
నిందితుల వివరాలు వెల్లడిస్తున్న పోలీసులు
గూడూరు: నేరాలను అరికట్టాల్సిన ఆయనే అందులో ఆరితేరాడు! రాష్ట్రపతి కార్యాలయం నుంచి ప్రధాని కార్యాలయం దాకా తనకు ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని చెబుతూ ఓ పోలీసు అధికారి కోట్ల రూపాయలకు కుచ్చుటోపీ పెట్టాడు. పద్మశ్రీ అవార్డు.. నామినేటెడ్ పోస్టు... రాజధాని అమరావతి సమీపంలో భూములిప్పిస్తానంటూ మోసాలకు పాల్పడిన కేసులో గుంటూరు సెంట్రల్ క్రైం స్టేషన్ సీఐ కాకర్ల శేషారావు, ఆయన కుటుంబ సభ్యులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు. శేషారావు, ఆయన బృందం రూ. 4 కోట్లకుపైగా గుంజినట్లు ఫిర్యాదులు దాఖలయ్యాయని శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా గూడూరు వన్‌టౌన్ సీఐ టి.వి.సుబ్బారావు తెలిపారు.
ఫేస్‌బుక్‌లో పరిచయం మొదలై...
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వడ్లపూడి గ్రామానికి చెందిన రాయపనేని రమణయ్యనాయుడు కొన్నేళ్లుగా గూడూరులోని నెహ్రూ నగర్‌లో ఉంటున్నారు. పలు గ్రామాల్లో సేవా కార్యక్రమాలు చేపట్టి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేయటం ఆయనకు అలవాటు. ఈ క్రమంలో 2014లో రమణయ్యనాయుడికి ఫేస్‌బుక్ ద్వారా గుంటూరు జిల్లా పండరీపురానికి చెందిన గడ్డం ప్రసన్నలక్ష్మి అనే మహిళ పరిచయమైంది. రమణయ్య నాయుడు గుంటూరు జిల్లాలో రాజధానికి సమీపంలో భూములు కొనుగోలు చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుసుకున్న ఆమె గుంటూరు సీసీఎస్‌లో సీఐగా పని చేస్తున్న తన భర్త కాకర్ల శేషారావును పరిచయం చేసింది. రమణయ్య నాయుడు ఎకరం భూమిని కొనుగోలు చేసేందుకు శేషారావుతో ఒప్పందం కుదుర్చుకుని అడ్వాన్సుగా రూ.1.50 కోట్లు ఇచ్చాడు.
అయితే ఆ తరువాత పెద్దనోట్లు రద్దు కావడంతో రమణయ్య నాయుడు తన వద్ద ఉన్న మిగతా డబ్బును మార్చుకునేందుకు 2016లో ఆ భూమిని రిజిస్ట్రేషన్ చేయాలని కోరాడు. భూమిని ఎప్పుడైనా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని చెప్పిన సీఐ శేషారావు తనకు ప్రధాని, రాష్ట్రపతి కార్యాలయాల్లో సైతం తెలిసిన వారు ఉన్నారని నమ్మకం కలిగించాడు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్‌లో నామినేటెడ్ పదవి ఇప్పిస్తానని చెప్పాడు. రమణయ్య నాయుడిని ఢిల్లీకి తీసుకెళ్లి రాష్ట్రపతి భవన్ వద్ద కొందరు అధికారులను కూడా పరిచయం చేశాడు. దీంతో శేషారావు మాటలను పూర్తిగా విశ్వసించిన రమణయ్య నాయుడు విడతల వారీగా రూ.2 కోట్ల విలువైన చెక్కులు ఇవ్వటంతోపాటు కొంత అకౌంట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా చెల్లింపులు జరిపాడు.
హైదరాబాద్ వైద్యుడికి రూ. 52 లక్షల టోకరా
రమణయ్య నాయుడితోపాటు ఓ ప్రముఖ వైద్యుడు కూడా ఈ ఊబిలో చిక్కుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ కమ్మెల శ్రీధర్‌కు పద్మశ్రీ అవార్డును ఆశగా చూపి అడ్వాన్సుగా రూ.52 లక్షలను శేషారావుకు ఇప్పించాడు. పద్మశ్రీ అవార్డు రావాలంటే రూ.2 కోట్లు ఇవ్వాలని, మిగతా డబ్బిస్తే వారం రోజుల్లో పని అవుతుందని సీఐ చెప్పినట్లు డాక్టర్‌కు తెలిపాడు. అప్పటికే మోసపోయానని గ్రహించిన డాక్టర్ శ్రీధర్ మిగిలిన మొత్తాన్ని ఇచ్చేది లేదని తేల్చి చెప్పాడు. విడతలవారీగా తాము చెల్లించిన రూ.4.02 కోట్లు తిరిగి ఇవ్వాలని రమణయ్య నాయుడు కోరగా సీఐ శేషారావు సమాధానం చెప్పకుండా దాటవేశాడు.
డబ్బిచ్చేది లేదని మీ ఇష్టమొచ్చింది చేసుకోండని తేల్చి చెప్పటంతో రమణయ్య పోలీస్ ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. గుంటూరు ఎస్పీతోపాటు నెల్లూరు జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకృష్ణను కలిసి తాము మోసపోయినట్లు తెలిపాడు. ఈ కేసును పరిశీలించాల్సిందిగా గూడూరు డీఎస్పీ వీఎస్ రాంబాబును ఎస్పీ ఆదేశించారు. రమణయ్య నాయుడి ఫిర్యాదు మేరకు గూడూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సీఐ కాకర్ల శేషారావు, అతడి రెండో భార్య గడ్డం ప్రసన్నలక్ష్మి, కుమారుడు హరికృష్ణ, కోడలు మౌనిక, మామ గురవయ్యలను శనివారం అరెస్ట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment