
కాకినాడలో యువకుడు
సెల్ఫీ వీడియో వైరల్
అనంతరం ఉరి వేసుకుని ఆత్మహత్య
కాకినాడ రూరల్: నా కన్న తల్లి, తండ్రివల్ల నేను చనిపోతున్నాను.. సూసైడ్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను.. నావల్ల ఇంకో అమ్మాయి జీవితం నాశనం అయిపోయింది. పెళ్లిచేసి టార్చర్ పెట్టారు. ముఖ్యంగా నా తల్లి పేరుకే ఆడది, వంద జన్మలెత్తినా అలాంటి దానికి పుట్టకూడదని కోరుకుంటున్నాను.
నేను పెళ్లి చేసుకుని ఇంకో అమ్మాయికి అన్యాయం చేశాను. నన్ను, నా భార్యను మానసికంగా వేధించారు. నిజంగా నేను వారికి పుట్టానో లేదో తెలీదు. ఇవీ.. కాకినాడ శశికాంత్‌నగర్‌లో ఆదివారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన దాకారపు దుర్గా వేణుగోపాల్ ప్రసాద్ (39) సెల్ఫీ వీడియోలోని మాటలు. ఇందుకు సంబంధించి మృతుడి భార్య పాప, పోలీసుల వివరాల ప్రకారం..
వాటా లేదంటూ ఇంట్లోంచి పొమ్మన్నారు
దుర్గా వేణుగోపాల్ ప్రసాద్‌కు తామరాడకు చెందిన యువతి పాపతో 2021 ఫిబ్రవరి 14న వివాహం జరిగింది. పాప టీసీఎస్‌కు వర్క్ ఫ్రమ్ హోం పద్ధతిలో ఉద్యోగం చేస్తూ కాకినాడలో తన తండ్రి ఇంట్లో ఉంటున్నారు. ప్రసాద్‌కు ఎటువంటి ఉద్యోగం లేకపోవడంతో భార్య సంపాదనతో ఇద్దరు అక్కడే ఉంటున్నారు.
ఇంట్లో వాటాలేదని, జగ్గంపేట మండలం మల్లిసాలలో ఉన్న స్కూల్లోనూ వాటాలేదని చెప్పడమే కాక తన ఇంట్లో ఉండవద్దని తల్లి వెంకటలక్ష్మి, తండ్రి శ్రీరామమూర్తి చెప్పడంతో పాటు ప్రసాద్, పాపలను ఇంటి నుంచి పొమ్మన్నారు. దీంతో పాప తండ్రి ఇంట్లో అద్దె చెల్లిస్తూ అక్కడే ఉన్నారు. ఈనెల 3న చనిపోతానని పాపతో పాటు ఆమె అన్నయ్యకు ప్రసాద్ వీడియో పెట్టడంతో వారు కంగారుపడి అదేరోజు తామరాడ తీసుకొచ్చారు. మరుసటి రోజు బయటకెళ్లి తల్లిదండ్రులు ఇంట్లోకి రానివ్వడంలేదని భార్యకు ఫోన్‌లో చెప్పి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.