కవిభండారీ ప్రియాపాల్ 1967, ఏప్రిల్ 30న కలకత్తాలో జన్మించారు. తన చిన్న వయసులోనే తండ్రి కన్నుమూయడంతో ఆయన నడుపుతున్న మూడు హోటళ్లకు చైర్ పర్సన్ అయ్యారు. విజ్ఞతతో వ్యవహరించారు. మనసు చెప్పినట్లు చేస్తూ ఆదాయాన్ని 400 శాతం పెంచారు.
1988 నాటికి ప్రియా పాల్ వయసు 21 సంవత్సరాలు. ఆ వయసులోనే ఢిల్లీలోని ‘ది పార్క్ హోటల్స్’ మార్కెటింగ్ మేనేజర్‌గా తొలి అడుగు వేశారు. అప్పటికి హార్వర్డ్ బిజినెస్ స్కూల్, వెస్లీ కాలేజీ, ఇన్‌సీడ్‌ల నుంచి డిగ్రీలు సాధించిన ప్రియా.. జనరల్ మేనేజర్‌గా, అపీజే సురేంద్ర గ్రూప్ డైరెక్టర్‌గా, అపీజే సురేంద్ర పార్క్ హోటల్స్‌కి చైర్‌పర్సన్‌గాను నియమితులయ్యారు. దక్షిణ ఆసియా మహిళానిధికి అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఇండియన్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ సభ్యురాలిగా... పెద్ద పెద్ద బాధ్యతలే చేపట్టారు.
‘‘రెండు సంవత్సరాల క్రితం అపీజే సురేంద్ర పార్క్ హోటల్స్ చరిత్రలో మరపురాని సంఘటన చోటుచేసుకుంది. ముంబైలో ‘ది పార్క్’, సేరామ్‌పోర్‌లో ‘ది డెన్మార్క్ టావెర్న్’, జైపూర్‌లో ‘జోన్ ప్యాలెస్’ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మొత్తం 22 హోటల్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. అన్ని రాజధానుల్లోనూ ప్రారంభించాలనుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణం గా వ్యాపారంలో మా సభ్యులంతా కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారం వృద్ధి చెందేలా కృషి చేస్తారని నేను భావిస్తున్నాను’ అని ఎంతో ఆత్మవిశ్వాసంతో అంటారు ప్రియాపాల్.
2000 సంవత్సరంలో బెస్ట్ ఎంట్ర్‌ప్రెన్యూర్‌గా ‘ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ 2011లో ‘హాల్ ఆఫ్ ఫేమ్’ అవార్డులతో పాటు 2012లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 2020లో అత్యంత ప్రభావశీలమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు.
ప్రియాపాల్ సేతు వైద్యనాథన్‌ను వివాహం చేసుకున్నారు. కలకత్తాలో పెరుగుతున్న రోజుల్లో ఫైన్ ఆర్ట్స్ పట్ల మక్కువ కనపరచటంతో, తండ్రి ప్రియాను ఆర్ట్ ఎగ్జిబిషన్స్‌కి తీసుకువెళ్లేవారు. ఆ తరవాత ఫైన్ ఆర్ట్స్ చదువుకున్నారు ప్రియా. తన కళను హోటల్స్‌ను అందంగా మలచటానికి ఉపయోగించారు. పార్క్ హోటల్స్ 1967లో ప్రారంభమయ్యాయి. ప్రియా 1988లో భాగస్వాములయ్యారు. 1992 నుంచి ప్రియా హోటల్స్‌ను అందంగా తీర్చిదిద్దటం ప్రారంభించారు. ‘‘మార్బుల్ లేదా ఇత్తడితో బొమ్మలు పేర్చటం కాదు. ఏదో ఒక థీమ్‌తో అందంగా ఉండాలి. కోల్‌కతాలోని హోటల్లో ముందుగా ఈ మార్పులు ప్రారంభించాను’’ అంటూ తన సృజన గురించి ఎంతో ఆనందంగా చెబుతారు ప్రియ.
ఇప్పుడు పార్క్ హోటల్స్ అందంగా కనిపిస్తాయి. చెన్నైలోని హోటల్‌ను సినీ స్టూడియో కాన్సెప్ట్‌తో అందంగా మలిచారు. ‘నేను కొత్త విషయం తెలుసుకున్నప్పుడల్లా ఎగ్జయిట్ అవుతుంటాను. 1990లో నేను పూర్తి బాధ్యతలు స్వీకరించినప్పుడు మూడు హోటల్స్‌ను పూర్తిగా మార్చవలసి వచ్చినప్పుడు నా ఆలోచనలను ఆచరణలోకి తీసుకువచ్చాను’ అంటారు ప్రియాపాల్.
అందనంత ఎత్తుకు ఎదిగారు.. ఊహించలేనన్ని విజయాలు సాధించారు... అపీజే సురేంద్ర గ్రూప్ చైర్మన్ సురేందర్ పాల్ మరణంతో ఆయన కుమార్తెగా 21 వ ఏటనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు అనుభవం లేకపోయినా మూడు హోటళ్ల నిర్వహణను స్వీకరించి, విజయం సాధించి పవర్‌ఫుల్ ఎంట్రప్రెన్యూర్ అనిపించుకున్నారు. మహిళా లోకానికే ఆదర్శంగా నిలిచారు ప్రియాపాల్.
Comments
Please login to add a commentAdd a comment