కాకినాడ బిడ్డకు పద్మశ్రీ
Published Mon, Jan 27 2014 1:33 AM | Last Updated on Sat, Sep 2 2017 3:02 AM
కల్చరల్(కాకినాడ), న్యూస్‌లైన్ : కాకినాడలో పుట్టి, అమెరికాలో స్థిరపడిన ప్రముఖ వైద్యుడు ముత్తా వంశీకృష్ణను పద్మశ్రీ వరించింది. తన సోదరుడు డాక్టర్ ముత్తా రమణారావు, వసంతలక్ష్మి దంపతుల కుమారుడైన వంశీకృష్ణకు ఈ అవార్డు ప్రవాస భారతీయ కోటాలో వచ్చినట్టు మాజీ మంత్రి ముత్తా గోపాలకృష్ణ ఆదివారం ఒక ప్రకటనలో వివరించారు. విదేశాల్లో ఖ్యాతి గడించిన వైద్యుడు : వంశీకృష్ణ అమెరికాలో హార్వర్డ్ మెడికల్ కళాశాలలో సిస్టమ్ బయాలజీ, మెడిసిన్ ప్రొఫెసర్‌గా, మసాచుసెట్స్ ప్రభుత్వాసుపత్రిలో మాలిక్యులర్ బయాలజీ విభాగాధిపతిగా, ప్రఖ్యాత అమెరికా బ్రోడ్ ఇనిస్టిట్యూట్ అసోసియేట్ సభ్యునిగా సేవలందిస్తున్నారు.
పరిశోధనలకు పద్మశ్రీ : వంశీకృష్ణ 35 సంవత్సరాల వయస్సులోనే పరిశోధనలు జరిపారు. ముఖ్యంగా జీవ కణవిచ్ఛిత్తి, మెటకాంట్రియల్ బయాలజీలో ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా 2004లో మెకార్డన్ ఫౌండేషన్ ఆయన్ను సత్కరించింది. రోగనిర్ధారణ రంగంలో చేసిన పరిశోధనలకుగాను అమెరికన్ ఫిలసాఫికల్ సొసైటీ 2008 లో డలాండ్ అవార్డు అందించింది. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి మేథమెటికల్ అండ్ కాంపిటేషనల్ సైన్స్‌లో డీఎస్ పూర్తిచేసిన వంశీకృష్ణ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన హార్వర్డ్ యూనివర్సిటీలో ఎండీ పట్టా పొందారు. బోస్టన్‌లోని బ్రిగ్‌హామ్ అండ్ ఉమెన్స్ హాస్పిటల్‌లో ఇంటర్నల్ మెడిసిన్‌లో ఇంటర్న్ షిప్ పూర్తిచేశారు. దేశ ఖ్యాతిని వైద్యరంగంలో ప్రపంచ దేశాలకు చాటిన వంశీకృష్ణను ఈ అవార్డు వరించింది.
Advertisement
Advertisement