
మీలో మనోధైర్యం నింపడానికే వచ్చా..
విద్యతోనే ఉన్నత స్థాయి, గౌరవం
నిట్ వరంగల్ విద్యార్థులతో
హాస్యనటుడు బ్రహ్మానందం ముఖాముఖి
అట్టహాసంగా ప్రారంభమైన స్ప్రింగ్‌స్ప్రీ–25 వేడుకలు
కాజీపేట అర్బన్: ‘హలో నిట్ ఫ్రెండ్స్. నేనూ మీలా కుర్రాడి నే.. మీలాగే అల్లరి చేశాను. క్రియేటివ్‌గా ఆలోచించి అందరినీ నవ్వించాను. గిన్నిస్ వరల్డ్ రికార్డు, పద్మశ్రీ అవార్డు అందుకున్నాను. మీలో మనోధైర్యం నింపేందుకే ఇక్కడిదాకా వచ్చా’ అని అన్నారు సినీ హాస్యనటుడు బ్రహ్మానందం. శుక్రవారం నిట్ వరంగల్ క్యాంపస్‌లో స్ప్రింగ్‌స్ప్రీ–25 వేడుకలను ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈసందర్భంగా ఆయన విద్యార్థులతో మాట్లాడారు.
ఆ ముచ్చట్లు ఆయన మాటల్లోనే.. నిరుపేద కుటుంబంలో పుట్టిన నేను కష్టపడి చదివి లెక్చరర్‌గా సెటిలవుదామనుకున్నా. చంటబ్బాయి సినిమాతో దేవుడు నాకో గొప్ప అవకాశం ఇచ్చాడు. నాకున్న కళతో సినీ అరంగేట్రం చేశా. దాదాపు 40 ఏళ్ల ఇండస్ట్రీలో పన్నెండు వందలకుపైగా సినిమాలు చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డులో స్థానం సాధించా. పద్మశ్రీ అవార్డు అందుకున్నా. దేవుడు మనకు చాన్స్ ఇస్తాడు. దాన్ని క్యాచ్ చేయాలి. లక్ష్యాన్ని ఎంచుకోవాలి. కృషి, పట్టుదలతో ముందుకు సాగాలి.
లాల్‌బహదూర్ శాస్త్రి, అంబేడ్కర్, అబ్దుల్ కలాం, రామకృష్ణ పరమహంస, వివేకానంద, ప్రధాని నరేంద్రమోదీ ఇలా.. ఉన్నత స్థానాలకు చేరిన వారందరి విజయగాథలను ఆదర్శంగా తీసుకుని ముందుకెళ్లాలి. ‘ప్రయత్నిస్తూ సాగితే విజయం, ప్రయత్నాన్ని విరమిస్తే మరణం’ అనే కొటేషన్‌ను గుర్తుంచుకోవాలి. ‘ఖాన్‌తో గేమ్స్ ఆడితే షాల్తీలు గల్లంతవుతాయ్’ అనే డైలాగ్‌తో విద్యార్థులను నవ్వించారు. స్ప్రింగ్‌స్ప్రీ–25 సక్సెస్ కావాలని కోరుకుంటున్నట్లు.. బైబై నిట్ వరంగల్ అంటూ ప్రసంగం ముగించారు. కార్యక్రమంలో నిట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబుదీ, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ శ్రీనివాసాచార్య పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment