బ్రెజిల్‌ పద్మశ్రీలు | India Honours 2 Brazilian Women With Padma Shri | Sakshi
Sakshi News home page

బ్రెజిల్‌ పద్మశ్రీలు

Published Mon, Jan 27 2020 1:49 AM | Last Updated on Mon, Jan 27 2020 1:49 AM

India Honours 2 Brazilian Women With Padma Shri - Sakshi

బ్రెజిల్‌ అధ్యక్షుడు ఈ ఏడాది మన గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చారు. బ్రెజిల్‌ మహిళలు ఇద్దరు ఈ ఏడాది మార్చి లేదా ఏప్రిల్లో మన రాష్ట్రపతి భవన్‌కు విశిష్ట వ్యక్తులుగా రాబోతున్నారు. వాళ్లిద్దరూ.. లియా దిస్కిన్, గ్లోరియా అరేరియా. వాళ్లు వస్తున్నది పద్మశ్రీ అవార్డు అందుకోడానికి. ఎవరీ లియా, గ్లోరియా?! మన ‘పద్మశ్రీ’ని అందుకునేంత ఘనతను ఈ పరదేశీయులు ఏం సాధించారు?!

భారత ప్రభుత్వం ఏటా ప్రదానం చేసే పౌర పురస్కారాలలో నాల్గవ అత్యున్నత పురస్కారం ‘పద్మశ్రీ’. మూడవది ‘పద్మభూషణ్‌’, రెండవది ‘పద్మవిభూషణ్‌’. మొదటిది ‘భారత రత్న’. ఆదివారం 71వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా శనివారం రాత్రి ప్రభుత్వం 7 పద్మవిభూషణ్, 16 పద్మభూషణ్, 118 పద్మశ్రీ అవార్డులు ప్రకటించింది.

వీరిలో 34 మంది మహిళలు. ఆ ముప్ఫై నాలుగు మందిలో ఇద్దరు లియా దిస్కిన్, గ్లోరియా అరేరియా! లియా గాంధీజీ సిద్ధాంతాలతో, గ్లోరియా భారతీయ వేద వాంఙ్మయంతో తమ దేశంలో శాంతి సుస్థిరతలను, ఆధ్యాత్మిక సుసంపన్నతను నెలకొల్పేందుకు గత నాలుగు దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. అందుకు దక్కిన గౌరవం, గుర్తింపే.. ‘పద్మశ్రీ’.

బ్రెజిల్‌ గాంధీ.. లియా!
సంతోషం ఎక్కడ ఉంటుంది? ఎక్కడో ఉండదు. మనలోనే ఉంటుంది. మన ఆలోచనల్లో.. మన మాటల్లో.. మన చేతల్లో ఉంటుంది. నువ్వు సంతోషంగా లేవంటే.. నీ ఆలోచన తూకం తప్పిందని. నీ మాట ఎక్కడో తూలిపడిందని. నీ పని తేలిపోయిందని. గాంధీజీ సత్యశోధన చేస్తే, లియా దిస్కిన్‌ సంతోష శోధన చేస్తోంది. పన్నెండేళ్ల బ్రెజిల్‌ అమ్మాయికి అంత శక్తి ఎక్కడిది! గాంధీమార్గాన్ని అనుసరించేంత శక్తి!! పుస్తకాలు చదవగలిగిన వయసు వచ్చేటప్పటికే గాంధీజీ.. అర్జెంటీనాలోని వాళ్లింట్లో, పుస్తకాల అరలో ఉన్నారు. 1972లో పెళ్లయి, భర్తతో కలిసి బ్రెజిల్‌ వచ్చేస్తున్నప్పుడు కూడా గాంధీజీ ఆమె చేతిని వదల్లేదు. గాంధీజీ జీవిత చరిత్ర ‘ది స్టోరీ ఆఫ్‌ మై ఎక్స్‌పరిమెంట్స్‌ విత్‌ ట్రూత్‌’తో బ్రెజిల్‌ సమాజంలో సంతోషాల పూల బాట వేయదలచారు లియా.

గాంధీ పుట్టిన రోజును మనం అక్టోబర్‌ 2న మాత్రమే జరుపుకుంటాం. లియా ఆ ఒక్కరోజే కాదు, ఆ వారం అంతా చేస్తారు. ఒక్కో ఏడాది ఆ నెలంతా! బ్రిజిల్‌లోనూ హింస ఉంది. నేరాలు, ఘోరాలు ఉన్నాయి. గాంధీజీనే లేరు! ఎలా బ్రెజిల్‌ని గాంధీమార్గం పట్టించడం? మొదట స్కూళ్లకు వెళ్లారు లియా. తర్వాత జైళ్లకు. తర్వాత బహిరంగ ప్రదేశాలకు. అహింస అన్నారు గాంధీజీ. ఆ విషయం తన ప్రజలకు  చెప్పారు లియా. శాంతి, సామరస్యం అన్నారు గాంధీజీ. ఆ సంగతీ చెప్పారు. గాంధీజీ పుస్తకాలను బ్రెజిల్‌లోని పండితుల చేత తేలిగ్గా అందరికీ అర్థం అయ్యేలా తర్జుమా చేయించి పంచిపెట్టారు. విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాలకు వెళ్లి గాంధీజీ సిద్ధాంతాలపై ప్రసంగాలు ఇచ్చారు. వ్యాధులు రాకుండా పిల్లలకు టీకాలు ఇస్తారు.

అలా గాంధీజీ సిద్ధాంతాలను రుచించే తియ్యటి గుళికల్లా అక్షరబద్ధం చేసి పిల్లలకు అందించారు. మనుషులపై కోపం పెంచుకుని ఉంటారు ఖైదీలు. గాంధీజీ కూడా ఖైదీగా ఉన్నవారే. ఆ ఖైదీ అనుభవాలను లియా ఈ ఖైదీలతో పంచుకున్నారు. అలా.. గాంధీజీ ముందు నడుస్తుంటే, ఆయన వెనుక ఆయన చేతికర్రను పట్టుకుని నడిచే అనుచరుల దేశంలా బ్రిజిల్‌ను మార్చేందుకు గత నలభై ఏళ్లుగా పట్టుదలతో పని చేస్తున్నారు లియా. ఆమె, ఆమె భర్త బాసిలో పాలోవిగ్జ్‌.. గాంధీజీ సిద్ధాంతాలపై ‘పలాస్‌ అథేనా’ ఒక సంస్థను కూడా నిర్మించారు. ఆ సంస్థ నిరంతరం సామాజిక సేవల్లో ఉంటుంది. గాంధీజీలోని తాత్వికతను బోధిస్తుంటుంది. వాళ్లే నెలకొల్పిన మరొక సంస్థ ‘కాసా డి పాండవాస్‌’(పాండవ గృహం) అనాథ పిల్లల్ని ఆదరిస్తుంటుంది.

ఆచరించినవే చెప్పారు గాంధీజీ. గాంధీజీ జీవితాన్ని తను కూడా ఆచరించి చూపిస్తున్నారు లియా దిస్కిన్‌. ఆమె నిరాడంబరంగా ఉంటారు. శాకాహారం మాత్రమే భుజిస్తారు. నిష్టతో గాంధీజీ విలువల్ని పాటిస్తారు. 2006లో గాంధీజీ సత్యాగ్రహానికి నూరేళ్ల ఉత్సవాలు జరిగినప్పుడు భారత ప్రభుత్వం నుంచి లియాకు ప్రత్యేక ఆహ్వానం అందింది. 2007లో ఐక్యరాజ్య సమితి గాంధీ జయంతిని ‘అంతర్జాతీయ అహింసా దినం’గా ప్రకటించినప్పుడు సమితిలో మాట్లాడేందుకు ఇండియా ఆహ్వానించిన కొద్దిమంది ప్రపంచ ప్రసిద్ధులలో లియా ఒకరు! గాంధీజీ ప్రభావంతో లియా కొన్ని పుస్తకాలు కూడా రాశారు. విద్య, శాంతి, విలువలు, సంస్కృతీ సంప్రదాయాలు ఆ పుస్తకాల్లోని ప్రధాన అంశాలు. ఆమె రాసిన ‘పజ్, కోమో సె ఫజ్‌?’ (పీస్, హౌ టు మేక్‌?) పుస్తకం ఐదు లక్షల కాపీలకు పైగా అమ్ముడయింది. బ్రెజిల్‌లోని ఆరు రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు ఆ పుస్తకాన్ని పిల్లల పాఠ్యాంశాల్లో ఒకటిగా చేర్చాయి.  

బ్రెజిల్‌ వేదాక్షరి.. గ్లోరియా!
అన్నీ వేదాల్లోనే ఉన్నాయంటారు. అన్నీ ఉన్న ఆ వేదాలన్నిటినీ గ్లోరియా అరేరియా తన గుప్పెట పట్టేశారు! సంస్కృత పండితురాలు. వేదాంత బోధకురాలు. భారతీయులకే కొరుకుడు పడవే, ఒక బ్రెజిల్‌ అమ్మాయి సంస్కృతాన్ని, వేదాలను జీర్ణించుకోగలిగిందా! ఇండియా, బ్రెజిల్‌ అన్నవి మనుషులకే కానీ వేదాలకు కాదు. ఆసక్తి ఉంటే ఏ దేశస్థులనైనా వేదసారం అనుగ్రహిస్తుంది. ఇండియా వచ్చాక గ్లోరియా ముందుగా సంస్కృత భాష నేర్చుకున్నారు. తర్వాత వేదాల్లోకి, అద్వైతంలోకి వెళ్లారు. వాటిని పోర్చుగీసు భాషలోకి అనువదించి రియో డిజెనీరో, ఇంకా బ్రెజిల్‌లోని అనేక ప్రాంతాలలో నేటికీ బోధిస్తున్నారు. రియో ఆమె పుట్టిన ప్రదేశం. నేర్చుకునే వయసులో ఆమె గడిపినదంతా ఇండియాలో! 1974లో ముంబైలోని ఆర్ష సందీపనీ సాధనాలయలో స్వామీ దయానంద దగ్గర  ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన చేశారు.

తర్వాత ఉత్తరకాశి, రుషికేశ్‌ వెళ్లారు. అక్కడి నుంచి తమిళనాడు, కేరళ వచ్చారు. తిరిగి 1978లో బ్రెజిల్‌ వెళ్లిపోయారు. వెళ్లాక, రియోలో ‘విద్యామందిర్‌’ అనే బోధనాలయాన్ని స్థాపించి తన దేశ ప్రజలకు వేదాలను, ఉపనిషత్తులను పరిచయం చేయడం మొదలుపెట్టారు. 1984 నుంచీ గ్లోరియా అవిశ్రాంతంగా వేదజ్ఞాన వ్యాప్తికి కృషి చేస్తున్నారు. భగవద్గీతతో పాటు అనేక గ్రంథాలను అక్కడి వారికి స్థానిక భాషల్లో అందుబాటులోకి తీసుకెళ్లారు. స్వీయజ్ఞాన సాధనపై ప్రసంగాలు ఇస్తున్నారు. వేదాలు, ఉపనిషత్తులు, ద్వైతాలు, అద్వైతాలు, అవైదిక వాదాలు.. ఇవన్నీ కఠినమైన అంశాలు. వీటిని నలభై ఏళ్లుగా సులభతరం, సూక్ష్మగ్రాహ్యం చేస్తూ బ్రెజిల్‌ను భారతీయ ఆధ్యాత్మిక చింతనవైపు మళ్లిస్తున్నారు గ్లోరియా.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement