Priya Paul
-
కన్నడ హీరో కొత్త సినిమా, అండగా కేజీయఫ్ టీమ్!
రామ్ గౌడ, ప్రియాపాల్ జంటగా నూతన చిత్రం ప్రారంభమైంది. వి.జె సాగర్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సీఆర్ ప్రొడక్షన్ పతాకంపై రవి సాగర్ నిర్మిస్తున్నాడు. హైదరాబాద్‌లోని సారథి స్టూడియోలో పూజాకార్యక్రమాలతో ఈ చిత్రం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హీరోహీరోయిన్లపై ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా రవి సాగర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ....నువ్వు గొప్పగా కల కనకపోతే ఎవరో కన్న కలలో నువ్వు బానిసవి అవుతావు అన్న డైలాగ్ చాలా అద్భుతంగా ఉందన్నారు. ఈ ఒక్క డైలాగ్ సినిమా ఏ రేంజ్లో ఉంటుందో చెప్పకనే చెప్తుందన్నారు. చిత్ర నిర్మాత సి.రవి సాగర్ మాట్లాడుతూ.. 'నేను గత కొంత కాలంగా నేచురల్ ఫార్మింగ్ చేస్తున్నాను, ప్రజలందరికీ మంచి ఆహారం ఇవ్వాలనే ఉద్దేశంతో సి.ఆర్ అనే ఒక బ్రాండ్‌తో విషం లేనటువంటి మంచి ఆహారాన్ని సమాజానికి అందిస్తూ అదే పంథాలో ఇప్పుడు సమాజానికి మంచి సందేశం ఇవ్వాలనే ఉదేశంతో మీ ముందుకు వస్తున్నాను. పిల్లల్ని మనం హాస్టల్లో జాయిన్ చేస్తూ వారికి మనం మంచి విద్యని మాత్రమే ఇస్తున్నాము. కానీ ఎడ్యుకేషన్ తో పాటు చాలా మిస్ అవుతున్నారు, వారు మిస్సయిన ప్రభావం కొంతకాలం తర్వాత అది ఓల్డ్ ఏజ్ హోంగా రిఫ్లెక్షన్ కనిపిస్తుంది అనే కంటెంట్ మీద దర్శకుడు వి జె సాగర్ అద్భుతమైన కథ రాసుకున్నారు' అని తెలిపాడు. దర్శకుడు వి.జె సాగర్ మాట్లాడుతూ.. 'నేను దర్శకత్వ శాఖలో 'తొలిప్రేమ' కరుణాకర్, రసూల్ ఎల్లోర్ దగ్గర పని చేశాను. తర్వాత కొన్ని యాడ్ ఫిలిమ్స్ డైరెక్ట్ చేశాను. దర్శకుడిగా ఇది నా మొదటి చిత్రం. చిన్న పిల్లలు తల్లిదండ్రుల ప్రేమను ఎలా మిస్ అవుతున్నారు. ఆ ప్రేమ మిస్ అయితే పెద్దయిన తర్వాత ఎలా తయారవుతారు అనే డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా చేస్తున్నాము. కన్నడలో హీరోగా చేసిన రామ్ గౌడ మా సినిమాలో హీరోగా నటిస్తున్నారు. కేజియఫ్కు సంబంధించిన కెమెరా డిపార్ట్మెంట్ వారే ఈ సినిమాకు పనిచేస్తున్నారు' అన్నారు. -
Kavi Bhandari Priya Paul: 21వ ఏటనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నా
కవిభండారీ ప్రియాపాల్ 1967, ఏప్రిల్ 30న కలకత్తాలో జన్మించారు. తన చిన్న వయసులోనే తండ్రి కన్నుమూయడంతో ఆయన నడుపుతున్న మూడు హోటళ్లకు చైర్ పర్సన్ అయ్యారు. విజ్ఞతతో వ్యవహరించారు. మనసు చెప్పినట్లు చేస్తూ ఆదాయాన్ని 400 శాతం పెంచారు. 1988 నాటికి ప్రియా పాల్ వయసు 21 సంవత్సరాలు. ఆ వయసులోనే ఢిల్లీలోని ‘ది పార్క్ హోటల్స్’ మార్కెటింగ్ మేనేజర్‌గా తొలి అడుగు వేశారు. అప్పటికి హార్వర్డ్ బిజినెస్ స్కూల్, వెస్లీ కాలేజీ, ఇన్‌సీడ్‌ల నుంచి డిగ్రీలు సాధించిన ప్రియా.. జనరల్ మేనేజర్‌గా, అపీజే సురేంద్ర గ్రూప్ డైరెక్టర్‌గా, అపీజే సురేంద్ర పార్క్ హోటల్స్‌కి చైర్‌పర్సన్‌గాను నియమితులయ్యారు. దక్షిణ ఆసియా మహిళానిధికి అధ్యక్షురాలిగా కూడా పనిచేశారు. ఇండియన్ అడ్వయిజరీ బోర్డ్ ఆఫ్ హార్వర్డ్ బిజినెస్ స్కూల్ సభ్యురాలిగా... పెద్ద పెద్ద బాధ్యతలే చేపట్టారు. ‘‘రెండు సంవత్సరాల క్రితం అపీజే సురేంద్ర పార్క్ హోటల్స్ చరిత్రలో మరపురాని సంఘటన చోటుచేసుకుంది. ముంబైలో ‘ది పార్క్’, సేరామ్‌పోర్‌లో ‘ది డెన్మార్క్ టావెర్న్’, జైపూర్‌లో ‘జోన్ ప్యాలెస్’ ప్రారంభమయ్యాయి. ఇప్పుడు మొత్తం 22 హోటల్స్ విజయవంతంగా నడుస్తున్నాయి. అన్ని రాజధానుల్లోనూ ప్రారంభించాలనుకుంటున్నాం. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణం గా వ్యాపారంలో మా సభ్యులంతా కొత్త కొత్త ఆలోచనలతో వ్యాపారం వృద్ధి చెందేలా కృషి చేస్తారని నేను భావిస్తున్నాను’ అని ఎంతో ఆత్మవిశ్వాసంతో అంటారు ప్రియాపాల్. 2000 సంవత్సరంలో బెస్ట్ ఎంట్ర్‌ప్రెన్యూర్‌గా ‘ఫెడరేషన్ ఆఫ్ హోటల్ అండ్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా’ 2011లో ‘హాల్ ఆఫ్ ఫేమ్’ అవార్డులతో పాటు 2012లో రాష్ట్రపతి చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. 2020లో అత్యంత ప్రభావశీలమైన వ్యక్తిగా గుర్తింపు పొందారు. ప్రియాపాల్ సేతు వైద్యనాథన్‌ను వివాహం చేసుకున్నారు. కలకత్తాలో పెరుగుతున్న రోజుల్లో ఫైన్ ఆర్ట్స్ పట్ల మక్కువ కనపరచటంతో, తండ్రి ప్రియాను ఆర్ట్ ఎగ్జిబిషన్స్‌కి తీసుకువెళ్లేవారు. ఆ తరవాత ఫైన్ ఆర్ట్స్ చదువుకున్నారు ప్రియా. తన కళను హోటల్స్‌ను అందంగా మలచటానికి ఉపయోగించారు. పార్క్ హోటల్స్ 1967లో ప్రారంభమయ్యాయి. ప్రియా 1988లో భాగస్వాములయ్యారు. 1992 నుంచి ప్రియా హోటల్స్‌ను అందంగా తీర్చిదిద్దటం ప్రారంభించారు. ‘‘మార్బుల్ లేదా ఇత్తడితో బొమ్మలు పేర్చటం కాదు. ఏదో ఒక థీమ్‌తో అందంగా ఉండాలి. కోల్‌కతాలోని హోటల్లో ముందుగా ఈ మార్పులు ప్రారంభించాను’’ అంటూ తన సృజన గురించి ఎంతో ఆనందంగా చెబుతారు ప్రియ. ఇప్పుడు పార్క్ హోటల్స్ అందంగా కనిపిస్తాయి. చెన్నైలోని హోటల్‌ను సినీ స్టూడియో కాన్సెప్ట్‌తో అందంగా మలిచారు. ‘నేను కొత్త విషయం తెలుసుకున్నప్పుడల్లా ఎగ్జయిట్ అవుతుంటాను. 1990లో నేను పూర్తి బాధ్యతలు స్వీకరించినప్పుడు మూడు హోటల్స్‌ను పూర్తిగా మార్చవలసి వచ్చినప్పుడు నా ఆలోచనలను ఆచరణలోకి తీసుకువచ్చాను’ అంటారు ప్రియాపాల్. అందనంత ఎత్తుకు ఎదిగారు.. ఊహించలేనన్ని విజయాలు సాధించారు... అపీజే సురేంద్ర గ్రూప్ చైర్మన్ సురేందర్ పాల్ మరణంతో ఆయన కుమార్తెగా 21 వ ఏటనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నారు అనుభవం లేకపోయినా మూడు హోటళ్ల నిర్వహణను స్వీకరించి, విజయం సాధించి పవర్ఫుల్ ఎంట్రప్రెన్యూర్ అనిపించుకున్నారు. మహిళా లోకానికే ఆదర్శంగా నిలిచారు ప్రియాపాల్. -
ఆతిథ్య ప్రియ
వ్యాపార నిర్వహణలో మెలకువలు నేర్పించే తండ్రి ఉగ్రవాదుల తూటాలకు నేలకొరిగారు. ఆ విషాదం నుంచి తేరుకోక ముందే సోదరుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. విషాదం వెంట విషాదం వెన్నాడినా ఆమె కుంగిపోలేదు. దుఃఖాన్ని దిగమింగి తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి నడుం బిగించారు ప్రియా పాల్. ఆతిథ్య రంగంలో మూసపద్ధతులను తోసిరాజని, హోటల్ పరిశ్రమలో తనదైన ముద్రను చాటుకున్నారామె. భారత ఆతిథ్య పరిశ్రమలో ‘ద పార్క్’ హోటల్స్ పేరు ప్రఖ్యాతులను దశ దిశలకూ విస్తరించిన ప్రియా పాల్ 1967లో కోల్‌కతాలోని సంపన్న వ్యాపార కుటుంబంలో జన్మించారు. తండ్రి సురేంద్రపాల్ ‘ద పార్క్’ హోటల్ వ్యవస్థాపకుడు. అపీజే సురేంద్ర గ్రూప్ చైర్మన్‌గా ఉండేవారాయన. ప్రియా జన్మించిన ఏడాదే సురేంద్ర పాల్ కోల్‌కతాలో తొలి పార్క్ హోటల్‌ను ప్రారంభించారు. ఆ మరుసటి ఏడాదిలోనే విశాఖపట్నంలో రెండో హోటల్ ప్రారంభించారు. విశాఖపట్నంలో సురేంద్ర పాల్ నిర్మించిన ‘ద పార్క్’ హోటల్ అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోనే తొలి ఫైవ్‌స్టార్ హోటల్. తండ్రే తొలి గురువు... ప్రియాపాల్ అమెరికాలోని వెల్లెస్లీ కళాశాలలో ఎకనామిక్స్‌లో డిగ్రీ పూర్తి చేశారు. చదువు పూర్తయ్యాక 1988లో ఇండియాకు తిరిగొచ్చారు. తండ్రి సురేంద్ర పాల్ ఆమెకు కోల్‌కతాలోని ‘ద పార్క్’ హోటల్ మార్కెటింగ్ మేనేజర్‌గా బాధ్యతలు అప్పగించి, హోటల్ నిర్వహణలో ఓనమాలు దిద్దించారు. సజావుగా సాగుతున్న కుటుంబంలో విధి విషాదం నింపింది. ‘ఉల్ఫా’ ఉగ్రవాదులు 1990లో సురేంద్ర పాల్‌ను కాల్చి చంపారు. ఆ సంఘటన నుంచి తేరుకోక ముందే ప్రియా సోదరుడు ఆనంద్ రోడ్డు ప్రమాదంలో మరణించాడు. వరుస విషాదాలతో ప్రియా పాల్ కుటుంబం శోక సముద్రంలో మునిగిపోయింది. ఇదే అదనుగా భావించిన బంధువులు, భాగస్వాములు వ్యాపారాన్ని దెబ్బతీసే కుట్రకు తెరలేపారు. అలాంటి క్లిష్ట సమయంలో ప్రియా పాల్ ‘ద పార్క్’ హోటళ్ల నిర్వహణను భుజానికెత్తుకున్నారు. అప్పుడామె వయసు ఇరవై రెండేళ్లే. చైర్మన్‌గా పగ్గాలు చేపట్టగానే యూనియన్ల పేరుతో సంస్థకు తెల్ల ఏనుగుల్లా మారిన ఉద్యోగులను దారికి తెచ్చారు. అప్పట్లో మన దేశంలో హోటళ్లంటే వినియోగదారుల దృష్టిలో కేవలం వసతి గృహాలు మాత్రమే. ప్రియా తనదైన వ్యూహంతో ఈ పరిస్థితిని సమూలంగా మార్చేశారు. నిత్య నవీనతే విజయ రహస్యం అప్పటికే పరిశ్రమలో ఉన్న ఐటీసీ, ఒబెరాయ్, తాజ్ వంటి దిగ్గజాలను తట్టుకొని ‘పార్క్ హోటళ్లు’ తమదైన ప్రత్యేకతను నిలిపేందుకు బోటిక్ హోటళ్ల నమూనాను అమలు చేశారు. ఈ విధానంలో హోటల్స్‌తో పాటు ప్రతి గది ప్రత్యేక డి జై న్లతో ఉంటుంది. పెద్ద హోటళ్ల కంటే తక్కువ గదులుంటాయి. సిబ్బంది ఎక్కువగా ఉండి సత్వర సేవలందిస్తారు. అంతర్జాతీయ వాస్తు శిల్పులను రంగంలోకి దింపి నిర్జీవంగా ఉండే హోటళ్లకు తన దైన నిర్మాణ శైలితో జీవం నింపారు. హైదరాబాద్ నగరం నగలకు ప్రసిద్ధి కావటంతో ‘పార్క్ హైదరాబాద్’ అలంకరణలో అదే థీమ్‌ను అనుసరించారు. కెంపులు, పచ్చలు, నీలమణి వంటి విలువైన రాళ్లతో ఒక్కో అంతస్తును డిజైన్ చేశారు. గదులు నగల పెట్టెల్లా రూపొందించారు. చెన్నై హోటల్‌ను జెమినీ స్టూడియోలో నిర్మించారు. దీన్ని సినిమా థీమ్‌తో నిర్మించారు. ఇలా ఒక్కో హోటల్ నిర్మాణానికి ఒక్కో థీమ్‌ను ఎన్నుకున్నారు. అందుకే ఏ రెండు పార్క్ హోటళ్లు.. ఒక హోటల్లోని ఏ రెండు గదులు ఒకేలా ఉండవు. ప్రతి ఏడేళ్లకు ఒకసారి హోటల్ రూపురేఖలను పూర్తిగా మార్చేస్తారు. అందుకే పార్క్ హోటళ్లు ప్రముఖులతో కళకళలాడుతూ ఉంటాయి. కాలం కంటే ముందు మారితేనే వ్యాపారంలో మనుగడ అని భావించి విమర్శలకు వెరవకుండా హోటళ్లలో నైట్‌క్లబ్బులు, బార్లు, డాన్స్ప్లోర్, లాంజ్‌లు ఏర్పాటు చేశారు. ‘పార్క్’లో రూమ్ దొరకటం అంత సులభం కాదు అనే స్థాయికి హోటళ్ల ఖ్యాతిని పెంచారు. ప్రియా హయాంలో బెంగళూరు, చెన్నై, హైదరాబాద్, కోల్‌కతా, న్యూఢిల్లీ, విశాఖపట్నం, గోవా వంటి వాణిజ్య, పర్యాటక ప్రాంతాల్లో కొత్త హోటళ్లను నిర్మించారు. ప్రపంచ ఉత్తమ 101 హోటళ్ల జాబితాలో పార్క్ బెంగళూరు హోటల్ స్థానం దక్కించుకుంది. ప్రస్తుతం వ్యాపార పరిమాణం రూ. 1700 కోట్లకు చేరింది. సేవాస్ఫూర్తిలోను మేటి... ఆతిథ్యరంగంలో కృషికి గుర్తింపుగా భారత ప్రభుత్వం 2012లో ప్రియా పాల్‌ను ‘పద్మశ్రీ’తో సత్కరించింది. వ్యాపార రంగానికే పరిమితం కాకుండా, ఆమె సేవా రంగంలోనూ తనవంతు కృషి సాగిస్తున్నారు. పశ్చిమ బెంగాల్లో పలు పాఠశాలలు ఏర్పాటు చేయటం, అస్సాంలో గొట్టపు బావులు త వ్వించటం, ఢిల్లీలోని చారిత్రాత్మక జంతర్‌మంతర్ సంరక్షణ బాధ్యతలను నిర్వహించటం ద్వారా సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.