
‘అస్థి పంజరం’ కేసులో వీడిన మిస్టరీ
పూజ చేసేందుకు వెళ్లి మహిళపై జ్యోతిష్యుడు అత్యాచారం
అప్పన్నను హత్య చేసిన ఆమె భర్త
భార్యాభర్తలను అరెస్ట్ చేసిన పోలీసులు
కొమ్మాది(విశాఖపట్నం): పెందుర్తి బీసీ కాలనీకి చెందిన జ్యోతిష్యుడు మోతి అప్పన్న అలియాస్ అప్పన్న దొర (50) అస్థి పంజరం కేసు మిస్టరీ వీడింది. భీమిలి నేరెళ్ల వలసకు చెందిన భార్యాభర్తలు గుడ్డాల మౌనిక, ఊళ్ల చిన్నారావు పథకం ప్రకారం అతన్ని హత్య చేశారు. ఘటనా స్థలంలో లభించిన వస్తువులు, సీసీ ఫుటేజ్, సెల్‌ఫోన్ సిగ్నల్ ఆధారంగా భీమిలి పోలీసులు నిందితులను గుర్తించి గురువారం అరెస్ట్ చేశారు. భీమిలి సీఐ బి.సుధాకర్ తెలిపిన వివరాలివి..
పెందుర్తి బీసీ కాలనీకి చెందిన మోతి అప్పన్న.. భార్య కొండమ్మ, కుమారులు ప్రసాద్, దుర్గా ప్రసాద్‌లతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన ఇంటింటికీ వెళ్లి జ్యోతిష్యం చెబుతుంటాడు. ఇబ్బందుల్లో ఉన్న వారి ఇళ్లలో పూజలు చేస్తూ.. తద్వారా వచ్చిన ఆదాయంతో తన కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఇదిలా ఉండగా ఆయన ఈ నెల 9న ఆనందపురం వెళ్తున్నట్లు ఇంటి వద్ద చెప్పాడు. ఆ రోజు రాత్రి అప్పన్న ఇంటికి రాకపోవడంతో 10న ఆయన పెద్ద కుమారుడు దుర్గా ప్రసాద్ ఆనందపురం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తులో భాగంగా ఉప్పాడ ప్రాంతంలో అప్పన్న తప్పిపోయినట్లు గుర్తించి, ఆ ప్రాంతంలో అతని కుటుంబ సభ్యులు, పోలీసులు గాలించారు. అక్కడ ఓ ప్రైవేట్ లేఅవుట్‌లో అప్పన్నకు సంబంధించిన అవశేషాలు గుర్తించారు.
పథకం ప్రకారం.. కత్తితో పొడిచి
కాగా.. నిందితులు నెల రోజుల కిందట ఆనందపురం మండలం లొగడలవానిపాలెంలో ఒక అద్దె ఇంట్లో దిగారు. అక్కడకు సమీపంలో ఉన్న యడ్ల తిరుపతమ్మ అనే టీ దుకాణం యజమానితో వారికి పరిచయం ఏర్పడింది. అదే టీ దుకాణానికి ప్రతి మంగళ, ఆదివారాల్లో అప్పన్న దొర వస్తుండేవాడు. చుట్టు పక్కల గ్రామాల్లో వాస్తు, పూజలు చేస్తుండేవాడు. తనకు కూడా సమస్యలు ఉన్నాయని, పరిష్కరించాలని నిందితురాలు అప్పన్నకు చెప్పగా ఇంటికి వచ్చి పూజలు చేస్తానని చెప్పాడు. ఈ క్రమంలో మౌనిక ఇంటికి వెళ్లిన అప్పన్న ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడమే కాకుండా అత్యాచారం చేశాడు.
ఈ విషయం ఎవరికై నా చెపితే కుటుంబాన్ని నాశనం చేస్తానని బెదిరించాడు. ఆమె ఈ విషయాన్ని తన భర్త చిన్నారావుకు తెలియజేయగా అప్పన్న దొరను హత్య చేయడానికి పథకం వేశారు. ఉప్పాడలో ఉన్న తన తల్లికి ఆరోగ్యం సరిగా లేదని, పూజ చేయాలని చిన్నారావు అప్పన్నను నమ్మించాడు. రూ.7 వేలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాడు. ఈ నెల 9న బటన్ కత్తి, పల్సర్ బైక్ తెప్పించుకుని అతన్ని ఆనందపురం మండలం క్రాస్ రోడ్డు, బోయపాలెం మీదుగా భీమిలి పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ప్రైవేట్ లే అవుట్‌కు తీసుకువెళ్లాడు. అతన్ని కత్తితో పొడిచి హత్య చేశాడు. ఈ క్రమంలో జరిగిన పెనుగులాటలో చిన్నారావు కుడిచేతి చూపుడు వేలికి గాయం కాగా కేజీహెచ్‌లో చికిత్స తీసుకున్నాడు.
ఒక రోజు ఆగి..
ఆధారాలు లేకుండా చేసేందుకు తర్వాత రోజు టిన్నర్, పెట్రోల్ కొనుగోలు చేశాడు. 11వ తేదీ వేకువజాము 4 గంటల సమయంలో రెండు లీటర్ల టిన్నర్, మరో రెండు లీటర్ల పెట్రోల్ తీసుకొని తన భార్యతో కలిసి బయలుదేరాడు. ఉదయం ఆరు గంటల సమయంలో మృతదేహాన్ని కాల్చివేశాడు.
ఘటనా స్థలంలో లభించిన వస్తువులు ఆధారంగా పోలీసులు నిందితులను గుర్తించారు. తన భార్యతో అసభ్యకరంగా ప్రవర్తించాడనే కోపంతో చిన్నారావు జ్యోతిష్యుడిని హత్య చేశాడని, ఈ ఘటనలో భర్తకు మౌనిక సహకారం అందించడంతో ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లు సీఐ బి.సుధాకర్ తెలిపారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు బటన్ కత్తి, రక్తపు మరకలు కలిగిన నిందితుడి జీన్ ప్యాంటు, అప్పన్నదొర ఫోన్ పౌచ్, లైటర్, పల్సర్ ద్విచక్రవాహనం, కీ పాడ్ మొబైల్ స్వాధీనం చేసుకున్నట్టు వివరించారు.
అదృశ్యమైన జ్యోతిష్యుడు.. అస్థిపంజరమై!
Comments
Please login to add a commentAdd a comment