
సాక్షి, గుంటూరు: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి గుంటూరు పర్యటనకు కూటమి ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు కలిగించింది. ఈసీ అనుమతి లేదంటూ పోలీసులను ప్రయోగించడం మొదలు.. రైతులతో ఆయన్ని మాట్లాడనీయకుండా చివరిదాకా ప్రయత్నాలెన్నో చేసింది.
బుధవారం వైఎస్ జగన్ గుంటూరు పర్యటన నేపథ్యంలో ఈ ఉదయం పోలీసులు చేసిన అతి అంతా ఇంతా కాదు. ఈసీ అనుమతి లేదని చెబుతూ పర్యటన అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే.. వైఎస్సార్‌సీపీ(YSRCP) నేతల వాదనలతో పోలీసులు దిగొచ్చారు. దీంతో జగన్ పర్యటనకు లైన్ క్లియర్ అయ్యింది.
జగన్ భద్రత విషయంలో కూటమి ప్రభుత్వం ఎంత నిర్లక్ష్య పూరితంగా వ్యవహరిస్తుందో ఇవాళ మరోసారి బయటపడింది. మాజీ ముఖ్యమంత్రి(Ex CM) హోదా, పైగా జెడ్‌ఫ్లస్ కేటగిరీ భద్రత ఉన్నా ఆయనకు పోలీసుల తరఫున కనీస భద్రత కూడా కల్పించలేదు. పర్యటన కొనసాగిన దారిలో ఎక్కడా పెద్దగా పోలీసులు ఎక్కడా కానరాలేదు. పైగా ఎక్కడా ట్రాఫిక్ క్లియర్ చేయలేదు. దీంతో జనసందోహం నడుమే నెమ్మదిగా ఆయన తన వాహనంలో మిర్చి యార్డు వద్దకు చేరుకున్నారు.
ఇక పెద్దగా భద్రత లేకుండానే మిర్చి యార్డులో అడుగు పెట్టిన వైఎస్ జగన్(YS Jagan) .. రైతులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. అయితే ఆ టైంలోనూ లౌడ్ స్పీకర్లతో అధికారులు ప్రకటనలు చేస్తూ.. ఆయన్ని రైతులతో మాట్లాడకుండా అవాంతరాలు కలిగించబోయారు. కానీ ఆయన మాత్రం మిర్చి రైతుల గోడును ఓపికగా అడిగి తెలుసుకున్నారు. వాళ్ల నుంచి వినతి పత్రాలు సైతం స్వీకరించారు.

సాధారణంగానే వైఎస్ జగన్ వస్తున్నారంటే అభిమానం ఎలా వెల్లువెత్తుతుందో తెలియంది కాదు. మిర్చి యార్డులో ఘాటును సైతం పట్టించుకోకుండా జగన్‌ను చూసేందుకు ఇవాళ ఇసుకేస్తే రాలని జనం వచ్చారు. అలాంటిది యార్డులో ఒక్క పోలీసుల కూడా ఉండకుండా చూసుకుంది కూటమి ప్రభుత్వం. ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేసినట్లు వైఎస్సార్‌సీపీ మండిపడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment