మం జిల్లా రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పద్మశ్రీ వనజీవి రామయ్య ఆదివారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబీకులు ఆయనను ఖమ్మం లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కొద్దికాలం క్రితం రామయ్యకు గుండెనొప్పి రావడంతో స్టంట్ వేశారు. మళ్లీ గుండెనొప్పి రావడంతో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. కాగా.. స్టంట్ వేసిన సమయంలోనే బాగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారు. అయినప్పటకీ ఆయన మొక్కలు నాటడం మాత్రం మానుకోలేదు. ప్రభుత్వ ఖర్చుతో వైద్యం సాక్షి, హైదరాబాద్: దరిపెల్లి రాములుకు పూర్తి ప్రభుత్వ ఖర్చుతో అత్యుత్తమ వైద్యం అందించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. -
మహారాష్ట్ర పాఠ్యాంశాల్లోకి వనజీవి రామయ్య?
ఖమ్మం రూరల్: ఖమ్మం జిల్లా రెడ్డిపల్లికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత వనజీవి రామయ్య జీవిత చరిత్రను మహారాష్ట్ర ప్రభుత్వం పాఠ్యాంశంగా చేర్చేందుకు కసరత్తు చేస్తున్నట్లు తెలిసింది. కోటి మొక్కలు నాటి పద్మశ్రీ పొందిన రామయ్య కృషిని గుర్తించిన మహారాష్ట్ర సర్కారు తెలుగు సబ్జెక్ట్‌లో ఒక పాఠంగా పెట్టాలని నిర్ణయించినట్లు సమాచారం. రామయ్య సమాజానికి, ప్రజలకు మొక్కలు నాటడం ద్వారా చేసిన సేవలను పాఠ్యాంశాల్లో చేర్చి విద్యార్థులకు వివరించాలని నిర్ణయించి నట్లు తెలిసింది. మంగళవారం మహారాష్ట్రకు చెందిన ఓ అధికారి రామయ్యకు ఫోన్ చేసి ఈ విషయాన్ని సూచనప్రాయంగా చెప్పినట్టు సమాచారం. -
తోటపల్లికి ‘పద్మశ్రీ’ ప్రకటించాలి
బిజినేపల్లి(నాగర్‌కర్నూల్): మారుమూల పల్లె పాలేనికి ప్రపంచ పటంలో గొప్ప స్థానాన్ని కల్పించిన దివంగత తోటపల్లి సుబ్రమణ్యానికి పద్మశ్రీ అవార్డు ప్రకటించాలని గ్రామస్తులు, పూర్వ విద్యార్థులు కోరారు. ఆదివారం గ్రామంలో ఆయన జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. సుబ్బయ్య కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా హెచ్ఎం దయానంద్ మాట్లాడుతూ విద్యా సంస్థలు, హాస్టళ్లను స్థాపించి ఎందరో నిరుపేద విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపిన గొప్ప వ్యక్తిగా కొనియాడారు. 1963లోనే డిగ్రీ కళాశాలను స్థాపించి ఎందరికో ఉన్నత విద్యను అందించడమేగాక గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారన్నారు. ఎంపీటీసీ సభ్యురాలు సరస్వతమ్మ మాట్లాడుతూ జాతిపిత మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని 60ఏళ్ల క్రితమే పరిచయం చేసిన గొప్ప వ్యక్తి అన్నారు. ఆయన స్థాపించిన విద్యాసంస్థల్లో చదువు నేర్చుకున్న ఎందరో విద్యార్థులు ప్రస్తుతం ఉన్నత స్థానాలతోపాటు దేశ, విదేశాల్లో ఉన్నారన్నారు. అనంతరం సుబ్బయ్య సేవల్ని గుర్తించి పాఠ్యాంశాల్లో ఆయన జీవిత చరిత్రను చేర్చాలని గ్రామస్తులు ఏకగ్రీవంగా తీర్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సొప్పరి బాలస్వామి, అమరేందర్, పాండు, ఆంజనేయులు, ఉపాధ్యాయులు గోపాలస్వామి, లక్ష్మీనారాయణరెడ్డి, జనార్దన్‌రెడ్డి, ఉమ, శ్రీలక్ష్మి, తుక్కాదేవి, మధు తదితరులు పాల్గొన్నారు. -
రామయ్యకి తోడుగా జానకమ్మ
‘వృక్షో రక్షతి.. రక్షితః’ అని తలకు బోర్డు పెట్టుకొని, మెడకు బోర్డు వేసుకొని సైకిల్‌పై, మోటర్ సైకిల్‌పై తిరిగే నా భర్తను చూసి.. ‘పిచ్చోడు ఏమీ పని లేదా’ అని అనేవారు. ఎవరు ఏమి అన్నా నేను మాత్రం నా భర్తను ఏమీ అనలేదు. ‘అనుకూలవతిౖయెన సుదతి దొరకుట పురుషుడి అదృష్టం’ అంటారు పద్మశ్రీ అవార్డు గ్రహీత రామయ్య. అన్నట్టుగానే ఆయన ఆశయంలో, తలపెట్టిన లక్ష్యంలో తోడు, నీడై నిలిచింది భార్య జానకమ్మ. భర్త తలంచిన కార్యంలో ఆయనతో పాటు అడుగేసింది. రామయ్యకు మొక్కలపై ఉన్న ప్రేమతో ఆమె కూడా మొక్కలు నాటింది. కోటికి పైగా మొక్కలు నాటిన రామయ్యను ఇటీవలే పద్మశ్రీ అవార్డు వరించిందని తెలిసి పద్మశ్రీ రావడం తమ బాధ్యతను మరింతగా పెంచిందనీ అందరూ వన ప్రేమికులమై ప్రపంచమంతా మొక్కలు నాటాలన్నదే తమ ధ్యేయం అని అంది. ఖమ్మం జిల్లా ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన జానకమ్మ మాటలు... పులి ఉన్నా మొక్కలే ముఖ్యం ‘నేనే రోజూ గేదెల వెంట పోత. ఒకరోజు చేలల్లో రెడ్డోరి ఆవును పెద్ద పులి తిన్నదని ఊళ్లో అనుకున్నరు. అప్పుడు గేదెల వెంట పోవాలంటే భయపడ్డా. తోడు నువ్వురా అని ఆయనను అడిగా. గేదెల పాలు పోసి వెంటనే వస్తానని ఖమ్మం పోయిండు. ఎప్పుడు వస్తాడోనని భయపడుతూనే గేదెల మేపా. పొద్దుపోయినా రాలేదు. చీకటి పడింది. ఇంట్లో అన్నం వండుతుంటే వచ్చిండు. అప్పుడు ఆయన్ను చూసి కోపం వచ్చింది. ‘నన్ను పెద్దపులి తిన్నా రావా..?’ అని ఏడ్చా. పాలు పోసి మొక్కలు తెచ్చేందుకు వెళ్లా అని చెప్పాడు. ‘నువ్వు గేదెలు కాసేందుకు వెళ్లక ముందే చేలల్లకు పోయి చూసిన. ఎక్కడా పులి గుర్తులు లేవు. నక్కో, తోడేలో వచ్చింది. అంతే. అందరూ పెద్దపులి అని భయపడ్డారు. అంతా చూసే నేను రాలేదు’ అని అన్నాడు. పెద్దపులి ఉంటే నా భార్యకు ఏమవుతుందోనని భయపడి ముందే చేలల్లో చూసి వెళ్లిన ఆయనపై కోపం తగ్గింది. భార్యగా నా మీద, మొక్కల మీద, పిల్లల మీద ఆయనకు ఎంత ప్రేమ ఉందో అప్పుడు ఆర్థమైంది’.. తొమ్మిదో ఏటే పెళ్లైయింది మా అమ్మనాన్నలు శంకరమ్మ, వెంకట్రామయ్య. మాది తుమ్మలపల్లి గ్రామం కొణిజర్ల మండలం. ఆరుగురు మగవాళ్లం. ఇద్దరం ఆడోళ్లం. చిన్నప్పుడే అమ్మనాన్న చనిపోయిండ్రు. అమ్మమ్మ దగ్గరే పెరిగాం. రామయ్య ఊరు ముత్తగూడెం. నా తొమ్మిదో ఏటే పెళ్లయింది. అప్పుడు రామయ్య వయస్సు 15 ఏళ్లు. అప్పటికే ఆయన ఎక్కడికి పోయినా మొక్కలు నాటేవాడు. ముత్తగూడెం నుంచి రెడ్డిపాలెం వచ్చాం. ఇక్కడ మా పొలాలు ఉండడంతో వ్యవసాయం చేసుకుంటూ ఇక్కడే ఉన్నాం. మాకు మగ్గురు కొడుకులు. ఇద్దరు ఆడపిల్లలు. ఒక కొడుకు అనారోగ్యంతో చనిపోయిండు. కుండలు చేయకుండా చెట్లబాట పట్టిండు మేము కుమ్మరోళ్లం. మా మామ లాలయ్య కుండలు చేసేవాడు. మా ఆయనకు కుండలు చేయడం రాదు. దీపాంతలు చేయడం ఒక్కటే తెలుసు. కొన్నాళ్లు మేళం వాయించాడు. కుండలు చేయడం రాకపోతే పిల్లలతో ఎలా బతకాలని బాధపడ్డా. ఉన్న పొలంలో కొంత నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద పోయింది. మొక్కలు, చెట్లు అంటూ తిరిగి ఉన్న 3 ఎకరాలు అమ్మిండు. మళ్లీ కొన్నాళ్లకు పొలం కొన్నాం. గేదెల పాలు తీస్తే పోసి వచ్చేది. వీటితో వచ్చే పైసలతోనే కుటుంబాన్ని గట్టెక్కించా. ఎక్కడ విత్తనాలు కనిపించినా ఏరకవస్తాడు. వేప, సుబాబుల్, గానుగ, చింత గింజలు తెచ్చి నాకిస్తే వాటిని చాటలో చెరిగి పెట్టేదాన్ని. ఇవి తీసుకెళ్లి నర్సరీ పెట్టేవాడు. వాళ్ల అమ్మ బీర ఇత్తులు నాటిందని.. కుండలు చేయడానికి ఉపయోగించే మట్టి మా మామ తెచ్చిపోస్తే అందులో మా అత్త బీర ఇత్తులు నాటిందట. అవి పెద్దవై కాయలు కాశాయట. మా ఆయన కూడా వాళ్ల అమ్మను చూసి బీర ఇత్తులు పెట్టడంట. మొక్కలు నాటితే వాటి పండ్లు తినవచ్చని, భవిష్యత్ తరాలు బాగుంటాయని వాళ్ల అమ్మే చెప్పిందట. అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ల ఆమ్మ మాటే పట్టుకొని మొక్కలు నాటుతుండు. ఒకసారి పొయ్యి కాడ పొంతకుండ పక్కనే మొక్క వేసిండు. ఇక్కడ వేడి ఉంటుంది ఎందుకు వేశావు అని అడిగాను. ‘పదును ఉంటుంది. బతుకుద్దిలే’ అన్నాడు. రెండు కోట్ల వరకు అయిన వేసిన మొక్కలు ఉన్నాయి. బాట వెంట పోయే వాళ్లందరూ ఇవి రామయ్య వేసిన మొక్కలు అని అంటే మా ఆయన గొప్పతనం నాకు తెలిసేది. పిచ్చోడు అన్నవారు.. ఆశ్చర్యపోతున్నారు.. ‘వృక్షో రక్షతి రక్షితః’ అని తలకు బోర్డు పెట్టుకొని, మెడకు బోర్డు వేసుకొని సైకిల్‌పై, మోటర్ సైకిల్‌పై తిరిగే నాభర్తను చూసి ‘పిచ్చోడు ఏమీ పని లేదా’ అని అనేవారు. ఎవరు ఏమి అన్నా నేను నా భర్తను ఏమీ అనలేదు. మొక్కలంటే ఆయనకు ఎంత ప్రేమ ఉందో చూసి మొక్కలు నాటమనే చెప్పా. అప్పుడు ఆయనను చూసి నవ్వినవాళ్లు, పిచ్చోడు అన్నవాళ్లు పద్మశ్రీ అవార్డు రావడం చూసి ఆశ్చర్య పోతుండ్రు. ఇంతకన్నా నాకు సంతోషం ఏం కావాలి..? తోడుగానే ఉంటా.. ఇప్పుడు ఆయన వయస్సు 77 ఏళ్లు. జీవితాంతం ఆర్థాంగిగా తోడు ఉంది ఆయన్ను బాధపెట్టకుండా మొక్కలు నాటడంలో తోడు ఉండటమే నా పని. ప్రభుత్వం 3 ఎకరాల భూమి ఇస్తే నర్సరీ ఏర్పాటు చేస్తాం. మొక్కలు పెంచి ప్రజలకు ఇవ్వాలన్నది మా తపన. మా పిల్లలు కూడా ఆయనలా మొక్కలు నాటి సమాజంలో పేరు తెచ్చుకోవాలన్నది ఆయన కోరిక. నా భర్తను అందరూ ‘వనజీవి’ రామయ్య అంటారు. ఇప్పుడు ఈ ఆవార్డుతో ‘పద్మశ్రీ రామయ్య’ అంటున్నారు. మా ఇంటికి వచ్చి కార్లల్లో తీసుకెళ్లి సన్మానం చేస్తున్నారు. మనవరాళ్ల పేర్లు.. కబంధపుష్పం, హరితలావణ్య ఆయనకు పిల్లలు, మనవరాళ్లు అంటే ప్రాణం. మనువరాళ్ల పేర్లు ఏమి పెట్టాలని పిల్లలే ఆయన్ను అడిగేవారు. మొక్కల మీద ఉన్న ప్రేమతో మనవరాళ్లకు ‘కబంధపుష్ప, వనశ్రీ, చందనపుష్ప, హరితలావణ్య’ అని పేర్లు పెట్టాడు. ఐదో తరగతి చదువుకున్న ఆయన రోజూ పుస్తకం తీసుకొని అందులో చెట్లు, మొక్కలపై సూక్తులు రాస్తాడు. చెట్లు నాటితే మనషుల లోకం ఎలా ఉంటుందో నాకు చెప్పుతాడు. ఆయనకు తెలిసిన ప్రాంతమంతా మొక్కలే నాటిండు. మా ఇంట్లో, ఊళ్లో, రోడ్ల వెంట ఎక్కడ చూసినా ఆయన నాటిన మొక్కలే. జానకమ్మ .. నా క్లాస్మెంట్.. ‘ఆడది కారం వేసుకొని తినాలి.. మగాడు కోడిగుడ్డు తినాలి అని ఎనకట పెద్దలు చెప్పేవాళ్లు. ‘ఆడోళ్లు మగాడితో సమానంగా వరి కోస్తరు, మోపులు మోస్తరు. ఎడ్లకు వరిగడ్డి వేస్తరు. పాలిచ్చే గేదెలకు పచ్చిగడ్డి పెడతరు. మగాళ్లకు బాధ తెలియకుండా పిల్లలను పెంచుతరు. వారికి పౌష్టికాహారం పెట్టాలి. మగాడు కారం తినాలి. ఆడది గుడ్డు తినాలి అంటాను నేను. అప్పుడే కుటుంబం ఇల్లు చక్కగా ఉంటుంది. నేనూ జానకమ్మ స్నేహితుల్లా ఉంటాం. ఆమెపై ఎప్పుడూ పెత్తనం చేయను. మొక్కలు నాటాలని ప్రచారానికి వెళ్లే నాకు సైకిల్ మధ్యలో ఎక్కడైనా పంక్చర్ అవుతుందేమోనని పదిరూపాయలు తెచ్చి నా జేబులో పెట్టేది. నేనంటే జానకమ్మకు అంతటి ప్రేమ. నేను నమ్మిన సిద్ధాంతానికి నా వెంటే జీవితాంతం తోడై నడుస్తోంది. మా ఇద్దరి ఆశయం ఒక్కటే. దేశంలో గ్రీన్ కరెన్సీ రావాలి. ప్రపంచం మన దేశాన్ని ‘పచ్చని భారతదేశం’ అని చెప్పుకోవాలి. – ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత రామయ్య – బొల్లం శ్రీనివాస్, సాక్షి, ఖమ్మం -
మాంటిస్సోరీ కోటేశ్వరమ్మ
పురస్కారం తొమ్మిది పదులు నిండిన పసిపాప... అందరినీ ఆప్యాయంగా నోరారా ‘పాపా’ అని పిలిచే మాతృమూర్తి డాక్టర్ వి. కోటేశ్వరమ్మ. స్త్రీవిద్య కోసం పాటు పడ్డారు. విజయవాడలో మాంటిస్సోరీ విద్యాసంస్థలను స్థాపించారు. అతి తక్కువ ఫీజులకే విద్య అందించారు. మగవారు మాత్రమే సంస్థలు నడపగలరు అనుకునే రోజుల్లో... స్త్రీశక్తిని నిరూపించారు. ఆమె అందించిన ఈ విశిష్ట సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డుతో గౌరవించింది. ఈ సందర్భంగా శ్రీమతి వి. కోటేశ్వరమ్మతో సాక్షి సంభాషించింది. విద్యాసంస్థలు స్థాపించాలనే ఆలోచన ఎలా కలిగింది? మా తల్లిదండ్రులు ఇద్దరూ ఉపాధ్యాయులే. మా అమ్మగారు కేవలం నాలుగు సంవత్సరాలు మాత్రమే టీచర్‌గా పనిచేశారు. ఆమె నా రెండవ ఏటే మరణించారు. ఆవిడతో నాకు సాన్నిహిత్యం లేకపోయినా, నాన్నగారు ఆవిడ గురించి తరచు చెబుతుండటంతో, ఆవిడకి ఉన్న పేరుప్రఖ్యాతులు అర్థం చేసుకున్నాను. ఆవిడ పేరు నిలబెట్టి, ఆవిడ పట్ల నా గౌరవాన్ని ప్రదర్శించాలనుకున్నాను. అలా మొదటగా ప్లే స్కూల్ ప్రారంభించాను. మాంటిస్సోరీ విద్యావిధానంలో పాఠశాల ప్రారంభించాను. మా స్కూల్ పేరు మాంటిస్సోరీ చిల్డ్రన్స్ హైస్కూల్. ఆ తరువాత నేను స్థాపించిన అన్ని సంస్థలకు అదే పేరు పెట్టాను. ఇన్ని విద్యాసంస్థలు స్థాపించడం వెనుక ప్రేరణ? భావిభారత పౌరులంతా పైకి రావాలనే కోరిక నాకు బలంగా ఉండేది. ఆ కోరికతోనే ఇన్ని విద్యాసంస్థలు స్థాపించాను. మీరు ఇంత డైనమిక్‌గా పెరగడానికి స్ఫూర్తి ఎవరిది? ఏదో ఒకటి చేయాలనే కోరిక నా మనసులో బలంగా ఉండేది. ఏదైనా పనిచేస్తే, ఆ పని అందరికంటె బాగా చేయాలని, పైకి ఎదగాలనే పట్టుదల, దీక్ష నాలో చిన్నతనం నుంచే ఉండేవి. ఆ దీక్షతోనే అన్ని పనులూ చేశాను. టీచింగ్ మీద ఉండే ప్రేమ, ఫలితం చూడాలనే ఆతురత, ఎంత చేసినా ఇంకా చేయాలనే తపన. వీటి వల్లే నేను ఏదైనా సాధించలిగాను. తక్కువ ఫీజులతో విద్యాసంస్థలు ఎలా నడపగలిగారు? నేను ఒక ఇల్లాలిని. నా ఆలోచనలు కూడా ఇల్లాలి ఆలోచనలలాగే ఉండేవి. ఏ ఇంట్లో అయినా భార్య తన భర్త ఆదాయాన్ని ఆధారం చేసుకుని ఇంటిని ఏ విధంగా నడుపుతుందో, నేను కూడా అదేవిధంగా.. వచ్చిన ఆదాయంతో మా సంస్థలను ప్రణాళికా బద్ధంగా నడిపాను. బడిని కూడా ఒక ఇంటిలాగే నడిపాను. అంతేకాదు, నేను చదువుకునే రోజుల్లో స్కూలు ఫీజులు కట్టడానికి చాలా ఇబ్బందిపడ్డాను. ఏ విద్యార్థీ అటువంటి ఇబ్బంది పడకూడదనుకున్నాను. అందుకే తక్కువ ఫీజులకు ఉత్తమ విద్య అందించాను. మరో కారణం... మా టీచర్లకు ప్రభుత్వమే జీతాలిచ్చేది. అందువల్ల విద్యార్థుల నుంచి తక్కువ ఫీజులు తీసుకునేవాళ్లం. మీ దగ్గర చదువుకున్న కొందరు ప్రముఖుల గురించి... ప్రముఖ కార్డియాలజిస్టు డా.పి.రమేష్‌బాబు, ఫోర్స్బ్ జాబితాలో చోటు దక్కించుకున్న సిస్కో సిఈవో పద్మశ్రీ వారియర్ మా స్కూల్లో చదివినవారే. వీరు కొందరు మాత్రమే. ఇంకా చాలామంది అమెరికాలో సెటిల్ అయినవారు ఉన్నారు. విద్యార్థుల అభివృద్ధి చూస్తే మీకు ఎలా ఉండేది? ఒక విద్యార్థికి స్టేట్ ఫస్ట్ ర్యాంకు వస్తే, మిగిలిన విద్యార్థులకి కూడా రావాలని ఆశించేదాన్ని. ఒకరు ఉన్నతస్థాయిలోకి వస్తే, మిగిలినవారు కూడా వస్తే బాగుంటుందనిపించేది. మిమ్మల్ని ప్రభావితం చేసినవారెవరు? గుంటూరు ఏకెసి కళాశాల ప్రిన్సిపాల్‌గా డా. సైప్స్ పనిచేసేవారు. ఆ కళాశాలలో అమెరికన్ విద్యా విధానం అమలులో ఉండేది. అక్కడ చదువుకునే రోజుల్లోనే నేను కూడా ఆ విద్యా విధానంలో ఒక కళాశాల ప్రారంభించాలనే కోరిక బయలుదేరింది. నేను బి.ఎస్సి. చదివాను. ఆ తరవాత ఉద్యోగం చేస్తూ ఎంఏ తెలుగు ప్రయివేట్‌గా చదివాను. ఆ వెంటనే పి.హెచ్డి చేశాను. ఆ తరువాత నేను కలగన్న విద్యా సంస్థలను ప్రారంభించాను. ప్రత్యేకంగా మహిళల కోసం మాంటిస్సోరీ మహిళా కళాశాల పేరుతో, విద్యాసంస్థ ఏర్పాటు చేశారు కదా! స్త్రీ విద్యకై పాటుపడాలని, వారిని ఉత్తేజపరచాలనే ఉద్దేశంతోనే ప్రత్యేకంగా మహిళా కళాశాల ప్రారంభించాను. అక్కడితో ఆగకుండా మరిన్ని సంస్థలు పెట్టాలనే కోరిక పెరుగుతూ ఉండేది. మా కళాశాలలో కొన్ని వేల మంది ఆడపిల్లలు చదువుకున్నారు. స్త్రీవిద్య గురించి కొందరు ప్రముఖులు ఉత్తరాదిన చేస్తున్న సేవ గురించి చదివినప్పుడు, నేను కూడా ఎంతో కొంత స్త్రీల కోసం చేయాలనే బలమైన కోరిక నాలో కలిగింది. ఆడపిల్లలు బాగా వెనుకబడి ఉంటున్నారు. పద్మశ్రీ అవార్డు అందుకోవడం గురించి... అవార్డుల కోసం నేనెప్పుడూ ఆలోచించలేదు. అవార్డు వచ్చిందని పొంగిపోను. బెటర్ లేట్ దేన్ నెవర్. విద్యా సేవ పెద్ద బాధ్యత. అంత పెద్ద బాధ్యతను ఒక్కరే ఎలా నిర్వర్తించారు? మా వారు నన్ను బాగా ప్రోత్సహించారు. సహకరించారు. నా దగ్గర పనిచేసేవారంతా నాకు సహకరించారు. అది నా అదృష్టం. రాజకీయాలలోకి రావాలనుకోలేదా? చదువుకుంటున్న రోజుల్లో కాలేజీ యూనియన్‌లో పనిచేశాను. పెద్దయ్యాక రాజకీయాలలోకి రావాలని ఎన్నడూ అనుకోలేదు. మంచి టీచర్ అనిపించుకోవాలనుకున్నాను. సాధించాను. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్నాను. కాలేజ్ ఈజ్ మై హోమ్ ఏబిసిడీలతో మాంటిస్సోరీ విద్యాసంస్థలు ప్రారంభించాను. ఈ రోజు ఈ స్థాయికి వచ్చాను. కాలేజ్ ఈజ్ మై హోమ్. జీవితమంతా విద్యతోనే గడిపాను. ఇప్పుడు నా వయసు 92 సంవత్సరాలు. నెలరోజుల క్రితం వరకు నేను కాలేజీకి వెళ్తూనే ఉన్నాను. అంతకంటె ఏం కావాలి ఎవరికైనా. వజ్రోత్సవ వీక్షణం 1955లో మాటిస్సోరీ మొదలైంది. వజ్రోత్సవాలు కూడా జరుపుకున్నందుకు సంతోషంగా ఉంది. చాలామంది వారి స్థాపించిన సంస్థ వజ్రోత్సవాలను కళ్లారా చూసుకోలేరు. నేను చూడగలిగాను, అది నా అదృష్టం. నేను ఏం సాధించాలనుకున్నానో అవన్నీ సాధించాను. – సంభాషణ: డా. పురాణపండ వైజయంతి, సాక్షి, విజయవాడ -
పద్మశ్రీ అందుకున్న డాక్టర్ ఎస్ఎల్.భైరప్ప
డాక్టర్ ఎస్ఎల్.భైరప్పను పద్మశ్రీ అవార్డుతో సత్కరిస్తున్న సుభాష్ చంద్ర మైసూరు: సరస్వతీ సమ్మాన్ అవార్డు గ్రహీత, ప్రముఖ కన్నడ సాహితీవేత్త డాక్టర్ ఎస్ఎల్.భైరప్పకు శుక్రవారం పద్మశ్రీ అవార్డును అందజేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ అవార్డులకు ఎస్.ఎల్.భైరప్పకూడా ఎంపిక చేసారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎస్.ఎల్.భైరప్పను పద్మశ్రీ అవార్డుతో సన్మానించాల్సి ఉండగా అనారోగ్య కారణాలతో ఢిల్లీ వెల్లడం కుదరలేదు. దీంతో కేంద్ర ప్రభుత్వ సూచన మేరకు శుక్రవారం కర్ణాటక అసిస్టెంట్ ఛీఫ్ సెక్రటరీ సుభాష్ చంద్ర మైసూరులోని ఎస్.ఎల్.భైరప్ప నివాసానికి చే రుకొని పద్మశ్రీ అవార్డును ఆయనకు అందచేసి సత్కరించారు. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ అభినవ్ ఖరే,అసిస్టెంట్ జిల్లా కలెక్టర్ వెంకటేశ్, నగర డిప్యూటీ పోలీస్కమీషనర్ శేఖర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. -
ప్రముఖ కార్టూనిస్టు సుధీర్ తైలంగ్ కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతూ ఇప్పటికే రెండుసార్లు సర్జరీ చేసుకున్న ప్రముఖ రాజకీయ కార్టూనిస్ట్ సుధీర్ తైలంగ్(56) గుర్గావ్లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. 30 సంవత్సరాలుగా వేసిన కార్టూన్లను ఢిల్లీలో 2014లో ప్రదర్శించిన ఆయన... చివరిగా మాజీ ప్రధాని మన్మోహన్పై కార్టూన్ల పుస్తకాన్ని తీసుకొచ్చారు. కొన్నేళ్ల పాటు వివిధ జాతీయ దినపత్రికల్లో కార్టూనిస్ట్‌గా పనిచేసిన సుధీర్ తైలంగ్‌కు 2004లో పద్మశ్రీ అవార్డు వరించింది. తైలంగ్ పూర్వీకులు తెలంగాణకు చెందినవారని, తెలంగాణగా ఉన్న పేరు తైలంగ్‌గా మారిందని ఆయన ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. రాజస్తాన్‌లోని బికనూర్‌లో పుట్టిన సుధీర్ తైలంగ్ ప్రముఖ రాజకీయ నేతలపై కార్టూన్లు వేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు. విరివిగా వివిధ జాతీయ చానళ్లలో జరిగిన చర్చాకార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ఆయన మృతి కార్టూన్ రంగానికి తీరని లోటు అని ఫోరమ్ ఫర్ పొలిటికల్ కార్టూనిస్ట్స్ హైదరాబాద్ సంతాపం వ్యక్తం చేసింది. -
'అవార్డు తీసుకోనని అనలేదు'
రాంచి: కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించిన పద్మశ్రీ పురస్కారాన్ని స్వీకరిస్తానని జార్ఖండ్ 'వాటర్ మేన్' సిమొన్ ఒరయన్ తెలిపారు. తనకు అవార్డు వచ్చినట్టు కేంద్రం నుంచి లేఖ లేదా వర్తమానం వస్తే తప్పకుండా తీసుకుంటానని చెప్పారు. తాను అవార్డు స్వీకరించబోనని ఎప్పుడూ చెప్పలేదని ఆయన స్పష్టం చేశారు. 'వాటర్ మేన్'గా సుపరిచితుడైన సిమొన్ ఒరయన్ కు పర్యావరణ పరిరక్షణ విభాగంలో పద్మశ్రీ పురస్కారం ప్రకటించారు. బెడో జిల్లాకు చెందిన 83 ఏళ్ల ఒరయన్ చిన్ననాటి నుంచే కరువుపై యుద్ధం చేస్తున్నారు. నాలుగో తరగతిలోనే చదువుకు స్వస్తి చెప్పి పొలం బాట పట్టారు. నీటి సంరక్షణ కోసం చెట్లు నాటడడం, అడవులను పెంచడం చేశారు. ఇప్పటికీ ఏడాదికి 1000 మొక్కలు నాటతారు. ఆయన అనుమతి లేకుండా చెట్ల కొమ్మలు నరడానికి కూడా అక్కడివారు వెనుకాడతారు. ఆయన నాటిన మొక్కలతో బెడో ప్రాంతం అగ్రికల్చర్ హబ్ గా మారింది. దాదాపు 20 వేల మెట్రిక్ టన్నుల కూరగాయలు జార్ఖండ్ లోని వివిధ జిల్లాలతో పాటు బిహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. -
మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట
-
మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట
న్యూఢిల్లీ: సీనియర్ సినీ నటుడు మోహన్ బాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. పద్మశ్రీ అవార్డు వివాదం కేసును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేసింది. పద్మశ్రీ పురస్కారాన్ని దుర్వినియోగం చేయనని, సినిమా టైటిల్స్ లో తన పేరు ముందు పెట్టుకున్న పద్మశ్రీని తొలగిస్తానని ఆయన అఫిడవిట్ చేశారు. దీంతో గతంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. కేంద్ర ప్రభుత్వం ఆయనకు ప్రదానం చేసిన పద్మశ్రీ అవార్డు కొనసాగుతుందని స్పష్టం చేసింది. దీంతో ఈ వివాదానికి తెరపడినట్టైంది. పద్మశ్రీ అవార్డును దుర్వినియోగ పరిచారంటూ మోహన్ బాబుపై హైకోర్టులో బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. తన ప్రమేయం లేకుండానే 'దేనికైనా రెడీ' చిత్రంలో నిర్మాత పద్మశ్రీని వాడుకున్నాడని మోహన్ బాబు ఇచ్చిన వివరణను హైకోర్టు తోసిపుచ్చింది. ఆయనకు ఇచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కి తీసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును మోహన్ బాబు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. గత ఏప్రిల్ లో హైకోర్టు తీర్పుపై స్టే విధించిన సుప్రీంకోర్టు తాజాగా ఈ కేసును కొట్టేసింది. -
మరోసారి మెరిసిన ‘పద్మం'!
విజయనగరం టౌన్ : విద్యలనగరానికి మరోసారి పద్మ అవార్డు దక్కింది. సంగీత, సాహిత్య కళలకు నిలయమైన జిల్లాలో ఇప్పటివరకు ఇద్దరు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. తాజాగా వయోలి న్లో జిల్లాకు చెందిన అవసరాల కన్యాకుమారిని కేంద్ర ప్రభుత్వం తమిళనాడు రాష్ట్ర విభాగంలో పద్మశ్రీ అవార్డుకు ఎంపిక చేసింది. 1958లో విజయానంద గజపతిరాజు (సర్ విజ్జీ) పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. ఆయన క్రికెట్ ప్లేయర్‌గా సుపరిచితులు. భారత్ క్రికెట్ జట్టుకు ఆయన 1936లో కెప్టెన్‌గా వ్యవహరించారు. 1960, 62లో విశాఖ నుంచి లోక్‌సభకు ఎంపీగా పోటీ చేసి గెలిచా రు. అలాగే జిల్లాకు చెందిన వెంకటస్వామినాయుడు కూడా 1957లో పద్మశ్రీ అవార్డు పొందారు. ఆయనకు ఏయూ కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. అలాగే రాజా, లక్ష్మి అవార్డు కూడా దక్కించుకున్నా రు. ఈయన ఘంటశాలకు కర్ణాటక సంగీతం నేర్పారు. తాజాగా అవసరాల కన్యాకుమారికి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ప్రకటించడంతో జిల్లా లో మూడో పద్మం మెరిసింది. జిల్లావ్యాప్తం గా సంగీత ప్రియులు ఆమెకు అవార్డు రావ డం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. సంతోషం కేంద్ర ప్రభుత్వం తనకు పద్మశ్రీ అవార్డు ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని అవసరాల కన్యాకుమారి తెలిపారు. చెన్నైలో ఉంటున్న ఆమె సోమవారం ఫోన్లో సాక్షితో మాట్లాడారు. జాతీయ స్థాయిలో అద్భుతమై న అవార్డును కేంద్ర ప్రభుత్వం తనకు ప్రకటించడం చాలా ఆనందంగా ఉందన్నారు. తన గురువులు ప్రోత్సాహం వల్లే ఇంతస్థాయి కి చేరుకున్నానని తెలిపారు. ఈమె విజయనగరంలోని కొత్త అగ్రహారంలో తన తొలి గురువు ఇవటూరి విశ్వేశ్వరరావు వద్ద విద్యాభ్యాసం చేశారు. ఆయన గురువైన ద్వారం నరసింగరావు పేరున ఏర్పాటు చేసిన పాఠశాలలో తానే తొలి విద్యార్థిని అని తెలిపారు. సంగీతంలో మరింతగా రాణించాలన్న ఉద్దేశంతో చెన్నైలో వయోలిన్‌లో పట్టా పొందేందుకు వెళ్లి స్థిరపడినట్టు చెప్పారు. -
కంకిపాడు సిగలో విరిసిన పద్మం
సినీ నటుడు ‘కోట’ పద్మశ్రీకి ఎంపిక కంకిపాడు : కంకిపాడు సిగలో పద్మం విరిసింది. కేంద్ర ప్రభుత్వం ఆదివారం రాత్రి ప్రకటించిన పద్మ అవార్డుల్లో ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావును పద్మశ్రీ వరించింది. కోట స్వగ్రామం కంకిపాడు కావటంతో పట్టణ వాసుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సందర్భంగా ఆయన ప్రస్థానమిదీ.. కోట సీతారామాంజనేయులు, విశాలాక్షి దంపతులకు ముగ్గురు కుమారులు. వారిలో కోట శ్రీనివాసరావు రెండో కుమారుడు. పెద్ద కొడుకు నర్సింహారావు, చిన్న కుమారుడు శంకర్రావు. శ్రీనివాసరావు తండ్రి సీతారామాంజనేయులు హస్తవాసి గల వైద్యుడు. శ్రీనివాసరావు ప్రాథమిక, ఉన్నత విద్య పునాదిపాడు, కంకిపాడులోనే సాగింది. అనంతరం ఉన్నత విద్య విజయవాడలో పూర్తిచేశారు. నాటక రంగం నుంచి సినీ రంగంలోకి... చిన్ననాటి నుంచి కళా రంగం అంటే కోటకు అమితమైన ఇష్టం. కళా రంగంపై ఉన్న ఆసక్తితో తన స్టేట్ బ్యాంకు ఉద్యోగాన్ని సైతం వదిలేసి సినిమాల వైపు అడుగులు వేశారు. ప్రాథమికంగా నాటక రంగం విషయానికొస్తే ఆయన నటించిన పూలరంగడు (మునసుబు), పుణ్యవతి (కరణం), జల్సా రంగడు (భుజంగరావు), మంగళసూత్రం తదితర నాటకాలు విశేషంగా గుర్తింపు తెచ్చిపెట్టాయి. ముఖ్యంగా పుణ్యవతిలో ఆయన నటనను ఆ తరం ఇంకా గుర్తు చేసుకుంటుంది. ఆ తర్వాత సినిమా రంగంలో ప్రవేశించి పిసినారిగా, విలన్‌గా, రాజకీయ నాయకుడిగా, తాజాగా గబ్బర్‌సింగ్ సినిమాలో తాగుబోతు పాత్రలోనూ ఇమిడిపోయి ప్రేక్షకులను అలరిస్తున్నారు. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అన్ని పాత్రలనూ పోషించి, జీవించి ఉత్తమ ప్రశంసలు అందుకున్నారు. కంకిపాడుపై ఎనలేని ప్రేమ తన స్వగ్రామమైన కంకిపాడుపై కోట శ్రీనివాసరావుకు ఎనలేని ప్రేమ. తరచూ ఇక్కడికొచ్చి వెళ్తూ ఉండటమేగాక స్థానిక ప్రముఖులను కలుసుకుని చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకుంటుంటారు. విద్యాభివృద్ధికి ప్రత్యక్ష వితరణలతో పాటుగా గుప్త దానాలు కూడా కోట చేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెబుతున్నారు.ఈ నేపథ్యంలో కళామతల్లికి విశిష్ట కళార్చన చేస్తున్న కోట శ్రీనివాసరావుకు పద్మశ్రీ ప్రకటించడంపై పట్టణ వాసుల్లో సంతోషం నెలకొంది. ఈ సందర్భంగా కోట శ్రీనివాసరావును ‘సాక్షి’ ఫోన్లో పలకరించి శుభాకాంక్షలు తెలిపింది. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ తనకు పద్మశ్రీ ప్రకటించటం చాలా సంతోషాన్నిచ్చిందని చెప్పారు. -
ప్రముఖ శాస్త్రవేత్త వసంత్ కన్నుమూత
పుణే: ప్రముఖ శాస్త్రవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ వసంత్ గోవారికర్(81) శుక్రవారం పుణేలోని దీనానాథ్ మంగేష్కర్ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఆయన డెంగ్యూ, మూత్రనాళ ఇన్ఫెక్షన్తో కన్నుమూసినట్టు ఆస్పత్రి ఐసీయూ ఇన్చార్జ్ డాక్టర్ సమీర్ జోగ్ వెల్లడించారు. ఇస్రోకు సేవలందించిన గోవారికర్.. సైన్స్, టెక్నాలజీ శాఖ కార్యదర్శిగా.. ప్రధానమంత్రికి శాస్త్రీయ సలహాదారుగా వ్యవహరించారు. -
మరొకరు రావాలి... బంగారు పతకం తేవాలి!
పుట్టింది: నవంబర్ 20, 1929 జన్మస్థలం: ల్యాల్‌పూర్ (ప్రస్తుతం పాకిస్తాన్లో ఉంది) ప్రస్తుతం ఉండేది: చండీగఢ్‌లో అందరూ పిలిచే ముద్దుపేరు: ఫ్లయింగ్ సిఖ్ కొన్ని విజయాలు ⇒1958 ఆసియా క్రీడోత్సవాల్లో 200 మీటర్ల పరుగుపందెం విజేత ⇒1958 ఆసియా క్రీడోత్సవాల్లో 400 మీటర్ల విజేత ⇒1958 కామన్వెల్త్ క్రీడోత్సవాల్లో 440 యార్డుల పరుగుపందెంలో విజేత ⇒1959లో పద్మశ్రీ పురస్కారం ⇒1962 ఆసియా క్రీడోత్సవాల్లో 400 మీటర్ల విజేత " నేనింతవరకూ ఎప్పుడూ డాక్టర్ దగ్గరకు వెళ్లలేదు. ఏ మందూ మింగలేదు. ఎప్పుడైనా కాస్త నలతగా ఉంది అనిపిస్తే రోడ్డెక్కుతాను. ఒళ్లు అలిసేలా పరుగు తీస్తాను. అంతే.. " అంతర్జాతీయ వేదికపై అథ్లెటిక్స్‌లో మన దేశానికి బంగారు పతకం సాధించి పెట్టిన ఏకైక క్రీడాకారుడాయన. అరవై ఏడేళ్లుగా మరే భారతీయ క్రీడాకారుడూ అందుకోలేనన్ని విజయాలు ఉన్నాయి ఆయన ఖాతాలో. దాదాపు ఎనభై అంతర్జాతీయ రేసుల్లో విజేతగా నిలిచారు. ‘ఫ్లయింగ్ సిఖ్’ అంటూ అందరితో ముద్దుగా పిలిపించుకున్నారు. ఆయనే - మిల్కాసింగ్. భారతదేశ పతాకాన్ని విదేశీ గడ్డపై ఎగురవేసిన మిల్కా ఎందరో క్రీడాకారులకు స్ఫూర్తిగా, ఆదర్శంగా నిలిచారు. జీవితం, విజయాలు, యువతరానికి సూచనల లాంటి పలు అంశాలపై మిల్కా సింగ్ ‘సాక్షి ఫ్యామిలీ’తో ముచ్చటించారు... సికింద్రాబాద్‌లో అడుగు పెట్టగానే భావోద్వేగానికి గురయ్యారు. మీకు ఈ నగరంతో ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి వివరిస్తారా? సికింద్రాబాద్‌తో నాకు చాలా అనుబంధం ఉంది. 1951లో సికింద్రాబాద్‌లోని ఈఎంఈ సెంటర్లో చేరాను నేను. నా పరుగు అప్పుడే మొదలయ్యింది. ‘ఆర్మీ బ్యారక్స్’లో ఉండేవాణ్ణి. రైలు పట్టాల మీద రైళ్లతో పోటీపడి పరుగులు తీసేవాడిని. రన్నింగ్ సాధన మొదలుపెట్టేసరికి నాకు నాలుగొందల మీటర్లు, వంద మీటర్లు అనే లెక్కలు ఉంటాయని తెలియదు. వాటి గురించి ఈఎంఈలో చేరిన తర్వాతే తెలిసింది. చేరిన కొత్తలో మమ్మల్నందరినీ ఐదు మైళ్లు పరుగెత్తమని చెప్పారు. వేగంగా పరుగెత్తినవారిలో మొదటి పదిమందిని తదుపరి శిక్షణ కోసం పంపిస్తామని, వాళ్లు భారత సైన్యం, భారతదేశాలకు ప్రాతినిధ్యం వహిస్తారనీ చెప్పారు. నేను టాప్ 10లో స్థానం పొందాను. అథ్లెట్‌గా అది నా తొలి విజయం. అప్పట్లో మిమ్మల్ని ప్రోత్సహించి, అండగా నిలిచినవారెవరు? మా కోచ్ హవల్దార్ గురుదేవ్ సింగ్. సికింద్రాబాద్‌లోని ఆర్మీ స్టేడియంలో ఆయన ఆధ్వర్యంలోనే శిక్షణ పొందాను. ఆయన ప్రోత్సాహం మరువలేనిది. ఇప్పుడీ నగరాన్ని చూస్తే ఏమనిపిస్తోంది? హైదరాబాద్‌ని చూస్తే చాలా గర్వంగా ఉంది. ఇది క్రీడానగరంగా మారిపోయింది. ఇక్కడ ఎంతోమంది క్రీడాకారులు ఉద్భవిస్తున్నారు. పతకాలు సాధిస్తున్నారు. దేశ గౌరవాన్ని నిలబెడుతున్నారు. ఈ విషయంలో పుల్లెల గోపీచంద్ లాంటి వారు చేస్తోన్న కృషి అమోఘం. క్రీడల విషయంలో నగరాన్ని ప్రతిష్ఠాత్మకంగా తీర్చిదిద్దుతున్నందుకు వారిని మెచ్చుకుని తీరాలి. మిల్కాసింగ్ దేశానికే స్ఫూర్తి. మరి మీకెవరు స్ఫూర్తి? అంతర్జాతీయ క్రీడా పోటీల్లో భారతీయ జెండాను సగర్వంగా ఎగుర వేయాలని భావించాను. అందుకే, కష్టపడి సాధన చేశాను. అవరోధాల్ని అధిగమించాను. నాకు ప్రేరణగా నిలిచింది - చార్లీ జెన్కిన్స్. 1956లో నాలుగొందల మీటర్ల రేసులో గెలిచి ఒలింపిక్స్ బంగారుపతకం సాధించారాయన. ఆయన్ని చూసి చాలా స్ఫూర్తి పొందాను. ఆయన సాధించారు కదా, నేను సాధించలేనా అనుకున్నాను. అనుకున్నది సాధించాను. అందుకే అందుకు ఆయన నాలో రగిలించిన స్ఫూర్తి కూడా ఒక కారణమని చెప్పవచ్చు. ప్రస్తుతం అథ్లెటిక్స్‌లో మన ప్రాభవం ఎలా ఉందంటారు? ఆ విషయంలో చాలా నిరాశపడుతున్నాను. గత అరవయ్యేళ్లలో మన దేశంలో మరో మిల్కాసింగ్ జన్మించకపోవడం నిజంగా దురదృష్టం. 120 కోట్ల జనాభాలో ఉండేది కేవలం ఒక్క మిల్కాసింగేనా?! మరో మిల్కాసింగ్‌ని మనం తయారు చేయలేమా?! దీన్ని బట్టి అర్థమవుతోంది మన దేశంలో క్రీడల పట్ల ఎంత అశ్రద్ధ ఉందో. పీటీ ఉష, అంజూ జార్జ్ లాంటి ఎవరో కొందరు అథ్లెట్లుగా రాణించారు తప్ప, గొప్పగా చెప్పుకోవడానికి మనకంటూ పెద్దగా ఎవరూ లేకపోవడం బాధాకరం. ఈ పరిస్థితిని మార్చడానికి మనమేం చేయాలి? మిల్కాసింగ్లు నగరాల్లో దొరకరు అన్న వాస్తవాన్ని ముందు గ్రహించాలి. దేశంలో ఎన్నో ప్రదేశాలు ఉన్నాయి. వాటి మూలల్లోకి వెళ్లి వెతకాలి. ఉత్సాహం, ప్రతిభ ఉన్న యువతను వెతికి పట్టాలి. శిక్షణనివ్వాలి. నిజం చెప్పాలంటే ఇప్పటి పిల్లలో క్రీడల పట్ల ఆసక్తి కాస్త తక్కువగానే ఉంది. ఇక నగరాల్లోని పిల్లల విషయానికొస్తే... ఆటలాడటానికి కావలసినంత శక్తి కూడా వారిలో కొరవడుతోంది. అందుకే వాళ్లు క్రికెట్, బ్యాడ్మింటన్, టెన్నిస్, ఫుట్‌బాల్ లాంటి వాటిని ఎంచుకుంటున్నారు తప్ప... శారీరక శ్రమ అధికంగా ఉండే అథ్లెటిక్స్ను ఎంచుకోవడం లేదు. అందుకే గ్రామాల్లోకి వెళ్లమంటున్నాను. అథ్లెట్లు అక్కడే దొరుకుతారు. మీకిప్పుడు ఎనభయ్యేళ్లు దాటాయి. అయినా ఇంత ఫిట్‌గా ఉండటానికి కారణం? నా వయసు ఎనభయ్యారు. అయినా ఇంకా పరుగులు తీస్తున్నాను, రేసుల్లో పాల్గొంటున్నాను. నిజానికి నాకూ కొన్ని సమస్యలు ఉన్నాయి. కంటిచూపు కాస్త తగ్గింది. నడుంనొప్పి వస్తోంది. అయినా నేను వాటిని లెక్క చేయకపోవడమే నా ఫిట్నెస్ సీక్రెట్. నేనెప్పుడూ అనుకుంటాను... టీనేజర్లతో సమానంగా నేనూ పరుగెత్తగలనని. అదే నన్ను ఉత్తేజితుణ్ణి చేస్తూ ఉంటుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడమే నన్నింత పటిష్ఠంగా ఉంచింది. నేనింతవరకూ ఎప్పుడూ డాక్టర్ దగ్గరకు వెళ్లలేదు. ఏ మందూ మింగలేదు. ఎప్పుడైనా కాస్త నలతగా ఉంది అనిపిస్తే రోడ్డెక్కుతాను. ఒళ్లు అలిసేలా పరుగు తీస్తాను. అంతే... నీరసం అదే ఎగిరిపోతుంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే... నేను నా నోటిని ఎప్పుడూ అదుపులో ఉంచుకుంటాను. అలా కాకుండా ఏది పడితే అది తినేశామా... బీపీ, షుగర్, ఒబెసిటీ, గుండె జబ్బులు అంటూ వరుసపెట్టి సమస్యలు వచ్చేస్తాయి.కాబట్టి ఆ ప్రమాదం రాకుండా జాగ్రత్తపడతాను. నోటిని అదుపులో ఉంచుకోవడం కూడా నాకు మేలు చేసింది. నేనెప్పుడూ అతిగా మాట్లాడను. అనవసర విషయాలు అస్సలు మాట్లాడను. కాబట్టి గొడవలు, వివాదాలు నా దగ్గరకు రావు. అందుకే ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాను. మనసు బాగుంటే శరీరమూ బాగుంటుంది కదా! మీ జీవితం ఆధారంగా ‘భాగ్ మిల్కా భాగ్’ చిత్రం తీశారు. ఆ సినిమా తీస్తామన్నప్పుడు మీకేమనిపించింది? చాలా సంతోషం వేసింది. సినిమా కూడా చాలా బాగా తీశారు. ఫర్హాన్ అఖ్తర్ నా పాత్రను అద్భుతంగా పోషించారు. నిజానికి నన్ను అందరూ మర్చిపోయిన సమయంలో ఈ సినిమా వచ్చి, నన్ను మళ్లీ జనబాహుళ్యంలో ప్రచారంలోకి తీసుకొచ్చింది. ఈ సినిమా విడుదలయ్యాక... రకరకాల వేడుకలకు నన్ను రమ్మని ఆహ్వానిస్తూ నాలుగొందల వరకూ ఉత్తరాలు వచ్చాయి. నా జీవితాన్ని అంత అందంగా చూపించి, నన్ను మళ్లీ అందరికీ దగ్గర చేసినందుకు ఆ టీమ్‌కి నేనెప్పుడూ కృత జ్ఞుడినై ఉంటాను. ఇన్నేళ్ల కెరీర్లో తీరని కోరిక ఏదైనా ఉందా? ఏ క్రీడాకారుడికైనా ఒలింపిక్స్‌లో బంగారు పతకం ప్రదానం చేస్తున్న ప్పుడు ఆ క్రీడాకారుడి జాతీయ గీతాన్ని గౌరవసూచకంగా వినిపిస్తారు. కానీ, అథ్లెటిక్స్ విషయంలో వేదిక మీద మన జాతీయ గీతాన్ని వినే అదృష్టం ఇంతవరకూ కలగలేదు. అది నాకు చాలా బాధగా అనిపిస్తుంది. అది మాత్రమే కాక... మరో మిల్కాసింగ్‌ను చూడాలన్న కోరిక కూడా అలాగే ఉంది. నాలాంటి మరొకరు రావాలి. మన దేశానికి బంగారు పతకం తేవాలి. నేను చనిపోయేలోపు ఆ అద్భుత దృశ్యాన్ని చూడాలనుంది! భావితరాలకు మీరిచ్చే సందేశం? కష్టపడండి. కృషి, ఆత్మవిశ్వాసం, నిబద్ధత ఎప్పుడూ మంచి ఫలితాలనే ఇస్తాయి. ఈ మూడూ పెంచుకోండి. మిమ్మల్ని ఎవ్వరూ ఆపలేరు. - కె.జయదేవ్ -
యోగా గురు అయ్యంగర్ అస్తమయం
పుణే: ‘ఐయ్యంగార్ యోగా’ వ్యవస్థాపకుడు , ప్రపంచ ప్రసిద్ధి గాంచిన యోగా గురు బీకేఎస్ ఐయ్యంగార్ బుధవారం తెల్లవారుజామున అస్తమించారు. ఆయన వయస్సు 96 యేళ్లు. వయోభారంతోనే ఆయన చనిపోయినట్లు బంధువులు చెప్పారు. యోగాపై ఆయన పలు పుస్తకాలు రచించారు. యోగాకు చేసిన సేవలకు గాను 1991లో ఆయనను పద్మశ్రీ అవార్డు, 2002లో పద్మభూషణ్, 2014లో పద్మ విభూషణ్ అవార్డులు వరించాయి. 2004లో టైమ్స్ మ్యాగజైన్ ప్రకటించిన జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో 100 మంది ప్రతిభావంతుల లిస్టులో అయ్యంగార్ పేరు కూడా ఉండటం విశేషం. ఇదిలా ఉండగా, అయ్యంగార్ మృతిపై ప్రధాన మంత్రి మోడీ తన సంతాపాన్ని ప్రకటించారు. ముందు తరాల వారు యోగా గురువుగా అయ్యంగార్ను గుర్తించుకుంటారని ఆయన కొనియాడారు. యోగా వ్యాప్తికి అయ్యంగార్ అంకితభావంతో పనిచేశారని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ తన సంతాప సందేశంలో పేర్కొన్నారు. యోగా ద్వారా భారతదేశ కీర్తిని ప్రపంచమంతా ఇనుమడింపజేశారని అయ్యంగార్ సేవలను ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్ కీర్తించారు. అయ్యంగార్ కర్ణాటక రాష్ట్రం బెల్లూర్లోని ఒక పేద బ్రాహ్మణ కుటుంబంలో 1918 డిసెంబర్ 14వ తేదీన జన్మించారు. అతడి పూర్తిపేరు బెల్లూర్ కృష్ణమాచార్య సుందరరాజ అయ్యంగార్. చిన్నతనంలో ఆయన మలేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులతో బాధపడేవారు. అతడి 16వ యేట గురువు టి. కృష్ణమాచార్య వద్ద యోగాభ్యాసం మొదలుపెట్టారు. రెండేళ్ల తర్వాత పుణే వెళ్లి యోగాలో ఇతరులకు శిక్షణ ఇవ్వడం ప్రారంభించారు. కాలక్రమేణా ‘అయ్యంగార్ యోగా’ను ప్రారంభించి ఎందరికో యోగాలో శిక్షణ ఇవ్వడమే కాక సొంతంగా కొన్ని మెళకువలను కనిపెట్టారు. ఆయన కనిపెట్టిన ‘అష్టాంగ యోగా’ ఇప్పుడు యోగా ఉపాధ్యాయులకు ఒక పాఠ్యాంశంగా మారింది. అయ్యంగార్‌కు 1943లో వివాహమైంది. ఆరుగురు సంతానం ఉన్నారు. ఇతని వద్ద శిష్యరికం చేసిన వారిలో జె.కృష్ణమూర్తి, జయప్రకాశ్ నారాయణ్, అచ్యుత్ పట్వార్ధాన్ వంటి వారు ఉన్నారు. అలాగే బెల్జియంకు చెందిన మదర్ ఎలిజిబెత్ రాణి కూడా తన 80 వ యేట ఈయన వద్ద యోగా మెళకువలు నేర్చుకున్నారు. అయ్యంగార్‌పై గౌరవ సూచకంగా చైనాకు చెందిన బీజింగ్ పోస్ట్ 2011లో స్టాంప్‌ను విడుదల చేసింది. అలాగే శాన్ఫ్రాన్సిస్కో 2005 అక్టోబర్ 3వ తేదీన బీకేఎస్ డేగా ప్రకటించింది. అయ్యంగార్ తన భార్య రమామణి జ్ఞాపకార్థం 1975లో పుణేలో రమామణి మెమోరియల్ యోగా ఇనిస్టిట్యూట్‌ను స్థాపించారు. లైట్ ఆఫ్ యోగా, లైట్ ఆఫ్ ప్రాణాయామా, లైట్ ఆన్ ది యోగా సూత్రాస్ ఆఫ్ పతంజలి వంటి ఎన్నో పుస్తకాలను ఆయన రచించారు. -
సైఫ్ అలీఖాన్ 'పద్మశ్రీ'కి ఎసరు?
న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్‌కు ప్రదానం చేసిన పద్మశ్రీ అవార్డును వెనక్కు తీసుకోవాలన్న డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తుంది. 2010లో సైఫ్‌కు బహూకరించిన ఈ అవార్డును రద్దు చేయాలని ఎస్ సీ అగర్వాల్ అనే ఆర్టీఐ ఉద్యమకర్త కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేశారు. ఓ రెస్టాంట్‌లో గొడవపడిన కేసులో సైఫ్‌పై చార్జిషీటు నమోదు చేయాలని ముంబై కోర్టు ఆదేశించిన నేపథ్యంలో అగర్వాల్ ఈ డిమాండ్ చేశారు. తన ఫిర్యాదు చేసిన అంశం ఏ దశలో ఉందో తెలిపాలని అగర్వాల్ మరోసారి కేంద్రాన్ని కోరారు. సైఫ్కిచ్చిన పద్మశ్రీ అవార్డును వెనక్కు తీసుకునే విషయం పరిశీలనలో ఉందని కేంద్రం బదులిచ్చింది. 2012లో ఓ రెస్టారెంట్లో సైఫ్ తన స్నేహితులతో కలసి దక్షిణాఫ్రికాకు చెందిన ఓ వ్యాపారవేత్త, ఆయన బంధువుపై దాడి చేసినట్టు కేసు నమోదైంది. -
సినిమాల్లోనే కొనసాగుతా..
తాను సినిమాల్లోనే కొనసాగుతానని, రాజకీయాల్లోకి వెళ్లే ఆలోచనేదీ లేదని ప్రస్తుతం ఆస్ట్రేలియాలో విహరిస్తున్న బాలీవుడ్ నటి విద్యాబాలన్ చెప్పింది. ఒక భారతీయురాలిగా ఓటు మాత్రం వేస్తానంది. మెల్బోర్న్లో శుక్రవారం ఆరంభమైన భారత మెల్బోర్న్ చిత్రోత్సవం (ఐఎఫ్ఎఫ్ఎం) సందర్భంగా ఓ వార్తాసంస్థతో మాట్లాడుతూ ఈ సంగతి తెలిపింది. ఐఎఫ్‌ఎఫ్‌ఎంకు మూడోసారీ ప్రచారకర్త ఎంపికయినందుకు సంతోషంగా ఉందని చెప్పిన విద్య... పద్మశ్రీ అవార్డు స్వీకరించేందుకు ఢిల్లీకి సోమవారం వస్తోంది. ‘ప్రతిభ ఉన్న దర్శకులు, నటులతో కలసి పనిచేయడాన్ని తాను ఇష్టపడుతాను. ప్రత్యేకంగా అవార్డుల కోసం ఏ ఒక్క పాత్ర/సినిమా చేయలేదు. సత్తా చూపిస్తే అవార్డులు వాటంతట అవే వస్తాయి’ అని ఈ 36 ఏళ్ల బ్యూటీ చెప్పింది. విద్యాబాలన్ గర్భిణి అంటూ వచ్చిన వార్తలనూ ఈమె కొట్టిపారేసింది. పస్తుతం స్వల్ప విరామం మాత్రమే తీసుకున్నానని, తరచూ షూటింగ్‌లకు వెళ్తున్నానని వివరించింది. అయితే విద్య గత రెండు నెలలుగా షూటింగులకు వెళ్లడం లేదు. ఆమె తాజా సినిమా బాబీ జసూస్ జూన్ లేదా జూలైలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ కామెడీ సినిమాలో విద్య డిటెక్టివ్‌గా కనిపిస్తుంది. సమర్‌షేక్ దీనికి దర్శకత్వం వహించగా, నటి దియామీర్జా, ఆమె ప్రియుడు రాహుల్‌సంఘా ఈ సినిమాను నిర్మించారు. త్వరలోనే ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో కనిపిస్తానని చెప్పింది. సుజొయ్ ఘోష్ తాజాగా తీస్తున్న దుర్గారాణి సింగ్‌లో విద్యాబాలన్‌ను కథానాయికగా తీసుకోవాలని అనుకున్నా, చివరికి కంగనా రనౌత్‌కు అవకాశం దక్కిందని వార్తలు వచ్చాయి. దీని గురించి అడిగితే కంగనకు ఆ సినిమాలో అవకాశం దక్కినందుకు చాలా సంతోషంగా ఉందని విద్యాబాలన్ చెప్పింది. -
'లైంగిక' ఆరోపణలున్న వ్యక్తికి 'పద్మశ్రీ'నా ?
లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న శాంతినికేతన్ లోని విశ్వభారతీయూనివర్శిటీ వైస్ చాన్స్‌లర్ సుశాంత్ దత్తగుప్తకు పద్మ పురస్కారం ప్రకటించడం పట్ల పశ్చిమ బెంగాల్ మహిళ కమిషన్ అగ్గి మీద గుగ్గిలం అవుతుంది. సుశాంత్‌కు ప్రకటించిన పద్మ పురస్కారాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని పశ్చిమ బెంగాల్ మహిళ కమిషన్ చైర్మన్ సునందా ముఖర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆమె మంగళవారం భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని మన్మోహన్ సింగ్‌లకు లేఖ రాశారు. పద్మ పురస్కారాలు అత్యున్నతమైనవని వాటిని వివిధ రంగాలలో రాణించిన వారికి అందజేయడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. అయితే ఆ పురస్కారాన్ని అందుకునే అర్హత సుశాంత్‌కు లేదని సునంద ఆ లేఖలో వెల్లడించారు. సుశాంత్‌కు పద్మ పురస్కారం ప్రకటించడంపై ఇప్పటికే పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, జాతీమ మహిళ కమిషన్‌కు లేఖ రాసినట్లు వివరించారు. వివిధ రంగాలలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి కేంద్రప్రభుత్వం ఆదివారం పద్మ పురస్కారాలను ప్రకటించింది. శాస్త్ర సాంకేతిక రంగంలో విశేష కృషి చేసినందుకు సుశాంత్‌కు పద్మశ్రీ పురస్కారాన్ని అందజేస్తున్నట్లు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. అసలు ఏం జరిగింది: 2005లో సుశాంత్ దాస్‌గుప్తా సత్యేంద్రనాథ్ బోస్ నేషనల్ సెంటర్ ఫర్ బేసిక్ సైన్స్ డైరెక్టర్‌గా విధులు నిర్వర్తించేవారు. ఆ సమయంలో ఆ సంస్థలో పని చేస్తున్న మహిళ శాస్త్రవేత్తపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని సుశాంత్ పై ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ మహిళ కమిషన్ సుశాంత్‌కు పద్మశ్రీ పురస్కారం ప్రకటించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కాకినాడ బిడ్డకు పద్మశ్రీ
కల్చరల్(కాకినాడ), న్యూస్‌లైన్ : కాకినాడలో పుట్టి, అమెరికాలో స్థిరపడిన ప్రముఖ వైద్యుడు ముత్తా వంశీకృష్ణను పద్మశ్రీ వరించింది. తన సోదరుడు డాక్టర్ ముత్తా రమణారావు, వసంతలక్ష్మి దంపతుల కుమారుడైన వంశీకృష్ణకు ఈ అవార్డు ప్రవాస భారతీయ కోటాలో వచ్చినట్టు మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో వివరించారు. విదేశాల్లో ఖ్యాతి గడించిన వైద్యుడు : వంశీకృష్ణ అమెరికాలో హార్వర్డ్ మెడికల్ కళాశాలలో సిస్టమ్ బయాలజీ, మెడిసిన్ ప్రొఫెసర్‌గా, మసాచుసెట్స్ ప్రభుత్వాసుపత్రిలో మాలిక్యులర్ బయాలజీ విభాగాధిపతిగా, ప్రఖ్యాత అమెరికా బ్రోడ్ ఇనిస్టిట్యూట్ అసోసియేట్ సభ్యునిగా సేవలందిస్తున్నారు. పరిశోధనలకు పద్మశ్రీ : వంశీకృష్ణ 35 సంవత్సరాల వయస్సులోనే పరిశోధనలు జరిపారు. ముఖ్యంగా జీవ కణవిచ్ఛిత్తి, మెటకాంట్రియల్ బయాలజీలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2004లో మెకార్డన్ ఫౌండేషన్ ఆయన్ను సత్కరించింది. రోగనిర్ధారణ రంగంలో చేసిన పరిశోధనలకుగాను అమెరికన్ ఫిలసాఫికల్ సొసైటీ 2008 లో డలాండ్ అవార్డు అందించింది. స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మేథమెటికల్ అండ్ కాంపిటేషనల్ సైన్స్‌లో డీఎస్ పూర్తిచేసిన వంశీకృష్ణ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్ యూనివర్సిటీలో ఎండీ పట్టా పొందారు. బోస్టన్లోని బ్రిగ్హామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్లో ఇంటర్నల్ మెడిసిన్‌లో ఇంటర్న్ షిప్ పూర్తిచేశారు. దేశ ఖ్యాతిని వైద్యరంగంలో ప్రపంచ దేశాలకు చాటిన వంశీకృష్ణను ఈ అవార్డు వరించింది. -
పద్మశ్రీ పురస్కారం.. దళిత జాతికే గర్వకారణం
బయోడేటా పూర్తి పేరు: నర్రా రవికుమార్ చదువు:బీఎస్సీ, ఎల్ఎల్ఎం, డీజే;డీపీఆర్ వృత్తి: శాంతి చక్ర అసోసియేట్ మేనేజింగ్ ైడెరైక్టర్, ఆదిత్య కమ్యూనికేషన్ భాగస్వామి,అధ్యక్షుడు దళిత ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కీ) ఆంధ్రప్రదేశ్ మరియు దక్షిణ భారతదేశ కోఆర్డినేటర్. తల్లిదండ్రులు : శంకరయ్య, సుశీల భార్య : వనజాక్షి (ఎంకాం, ఎంఐఎస్సీఏ) కుమారులు: ఆదిత్య రిత్విక్ (ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం, ఎన్ ఐటీ, వరంగల్) ఆదిత్య రోహన్: (9వ తరగతి, భారతీయ విద్యాభవన్ సైనిక్ పురి) కృషి ఉంటే మనుషులు రుషులవుతారు.. మహా పురుషులవుతారు.. అని ఓ సినీకవి చెప్పినట్లుగా ఆయన అంచలంచెలుగా ఎదిగి అత్యున్నత స్థాయికి చేరుకున్నారు. రాష్ట్ర చరిత్రలోనే మొదటిసారిగా పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య రంగంలోని ఓ దళితుడు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యారు. తనకు ఈ ఏడాది పద్మశ్రీ పురస్కారం రావడం దళితులు వ్యాపార రంగంలోనూ ఎదుగుతున్నారనే సందేశం సమాజం దృష్టికి వెళ్లిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆయన మరెరో కాదు పద్మశ్రీ నర్రా రవికుమార్. శాంతి చక్ర ఇంటర్నేషనల్ అసోసియేట్స్ ఆధ్వర్యంలో ప్రతి యేటా జనవరి 26న నిర్వహించే ‘ప్రబుద్ధ భారత్ ఉత్సవ్- 2014’ను ఆదివారం శామీర్‌పేట్‌లోని లియోనియా రిసార్ట్స్‌లో జరిపారు. పద్మశ్రీ అవార్డు లభించిన సందర్భంగా నర్రా రవికుమార్ ‘న్యూస్‌లైన్’తో ముఖాముఖి మాట్లాడారు. దళితులు అభివృద్ధి సాధిస్తేనే దేశం మరింత అభ్యున్నతి సాధిస్తుందని ఆయన స్పష్టం చేశారు. తనకు వచ్చిన పద్మశ్రీ అవార్డు ద ళిత జాతికే గర్వకారణంగా భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. న్యూస్‌లైన్: మీరు పుట్టి పెరిగిన స్థలం.. కుటుంబ నేపథ్యం చెబుతారా..? నర్రా రవికుమార్: మాది సికింద్రాబాద్‌లోని మారెడ్‌పల్లిలోని భూసారెడ్డిగూడ. మధ్యతరగతి కుటుంబం. మా అమ్మానాన్న నర్రా శంకరయ్య, సుశీల. నాన్న తాపీమేస్త్రీ. నేను 01.09.1963లో జన్మించా. నా విద్యాభ్యాసమంతా మారెడుపల్లిలోనే సాగింది. న్యూ: ఈ స్థాయికి మీరెలా ఎదిగారు? న.ర.: నాకు చిన్నతనం నుంచే వ్యాపార, వాణిజ్య రంగాల్లో రాణించాలనే పట్టుదల ఉండేది. దీంతో పాటు సేవా భావాలు కల్గి ఉండేవాడిని. ప్రతిభ కనబర్చి ఉన్నత శిఖరాలను ఎదిగాను. రాజకీయాల్లోనూ ప్రవేశం ఉండటంతో అనతి కాలంలోనే అన్ని రంగాల్లో ఒక్కో మెట్టు ఎక్కుతూ ఉన్నతస్థాయికి చేరుకున్నా. వ్యాపార, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో అంచలంచెలుగా ఎదుగుతూ ద ళితుల అభ్యున్నతికి అహర్నిశలు పాటుపడ్డా. నా సేవలను గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించడం ఆనందంగా ఉంది. ఇది దళితజాతి గర్వించదగిన విషయం. న్యూ: దళితులు అభ్యున్నతి కోసం మీరిచ్చే సూచనలు, సలహాలు? న.ర.: దళితులు అంటే.. ప్రభుత్వంపై ఆధారపడి జీవనం సాగించేవారనే అపోహను రూపుమాపాల్సిన అవసరం ఉంది. అవకాశాలు వస్తే దళితులు దేనికీ తీసిపోరు. తమ నైపుణ్యాన్ని ప్రదర్శించి దేశ ప్రగతిలో భాగస్వాములు కాగలుగుతారు. ప్రస్తుత భారత దేశంలో దళిత్ క్యాప్టలిజాన్ని ప్రోత్సహించాల్సి ఉంది. ఆర్థికంగా వెనుకబడిన వారికి ప్రభుత్వ, ప్రైవేటు పరంగా విద్య, నైపుణ్యం, పెట్టుబడి, ఉత్పత్తులకు మార్కెటింగ్లాంటి సదుపాయాలు కల్పించడంతోనే ఎవరూ ఊహించని విధంగా అమెరికా ఆర్థికంగా అభివృద్ధి చెందింది. భారత్ సుసంపన్న దేశంగా ఎదగాలంటే దళితుల పురోభివృద్ధి ఎంతో అవశ్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉద్యోగ అవకాశాలు రోజురోజుకీ తగ్గిపోతున్న ప్రస్తుత సందర్భంలో దళిత జాతి కూడా వ్యాపార, వాణి జ్య, పారిశ్రామిక రంగాలపై శ్రద్ధ చూపించాల్సిన అవసరం ఉంది. న్యూ: మీ మార్గదర్శకులు ఎవరు? న.ర.: బాబా సాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నా మార్గదర్శకుడు. ఆయన చూపిన మార్గంలో పయనించడంతో పాటు నాతో పాటు పలువురికి దారి చూపడం నా కర్తవ్యంగా భావిస్తున్నా. -
అంతరిక్ష పరిశోధనలో ఆయనే సాటి
మొగల్తూరు, న్యూస్‌లైన్: మారుమూల గ్రామంలో పుట్టి అంతరిక్ష పరిశోధనా రంగంలో అత్యున్నత స్థాయికి ఎదిగిన మలపాక యజ్ఞేశ్వర సత్యనారాయణ ప్రసాద్ పద్మశ్రీ పురస్కారానికి ఎంపికయ్యూరని తెలిసి మొగల్తూరు గడ్డ పులకించింది. ఇక్కడే పుట్టిపెరిగిన సినీనటుడు మెగాస్టార్ చిరంజీవిని గతంలోనే పద్మభూషణ్ వరించగా, తాజాగా ప్రసాద్ పద్మశ్రీకి ఎంపిక కావడంతో ఇక్కడి ప్రజల ఆనందానికి అవధులు లేవు. ఒకే గ్రామం నుంచి ఇద్దరు పద్మ పురస్కారాలకు ఎంపిక కావడం గర్వకారణంగా భావిస్తున్నారు. మలపాక సూర్యనారాయణ, భాస్కరమ్మ దంపతుల మూడో కుమారుడైన ప్రసాద్ శాస్త్ర, సాంకేతిక రంగంలో ఉన్నతస్థారుుకి ఎదిగారు. 1953 మే4న మొగల్తూరులో పుట్టిన ప్రసాద్ 1968లో ఇక్కడి పెన్మత్స రంగరాజా జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎస్ఎస్ఎల్సీ పూర్తి చేశారు. 1969లో ఏలూరులో పీయూసీ చదివారు. కాకినాడ జేఎన్టీయూలో ఇంజనీరింగ్ అభ్యసించారు. తిరువనంతపురం ఇస్రో కేంద్రంలో జూనియర్ సైంటిస్ట్‌గా ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన అందులో ఉన్నత పదవులను అధిరోహించారు. చంద్రయాన్-1 విజయవంతం కావడంలో కీలక పాత్ర పోషించిన ప్రసాద్ ఇటీవల మార్స్ ఉప గ్రహ ప్రయోగంలోనూ ముఖ్యభూమిక పోషించారు. మొగల్తూరు వాసులు చిట్టిబాబుగా పిలుచుకునే ప్రసాద్‌కు పద్మశ్రీ దక్కడంపై గ్రామస్తులు పులకించిపోతున్నారు. ప్రసాద్‌కు ఆయన చిన్ననాటి స్నేహితులైన అనంతపల్లి బుల్లెబ్బాయి, ఉద్దగిరి వెంకన్న, పడాల భాస్కరరావు, అయితం దుర్గారావు, దూసనపూడి ఆదియ్య, నాగళ్ళ నాగేశ్వరరావు అభినందనలు తెలిపారు. -
రవికుమార్ నర్రాకు పద్మశ్రీ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారిలో రాష్ట్రానికి చెందిన రవి కుమార్ నర్రాతో పాటు అయిదుగురు పారిశ్రామిక దిగ్గజాలు ఉన్నారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రాష్ట్ర చాప్టర్‌కి రవి కుమార్ నర్రా ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అటు, మరో దళిత పారిశ్రామిక దిగ్గజం రాజేశ్ సరాయా సహా ప్రతాప్ గోవిందరావ్ పవార్, మల్లికా శ్రీనివాసన్, అశోక్ కుమార్ మాగో పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. ప్రతాప్ గోవిందరావు పవార్ కేంద్ర మంత్రి శరద్ పవార్‌కి సోదరుడు. ఆయన సకల్ మీడియా గ్రూప్‌కి, అజయ్ మెటాకెమ్ గ్రూప్‌కి చైర్మన్‌గాను వ్యవహరిస్తున్నారు. మరోవైపు, 1.6 బిలియన్ డాలర్ల టాఫే (ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్) సంస్థకి మల్లికా శ్రీనివాసన్ చైర్మన్‌గా ఉన్నారు. టీవీఎస్ మోటార్స్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ సతీమణి మల్లికా. ఇక రాజేశ్ సరాయా బహుళ జాతి మెటల్స్ దిగ్గజం స్టీల్ మాంట్ ట్రేడిం గ్ని నిర్వహిస్తున్నారు. పద్మశ్రీ అందుకోనున్న మరో దిగ్గజం అశోక్ కుమార్ మాగో.. అమెరికా కేంద్రంగా పనిచేసే ఇన్వెస్ట్మెంట్ కన్సల్టింగ్ సంస్థ మాగో అండ్ అసోసియేట్స్‌కి చైర్మన్‌గా ఉన్నారు. దళిత పారిశ్రామికవేత్తలకిచ్చిన గుర్తింపు: నర్రా పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా తనను సంప్రతించిన ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో నర్రా రవికుమార్ మాట్లాడారు. ఈ పురస్కారాన్ని దళిత పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన గుర్తింపుగా భావిస్తున్నానంటూ... ‘‘దళితులు కేవలం రిజర్వేషన్లకే పరిమితం గాకుండా తగిన అవకాశాలు కల్పిస్తే వ్యాపార రంగంలో కూడా రాణించగలరు. దేశం సమ్మిళిత వృద్ధి సాధించాలంటే దళితులను కూడా అందులో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉంది. అమెరికాలో ఎలాగైతే బ్లాక్ క్యాపిటలిజానికి ప్రోత్సాహం లభించిందో దేశీయంగా కూడా దళిత క్యాపిటలిజాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. దీనిపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అప్పుడే దేశ అభివృద్ధి వేగవంతమవుతుంది.’’ అని వ్యాఖ్యానించారు. -
ఆచార్య ఇనాక్ ఇంట ‘పద్మ’ పరిమళం
గుంటూరు కల్చరల్, న్యూస్‌లైన్: సాహిత్యరంగంలో సమున్నత శిఖరాలు అధిరోహించిన మన జిల్లావాసి డాక్టర్ కొలకలూరి ఇనాక్‌ను పద్మశ్రీ అవార్డు వరించింది. చేబ్రోలు మండలం, వేజండ్ల గ్రామంలోని రామయ్య, విశ్రాంతమ్మ దంపతుల కుమారుడైన ఇనాక్ 1939, జులై ఒకటో తేదీన జన్మించారు. సామాజిక ఆవేదనే సాహిత్య సంవేదనగా భిన్నప్రక్రియల్లో తన సాహిత్య రచనలు కొనసాగించారు. ఇప్పటికి 72 గ్రంథాలు ఆయన కలం నుంచి వెలువడ్డాయి. ఊరబావి, సూర్యుడు తలెత్తాడు, కట్టడి, కొలుపులు, కాకి వంటి కథా సంపుటాలు ముని వాహనుడు, దిక్కులేనివాడు, ఇడిగో క్రీస్తు తదితర నాటికలను అందించారు. ఆది ఆంధ్రుడు, త్రిద్రవ పతాకం, చెప్పులు వంటి కవితా సంపుటులు ఆయన కలం నుంచి జాలువారాయి. నిబిడిత సిద్ధాంతం పేరిట ఆధునిక సాహిత్య విమర్శన సూత్రాన్ని ప్రతిపాదించారు. ఆయన గొప్ప సాహిత్య సేవ చేశారు. దళిత బహుజన చైతన్యంతో వెలువడిన ఆయన మొదటి తెలుగు కథా సంపుటిగా ఊరబావి గుర్తింపు పొందింది. ఇనాక్ సాహిత్యం పలు జాతీయ, అంతర్జాతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన సాహిత్యంలో గుంటూరు ప్రాంతీయ మాండలికం ప్రస్ఫుటంగా కనబడుతుంది. ఆయన చెప్పినట్లుగానే ఇనాక్ క్రైస్తవుడుగా పుట్టి, హిందువుగా పెరిగి, భారతీయుడుగా జీవిస్తోన్న గొప్ప లౌకికవాది. గుంటూరులోని ఏసీ కళాశాలలో విద్యనభ్యసించి, అధ్యాపకునిగా, ఆచార్యునిగా, ఉపకులపతిగా అంచెలంచెలుగా ఎదిగారు. ఏసీ కళాశాల అధ్యాపకులుగా, అనంతపురం శ్రీకృష్ణదేవరాయలు యూనివర్సిటీలో తెలుగు శాఖాధ్యక్షునిగా, తిరుపతి శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయంలో ఉపకులపతిగా బాధ్యతలు నిర్వహించారు. ఆయన చేసిన సాహిత్య కృషికి ఎన్నో ప్రతిష్టాత్మకమైన పురస్కారాలు అందుకున్నారు. కులవాస్తవికత మీద రాసిన కథల ద్వారా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని పొందారు. తెలుగు కథను దళితవాడ దృ క్పథం నుంచి సుసంపన్నం చేసిన ఇనాక్ తొలిసారి ప్రత్యామ్నాయ కథా సాహిత్యాన్ని ఆవిష్కరించారు. పురస్కారాలు : తెలుగు విశ్వవిద్యాలయ పురస్కారం, తెలుగుభారతి పురస్కారం, విశాలసాహితీ పురస్కారం, అజోవిభో జీవిత సాఫల్య పురస్కారం, ఈనెల 18న గుంటూరు నగరంలో బొమ్మిడాల శ్రీకృష్ణమూర్తి ఫౌండేషన్ స్ఫూర్తి ఫౌండేషన్ వంటివి ఎన్నో అందుకున్నారు. తన తల్లి, భార్య జ్ఞాపకార్థం ఏటేటా సాహిత్య పురస్కారాలు ఇస్తూ యువసాహితీ వేత్తలను ప్రోత్సహించారు. ఇనాక్ సాహిత్యంపై ఎందరో పరిశోధనలు చేశారు. అసంఖ్యాక వ్యాసాలు వెలువడ్డాయి. ఈ సందర్భంగా తెలుగు భాషోద్యమ సమాఖ్య రాష్ట్ర కోశాధికారి వెనిశెట్టి సింగారావు, జిల్లా అధ్యక్షుడు నాగభైరవ ఆదినారాయణ, ప్రముఖ సాహిత్యవేత్త పాపినేని శివశంకర్ తదితర సాహిత్య వేత్తలు ఇనాక్‌కు అభినందనలు తెలిపారు. ఇలాగే రాస్తూ ఉండాలి ఆచార్య ఇనాక్ విశిష్ట రచయిత. అరసానికి, నాకు హితులు సన్నిహితులు. ఆయన గురించి చెప్పాలంటే ఎంతో కష్టం. ఎందుకంటే చెంచాతో సముద్రాన్ని కొలవలేం. ఆయన నూరేళ్లు ఇలాగే రాస్తూ ఉండాలి. -పెనుగొండ లక్ష్మీనారాయణ, అరసం రాష్ట్ర అధ్యక్షుడు చాలా ఆనందపడ్డాను చాలా ఆనంద పడుతున్నాను. ఉద్వేగంగాను, ఉత్సాహంగాను ఉన్నాను. నేను చేసిన సాహిత్య కృషి అందరి అభిమానంతో పెద్దలకు చేరింది. పద్మశ్రీ రావడానికి సహాయ సహకారాలు అందించిన పెద్దలకు, ప్రభుత్వానికి కృతజ్ఞతలు. -కొలకలూరి ఇనాక్ -
యువరాజ్ సింగ్‌కు పద్మశ్రీ అవార్డు
-
నాతోపాటు నా ‘పద్మశ్రీ’నీ సమాధి చేయండి
అది నా జీవితాన్ని నాశనం చేసింది ఓ నేత కార్మికుడి చివరి కోరిక లక్నో: ‘‘ఆయన హస్తకళ.. ప్రాచీన సంప్రదాయకంగా సాంస్కృతికంగా సుసంపన్నమైనది’’ అని నాటి రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి నుంచి ప్రశంసలందుకున్న తివాచీ నేత కార్మికుడతడు. ఆ ప్రశంసలతో పాటు.. 1981లో దేశంలో అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన ప్రతిష్టాత్మక ‘పద్మశ్రీ’ అవార్డునూ అందుకున్నాడు. అప్పుడతడి ఖ్యాతి దేశమంతా మార్మోగింది. ఆయన నివసించే ప్రాంతంలో ఎంతో ప్రముఖుడైపోయాడు. ఆ అవార్డు రాకముందు వరకూ నేత పనితో అతడి కుటుంబం జీవిస్తుండేది. పద్మశ్రీ పురస్కారంతో తమ జీవితం మారిపోతుందని ఆశించింది. నిజంగానే మారిపోయింది. ఎంతగా మారిపోయిందంటే.. ఇక అతడు పని చేయటానికే అవకాశం దక్కలేదు. ఎవ్వరూ పని ఇవ్వలేదు. ఒకే ఒక్క జీవనాధారం కూడా కోల్పోయి.. దుర్భర దారిద్య్రంలోకి ఆ కుటుంబం దిగజారిపోయింది. ఆ పద్మశ్రీ గ్రహీత పేరు సీతారాంపాల్. ఇప్పుడతడి వయసు 72 సంవత్సరాలు. కంటిచూపు లేదు. పాతికేళ్ల కిందటే పోయింది. డాక్టర్‌కు ఫీజు కట్టలేకపోవటమే కారణం. ఏళ్ల తరబడి సరైన తిండి లేదు. సన్నగా బక్కచిక్కిపోయాడు. మంచం మీద జీవచ్ఛవంలా పడున్నాడు. చావు కోసం నిరీక్షిస్తున్నాడు. అతడిది ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్ జిల్లా షేర్పూర్ కలాన్ గ్రామం. ‘‘నేను మా ప్రాంతంలో అకస్మాత్తుగా చాలా కీర్తివంతుడినయ్యాను. కానీ.. తివాచీ తయారుదారులు నాకు పని ఇవ్వటం మానేశారు. నన్ను రోజు కూలీగా పెట్టుకుంటే.. ప్రభుత్వానికి కోపం వస్తుందని వారు భయపడ్డారు. పద్మశ్రీ అవార్డుతో నా దుర్దినాలు మొదలయ్యాయి. చేతిలో సొమ్ములు లేక, వైద్యం చేయించుకోలేకపోవటంతో 1986లోనే నా కంటిచూపు పోయింది. నా పరిస్థితిని వివరిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎన్నోసార్లు లేఖలు రాశాను. ఫలితంగా నెలకు 300 రూపాయల వృద్ధాప్య పింఛను మంజూరు చేశారు. ఇందిరా ఆవాస్ యోజన కింద ఇల్లు మంజూరు చేశారు. కానీ.. అవేవీ నా దుస్థితిని మార్చలేకపోయాయి. డాక్టర్‌కు ఫీజులు కట్టేందుకు పైసలు లేకపోవటంతో నా కొడుకు కూడా కంటి చూపు కోల్పోయాడు’’ అని మంచం మీద నుంచి బలహీనమైన గొంతుతో నిర్వేదంగా వివరించాడు సీతారాంపాల్. ‘‘ప్రభుత్వం మా తండ్రికి పద్మశ్రీ అవార్డు ఇవ్వకముందు మా జీవితం సాఫీగానే సాగిపోయేది. కానీ అవార్డు అందుకున్నప్పటి నుంచీ మా తండ్రికి ఉపాధి లేదు. ఆయనకు తెలిసిన కళను మేం నేర్చుకోలేకపోయాం. ఎందుకంటే.. అది నేర్చుకుని జీవనోపాధి సంపాదించగలమన్న ఆశ ఏకోశానా లేకుండా పోయింది. మా ఇంట్లో కరెంటు లేదు.. దీంతో నాకు శుక్లాలు వచ్చాయి. చివరికి కంటిచూపు పోయింది’’ అని సీతారాం కుమారుడు శ్రావణ్పాల్ వివరిం చారు. ఎన్నిసార్లు వేడుకున్నా ప్రభుత్వాలు ఆదుకోలేదని సీతారాం పాల్ ఆవేదన వ్యక్తంచేశారు. ‘‘ప్రభుత్వాలకు గత ముప్పై ఏళ్లలో కనీసం 20 సార్లు నేను లేఖలు రాశాను. సాయం అర్థిస్తూ చాలామంది రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులను కలిశాను. కానీ నా కష్టాలు వారు అర్థంచేసుకోలేదు. నేనెలా ఉన్నానని అడగటానికి ఏ ఒక్కరూ రాలేదు’’ అని ఆయన చెప్పారు. అయితే తన చివరి కోరిక ఒకటి చెప్పారు. అదేమిటంటే... ‘‘ఇప్పుడు నేను మరణశయ్యపై ఉన్నాను. నా చివరి కోరిక ఒక్కటే.. నాతో పాటు నా పద్మశ్రీ పతకాన్ని కూడా సమాధి చేయండి.’’