ఆతిథ్య ప్రియ | Journey of Women Entrepreneurs Priya Paul | Sakshi
Sakshi News home page

ఆతిథ్య ప్రియ

Published Sun, Dec 4 2016 12:46 AM | Last Updated on Mon, Sep 4 2017 9:49 PM

ఆతిథ్య ప్రియ

ఆతిథ్య ప్రియ

వ్యాపార నిర్వహణలో మెలకువలు నేర్పించే తండ్రి ఉగ్రవాదుల తూటాలకు నేలకొరిగారు.  ఆ విషాదం నుంచి తేరుకోక ముందే సోదరుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు.  విషాదం వెంట విషాదం వెన్నాడినా ఆమె కుంగిపోలేదు. దుఃఖాన్ని దిగమింగి తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి నడుం బిగించారు ప్రియా పాల్. ఆతిథ్య రంగంలో మూసపద్ధతులను తోసిరాజని, హోటల్ పరిశ్రమలో తనదైన ముద్రను చాటుకున్నారామె.
 
 భారత ఆతిథ్య పరిశ్రమలో ‘ద పార్క్’ హోటల్స్ పేరు ప్రఖ్యాతులను దశ దిశలకూ విస్తరించిన ప్రియా పాల్ 1967లో కోల్‌కతాలోని సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించారు. తండ్రి సురేంద్రపాల్ ‘ద పార్క్’ హోటల్ వ్యవస్థాపకుడు. అపీజే సురేంద్ర గ్రూప్ చైర్మన్‌గా ఉండేవారాయన. ప్రియా జన్మించిన ఏడాదే సురేంద్ర పాల్ కోల్‌కతాలో తొలి పార్క్ హోటల్‌ను ప్రారంభించారు. ఆ మరుసటి ఏడాదిలోనే విశాఖపట్నంలో రెండో హోటల్ ప్రారంభించారు. విశాఖపట్నంలో సురేంద్ర పాల్ నిర్మించిన ‘ద పార్క్’ హోటల్ అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోనే తొలి ఫైవ్‌స్టార్ హోటల్.
 
 తండ్రే తొలి గురువు...
  ప్రియాపాల్ అమెరికాలోని వెల్లెస్లీ కళాశాలలో ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక 1988లో ఇండియాకు తిరిగొచ్చారు. తండ్రి సురేంద్ర పాల్ ఆమెకు కోల్‌కతాలోని ‘ద పార్క్’ హోటల్ మార్కెటింగ్ మేనేజర్‌గా బాధ్యతలు అప్పగించి, హోటల్ నిర్వహణలో ఓనమాలు దిద్దించారు. సజావుగా సాగుతున్న కుటుంబంలో విధి విషాదం నింపింది. ‘ఉల్ఫా’ ఉగ్రవాదులు 1990లో సురేంద్ర పాల్‌ను కాల్చి చంపారు. ఆ సంఘటన నుంచి తేరుకోక ముందే ప్రియా సోదరుడు ఆనంద్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. వరుస విషాదాలతో ప్రియా పాల్ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. 
 
 ఇదే అదనుగా భావించిన బంధువులు, భాగస్వాములు వ్యాపారాన్ని దెబ్బతీసే కుట్రకు తెరలేపారు. అలాంటి క్లిష్ట సమయంలో ప్రియా పాల్ ‘ద పార్క్’ హోటళ్ల నిర్వహణను భుజానికెత్తుకున్నారు. అప్పుడామె వయసు ఇరవై రెండేళ్లే. చైర్మన్‌గా పగ్గాలు చేపట్టగానే యూనియన్ల పేరుతో సంస్థకు తెల్ల ఏనుగుల్లా మారిన ఉద్యోగులను దారికి తెచ్చారు. అప్పట్లో మన దేశంలో హోటళ్లంటే వినియోగదారుల దృష్టిలో కేవలం వసతి గృహాలు మాత్రమే. ప్రియా తనదైన వ్యూహంతో ఈ పరిస్థితిని సమూలంగా మార్చేశారు.
 
 నిత్య నవీనతే విజయ రహస్యం
 అప్పటికే పరిశ్రమలో ఉన్న ఐటీసీ, ఒబెరాయ్, తాజ్ వంటి దిగ్గజాలను తట్టుకొని ‘పార్క్ హోటళ్లు’ తమదైన ప్రత్యేకతను నిలిపేందుకు బోటిక్ హోటళ్ల నమూనాను అమలు చేశారు. ఈ విధానంలో హోటల్స్‌తో పాటు ప్రతి గది ప్రత్యేక డి జై న్లతో ఉంటుంది. పెద్ద హోటళ్ల కంటే తక్కువ గదులుంటాయి. సిబ్బంది ఎక్కువగా ఉండి సత్వర సేవలందిస్తారు. అంతర్జాతీయ వాస్తు శిల్పులను రంగంలోకి దింపి నిర్జీవంగా ఉండే  హోటళ్లకు తన దైన నిర్మాణ శైలితో జీవం నింపారు.
 
  హైదరాబాద్ నగరం నగలకు ప్రసిద్ధి కావటంతో ‘పార్క్ హైదరాబాద్’ అలంకరణలో అదే థీమ్‌ను అనుసరించారు. కెంపులు, పచ్చలు, నీలమణి వంటి విలువైన రాళ్లతో ఒక్కో అంతస్తును డిజైన్ చేశారు. గదులు నగల పెట్టెల్లా రూపొందించారు. చెన్నై హోటల్‌ను జెమినీ స్టూడియోలో నిర్మించారు. దీన్ని సినిమా థీమ్‌తో నిర్మించారు. ఇలా ఒక్కో హోటల్ నిర్మాణానికి ఒక్కో థీమ్‌ను ఎన్నుకున్నారు. అందుకే ఏ రెండు పార్క్ హోటళ్లు.. ఒక హోటల్‌లోని ఏ రెండు గదులు ఒకేలా ఉండవు. ప్రతి ఏడేళ్లకు ఒకసారి హోటల్ రూపురేఖలను పూర్తిగా మార్చేస్తారు. అందుకే పార్క్ హోటళ్లు ప్రముఖులతో కళకళలాడుతూ ఉంటాయి. 
 
 కాలం కంటే ముందు మారితేనే వ్యాపారంలో మనుగడ అని భావించి విమర్శలకు వెరవకుండా హోటళ్లలో నైట్‌క్లబ్బులు, బార్లు, డాన్స్‌ప్లోర్, లాంజ్‌లు ఏర్పాటు చేశారు. ‘పార్క్’లో రూమ్ దొరకటం అంత సులభం కాదు అనే స్థాయికి హోటళ్ల ఖ్యాతిని పెంచారు. ప్రియా హయాంలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, న్యూఢిల్లీ, విశాఖపట్నం, గోవా వంటి వాణిజ్య, పర్యాటక ప్రాంతాల్లో కొత్త హోటళ్లను నిర్మించారు. ప్రపంచ ఉత్తమ 101 హోటళ్ల జాబితాలో పార్క్ బెంగళూరు హోటల్ స్థానం దక్కించుకుంది. ప్రస్తుతం వ్యాపార పరిమాణం రూ. 1700 కోట్లకు చేరింది.
 
 సేవాస్ఫూర్తిలోను మేటి...
  ఆతిథ్యరంగంలో కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 2012లో ప్రియా పాల్‌ను ‘పద్మశ్రీ’తో సత్కరించింది. వ్యాపార రంగానికే పరిమితం కాకుండా, ఆమె సేవా రంగంలోనూ తనవంతు కృషి సాగిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో పలు పాఠశాలలు ఏర్పాటు చేయటం, అస్సాంలో గొట్టపు బావులు త వ్వించటం, ఢిల్లీలోని చారిత్రాత్మక జంతర్‌మంతర్ సంరక్షణ బాధ్యతలను నిర్వహించటం ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement