
కాకినాడ: తెలంగాణ రాష్ట్రం నుంచి బియ్యం ఎగుమతులకు సంబంధించి ఫిలిప్పీన్స్ తో ఒప్పందం చేసుకున్నామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈరోజు(సోమవారం) కాకినాడ పోర్ట్ నుంచి ఉత్తమ్ మాట్లాడారు. తొలి విడతలో ఫిలిప్పీన్స్ కు సరఫరా చేసే బియ్యం షిప్ కు జెండా ఊపి ప్రారంభించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘ ఫిలిప్పీన్స్ కు 8 లక్షల టన్నుల బియ్యం ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాం.తొలి విడతగా రూ. 45 కోట్ల విలువైన 12,500 మెట్రిక్ టన్నుల బియ్యం పంపిస్తున్నాం. ఇతర దేశాలతో సంప్రదింపులు జరుగుతున్నాయి. తెలంగాణలో 280 లక్షల టన్నుల బియ్యం ఉత్పత్తి జరుగుతుంది. మా రాష్ట్ర రేషన్ అవసరాలు తీరిన తర్వాత మిగిలిన వాటిని సివిల్ సప్లయి ద్వారా విదేశాలకు ఎగుమతి చేస్తున్నాం. గత ప్రభుత్వాలు ఇటువంటి ప్రయత్నాలు చేయలేదు. స్వయంగా నేను వెళ్లి రైస్ ఎగుమతులు చర్చిస్తాం. తెలంగాణలో వరి రైతులకు మేలు జరిగేలా ఆఫ్రికా, సౌత్ ఈస్ట్ ఏసియాలో మార్కెట్ ఎక్స్ ప్లోరర్ చేస్తాం’ అని ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
